Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-91

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సప్తమః సర్గః

కంపితౌష్టపుట జ్ఞాతమన్త్రపాఠః కవేద్దినే।
ద్వాదశ్యాం జ్యేష్ఠమాసాస్య మధ్యాహ్నే జీవిత జహో॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 216)

కంపిస్తున్న పెదిమలు  రాజు చివరి దశలో ప్రార్థిస్తున్నాడని సూచిస్తున్నాయి. అలా ప్రార్ధిస్తూ జ్యేష్ఠమాసం శుక్రవారం ద్వాదశి తిథి నాడు మధ్యాహ్నం సమయంలో రాజు మరణించాడు.

మరణ సమయంలో జైనులాబిదీన్ పెదిమలు కదలుతున్నాయి, అతను ప్రార్థన చేస్తున్నాడని శ్రీవరుడు వ్రాశాడు.

మరణం తప్పనిసరి అని తెలిసినప్పుడు ముస్లింలలో, కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ మరణం ఆసన్నమయిన మనిషి చుట్టూ చేరతారు. మరణానికి సిద్ధంగా ఉన్న మనిషిని ‘షహదహ’ వల్లె వేయమని ప్రోత్సహిస్తారు. ‘దేవుడిని మించి ప్రార్థించదగ్గది ఏమీ లేదు. మహమ్మదు ప్రవక్త ఒక్కడే నిజమైన దేవదూత’ అన్నది వల్లె వేస్తూండాలి. చుట్టూ ఉన్న వారంతా ‘మేము అల్లాహ్‍కు చెందిన వారం. అల్లా వద్దకే తిరిగి వెళ్తాము’ అని ప్రార్థిస్తుంటారు. జైనులాబిదీన్ చివరి క్షణాలలో ‘షహదహ’నే వల్లె వేస్తూండి ఉండాలి. దాన్నే వర్ణించాడు శ్రీవరుడు.

ఈ వర్ణన జైనులాబిదీన్ అవసాన దశలోనే కాదు, చివరి క్షణం వరకూ శ్రీవరుడు జైనులాబిదీన్ తోనే ఉన్నడన్న విషయాన్ని ఎత్తి చూపిస్తుంది.

ఒకసారి మనం శ్రీవరుడి స్థానంలో ఉండి ఆలోచిస్తే, శ్రీవరుడి మనస్సులో చెలరేగుతున్న ఆందోళనలు, భయాలు, భవిష్యత్తుపై సందేహాలు ఊహించడం కష్టం కాదు. భవిష్యత్తులో జరిగిన సంఘటనలు శ్రీవరుడి భయాలు నిజానికి ఎంత దగ్గరగా ఉన్నాయో నిరూపిస్తాయి.

ప్రాణప్రయాణ సమయే నృపతిః స మయేక్షితః।
సర్వాంగ నిర్యత్సౌభాగ్యభాగ్యాత్పతముఖచ్ఛవిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 217)

ప్రాణం రాజును వదలి వెళ్ళే సమయంలో నేను చూశాను. అతని ముఖం నుండి వెలువడుతున్న కాంతిలో అతని సర్వ సౌభాగ్య సమృద్ధి ఉంది.

అంటే రాజు శరీరాన్ని ప్రాణం విడిచి వెళ్లడం శ్రీవరుడు చూశాడు.

జానే తద్బదనే లక్ష్మీసదనే స్వేదసంతతిః।
నిర్యద్భాగ్య తరంగిణ్యాః ప్రవాహః ఇవ దిద్యుతే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 218)

అతని వదనం నుండి బహిర్గతమవుతున్న స్వేదం లక్ష్మీ సదనం, వినిర్గమిస్తున్న భాగ్య ప్రవాహ తరంగిణిలా శోభిస్తోంది.

తజ్జీవరత్న హరిణాజ్జాత భీతిరివ ధృవమ్।
ప్రాణవాయుర్హవన్నాయుః క్షణం తూర్ణగతిం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 219)

అతని జీవరత్నాన్ని దొంగిలించిన భయంలో పరుగు పెట్టినట్టు ప్రాణ వాయువుని వెంటతీసుకువెళ్తున్న వాయువు గతి వేగవంతమయింది.

జైనులాబిదీన్ అంతిమ క్షణాలను శ్రీవరుడు వర్ణించటం చూస్తే, ఆ సంఘటనను, ఆయన ఎంత సూక్ష్మంగా గమనించాడన్న విషయమే కాదు, ఆ ఘటన అతడిపై ఎంతగా ప్రభావం చూపిందో అర్థం అవుతుంది. అతని మస్తిష్కంలో ఆ సంఘటన ముద్రితమైపోయింది. మనోయవనికపై ఆ చివరి క్షణాలు సజీవంగా నిలిచిపోయాయి.

మరణ సమయంలో వ్యక్తి వాయువు కోసం తపిస్తాడు. అందీ అందనట్టుండే వాయువు, వదలలేక వదలేక వదిలి వెళ్లే ప్రాణం తపనను సూచిస్తుంది.శ్వాస దీర్ఘతమవుతుంది. వేగవంతమవుతుంది. అలా వేగవంతమవుతూ ఊర్థ్వ(ఎగ) శ్వాస తీసుకుకూంటాడు వ్యక్తి. అప్పుడు శరీరంలోంచి బహిర్గతమయ్యే వాయువు పైకి వచ్చి గొంతు వద్ద ప్రాణంతో కలసి బయలు వెడలుతుంది. అందుకే మరణ సమయంలో ఊర్థ్వ శ్వాస మరణం దగ్గర పడిందనటాన్ని సూచిస్తుంది. ఆ అంతిమ క్షణాలను వర్ణిస్తున్నాడు శ్రీవరుడు. తుఫాను గాలికి రెపరెప లాడుతూ ఆరిపోయే దీపాన్ని వర్ణించినట్టు వర్ణిస్తున్నాడు.

ప్రాణాన్తే విగలత్యూర్యసోమనేత్రజలచ్ఛలాత్।
నిరగాన్నదదేవస్య ప్రజాస్నేహరసో ధృవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 220)

ప్రాణం విడిచి వెళ్లిన తరువాత, సూర్యచంద్రుల్లాంటి కళ్లు కరిగి, ప్రజలపై అతని స్నేహరసం ప్రవహిస్తున్నట్టు కంటి నుండి నీరు కారుతూనే ఉంది.

శ్రీవరుడి వర్ణన చదువుతుంటే కళ్ల ముందు దృశ్యం కనిపిస్తున్నది. ఆ దృశ్యంలో కవి హృదయం కరుణరసంలా కరిగి ప్రవహిస్తోంది.

చివరి దశలో తన తరువాత రాజ్యం ఏమవుతుందో, ప్రజల జీవితాలు ఎంతగా అల్లకల్లోలమౌతాయోనని జైనులాబిదీన్  బాధ పడ్డాడు. ఇప్పుడతడు మరణించాడు. ఎవరెన్ని బాదలు పడ్డా ఏమీ చేయలేడు. కష్టాలలో ఆదుకోలేడు. ప్రజల పట్ల అతని ప్రేమ, స్నేహ భావనలు అతని కంట కారే నీరయి ప్రవహిస్తున్నదంటున్నాడు. అతని ఒక కన్ను సూర్యుడు, మరో కన్ను చంద్రుడు. సూర్యచంద్రులు నిత్యం జగతిని కాపలా కాస్తుంటారు. జగతి గతికి సాక్షులు  వారు. ప్రాణం పోవటమంటే కళ్లల్లోని కాంతి పోవటమే. అంటే, కళ్లలోని సూర్యచంద్రులు కరిగిపోవటమే. కంటి నుండి కారే నీటిని, కరిగిపోయిన సూర్యచంద్రుల ప్రవాహమని, అది ప్రజల పట్ల ప్రేమ ప్రవాహమని వర్ణించటం పరమాద్భుతం.

ఇక్కడే సృజనాత్మక కవులు, రచయితల గురించి ఓ ఆంగ్ల కవి అన్న మాటలు ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో కవులు, రచయితలంత దౌర్భాగ్యులు మరొకరు లేరట. ఎందుకంటే వారు జీవితంలోని ఆనందాన్ని అనుభవించలేరు. విషాదంలో దుఃఖించలేరు. ఎందుకంటే వారి వ్యక్తిగత ఆనందాలు, వేదనల్లో కూడా వారు కవితలను, కథలను దర్శిస్తారు కాబట్టి. శ్రీవరుడి జైనులాబిదీన్ చివరి క్షణాల వర్ణన చదువుతుంటే ఇవే మాటలు గుర్తుకొస్తుంటాయి.

ద్వాపంచశతమబ్దాన్ స రాజ్యం కృత్వా సుఖప్రదమ్।
షట్చత్వారింశ వర్షే గాద్దివం శ్రీజైనభూపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 221)

జైనభూపతి 52 ఏళ్ళు సుఖపూర్వకంగా రాజ్యం చేశాడు. 46వ సంవత్సరంలో  స్వర్గానికి ప్రయాణమయ్యాడు.

శ్రీవరుడు చెప్పిన కాలం లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే జైనులాబిదీన్ జన్మకాలం 1401. రాజ్య ప్రాప్తి కాలం 1418. మరణం 1470.

జైనులాబిదీన్ మరణంతో కశ్మీర్ చరిత్రలో సుల్తాన్ పాలనలోని సువర్ణాధ్యాయం ముగిసింది. పగలు తరువాత చీకటి వచ్చేట్టే, ఉజ్జ్వలమైన జైనులాబిదీన్ పాలన తరువాత కశ్మీరును అంధకారం ఆవహించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version