Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శల్యపర్వంలో దుర్యోధనుని నిర్ణయం: ఆధునిక ప్రపంచానికి పాఠాలు..

[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘శల్యపర్వంలో దుర్యోధనుని నిర్ణయం: ఆధునిక ప్రపంచానికి పాఠాలు..’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్మద్రోణ కర్ణాదులు మరణించారు. యుద్ధం దాదాపుగా చివరి అంకాన్ని చేరిన నాటి రాత్రి దుర్యోధనుడు యుద్ధభూమిలో తన విడిదిలో ప్రవేశింపక ఆరుబయట బంధుమిత్ర సైనికసమూహంతో కొలువుదీరి విచారగ్రస్తుడై యున్నాడు. ఆ సమయంలో యుద్ధం కొనసాగింపులో ప్రయోజనం లేదని.. నష్టాన్ని పరిమితం చేయాలని, ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరించాలని.. భావించిన కృపాచార్యుడు దుర్యోధనుని సమీపించి.. “రాజా! యుద్ధమనేది మీలాంటి సుక్షత్రియులకు ఉత్తమ ధర్మమే. అయినా నేను చెప్పే మాటలను ప్రశాంతంగా విని, అందులో ఉచితానుచితాలు బుద్ధితో విచారించి, ఏది ఆనుసరణీయమో దానిని ఆచరించండి. ఇప్పటి వరకు భీష్మద్రోణ కర్ణులు, పరాక్రమవంతులైన పలువురు రాజులు, ఎందరో యోధులు పాండవులచేత సంహరింపబడ్డారు. దానికి కారణం వారి అస్త్రవిద్యా నైపుణ్యం మొదటిది కాగా రెండవది దైవబలం. ముఖ్యంగా అమిత పరాక్రములైన ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు నేను.. ఇలా ఎందరమో ప్రాణాలొడ్డి సైంధవుని రక్షించాలని సంకల్పించినా ఆనాటి సైంధవ వధ మానుష పరాక్రమం అనుకోలేము. ఇప్పటికి యుద్ధం ఆరంభించి పదిహేడు రోజులయింది.. ఇరువైపులా బలాలు సన్నగిల్లాయి. ఇంకా యుద్ధం కొనసాగింపు వల్ల ప్రాణ నష్టం తప్ప ఉపయోగం ఉండదు. విజయం ఎవరిని వరించినా అది నిరర్ధక విజయమే అవుతుంది. పూర్వ నిశ్చితాభిప్రాయాలను ప్రక్కన పెట్టి కాగల కార్యాన్ని విచారించు. ఈ యుద్ధమే నిష్కారణ జనితము. నిజానికి దీర్ఘ క్రోధుడైన పాలకులకు కీడు తప్పక వాటిల్లుతుందని పెద్దలు చెపుతారు.

రాజా! తమకు బలం హెచ్చిన వేళ యుద్ధానికి వెళ్ళాలి.. మన బలం తగ్గి శత్రువులు ఉత్సాహంతో పరాక్రమించిన వేళ సంధిని కోరుకోవాలని పెద్దలు చెపుతారు. కావలసిన వారంతా మరణించాక గెలిచినా ఓడినా ఉపయోగం లేదు. ఆత్మ వినాశం మహా పాతకమని చెపుతారు కదా.. రాజు తనను తాను కాపాడుకోవడం అత్యంత ప్రధానమైనది. రాజులేని నాడు రాజ్యానికి విలువలేదు. రాజు ఉంటేనే సకలమూ సిద్ధిస్తుంది. నీవు ధర్మరాజు వద్దకు సంధి ప్రతిపాదనను పంపించు. నాకు తెలిసి ధర్మరాజు నీ గత తప్పిదాలను పట్టించుకోకుండా సంధికి సమ్మతిస్తాడు. ధర్మరాజు సమ్మతిస్తే తమ్ములూ కాదనరు. శ్రీకృష్ణుడూ వారి మాటలను గౌరవిస్తాడు. నేను పిరికి మాటలు చెపుతున్నానని భావింపకు. ప్రాణభయం చేతగాని, యుద్ధానికి భయపడి కాని, పాండవ పక్షపాతంచే కాని లేదా నిన్ను తక్కువ చేసి చూపాలనే భావనతో కాని నేనివన్నీ చెప్పడం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకో.. ఇరు పక్షాలకూ గౌరవప్రదమైన సంధి ఉత్తమమైనది..” అంటూ హితవు పలుకుతాడు, కృపాచార్యుడు.

అది విన్న దుర్యోధనుడు.. చాలా సేపు ఆలోచించి.. వేడి నిట్టూర్పులు విడిచి.. చింతాక్రాంతుడై మౌనంగా ఉండి.. కొంత సమయం తదుపరి.. కృపాచార్యునితో ఇలా అంటాడు.

“ఆర్యా! నేను చెడిపోవద్దని, నా శుభాన్ని కోరి గురువుగా నాకు హితబోధ చేసారు. కృతజ్ఞుడను. మీరు నా హితమును కోరి స్నేహితుని వలె చక్కని ఆచరణీయమైన, ఆదరణీయమైన మార్గాన్ని ఉపదేశించారు. నేను ఆపదల పాలు కావద్దని, సంధి చేసుకోవాలనే మీ ఆలోచన సమంజసమే. మీ పలుకులు నాపై మీ కున్న ప్రేమను తెలియచేస్తున్నాయి. అయినా ఇప్పటి పరిస్థితులలో సంధి నాకు ఆచరణీయం కాదు.. ఎందుకంటారా? మాయాజూదము కావచ్చు, ద్రౌపది వస్త్రాపహరణం కావచ్చు, ఘోషయాత్ర కావచ్చు, ఉత్తర గోగ్రహణం కావచ్చు, అధర్మయుద్ధంలో అభిమన్యుడిని సంహరించడం కావచ్చు.. ఇవన్నీ మన పక్షం నుండి జరిగిన తప్పిదాలే. ముఖ్యంగా నిన్నటి రోజు దుశ్శాసనుని ఱొమ్ము జీల్చి నెత్తురు ద్రావుతూ భీముడు పలికిన మాటలు విన్నాక నేను వెళ్ళి సంధిని చేసుకుంటానని ఎలా అడగగలను.. పాండవులు ఎలా సమ్మతిస్తారు. అది అలా ఉండనీయండి.. ఇప్పటి వరకు సామంత రాజులు సేవింపగా, ‘శత్రుజన ఖేదంబును, మిత్రజన మోదంబునుంగదా సంపదలకుం దగియెడు ఫలంబులు’ అన్న సూక్తిని అనుసరించి, ఈ భూమిని ఏకఛ్ఛత్రాధిపత్యంగా, దర్పంతో పాలించాను. రాజరాజుగా పేరుప్రఖ్యాతులను పొందిన నేను, దీనస్థితిలో ఒకరి దయతో.. పొందిన రాజ్యాన్ని పాలిస్తూ, ప్రాణాలను కాపాడుకొని సుఖంగా ఉండడం సాధ్యమా? ఆదరణీయమా? నిజానికి అలాంటి రాజ్యం నాకు అవసరమా? నిశ్చయంగా ఒకటే నిర్ణయం.. ఆర్యా! మీ మాటలు వినడం లేదని భావించవద్దు.. గెలవడమో లేదా యుద్ధంలో భీష్మద్రోణాది వీరుల ప్రక్కన నిలిచి యుండడమే నా నిర్ణయం”, అంటాడు.

ఇదీ శల్య పర్వంలో మనకు కనిపించే సన్నివేశం. కృపాచార్యుల బోధ.. దుర్యోధనుని నిర్ణయం. నిజానికి అప్పటికే కౌరవుల పక్షాన జరగవలసిన నష్టం జరిగిపోయింది. యుద్ధమూ చివరిదశకు చేరింది. కృపాచార్యుల సంధి ప్రస్తావన ధర్మబద్ధమైనది, ఆచరణీయమైనది, ఆదరణీయమైనది. ముఖ్యంగా కృపాచార్యుల పలుకులు నష్టాన్ని తగ్గించుకోవడం ఉత్తమమనే వాస్తవకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. దానికి భిన్నంగా దుర్యోధనునిలో అహంభావ పూరిత నిర్ణయం వెలుగుచూస్తున్నది. దానికి కారణం దుర్యోధనునిలో క్షత్రియ గర్వం మరియు గౌరవానికి సంబంధించిన అంశం తొంగిచూస్తున్నది. క్షాత్రాన్ని విడిచి పిరికివానిగా సంధిని కోరడం కన్నా మరణం ఉత్తమమనే అభిజాత్య సంబంధ విషయమది. తప్పొప్పుకోవడం అంటే ఓటమిని ఒప్పుకోవడమే. శత్రువుతో సంధి ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడమే. అది తన ప్రతిష్ఠకు భంగకరమైనది. దుర్యోధనుడు ఇక్కడ ధర్మాన్ని తన భావోద్వేగాలకు, అహంకారానికి అనుకూలమైన భాష్యం ద్వారా నిర్వచిస్తున్నాడు.

క్యాచ్ 22 అని ఆంగ్ల సాహిత్యంలో ఒక నవల ఉన్నది. తదుపరి కాలంలో అది ఒక సామెతగా ప్రాచుర్యం పొందింది. క్యాచ్ 22 అంటే.. మనం ప్రత్యేక పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యే ఎదురవుతుంది.. దానిని విరోదాభాసంగా చెప్పుకోవచ్చు. దాని నుండి బయటపడే మార్గం ఉండదు. ఎటు వైపు వెళ్ళినా నష్టమే.. అనే భావానికది ప్రతీక. ఉదాహరణగా ఉద్యోగం వస్తే అనుభవం వస్తుంది.. అనుభవం ఉంటే ఉద్యోగం వస్తుంది. దీనికి పై పరిస్థితిని అన్వయించుకుంటే.. పూర్తిగా కాకున్నా కొంతవరకు అన్వయం అవుతుంది. దుర్యోధనుని దృష్టిలో సంధి చేస్తే గౌరవం పోతుంది. యుద్ధం కొనసాగిస్తే పూర్తిగా నష్టం జరుగుతుంది.. ప్రాణాలూ పోవచ్చు. రెండు వైపులా అతనికి నష్టమే కనిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా క్యాచ్ 22 నకు పోలికగా చూడలేము. ఎందుకంటే.. బయటపడడానికి సంధి అనే అవకాశం ఉన్నది. వ్యక్తిగత అహంకారాన్ని ప్రక్కన పెట్టి కృపాచార్యుల లాంటివారిని ముందుపెట్టి గౌరవప్రదమైన సంధిని చేసుకోవచ్చు. కాని దుర్యోధనుని అహంభావం ఫలితంగా తప్పుడు నిర్ణయం జరిగింది. దీనిని ‘స్వయంకృత సందిగ్ధత’ లేదా తనకు తానుగా ఏర్పరుచుకున్న సంక్షోభంగా పేర్కొనవచ్చు లేదా మార్పును అంగీకరించలేని మూర్ఖపు మనస్తత్వంగా భావించవచ్చు.

దుర్యోధన, కృపాచార్యుల మధ్య సంభాషణను ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో చూస్తే.. పరిమితంగానైనా కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి (దుర్యోధనుడు) తీసుకున్న నిర్ణయం.. ఆ వ్యక్తి అహంకారానికి, ధర్మానికి మధ్య జరుగుతున్న సంఘర్షణగా భావించవచ్చు. అయితే దేశాల మధ్య సంబంధాలను అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్గత భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు, అంతర్జాతీయ ఒత్తిళ్ళు.. ఇలా అనేక కోణాలలో చూడవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో సంధి చేసుకుంటే తమ స్థానం బలహీనమౌతుందనే భావన కలుగుతుంది.. అలాంటి పరిస్థితులూ కొన్ని సందర్భాలలో ఎదురవవచ్చు. ఒక అడుగు వెనుకకు వేస్తే అది బలహీనతగా ఎదుటివారు భావించి సంధికై గొంతెమ్మ కోరికలనూ ముందు పెట్టవచ్చు. ఇరు పక్షాల మధ్య పరస్పర విశ్వాసం కొరవడడం వల్ల “ఓటమి – ఓటమి” విధానమే సంధికన్నా ఆదరణీయంగా రెండు పక్షాలు భావిస్తాయి. ఇరాన్–అమెరికా విషయంలో వారి వారి వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రాంతీయ రాజకీయాలు, గతకాలంలో జరిగిన సంఘటనలు, అణు ఒప్పందం ఇలాంటి పలు కీలకమైన, క్లిష్టమైన అంశాలు వారివారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. రెండు పక్షాలూ వెనుకకు తగ్గలేని పరిస్థితి. దుర్యోధనుని నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలూ దాదాపుగా ఇవే.

రెండు (లేదా అంతకంటే ఎక్కువ) పక్షాలు తమ తమ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే సమయంలో, ఒకరి నిర్ణయం మరొకరిపై ఎలా ప్రభావం చూపుతుందనేది అధ్యయనం చేయడాన్ని Game theory లేదా ఆట సిద్ధాంతం అంటారు. ఇద్దరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటే ఇరువురికీ సత్ఫలితం కలుగుతుంది.. కాని ఒకరు సహకరించి మరొకరు మోసం చేస్తే.. మోసం చేసిన వానికి ఎక్కువ లాభం కలుగుతుంది.. అలాకాక ఇరువురూ ఒకరినొకరు మోసం చేసుకుంటే ఇరువురూ నష్టపోతారు. దీనినే Prisoner’s Dilemma అని పిలుస్తారు. అందువల్ల, ‘మోసం చేయడం’ తమకు ఉత్తమం అని ఎవరికి వారు భావిస్తారు. ఇరువురూ సాధారణంగా దానినే ఎంచుకుంటారు.. ఫలితం ఇరువురికీ అధమంగా ఉంటుంది.

ఇరాన్ – అమెరికాల మధ్య ఒకరిని మరొకరు నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. సంధి, ఒప్పందాలు కావాలంటే అణు ఒప్పందాలు, ఆంక్షలు, ప్రతిస్పందనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ అంటుంది.. “నేను ఒప్పందం పాటిస్తే, అమెరికా మారిపోతే?”.. అమెరికా అంటుంది.. “నేను ఒప్పందం చేస్తే, ఇరాన్ మోసం చేస్తే?” ఇది ఇరువురికీ ఒకరిపట్ల మరొకరికి నమ్మకం లేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితి.. అలాంటి పరిస్థితుల్లో పరస్పరం అనుమానం కారణంగా సహకారం కష్టతరమవుతుంది. ఫలితంగా వారి మధ్య నిరంరతమైన ఒత్తిడి, ‘ఓటమి – ఓటమి’ విధానం.. వెలుగు చూస్తుంది.. దీనితో అంతర్జాతీయ ఆర్థిక రంగం ప్రభావితమౌతున్నది.

దీనినే పైన చెప్పుకున్న దుర్యోధన కృపాచార్యుల సంవాదం కోణంలో చూస్తే.. దుర్యోధనునికి ‘సంధి’ అంటే ఓటమి, గౌరవ హాని. యుద్ధం ప్రమాదమే.. అప్పటివరకు జరిగిన నష్టం తనకు విదితమే.. అయినా యుద్ధంతోనే తన గౌరవం నిలుస్తుందనేది దుర్యోధనుని పూర్వ నిశ్చితాభిప్రాయం. దుర్యోధనుడి నిర్ణయం భావోద్వేగం మరియు అహంకారం మీద ఆధారపడి ఉంది.

శల్యపర్వంలో ఈ సన్నివేశం పూర్తిగా ధర్మ భావనకు (కృపాచార్యుల బోధ) వ్యక్తిగత అహంకారానికి (దుర్యోధనుని) మధ్య ఘర్షణ. అదే ఇరాన్, అమెరికాల మధ్య వ్యూహాత్మక అవిశ్వాసం. ఇరువురి వల్లా నష్టపోయింది సాధారణ ప్రజానీకమే.. ఆనాడయినా.. ఈనాడయినా. నేర్చుకోవలసింది.. తత్ క్షణమే గౌరవాన్ని కాపాడుకోవాలనే ఆరాటం, నిర్ణయాలు, దీర్ఘకాలంలో సమష్టి నష్టానికి దారితీస్తాయి. పరస్పరం విశ్వాసం లేకపోవడం యుద్ధాన్ని కొనసాగిస్తుంది; విశ్వాసం నిర్మాణం మాత్రమే శాంతికి దారి తీస్తుంది.

Exit mobile version