Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శంఖచూడుడు

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘శంఖచూడుడు’. రచన శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

ది పుష్కర సరోవర ప్రాంతం. ఆ సరస్సు అంతా తెల్లని, ఎర్రని పద్మాలతో నిండి ఉంది. అక్కడ సారసపక్షులు, హంసలు ఈదులాడుతూ ఉన్నాయి. నీటిమీద నుంచీ చల్లనిగాలులు వింజామరలు వీస్తున్నట్లుగా ఉన్నాయి. సరోవర తీరాన బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. అది మహర్షులకు తపస్సు చేసుకోవటానికి, యజ్ఞయాగాలు చేయటానికి అనుకూలమైన విశాల ప్రదేశం.

ఆ తీర్ధంలో “ఓం బ్రహ్మదేవాయనమః” అనే మంత్రం మంద్రస్థాయిలో వినిపిస్తున్నది. అది శంఖచూడుడు అనే తపస్వి ఏకాగ్రతతో ఆ మంత్రాన్ని జపిస్తున్నాడు. చుట్టుపక్కల గాలివిసురు గానీ, పక్షుల కిలకిలారవాలు గానీ అతడి తపస్సుకు అంతరాయం కలిగించటం లేదు.

రోజులు గిర్రున తిరిగిపోయాయి. వసంతం, గ్రీష్మం, హేమంతం, శిశిరం ఇలా ఋతువులు శరవేగంగా మారిపోతున్నాయి. అతడి తపస్సు మాత్రం చెదరలేదు. శరీరం చిక్కిశల్యం అయింది. ఎట్టకేలకు బ్రహ్మ హంసవాహనం మీద ప్రత్యక్షమయ్యాడు.

“వత్సా! నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో!” అన్నాడు. శంఖచూడుడు కళ్ళుతెరిచి చూశాడు. బ్రహ్మదేవుడి ప్రభావం వలన అతడి జవసత్వాలు తిరిగి చేకూరాయి. మునుపటి కన్నా దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మదేవుడికి అవనత శిరస్కుడై ప్రణామం చేసి, స్తుతించి “పితామహా! నువ్వు సృష్టికర్తవు. నీ వాక్కు తిరుగులేనిది. దేవతలందరినీ జయించే వరం ప్రసాదించు” అన్నాడు.

“తథాస్తు” అని దీవించి, చెయ్యి జాపాడు బ్రహ్మ. అందులో సువర్ణమయైన ఒక కవచం వచ్చింది. “వత్సా! ఇది కృష్ణకవచం. ఇది సర్వత్రా విజయప్రదమైనది. దీనిని ధరించు. ఇది నీ తనువు మీద ఉన్నంతకాలం నీకు అపజయం, జరామరణాలు ఉండవు” అంటూ అందించాడు.

“ధన్యుణ్ణి” అని అందుకున్నాడు శంఖచూడుడు. “మరొక్కమాట. బదరికావనంలో ధర్మధ్వజుని కుమార్తె తులసి తపస్సు చేస్తున్నది. ఆమెను వివాహం చేసుకో! నీకు మేలగుగాక!” అన్నాడు.

“అలాగే చేస్తాను పితామహా!” అంటూ తలవంచి నమస్కరించాడు శంఖచూడుడు. బ్రహ్మ అదృశ్యుడయ్యాడు. కవచాన్ని తొడుక్కుని బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం బదరికావనం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ లావణ్యరాశియైన ఒక యువతి నారచీరలు కట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నది. ఆమె చుట్టూ సువర్ణకాంతులు వెలుగొందుతూ ఉన్నాయి.

“సుందరీ! నేను శంఖచూడుడను. దంభుడి కుమారుడను. కశ్యప ప్రజాపతి నా పితామహుడు. అపూర్వ తేజోరాశివైన నువ్వెవరు? నీ నామధేయాన్ని వహించి ఏ అక్షరాలు సార్ధకతను పొందాయి?” అని అడిగాడు.

ఆమె కళ్ళు విప్పి చూసింది. “నా పేరు తులసి. ధర్మధ్వజుడి కుమార్తెను. ఇక్కడి తపోవనంలో తపస్సు చేసుకుంటున్నాను” అన్నది కోకిలస్వరంతో.

“పెళ్లి పేరంటం చేసుకోవలసిన వయసులో నీకీ వైరాగ్యం దేనికి? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను వివాహం చేసుకుంటాను”

“నువ్వు చూడబోతే ఉత్తమకుల సంజాతుడిలా ఉన్నావు. నీవంటివాడు అనదగిన మాటేనా ఇది? స్త్రీసాంగత్యం ఉత్తమలోక ప్రాప్తికి విఘ్నకారకం. సాధ్యమైనంత శీఘ్రంగా ఇక్కడినుంచీ వెళ్ళిపోతే మంచిది”

“నువ్వు చెప్పినది పూర్తిగా అసత్యం కాదు. స్త్రీపురుషులు ప్రకృతీ పురుషులు కదా! ప్రకృతి లేని పురుషుడు, పురుషుడు లేని ప్రకృతి ఉంటాయా! సంసారంలో భార్యాభర్తల మనసులు కలిసి, భార్య అనురాగవతి అయితే వారి జీవితం ఆనందమయం అవుతుంది.  సంతానానికి క్షేత్రస్థానం స్త్రీ. నీ ద్వారా నాకు పుత్రసంతతి కలిగేటట్లు చెయ్యి” అన్నాడు శంఖచూడుడు.

అదే సమయానికి ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు మెరుపు మెరిసింది. ఆ మెరుపులో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. “శంఖచూడా! ఈమెను గాంధర్వవివాహం చేసుకో! తులసీ! నువ్వు ఇతనితో కూడి సర్వలోకాలలో విహరించి సుఖించు. మీ ఇద్దరి వివాహం గొప్ప మేలు చేకూర్చగలదు” అని చెప్పాడు.

“మీ ఆజ్ఞ తప్పక పాటిస్తాను స్వామీ!” లేచి వందనం చేసింది. శంఖచూడుడు ఆమెను గాంధర్వవిధిని వివాహం చేసుకుని తన నివాసానికి తీసుకువెళ్ళాడు. తల్లిదండ్రులు అతడిని చూసి ఆనందించారు. “కుమారా! నీ తపస్సు మెచ్చి విరించి ప్రత్యక్షమయ్యాడా? కోరిన వరం అనుగ్రహించాడా!” అడిగాడు దంభుడు.

“ఆహా! కోరిన వరం ఇవ్వటమే కాదు, సర్వకాల సర్వావస్థలలోనూ కాపాడే ఈ కృష్ణ కవచాన్ని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు నాన్నా! నేను కోరకుండానే బ్రహ్మ మెచ్చి ఇచ్చిన మరో వరం ఈమె, నీ కోడలు” అంటూ తులసి వంక చూపించాడు. తులసి అత్తమామల కాళ్ళకు నమస్కరించింది.

“నీ రాకతో మా గృహం మరింత శోభాయమానం అయింది తల్లీ! మా ఇంటిదీపమై, మా కంటివెలుగై, పతికి అభిమాన పాత్రురాలివై వెయ్యేళ్ళు సుఖంగా జీవించు” ఆశీర్వదించాడు దంభుడు.

“నిరంతర పతిభక్తితో మహిళా మాణిక్యమై వర్ధిల్లు తల్లీ!” అత్తగారు కూడా ఆశీర్వదించింది. తల్లిదండ్రుల దగ్గర శెలవు తీసుకుని భార్యతో ఏకాంత మందిరానికి వెళ్ళిపోయాడు శంఖచూడుడు.

***

ఒకరోజు రాక్షసగురువు శుక్రాచార్యుడు శంఖచూడుడిని చూడటానికి వచ్చాడు. శంఖచూడుడు ఆయనకి ఎదురువెళ్లి “తమ రాకతో మా గృహం పావనమైంది. ఆశీనులు కండి” అని తగిన ఆసనమిచ్చి గౌరవించి కుశలప్రశ్నలు వేశాడు.

“శంఖచూడా! నీకు గానీ, మీ రాక్షసజాతికి గానీ గురువు మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయా!” నిష్ఠురంగా అన్నాడు శుక్రాచార్యుడు.

“ఎంత మాట గురుదేవా! మాకు హితులు, మార్గదర్శకులు మీరే కదా!”

“నా మాటకు చిన్నబుచ్చుకున్నావే గానీ, ఆనాడు మహావిష్ణువు మాయావి, అతనికి దానం ఇవ్వద్దు అని నేను ఎంత వారించినా విన్నాడా బలిచక్రవర్తి? తల మీదకు తెచ్చుకున్నాడు. పరమేశ్వరుడు భస్మాసురుడికి వరం ఇచ్చిన సార్థకత లేకుండా విష్ణువు మయోపాయంతో మట్టుపెట్టాడు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను ఎంత క్రూరంగా సంహరించాడో నువ్వూ విన్నావు కదా! క్షీరసాగరమథన సమయంలో మనల్ని వంచించి దేవతలకు అమృతం ధారపోసింది విష్ణువే కదా! ఆ విష్ణువు అండ చూసుకుని అమరులు ఎన్ని దురాగతాలు చేశారో మర్చిపోయావా? వాటికి ప్రతిక్రియ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటావా! బ్రహ్మ ఇచ్చిన వరాన్ని నిరుపయోగం చేస్తావా?”

“మన్నించండి గురుదేవా! ఇప్పుడే దేవతలపైకి దండు పంపుతాను. నేనే స్వయంగా అవక్రపరాక్రమంతో పోరు సల్పి అమరులను చీకాకు పరుస్తాను. అమర సింహాసనాన్ని కైవశం చేసుకుంటాను”

“విజయోస్తు!” ఆశీర్వదించాడు శుక్రాచార్యుడు.

దేవదానవ సంగ్రామం మొదలు అయింది. రథాల మీద కొంతమంది, గుర్రాల మీద కొంతమంది, ఏనుగుల మీద కొంతమంది ఇలా అందరూ యుద్ధం చేసుకుంటున్నారు. కత్తుల కణకణ ధ్వనులతో, రివ్వురివ్వున దూసుకుపోయే బాణాలతో రణరంగం అంతా కోలాహలంగా ఉంది. రాక్షసుల పరాక్రమం ముందు దేవతల పరాక్రమం చిన్నబోయింది. శంఖచూడుడు ఇంద్రసింహాసనాన్ని అధిరోహించి తానే ప్రభువుగా ప్రకటించుకున్నాడు.

శంఖచూడుడు దానవవంశంలో జన్మించినా అతడు మహా తపస్వి. బ్రహ్మ దేవుడి భక్తుడు. అందువల్ల ప్రజారంజకం గానే రాజ్యపాలన చేస్తున్నాడు. అతడి పాలనలో అతివృష్టి, అనావృష్టులు లేవు. ప్రజలు సుఖంగానే ఉన్నారు. శంఖచూడుడు పొందుతున్న ప్రజాభిమానాన్ని చూసి జ్ఞాతివైరం వలన ఓర్వలేక, దేవతలు అందరూ విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు.

“శంఖచూడుడు గతజన్మలో కృష్ణభక్తుడైన సుధాముడు అనే గోపాలకుడు. గోలోకానికి అధిపతిగా ఉండి పశువులను సంరక్షిస్తూ ఉండేవాడు. ఒకసారి శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధాదేవి సౌందర్యాన్ని చూసి సమ్మోహితుడై ఆమెను ఆశించగా ఆమె అతడిని దానవుడవు కమ్మని శపించింది. సుధాముడు రాధాదేవి శాపానికి భయపడి శ్రీకృష్ణుడనైన నన్ను వేడుకోగా పరమేశ్వరుడి చేతిలో మరణించి, అనంతరం గోలోకానికి చేరుకుంటావని పరిహారం చెప్పాను. కనుక ఇప్పుడు మీరంతా కైలాసానికి వెళ్లి ఈశ్వరుని ప్రార్థించండి” అని చెప్పాడు.

దేవేంద్రుడు, దేవతలు అందరూ కైలాసానికి వెళ్ళారు. ద్వారపాలకుడైన నందీశ్వరుని స్తుతించి, అతని అనుమతితో ఈశ్వరుని దర్శించుకున్నారు.  ప్రమధగణాలు, రుద్రగణాలు, భక్తగణాలు జయజయ ధ్వనులు చేస్తూ ఉండగా పరమేశ్వరుడు మందహాస వదనంతో దర్శనమిచ్చాడు. తర్వాత దేవతల మొర విని శంకరుడు “శంఖచూడుడి శాపకారణం నాకు కూడా విదితమే! అతడికి నా వలననే మరణం సంభవిస్తుంది. ఆ సమయం సమీపించింది. నేను అనతికాలంలోనే అతడిని వధిస్తాను. మీరు భయం వదలిపెట్టి నిశ్చింతగా వెళ్ళండి” అన్నాడు.

ఆ తర్వాత శివుడు పుష్పదంతుడు అనే గంధర్వుడిని రాయబారిగా పంపించాడు. పుష్పదంతుడు శంఖచూడుడు దగ్గరకు వెళ్లి “నేను ఈశ్వరుడి దూతను. నా పేరు పుష్పదంతుడు. శివుడు పంపిన సందేశం విను. నువ్వు వెంటనే దేవతల రాజ్యాన్ని దేవతలకు అప్పగించు. లేదా యుద్దాన్ని చేసి వీరమరణం పొందు. ఈ రెండిటిలో ఒకదానికి ఎన్నుకుని నాకు సమాధానం చెప్పు అని ఈశ్వరుడు చెప్పమన్నాడు”

“రాజ్యం వీరభోజ్యం. నేను దేవతలను ఓడించి వారి రాజ్యాన్ని గెలుచుకున్నాను. యుద్ధం జరిగేటప్పుడు మీ రుద్రుడు ఏం చేస్తున్నాడు? నృత్య గాన విలాసాలతో పొద్దుపుచ్చుతూ ఉన్నాడా? దేవతలకు రాజ్యాన్ని అప్పగించటం కల్ల. నేను యుద్దాన్నే కోరుకుంటున్నాను. ఈ సందేశాన్ని ఆయనకు చెప్పు. వెళ్ళు” అన్నాడు శంఖచూడుడు.

పుష్పదంతుడు కైలాసానికి వచ్చి ఆ విషయాన్ని చెప్పాడు. ఈశ్వరుడు మండిపడి, నందిని, వీరభద్రుడిని, దిక్పాలకులను, గణాధ్యక్షులను యుద్దానికి సిద్ధం కావలసిందిగా ఆజ్ఞాపించాడు. ఎక్కడెక్కడి రుద్రగణాలు అన్నీ అక్కడికి చేరాయి.

ఉభాయపక్షాల సైన్యాధిపతులు ప్రేరేపించగా వారివారి సైన్యం కదిలింది. శంఖాలను పూరించారు. భేరీలు మ్రోగించారు. దేవదానవుల మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. రాక్షసులు ఆకలిగొన్న సింహాలై గర్జిస్తూంటే దేవతలు  పారిపోయి శివుని శరణువేడారు. రక్తధారలు కడుతున్న శరీరాలతో వచ్చిన దేవతలను చూసి శివుడు భద్రకాళిని పంపించాడు. కప్ప దోమలను మింగినట్లు భద్రకాళి దానవ సైన్యాన్ని చప్పరించివేస్తూంది.

శంఖచూడుడి బాణవర్షానికి రాహుగ్రస్తమైన ఆకాశంలా చీకట్లు కమ్ముకున్నాయి. వీరుల తలలు ఆకాశం నుంచీ పడుతున్న ఉల్కల్లా రాలిపడుతున్నాయి. కుమారస్వామి ధ్వజాన్ని తెంచి, సారథిని కూల్చి, రథాన్ని విరగగొట్టి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు శంఖచూడుడు. ఆ దెబ్బతో స్పృహ తప్పి పడిపోయాడు కుమారస్వామి. ఈ సంగతి తెలిసిన రుద్రుడు ఆవేశంతో త్రిశూలంతో శంఖచూడిడి శిరసు ఖండించబోయాడు. ఇంతలో ఆకాశవాణి “మహాదేవా! నీవందుకు సమర్థుడవే! కానీ వేదమర్యాదను పాటించాలి కదా! కృష్ణకవచం ఉన్నంతవరకూ శంఖచూడుడికి వృద్ధాప్యము, మరణము ఉండవని బ్రహ్మ వరం ఇచ్చాడు. బ్రహ్మ వరాన్ని వమ్ము చేస్తావా! శంఖచూడుడి భార్య పాతివ్రత్యమే అతడిని సదా రక్షిస్తూ ఉన్నాయి. కృష్ణ కవచం కోల్పోయినప్పుడు, ఆమె పాతివ్రత్యం భగ్నం అయినప్పుడే శంఖచూడుడికి మరణం సంభవిస్తుంది” అని చెప్పింది.

“సరే!” అని పరమేశ్వరుడు విష్ణువును స్మరించగా, విష్ణువు ప్రత్యక్షమైనాడు. “శంఖచూడుడి కృష్ణ కవచాన్ని స్వాధీనం చేసుకుని, అతడి భార్య పాతివ్రత్యాన్ని భంగం చెయ్యి” అన్నాడు.

“కవచం ఎలాగోలా స్వాధీనం చేసుకోవచ్చు. కానీ పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు. వారికి ఎగ్గు తలపెట్టిన వారికి ముప్పు తప్పదు. నన్ను ఇటువంటి కార్యానికి నియోగించటం భావ్యమా!” అన్నాడు విష్ణువు.

“లోకకళ్యాణం కోసం తప్పదు. నేనున్నాను. నీకేమీ భయం లేదు. వెళ్లిరా!” అన్నాడు శంకరుడు.

విష్ణువు మాయావిప్రుడిగా మారి, శంఖచూడుడిని స్తోత్రం చేశాడు. “బ్రాహ్మణోత్తమా! నీ మాటలకు సంతోషించాను. ఏం కావాలో కోరుకో!” అన్నాడు.

“నీ మేన ఉన్న విష్ణుకవచం నాకివ్వు” అన్నాడు విప్రుడు. శంఖచూడుడికి ఇది విష్ణుమాయ అని అర్ధం అయింది. మనసులోనే నవ్వుకుని నిస్సంకోచంగా దాన్ని దానం చేశాడు.

అక్కడి నుంచీ శంఖచూడుడి రూపంలో అతడి మందిరానికి వెళ్ళాడు విష్ణువు. ఆ సమయంలో తులసి దైవపూజలో ఉండి పార్వతీ పరమేశ్వరులను ధ్యానిస్తూంది. విష్ణువు మెడలో కృష్ణ కవచం చూసి తన భర్తే అక్కడకు వచ్చాడని నమ్మింది. పాదపూజ చేయటానికి వంగింది తులసి. “ప్రణయ సల్లాప వేళ పాదపూజ లెందుకు? లే దేవీ!” అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు.

అతడి స్పర్శ తగలగానే ఆమె నుంచీ ఒక దివ్యతేజస్సు బయటకు వచ్చి, ముఖం కళావిహీనం అయింది. తులసి నిటారుగా నిలబడి అతడి వంక తీక్షణంగా చూస్తూ “నీ స్పర్శతో నేను అపవిత్రురాలైనాను. నన్ను మైలపరచిన నువ్వెవరు? చెప్పు” అన్నది కఠినంగా. విష్ణువు నాలుగు చేతులతో, శంఖ చక్రాలు ధరించి, నిజరూపం దాల్చాడు.

అదే సమయానికి అక్కడ యుద్ధరంగంలో శంకరుడు మధ్యాహ్న మార్తాండుడిలా వెలిగిపోతున్న విజయము అనే పేరుగల శూలాన్ని శంఖచూడుడి పై ప్రయోగించాడు. అది ఆ దానవుడి శిరస్సుని ఛేదించి తిరిగి శంకరుని చేరింది. ఇక్కడ తులసి పూజామందిరంలో అఖండ జ్యోతి టప్పున ఆరిపోయింది. “స్వామీ!” అంటూ ఏడుస్తూ కూలబడింది.

“మాధవా! నన్ను అపవిత్రురాలిని చేసి నా భర్త మరణానికి కారణమయ్యావు. ఇది శిలా హృదయం కలవాడు చేసే పని. కాబట్టి నువ్వు కూడా శిలారూపుడవు అయిపో!” అంటూ శపించింది.

పార్వతీ పరమేశ్వరులు, దేవతలు అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. తులసి లేచి వారికి నమస్కరించింది. “తులసీ! ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. ఊరడిల్లు. నీ పతి ఎముకల నుంచీ ఈ శంఖం పుట్టి నా చేతికి వచ్చింది. ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ శంఖజలం సేవించిన భక్తులు ఆయురారోగ్యాలతో వర్దిల్లగలరు” అన్నాడు శంకరుడు.

“అమ్మా! నువ్వు, నీ భర్త పూర్వజన్మలో నా భక్తులే! నీ భర్త శాపవిముక్తి పొంది పూర్వరూపంతో తిరిగి గోలోకం చేరుకున్నాడు. నువ్వు తులసిమొక్కగా జన్మించి ముల్లోకవాసులకూ ప్రీతిపాత్రమవుతావు. నీచే పరిత్యజించబడిన నీ దేహం నదీ రూపాన్ని పొంది ‘గండకి’ పేరుతో పిలువబడుతుంది. నిన్ను ఎప్పుడూ ఎడబాయకుండా నా మెడలో హారంగా ధరించి నేను కూడా వనమాలి పేరుతో పిలువబడతాను. నీ శాపం వలన గండకీ నదీతీరంలో సాలగ్రామ శిలగా అవతరించి అక్కడ స్నానం చేసిన వారిని అనుగ్రహిస్తూ ఉంటాను.. శంఖచూడుడికి ప్రతీక అయిన శంఖం, తులసికి ప్రతీక అయిన తులసి మొక్క, విష్ణువుకు ప్రతీక అయిన సాలగ్రామ శిల ఈ మూడింటిని పూజించిన వారు సుఖంగా జీవించి అంత్యకాలంలో ముక్తిని పొందగలరు” అని చెప్పాడు విష్ణువు.

తులసి విష్ణువుకి నమస్కరించింది. దేవతలందరూ శివకేశవులను స్త్రోత్రం చేశారు.

(సమాప్తం)

Exit mobile version