Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రమ దేవో భవ

[శింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన ‘శ్రమ దేవో భవ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“టికెట్.. టికెట్” అడుగుతూ వచ్చిన కండక్టరుతో,

“రామతీర్థం.. ఒక ఫుల్, ఒక ఆధార్” అని వంద రూపాయల నోటు తీసి ఇచ్చాడు భార్గవ.

“ఆధార్ కార్డు చూపించండి” అని అడిగాడు కండక్టర్. తన భార్య ఆధార్ తీసి చూపించాడు.

దాన్ని చూసి ఒక ఫుల్ టికెట్, ఒక ఫ్రీ టికెట్ ఇచ్చి, భార్గవ్ ప్రక్కన వున్న పిల్లవాడిని చూసి, “ఈ.. అబ్బాయి..” అనగానే,

“మా అబ్బాయి” అన్నాడు భార్గవ.

“ఇతనికి అరటికెట్ కొట్టాలి”

“మూడేళ్ళ కుర్రాడికి అరటికెట్టా?”

“ఇంత పొడవుంటే మూడేళ్ళేమిటండి. ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు ఉంటాయి”

“లేవండి.. మూడేళ్ళే” అందుకున్నది భార్గవ్ భార్య సుమతి.

“ఏం నాటకాలు వేస్తున్నారా” సీరియస్ అయ్యాడు కండక్టర్.

“నాన్నా.. నాకు..” ఏదో చెప్పబోయాడు భార్గవ కొడుకు వాత్సవ.

“నువ్వు నోరుముయ్యరా.. ఏమిటయ్యా.. కన్నది నేనా.. నువ్వా” గదమాయించింది సుమతి.

“అమ్మా.. మీరు అరిచినంత మాత్రాన మీ అబ్బాయి వయసు తగ్గదు. మధ్యలో ఎవరైనా చెకింగుకు వస్తే, నా ఉద్యోగం ఊడుతుంది. టికెట్ తీసుకోండమ్మా” కాస్త తగ్గి అన్నాడు కండక్టర్.

“అదికాదమ్మా.. మరి” మళ్ళీ అందుకున్నాడు వాత్సవ.

“ఇంటిదగ్గర నీకేమి చెప్పాను. గుర్తు తెచ్చుకుని నోరు మూసుకుని కూర్చో” కొడుకును అరిచింది సుమతి. వెంటనే అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాత్సవకు.

“ఒరేయ్ చిన్ను.. నీకు ఇంట్లో ఆరేళ్ళు, స్కూల్లో అయిదేళ్ళు, బస్సులో మూడేళ్ళు.. గుర్తుపెట్టుకో. అందుకే బస్సులో ఎవరడిగినా మూడేళ్ళనే చెప్పు. సరేనా..”

అంతే. నోరు మెదపకుండ కూర్చున్నాడు వాత్సవ.

“చూడండి కండక్టరుగారు, మా ఇంట్లో అందరు బారుమనుషులు అందుకే వాడు పొడవుగా ఉన్నాడు. చెకింగు వస్తే మేము వీడికి మూడేళ్ళని గంటకొట్టి చెబుతాములే. మీరు వెళ్ళండి” అని సుమతి చెప్పగానే, “వీళ్ళకు ఎన్ని ఉచితాలు సరిపోవు” అని గొణుక్కుంటు వెళ్ళాడు కండక్టర్.

“నాన్నా.. తిరునాళ్ళలో నేను అడిగినవన్నీ కొనిపెట్టాలి. టికెట్ లేదుగా” అడిగాడు వాత్సవ.

“ఒరేయ్.. నువ్వు అచ్చు మీ అమ్మ కొడుకువేరా. ఒకచోట ఆదాయాన్ని ఇంకోచోట పూడుస్తావు. అలాగేలే” అన్నాడు భార్గవ, కొడుకు నెత్తిన మొట్టి.

***

“పీచు మిఠాయి.. పీచు మిఠాయి.. నాలుగు రూపాయలే బాబు. రండి బాబు..రండి” అన్న అరుపులు విని అటువైపు వేలుపెట్టి చూపిస్తూ, “నాన్నా.. నాకు పీచు మిఠాయి కావాలి” తండ్రి చేయిపట్టి లాగుతూ అడిగాడు వాత్సవ.

“ఇప్పుడే కదురా ఐస్ క్రీమ్ తిన్నావు. ముందు రంగులరాట్నం తిరుగు. తరువాత తిందువు” అన్నాడు భార్గవ్.

“ఆ.. ఆ.. ఇప్పుడే కావాలి నాన్నా.. తింటూ తిరుగుతాను. కొనిపెట్టు నాన్నా” చిందులు తొక్కసాగాడు వాత్సవ.

“వాడి నస మీకు తెలుసుగా..కొనిపెట్టండి. ఎలాగు వాడికి టికెట్టు కొనలేదు. అబద్ధం చెప్పి తప్పించుకున్నాము. వాటి వరకైనా ఖర్చు పెట్టండి. మీ పిసినారితనం పాడుగాను” సుమతి దెప్పుడు.

“నోరు మూసుకుని పద” అని పీచు మిఠాయి అమ్మే కుర్రాడి దగ్గరికి వెళ్ళారు.

“అన్నా.. పీచు మిఠాయి ఇవ్వవా” అడిగాడు వాత్సవ.

అమ్మే కుర్రాడిని చూసి షాకయ్యాడు భార్గవ. ఆ కుర్రాడికి ఒక కాలు సగంవరకే ఉంది. చంకల క్రింద కర్ర పెట్టుకున్నాడు. ఒక కన్ను కూడ పువ్వు పూసినట్టుగా ఉంది. వయసు పదిహేను సంవత్సరాలకు అటుయిటుగా ఉంటుందనిపించింది. ‘నిజానికి అటువంటి వాళ్ళు తమ లోపాన్ని చూపిస్తూ అడుక్కుంటుంటారు. కాని ఈ కుర్రాడు తను చేయగలిగిన వ్యాపారం చేస్తున్నాడు.. శ్రమజీవి’ మనసులో అనుకున్నాడు భార్గవ.

“ఎంత బాబు?” అడిగాడు భార్గవ.

“ఒకటి నాలుగు రూపాయలు సర్”

“సరే.. ఒకటివ్వు” అని పది రూపాయలు ఇచ్చాడు.

“చిల్లర లేదు సర్”

“ముందు ఇవ్వు. ఆ రంగులరాట్నం తిరిగి వచ్చాక మిగిలిన డబ్బులు తీసుకుంటానులే”

“నేను ఈడనే ఉంటా సార్. మా నాన్న కాడికెళ్ళి చిల్లర తెచ్చి ఉంచుతా.. మర్సిపోకుండా రండి సార్” అన్నాడా కుర్రాడు.

“సరే” అని చెప్పి మిఠాయి తీసుకుని రంగులరాట్నం దగ్గరికి వచ్చాము.

సాయంత్రం నాలుగు వరకు అక్కడ కనిపించిన ప్రతి ఆట ఆడి అలిసిపోయాడు వాత్సవ.  అక్కడే ఒక బడ్డికొట్టులో టిఫిను చేసి తిరుగుముఖం పట్టారు భార్గవ కుటుంబం.

“మొత్తానికి నీ కొడకనిపించాడే వీడు. రెండు వందల రూపాయలు వదిలించాడు వెధవ” అని వాత్సవ నెత్తిన తట్టాడు భార్గవ.

“అయినా అదేమన్నా మీరు కష్టపడి సంపాదించిన డబ్బా.. అంతా ప్రభుత్వం దగ్గర ఉచితంగా నొక్కుతున్న దాన్లో ఏ ముప్ఫయ్యో వంతో, నలభైయవ వంతోనే కదా” చురక వేసింది సుమతి.

“ఉచితంగా వచ్చేటప్పుడు ఉన్న కిక్కే వేరు సుమతి. ఆ పీచు మిఠాయి అమ్మే కుర్రాడు చూడు. అడుక్కుంటే అంతకంటే ఎక్కువ సంపాదించగలడు. కాని ఆ పీచు మిఠాయి కర్ర తగిలించుకుని నిలుచుని అమ్ముకుంటున్నాడు” ఎద్దేవాగ అన్నాడు.

“అవును.. మర్చేపోయాను. వాడు మనకు ఆరు రూపాయలు ఇవ్వాలికదా” అన్నది సుమతి.

“పాపం ఆ అబ్బాయికి కాలు లేదుగా. పోనీలేవే. దానం చేశామనుకుందాం. శ్రమను నమ్ముకున్నవాడికి ఒక రూపాయ ఇస్తే ఏంపోయింది” జాలి పలుకులు పలికాడు భార్గవ.

ఇంతలో ఎవరో “సారు.. సారు” అని అరుస్తున్నట్లు వినిపించింది.

‘తమనా.. కాదా..’ అనుకుంటూ వెనక్కు తిరిగి చూశాడు భార్గవ. దూరంగా ఒకతను చక్రాలబండిని తోసుకుంటు తమవైపు వస్తూ అరుస్తున్నాడు. అతని వెంట కర్రపోటు వేసుకుంటు పీచుమిఠాయి కుర్రాడు. వాళ్ళు తమ కోసమేననుకుని వాళ్ళకు ఎదురువెళ్ళాడు భార్గవ.

“సారు.. మీకు మా అబ్బాయి ఆరు రూపాయలియ్యాలంట కదా. మీరొత్తారని సూసినాడు. మీరు రాలె. మిమ్మల్ని ఎతుక్కుంటా తిరగతున్నాడు. ఎట్టానో కనిపించినారు. లేకుంటే మాకియాల నిదరట్టేది కాదు” అన్నాడు చక్రాలబండిని నెట్టుకుంటు వచ్చిన కాళ్ళులేని అతను. బహుశ అతను ఆ కుర్రాడి తండ్రి అనుకున్నాడు భార్గవ.

“నాకు గుర్తుందండి. కావాలనే మీ దగ్గరికి రాలేదు. కష్టపడుతున్న బిడ్డకు ఇచ్చాననుకున్నాను” అన్నాడు భార్గవ.

“ఊరకవచ్చే సొమ్ము మాకొద్దు సారు. మా పీచుమిఠాయి ధర మాకొత్తే చాలు. అందుకే మిమ్మల్ని ఎతుక్కుంటా వచ్చాము” అన్నాడా కుర్రాడు.

“సారు.. మేము కట్టాన్ని నమ్ముకుని బతికేటోల్లమే తప్ప, ఎవురి సొమ్ముకోసమో ఎదురుసూసేటోల్లం కాదు. కట్టపడి బతకడమే మాకిట్టం సారు. నాకు కాల్లు లేవు. నేను పొయ్యికాడ కూసుని దోసెలు పోసి అమ్ముతా. ఈడు నా కొడుకు కాదు. నాలాటి అనాధోడు. నాకు కుప్పతొట్టికాడ దొరికినాడు.. తెచ్చి పెంచినా. ఆడికి కట్టాన్ని నేర్పినా. కట్టమంటే దైవంతో సమానమంట.  అందుకే సారు.. మా కట్టమే మాకు దేవుడని  నమ్ముకు బతుకుతున్నాము. ఇయిగోండి సారు మీ ఆరు రూపాయలు” అని సొమ్ము భార్గవ చేతిలో పెట్టి వెళ్ళారిద్దరు.

భార్గవ నోటివెంట మాటరాలేదు. మౌనంగా బస్టాండు వైపుకు నడిచాడు. సుమతి కూడ మాట్లాడకుండా వాత్సవను తీసుకుని భర్తను అనుసరించింది.

***

“టికెట్.. టికెట్” అరిచాడు కండక్టర్.

“రెండు ఫుల్లు, ఒక హాఫ్” అని చెప్పి కండక్టరుకు డబ్బులు ఇచ్చాడు భార్గవ.

“ఆడవాళ్ళకు ఉచితమండి. ఆధార్ లేదా?” అడిగాడు కండక్టర్.

“ఉంది.. కాని మాకు వద్దు. టికెట్ కొట్టండి” అన్నాడు భార్గవ.

“నాన్నా.. నాకు మూడేళ్ళు కదా.. టిక్కెట్టు లేదుగా” అమాయకంగా అన్నాడు వాత్సవ తండ్రి చెవి దగ్గర చేరి.

“వాత్సవ.. నీకు ఆరు సంవత్సరాలు. ఎక్కడైనా అలాగే చెప్పు. అబద్దాలు చెప్పకు” అన్నాడు భార్గవ.

“నాన్నా.. అయితే నేను ఇకనుంచి..” ఏదో అడగబోయాడు వాత్సవ.

“నిజమే చెప్పు.. నిజాయితీగా ఉండు. పీచుమిఠాయి అమ్మే అబ్బాయి, వాళ్ళ నాన్నకాని నాన్న ఎంత నిజాయితీగా ఉన్నారో. మనలా అబద్ధాలు చెప్పి ఉచితాల కోసం ప్రాకులాడలేదు. శ్రమను నమ్ముకుని బ్రతుకుతున్నారు. మనకు ఇక ఉచితమనేది వద్దు. శ్రమను నమ్ముకుని బ్రతకుదాం. ‘శ్రమ దేవో భవ’..అన్నది ఇక మన సిద్ధాంతం” భార్గవ మాటల్లో నిజాయితి తొణికిసలాడింది. భర్తలో వచ్చిన మార్పు “కలా.. నిజమా” అన్నట్లు భార్గవ వైపు చూసింది సుమతి.

“నిజమే” అన్నట్లు తలవూపాడు భార్గవ.

Exit mobile version