Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-90

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

స్వస్తివాదధ్వనిం శృత్వా సవాహ్యాభ్యాన్తరా జనాః।
ద్వితీయేన్దుభివాద్రాక్షుః సానన్దా దర్శనాగతాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 188)

స్వస్తివాద శబ్దం విని లోపలా బయటా ఉన్న ప్రజలందరూ రాజును చంద్రుడిని చూసేందుకు  తహతహలాడినట్లు ఆనందంగా దర్శించారు.

శృత్వా బహామఖానోథ చక్రితోన్తికమాగతః।
గత్వరం లక్షణైర్జ్ఞాత్వా భూప భ్రాతేత్రవీదితి॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 189)

ఈ శబ్దాలు విని బహ్రమ్ ఖాన్ రాజు దగ్గరకు వచ్చి చూశాడు. లక్షణాలను బట్టి రాజు మరణ సమయం ఆసన్నమయందని గ్రహించాడు. సోదరుడితో ఇలా అన్నాడు.

జీవత్యస్మత్పితా నైవ మిథ్యైవోత్థాప్యతే విట్టః।
ద్వారాగ్రాత్ పతితో భూమీ మూకప్రాయో విచేతనః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 190)

మన తండ్రిగారు ద్వారం వద్ద పడిపోయారు. మాట్లాడలేకపోతున్నారు. చైతన్యం రహితంగా ఉన్నారు. ఆయన మరణించారు కానీ ఇంకా జీవితుడయి ఉన్నట్టు భ్రమ కలిగిస్తున్నారు.

తదుత్తిష్ఠ వయం యామః ససంనాహా నృపాంగనమ్।
హరామస్తత్తురంగాది బద్ధ్వా దుష్టాంశ్చ మన్త్రిణః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 191)

కాబట్టి వెంటనే మనం రాజు ప్రాంగణానికి వెళ్లి దుష్ట మంత్రులను బంధిద్దాం. వారి అశ్వాలను హస్తగతం చేసుకుందాం.

తండ్రి మరణశయ్యపై ఉన్నాడన్న బాధ లేదు. మరణించాడన్న ఆలోచన లేదు. తండ్రి మరణించినా జీవితుడయి ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్న మంత్రులను బంధించి వారి అశ్వాలు (ఆయుధాలు) స్వాధీనం చేసుకోవాలన్న ఆత్రం అధికం. అంటే పోయిన తండ్రి ఎలాగో పోయాడు. రాజ్యం చేజారిపోనీయకుండా కాపాడుకోవాలన్న ఆత్రం అధికంగా కనిపిస్తోంది. పాపం జైనులాబిదీన్! ఇది కేవలం జైనులాబిదీన్ పరిస్థితి మాత్రమే కాదు. అవసరానికి మించి ధనం, అధికారం కలవారందరి పరిస్థితి. వారి మరణం గురించి బాధ పడేకన్నా, వారి తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకోవటంపై, తమకు కాని వారి చేతికి అధికారం దక్కకూడదన్న ఆరాటంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది.

నౌసేతుబన్ధం ఛేత్స్యామస్తేన నశ్యతి తేగ్రజః।
శృత్వేతి సోభ్యధాన్నైవం వక్తుం యుక్తం మమాగ్రతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 192)

స్వప్నేయనిష్ఠం యస్యాహ నేచ్ఛామి స్వామినః పితుః।
తచ్ఛ్రుత్యేకాం నిశాం యావత్ తదగ్రే స్యోయచ్ఛుచా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 193)

“నగరాన్ని బయట ప్రపంచంతో కలిపే వంతెనను ధ్వంసం చేద్దాం. దాంతో పెద్దన్న నష్టపోతాడు. దెబ్బతింటాడు” అన్నాడు. ఈ మాటలు విన్న హజీఖాన్ “నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కలలో కూడా నా తండ్రికి హాని కలగాలని నేను కోరుకోను” అంటూ చింతలో రాత్రి గడిపాడు.

తావన్ముమూర్షుం తం శృత్వా పితృరాజ్యజిహీర్షయా।
ఆదమఖానః శ్రీజైననగర సబలోభ్యగాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 194)

తండ్రి మరణ వార్త విన్న ఆదమ్ ఖాన్ సైన్యంతో జైననగరం బయలు దేరాడు. సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునే ఉద్దేశంతో..

భటసంనాహమామగ్రీం ప్రాపథ్య పథి గోషితామ్।
వసత్ స నిశామేకాం రాజధాన్యన్తరాలయే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 195)

భటుల అయుధాలను రహస్యంగా దాచి, ఆయన ఓ రాజు రాత్రి రాజధానిలో రహస్యంగా గడిపాడు.

తావద్భస్సనకోశేశః స్వార్థాన్ధో మోహయన్ పరాన్।
గృహీతదివ్యః శ్రీహాజ్యఖానపక్షం సమాశ్రయత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 196)

ఇంతలో, కోశాధికారి హస్సానా, స్వార్ధంతో హ్యాజీఖాన్‌కు మద్దతు ప్రకటిస్తూ అతని శరణు వేడాడు.

తన సంతానంలో రాజ్యార్హత ఎవ్వరికీ లేదని, వారిలో వారు తన్నుకుని గెలిచిన వాడిని రాజవ్వమని జైనులాబిదీన్ నిర్లిప్తంగా ఉడిపోవటం వల్ల అతని మరణం కన్నా ముందే  కశ్మీరుకు ఒక  ‘రాజు’ అన్నవాడు లేని అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. ఎవరు రాజు అవుతారో తెలియదు. ఎవరు అధికారాన్ని దక్కించుకుంటారో తెలియదు. దాంతో ప్రతి ఒక్కరూ తమ అదృష్టంతో జూదం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి అడుగు హస్సాను (హుస్సేను) హ్యాజీఖాన్ వేపు వేశాడు.

అథ నిష్కాసితోన్యేద్యుః సచివైః సబలోగ్రజః।
కుద్మదీనపురం గత్వాం ధియా భాగ్యశ్రియోజ్ఝితః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 197)

మరుసటి రోజు సుల్తాన్ పెద్ద కొడుకు (ఆదమ్ ఖాన్) మంత్రుల సలహాను అనుసరించి సైన్యంతో కుద్మదీనపురం చేరాడు. కానీ అక్కడ అతడి అదృష్టం అతడిని విడిచి వెళ్లిపోయింది.

జ్యేష్ఠోప్యభూత్ కుశలధీరపి భృత్యయుక్తః।
శూరోప్యనన్యసదృశోద్యమధైర్యయుక్తః
ప్రాప్తే క్షణే కిమపి సాధు న కర్మ కుర్యాత్
పుణ్యైర్వినా న హి భవన్తి సమీహితార్థాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 198)

కుశల బుద్ధి కలవారైన మంత్రులు వెంట ఉన్నా, శూరుడు, ధైర్యవంతుడు అయి, రాజు సంతానంలో పెద్దవాడయి కూడా, సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టకపోవటంతో రాజ్యానికి దూరమయ్యాడు. పుణ్యం లేని వాడు ఎంత ఆశ పడ్డా, నిరాశను పొందాల్సిందే.

స చేతన్నిశి ఇత్యైకమహరిష్యత్ తురంగమాన।
అలభిప్యద్ ధ్రువం రాజ్యం బుద్ధిః కర్మానుమారిణీ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 199)

ఆ రోజు రాత్రి అతడు (ఆదమ్ ఖాన్) ఒకరిని చంపి అశ్వాలను అధీనం చేసుకుని ఉంటే రాజ్యాధికారం అతని వశమయ్యేది. కానీ, బుద్ధిః కర్మానుసారిణీ అంటారు.

అత్రాంతరే హాజ్యఖానః కోశేశానుజచోదితః।
రాజఘాన్యంగనం గత్వా తురుగద్య హరత్ పితుః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 200)

ఈ సమయంలో కోశాధికారి, చిన్న సోదరుల ప్రోద్బలంతో హ్యాజీఖాన్ రాజభవనంలోకి వెళ్లాడు. రాజు ఆశ్వాలను తన అధీనంలోకి తీసుకున్నాడు.

యద్వార్తయా వినిర్ధైర్యా యే భవన సుతసేవకాః।
వివిశుస్తే ససంనాహాః సమదాః కాలపర్యయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 201)

ఈ వార్త తెలియటంతోటే ధైర్యరహితులయిన సుతుడు, సేవకులు, వారు మారిన పరిస్థితులననుసరించి రాజభవనంలోకి ప్రవేశించారు.

అభిమన్యుప్రతీహారముఖా నిశ్యా యద బృహవన్।
తదుత్పిన్జే తత్ఫలం తెరచిరేణానుభూయతే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 202)

భవనంలోకి అడుగుపెట్టిన వారిని అభిమన్యు ప్రతిహరి,  ఇతరులు దూషించారు. కానీ తరువాత జరిగిన అల్లకల్లోలంలో వారు దానికి తగిన ప్రతిఫలం అనుభవించారు.

తద్దినే హాజ్యఖానః స సబలో బహిరాస్థితః।
నాశకజ్జనకం దృష్టుం సోత్కోపి ద్రోహశంకయా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 203)

ఆ రాత్రంతా హ్యాజీఖాన్ రాజభవనం బయటే ఉండిపోయాడు. విప్లవం చెలరేగుతుందన్న భయంతో తండ్రిని దర్శించలేకపోయాడు.

తద్వార్తాకర్ణనాద్భీతో నిరాశః సపరిచ్ఛదః।
ఆదమ్‌ఖానో విత్రాణో విషులాటాధ్వనా యయౌ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 204)

ఈ వార్త వింటూనే నిరాశకు గురయి, భయంతో ఆదమ్ ఖాన్ అనుచరులతో సహా విషులాట మార్గం గుండా వెళ్లిపోయాడు.

బనిహల్ వద్ద ‘విషులాట’ ప్రాంతం ఉందని భావిస్తున్నారు. బనిహల్ ప్రాంతం గుండా వెళ్లిపోయాడు ఆదమ్ ఖాన్.

స తారాబలమార్గేణ గచ్ఛన్నిజజనావృతః।
అన్యాగతానుజభ్రాతృ వీరలోకక్షయం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 205)

ఆదమ్ ఖాన్ తారబల మార్గం గుండా వెళ్తూంటే, అతని చిన్న సోదరుడు సైన్యంతో అతడిని వెంబడించి అతని సైనికులను చంపాడు.

అభిమన్యు ప్రతీహారముఖ్యాః శౌర్యమమానుషమ్।
దృష్ట్వైవాదమఖానస్య సాన్వర్థాభిఘమూచిరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 206)

అభిమన్యు, ప్రతీహార ప్రముఖులు ఆదమ్ ఖాన్ అమానవీయ శౌర్యాన్ని దర్శించి, అతడిని సార్థక నామధేయుడిగా భావించారు.

యావాన్ సుయ్యపురే తేన కృతో లోకక్షయః కృధా।
తావానేవ కృతస్తత్ర సఙ్కటే గిరిగహ్వరే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 207)

ఆ యుద్ధంలో అతడు చంపిన సైనికుల శవాల గుట్టలతో గుహలు నిండేయి. ఇది సుయ్యపురంలో అతడు సృష్టంచిన మారణహోమాన్ని తలపింపచేసింది.

తావద్యస్మఖానోపి రాజపుత్రో గుణోజ్జ్వలః।
తూర్ణం పర్ణోత్స ముల్లుంఖ్య కశ్మీరాన్తరమాయయౌ॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 208)

ఈ సమయంలో అనేక ఉత్తమ గుణాలతో విరాజిల్లే హసన్ ఖాన్ పర్ణోత్స దాటి కశ్మీరుకు సమీపంగా వచ్చాడు.

గ్రీష్మోప్మశోపితతనుర్విరసశ్చిరం య-
ఇచ్ఛాయోజ్ఝితో మరుతరుః పథికైర్నిరస్తః।
వర్షాప్త సేకమహిమా జనతాపశాన్తయే
సేవ్యః స ఏవ వత పత్రవిచిత్రశోభః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 209)

సదృశైవావహన్మధ్యే యా ద్వయోస్తయోరివ।
ఏకపారఖగతా సర్వా తదాభూద్రాజ్యనిమ్నగా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 210)

గ్రీష్మ ఋతువులో నీరు లేని భూమిపై వేడికి ఎండిన వృక్షం రసహీనమై, నీడను కూడా ఇవ్వలేదు.  ప్రయాణీకులు నీడ కోసం దాని వైపు కూడా చూడరు. కానీ దానికి నీరు అందితే వర్షాకాలంలో అది పూలు పూస్తుంది. మనుషులకు నీడను ఇచ్చి వేడి నుంచి చల్లదనం ఇస్తుంది. అందరూ ఆనందిస్తారు.

ఒక నది రెండు వైపుల ఒడ్డున ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది. అలాంటి రాజ్యం ఇప్పుడు ఒకరికే అందేట్టుగా మారింది.

ఇత్థం భ్రాతృద్వయస్థిత్యా విజయావజయక్రమః।
అన్యథా కల్పితః సర్వేరన్యథాభూద్విధైర్వవాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 211)

ఇద్దరు సోదరుల ప్రవర్తన వల్ల, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలెవరూ ఊహించని విధంగా విధి జయపజయాలను నిర్ణయించింది.

పుత్రః స్యాన్ను కతి శోచతి పితా జాతేతిహర్షాకుల –
స్వదృవృద్ధ్యై యవతేఽన్వహం విధిద్యతైశ్చిన్తాస్తఢీయా వహన్।
వృద్ధో విఘ్నమివ స్వకం స జనకం జానాతి లోభాన్విత –
స్వద్విత్తాప్తిఘియా మరిష్యతి కద్రేత్యన్తః సదా చిన్తయన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 212)

తమకు పుత్రుడు కలగాలని వాంఛించనిది ఎవరు? తమకు కొడుకు కలిగినప్పుడు సంతోషించనిది ఎవరు? అతని భవిష్యత్తు గురించి ఆందోళన చెందనిదెవరు? ఎలాగోలా పుత్రుడికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని తపించనిది ఎవరు? కానీ, అదే కొడుకు పెద్దవాడయిన తరువాత తన స్వార్థంతో తండ్రి ఆస్తి కోసం ఆశపడతాడు. ఎంతగా అంటే, తండ్రి ఎప్పుడు మరణిస్తాడోనని ఎదురు చూస్తాడు. తన ఆనందానికి తండ్రిని పెద్ద ప్రతిబధకంగా భావిస్తాడు.

అస్మిన్నవసరే రాజా కియద్భిః సేవకైర్వృతః।
శ్రుతమశ్రు తచత్ కర్తు మ నిశ్చిన్త ఇవాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 213)

తను మరణించాడనుకుని, రాజ్యాధికారం కోసం సంభవిస్తున్న సంఘర్షణల వార్తలు విని కూడా రాజు విననట్టు ఉన్నాడు.

దర్శితాస్వాస్థ్యవాగ్బన్ధస్త్యక్తపేయాద్యుపక్రమః।
నృపేంద్రో విరుచిః క్షీణకలచన్ద్ర ఇవాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 214)

అనారోగ్యం కారణంగా బలహీనుడవటం వల్ల అతడు మాట్లాడలేక పోతున్నాడని, రాజుకు వినికిడి పోయిందని తెలుస్తోంది. రాజు అందం నశించింది.  అమావాస్యకు ముందరి రోజు చంద్రుడిలా క్షీణదశలో ఉన్నాడు. చివరి దశలో ఉన్నాడు.

ప్రజాభాగ్యవిపర్యాసాత్ సర్వాయాసాయ విచ్ఛవిః।
కల్పాన్తరనివమోస్త గన్తు ప్రావతతాతుర॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 215)

ప్రజల దౌర్భాగ్యం వల్ల, సకల జనుల దుర్దశ వల్ల శక్తహీనుడై రాజు కల్పాంతరంలోని సూర్యుడి లాగా ఉన్నాడు.

కల్పాంతరంలో సర్వం నాశనం అయిపోతుంది. కల్పాంతరం అంటే బ్రహ్మకు ఒక రోజు. అంటే మహా ప్రళయం అన్న మాట. సూర్యుడు భూమిని ముంచెత్తుతాడు. మహా ప్రళయం వచ్చి భూమిని జలమయం చేస్తుంది. సూర్యుడి వేడి చల్లారిపోతుంది. ప్రళయకాలం నాటి సూర్యుడి స్థితి అది.

వైజ్ఞానికంగా కూడా చివరి దశలో సూర్యుడు సౌరకుటుంబాన్ని మింగేస్తాడు. ఆ తరువాత చల్లబడి ‘White Dwarf’ లా మిగిలి పోతాడు.

జైనులాబిదీన్ మరణానికి అతి చేరువలో ఉన్నాడని సూచించేందుకు కల్పాంతరంలో సూర్యుడిలా ఉన్నాడంటున్నాడు శ్రీవరుడు. నిజంగానే జైనులాబిదీన్ తరువాత ప్రళయం వచ్చినట్టే ఉక్కిరిబిక్కిరయింది కశ్మీరం. ఆ తరువాత నూతన సృష్టిలా సంపూర్ణంగా రూపాంతరం చెందింది. గతాన్ని మరచిపోయింది. రాజతరంగిణిలు లేకపోతే, కశ్మీరు ప్రాచీన చరిత్ర ప్రళయంలో మునిగిన విశ్వంలా అదృశ్యం అయి ఉండేది.

(ఇంకా ఉంది)

Exit mobile version