[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
సూర్యసంక్రాన్తయః క్రూరదినేశ్వాప్రాప్తాదా విశామ్।
భావి క్రూరఫలోత్పాద సాదచింతన భీతిదాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 16)
ఆ కాలంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణించటం క్రూర దినాల్లో జరిగింది. దాంతో తమ భవిష్యత్తులో క్రూర ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని ప్రజలలో భయం కలిగింది.
మన్నిర్మతా క్షయాం యాస్యత్యయం కిమితి దుఃఖితా।
రాజధాన్యరుదచ్ఛత్ర తలోలూకధ్వనిచ్ఛలాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 17)
అక్కడ భవంతిపై నిర్మించిన ఛత్రం క్రింద గుడ్లగూబ అరుపు వినిపించింది. నన్ను నిర్మించిన నిర్మాత నష్టమైపోతాడని రాజధాని రోదిస్తున్నట్టుంది.
కుక్క రోదన, గుడ్లగూబ కూతలు అశుభ సూచనలు. మృత్యువు, సర్వనాశనం సమీపంలో ఉందన్న దానికి సూచనలు అవి. గుడ్లగూబలు ఉదయం కనబడవు. రాత్రిళ్లు ఇతర చిన్న పక్షులను వేటాడి తింటాయి. జనసమ్మర్ధం ఉన్న చోట గుడ్లగూబలు ఉండవు. కాబట్టి గుడ్లగూబ కూసిందంటే అర్థం అక్కడ సర్వనాశనం సంభవించబోతున్నదని. అన్నీ దుశ్శకునాలే కనిపిస్తున్నాయి.
దృష్టోంబరే ద్వితీయస్యాం సుధాంశుస్తత్ర తైర్జనైః।
ఉత్తాన ఇవ భూపేశమాన్యం సూచయితుం విశామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 18)
ఇంతలో ప్రజలు ఆకాశంలో రెండవ చంద్రుడుని చూశారు. మరో రాజు ఉద్భవించడానికి దాన్ని సంకేతంగా భావించారు.
మనం శ్రీవరుడి రాజతరంగిణి చదివే సమయంలో శ్రీవరుడు సుల్తానుల ఆస్థానంలో ఒకడు అన్న విషయం మరచిపోకూడదు.
శ్రీవరుడి దృష్టిలో జైనులాబిదీన్ దైవస్వరూపం, దైవావతారం. అతని పాలన అంతం అవటం శ్రీవరుడికి పెద్ద ఉత్పాతం. ఎందుకంటే, జైనులాబిదీన్ తరువాత ఎవరు సింహాసనానికి వచ్చినా, వారు ఎంత గొప్ప వారయినా జైనులాబిదీన్ మాత్రం కాలేరు. ముంచెత్తాలని ఉరకలేస్తున్న ఇస్లాం మత ఛాందసవాదానికి అడ్డుగోడలా నిలబడి కశ్మీరీ పండితులకు రక్షణ నిచ్చాడు జైనులాబిదీన్. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు.
శ్రీవరుడికి జైనులాబిదీన్ సంతానం శక్తులు, బలహీనతలు తెలుసు. వాళ్ల గురువు శ్రీవరుడు. కాబట్టి, వారెవరూ జైనులాబిదీన్‌కు సాటి రాలేరని తెలుసు. కానీ, జైనులాబిదీన్‌ను పొగడి వారిని తక్కువ చేయలేడు. తక్కువ చేసి వాళ్ల రాజ్యంలో బతకలేడు. కాబట్టి జైనులాబిదీన్ నిష్క్రమణ గురించి ఆకాశంలో కనబడితే, నూతన రాజు ఆగమనం గురించి కూడా ఆకాశంలో సూచన కనబడాల్సిందే. కనబడింది.
అత్రాన్తరే మహాఘోరమనావృష్టికృతం భయమ్।
ఉదభూదక్యదేశేషు దుర్భిక్షోపద్రవావహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 19)
ఇతర దేశాలలో భయంకరమైన, ఘోరమైన దుర్భిక్ష ఉపద్రవాలు, ఘోర అనావృష్టి సంభవించింది.
క్రీ.శ 1469 ప్రాంతాలలో మధ్య ఆసియా, తుర్కిస్తాన్ వంటి ప్రాంతాలలో ఘోరమైన కరువుకాటకాలు సంభవించాయి. ప్రపంచ చరిత్రను గమనిస్తే 1508-1574 నడుమ రష్యా, యుక్రెయిన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కరువు కాటకాలతో బాధపడటమే కాదు, ప్లేగు వ్యాధులతో ప్రజలు పెద్ద సంఖ్యలో మరణించటం కనిపిస్తుంది. పంటలు నష్టమవటంతో, తినటానికి తిండి లేక ఆకలి చావులు సంభవించాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ‘తిండి’ని వెతుకుతూ తమ ప్రాంతాలను వదలి వలస పోయారు.
శ్రీవరుడు ప్రస్తావిస్తున్నది ఆ కరువు కాటకాల సమయాన్నే.
భిక్షుకానన్య దేశీయాన్ ప్రేతరూపాని వాగతాన్।
దృష్ట్వా పృచ్ఛన్నృపస్తే చ వార్తాం తస్యాభృవన్నిమామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 20)
ఏయే దేశాలు కరువు కాటకాలతో సతమతమవుతున్నాయో, ఆయా దేశాల నుంచి వచ్చినవారు ప్రేతాల్లా ఉన్నారు. వారిని చూసి రాజు వారి పరిస్థితులు అడిగాడు. వారు సమాధానం ఇచ్చారు.
రాజన్ దేశేష్వనేకేషు వృష్టచభావాత్ సమన్తతః।
సర్వాన్తక్రుత కాల ఇవ దుష్కాలః సముపస్థితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 21)
ఓ రాజా! అన్ని దేశాలలో, అన్ని దిక్కులలో వర్షాలు పడకపోవటం వల్ల కరువు కాటకాలు సంభవించాయి. సృష్టి అంత్యకాలం సమీపించినట్టనిపిస్తుంది.
దుర్భిక్షేణ ప్రభవతా మణీనాం సా మహర్ధాతా।
నీతా నీచేన సాధూనామివ సర్వోపయోగినామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 22)
నీచుల సాంగత్యంతో అందరికీ ఉపయోగపడే నిధులు నిరుపయోగం అయినట్టు విలువైన వజ్రాలు కూడా దుర్భిక్షం వల్ల తమ విలువను కోల్పోయాయి.
ఇప్పుడు అర్థమవుతుంది శ్రీవరుడు ఎందకని జైనులాబిదీన్ దానాలను, ముఖ్యంగా, ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేయటాన్ని అంతగా వర్ణించాడో!
భుంజతే శ్వాదయో న్యోన్యపిషిఇతం క్షుదుపదృతాః।
తత్తచ్ఛూన్యో గృహాన్తః స్థానిః శోషిత శవవ్రజాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 23)
క్షుద్భాధ భరించలేని శునకాలు, శూన్య గృహాలు మాత్రమే మిగిలాయి. ఆకలి బాధకు తాళలేక కుక్కలు శవాలను పీక్కుతిన్నాయి. శవాలయి పోయిన తరువాత ఒకదానినొకటి పీక్కు తింటున్నాయి కుక్కలు.
గతంలోనూ శ్రీవరుడు ఒక కరవు కాటకాల పరిస్థితిని ఘోరంగా వర్ణించాడు. ఇప్పుడు ఆ వర్ణన కన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళి బీభత్సానికే భయం పుట్టేలా వర్ణిస్తున్నాడు.
ఆకలికి తాళలేని కుక్కలు శవాలను పీక్కుతినటం, మనిషిని మనిషి పీక్కుతినటం గురించి చదివేము. కానీ ఆకలికి తాళలేక కుక్కలను కుక్కలే పీక్కుతినటం శ్రీవరుడి దగ్గరే ప్రథమంగా వినటం.
స్పృష్టోచ్ఛిశుతయా దృష్టప్రాయశ్చిత్తాదినిష్టితాః।
క్షుదాద్విజవరా దేవ ప్రయాతాః సర్వభక్ష్యతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 24)
ఓ రాజా! ఒకప్పుడు ఇతరుల స్పర్శ వల్ల కానీ, ఎంగిలి కానీ తాకినవి తినవలసి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకునే ద్విజ శ్రేష్ఠులు ఇప్పుడు సర్వభక్షులు అయిపోయారు.
నిజానికి ఏది తినాలి, ఏది తినవద్దు అన్న చర్చలు ప్రాణం మీదకు వచ్చినప్పడు వ్యర్థం. ఏది దొరికితే అది తిని ప్రాణం నిలుపుకోవాల్సిందే.
ఉపనిషత్తులలో కూడా ఒక కథ ఉంటుంది. ప్రాణం కాపాడుకునేందుకు ఒక బ్రాహ్మణుడు మాంసం తింటాడు. కానీ నీళ్లు తాగడు. ప్రాణం నిలిచింది. కాబట్టి నీళ్లు తాగకూడనివి అవుతాయి. అంటే, ప్రాణం నిలుపుకోవటం మనిషి కర్తవ్యం. ప్రాణం నిలిచిన తరువాతనే మిగలినవి. ఇప్పుడు కరవుకాటకాల వల్ల తిండి దొరకమే కష్టంగా ఉంది. కాబట్టి ఎవరు తాకారు, అది ఉచ్చిష్టమా అన్నది అనవసరం. తినటం, ప్రాణాలు కాపాడుకోవటాన్ని మించి ఇంకేమీ లేదు.
క్వాపి విప్రస్త్రియస్తత్తదభక్ష్యవీక్షణాక్షమాః।
పక్వాన్నం సవిషం భుక్త్యా స్వమన్యాశ్చ వ్యసూన్ వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 25)
అక్కడ అక్కడ తినగా మిగిలిన అహార పదార్థాలను చూసి ఆకలి తాళలేక తాము తిని, ఇతరులకు పెట్టిన స్త్రీలు, ఆ విషాన్న ప్రభావంతో తాము ప్రాణాలు కోల్పోయారు. ఇతరుల ప్రాణాలు తీశారు.
దీన్ని కొందరు ఆంగ్లంలోకి మరో రకంగా అనువదించారు.
ఏది స్వీకరించాలో, ఏది స్వీకరించకూడదో తెలిసిన బ్రాహ్మణ స్త్రీలు, విషాహారం తిని ప్రాణాలు పోగొట్టుకున్నారు. విషాహారం పెట్టి ఇతరుల ప్రాణాలు తీశారు.
రెండు అనువాదాలలో ఎంత తేడా ఉంది!
ఒక అనువాదం ప్రకారం తినే పదార్థం చూసి, విషాన్నం తిని తాము ప్రాణాలు కోల్పోయారనిపిస్తే, ఇంకో అనువాదంలో విషాన్నం పెట్టి చంపారు, తాము ఆత్మహత్య చేసుకున్నారన్న అర్థం వస్తోంది.
దీనికన్నా ముందరి శ్లోకాలను గమనిస్తే మొదటి అనువాదం వైపే మనసు మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే, ఎవరు తాకారు, అది ఉచ్ఛిష్టమా? కాదా? అని ఆలోచించకుండా సర్వభక్షకులయ్యారు మనుషులు. కాబట్టి వారేది దొరికితే ఆత్రంగా తినటం, తమ వారికి పెట్టటం తప్ప మరో ఆలోచన రాకపోవటం, ఒకవేళ ఆ తిన్నది విషాహారం అయితే ప్రాణాలు కోల్పోవటం సంభవించింది తప్ప, కావాలని విషాహారం తిని చావటం, పెట్టి చంపటం సమంజసం అనిపించదు.
అవృష్టయా వసతిం త్యక్త్వా గతే క్యాపి మృతే జనే।
శూన్యా కేన పురగ్రామా దృష్టా రాజన్ పదే పదే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 26)
కరవు వల్ల ప్రజలు తమ ఇళ్ళు వాకిళ్ళు వదలి పోవటం వల్ల, లేక, మరణించటం వల్ల, రాజా!, అదుగడుగున , ఎటుచూసినా, శూన్య గృహాలు, శూన్య గ్రామాలు కనిపిస్తున్నాయి.
ప్రీతిం స్నేహం చ దాక్షిణ్యం పత్న్యాం పుత్రే పితర్యపి।
కుక్షింభరిః క్షుదుత్తప్తో విస్మరత్య వనౌ జనః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 27)
ఆకలి వల్ల ప్రజలు స్నేహం, జాలి వంటివి మరచిపోయారు. భార్య పై ప్రేమ, సంతానం పై ప్రేమ, తండ్రి పై ప్రేమ వంటివి అన్నీ మరచిపోయారు.
ఖురసన వనీశక్రం విక్రాన్త్యా శత్రుభూమిగమ్।
అన్నాభావాద్ భవన్మిత్రమభిషేణేన నిర్గతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 28)
మేర్జాభోసైదనామానాం సురత్రాణం రణాన్తరాత్।
ఇరాక భూపతిర్బద్ధ వావధీత్ కోటిబలాన్వితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 29)
తస్య దుర్యోధనస్యేవ బద్ధస్య హరణక్షణే।
అభూత్ సంఖ్యాన్తరే సంఖ్యా తురుష్కనృపతిక్షయః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 30)
ఖురసాన్ భూములకు ఇంద్రుడి లాంటివాడు, మీ మిత్రుడు, ఆహార లేమి వల్ల సైనికులతో శత్రు భూమిలోకి వెళ్లిపోయాడు. సుల్తాన్ అభౌసైద్ పేరున్న ఆ సుల్తాన్‌ను, కోటి సైనికులను రణభూమిలో ఓడించి, బంధించి చంపేశాడు ఇరాక్ సుల్తాన్. దుర్యోధనుడిలా అతడ్ని బంధిస్తున్న సమయంలో యుద్ధ సమయంలో అనేక తరుష్కులు, రాజులు మరణించారు.
ఈ మూడు శ్లోకాలు మధ్య ఆసియా చరిత్రను ప్రదర్శిస్తాయి. 1469లో ఖరుసాన్ సుల్తాన్ యుద్ధంలో మరణించాడు. ఈ శ్లోకాల వల్ల, ఆయన ఆకలికి తాళలేక పొరుగు శత్రురాజ్యం పై దాడికి వెళ్లాడని తెలుస్తుంది. అతి భయంకరమైన పరిస్థితి. దేశంలో తిండి లేక పొరుగు దేశంపై తిండి కోసం యుద్ధానికి వెళ్లటం. ఈ సమయంలో హేరత్ అదికారి హసన్ వైవార్ స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు.
‘అభోసైద్ అజూమేద్’ అనే సుల్తాన్‌ను తుర్కమన్ సుల్తాన్ హసన్ బేగ్ యుద్ధంలో ఓడించి చంపాడు.
దేశీషూద్ భుతదుష్కాల బలాబల పర్యయాత్।
అన్యోన్య నృపయుద్ధేన విఘ్నో దేవ పదే పదే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 31)
ఓ రాజు! 11 దేశాలలో కరువు పరిస్థితుల వల్ల బలహీనులు ప్రాణాలు కోల్పోయారు. రాజుల నడుమ పోరు వల్ల అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
సుఖప్రదం భవద్దేశం శృత్వాన్నది సమృద్ధిభిః।
ఆగతాంస్త తీక్షమాపాల రక్షాస్మాన్ విక్షతాన్ క్షుదా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 32)
ఓ రాజా! నీ దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉన్నదని తెలిసి, ఆకలితో అలమటిస్తూ నీ రాజ్యనికి వచ్చాము. ఓ రాజా! మమ్మల్ని రక్షించు.
ఇదంతా జైనులాబిదీన్‍కు – ప్రాణాలు అరచేత పట్టుకుని, క్షుద్భాతతో తమ నివాస స్థలాలు వదలి కశ్మీరుకు వచ్చిన అభ్యాగతులు వర్ణించి చెప్పిన కరువు పరిస్థితులు. దోచుకోవాలన్నా భారతదేశం కావాలి. రాజ్యం చేసేందుకు భారతదేశం కావాలి. వ్యాపారానికి భారతదేశం కావాలి. చివరికి కరువు కాటకాలు వచ్చినా ఆహరం కావాలంటే భారతదేశం రావాలి.జ్ఞానంకావాలన్నా భారతదేశం కావాలి. ఇలా ఎన్నేళ్లుగా, ఎందరెందరో, ఎన్నెన్ని రకాలుగా దోచుకుంటూ, అవసరమైనప్పుడు భారతదేశంపై ఆధారపడుతూ, మళ్లీ దోచుకుంటుంటే ఈ స్థితికి వచ్చాము మనం. తురుష్కులు ఎంతగా దోచుకుని, సంపద తరలించుకుపోయినా, బ్రిటీష్ వారికీ అంత కన్నా ఎక్కువ సంపద దోచుకునెందుకు లభించింది. ఇప్పటికీ భారత్‌ని దోచుకుని, తమ దేశాన్ని ‘గొప్ప దేశం’గా ఎదిగించాలని ప్రపంచ రాజ్యాలు పోటీపడుతూనే ఉన్నాయి. తేడా అల్లా, ఇప్పుడు భారతదేశం ఇతరుల దోపిడీని ఆమోదించేంత బలహీనం కాదు.
శృత్వేతి వార్తామార్తాం తాం జానన్నివ నిజాం ప్రజామ్।
ద్రవ్యకోటిం దదౌ రాజా తదర్థే కరుణాకులః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 33)
వారి జాలి గొలిపే గాథలు విన్న రాజు, తన స్వంత రాజ్య ప్రజలకు అలాంటి కష్టం వచ్చినంతగా కదలిపోయాడు. జాలితో, ఆయన వారికి కోటి కోటి ద్రవ్యాలు దానం చేశాడు. వారి ఆకలి తీర్చాడన్న మాట. అదీ జైనులాబిదీన్ అంటే! ఇలాంటి సుల్తాన్ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఇక రాడు కూడా. ప్రపంచంలో ఒకే ఒక జైనులాబిదీన్!
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
