Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-50

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

ఇతి మార్గే కథాః శృణ్వన్ గ్రామ్యాణాం జైనభూపతిః।
వధాత్ కుతనయం నిందన్ ప్రాప సుయపురాన్తరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 108)

మార్గంలో గ్రామీణుల మాటలు వింటూ, సోదరుల పోరు వల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు – కుపుత్రులను వాళ్ళు  నిందించటం  వింటూ రాజు సుయ్యపురం చేరుకున్నాడు.

మానసిక శాస్త్రంలో primacy effect, recency effect అని ఓ సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం మనుషులకు మొదట్లో విన్నవీ కన్నవీ గుర్తుంటాయి. చివరవి గుర్తుంటాయి. మధ్యలో విన్నవి, కన్నవి ఈ మొదలు చివరి అంశాలు గుర్తున్నంతగా గుర్తుండవు. ప్రజల మాటలు ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. దీన్ని మామూలుగా ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అని అనటం అలవాటు.

జైనులాబిదీన్ గొప్ప రాజు. గొప్ప వీరుడు. ఆరంభంలో గొప్ప శౌర్య ప్రదర్శన చేసి సింహాసనం అధిష్ఠించాడు. తరువాత వీరత్వ ప్రదర్శన ద్వారా రాజ్యాన్ని విస్తరింప చేశాడు. అతి చక్కని రీతిలో రాజ్యాన్ని పాలించాడు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించాడు. వారికి శాంతిభద్రతల నిచ్చాడు.

చివరి దశలో కొడకుల దురాశ వల్ల రాజ్యం అల్లకల్లోలమవుతోంది. హింస చెలరేగుతోంది. రాజు కూడా, వృద్ధాప్యం వల్లనో, అనారోగ్యం వల్లనో రాజ్యంపై పట్టుకోల్పోతున్నాడు. ప్రజలకు రాజు మంచితనం గుర్తుంది. కొడుకుల దౌష్ట్యం వల్ల బలహీనుడుగా కనిపిస్తున్న రాజు తెలుస్తున్నాడు. అతడిపై జాలి ఉంది. దాంతో కొడుకులను దూషిస్తూ వారు మాట్లాడుతున్నారు. రాజు  పరిపాలనా దక్షత, చతురతలు వారికి గుర్తుకు రావటం లేదు.

‘సుయ్యపురం’ అంటే ఈనాటి ‘షోపూర్’. ఫరిస్తా సుయ్యపురాన్ని ‘శివపురం’ అన్నాడు.

తీరద్వయ్ వితస్తాయాః పితాపుత్ర బలద్వయమ్।
న్యవీవిషత్ సమాసన్నం పరస్పర జయోద్యతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 109)

వితస్త నది ఒడ్డున తండ్రీ కొడుకుల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకరినొకరు జయించాలన్న ఆతృతతో మొహరించి ఉన్నాయి ఒడ్డున కిరువైపులా సైన్యాలు.

‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం “నది దాటి ఆదమ్‌ఖాన్ ఒడ్డున శిబిరం నిలిపాడు. శ్రీనగర్ నుంచి సుల్తాన్ సేనలు సోయాపూర్ (సయ్యపురం) వచ్చి చేరాయి. సుల్తాన్ సేనల రాక ప్రజలకు ఉత్సాహాన్నిచ్చింది”.

ఆంగ్లంలో ఒక సామెత ఉంది.

“ఒక సంఘటనకు వెయ్యి మంది ప్రత్యక్ష సాక్షులుంటే, సంఘటన గురించి వెయ్యి రకాల కథనాలుంటాయి” అని.

ఒకే సంఘటనను వెయ్యి మంది చూస్తే వెయ్యి రకాల కథనాలుండటం వెనుక ‘Reconstructive Memory’ అన్న సిద్ధాంతం ఉంది. ఏ వ్యక్తి కూడా చూసినదానికి తనదైన స్వంత కల్పన జోడించకుందా చెప్పలేడు. దాంతో ఒక వ్యక్తి ఒక సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయినా ఆయన చెప్పినదాన్ని సంపూర్ణంగా సత్యంగా భావించటం కుదరదు.

“The constructive memory process as functions by encoding patterns of perceived physical characteristics, as well as interpretive conceptual and semantic functions that act in response to the incoming information.”

ప్రతి వ్యక్తికీ తనదైన దృక్పథం ఉంటుంది. తనదైన అనుభవాలుంటాయి. తనదైన ఆలోచన ఉంటుంది. తనదైన అవగాహన ఉంటుంది. ఏ అంశాన్నయినా తన ప్రమేయం లేకుండానే వ్యక్తి వీటన్నిటి ఆధారంగా చూస్తాడు. అర్థం చేసుకుంటాడు. అందుకే ‘న్యాయస్థానం’ ఏ ఒక్క సాక్ష్యంపై ఆధారపడి నిర్ణయం తీసుకోదు. పలు అంశాలను, పలు విభిన్నమైన కోణాలలో విశ్లేషించిన తరువాతనే ఒక నిర్ణయానికి వస్తుంది.

కానీ భారతదేశ చరిత్ర విషయంలో మాత్రం ఎవరో ఒకరు చెప్పిన మాటను ప్రామాణికంగా భావించి నిర్ణయించి తీర్పులిచ్చేయటం చూస్తున్నాం. ఈ నిర్ణయానికి ఎలాంటి ఆలోచన, విశ్లేషణ లేకుండా గుంపులు ఆమోదించి ప్రచారం చేయటం గమనిస్తున్నాం. దీనికి కూడా ఓ కారణం ఉంది.

ఒక వ్యక్తి దృక్కోణాన్ని ఒక సమాజం – వ్యక్తి గతాన్ని విస్మరించి సామూహికంగా ఆమోదించటం వెనుక ‘retrieval cues’ అన్న సిద్ధాంతం ఉంది. అంటే ప్రతి వ్యక్తీ తనద్ైన  దృక్కోణాన్ని కలిగి ఉన్నా, ఆ సంఘటనను అర్థం చేసుకునేందుకు ఇచ్చే ‘cues’ వల్ల ఆ వ్యక్తి ఆలోచన ప్రబావితం అవుతుంది. తన schema (అనుభవాల)ను మరో వ్యక్తి అనుభవాల ద్వారా అర్థం చేసుకుంటాడు.

భారతదేశ చరిత్ర ఒక్కటే కాదు, ఏ దేశ చరిత్రను అర్థం చేసుకోవాలన్నా, ఇదే పద్ధతిని పాటించాలి. ముఖ్యంగా ఒక దేశం గురించి ఆ దేశానికి చెందని వ్యక్తుల రచనలను ప్రామాణికంగా భావించే సమయంలో ఎంతో జాగరూకత వహించాల్సి ఉంటుంది. శ్రీవరుడి రచనలో జైనులాబిదీన్ పట్ల సానుభూతి కనిపిస్తుంది. ఆవేదన కనిపిస్తుంది. కానీ పర్షియన్ రచయితల రచనలలో జైనులాబిదీన్ పట్ల ఓ రకమైన క్రోధం, కసి కనిపిస్తాయి. ఎందుకంటే, జైనులాబిదీన్ ఇస్లామీయులతో సమానంగా ఇస్లామేతరులకు కూడా అన్ని హక్కులు, భద్రతలు ఇచ్చాడు. వారి ప్రార్థనా స్థలాలను నిర్మించాడు. పూజలు, సంబరాలు చేసుకోనిచ్చాడు. దాంతో  ఇస్లామేతరులు ఇస్లామీయులతో సమానంగా అన్ని వైభవాలు అనుభవించటమే కాదు, ఇస్లామీయులను లెక్కచేయని పరిస్థితులు వచ్చాయి. ఇందుకు కారణం జైనులాబిదీన్ అన్నది వారి ఆలోచన. అందుకని వారు జైనులాబిదీన్‍ను గొప్ప సుల్తాన్‍గా భావించేందుకు ఇష్టపడలేదు. పొగిడారు, కానీ నిరసన కూడా ప్రదర్శించారు. కాబట్టి, చరిత్రలో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే కన్నా ముందు అన్ని కోణాలను పరిశీలించి, విశ్లేషించటంతో పాటుగా, ఆధారం ‘దృష్టి’ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ‘దృష్టి’ ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది, శ్రీవరుడు జైనులాబిదీన్‍ను విష్ణువు అవతారం అన్నాడు. జైనులాబిదీన్ గొప్ప రాజే కానీ, కాఫిర్‍లకు సుల్తాన్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ‘gave birth to innumerable blasphemous innovations in the Islam of the prophet’ అంటుంది బహరిస్తాన్. తారీఖ్-ఇ-బీర్బల్ కమ్ర’ లో జైనులాబిదీన్ వల్ల బ్రాహ్మణుల తపశక్తి దెబ్బతిన్నదన్న అభిప్రాయం కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి వండిన పదార్థాలను పొద్దున్న తినటం, పచ్చళ్ళ వాడకం, పర్షియన్ నేర్చుకోవటం వల్ల బ్రాహ్మణుల తపశక్తి నష్టమైపోయిందట. ఇది రాసింది 19వ శతాబ్దంలో కాశ్మీరీ పండితుడు. ఈ కాశ్మీరీ పండితుడికి, తన స్వంతదేశం వదలి ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే దేశం పారిపోవటం తెలియదు. ఒక సుల్తాన్, తనవారి మౌఢ్యానికి అడ్డుకట్ట కట్టి, వలసపోయినవారందరికీ భద్రతనిచ్చి తమ స్వంత దేశంలో స్థిరపరచటం తెలియదు. అందుకని, పర్షియన్ నేర్వటం, చద్దన్నం తినటంవంటివి నేరాలుగా, దోషాలుగా భావించి, జైనులాబిదీన్ ను దూషిస్తున్నాడు. ముగ్గురూ ఒకే సుల్తాన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ, ముగ్గురి అభిప్రాయాలు వేరు. కారణం వారు జైనులాబిదీన్ ను అర్ధం చేసుకునే దృక్కోణాలు వేర్వేరు. ఇందులో ఏదో ఒకరి అభిప్రాయాన్ని ఆధారం చేసుకుని చరిత్రలో ఇదే జరిగిందని నిర్ణయించటం పొరపాటు. కానీ, చరిత్ర విశ్లేషణ, రచన పరిజ్ఞానంలేనివారంతా, తమ స్వీయ ఇష్టాయిష్టాల ఆధారంగా చరిత్రను రచించేస్తూ, అందువల్ల తాత్కాలిక లాభాలున్న గుంపులను సంతృప్తిపరచటం ద్వారా కొత్త చరిత్రను రచించటం ఇటీవలె సాధారణమవుతున్నది. ఇలాంటి చరిత్ర ‘రీమేకర్ల’ వల్ల  చరిత్రకు మాత్రమే కాదు, సమాజానికి  కూడా తీరని నష్టం కలుగుతుంది. అమెరికాలో ఇలాంటి చరిత్ర రీమేకర్ల వల్లనే స్థానిక రెడ్ ఇండియన్లు అనాగరికులుగా, విలన్లుగా, బయటనుంచివచ్చి వారిని అణచివేసిన యూరోపియన్లు హీరోలుగా ప్రపంచానికి అర్ధమయ్యారు.

జైనులాబిదీన్ ఒకడే. కానీ అతని ఒక్క చర్య గురించి ఇన్ని రకాల వ్యాఖ్యలు, ఇన్ని రకాల అభిప్రాయాలు. కాబట్టి చరిత్రలో ఒక వ్యక్తి వ్యక్తిత్వం నిర్ణయించాలన్నా, నిజానిజాలు గ్రహించాలన్నా ఒక గ్రంథమో, ఒక వ్యాఖ్యనో ఆధారం చేసుకోవటం అంటే కళ్ళకు గంతలు కట్టుకుని, దృశ్యాన్ని చూసి, అంతా తెలిసినట్టు  వ్యాఖ్యానించటం అన్నమాట.

అన్నంతరే హాజ్యఖానః పర్ణోత్సాత్ తూర్ణమాగతః।
సంపూర్ణ ఇవ సదృర్ణో దేశాభ్యర్ణం సమాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 110)

ఇంతలో ఆలస్యం చేయకుండా హ్యాజీఖాన్ పర్ణోత్స చేరుకున్నాడు. అటునుంచి అందమైన ‘గుజరు’ ప్రాంతం దగ్గరకు వచ్చాడు. ‘పర్ణోత్స’ అంటే ఇప్పటి ‘పూంఛ్’.

శృత్యా వరాహమూలాన్తే పుత్రం ప్రాప్తం బలాన్వితమ్।
అగ్రే బహామఖానం తం సత్కర్తుం వ్యసృజన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 111)

రాజకుమారుడు హాజీఖాన్ వరాహమూల (బారాముల్లా) దగ్గరకు వస్తున్నాడని తెలియగానే, అతని సత్కరించి ఆహ్వానించేందుకు వహ్రాంఖాన్ (బహరామ్ ఖాన్) ను పంపించాడు రాజు.

బహరామ్ ఖాన్ సుల్తాన్‌  చిన్న కొడుకు.

‘తవాకత్ అక్బరీ’లో బహరామ్ ఖాన్, హాజీఖాన్‌ల నడుమ శత్రుత్వం ఏర్పడింది ఈ సందర్భం లోనే అన్న వ్యాఖ్య కనిపిస్తుంది.

కాలాపేక్షే హాజ్యఖానః ప్రేమ్ణాశ్లిష్యం కృతాదరః।
ప్రీతినిష్ఠం కనిష్ఠం తం భ్రాతరం స్వమమానయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 112)

తనను గౌరవించించేదుకు వచ్చిన కనిష్ఠ సోదరుడిని సన్మానించి ప్రేమ ప్రదర్శించాడు హాజీఖాన్.

పీర్ హసన్ ప్రకారం ఇద్దరు సోదరులు ఒకరిపట్ల మరొకరు గాఢానురాగం ప్రదర్శించారు.

అన్యేద్యుర్మానితం దుష్ట్వా జనకేన నిజానుజమ్।
ఆదమ్‍ఖానో విత్ర్రాణః సంత్రస్తోగాద్ దిగన్తరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 113)

తన సోదరుడిని తండ్రి ప్రేమపూర్వకంగా ఆహ్వానించటం తెలుసుకున్న ఆదమ్‍ఖాన్ భయంతో వెనుతిరిగాడు. దిగంతరానికి పారిపోయాడు.

ఆదమ్‍ఖాన్ స్వతహాగా పిరికివాడు. తండ్రిని ఎదిరించి గెలవవచ్చన్న ధైర్యాన్ని చుట్టూ ఉన్నవారు నూరిపోసి అతడిని ఉత్సాహపరచి ఉండవచ్చు. కానీ ఎప్పుడయితే  హాజీఖాన్ కూడా వచ్చి తండ్రి వైపు చేరాడో, ఆదమ్‍ఖాన్ తెచ్చిపెట్టుకున్న ధైర్యం పారిపోయి ఉంటుంది. అతడు కూడా యుద్ధం వదలి పారిపోయాడు.

“దిగంతరం వెళ్ళాడు ఆదమ్‍ఖాన్” అని శ్రీవరుడు, ‘దిగంతరం’ అన్న పదప్రయోగం చేశాడు. ‘దిగంతరం’ అంటే ‘దిక్కులు అంతం అయ్యే చోటు’ అన్న అర్థం వాడుకలో ఉంది. ఇక్కడ శ్రీవరుడి ఉద్దేశం ప్రకారం రెండు దిక్కుల మధ్య  ప్రదేశం. ‘దిగంతం’ కాదు.

షాహిభంగపథా సింధుం సుముత్తీర్య బలాన్వితః।
ప్రాప సింధుపతేర్దేశ కష్ట క్లిష్ట పరిచ్ఛదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 114)

సింధునది దాటి, షాహిభంగ దారిలో సింధుపతి దేశం చేరాడు, తన అనుచరులతో.

‘షాహిభంగ్’ అన్న పదం శ్రీవరుడు వాడేడు. ఈ ‘షాహిభంగ్ మార్గం’ ఏమిటో, ఎక్కడ ఉందో నిర్ధారణగా తెలుసుకోలేకపోయారు చరిత్ర రచయితలు, పరిశోధకులు. ‘సింధుపతి రాజ్యం’ జైనులాబిదీన్ పరిధికి ఆవల ఉండటంతో ఆదమ్‌ఖాన్ ఆ రాజ్యంలో ఆశ్రయం పొందాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version