Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-104

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

తథాహి ప్రథమం రాజ్ఞి పుప్పలీలా చికీర్షయా।
గతే మడవ రాజ్యోర్వీ భూమికంపోభవన్మహాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 114)

పుష్పాల పండుగ కోసం మడవ రాజ్యానికి రాజు వెళ్లినప్పుడు భూకంపం సంభవించింది. అన్నీ దుష్టశకునాలు కనిపిస్తున్నాయనీ, కశ్మీరు కఠినమైన కాలాన్ని ఎదుర్కొవాల్సి వస్తున్నదని ఆకాశం, గాలి, భూమి సూచనలిస్తున్నాయని ముందరి శ్లోకంలో చెప్పాడు శ్రీవరుడు. ఇప్పుడు భూకంపం వచ్చినదని చెప్పాడు.

కశ్మీరు భౌగోళికంగా స్థిరమైన ప్రదేశం కాదు. అక్కడ భూకదలికలు సంభవిస్తూన్నాయి ఇప్పటికీ. కానీ కశ్మీరులో భూకంపాలు అంత భయంకరమైనవి అరుదుగా సంభవిస్తాయి. భూకంపాలను అధ్యయనం చేసేవారు కశ్మీరులో సంభవించిన తీవ్రమైన భూకంపాల జాబితాను తయారు చేశారు. దానిలో కల్హణుడు ప్రస్తావించిన భూకంపం ప్రస్తావన ఉంది. శ్రీవరుడు ప్రస్తావించిన ఈ భూకంపం ప్రస్తావన లేదు. అందువల్ల శ్రీవరుడు ప్రస్తావించిన ఈ భూకంపం అంత తీవ్రమైనది కాదని భావించ వచ్చు. తరువాత శ్లోకం ఈ భావనను బలపరుస్తుంది.

అస్మత్ కర్తృజనః కోపి సుఖీ నైవాధునా స్థితః।
ఇతీవ దేశే తత్కాలం చకంపుర్జనవధృహాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 115)

ఇక పై ఈ దేశంలో ఎవరూ సుఖంగా ఉండరని తెలియటం వల్ల కాబోలు,  భయంతో  మనుషులలాగా భవంతులు కూడా కంపించాయి.

రాబోయే భయంకరమైన దినాలను తలచుకుని మనుషులు భయంతో వణుకుతున్నారు. వారి భాధను గ్రహించి స్పందిస్తున్నట్లు వారి గృహాలు కూడా కంపించాయంటున్నాడు శ్రీవరుడు. అంటే, వచ్చిన భూకంపం భవంతులను కంపింపచేసినదే తప్ప కూల్చినది కాదు. బహుశా అందుకనే ఈ భూకంపాన్ని పరగణనలోకి తీసుకోలేదు పరిశోధకులు. అయితే తరువాత ప్రజ్ఞాభట్టు రాజతరంగిణిలో ప్రస్తావించిన భూకంపాన్ని ప్రస్తావించారు. అది పెద్ద భూకంపం.

ఉద్భూత్ పూర్వదిక్పుచ్ఛః కేతుర్నభసి విస్తృతః।
పూర్వ బహ్రామఖానేన దృష్టోరిష్టస్య సూచకః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 116)

తూర్పు వైపు తోక ఉన్న తోకచుక్క కశ్మీరులో కనిపించింది. దీన్ని ప్రథమంగా చూసింది బహ్రమ్ ఖాన్. ఈ తోకచుక్క భవిష్యత్తులో రాబోయే భయంకరమైన సంఘటనలను సూచిస్తూ ఉంది.

స దూరవిస్తృతః పుచ్ఛః కాలకున్తోపమో దినే।
స్ఫురన్ ప్రతీచీం ప్రత్యాశాం తస్యైవ దదృశే జనైః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 117)

దూరం వరకు కేశాల్లాంటి దాని తోక విస్తరించి ఉంది. అది మరణ ఖడ్గంలా ఉంది. పశ్చిమం వరకూ విస్తరించి ఉన్న ఈ తోకచుక్కను ప్రజలు పగటి పూట కూడా చూడగలిగారు.

తోకచుక్కను  ‘ధూమకేతు’ అని కూడా అంటారు. ఆకాశంలో తోకచుక్క కనిపించటం అరిష్టదాయకం అన్నది సంప్రదాయికుల నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం జైనులాబిదీన్ మరణం తరువాత తోకచుక్క కనబడటం అరిష్టాన్ని సూచిస్తున్నదంటున్నాడు శ్రీవరుడు. అంతే కాదు, తరువాత శ్లోకాలలో అరిష్ట ఆగమనాన్ని సూచించే పలు సంఘటనలను ప్రస్తావించాడు.

యుగ్మ సూర్వడవా రాజమన్దురాన్తర్గతాభవత్।
దేశాత్ కృష్టుం దదౌ రాజా యాం మియా యవనక్షయే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 118)

సింహాదయో దినే చేరుర్వన్యాః శ్రీనగరాంతరే।
బిడాలపోతం సుపుత్రే గునీ చ ప్రసవక్షణే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 119)

నిష్ఫలో యః సదానన్దీతరుః స సఫలోభవత్।
ఉపరాజగృహం మూలాద్ దాడిమీకుసుమోద్గమః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 120)

సుమనోవాదశాటాన్తర్భవ శోణితవర్పణమ్।
ఇతి దృష్ట్వా జనః సర్వః క్షతే క్షారమివాన్వభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 121)

రాజు పశుశాలలో ఒక అశ్వం కవలలకు జన్మనిచ్చింది. ఇది అశుభ సూచకం అని భావించి రాజు ఆ కవల పిల్లలను యవనులకు దానం ఇచ్చేసాడు.

ఉదయం పూట శ్రీనగరం వీధులలో సింహాలతో సహా అనేక అడవి జంతువులు స్వేచ్ఛగా విహరించాయి. ఒక కుక్క, పిల్లికి జన్మనిచ్చింది.

పుష్పించని చెట్టు హఠాత్తుగా పుష్పించింది. రాజు గృహం దగ్గర చెట్టు వేళ్లకు పూలు పూశాయి. ఇవన్నీ అనర్థ సూచనలు. తోకచుక్క కనిపించిన తరువాత గొప్ప రాజులు మరణించటం, రాజ వంశాల పాలనలు అంతరించి కొత్త రాజవంశ పాలన ఆరంభమవటం, ప్రజలు అష్టకష్టాలు పడటం వంటి అనేక సంఘటనలను చరిత్రలో చూడవచ్చు.

ప్రజలు ఆరవేసిన బట్టలపై రక్త వర్షం కురిసింది. అది చూసిన ప్రజలు భయభ్రాంతులయ్యారు. వారికి పుండుపై ఉప్పు చల్లినట్టనిపించింది.

అత్రాన్తరే వసన్సై దఖాన గాహాది పీడనమ్।
హిందుకా విదధుః పూర్ణనాపితోద్వలితకృధాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 122)

పూర్ణ అనే మంగలి వాడు రెచ్చగొట్టటం వల్ల ఆగ్రహించిన హిందువులు సైయద్ ఖాన్‌ను, ఇతరులను తీవ్రంగా కష్టపరచారు.

బహుశా భారతీయ వాఙ్మయంలో హిందూ –ముస్లింల నడుమ సంఘర్షణల ఫలితంగా హిందువులను తీవ్రమైన రీతిలో హింసించటం వంటి విషయాలను గ్రంథస్థం చేసిన తొలి రచన శ్రీవరుడి రాజతరంగిణియేమో!

ఇంతకు ముందు జోనరాజు, సింకదర్ బుత్‌షికన్ అకృత్యాలను తన రాజతరంగిణిలో గ్రంథస్థం చేసినా, అది సుల్తానుల అకృత్యాలను, జాతివధను ప్రదర్శించిన తొలి సాక్షిగా జోనరాజును నిలుపుతుంది.

ఇప్పుడు శ్రీవరుడు ప్రదర్శిస్తున్నది జాతి వధ కాదు. హిందూ – ముస్లింల నడుమ ఘర్షణల ఫలితంగా సుల్తాన్ హిందువులను తీవ్రమైన స్థాయిలో శిక్షించటం.  అంటే ఒక ఇస్లామ్ రాజ్యంలో హిందువులు తిరగబటం, మతకల్లోలాలు చెలరేగటం, సుల్తాన్ దాన్ని తీవ్రంగా పరిగణించటం, వంటి విషయాలను తొలిసారిగా ప్రదర్శించినవాడు శ్రీవరుడు. 13వ శతాబ్దానికి చెందిన ‘చాచ్‌నామా’ అరబ్బులు తొలిసారిగా భారత్‌లో ప్రవేశించిన తరువాత జరిపిన అకృత్యాలను ప్రదర్శించింది. భారతీయులపై సుల్తానులు అకృత్యాలను తొలిసారిగా గ్రంధస్థం చేసినవాడు జోనరాజు. సుల్తాను రాజ్యంలో తురకలపై భారతీయులు తిరగబడటాన్ని గ్రంధస్థం చేసినవాడు శ్రీవరుడు. తరువాత,   ప్రజ్ఞాభట్టు, శుకుడు చరిత్రను గ్రంథస్థం చేయటంలో తమ బాధ్యత నిర్వహించారు.

పూర్ణ అనే మంగలి వాడు సుల్తాన్‌ను గుప్పిట్లో పెట్టుకుని వెనుక నుంచి చక్రం తిప్పాడని ముందరి శ్లోకాలలో శ్రీవరుడు చెప్పాడు. ‘పూర్ణ’ మతం మారిన భారతీయుడు అని ఊహించటం కష్టం కాదు. జోనరాజు కానీ, శ్రీవరుడు కానీ మతం మారిన వారిని, వారు వదలిన ధర్మంలోని పేరుతోనే ప్రస్తావించటం కనిపిస్తుంది. కాబట్టి మత  ఛాందసత్వంతో   నిండిన అప్పటి కాలంలో ‘పూర్ణ’ అనే ఇస్లామేతరుడు సుల్తాన్‌కు అంత దగ్గరివాడు కావటం కుదరదు. అందుకని కూడా ‘పూర్ణ’ మతం మారి ముస్లింగా అయి ఉంటాడని అర్థం చేసుకోవటం కష్టం కాదు.

భారతదేశంలో మతకల్లోలాలను అధ్యయనం చేసేవారు గమనించిన విషయం ఏమిటంటే ఎప్పుడెప్పుడు హిందువుల ఆత్మవిశ్వాసం పెరుగుతున్నట్టు అనిపిస్తుందో అప్పుడప్పుడు ‘మతకల్లోలాలు’ హిందువులను భయభ్రాంతులను చేసేందుకు ఒక ఆయుధంలా వాడటం కనిపిస్తుంది. అందుకు పెద్దగా కారణం అవసరం లేదు. ఎటువంటి పనికిరానిదయినా, విద్వేషాగ్నితో హిందువులను దహించటానికి పనికి వస్తుంది.

ఇటీవలె, కొన్ని రంగు చుక్కలు పొరపాటున తనపై పడ్డాయన్న ముస్లిం మహిళ ఫిర్యాదు ఫలితంగా నలభై మంది ముస్లింలు ఒక కుటుంబంపై దాడి చేయటం,  ఈ గొడవతో సంబంధం లేకుండా బయట నుంచి ఇంటికి వస్తున్న యువకుడిని చంపేయటం, ఫలితంగా ఆగ్రహావేశాలతో ఢిల్లీలోని ఓ ప్రాంతమంతా  ఉద్విగ్నతామయం అవటం చూస్తున్నాం.ఎన్నో ఏళ్ళుగా ప్రతి పండగా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా సంబరాలు జరుపుకునే హిందువులు ఈరోజు ఉత్తమ్ నగర్ లో ఇంత ఆవేశం ప్రదర్శిస్తున్నరు. ఆధునిక వైజ్ఞ్నానిక, యాంత్రిక, సాంకేతిక సమచార విస్ఫోటన యుగంలో, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలోనే  ఇలాంటి పరిస్థితి ఉంటే, ఆ కాలంలో మధ్య యుగంలో జైనులాబిదీన్ వంటి పరమత సహనం కలిగిన రాజు అడ్డు తొలగటంతోటే పెల్లుబికిన మతదురహంకార అసహనాన్ని అర్థం చేసుకోవటం కష్టం కాదు.

బంగ్లాదేశ్‌లో ఏదో ఓ చిన్న కారణంతో హిందువులను చంపటం, దాడులు చేసి ఇళ్లు తగులబెటట్టం మనం చూస్తూనే ఉన్నాం.

అలాంటి పరిస్థితులలో ఉంటూ ఇలా నిజాన్ని నిర్భయంగా తన రచనలో పొందుపరచిన శ్రీవరుడిని అభినందించక తప్పదు. భావితరాలకు,  ‘చేదు నిజాన్ని’ అందించాలన్న శ్రీవరుడి తపనను కొనియాడక తప్పదు. భారతీయ సమాజంలోని అణిచివేతల వల్ల అట్టడుగు వర్గాలవారు స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరించారని  వేదికలెక్కి ప్రకటిస్తూ, ఆ అబద్ధాన్ని నిజంగా స్థిరపరచాలని తీవ్రంగా తపనపడుతున్న  అధునిక లౌకిక మేధావుల తీవ్ర ప్రయత్నాలలోని నైచ్యాన్ని ఎత్తి చూపించే వీలునిచ్చిన శ్రీవరుడికి భారతీయులందరూ సర్వదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పటి నుంచీ వచ్చే ఓ పది పన్నెండు శ్లోకాలు ప్రతి భారతీయుడు గుర్తు పెట్టుకోగలవి. వీలయితే రోజూ వాటిని పఠిస్తూ మరిచిపోకుండా ఉండాలి,

తమ పూర్వీకులపై జరిగిన అత్యాచారాలను మరచిపోకుండా ఉండేందుకు శ్రీవరుడు ఎన్నెన్ని ప్రమాదాలను ఎదుర్కుంటూ, ఈ రచనను చేశాడో! ఎలాంటి కఠినమైన అమానుషమైన పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా తమ స్వధర్మాన్ని వదలకుండా భావి తరాలకు సజీవంగా అందించిన మన పూర్వీకుల ధర్మదీక్షను అర్థం చేసుకోవటం కోసం, మనం  ధర్మాచరణ దీక్ష వహించి ధర్మాన్ని కాపాడుకోవటం కోసం, ‘స్వధర్మే నిధనం శ్రేయః’ లోని సత్యాన్ని గ్రహించి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవటం కోసం,  దుష్టప్రచారాల అసలు రూపును గ్రహించి భావి తరాలను కాపాడటం కోసం శ్రీవరుడు రచించిన  ఈ శ్లోకాలను నిరంతరం వల్లె వేస్తూండాలి.

పూర్ణ అనే మంగలి వాడు రెచ్చగొట్టాడు. అప్పటికే అకృత్యాలు సహిస్తూ ఉన్న హిందువుల సహనం బద్దలయింది. వారు ‘ఖాన్‌కాహ్’ లపై దాడి చాశారని  – ‘సైదఖాన గాహాది పీడనమ్’ ను కొందరు భావించారు. సైదఖాన్‌తో సహా ఇతరులను  నష్టపరిచారని మరి కొందరు ఈ శ్లోకార్థాన్ని భావించారు.

‘ఖాన్‌కాహ్’ లన్నవి సూఫీలూ, ఇతర ప్రయాణాలు చేసే ఇస్లామీయులు తమ ప్రయాణాలలో విశ్రాంతి తీసుకునే స్థలాలు. కశ్మీరులో సుల్తానుల పాలన ఆరంభమైనప్పటి నుంచీ ఖాన్‌కహ్‌ల నిర్మాణం ఆరంభమయింది. ఖాన్‌కహ్‌లు, ఇతర ఇస్లాం కట్టడాలను హిందువులు నష్టపరిచినట్టు భావించవచ్చు. ఖాన్‌కహ్ వంటి కట్టడాలు కాక ముస్లిం వ్యక్తులపై దాడి చేసినట్టు భావిస్తే, సమస్య తీవ్రత తగ్గుతుంది. అదీకాక వ్యక్తులపై దాడి వ్యక్తిగతమవుతుంది. పవిత్ర కట్టడాలపై దాడి సమాజంపై, సంస్కృతిపై దాడి అవుతుంది. కాబట్టి, ఇక్కడ ‘ఖాన్‌కాహ్’లు, ఇతర కట్టడాలను నష్టపరచినట్టు భావించవచ్చు.

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇస్లామీయులు మతపరమైన విషయాలలో తీవ్రమైన పట్టుదలతో ఉంటారు. రాజీపడరు. మతానికి కానీ, మతపరమైన చిహ్నాలకు కానీ అవమానం జరిగితే, అవమానం జరిగిందనిపించినా,  సహించరు. ఆ మధ్య ఓ ఫ్రెంచి కార్టునిస్టు ప్రచురించిన  కార్టూనును వ్యతిరేకించి   జరిగిన దాడులు ఇంకా విస్మృతిలో పడలేదు.

‘సల్మాన్ రష్దీ’ ప్రాణ రక్షణ కోసం కలుగులో దూరి బ్రతికినట్టు బ్రతికినా బయటకు రాగానే అతని పై జరిగిన దాడి, ఎన్నాళ్లయినా మరచిపోని ఆగ్రహానికి నిదర్శనం.

‘నూపుర్ శర్మ’ ఇప్పటికీ ధైర్యంగా బయటకు రాలేకపోతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోన్న భయం జీవితాంతం పోదు ఆమెకు.

ఇప్పుడు 21వ శతాబ్దంలో, వైజ్ఞానికి సాంకేతిక యుగంలోనే  పరిస్థితి ఇలా ఉంటే, 15వ శతాబ్దంలో మధ్యయుగపు సంధి కాలంలో పైగా, సుల్తానుల పాలనలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కష్టం కాదు. శ్రీవరుడు తరువాత రాసిన శ్లోకాలు ఒక పీడకల నిజమైతే ఎలా ఉంటుందో చూపిస్తాయి. శ్రీవరుడు ఆ కాలం గురించి రాస్తున్నాడా? సమకాలీన సమాజాన్ని వర్ణిస్తున్నాడా?  అన్న భ్రమ కలుగుతుంది.

ఇక్కడ శ్రీవరుడిని అభినందించాల్సిన విషయం మరొకటి ఉంది. పూర్ణ అనే మతం మారినవాడు రెచ్చగొట్టాడు. హిందువులు రెచ్చిపోయి దాడులు చేశారు అని రాశాడు శ్రీవరుడు. అంటే, అంత మధ్యయుగ సంకుచిత మతఛాందసభావాల సముద్రం నడుమ ఉంటూ కూడా’ ఇదీ కారణం’ అని చెప్పాడు శ్రీవరుడు. ఈనాడు, ఇరవయ్యొకటవ శతాబ్దంలో, ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక యుగంలో, ప్రజాస్వామ్య ప్రభుత్వ లౌకిక పాలనలో కూడా గోధ్రా అల్లర్లను ప్రస్తావించి హిందువులను మాత్రమే దోషులుగా నిలబెట్టటం చూస్తున్నాము గానీ, అంతకు ముందు ముస్లీములు  రైల్లో హిందువులను  సజీవదహనం  చేయటంవల్ల కలిగిన ఆగ్రహావేషాలవల్ల గోధ్రాలో హింసచెలరేగిందనే ధైర్యం మన దేశంలో ఎవ్వరూ ప్రదర్శించలేకపోతున్నారు. అలా అన్నవారు మత ఛాందసవాదులుగా, మత విద్వేషాలు రెచ్చగోట్టే వారిగా  గుర్తింపుపొందుతున్నారు. కాబట్టి, ఆకాలంలో సుల్తానుల పాలనలో, మతచ్ఛాందసవాద సంకుచిత పచ్చ సముద్రం నడుమ ఉండి కూడా కారణం ఇదీ అని చెప్పిన శ్రీవరుడి ధైర్యానికి జోహార్లు అర్పించకతప్పదు.

(ఇంకా ఉంది)

Exit mobile version