[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
శ్రీతోరమాణదీన్నారాన్ నిష్ప్రచారానవేత్య చ।
ద్విదీన్నారీ నాగమయీ నవా తేన ప్రవర్తితా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 212)
తోరమాణుడి దీనారాలు చలామణిలో తగ్గిపోవటం, విలువ మారిపోవటం గమనించిన రాజు, నాగుల ముద్ర ఉన్న ద్వి-దినారాలను ప్రచారంలోకి తెచ్చాడు.
కల్హణ కశ్మీర రాజతరంగినిలో ఇద్దరు తోరమాణులున్నారు. ప్రథమ తోరమాణుడు మిహిరకులుడి తండ్రి. రెండవ తోరమాణుడు రాజు తుంజీనుడు పుత్రుడు. అతని అన్న హిరణ్యకుడు. ఇద్దరూ కలిసి రాజ్యం చేశారు. తన అన్న రాజ్యం చేస్తుండగానే, ఈ తోరమాణుడు తన పేరు మీద నాణేలు ముద్రింప జేసుకున్నాడు. ఫలితంగా, హిరణ్యకుడు అతడిని బంధించాడు. చెరసాలలో కాలం గడిపిన తరువాత తోరమాణుడు విడుదల అయ్యాడు. ఈ తోరమాణుడి కథ ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ ‘పాతిపెట్టిన నాణెములు’ అన్న కశ్మీర రాజవంశావళి చారిత్రాత్మక నవల రచించాడు. ఆ తోరమాణుడి నాణేలు తరువాత ప్రచారం లోకి వచ్చాయి. ఇప్పుడు డబ్బు విలువ పెరిగిపోవటంతో సుల్తాను కొత్త నాణేలు ముద్రింపచేశాడు. ఆ నాణేలపై నాగుల ముద్రలున్నాయి. కశ్మీరు నాగులకు ప్రసిద్ధి. ఆ సంప్రదాయాన్ని ఇస్లామ్ రాజు పాటించాడు. ఇది గమనించదగ్గ విషయం. జైనులాబిదీన్ బాటలో నడవాలని హసన్ షాహ ప్రయత్నిస్తున్నాడనేందుకు ఇది చక్కటి ఉదాహరణ. ఇతడు కాక మహమ్మద్ ఘోరీ ఒక్కడు నాణేలపై భారతీయ దేవీదేవతల చిత్రాన్ని ఉంచినవాడు. మహమ్మద్ ఘోరీ ముద్రించిన నాణేలపై లక్ష్మీదేవి బొమ్మ ఉండేది.
పంచవింశతికో యోభూత్ పురాణస్తాత్రనిర్మితః।
కించిదూనీకృతశ్చాభూద్ ద్రవ్యాప్రాచురలక్షణాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 213)
ప్రాచీన తామ్ర నాణేల విలువ ఇరవై అయిదు ఉండేది. కానీ వస్తువుల ధరలు పెరగటంతో వాటి విలువ తగ్గిపోయింది.
ముక్తామణిం నృపతిమౌలిషు యోగ్యమూర్తిం
యా వర్ధయత్యుపనతేన పయోధరేణ।
సా పావనీ శుచిరుచిర్జననీ సుముఖ్యా
సంగచ్ఛతే న చిరకాలమనేన సాకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 214)
రాజుల మస్తకాలపై ఉండే అర్హత కల రూపం కల ముత్యం దాచుకుని చిప్పను విసర్జిస్తారు. ఎలాగయితే, ముత్యాన్ని ఉత్పన్నం చేసిన చిప్ప, ముత్యాన్ని పట్టుకుని ఎల్లకాలం ఉండదో, అలాగే రాజు లాంటి ముత్యానికి జన్మనిచ్చిన ఈతని తల్లి కూడా అతని వెంట చిరకాలం ఉండదు.
సా శుక్తికాస్య జననీ జననీతచిత్తా।
సాధ్వీయ తిష్ఠతి చిర వరభుక్తికామా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 215)
శైశవే స్వపయో దత్వా రాజా సవర్ధితో యయా।
గోల్ఖాతీనాస్య జననీ సాకస్మాత్ త్రిదివ గతా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 216)
బాల్యంలో రాజుకు పాలిచ్చి పెంచిన అతని తల్లి గోల్ఖాతూన్ హఠాత్తుగా మరణించింది. ఎలాగయితే ముత్యానికి జన్మనిచ్చిన ముత్యపు చిప్ప ఎల్లప్పుడూ ముత్యం వెంట ఉండలేదో, అలాగే రాజు తల్లి అతడిని విడిచి వెళ్ళిపోయింది.
కోపోర్వవికృతే రాజ్ఞస్తరఙ్గతరలాత్మనః।
సతతం ప్రతివన్ధాయ సిన్ధోర్వేలేవ యాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 217)
బడబానలం లాంటి రాజు కోపం వికృత రూపం దాల్చేముందు అడ్డుకట్టిన తీరంలా, రాజు చంచల మనస్సుకు అడ్డుకట్ట వేసేది అతని తల్లి.
తాం హిందుకసమాచారశతపత్రరవిప్రభామ్।
స్మృత్వా సరుదితాక్రంద్రం శుశోచ సకలో జనః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 218)
సూర్యుడు కమలాన్ని వికసింపచేసినట్టు ఆమె (గోల్ఖాతూన్) హిందువుల సంప్రదాయాలను సంరక్షించిందని తలుస్తూ, ఆమెను గుర్తు చేసుకుంటూ అందరూ రోదించారు. ఆమె కోసం బాధపడ్డారు.
ఈ శ్లోకాన్ని బట్టి గోల్ఖాతూన్ హిందువుల ఆచారాలను సంరక్షించిందనీ, ప్రోత్సహించిందనీ తెలుస్తోంది.
తయా వియుక్తస్తత్కాలం రాజా కృష్ణాంబరాంబరః।
దినశ్రియేవ పద్మోభూద్ దుఃఖసంకుచితాననః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 219)
తన తల్లి మరణంతో రాజు, సూర్యుడు అస్తమించిన తరువాత కుచించుకుపోయిన కమలంలా అయిపోయాడు. విషాదాన్ని సూచించే నల్ల దుస్తులు వేసుకున్నాడు రాజు.
గ్రాహయిత్వాంశుకం శుద్ధం వ్యతీతే దిన సప్తకే।
సన్యయం మల్లికో రాజ్ఞో వ్యధాద్ దుఃఖనివారణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 220)
వారం రోజులు గడిచిన తరువాత మల్లికా (అహ్మద్) రాజు శుభ్ర వస్త్రాలు ధరించేట్టు చేశాడు. దానధర్మాలు చేశాడు. రాజు దుఃఖాన్ని కాస్త తగ్గించాడు.
శాహాభదీన పుర్యన్తనౌం సేతుం విపులం నవమ్।
తద్ధనేనాదిశత్ కర్తుం తత్పుణ్యద్ధర్యై మహీపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 221)
తన తల్లి పుణ్యం అధికమయ్యేందుకు, రాజు, ఆమె ధనంతో, ‘శాహాభదేవపురి’ వద్ద నదిపై విశాలమైన నౌకల వంతెనను నిర్మించాడు.
అభూత్ సైదాన్వయే జాతా వల్లభా యా మహీపతేః।
హయాతఖాతోనా రాజ్ఞీ ప్రేమాశ్వాసవిలాసభూః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 222)
పదార్థాన్ ఘోపభూపాదిపరివారసమన్వితాన్।
అనన్యరసికో రాజా తస్యై సర్వ సమార్పయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 223)
తయైకయైవ రాజేన్దుః స సున్దరగుణథియా।
అవిన్దత్ పరమానన్దం మాలత్యేవ మధువ్రతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 224)
సయ్యదా కుటుంబానికి చెందిన రాణి హయతా ఖాతూన్, రాజుకు అతి ప్రియమైనది. రాజుకు ఇంకా ఎవరన్నా మోజు లేదు. అందుకని విలువైన వస్తువులు, భవనాలు, ఆభరణాలు ఆమెకే సమర్పించేవాడు. మాలతీ మొక్క నుంచి తేనెటీగ తేనెను జుర్రుకునేట్టు రాజు పరమ ఆనందాలు, సౌఖ్యాలు ఆమె ద్వారానే అనుభవించేవాడు.
విభవే సతి భవతి భవే కస్యచిదేవేప్సితో లాభః।
వర్షతి మేఘే కృషికృత్ కోపి మణిం మౌక్తికం లభతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 225)
ఈ ప్రపంచంలో ఎంత ఐశ్వర్యమున్నా కోరినది లభించేది కొందరికే. మేఘం ఎంత వర్షించినా ముత్యం లభించే కర్షకుడొకడే ఉంటాడు.
మహారాజ్యాం మహీభర్తురస్యాం రాజసుతోజని।
యస్య మాదఖానాఖ్యామకరోన్మౌసులోచితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 226)
ఈ మహారాణి ద్వారానే రాజుకు పుత్రుడు కలిగాడు. అతడి ముసల్మాన్ నామము మహమ్మద్.
సుల్తాన్ పుత్రుడి పేరు మహమ్మద్ ఖాన్. ముస్లింలకు ఉచితమైన నామము అంటున్నాడు శ్రీవరుడు. మహమ్మద్ ప్రవక్త పేరును పిల్లవాడికి పెట్టారు.
తతః పూర్వాధికప్రీతే తాజిభట్టే స భూపతిః।
స్వసుతం రక్షణాయాదాత్ సిన్ధురిన్దుమివేశ్వరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 227)
సాగర మథనంలో ఉద్భవించిన చంద్రుడిని సగరుడు శివుడికి ఇచ్చినట్టు, రాజు తన పుత్రుడి సంరక్షణా బాధ్యత తాజిభట్టుకు అప్పజెప్పాడు.
తాజిభట్టు ముస్లిం పేరు మాలిక్ యారి. ఆ పిల్లవాడి సంరక్షణ బాధ్యత ఇచ్చాడంటే, సుల్తానుకు తాజిభట్టుపై ఎంత నమ్మకం ఉన్నదో ఊహించవచ్చు.
సుల్తానుకు మొత్తం ముగ్గురు కొడుకులు. మహమ్మద్ ఖాన్, హుసేన్ ఖాన్, యూసుఫ్ ఖాన్‌లు.
చతుఃపంచాశవర్షేథ వైశాఖే నరనాయకః।
పుత్రజన్మోత్సవానంద మభజద్ వ్యయసుందరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 228)
54వ సంవత్సరం, వైశాఖమాసంలో రాజు పుత్రుడి జన్మోత్సవం వైభవంగా, ఎంతో ధనం వ్యయం చేసి జరిపాడు.
విదగ్ధచర్చరీపాలనర్తకీనటగాయనాన్।
ఉద్దిశ్య త్యాగర సికైర్న కైర్వైశ్రవణాయితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 229)
అందరూ కుబేరుడిలా ధనం నీళ్ళలా ఖర్చు చేశారు. సంబరాలకు, ఆటలకు, నాట్యగత్తెలకు, గాయకులకు బోలెడంత ధనం ఖర్చు చేశారు.
పట్టకౌశేయవస్త్రాప్తీ రాజ్యే శ్రీజైన భూపతేః।
సామన్తసచిచాదీనామాసీత్ సత్కార సిద్ధయే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 230)
జైనులాబిదీన్ పాలనా కాలంలో, సామంతులను, మంత్రులను పట్టు వస్త్రాలతో సత్కరించేవారు.
తద్రాజ్యే విభవోదారవ్యయే సా ప్రాకృతాలయాత్।
ఉత్సవే చర్చరీపాలనటాద్యైః ప్రాపి తైరపి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 231)
ప్రస్తుత రాజు పాలనా కాలంలో, సంబరాలను నిర్వహించేవారు, ఉత్సవంలో కళాకారులకు పెద్ద బహుమతులిచ్చేవారు. సామాన్యులు సైతం నటులకు, గాయకులకు విలువైన బహుమతులను అందజేశారు.
స్ఫీతరాజశ్రియా ప్రీతో నృపతినే వయౌవనః।
ఆనీతగీతవింద్వర్థః సంగీతరసికోభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 232)
యువకుడైన రాజు, తనకు అందిన ఐశ్వర్యంతో కళాకారులను, ముఖ్యంగా గాయకులను సత్కరించి, పాటలు వినడంలో నిమగ్నమయ్యాడు. ఆయన సంగీత రసికుడయ్యాడు.
సంగీతజ్ఞజ్యహాంగేరమార్గేశాద్యాః సుఖోచితాః।
తారకా ఇవ చంద్రాగ్రే వ్యరుచన్త సభాసదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 233)
సంగీతజ్ఞులైన జహంగీర్, మార్గేశుడు, ఇతర సభాసదులు నక్షత్రాల్లా అగుపించారు. రాజు చంద్రుడు. మిగతావారు నక్షత్రాలు.
కృష్ణచంద్రావలీరాజరూపాభినయనైపుణాత్।
రాజ్ఞే వరనటా నాట్యాత్ తద్దర్శనకుతూహలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 234)
గొప్ప నటులు, ప్రతిభావంతులు కృష్ణ, చంద్రావలీ, రాజుల్లాగా ఎంత గొప్పగా అభినయించారంటే, వారి అభినయం, వారిని కలవాలన్న కుతూహలం రాజులో కలిగించింది.
‘చంద్రావలి’ అన్నది కృష్ణుడిపై అనురక్తి కల కన్య. వీరిద్దరి ప్రేమ ఆధారంగా సంస్కృతంలో ఒక నాటకం ఉంది. చంద్రావలి గోపిక. బ్రజ ప్రజల జానపదాలలో ఈమెకూ రాధకూ పోటీ. బ్రజ భాషలో ‘మన్ లీలా’ అన్నది వీరి ప్రేమను తెలిపే సాంప్రదాయ నాటకం. కృష్ణుడు చంద్రావలిని కలుస్తున్నాడని తెలిసి రాధ అసూయతో రగిలిపోతుంది. మళ్ళీ రాధ ప్రేమ సాధించటం కోసం శ్రీకృష్ణుడు గోపిక వేషంలో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ప్రేమను పొందుతాడు. 16వ శతాబ్దికి చెందిన రూప గోస్వామి సంస్కృత నాటికలో అయిదవ అంకం ‘లలిత – మాధవ’ ఈ గాథను చెప్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
