[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
శ్రీవర పండిత కృత జైనరాజతరంగిణి
తృతీయస్తరంగ
తృతీయ తరంగం
మంగళాచరణ:
శివాయాస్తు నమస్తస్మై త్రైలోక్యైక మహీభుజే।
అశేషక్లేశనిర్ముక్తనిత్యైశ్వర్యదశాజుషే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 1)
అశేష క్లేశాల నుండి విముక్తి ప్రసాదించేవాడు, నిత్య ఐశ్వర్యయుక్తుడు, ముల్లోకాలకు రాజయిన శివుడికి నమస్కారం.
శ్రీవరుడు మూడవ తరంగాన్ని ఆరంభిస్తున్నాడు. ఆనవాయితీ ప్రకారం దైవప్రార్థనతో మూడవ తరంగం ఆరంభిస్తున్నాడు.
భూతం యద్ రాజ్యవృత్తాంతం వర్తమానం కరోత్యలమ్।
స్వవాయోగ్యప్రకారేణ వన్ధ్యో యోగీశ్వరః కవిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 2)
భూతకాలపు గాథలను తన రచనలతో వర్తమానంలో సజీవంగా నిలిపే కవి యోగీశ్వరుడి లాంటి వాడు. వందనీయుడు.
ప్రతిగ్రహానుగ్రహాప్తా భుక్తా యన్నృపజీవికా।
తద్వృత్తం స్వస్య నిష్కృత్యై వక్ష్యే శ్రీవరపండితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 3)
ఏ రాజు వల్ల జీవితాన్ని ఆనందంగా అనుభవించానో, అనుగ్రహాన్ని పొందానో, ఆ రాజు వృత్తాంతాన్ని వర్ణిస్తాను. తద్వారా నేను శ్రీవర పండితుడను ఋణ విముక్తుడనవుతాను.
శ్రీవరుడు సుఖంగా బ్రతికేందుకు రాజు కారకుడు. ఆ ఋణం నుండి విముక్తి పొందేందుకు తన రచన ద్వారా రాజును చిరంజీవిగా నిలుపుతున్నాడు శ్రీవరుడు. తద్వారా ఋణ విముక్తుడు అవుతున్నాడు.
స్వదృగ్దృష్ట స్మృతక్ష్మా భృద్వి భవవైకృతైః।
సేయం కస్య న వైరాగ్యం సూతే రాజతరంగిణీ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 4)
రాజుల ఐశ్వర్యం చూశాను. వారు భోగాలు అనుభవించటం చూశాను. వారి దుర్దశనూ చూశాను. వాటిని స్మరిస్తున్నాను. ఇలాంటి ఘటనల వల్ల రాజతరంగిణి పఠనం వైరాగ్య భావన కలిగిస్తుంది.
రాజ్యవృత్తానురోధేన న కావ్యగుణచర్చయా।
స్వంతః శృణ్వన్తు మద్వాచః స్వధియా యోజయన్త్వపి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 5)
కావ్యగుణ చర్చల వల్ల కాకుండా, రాజతరంగిణి లోని రాజుల గాథలను విని స్వబుద్ధితో అలోచించి స్వయం నిర్ణయం తీసుకోవాలి.
కాయస్థోక్తివదేవేయం కృతా స్మృత్యై భవిష్యతామ్।
దృష్ట్వేమాం లలితం కావ్యం కుర్వన్త్వన్యే అత్ర పండితాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 6)
కాయస్థులు రాసే రాతలలాగా, భావిజనుల కోసం ఈ రచన చేశాను. ఇది చదివి ఇతర పండితులు మరిన్ని లలిత రచనలు చేయాలి.
భారతీయులకు చరిత్ర స్పృహ, చైతన్యం లేదనే వారికి చెంపపెట్టు లాంటిదీ శ్లోకం.
కల్హణుడు రాజతరంగిణి రచన చేయటంలో ప్రధాన ఉద్దేశం స్పష్టంగా చెప్తాడు. భవిష్యత్తరాల వారికి తమ గత చరిత్ర ఔన్నత్యం తెలుపుతూ, ఒకప్పుడు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు, ఇంత గొప్పగా రాజ్యం చేశారనీ, మహానుభావులు జీవించారనీ, కశ్మీరు ధార్మికంగా అత్యుత్తమ స్థాయిలో ఉండేదనీ, భావి తరాల వారికి గుర్తు చేయటం కోసం కల్హణుడు రాజతరంగిణిని రచించాడు. కల్హణుడుకి రాజతరంగిణిని రచించాలన్న సంకల్పం కలిగింది కూడా, అతని కళ్లముందే కశ్మీరం పరశురామ ప్రీతి అవటం, తురకల ప్రాబల్యం పెరగటం, రాజులు అసమర్థులై అవినీతిపరులై మూర్ఖులై దేశాన్ని నాశనం చేయటం చూసి, ఒకప్పుడు ఐశ్వర్యంతో తులతూగిన కశ్మీరు గురించి భావితారలకు తెలపాలన్న తపనతో కల్హణుడు రాజతరంగిణి రచించాడు. దాన్ని జోనరాజు కొనసాగించాడు. ఇప్పుడు శ్రీవరుడు కొనసాగిస్తున్నాడు. శ్రీవరుడు జైనులాబిదీన్ కాలంలో గౌరవంతో పాటూ భద్రతను అనుభవించాడు. జైనులాబిదీన్ తరువాత గౌరవం తగ్గింది. భద్రత సందిగ్ధమయింది. ఇది జీవితం పై విరక్తి కలిగిస్తుంది. అందుకే, ముందరి రాజతరంగిణి రచనలలో అనని మాట ‘వైరాగ్యం’ ఇప్పుడంటున్నాడు. రచన ఎల్లప్పుడూ రచయిత మానసికస్థిని ప్రతిబింబిస్తుంది.
కాయస్థులు ఆ కాలంలో అకౌంటెంట్లు, జమాఖర్చులు లెక్కలు చూసేవారు. సెక్రటరీలు.. రాజులు ఇచ్చే ఆజ్ఞలను రాసేవారు. శాసనాలు రాసేవారు. రాజులు ఇచ్చే దానాల వివరాలు రాసేవారు. పన్నులు ఎంత కట్టాలో లెక్క కట్టేవారు. అంటే, కాయస్థులు నిర్మోహంగా కచ్ఛితంగా నిజాయితీగా రాసేవారన్నమాట. వారిని అక్షపటలికా, మజముదార, పుస్తకపాల ( record keeper) అనేవారు. వీరు ఎలా రికార్డులను రాస్తారో, తాను అలా రాజతరంగిణిని రచించానని శ్రీవరుడు చెప్తున్నాడు. అంటే నిర్మోహంగా నిజాలను రికార్డు చేస్తున్నానని అంటున్నాడు శ్రీవరుడు. ఇప్పుడు చరిత్ర రచయితలు అనే న్యూట్రాలిటీని తాను పాటిస్తున్నానని శ్రీవరుడు చెప్తున్నాడు. అప్పటికి ఇంకా చరిత్ర రచన సిద్ధాంతాలు పాశ్చాత్య దేశాల్లో ఏర్పడలేదు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే శ్రీవరుడి కాలం నాటికి కాయస్థ అన్నది ‘వృత్తి’ తప్ప కులంగా స్థిరపడలేదు.
మనుషుల మంచి చెడ్డల లెక్కలు రాయటం తన ఒక్కడి వల్ల కాదని చిత్రగుప్తుడు యముడి దగ్గర మొర పెట్టుకుంటే యముడు అతడికి సంతానాన్ని అనుగ్రహించాడు. అతని ఒక భార్య ఇరావతి ద్వారా ఎనిమిది మంది, నందిని ద్వారా నలుగురు. మొత్తం 12 మంది సంతానం కలిగారు చిత్రగుప్తుడికి. వారిని కాయస్థులంటారు.
మాధుర్, గౌర్, భట్నాగర్, సక్సేనా, అంభస్త, నిగమ్, కర్ణ్, కులశ్రేష్ఠ్‌లు ఇరావతి సంతానం. శ్రీవాస్తవ, సూర్యధ్వజ, అస్థాన, వాల్మీకి లంతా నందిని సంతానం. ఋగ్వేదం, పురాణాల కాలంలో రికార్డు కీపర్లు, ఎకౌంటెట్లు, స్క్రైబ్‌లను కాయస్థులనేవారు.
మొఘలుల కాలంలో విద్యావంతులై లెక్కలు చూసేవారు, రాసేవారంతా ఒకటై కాయస్థ కులం ఏర్పాటు చేసుకున్నారని చరిత్ర రచయితలు చెప్తారు. ఇలా కాయస్థుల్లా ఏర్పడిన వాళ్ళల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా ఉన్నారు. మళ్లీ తరువాత మాధుర్‌లు 197, భట్నాగర్‌లు 95, సక్సేనాలు 121, నిగమ్‌లు 42, శ్రీవాస్తవ్‌లు 43 ఉపకులాలుగా ఏర్పడ్డాయి. మహారాష్ట్రలో ప్రభుకాయస్థులు, బెంగాల్‌లో బెంగలీ కాయస్థులు ఉన్నారు. వీరూ ‘రాతగాళ్ళే’. ప్రయోగ్‌రాజ్, మధుర, వారణాసి వంటి ప్రాంతాలలోని కాయస్థులు శాకాహారులు. కానీ ఇతర ప్రాంతాలలోని కాయస్థులు మాంసాహారులు. మొఘలుల కాలంలో పర్షియన్ నేర్చి ఇస్లామీయులతో కలుస్తుండటం వల్ల వీరు మాంసాహారులయ్యారంటారు. తమిళనాడులో కాయస్థులను ‘కన్నక్కుపిళ్లై’లంటారు. వీరు బ్రాహ్మణులు పాటించే ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తారు. తమిళనాడులో కాంచిపురంలో చిత్రగుప్తుల మందిరంలో చిత్రగుప్త అష్టోత్తరం పఠిస్తారు. గతంలో కాయస్థులను బ్రహ్మక్షత్రియులనేవారు. వీరు యజ్ఞోపవీతం ధరిస్తారు. మహారాష్ట్రలో చాంద్రసేనీయ కాయస్థప్రభులు ‘ఇంకుడబ్బా-కత్తి’ (అసిజేవి, మసీజేవి) తో జీవిస్తారు. కాయస్థులు ‘వృత్తి’ నుంచి కులంగా ఎదిగి విభిన్న పద్దతులు, పేర్లతో దేశమంతా విస్తరించటం గమనిస్తే ఇప్పుడు మన సామాజిక మేధావులు చెప్పిన రీతిలో భారతీయ సామాజిక వ్యవస్థ ఏ మాత్రం మారకుండా ఆవిర్భావం నుంచీ ఇలాగే లేదని సృష్టమవుతుంది. భారతీయ సామాజిక వ్యవస్థ గురించి పరిశోధించాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది.
తతః శ్రీహస్సనో రాజా వ్యసనోజ్ఝితవాసనః।
శేకన్ధరపురీం త్యక్త్వా పిత్ర్యాం ప్రాశస్త్యసుందరమ్।
అగమజ్జైననగరమ పితామహ వినిర్మితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 7)
రాజు హసన్, తన రాజధానిని శేకంధరపురం నుంచి తన పితామహుడు నిర్మించిన ప్రసిద్ధి పొందిన జైననగరానికి మార్చాడు.
శేకందరపురీ అంటే శ్రీనగర్. జైననగర్ ఈనాటి నవశహర్.
సింహాసనోపవిష్టః స నిర్మలామ్బరభూషణః।
బభౌ కువలయానన్దీ శశీవోదయ పర్వతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 8)
నిర్మలవస్త్రాలను ధరించి, సింహసనారూఢుడైన రాజు, పృథ్వీ మండలాన్ని ఆనందపరచాడు. చంద్రుడితో సమానంగా శోభితుడయ్యాడు.
మల్లేకో అహ్మదాయుక్తో విధాయ తిలకం స్వయమ్।
సౌవర్ణకుసుమైః పూజామకరోన్నవభూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 9)
మల్లేక, అహ్మద్‌లు రాజుకు తిలకం దిద్దారు. స్వర్ణకుసుమాలతో నూతన రాజును అర్చించారు.
రౌప్యాసన సముద్రాంతః కృత్వా ఛత్రపిధానకమ్।
ఏకశేపతయేవ శ్రీరరక్షద్ వంశభూషణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 10)
రాజ్యనికి ఉన్న ఏకైక వారసుడికి, రాజ్యార్హత కలవాడిగా భావించి లక్ష్మీదేవి – రజతమయ అసనంపై ఛత్రం నీడలో కూర్చున్న రాజును రక్షిస్తున్నట్టుంది.
చిత్ర నవనృపస్యాస్య ముఖచంద్రావలోకనాత్।
నాగరాననపద్మానాం వికాసః సమపద్యత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 11)
చంద్రుడి లాంటి రాజు వదనాన్ని చూసిన కలుకల్లాంటి నగరం వదనం విప్పారింది.
కలువలు చంద్రుడి దర్శనం కావటంతోటే విప్పారుతాయి. నగరాన్ని కలువలతో, రాజును చంద్రుడితో పోల్చి రాజు నగర ప్రజలకు ఆనందం కలిగించాడని చెప్తున్నాడు శ్రీవరుడు.
అభిషేకక్రియారబ్ధహోమధూమమిషాద్ భువః।
హర్పేణైవోద్రతో రాజ్ఞో సుఖోచ్ఛాస ఇవాబభౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 12)
రాజు పట్టాభిషేకం సమయంలో జరిపిన హోమం నుంచి వెలువడిన పొగ ఆకాశానికి ఎగసింది. ఆ పొగ – ఆనందంగా భూమి ఊపిరి వదిలితే (దీర్ఘ నిశ్వాసం) ఆ ఊపిరి ఆకాశానికి ఎగసినట్టుంది.
వాద్యమానోద్యతాతోద్యతోద్యత్ప్రతిరఖ చ్ఛలాత్।
సుప్రసన్నాః సుదేవస్య ప్రోచుః పూర్ణాశిపో దిశః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 13)
ఆ సమయంలో వాయించిన వాయిద్యాల మ్రోతకు, పరిసర ప్రాంతాల గాలి స్పందించి, ఆశీర్వాద వర్షం కురిపించినట్టుంది.
ఇస్లామీయుడైనా సుల్తాన్ హసన్ హిందూ సంప్రదాయం ప్రకారం రాజ్యాభిషిక్తుడు అవుతున్నాడు. నుదట తిలకం దిద్దారు. హోమం జరుగుతోంది. ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నారు. భూమి సంతృప్తిగా ఊపిరి పీలుస్తోంది. గాలి ఆశీర్వాదాలు కురిపిస్తోంది. అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు.
ధ్వజమాలా బబుర్దీర్ఘ స్ఫురద్రక్త పటాంచలాః।
జ్వాలా ఇవ ప్రతాపాగ్నేర్నిర్గతా నవభూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 14)
దీర్ఘము అయిన ఎర్ర ధ్వజాలు కొత్త రాజు ప్రతాపాగ్ని జ్వాలల్లాగా అనిపించాయి.
ఛాయా కుసుమకార్యాస్తా బభుః శ్వేతాః ప్రవిస్తృతాః।
చిరాత్ తరుణరాజాప్త్యా హర్షహాసా ఇవ శ్రియః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 15)
తెల్లని పూల అలంకరణాలతో మళ్లీ, చాలాకాలం తరువాత అదృష్టం కొత్త రాజు పట్ల ప్రసన్నమై చిరునవ్వులతో అలంకృతమవుతున్నట్టు అనిపించింది.
కౌశేయ కోజ్జ్వలాః సర్వే సేవకా నవభూపతేః।
స్ఫురద్భాగ్య తరంగస్య తరంగా ఇవ తే అరుచన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 16)
పట్టు దుస్తులు ధరించిన నూతన రాజు సేవకులు దుస్తుల మెరుపు భాగ్య తరంగాలలా మెరుపులా తోస్తున్నది.
కౌశేయ వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు. పూర్వకాలంలో పండుగలప్పుడు, సంబరాల సమయంలో రాజులు సేవకులందరికీ నూతన వస్త్రాలు అందించేవారు. ఈ పద్ధతిని తరువాత జమిందార్లు కొనసాగించారు. పండుగలు, శుభకార్యాలు సమయంలో సేవకులందరికీ బట్టలు పెట్టి, డబ్బలిచ్చేవారు. రాజులు పోయి, జమీందార్లు పోయిన తరువాత ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కొంత ధనాన్ని ఏదో ఓ రూపేణ అందచేయటం అనవాయితీ అయింది. కొన్ని ప్రైవైట్ సంస్థలు కూడా లాభాలు ఉద్యోగులతో పంచుకుంటాయి. పేరు ఏదైనా రాచరికాన్ని సూచిస్తుందీ పద్దతి. ఇప్పటికీ దసరా సమయంలో, ఇతర పండుగల సమయాల్లో ‘బక్షీష్’ ‘ఈనామ్’ అంటూ కోరటం ఈ పద్ధతికి మరో రూపు.
కార్పాసకపరీధానం యత్ర యత్రాభవత్ పురా।
తత్ర తత్రాస్త తద్రాజ్యే కౌశేయకవ్యయో మహాన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 17)
గతంలో ఇంతకు ముందు ప్రజలు ఎక్కడిక్కడ ‘కార్పసన్’ (నూలు) వస్త్రాలు కట్టేవారు, ఇప్పుడు అక్కడక్కడంతా కౌశేయ (పట్టు) దుస్తులపై ఎంతో ఖర్చు అవుతున్నది.
రాజ్యలాభే వసున్తామే సూర్యస్యేవ మహీపతేః।
ప్రత్యాపహారకాః సర్వే దుష్టమేఘా లయం యయుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 18)
వసంతకాలంలో సూర్యుడు రావటంతో దుష్ట మేఘాలు పారిపోయినట్టు నూతన రాజు సామ్రాజ్య భారం స్వీకరించగానే ప్రజలను దోచేవారంతా అదృశ్యమైపోయారు. అంటే పారిపోయారు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
