Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చరిత్ర తిరగరాసిన హాలీవుడ్ స్థాయి బాలీవుడ్ సినిమా ‘షోలే’

[రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ‘షోలే’ సినిమాను విశ్లేషిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి.]

‘షోలే’ అంటే నివురుగప్పిన నిప్పు అని అర్థం. పేరుకు తగినట్లే అండర్ కరెంటులా ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది. ‘బాక్సాఫీస్ ఇండియా’ వారిచేత ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా గుర్తింపుపొందింది. దేశవ్యాప్తంగా అరవై గోల్డెన్ జూబిలీలను జరిపించుకుంది. వంద సినిమా హాళ్ళలో సిల్వర్ జూబిలీలు చవి చూసింది. రెండు వందల కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ముంబై మినర్వా టాకీసులో ఏకంగా అయిదున్నరేళ్లు అప్రతిహతంగా ఆడి రికార్డు నిలబెట్టింది. బి.బి.సి వారిచేత ‘ఫిలిం ఆఫ్ ది మిలీనియం’ గా కీర్తింపబడింది. బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎంపిక చేసిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచిన తొలి భారతీయ చిత్రంగా మన్ననలందుకుంది. యాభై యేళ్ళలో విడుదలైన సినిమాలలో అత్యుత్తమ చిత్రంగా ‘షోలే’ సినిమాని ఫిలింఫేర్ సంస్థ 2005లో ప్రకటించింది. ఒక భారతీయ సినిమా ఔచిత్యాన్ని చాటడానికి ఈ ప్రశంసలు చాలు. జి.పి. సిప్పీ నిర్మించిన ‘షోలే’ చిత్రానికి అతని తనయుడు రమేష్ సిప్పీ దర్శకుడు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్, హేమామాలిని, జయాభాదురి వంటి అగ్రశ్రేణి నటీనటులు పాల్గొన్న ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చింది ఆర్.డి. బర్మన్. హాలీవుడ్ స్థాయిని మరపించిన ఈ 70 ఎం.ఎం తొలి స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమా 1975వ సంవత్సర స్వాతంత్ర్య పర్వదినాన దేశవ్యాప్తంగా వెయ్యి వెండితెరలమీద విడుదలై యాభై వసంతాలు పూర్తి చేసుకొని షష్టిపూర్తి ఉత్సవానికి ఉరకలు వేస్తోంది. ఈ సందర్భంగా ‘షోలే’ విశేషాలు కొన్ని గుర్తు చేసుకుందాం.

కథ చిన్నదే..

చిత్రకథ చిన్నదే. రామ్ ఘడ్ అనే ఒక కుగ్రామంలో ఠాకూర్ బలదేవ్ సింగ్ (సంజీవ్ కుమార్) అనే ఒక మాజీ పోలీసు అధికారి, తన విధినిర్వహణలో గబ్బర్ సింగ్ (అమ్జాద్ ఖాన్) అనే బందిపోటును పట్టుకొనే ప్రయత్నంలో ఆ బందిపోటు చేతిలో తన రెండు చేతుల్ని కోల్పోతాడు. పగబట్టిన అ బందిపోటు, ఠాకూర్ బలదేవ్ సింగ్ కుటుంబాన్ని హతమారుస్తాడు. బందిపోటు గబ్బర్ మీద పగ తీర్చుకోవడానికి గతంలో తను అరెస్టు చేసిన చిల్లర దొంగతనాలు చేసే వీరూ (ధర్మేంద్ర), జయ్ (అమితాబ్) అనే ఇద్దరు దొంగల సహాయాన్ని ఠాకూర్ అర్థిస్తాడు. బందిపోట్లకు ఈ జంట దొంగలకు మధ్య నాటకీయ పక్కీలో పోరు జరుగుతుంది. బందిపోటును పట్టుకొనే ప్రయత్నంలో జయ్ మరణిస్తాడు. చివరకు బందిపోటు ఆ పోలీసు అధికారికి చిక్కడం, అతని పట్టుదల నెరవేరడం ఈ చిత్రకథ సారాంశం. ఈ సినిమాలో హేమామాలిని బసంతిగా, జయాభాదురి ఠాకూర్ కోడలు రాధగా, హంగల్ ఇమాంచాచా రహీమ్‌గా, అస్రాని జైలర్‌గా, జగదీప్ సుర్మా భూపాలిగా, ఇఫ్తేకర్ ఇన్స్పెక్టర్ ఖురానాగా ఇతర పాత్రల్లో నటించారు.

కథ అల్లడంలో..

సలీం-జావేద్ జంటకవులు తొలుత ఒక చిన్న కథ అల్లి సిప్పీకి వినిపించారు. సిప్పీకి ఆ కథ నచ్చలేదు. కానీ కథ కొత్తగా ఉండడంతో కథా సంవిధానానికి మార్పులు సూచించారు. ఠాకూర్ బలదేవ్ సింగ్‌ను విశ్రాంత ఆర్మీ అధికారిగా తొలుత ప్రవేశపెట్టినా ఆ పాత్రను విశ్రాంత పోలీసు అధికారిగా మార్చారు. అలాగే ఇద్దరు చిల్లర దొంగల పాత్రల్ని మాజీ సైనికులుగా ప్రవేశపెట్టాలని సలీం-జావేద్ అభిప్రాయం. ఈ పాత్రలను సృష్టించాలంటే, మిలిటరీ అధికారులనుండి అనుమతి తీసుకోవాల్సిరావడంతో పాత్రల స్వరూపాన్ని చిల్లర దొంగతనాలు చేసేవారిగా మార్చాల్సివచ్చింది. ఈ స్క్రిప్టును సలీం-జావేద్ జంట ఒక నెలలో సిద్ధం చేశారు. ‘షోలే’ సినిమాకు హాలీవుడ్ స్థాయి తెచ్చేందుకు 1954లో వచ్చిన అకీరా కురుసోవా సినిమా ‘సెవెన్ సమురాయ్’, 1968లో వచ్చిన సెర్జియో లియోన్ సినిమా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’, 1960లో వచ్చిన జాన్ స్టర్జెస్ సినిమా ‘ది మాగ్నిఫిషిఎంట్ సెవెన్’ చిత్రాల్లో కొన్ని అంశాలను ఈ సినిమా కోసం వాడుకున్నారు. అలాగే మరికొన్ని వెస్టర్న్ సినిమాలు ‘ది వైల్డ్ బంచ్’ (1968), ‘ది కిడ్’ (1973), ‘బుచ్ కాసిడీ అండ్ ది శాండన్స్ కిడ్’ సినిమాల ప్రభావం ‘షోలే’ స్క్రిప్టు మీద యెంతైనా వుంది. బందిపోటులు చేసే ట్రైన్ రాబరీ సన్నివేశాన్ని ‘నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్’ సినిమాలో స్టేజ్ కోచ్ నుంచి యథాతథంగా అనుకరించారు. అలాగే ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ సినిమాలో మేక్బెయిన్ కుటుంబాన్ని ఊచకోత కోసే సన్నివేశాన్ని ‘షోలే’ సినిమాలో అనుకరించారు. 1950 ప్రాంతంలో గ్వాలియర్ నగరానికి దగ్గరలో వున్న గ్రామాలను గజగజలాడించిన గబ్బర్ సింగ్ అనే ఒక బందిపోటు ఉండేవాడు. పోలీసులు యెవరైనా అతని జోలికి వెళితే వారి ముక్కు చెవులు కోసి, తనను బంధించే ప్రయత్నం చేసేవారికి అదే శాస్తి అని చాటించేవాడు. అతని పేరే ఇందులో విలన్‌కు వాడుకున్నారు. ఈ విలన్ లక్షణాలను ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ అనే సినిమాలో మరియా ఓలోంటే పోషించిన ‘ఎల్ ఇండియో’ విలన్ పాత్రనుంచి స్పూర్తిగా తీసుకున్నారు. భోపాల్ నగరంలో నివసించిన సుర్మా అనే అటవీ అధికారి మేనరిజం నుంచి పుట్టిన పాత్రే జగదీప్ పోషించిన సుర్మా భూపాలి పాత్ర. ఇక షోలే సినిమా హీరోలు ‘వీరూ’ పేరు శౌర్యానికి, ‘జయ్’ పేరు గెలుపుకు సంకేతాలుగా పెట్టారు.

పాత్రల ఎంపికలో..

గబ్బర్ సింగ్ పాత్ర కోసం తొలుత డానీ డెన్ జోంగ్పాను తీసుకోవాలనుకున్నారు. కానీ డానీ ఫిరోజ్ ఖాన్ నిర్మిస్తున్న ‘ధర్మాత్మా’ సినిమాకోసం ఆఫ్గనిస్తాన్‌లో బిజీగా ఉండడంతో అతడు డేట్లు సర్దుబాటు చేయలేక పోయాడు. దాంతో ఆ పాత్రకు అమ్జాద్ ఖాన్‌ను ఎంపిక చేశారు. కానీ అమ్జాద్ గొంతు పీలగా వుందని రచయితలలో ఒకరైన జావేద్ అఖ్తర్ అభ్యంతరపెట్టాడు. చివరకు ఆ పాత్రే చిరస్మరణీయమైంది. అమ్జాద్ ఖాన్ డైలాగులే రికార్డులుగా వెలువడి బాగా అమ్ముడుపోయాయి. ఈ పాత్ర పోషణ కోసం అమ్జాద్ ఖాన్ ‘అభిశాప్త చంబల్’ అనే పుస్తకాన్నిక్షుణ్ణంగా చదివి చంబల్ లోయ బందిపోట్లు వ్యవహరించే పద్ధతులను ఆకళింపు చేసుకున్నాడు. సంజీవ్ కుమార్ పోషించిన ఠాకూర్ పాత్రకు ప్రాణ్ పేరు తొలుత పరిశీలనకు వచ్చినా, సిప్పీ మాత్రం సంజీవకుమార్ వైపే మొగ్గుచూపారు. అలాగే ధర్మేంద్ర కూడా ఠాకూర్ పాత్ర మీద మోజు పడ్డాడు. అప్పట్లో ధర్మేంద్ర టాప్ హీరో. అయితే వీరూ పాత్రను సంజీవ్ కుమార్‌కు ఇస్తానని సిప్పీ చెప్పడంతో ధర్మేంద్ర ఆ ప్రయత్నాన్ని విరమించుకొని హేమామాలిని ప్రేమించే వీరూ పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యాడు. హేమామాలినితో ధర్మేంద్ర ప్రేమలో వుండటం, సంజీవ్ కుమార్ ప్రేమను హేమామాలిని తిరస్కరించి వుండడం ధర్మేంద్ర వీరూ పాత్రను పోషించడానికి ముఖ్యకారణంగా చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన ఐదు సంవత్సరాలకు ధర్మేంద్ర-హేమామాలిని వివాహం జరిగింది. సినిమాలో జయ్ పాత్ర కోసం శత్రుఘ్నసిన్హా పేరును ముందు నిర్మాతలు పరిశీలించారు. అయితే ‘జంజీర్’ సినిమాలో మంచి నటన ప్రదర్శించిన అమితాబ్ బచ్చన్‌ను జయ్ పాత్ర వరించింది. ఈ  సినిమాకు ముందే అమితాబ్ బచ్చన్ జయాభాదురిని పెళ్ళాడాడు. జయాభాదురి యిందులో ఠాకూర్ కోడలుగా నటించింది. అయితే ఈ షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆమె గర్భవతి కావడంతో జయాభాదురి నటించిన సన్నివేశాల చిత్రీకరణ కొంచెం ఆలస్యమైంది. ఈ సినిమా నిర్మాణ దశలోనే ఆమె కూతురు ‘శ్వేత’కు జన్మనిచ్చింది. మరో విశేషమేమిటంటే ‘షోలే’ విడుదల కాలానికి ఆమె ‘అభిషేక్ బచ్చన్’ కడుపులో వున్నాడు.

నిర్మాణ క్రమంలో..

బెంగుళూరు నగరానికి దగ్గరగా ‘రామనగర’ పట్టణానికి సమీపంలో వుండే కొండప్రాంతం ‘రామదేవరబెట్ట’ను షూటింగుకు అనువైన ప్రదేశంగా గుర్తించారు. బెంగుళూరు హైవే నుంచి రామదేవరబెట్ట వరకు కొత్త రోడ్డును నిర్మించారు. కళాదర్శకుడు రామ్ ఏడేకర్ అక్కడ ఒక టౌన్-షిప్ నిర్మాణానికి బ్లూప్రింట్ రెడీ చేసి నిర్మాణ పనులు పూర్తి చేశాడు. జైలు సెట్టింగు మాత్రం ముంబై రాజ్ కమల్ స్టూడియోలో వేశారు. అక్టోబరు 3, 1973న చిత్ర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. బీరువా తాళాలను జయాభాదురి అమితాబ్ బచ్చన్‌కు అందించే సన్నివేశాన్ని తొలి షాట్‌గా చిత్రీకరించారు. చిత్ర నిర్మాణానికి ఏకంగా రెండున్నరేళ్ళుపట్టింది. మంచి ఫలితాన్ని రాబట్టే ఉద్దేశ్యంతో ఒకే సన్నివేశాన్ని అనేక కోణాలలో చిత్రీకరించడం వలన నిర్మాణ వ్యయం మూడు కోట్లకు పెరిగింది. ఉదాహరణకు “యే దోస్తీ హమ్ నహీ ఛోడెంగే” పాట చిత్రీకరణకు 21 రోజులు పట్టింది. అలాగే జయాభాదురి దీపాలు వెలిగించే సన్నివేశ చిత్రీకరణకు లైటింగ్ అడ్జస్టుమెంటు కుదరక 20 రోజులు పట్టింది. ఇమామ్‌గా నటించిన హంగల్ కొడుకును గబ్బర్ సింగ్ చంపే సన్నివేశ చిత్రీకరణకు 19 రోజులు పట్టింది. బందిపోటు దొంగలు రైలు దోపిడీ చేసే సన్నివేశాలను ముంబై నగరానికి దగ్గరలో వున్న పాన్వెల్ ఉరాన్ రైలు మార్గం మీద చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు చిత్రీకరించడానికి యాభై రోజుల సమయం తీసుకుంది. రామ్ ఘడ్‌లో వసంతోత్సవ గీతం చిత్రీకరణకు వినియోగించిన రంగుల ఖరీదు ఆ రోజుల్లోనే పదిహేను వేలు. ఇది కాక పాట చిత్రీకరణకు ఏడు లక్షలు ఖర్చయింది. ఈ చిత్రం కోసం వాడిన ముడి ఫిలిం ఖర్చే మూడుకోట్ల రూపాయలంటే మీరే ఊహించండి ఇది యెంత ఖరీదైన చిత్రమో! ఆ రోజుల్లో 70 ఎం.ఎం కెమెరా లభ్యత కష్టంగా ఉండడంతో 35 ఎం.ఎం కెమెరా మీద తొలుత చిత్రీకరణ జరిపి తర్వాత దానిని 2.2:1 ఫ్రేములోకి మార్పిడి చేశారు. ఈ సినిమాకు తొలిసారి 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ వ్యవస్థను ఉపయోగించారు. ‘షోలే’ సినిమాకు ముద్రించిన వాల్-పోస్టర్లు కూడా ప్రత్యేకంగా 70 ఎం.ఎం తెర మీద వున్నట్లు తీర్చిదిద్దడం ఆ రోజుల్లో ఒక గొప్ప ప్రయోగం! సినిమా స్క్రిప్టు ప్రకారం పతాక సన్నివేశంలో గబ్బర్ సింగ్ ని ఠాకూర్ చంపుతాడు. కానీ ఈ సన్నివేశంతో సహా ఇమామ్ కొడుకుని చంపడం వంటి సన్నివేశాలు సభ్యసమాజంలో హింసను ప్రేరేపిస్తాయని భావించి సెన్సారు బోర్డు సర్టిఫికేటును నిరాకరించింది. సినిమాకు ఈ సన్నివేశాల అవసరాన్ని సిప్పీ సెన్సారు బోర్డుకు నివేదించి, వారిని ఒప్పించి సర్టిఫికేటు పొందారు. అయితే పతాక సన్నివేశాన్ని మాత్రం సెన్సారు బోర్డు మార్చాల్సిందేనని పట్టుబట్టింది. అందుచేత పతాక సన్నివేశాన్ని రీ-షూట్ చేసి, ఠాకూర్ గబ్బర్ సింగ్ ని చంపబోయే సమయానికి పోలీసులు రంగప్రవేశంచేసి గబ్బర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు చూపి, “నేరస్తులను చట్టమే శిక్షిస్తుంది” అని ఠాకూర్ చేత చెప్పించారు. ఆర్.డి. బర్మన్ సంగీతాన్ని గురించి చెప్పడానికి మాటలు చాలవు.

షోలే సినిమా మరో కోణంలో..

‘షోలే’ సినిమాకు మొదట ప్రతిపాదించిన పేరు ‘ఏక్ దో తీన్’. కానీ నిర్మాతలు పట్టుబట్టి సలీం-జావేద్ చేత ‘షోలే’ గా మార్పు చేయించారు. ఠాకూర్ బలదేవ్ సింగ్ ప్రతీకారేచ్చ నివురుగప్పిన నిప్పులా ఉందనే భావంలో  ‘షోలే’ పేరును ఖరారు చేశారు. ఇందులో ఒక కవ్వాలీ పాటను కూడా చేర్చారు. నిడివి యెక్కువ కావడంతో ఆ పాటను ప్రక్కన పెట్టారు. గబ్బర్ సింగ్ డైలాగులు ప్రేక్షకులను యెంతగా మెప్పించాయో చెప్పనలవికాదు. “అరె ఓ సాంబా కితనా ఈనాం రఖాహై సర్కార్ హమ్ పర్!”, “తేరా క్యాహోగా కాలియా”, “యే హాత్ హమ్ కో దేదో ఠాకూర్”, “జో డర్ గా, సోచో వో మర్ గయా”,  “జబ్ బచ్చా రాత్ కు రోతాహై తో.. మా కేహతీ హై.. బచ్చా సోజా.. నహీతో గబ్బర్ సింగ్ ఆజాయేగా” వంటి గబ్బర్ డైలాగులు బాగా పేలాయి. అమ్జాద్ ఖాన్ మీద తీసిన తొలి షాట్ “కితనే ఆద్మీ థే” అనే డైలాగు. అది “ఒకే” అవడానికి అమ్జాద్ నలభై టేకులు తిన్నాడు. ఈ సినిమా డైలాగులతో కూడిన గ్రామఫోన్ రికార్డులు అత్యధికంగా అమ్ముడుపోయి ప్లాటినం స్థాయికి చేర్చాయి. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం హాలీవుడ్ నిపుణులు జిమ్ అలెన్, గ్రెగరీ క్రాంప్టన్, రెమో కొమేరో, జాన్ గ్రాంట్ లను పిలిపించారు. ‘షోలే’ సినిమా ఆగస్టు 15, 1975 న విడుదలైంది. ముంబైలో విడుదలైన తొలి రెండు వారాలు షోలే సినిమా నిరాశాజనకంగా నడిచింది. కలెక్షన్లు లేవు. పైగా సినిమా రివ్యూలు డిజాస్టర్ అంటూ రాశాయి. సిప్పీ నిరాశపడ్డారు. బయ్యర్లు పెదవి విరిచారు. సినిమా చివరలో అమితాబ్ బచ్చన్ చనిపోవడం ప్రేక్షకులకు రుచించలేదు. కానీ, రెండు వారాల తరవాత సినిమా అనూహ్యంగా పుంజుకుంది. అప్పుడు ఉత్తర ప్రదేశ్, బెంగాల్, హైదరాబాద్ జోన్లలో అక్టోబరు 11న షోలే ను విడుదల చేశారు. ఆ రోజుల్లోనే దాదాపు 150 మిలియన్ల వసూళ్లు నమోదు చేసి ‘షోలే’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రికార్డు పందొమ్మిది సంవత్సరాల దాకా చెక్కు చెదరలేదు. ఇప్పుడు రామనగర ఊరు ‘సిప్పీ నగర్’ పేరుతో పిలవబడుతోంది.

ఆర్.డి. బర్మన్ పాటల విందు..

ఆనంద్ బక్షి సమకూర్చిన సాహిత్యానికి రాహుల్ దేవ్ బర్మన్ అందించిన సంగీతం కూడా చిత్రవిజయానికి అనుకూలించింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం గొప్పగా అమరింది. గబ్బర్ సింగ్ వచ్చే ప్రతి సన్నివేశానికి ముందు వినవచ్చే విచిత్రమైన, భయానకమైన విజిల్-లైక్ సౌండ్ నేపథ్య సంగీతం ‘థీమ్ మ్యూజిక్’ గా సంతరించుకుంది. అలాగే అమితాబ్ వినిపించే మౌత్ ఆర్గన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. షోలే  స్నేహాకి ప్రతీకగా నిలచిన కిషోర్ కుమార్, మన్నా డే ల గీతం “యే దోస్తీ హమ్ నహీ తోడెంగే” చిత్రానికే హైలైట్. ఈ పాట చిత్రీకరణకు 21రోజుల సమయాన్ని వెచ్చించారు. రాహుల్ దేవ్ స్వయంగా పాడిన హెలెన్ నృత్యం చేసే “మెహబూబా మెహబూబా” పాటను తొలుత ఆశా భోస్లే చేత పాడించాలనుకున్నారు. వెస్ట్రన్ బీట్ అయితే బాగుంటుందని తనే పాడి హిట్ చేసారు బర్మన్. ఈ పాటకు బర్మన్ “సె నా మేరీ సే మేరీ” అంటూ గ్రీక్ సింగర్ డేమిస్ రుస్సోస్ ఆలపించిన గీతాన్ని ప్రేరణగా తీసుకున్నారు. “హోలీ కె దిన్” పాట చిత్రానికి హైలైట్. లతాజీ, కిషోర్ కుమార్ పాడిన ఈ పాట నేటికీ ప్రతి హోలీ పండుగలలో విశేషంగా వినిపిస్తూ వుంటుంది.

కొన్ని సరిగమలు.. మరికొన్ని పదనిసలు..

ధర్మేంద్ర అప్పటికే హేమామాలినితో పీకలలోతు ప్రేమలో మునిగి వున్నాడు. షోలే చిత్రంలో ధర్మేంద్ర, హేమామాలిని మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సీన్లు సరిగ్గా పండడంలేదనే సాకుతో లైట్ బాయ్స్‌కు ధర్మేంద్ర లంచాలు ముట్టజెప్పి వారిచేత తప్పులు చేయించి టేకుల మీద టేకులు తీయించేవాడట.

“చల్ ధన్నో! ఆజ్ తేరే బసంతి ఇజ్జత్ కీ సవాల్ హై” అనే హేమామాలిని డైలాగ్; “కిత్నా గరం మైండ్ హై! బసంతి” అనే ధర్మేంద్ర డైలాగ్; రహీమ్ చాచా చెప్పే “ఇత్నా బడా సంసార్, యహా ఏక్ ఆద్మీ ఆతా హై, ఏక్ ఆద్మీ జాతా హై.. ఫిర్ భీ యహా ఇత్నా సన్నాటా క్యోం హై” సినిమాలో బాగా పేలాయి.

క్లైమాక్స్ యాక్షన్ సీన్‌లో ధర్మేంద్ర పొరపాటున నిజమైన తుపాకీ పేల్చడంతో అందులోని బుల్లెట్ అమితాబ్ బచ్చన్ చెవి ప్రక్కనుంచి వెళ్ళింది. అలా అమితాబ్ కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు.

ఇందులో ‘సాంబా’ పాత్రను పోషించిన మెక్ మోహన్ “పూరే పచాస్ హజార్” అనే ఒకే ఒక డైలాగ్ చెప్పడానికి ముంబై నుంచి ఇరవై ఏడు సార్లు బెంగుళూరు కు ప్రయాణించాడు.

అయితే ఈ సినిమాలో కొన్ని పదనిసలు కూడా వున్నాయి. బందిపోటు దొంగల దౌర్జన్యాలకు గురౌతున్న ఆ గ్రామంలో ఒక చిన్న పోలీస్ అవుట్ పోస్టు కూడా లేకపోవడం, దొంగల స్థావరం ఎక్కడ వుండేది అనే విషయం తెలిసి కూడా చివరిదాకా పోలీసులు దాడి చేయకపోవడం ఈ సినిమాలో చిరులోపాలు.

అయినా ప్రేక్షకుల దృష్టిలో ‘షోలే’ ఒక నవరస చిత్ర మాలిక!

Exit mobile version