Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-126

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యేన లోకార్తిహ్యచ్చక్రే విహారః సుగృహోజ్జ్వలః।
మఠాగ్రహారమస్జేదావిహారగృహపంక్తిభిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 196)

(పితృవిహార సమీపంలో) ప్రజల కష్టాలు తొలగిస్తూ సుందరమైన ఇళ్లు, అందమైన విహారాన్ని నిర్మించాడు. మఠం, అగ్రహారాలు, మసీదులు, విహారాల – వరుసలు నిర్మించాడు.

త్రింశద్విశాః ప్రతిష్ఠాస్తా మండలే యేన కారితాః।
సర్వదర్శన సపన్న ప్రతిపాదితదక్షిణే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 197)

రాజ్యం (మఠం, అగ్రహారాలు, మసీదులు, విహారాల) వరసులు దాదాపుగా ఇరవై, ముప్పయి మండలాలలో నిర్మింపచేశాడు. ఇవన్నీ అన్ని ధర్మాల వారికి అంకితం చేశాడు.

‘హసన్ షాహ’ వ్యక్తిగతంగా రాజ్యపాలనపై ఆసక్తి అంతగా ఉన్నవాడు కాకపోయినా, ఆయన సర్వాధికారులను ‘ముల్లా అహ్మద్ యాతు’కు అప్పగించాడనీ, అతని ప్రభావం వల్ల సుల్తాన్ పరమత సహనం ప్రదర్శించాడనీ కశ్మీర్ చరిత్ర రచయితలు అభిప్రాయ పడుతున్నారు.

“Ahmad Yatu’s regime was a period of reform and consolidation. He was a follower of the policy of Zain-ul-Abiden, and attempted to revive the traditions of that king. Under his influence, Hasan Shah retransferred the seat of government to Nowshahr, granted freedom of worship to the Hindus.” (A History of Muslim Rule in Kashmir, P. R. Parmu, Pg.179)

శ్రీవరుడు సైతం రాజు మఠాలు, అగ్రహారాలు, మసీదులు, విహారాల వరుసలు నిర్మించాడని చెప్తున్నాడు. ఈ నిజాన్ని నిరూపిస్తూ 1908లో లోలాచ్ లోయ దగ్గర ఉన్న పరేపూర్ గ్రామంలో ఓ శిలాశాసనం లభించింది. ‘హసన్ నాగ్’ అనే సరస్సు వద్ద ‘పరమభక్త మహాభక్త హసన్ పాద’ నిర్మించిన పవిత్ర స్థలం అని ఉంది దాని మీద. క్రీ.శ. 1474 నాటిదీ శిల.

దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, ‘హసన్ షాహ’ కూడా జైనులాబిదీన్ బాటలో ప్రయాణిస్తూ, పరమత సహనం ప్రదర్శించాడని.

‘పరమత భక్తి మహారాజా హసన్ షాహ’ అని సంస్కృతంలో ‘హసన్ షాహ’ను సంబోధించారంటేనే అర్థం చేస్కోవచ్చు, జైనులాబిదీన్ తరువాత అనుభవించిన గడ్డు రోజుల అనుభవంతో, పరమత సహనం ప్రదర్శించిన ‘హసన్ షాహ’ పట్ల ఇస్లామేతరులు, ఎంతగా అభిమానం ప్రదర్శించారో.

‘హసన్ షాహ’ ప్రదర్శిస్తున్న పరమత సహనం నచ్చని ఇస్లాం ఛాందసవాదులు అతడిని పదవీచ్యుతుడిని చేయాలన్న ఉద్దేశ్యంతో బహ్రమ్ ఖాన్‌ను ఆహ్వానించి అతడికి మద్దతు తెలిపి అల్లకల్లోలం సృష్టించారన్నది P. R. Parmu అభిప్రాయం. హసన్ షాహ రాజ్యంలో శాంతిని స్థాపించటం, పరమత సహనం ప్రదర్శించటం “was not what the enemies of peace and national welfare desired. They reasserted themselves and caused civil strife.” (Pg. 180)

గమనిస్తే, రాచరికంలో రాజు వ్యవహార సరళి నచ్చనివారు, ఆ రాజుకు వ్యతిరేకంగా కుట్రలు చేసి, అధికారాన్ని తమకు నచ్చిన వాడికి కట్టబెట్టటం సాధారణం. రాజు ఆ కుట్రలను భగ్నం చేసి, తిరుగుబాటు, లేక, విద్రోహ చర్యలకు పాల్పటిన వారిని శిక్షించటం, కలుపుమొక్కలను ఏరినట్టు ఏరివేయటం కూడా అంతే సాధారణం.  కానీ, ఇలాంటి విద్రోహ చర్యలకు ప్రజాస్వామ్యంలో తావు లేదు. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో అధికారిని ప్రజలు ఎన్నుకుంటారు. అతని పనితీరు నచ్చకపోతే, ఎన్నకలలో ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటారు. ఈలోగా, కోర్టులు, చట్టాలూ ఉంటాయి. వాటినీ ఉపయోగించుకోవచ్చు.  అంతే కానీ, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ,  వీధుల్లో అల్లర్లు చేసేవారు, అరాచకం సృష్టించేవారు, హింస ద్వారా మాట చెల్లించుకోవాలని ప్రయత్నించే బ్లాక్‌మెయిలర్లు నిర్ణయాలను, పనితీరునూ  నిర్దేశించేట్టయితే, ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం అన్న ఆలోచన అర్థవిహీనమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి కాక, హింస ద్వారా ప్రభుత్వాన్ని బెదిరించేవారికి ప్రాధాన్యం లభించటమంటే, ప్రజల అభిప్రాయం పనికిరానిది అవుతుంది. నోరున్నవాడి మాట చెల్లేట్టయితే, రాయి విసిరినవాడి కోరిక  తీరేట్టయితే, ప్రజాస్వామ్యమన్నది అర్ధవిహీనమయిన  వ్యవస్థ అవుతుంది.

ప్రతిహార్య క్షణే యేన కోటిరేకా వ్యయీకృతా।
స ఫిర్యడామరో జైననగరే సత్రసుందరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 198)

మసోదాహజిరోదారం ఖానగాహం వినిర్మమే।
హయాతఖాతోనా రాజవల్లభా విభవోజ్జ్వలా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 199)

మృగవాటాభిధే స్థానే మఠం దుగ్ఘం నవం వ్యధాత్।
మోమారఖాతోనా రాజమహిషీ స్వధనైర్నవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 200)

జైనపుర వద్ద చక్కటి ఖాన్‍గాహను ఫిర్యదామరుడు నిర్మించాడు. దాని ఆవరణలో ఒక అందమైన మసీదునూ నిర్మించాడు. ద్వార ప్రవేశ సమయంలో అందరికీ ఖరీదయిన బహుమతులిస్తూ ఒక కోటి పైన ధనం వెచ్చించాడు. రాజుకు ప్రియమైనది, ధనవంతురాలు అయిన హయాత్ ఖాతోనా, మృగవాత వద్ద దగ్ధమయిన మఠాన్ని పునర్నిర్మించింది.

రాజు నిర్మాణాలు ఆరభించాడు. ఇతరులంతా తమ శక్తి కొద్దీ నిర్మాణాలు చేశారు. ఫిర్యదామరుడు, ఖాన్‌గాహ్‍నూ మసీదును నిర్మించాడు. ఇక్కడ శ్రీవరుడు ‘ద్వార ప్రవేశం’ అన్నాడు. సాధారణంగా ‘గృహప్రవేశం’ అంటాం కానీ ఇక్కడ ప్రవేశం జరిగింది మసీదులో. అది  యాత్రికుల విశ్రాంతి స్థలం. ‘ఖాన్‌గాహ’లో కాబట్టి ‘గృహప్రవేశం’ అనలేడు. అందుకని ‘ద్వార ప్రవేశం’ అన్నాడు.

ఈ శ్లోకాల్లో ప్రస్తావించిన ‘హయత్ ఖాతూన్’, సయ్యద్ హసన్ కూతురు. ‘ఖూతూన్’ అన్నది విశేషణం. ‘శిష్ఠ మహిళ’ అన్నది అర్థం. ‘హయత్’ అన్నది పేరు. ఆమె సుల్తాన్ ప్రియమైన రాణి. ఈమె ద్వారా ఆయనకు ‘మహమ్మద్ ఖాన్’ అనే పుత్రుడు కలిగాడు. తరువాత శ్లోకంలో ‘ఖాతోన్’ అన్న శబ్దం వాడేడు శ్రీవరుడు. ‘ఖాతోన్’ అన్నది ‘తుర్కీ’ పదం. దీని అర్థం ‘సభ్యస్త్రీ’.

ఇటీవలి కాలంలో పలువురు భాషోద్ధారకులు, తమ మాతృభాషలో పరభాషా పదాల వాడకాన్ని నిరసిస్తున్నారు. ఇది పొరపాటు. ఒక నది మహానదిగా ఎదగాలంటే దాన్లో అనేక ఉపనదులు కలవాల్సిందే. అప్పుడే దాని ప్రవాహం తీవ్రమవుతుంది. ఉపనదులు కలవని నది మహానది కాలేదు. కాస్త దూరం ప్రయాణించిన తరువాత పలుచనై నిలచిపోతుంది. భాష అయినా, దేశం అయినా, మనిషి మెదడయినా అంతే. నిరంతరం నూతన ఆలోచనలు అందనిదే మెదడు స్తబ్ధమైపోతుంది. దేశానికి కూడా నిరంతరం నవయువకులు, నూతన ఆలోచనలు, నిర్మాణాలు లేకపోతే అభివృద్ధి స్తంభించి పోతుంది. భాష కూడా అంతే. కొత్త కొత్త పదాలు  వచ్చి చేరకపోతే భాష స్థగితమైపోతుంది. కాబట్టి, ఒక భాష శోభాయమానం అవ్వాలంటే ఎన్నెన్ని భాషలనుంచి ఎన్నెన్ని కొత్త పదాలు వచ్చి చేరితే ఎన్ని ప్రయోగాలు జరిగితే అంత మంచిది. అలాకాక, తలుపులన్నీ మూసుకుని కూర్చుంటే చీకటి తప్పించి ఏమీ మిగలదు.

ఈనాడు మనం వాడుతున్న తెలుగులో మన ప్రమేయం లేకుండా అనేక భాషల పదాలు భాగమైపోయాయి. ‘తబలా’ పార్సీ పదం. ‘ఫరవాలేదు’ మన పదం కాదు. ‘పర్‍వా నహీ’ నుంచి వచ్చింది. వకీలు, తాహసిల్దార్, కచేరీ, బస్సు, రైలు, కంప్యూటర్, మౌస్, మొబైల్.. ఇలా ఎన్నెన్నో పదాలు భాష అనే నదిలో వచ్చి చేరుతున్నాయి. వాటి వెల్లువలో తన అస్తిత్వం కోల్పోకుండా తనని తాను పునర్నిచించుకుంటూ  ముందుకు సాగాల్సి ఉంటుంది. లేకపోతే. లాటిన్, పురాతన ఈజిప్టియన్ భాషలలాగా ఏ భాష అయినా ‘మృతభాష’ జాబితాలోకి చేరుతుంది. కాబట్టి భాషపై మక్కువ కలవారు, భాషాభివృద్దిని కాంక్షించేవారు ‘ఏ వేపు నుంచి ఎన్నెన్ని కొత్త పదాలు వస్తే అన్నిటినీ అహ్వానించి తమ భాషా సంద్రంలో భాగం చేసి, నూతన పదాలు సృష్టిస్తూ ముదుకు సాగాలి. ఇతర భాషా పదాల ప్రవాహాలకు  అడ్డుపెట్టకూడదు. శ్రీవరుడి రచన ఈ నిజాన్ని స్పష్టం చేస్తుంది. ఫారసీ, తుర్కి కశ్మీరు పదాలను సంస్కృతంలో స్వేచ్ఛగా వాడేడు. నూతన పదాలు సృష్టించాడు. సంస్కృత పదాల సౌందర్యాన్ని ప్రదర్శిస్తూనే పర భాషా పదాలను తన శ్లోకాలలో భాగం చేశాడు. అయితే శ్రీవరుడి ప్రయోగాలు దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృత కవులు కొనసాగించి ఉంటే ‘సంస్కృతం’ మరింతగా ప్రాచుర్యం పొంది ఉండేది. ఇతర భారతీయ భాషలు కూడా ప్రమాదంలో పడేవి కావు. కానీ, మామూలు మాట్లాడే భాషనే కావ్యభాష కావాలన్న పట్టుదల వల్ల కావ్యభాష ప్రత్యేకతను కోల్పోయింది. నూతన పదాల సృష్టి ఆగిపోయి మామూలు మాటలే సాహిత్యంలోనూ చలామణీ అవటంతో భాషలు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నిజాన్ని శ్రీవరుడి రాజతరంగిణి పరోక్షంగా ప్రదర్శిస్తుంది.

రాజధాన్యన్తికే జైననగరే స్వమఠం వ్యధాత్।
జయరాలాభిఘా రాజపురీరాజాన్యయోదితా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 201)

(మోతురా ఖాతూన్) రాజధాని దగ్గరలో జైనులాబిదీన్ నూతన మఠాన్ని నిర్మించింది. జయరాలా రాజపురీ రాజవంశానికి చెందినది.

‘మోతురా ఖాతూన్’ రాజమహిషి అని ముందరి శ్లోకంలో చెప్పాడు శ్రీవరుడు. రాజపురి రాజవంశానికి చెందినది. ‘జయరాలా’ అని శ్రీవరుడు అన్నాడు. గతంలో రాజపురిలో రాజా ‘జయసింహుడు’ తన కూతురి వివాహం హసన్ షాహతో జరిపించాడని చెప్తాడు. అప్పుడు రాజకుమారి పేరు చెప్పలేదు. ఇప్పుడు ఆమె పేరు ‘జయరాలా’ అంటున్నాడు. ఆమె పేరు ‘జయమాల’గా నిర్ధారించారు పరిశోధకులు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మతం మారిన వారి పేర్లను శ్రీవరుడు కానీ జోనరాజు కానీ, వారి మారిన పేర్లతో కాక, భారతీయ ధర్మంలో  ఉన్నప్పటి పేర్లనే వాడేరు. కాబట్టి వారు సుల్తాన్‌ని వివాహం చేసుకున్నా మతం మారలేదని పొరబడే అవకాశం ఉంది. ఇస్లామీయుడిని వివాహం చేసుకుని కూడా తమ పాత ధర్మం పట్ల సానుభూతి చూపించే వారిని,    మతం మారని అమ్మాయితో వివాహాన్ని’ ఫాసిద్ వివాహం’ అంటారు.

‘ఫాసిద్’ అన్నది అరబ్బీ పదం. ‘అపసవ్యమైన వివాహం’ అన్న మాట. మనకు పలు కశ్మీరీ సుల్తానుల రాణులు వారి పాత మతం పేర్లతో చలామణీ అవటం కనిపిస్తున్నా దాన్ని సుల్తానుల పరమత సహనంగా భావించే వీలులేదు. ఆయా రాణులు దర్గాలు, ఖాన్‌గాహాలు, మసీదులు నిర్మించటం వారు మతం మారేరని నిరూపిస్తుంది. ఏ సుల్తానయినా తన వివాహం ‘ఫాసిద్ వివాహం’గా భావించటాన్ని ఇష్టపడడు.

షేకంధరపురప్రాంతే ఖానగాహం నవం వ్యధాత్।
శ్రీజైననగరే యస్య మసోదాహజిరాదయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 202)

(జయరాలా) సికందపురం సమీపంలో ననీన ఖాన్‍గాహాను నిర్మించింది. జైననగర్ సమీపంలో పుణ్యం కీర్తి సంపాదించిపెట్టే మసీదు, ముజీరాలు నిర్మించింది.

ఈ శ్లోకాన్ని బట్టి, శ్రీవరుడు ‘జయమాలా’ అన్న రాజపురి రాజు  కూతురు తన స్వధర్మాన్ని వదలి వేసిందని స్పష్టమవుతుంది. శ్రీవరుడు ‘జయమాల’ మసీదులు, ఖనగహాలతో పాటు ‘హుజీరా’ను నిర్మించిందని చెప్పాడు. ‘హుజీరా’ను ఇప్పుడు ‘హజ్రాహ్’ అంటున్నారు. ఇది వ్యక్తిగత ప్రార్థనా గది. ప్రశాంతంగా, ఒక వ్యక్తి ప్రార్థన చేసుకునే గది అన్న మాట. వీటినీ నిర్మించింది ఆమె.

భాన్తి ప్రతిష్ఠా యత్రైతాః పుణ్యకీర్తిమనోహరాః।
కర్మపత్యధికారస్థో నాపితః ఫేరఠక్కురః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 203)

విజయేశనదీపారే మఠ చారుతరం వ్యఘాత్।
సయ్యభాండపతిశ్చక్రే విహారం విజయేశ్వరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 204)

కశ్మీరులో ఈ నిర్మాణాలు పుణ్యకీర్తితో శోభితం చేశాయి నిర్మాతలను. కర్మపతి పదవిలో ఉన్న మంగలివాడు ‘ఫేర ఠక్కుర’ విజయేశ్వర నదీతీరంలో సుందరమైన మఠం నిర్మించాడు.

‘ఫేర ఠక్కుర’ను మంగలివాడని శ్రీవరుడు చెప్పాడు. ఇప్పుడు ‘ఠాకుర్లు’ అంటే జమిందార్లు, అణచివేసే అగ్రవర్ణాల వారిగా గుర్తిస్తారు కానీ, ఆ కాలంలో మంగలివారిని ‘ఠాకుర్లు’ అనేవారు. ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్, బీహార్, కశ్మీర్ ప్రాంతంలో మంగలి వారిని ‘ఠాకుర్లు’ అంటారు. ఇది కూడా భారతీయ సమాజం నిత్య పరిణామశీలి అని నిరూపిస్తుంది. ఒక చోట ఠాకుర్లు, మరో చోట ‘ఠాకుర్లు’ కారు. కానీ ఆధునిక మేధావులు ‘ఠాకుర్’ అనగానే ఊగిపోతారు. సంక్లిష్టమైన భారతీయ సమాజ పరిణామ క్రమం వారి ఊహకు అందదు.

‘భాండపతి’ అంటే ఇప్పటి ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ లాంటిది. ఈ భాండపతి బౌద్ధుడని, విహార నిర్మాణం ద్వారా తెలుస్తుంది. ‘సయ్య’ భాండపతి లదాఖ్ ప్రాంతానికి చెందినవాడిగా భావిస్తున్నారు. రాబోయే శ్లోకంలో ఇతని సోదరుడు ‘లక్ష్మ’ వ్యాపారి అని తెలుస్తుంది. దీన్ని బట్టి తెలిసే మరో విషయం ఏమిటంటే 15వ శతాబ్దంలో కూడా నేపాల్, కాశ్మీర్‌లలో బౌద్ధులు ఉన్నారనీ వ్యాపారాలు చేసేవారనీ, వారు ఉన్నత పదవుల్లో ఉంటూ, విహారాలు నిర్మించేవారనీ తెలుస్తుంది. అంతేకాదు, కశ్మీరంలో బౌద్ధులు, బ్రాహ్మణులు వివాహాలు చేసుకునేవారని, కలసిమెలసి ఉండేవారనీ తెలుస్తుంది. మన సామాజిక వ్యాఖ్యాతలు గమనించాల్సిన విషయం ఇది.

(ఇంకా ఉంది)

Exit mobile version