[కోవెల సుప్రసన్నాచార్య గారు వ్రాసిన ‘శతాంకుర’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ. సుప్రసనాచార్యగారి తొంభయ్యవ జన్మదినం( మార్చ్ 17) సందర్భంగా సంచిక అందిస్తున్నదీ ప్రత్యేక వ్యాసాన్ని. ]
కవి ఏదేని ఒక సమయంలో పరిస్థితుల నుండి, సంఘటనల నుండి, అనుభవాల నుండి ఉవ్వెత్తున కెరటమై ఎగసిపడతాడు. అట్లాగే సుప్రసన్నాచార్య గారు కూడా జీవితంలో నుండి, అనుభావిత వ్యవస్థ నుండి, ఆటుపోటుల కల్లోలాల నుండి, హృదయంలో రగులుతున్న బడబాగ్ని నుండి ఉబికివచ్చారు. భౌతిక జీవన కంపనాల నుండి తమను తాము అన్వేషించే దిశగా సాగారు. అంతర్ముఖంగా సాగిన ఈ ఆత్మ వివేచన ఆయనలోని చేతస్సును బహిర్గతం చేసింది.
సుప్రసన్నాచార్య గారు ఇందులో తమలోని మూలాలను వెతుక్కుంటూ ముందుకు సాగినట్టు కనిపిస్తుంది. అంతస్సులోని అమృతత్త్వంవైపు ప్రవహిస్తారాయన. ఆయనలోని ఆలోచన ఎప్పటికప్పుడు వికసిస్తూ అలౌకికానందమయులవుతారు. ఒక్కోసారి ఆ దిశగా వెళ్లలేకున్నానని దుఃఖిస్తారు. మానవునిగా అయోమయావస్థతో పాటు కాంతిరేఖ వైపు నడుస్తున్న వివేకవంతుడు ఆయనలో గోచరిస్తాడు.
“నా చేతిలోని ఆకాశం జారిపడింది
ముక్కలయింది వేలుగా లక్షలుగా కోట్లుగా
ప్రతి ముక్కలోనూ ప్రతిఫలించే ఏదో ఒక ‘నేను’
ప్రతిభ స్రష్ట జగత్తులో వలె”
అని ఈ కావ్యంలో మొదటి కవితలో చెప్పిన ఆకాశం అవ్యక్తమైన సృష్టి ఆరంభంగా తోస్తుంది. ఈశ్వరుడు దానికి కర్త. అట్లాగే
“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః
యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే” (అగ్నిపురాణం)
అని చెప్పినట్లు కావ్య జగత్తుకు సృష్టికర్త కవి. విస్తృతమైన సృష్టి పరంపరలా కవి కూడా తన భావనా సృజనతో కావ్యమై వ్యాప్తిచెందాలన్న తత్త్వం ఇక్కడ ధ్వన్యార్థంగా చెప్పబడింది. ‘శతాంకుర’ ప్రసన్నాచార్యులు గారి భావనా లోతుల్లోంచి చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలనాత్మకంగా చూస్తూ అంకురించింది. కాబట్టి ఇందులో తాత్త్వికం, సామాజికం రెండు పార్శ్వాలుగా గోచరిస్తాయి.
“మనస్సు గీచిన లక్ష్మణ రేఖను దాటకుంటే
ఈ దేవుళ్ళూ చావులు మీవే”
“అనుభవాల వెండికొండ అంచులు కరిగినప్పుడు/
మీరు దాన్లో ఒరిపిడి పడ్డ బండరాళ్ళై మిగులుతారు”
పై వాక్యాల్లో ఆయన మనస్సనే ఇంద్రియాలకు లోబడి వాటిని నియంత్రించుకోకపోతే జరిగే పరిణామాలను హెచ్చరిస్తున్నారు. అనుభవాల రాపిడితో మనిషి హృదయం ఒక నిశ్చల స్థితికి అంటే సమాధి స్థితికి చేరుకోవాలని మార్గనిర్దేశం చేస్తారు. ‘అనుభవాల వెండికొండ కరగడం’ ఆయన అంతశ్చేతనమైన భావనా నైపుణ్యం.
“పచ్చదనం మీద కక్షగట్టిన/కాంక్రీటు రక్కసి నిర్మాణాల ప్రవాహాలు/సాగిపోతున్నాయి నాగరికతా మరుభూములలో/”
“..నేలతల్లి చనుబాలను కాక/ తృషితుడైన నరుడు/ ఆమె జీవన ధారలను/ పీలుస్తున్నాడు”
“ఐనా తడారడం లేదు గొంతు/ఎవరు తట్టుకుంటారు ఈ నిరంతర గ్రీష్మతాపాన్ని/ఏ సుదూర సముద్రంలోనో/ కన్నీళ్ళు కారుస్తున్నాడు పృషన్నిధి”
మానవుడు తనను పట్టి పీడిస్తున్న నాగరికతా వ్యామోహంలో పచ్చదనాన్ని నాశనం చేస్తూ నేలతల్లి రక్తాన్ని పీలుస్తూ ఆనందిస్తున్నాడు. కన్నతల్లి చనుబాలనే మరచిన వాడు ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. భూమిలోని నీటి ఊటను కాంక్రీటుల కింద సమాధి చేస్తున్నాడు. తత్ఫలితంగా గ్రీష్మఋతువు తాపాన్ని శాశ్వతం చేసుకుంటున్నాడు.
అనేక సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో పర్యావరణాన్ని ముందే ఊహించిన విశ్వనాథ సత్యనారాయణ గారు ‘వేయిపడగలు’లో ‘పృషన్నిధి’ అనే మేఘాన్ని సృష్టించారు. ఆ మేఘం ఊళ్లోని ప్రాచీన వటం మీద నిలుస్తుంది. ఆ రెండింటి మైత్రీబంధం ఊరును పచ్చగా కాపాడింది. నాగరికతా విలయం మేఘాన్ని తాకి అది నీరు అక్కరలేని ఒక కొండపై పడిందని తద్వారా ఊరు వసివాడినదని చెబుతారు. మేధస్సు పెరిగిన మనిషి తనకు తాను ఎంత ద్రోహం చేసుకుంటాడో ఆనాడే ఆయన ఊహించారు. విశ్వనాథ వారి పట్ల సుప్రసన్నాచార్య గారికి ఉన్న అత్యంత ఆదరం వల్ల ఈ ‘పృషన్నిధి’ పదాన్ని ఆయన ఇక్కడ ప్రయోగించడం స్పష్టం. కవి సమాజ శ్రేయస్సును కాంక్షించాలన్న దానికి ఇది తార్కాణంగా నిలుస్తుంది.
జననమరణాల మధ్య జీవనం ఒక నాటకం. “నానాటి బ్రతుకూ నాటకమూ, కానక కన్నది కైవల్యమూ” అన్నాడు అన్నమయ్య. ఈ భావననుసరించి..
“ఈ నక్షత్రశాలలో అన్నీ చిందరవందరలే
………..
ఇది నటులు ధర్నా చేస్తున్న నాటకశాలలా ఉన్నది/
మీట నొక్కినా కదలని విద్యుచ్చామరంలా ఉన్నది/
దిక్కు తోచకుండా నేనిక్కడ” అంటారు.
గాడి తప్పుతున్న మనిషి జీవన గమనం అల్లకల్లోలంగా ఉంది. ఆ వేదన ఆయనను నిలువనీయడం లేదు. చెప్పడానికి సిద్ధంగా ఉన్నా వినేవారు కరువయ్యారు. రంగస్థలం మీది నాటకంలో ప్రతీ ఒక్కరి పాత్ర అద్భుతమైన నటనా కౌశలంతో మెప్పించి, రక్తి కట్టించాలి. కానీ వర్తమానం అట్లా లేదు. నియమాలకు లోబడి, విధివిధానాలను అనుసరించి మనిషి తన జీవన సార్థక్యాన్ని గుర్తెరిగి కర్తవ్యోన్ముఖుడు కావడం లేదు. అందువల్ల ధర్నా చేస్తున్న నటులున్న వేదిక వలె ధరణీ వేదిక కళ తప్పింది. ఈ నిస్సహాయ స్థితిలో దిక్కుతోచకుండా ఉన్నానంటారు కవి.
వర్షపు జాడలేని వేసవి తాపాన్ని వర్ణిస్తూ మేఘం కోసం నిరీక్షిస్తూ..
“నిర్జీవమైన ఈ సుదీర్ఘ నిదాఘ మార్గంలో నుంచి
శ్రావణీ! నీకోసం వస్తున్నాను
నీ చూపుల్లో పుష్కలావర్తకాలు
రామగిరి నుంచి అలకాపురం దాకా మందాక్రాంతలు”
పై పంక్తులు కాళిదాసు ‘మేఘసందేశ’ కావ్యాన్ని ప్రతీకగా తీసుకొని రాసినవి. కర్తవ్య నిర్వహణలో లోపం చేశాడన్న నెపం మీద ఒక యక్షుడు అలకాపురి పట్టణానికి రాజైన కుబేరుని శాపానికి గురై సంవత్సర కాలం పాటు రామగిరి అరణ్యాలలో ఉంటాడు. అలకాపురిలో ఉన్న ప్రేయసి విరహవేదనను అనుభవిస్తూ యక్షుడు తన సందేశాన్ని మేఘం ద్వారా పంపిస్తాడు.
కాళిదాసు రచించిన ‘మేఘసందేశం’ కావ్యమంతా మందాక్రాంత ఛందస్సులో రాయబడింది. ఈ కావ్యంలో చెప్పబడిన ‘రామగిరి’ ప్రస్తుతం నాగపూర్ సమీపంలో ఉన్న ‘రామ్టేక్’ అనే ప్రదేశంగా పండితులు భావిస్తున్నారు. ఆ విషయాన్ని ఉటంకిస్తూ సుప్రసన్నాచార్య గారు రామగిరిలో ఉన్న యక్షుడు అలకాపురం దాకా మేఘాన్ని పంపిన సందేశమంతా మందాక్రాంతలో కాళిదాసు రాసిన విషయాన్ని అన్యాపదేశంగా చెప్తారు.
ఇక్కడ మరో విశేషం ఉంది. పుష్కలావర్త సంభూతుడు, ఉత్తమ కుల సంజాతుడైన మేఘాన్ని పంపుతూ యక్షుడు పలికిన సందర్భాన్ని వివరిస్తూ కాళిదాసు..
“జాతం వంశే భువన విదితే పుష్కరా వర్తకా నాం
జానామి త్వాం ప్రకృతి పురుషం కామరూప మఘోనః।
తేనార్థిత్వం త్వయి విధి వశాద్దూర బన్ధుర్గతోహం
యాఞ్చా మోఘా వరమధి గుణే నాధమే లబ్ధ కామా॥”
అని అంటాడు.
ఇక్కడ కామరూపుడైన పుష్కలావర్తకుడు సందేశాన్ని మోసుకెళ్లినట్లే వర్షఋతువు ఆరంభంలో శ్రావణ మాసంలో వచ్చే పుష్కలావర్తకాల కొరకు ఎదురుచూస్తున్నానని, నిస్తేజమైన వేసవితాపం నుండి అవి భూమిని రక్షించాలని ఆకాంక్షిస్తారు ఆచార్యులవారు.
గాఢవేసంగి తీవ్రతను వర్ణిస్తూ, కాళిదాసు కావ్యానికి సమన్వయిస్తూ వర్షాన్ని కురిపించే అదృశ్యమేఘాన్ని కల్పన చేయడం అంత సులువేమీ కాదు.
“పచ్చటి చెట్టును ఎండగొట్టి
వంట చెరకుగా వాడుకునే మూర్ఖుడిలా కాలం
సిగ్గు లేకుండా చరిస్తున్నది”
ఈ పంక్తులు కేవలం మండువేసవి తాపాన్ని వర్ణించడమే కాదు, మానవుడు తన అవసరాలు, సౌకర్యాలు, విలాసాల కోసం మేథస్సును ఉపయోగించి ప్రకృతిని నాశనం చేస్తూ తన నాశనాన్ని తానే కోరుకుంటున్నాడనే హెచ్చరిక కూడా ఇందులో కనిపిస్తుంది.
మరోచోట..
“ఈ భ్రాంతిలో పడి స్వప్నంలో స్వప్నాన్ని/
నాటకంలో నాటకాన్ని, సంసారంలో అంతస్సంసారాన్ని/
నిర్మించుకుంటున్నారు సాలెగూడుగా వీళ్ళు”
అని తనకు తానుగా గిరి గీసుకున్న వలయంలో సాలెగూటికి చిక్కినట్లు జ్ఞానరహితంగా జీవిస్తున్నాడని, దాని నుండి బయటపడాలని విశ్వగీతాన్ని ఆలపించాలంటారు.
“ఈ శరీర సముద్రంలో ఈదుతున్నాను/
పైన మన్మథుని మిత్రుడు విసిరే వెన్నెల/
ప్రత్యణువూ వాంఛా జ్వాలా తోరణం” అంటారు.
ఈ దేహమనే సముద్రంలో తిరుగాడే హృదయం వెండి వెన్నెల్లో వాంఛలతో రగిలిపోతూ ఉంటుంది.
దానిని నియంత్రించడం కష్టమని చెబుతూనే..
“ప్రాణాల గుఱ్ఱాల మీద విన్యాసాలు చేసే నన్ను/
ప్రాణ మూలాన జీవభావ బిందువు వెనుక/
రసబీజమైన నీవు కలుసుకోవడం/
ఏ సేతువు మీద – ఏ హేతువు మీద”
ఇంద్రియాలను ప్రాణాల గుఱ్ఱాలుగా చెబుతూ అవి ఆడిస్తున్నట్టుగా ఆడుతూ కూడా ఎక్కడో ఏదో మూలన వీటి వెనుక ఉన్న అంతశ్చలనంగా ఉన్న చేతన తనను ఏ కారణం చేతో వాటికి లోబడకుండా నిగ్రహిస్తున్నదని అంటారు.
“ఈ చైతన్య సురఝరీ ప్రవాహం నీవుగా తోచి/
నేను వెదకి వెదకి/
భూమి చివరల దాకా పరిభ్రమించి/
ప్రతీకల వ్రేళ్ళు ప్రాకిన భూమిలోకి దూరి/
మాటల టంకశాలల గర్భగృహాల్లోకి చేరి/
చివరకు తెలుసుకున్నాను/
అంతర్వాహినివని, నాలోనే ఉన్నావని”
ఆ చేతనతోనే అంతటా అన్వేషించి చివరకు తనలోనే ఆ పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నారు.
ఈ కావ్యంలో కొన్నిచోట్ల ఒక స్త్రీ రూపాన్ని ఆరాధిస్తున్నట్లున్న కవితలు కనిపిస్తాయి. ఆమె ఆయన అంతరాళాలలో నిండిన జగదేకమోహిని జగన్మాత. అణువణువూ పులకాంకురం కాగా ఆమె దివ్యతేజోరూపాన్ని కవిత్వపరంగా అభివ్యక్తీకరిస్తారు. తనలోని భావజలధికి ఆమె ప్రేరణ, లోతుల్లోంచి ఉబికే ఊట.
దాశరథి గారు ఈ కావ్యాన్ని చదివి “శ్రీమూర్తిగా, స్త్రీమూర్తిగా భాసించే జగన్మాతృ స్వరూపాన్ని ‘శతాంకుర’లో దర్శించాను. మీ కవితాధునిలోని మహాధ్వని వినడానికి హృదయ శ్రవణం కావాలి” అని సుప్రసన్నాచార్య గారిని ప్రశంసించారు. ఈ కావ్యాన్ని ఊరికే చదివితే సరిపోదు. హృదయగతం చేసుకోవాలి. ఎక్కడో నిద్రాణమై ఉన్న స్పందనలు చిగురిస్తే తప్ప అది సాధ్యం కాదు.
“మాటలు రావడం లేదు/
మనస్సునెవరో దొంగిలించారు/
నన్ను నేను మరిచిపోయాను”
“ఆనంద మధుకరీ గీతం/
విశ్వ విరహాన్ని రోదసిలో ముద్రిస్తున్నది”
“ఈ జీవితం మెడలో వేసుకున్న ఇంద్రియాల దండను/
ఎవరి మీదకు విసరివేయను”
“విస్మృతమైన మహతీ స్వన స్వప్నం/
విలులితమైన మృత్యు త్రస్త గజ ఘీంకారం”
“మనస్సు కొండ క్రింది పాదులో/
దాచుకొన్న తాళం చెవి నెవరిస్తారు”
“ఎన్నిసార్లయినా ఈ పుష్పాసవం మీద ప్రీతి/
తరగడం లేదు/
ఎన్నేండ్లయినా ఈ పూలను తాకిన గాలికే/
పరవశించి పోతున్నదీ భ్రమరం”
“ఈక్షణ విస్ఫోటం లోంచి మృత్యువు/
ఎదిగివచ్చి
మ్రింగుతుంది గడచిన అనుభవాన్ని/
మనస్సు అవచేతన లోంచి తోస్తుంది”
వంటి అనేక పంక్తులు ఈ కావ్యంలో దర్శనమిస్తాయి. భావుకత, ఆధ్యాత్మికత, తాత్త్వికతలు కలబోసి ఆలంకారిక ప్రయోగాలతో సుప్రసన్నాచార్యగారి కవిత్వీకరణ అసామాన్యం. ఇందులో ఆయన అనేక కవులను, యోగులను కూడా దర్శింపజేశారు. విశ్వనాథవారిని తలచుకుంటూ..
“తెలుగులోకంలోకి దిగి వచ్చిన/
చేతః పరిణాహమైన పిలుపు/
షడరమై, షట్కోణమై, షట్కాండమై, షణ్ముఖమై/
అగ్ని జ్వాలయైన నీ పద్యం/
గంగాతరంగమైన నీ గద్యం/
భూమి నుంచి ఆకాశం దాకా లేచి/
నాకు వేయిపడగల గొడుగు పట్టింది”
అని చెప్పుకున్న సుప్రసన్న గారు తానే ఆ ఆదిశేషుడై సాహితీ క్షీరసాగరాన్ని ఆక్రమించారు.
1987 లో వెలువడినప్పటికీ ఈ కావ్యం సార్వకాలీనం. ఇందులో మానవుడు తన భవిష్యత్తు నాశనానికి తానే కారకుడవుతున్నాడని చెప్పిన అనేక విషయాలు ఇప్పటికీ జరుగుతుండడం దురదృష్టకరం. శోచనీయం.
మానవుడు వ్యష్టి నుండి సమిష్టి వైపు ప్రయాణించాలని ఆయన పడిన వేదనంతా ఈ కావ్యంలో ప్రతిఫలిస్తుంది. ఇందులో వస్తువు, అభివ్యక్తి, భావచిత్రాలు, పదబంధాలు అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కృతమయ్యాయి.
ధూళిపాళ అరుణగారు అధ్యాపకురాలిగా పనిచేసారు. తెలుగు ఎమ్.ఏ., టిపిటి చేశారు. 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం గడించి, స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 28 మందిని ఇంటర్వ్యూలు చేశారు.
ప్రచురణలు: ‘జ్ఞాపకాల సంతకం’ తొలి కవితా సంపుటి. ‘మిగిలేవి గురుతులే’ తొలి కథా సంపుటి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం, మయూఖ ముఖాముఖి (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం), చేతనాశిల్పం (కవితా సంపుటి), మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం ఇతర ముద్రిత గ్రంథాలు. ఫోన్: 8712342323

