Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సొంత లాభం..

[బాలబాలికల కోసం ‘సొంత లాభం..’ అనే గేయకథ అందిస్తున్నారు శ్రీ దాసరి చంద్రయ్య.]

తేనెటీగల గుంపు
తిరిగి తిరిగి తాము
తీయనైన పూల
తేనె గూర్చాయి

వేటగాడు వచ్చె
వేటకై అటువైపు
చెట్టు కొమ్మన ఉన్న
తేనె పట్టును చూసె

ఎండు తాటాకును
అగ్గితో రగలేసి
తేనె పట్టున ఉన్న
ఈగల్ని తరిమేసె

తేనె పట్టును తీసి
తేనెనంతా పిండె
తేనెటీగల గుండె
బాధతోనూ మండె

ముసలి తేనెటీగ
తన గుంపు ఈగలతో
పూదేనె కోసము
పోదాము రండనగా

కష్టపడిన పంట
పరుల పాలవ్వగా
యువతేనెటీగలు
రాము రామనగా

కష్టపడిన కాయం
కఠినమవుతుందిలే
ఆరోగ్య భాగ్యము
అమరి వస్తుందిలే

సంపాదించినదంతా
మనము తినుట కంటే
కొంత దానం చేస్తే
మన పేరు నిలిచేను

ముసలి తేనెటీగ
హితబోధ చేయగా
యువతేనెటీగలు
బయలుదేరాయి

Exit mobile version