[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీమతి సుందరి వేణుగోపాల్.]
మా రామయ్య చేపట్టిన జానకమ్మ పేరు తలిస్తేనే ఒక రకమైన పవిత్ర భావము మనలో కలిగి ఆ అమ్మ ప్రేమలో సేద తీరినట్టుగా భావిస్తాము. మరి సుగాత్రి జానకి పేరు వింటే- సిరిమల్లె పువ్వులు, చిరుమువ్వల సవ్వడులు, పసిపాపల పసిడి పలుకులు, పదహారేళ్ళ వయస్సు చేసే చిలిపి పనులు, పండించుకున్న వలపులు, పండిన ప్రాయపు పలకరింపులు మన ముందు నిలుస్తాయి. సంగీత సాహిత్య సమలంకృతైన సరస్వతి పాద మంజీరాలలోని ఒక చిరుమువ్వ జానకిరూపంలో ఆధాటున మన తెలుగు నేలకు జారి, మన జీవితాలని తన గానముతో రాగభరితం చేసింది. ఆమె పాడిన ప్రతి పాట ప్రత్యేకమే. ఊహ తెలిసిన నాటినుంచి ఆ గళ మధురిమను ఆస్వాదిస్తూ పెరిగిన మనం, ఆమె గానము మనలను ఇక పలకరించదని, అలరించదని నమ్మడం ఎలా? ఇహ ప్రియతమా మము పలకరించు గళమా అని ఎవరిని అడగాలి?
ఆమె గానము గలగలా పారే గోదావరి, పరవళ్ళు త్రొక్కే కృష్ణమ్మ, ఉరికే జలపాతము. పరుగాపక పయనించే సెలయేరు. నెమలికి నడకలు నేర్పే నాట్యం. పచ్చటి పచ్చిక బయల్లో పండువెన్నెల పందిరిగా పొన్నచెట్టు క్రింద ఉయ్యాల్లో హాయిగా స్వేచ్ఛగా గొంతెత్తి పాడుకునే హృదయంపు పాట (కృష్ణశాస్త్రిగారి పదం). యతిరాజుకు జతిస్వరముల పరిమళములు కూర్చిన లయ.
పూచే పూలలోనా, వీచే గాలిలోనా మనలను ఎవరో తాకిన అనుభవం ఆమె పాట విన్నప్పుడల్లా. సందర్భానికి తగినట్టుగా వయసును స్పురింపచేస్తూ ఏమి మాయ చేస్తుందో తెలీదు ఆ స్వరమంత్రగత్తె. మరులు, మైమరుపులు, భగ్నకణాలు-భాష్పవీణలు (ముళ్ళపూడివారికి క్షమార్పణలతో), కొంటెతనం, చిలిపిదనం, వలపుధనం, విషాదం, మోదం, ప్రమోదం, అద్భుతం, హాస్యం, ఏన్నో రసాలు ఆమె గళం పలికించకలదు.
మంచి చెడు, ఆశ నిరాశ, కష్టం సుఖం, వలపు విరహం, కలయిక ఎడబాటు ఇలా ఏన్నో భావాలకు తగ్గట్టుగా ఆమె పాటల జలధిలో మనకు అనేక అనర్ఘ రత్నాలు, మేలిముత్యాలు దొరుకుతాయి. ఏరుకున్నవారికి ఏరుకున్నంత. ఆమె పాట పగలే వెన్నెల్ని కురిపించగలదు. రేయైతే నిదురపోరా సామి అని సేద దీర్చగలదు. ఈ దుర్యోధన దుశ్శాసన అని నిప్పులు కురిపించగలదు. సిన్నిసిన్ని కోరికలడగా అంటూ తనలో ప్రేమను వ్యక్తపర్చకలదు. నీ కౌగిలిలో తల దాల్చి నీ చేతులలో కనుమూసి అని తన కోఱికను తెలియచేయగలదు. నిరాశలో కృంగిపోతున్నవేళ నీతో నడచి నీడగ నడిచే తోడుగ నేనుంటే నీకేలా ఇంత నిరాశ అని ధైర్యాన్ని ఇవ్వగలదు. ఆశలు భగ్నమైనపుడు తలచినది ఒకటైతే, జరిగినది వేరొకటి అంటూ నీ దుఃఖంలో పాలు పంచుకోగలదు. వెన్నెల్లో గోదారి అందాన్ని ఎంతోమంది అనుభవించి ఉంటారు, విని ఉంటారు, చదివి ఉంటారు, కని ఉంటారు. కాని అదే గోదారి విషాదాన్ని ఒలికించిన జానకి కాకలీనస్వరం మనలను వెన్నాడుతూనే ఉంటుంది.
భక్తిలో మునకలు వేయించినా, రక్తితో రాగలాహిరిలో డోలలాడించినా, విషాదంతో కన్నీటి ధారలు కురిపించినా, ఆనందంతో నాట్యమాడించినా, ఆట పట్టించినా, అల్లరిపెట్టినా, ఆమె పాటకు సాటిలేదు. విడిదైన విరితోట ఆమనికి, అతిథులైన కలకూజిత కోయిలమ్మలకు, కీరవాణులకు, కలభాషిణులకు చిరునామా జానకి స్వరమే.
జీవితమే కృష్ణ సంగీతమని మనసారా నమ్మిన జానకి, తాను విపరీతంగా ఆరాధించే కిట్టయ్య సన్నిధికి చేరి, నీ చరణ కమలాల నీడయే చాలు అని ఆయనలో లీనమైపోయింది. ఆ కన్నయ్య కూడా నీ పాట వింటే చాలు నాకెందుకిక ఈ బృందావనాలు, నందనవనాలు అని ఆమె గాన మాధుర్యపు రసగంగలో తానాలు ఆడుతున్నాడు.
మాటే రాని మౌనం. ఘనీభవించిన కన్నీరుతో మనసు స్తబద్దమైన వేళ ఇది. మూగబోయిన జీవస్వరం, వేకువ ఝూమున ఒలికిన వెన్నెల మరక, స్మృతిలో మిగిలిపోయిన నవ్వుల పువ్వులు రాల్చిన సిరిమల్లె చెట్టు క్రింద చిన్నబోయిన ఆమె అభిమానులము. మన మనసులలో పూడ్చలేని వెలితిని నింపి గిరులు, ఝరులు, తరులు అన్నిటిని దాటి ప్రాప్తమున్నతీరానికి నావలా చేరిపోయింది. బావురుమంటున్న రేవులా మనం మిగిలిపోయాము.
మాట పాట విడదీయలేని విడదీయరాని జంట. వీటికి బాసటగా బాట (అంటే బాణీ) చేరితే అవి త్రిమూర్తులు. మాట సృష్టికర్త, పాట స్థితికారుడు, బాట లయకారుడు. వ్రాయసకాడుని ప్రతిభ, బయకాడుని ప్రజ్ఞ, గర్వాటుడి ఉపజ్ఞల సమ్మేళనం మనోరంజకమైన పాటల పుట్టుక. వీటిలో ఏది గతి తప్పినా ఫలితం మోత, వాత, రోత. భాగ్యవశాత్తు వీటి మేలుకలయికతో వచ్చిన ఎన్నో ఆణి ముత్యాల్లాంటి పాటలను జానకి దైవదత్తమైన విద్యతో వాణి గళసీమను ముప్పేటసరాల్లా అలంకరించిన ధన్య.
జానకి జీవిత విశేషాలు, సంగీత ప్రస్థానాన్ని గురించి చలన చిత్రరంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖులు, విద్వాంసులు, సంగీత దర్శకులు, గీత రచయితలు, దర్శకులు అమూల్యమైన వివరాలను అందచేసారు, చేస్తున్నారు. అందుచేత నేను ఆ విషయాల గురించి ప్రస్తావించలేదు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఆమె కొన్ని వేల పాటలు అనేక భాషలలో పాడారు, మనలను అలరించారు. నాకు ఆమె పాటలతో ఉన్న సాన్నిహిత్యం, ఆవిడ మీద ఉన్న అభిమానం కారణంగా సాహసించి ఈ రచనతో మీ ముందుకు వచ్చాను.
ఆమె మిగిల్చి వెళ్ళిపోయిన శూన్యాన్ని అనుభవిస్తూ, నీలిమేఘాలలోనూ, గాలి కెరటాలలోనూ, పూచే పువ్వుల్లోనూ, వీచే పిల్ల తెమ్మరలలోనూ, ఆమె స్వరరాగ గంగా ప్రస్తారాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ జీవితం సప్త సాగర గీతం, వెలుగు నీడల వేదం సాగనీ పయనం అనే ఆమె పాటను శిరోధార్యంగా భావిస్తూ ఆమెకు నా ఈ చిన్న శ్రద్ధాంజలిని అంకితమిస్తున్నాను.
నేను పుట్టింది. గోదావరమ్మ ఒడిలో పెరిగింది గోదావరి నీళ్లు త్రాగి. అందుకే ఆ నీళ్ళన్నా, ఆ నేల అన్నా పిచ్చి.మాగోదారోళ్లకి మల్లె సినిమాలంటే ప్రాణం.
తెలుగు సాహిత్యాభిమానిని అయిన నేను ఆరుద్ర వ్రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర ద్వారా ఎన్నో విషయాలను, విశేషాలను తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఆరాధన పెరిగింది. అలాగే మల్లాది వారు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర వ్రాసిన సినిమా పాటలంటే అన్నం నీళ్ళు కూడా అక్కరలేదు.
ఆరుద్ర కూనలమ్మ పద్యాలు, సినివాలి, పలకల వెండిగ్లాసు , అరబ్బీమురబ్బాలు చదివి మురిసిపోయిన నాకు ఆయన వ్రాసిన కొండగాలి తిరిగింది పాట రామకోటి. ఎన్నిసార్లు విన్నానో, వింటున్నానో. అందుకే ఆయన గురించి వ్రాయడానికి ముందడుగు వేసాను.
నేను విశ్రాంత బ్యాంక్ ఉద్యోగినిని. హైదరాబాద్ నగర నివాసిని.
