[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
యాదృగ్ బహామఖానాయ కారయోన్నృపతేరమౌ।
వర్షేణైనేన తాదృక్షం నేత్రోత్ఘాటన మాన్వభూత్॥
శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 133)
ఈయన (అభిమన్యు ప్రతీహారి) ఎలాగయితే రాజును రెచ్చగొట్టి, బహ్రామ్ ఖాన్ కళ్లను ధ్వంసం చేయించాడో, అలాగే సంవత్సరం గడిచేలోగా అతని కళ్లు కూడా ధ్వంసం అయ్యాయి.
‘ఒరులేయవి యొనరించిన’ అని మహాభారతంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఉంది. తెలిసి తెలిసి కూడా ‘నాకేం కాదు’ అని విర్రవీగుతూ ఎదుటి వారికి హాని కలిగిస్తారు. కానీ కర్మ చక్రంలో ఉన్నవారు చేసిన కర్మ నుంచి తప్పించుకోలేరన్న నిజం విస్మరిస్తారు. మనిషి అహంకారం, ‘నాకేం కాదు’, ‘నేను అందరిలాంటి వాడిని కాదు’, ‘నేను భిన్నం’ వంటి ఆలోచనలు వ్యక్తిని దుష్కర్మ వైపు ప్రేరేపిస్తాయి. కర్మఫలం అనుభవించేట్టు చేస్తాయి. సంతోషంగా దుష్కర్మలు ఆచరించినవాడు ఏడుస్తూ కర్మఫలం అనుభవిస్తాడు. ప్రతీహారి అభిమన్యుకు ఇప్పుడు అది అనుభవానికి వస్తుంది.
చరిత్ర రచన అంటే నిర్జీవమైన తేదీలు, స్పందన కలిగించలేని రాజుల వంశావళులు కాదు. చరిత్ర ఒక చలనశీల శాస్త్రం. గతం నుంచి మనిషి పాఠాలు నేర్చుకోవాలి. తన కన్నా ముందున్న వారి జీవితాల ద్వారా గుణపాఠాలు గ్రహించి తన జీవితాన్ని చక్కదిద్దుకునేవాడు ఉత్తముడు. మనిషి ఉత్తముడిగా మారే వీలును కల్పించేది శాస్త్రం. చరిత్ర రచన ప్రధాన ఉద్దేశ్యం ఇదే. గతంలో వారు చేసిన పొరపాట్లు నుంచి పాఠాలు నేర్చుకుని వారు చేసిన తప్పులు ఈ తరం వారు చేయకూడదు. అందుకే శ్రీవరుడు అభిమన్యు గురించి రాస్తూ తాను చేసిన పని వెన్నాడి మరీ తనకూ అదే ఫలితం ఇచ్చిందనీ, ఒక్క సంవత్సరంలోగా, అదే నెలలో, అదే రోజున ప్రతీహారి కూడా తన కన్నులు కోల్పోయాడని స్పష్టంగా రాశాడు శ్రీవరుడు.
చరిత్ర రచనలో రచయిత దృష్టిపై చరిత్ర రచన ధ్వని ఆధారపడి ఉటుందనేందుకు ఇది చక్కటి ఉదాహరణ. శ్రీవరుడి దృష్టి భవిష్యత్తు, తరాలకు పాఠాలు నేర్పటంపై ఉంది.
తవాక్కతే అక్బరి ప్రకారం ఏ రోజయితే బహ్రామ్ ఖాన్ కళ్లను అభిమన్యు ప్రతీహారి ధ్వంసం చేయించాడో, సరిగ్గా సంవత్సరం కాగానే అదే రోజు, అవే ఇనుప కడ్డీలు ప్రతీహారి కళ్లను కుళ్లబొడిచాయి. ఇక్కడ తాత్వికత కన్నా ప్రతీకారంపై దృష్టి ఉంది. ‘పీర్ హసన్’ కూడా ఇలాగే రాశాడు. ఏ ఇనుప కడ్డీలు బహ్రామ్ ఖాన్ కళ్లల్లో గుచ్చారో, అవే ఇనుప కడ్డీలతో అభిమన్యు ప్రతీహారి కళ్లనూ పొడిచారు. ఇతను కూడా మూడేళ్లు ఖైదులో ఉండి మరణించాడు. బహ్రామ్ ఖాన్ లాగే ప్రతీకారాన్ని ఓ అడుగు ముందుకు తీసుకెళ్లాడు. రోజర్స్ కూడా దీన్నే అంది పుచ్చుకున్నాడు.
చరిత్ర రచన రచయిత దృష్టిని బట్టి, ఆలోచనను బట్టి మారుతుందనేందుకు ఇది చక్కని దృష్టాంతం. కాబట్టి ఫలానా వాడి పుస్తకంలో ఇలా ఉంది, కాబట్టి ఇలాగే జరిగి ఉంటుందని తీర్మానించటం పొరపాటు. అలా తీర్మానించే ముందు చరిత్ర రచయిత హృదయాన్ని గ్రహించాల్సి ఉంటుంది.
యాదృగ్ బహామఖానస్య వ్యథాభూదతిదుః సహా।
అవిన్దత్ తాదృశీం సోఅపి వక్తుం నాన్యేన శక్యతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 134)
ఎలాగయితే బహ్రామ్ ఖాన్ దుస్సహమైన తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించాడో, అతడు కూడా (అభిమన్యు ప్రతీహారి) అలాంటి దుస్సహమైన వేదనను అనుభవించాడు. ఆ వేదనను వర్ణించటం ఇతరుల తరం కాదు.
యస్మిన్నేవ దినే యస్మిన్ మాసే విప్రియమాతనోత్।
తస్మిన్నేవ దినే తస్మిన్ మాసే సోఅపి సమాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 135)
ఏ నెల, ఏ రోజు అప్రియమైన కార్యం జరిపాడో, అదే నెల, అదే రోజు ఆయన కూడా దుఃఖాన్ని పొందాడు.
సోఅపి వర్షద్వయం భుక్త్వా సపుత్రో నరకవ్యథామ్।
బహామఖానవద్వద్ధో వ్యసనాన్తర్వ్యపద్యత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 136)
ఇతను కూడా పుత్రుడి సహితంగా, రెండు సంవత్సరాల పాటు నరకబాధలను అనుభవిస్తూ, బహ్రామ్ ఖాన్ లాగే బందీగానే దుఃఖం అనుభవిస్తూ మరణించాడు.
శ్రీవరుడు రెండు సంవత్సరాలున్నాడు. బహ్రామ్ ఖాన్ ఎంతటి తీవ్రమైన దుఃఖం అనుభవించాడో అంతటి తీవ్రమైన దుఃఖం అనుభవించాడని అన్నాడు. దీన్ని ఇంకో సంవత్సరం పెంచి అన్ని విషయాలలో బహ్రామ్ ఖాన్‌తో సమానం చేశారు పర్షియన్ చరిత్ర రచయితలు. భారతీయులు కట్టుకథలు చెప్తారు, అతిశయోక్తులు జోడిస్తారు అని ఆరోపించి విదేశీ చరిత్ర రచయితలు, ప్రత్యక్ష సాక్షిని కాదని పర్షియన్ రచయితల ఊహలు ప్రామాణికంగా భారత దేశచరిత్రను నిర్ధారించారు.
అద్యైవ మద్దృశౌ ధన్యే యాఖ్యాం మత్కులవైరిణః।
సర్వస్వ హరణం దృష్టం మరణం జైనభూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 137)
ఇత్యూచే నిష్ఠురం యత్స దుష్టాత్మా కృతలుంఠనః।
తదుక్తిఫలమాపాసౌ తయోర్నాశో అభవత్ ఫలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 138)
చిన్తితం జైనభూపేన సపన్న నైవ యత్పురా।
హేలయాస్యాద్య పౌత్రేణ కృతమిత్యవదజ్జనః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 139)
‘నా కులాన్ని, ఐశ్వర్యాన్ని నాశనం చేసిన వాడి మరణాన్ని చూసి నా కళ్లు ధన్యమయ్యాయి’ అని జైనులాబిదీన్ మరణం గురించి వ్యాఖానించిన వాడి కళ్లు నాశనం చేసి, జైనులాబిదీన్ మనుమడు ప్రతీకారం తీర్చుకున్నాడని ప్రజలు అనుకున్నారు. ఆ దుష్టుడు పలికిన నిష్ఠుర వచనాల ఫలితంగా రెండు కళ్లు నష్టమైపోయాయి అనుకున్నారు ప్రజలు.
యత్కర్తుమిచ్ఛతి పరాపచయం మనుష్య-
స్తేనైవ తస్య నియమేన భవేద్వినాశః।
శృంగం విభర్తి హరిణః పరరంధ్ర యుద్ధయా
శార్గీంకృతం తదిషుభిర్హరతే తమేవ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 140)
ఎలాగయితే జింక తన కొమ్ములతో ఇతరులకు హాని చేయాలనుకుంటే, ఆ కొమ్ములతో తయారయిన బాణంతో దాని ప్రాణం పోతుందో అలాగే, ఎదుటి వాడికి హాని తలపెట్టిన మనిషి, అలాగే నష్టం పొందుతాడు.
కర్మ సిద్ధాంతం, తనకేది జరిగిదే బాధ కలిగితే ఎదుటి వాడికి అలాంటి బాధ కలిగించక పోవటమే పరాయణ ధర్మం అన్న వాటికి ప్రతిధ్వని లాంటిదీ శ్లోకం. చరిత్రలో జరిగిన సంఘటనలు చేప్తూ ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూండటం వల్ల చరిత్ర అధ్యయన లక్ష్యం నెరవేరుతుంది. చరిత్ర పఠనం ఉత్తమ విలువలకు, ఉన్నతపుటాలోచనలకు, సమాజం పట్ల మానవ మనస్తత్వం పట్ల అవగాహనకు దారితీస్తుంది. లేకపోతే, చరిత్ర చదువుతారు కానీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది.
దృష్టో రమ్యశ్చిరముపవనే వంశవాటో జనైర్యో
నానావర్ణైస్తృణగణగుణైర్భూషితో భూరిపత్రః।
తత్రాన్యోన్యాహననజననాత్ తాదృగభ్యుత్థితోఽగ్ని-
ర్యేనైకాన్తాదుపవనగతం సర్వమేవ ప్రనష్టమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 141)
ప్రజలు సంతోషంతో చిరకాలం తోటలోని వెదురు పొదలను నానా వర్ణాల గడ్డి పరకలతో అందంగా అలంకృతమైన నృత్యాలను చూసి ఆనందించారు. కానీ వాటిలోనే పరస్పర ఘర్షణ వల్ల జనించిన అగ్ని ఆ తోటను పూర్తిగా కాల్చి బూడిద చేసింది, నష్టపరిచింది.
‘పోరు నష్టం పొందు లాభం’ అంటే, ఇదే. అంత వరకూ వివిధ వర్ణాలతో ఆనందింప చేసిన వనం, ఆ వనంలోనే రాపిడి (సంఘర్షణ) వల్ల జనించిన అగ్ని వల్ల సర్వనాశనమైంది.
అధికార పోరాటాల వల్ల, అంతర్గత కలహాల వల్ల రాజవంశం భవిష్యత్తలో అంతం అంతమవడమే కాదు కశ్మీరం నాశనమవటాన్ని సూచిస్తున్నాడు శ్రీవరుడు.
యా కారకసభా రమ్యాభవన్మౌలమహీభుజామ్।
అచిరేణైవ కాలేన సర్వా స్వప్నోపమాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 142)
ప్రాచీన రాజుల రమ్యమైన నిర్మాణాలు, పాలనలు, కొన్ని రోజులలోనే కలల్లాగా అయిపోయాయి.
శ్రీవరుడి ఆవేదన తెలుస్తోంది. కల్హణుడి రాజతరంగిణి ఆరంభంలో కనిపించే రాజులకు, చివరి దశలో కనిపించిన రాజులకు, కశ్మీరుకు పోలిక లేదు. కల్హణుడి రాజతరంగిణి రాజులకు, కశ్మీరుకు జోనరాజు కశ్మీరుకు ఎంతో తేడా ఉంది. శ్రీవరుడు జైనులాబిదీన్ పాలనతో రాజతరంగిణి ఆరంభించాడు. అప్పటి కాశ్మీరుకు, జైనులాబిదీన్ తరువాత కశ్మీరుకు పోలిక లేదు. పాతకాలపు ఔన్నత్యం, విలువలు అన్నీ కేవలం కలల్లాగే మిగిలిపోయాయి.
క్రష్టుం మల్లికజాదో యమన్ధజం ఖానమిచ్ఛతి।
రాజ్యార్థమితి కేనాపి రాజ్ఞో పైశునే కృతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 143)
బహ్రామ్ ఖాన్ కొడుకును తెరపైకి తెచ్చి అతని ద్వారా రాజ్యాధికారం హస్తగతం చేసుకోవాలని ‘మల్లిక్ జాదా’ పథకాలు వేస్తున్నాడని రాజుకు చెప్పారు.
సర్వస్వహరణం కృత్వా కారాయాం బంధుమాదిశత్।
శ్రుతేన తేన తద్విష్టో న కః సౌఖ్యం సమాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 144)
ఇది విన్న రాజు మల్లికాజాదాను కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించాడు. మల్లిక జాదా సర్వస్వం దోచారు. ఇది చూసి, అతడిని ద్వేషించే వారంతా సంతోషించారు.
కశ్మీరులో రాజుకు సన్నిహితమవ్వాలన్న ఆరాటంలో ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఎవరేం చెప్తే దాన్ని నమ్మి రాజు, తనకు విధేయులను శక్తిమంతులను అందరినీ జైల్లో వేయటం, చంపటం చేస్తున్నాడు. కశ్మీరు బలహీన పడుతున్నదన్న ఆలోచనే లేదెవ్వరికీ.
ఆక్షేపైరజింతా యహత్తేన శ్రీయాయవర్జితా।
తదాక్షేపతస్తస్మాన్నీతా రాజాధికారిభిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 145)
అన్యాయంగా హింసతో ఎలాగయితే ఎదుటి వారి ఆస్తులను అతడు కాజేశాడో, అలాగే అన్యాయంగా బలవంతంగా పశుబలంతో అతడి ఆస్తినీ అధికారులు హస్తగతం చేసుకున్నారు.
ఉత్కోచముద్రాదానాదితత్తదాయాసకారణాత్।
స విపత్పతితో నాభృత్ కస్యాపి కరుణావహః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 146)
అతడు అనుభవిస్తున్న దుర్భర స్థితిపై ప్రజలు ఎలాంటి సానుభూతి ప్రదర్శించలేదు. ఎందుకంటే అతడు దౌర్జన్యం ద్వారా లంచాల ద్వారా ఆస్తినంతా కూడగట్టాడు.
కదర్యహస్తే క్షణసౌఖ్యనిష్ఠం
విద్యత్యగుద్ధం ప్రసభం ధనం యత్।
కష్టేన నిర్యాతి తదేవ కృష్టం
శునీభగే లింగమివ ప్రవిష్టమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 147)
ఎంతో కష్టంతో అతడి నుంచి అతడి ధనాన్ని దూరం చేయగలిగారు. అతడి దుష్టహస్తం, దౌష్ట్యంగా సంపాదించిన అతడి ధనం నడుమ విడదీయరాని బంధం ఏర్పడినట్టుంది.
ఏకైకం సంచితం వస్తు క్రష్టుం కష్టేన తత్కరాత్।
నియుక్తైః పీడనం క్రుత్వా బలాన్తర్గత సర్పవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 148)
బిలంలో దూరిన సర్పాన్ని వెతికి తీయటం ఎంత కష్టమో, అలాగే అతని నుండి అతడి ధనం వివరాలు రాబట్టటం కాష్టమయింది. బెదిరించి, బుజ్జగించి, హింసించి అతి కష్టంగా రాబట్టారు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
