Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బాలసాహితీవేత్త శ్రీ దాసరి వెంకట రమణ ప్రత్యేక ఇంటర్వ్యూ

[ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ దాసరి వెంకట రమణ పదవీవిరమణ సందర్భంగా, చందమామ కథలపై పిహెచ్‌డి పట్టా పొందిన సందర్భంగా వారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం దాసరి వెంకట రమణ గారూ.

దాసరి వెంకట రమణ: నమస్కారం.

~

దాసరి వెంకట రమణ గారూ మీకు ఉద్యోగవిరమణ శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపిస్తున్నది, ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే?

జ: ధన్యవాదాలు. ఒక్కసారి వెనుతిరిగి విహంగ వీక్షణం చేస్తే, ఎన్ని మలుపులు ఎదురు దెబ్బలు కాసిని ఉల్లాసాలు కాసిని ఉద్వేగాలు. ఉద్యోగంలో సహజమైన అటుపోట్లు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో మానసిక ఒత్తిడి బాగా ఎక్కువ. 1987 మార్చి, 18వ తేదీన నల్గొండ జిల్లా పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయత్ రాజ్ డిపార్టుమెంటులో విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. తర్వాత 1995 జూన్‌లో సబ్-రిజిస్ట్రార్‌గా రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్‌లో జాయిన్ అయ్యాను. పంచాయత్‌రాజ్‌లో ఎనిమిది సంవత్సరాలు, రిజిస్ట్రేషన్‌లో ముప్పది ఒక్క సంవత్సరాలు మొత్తం 39 సంవత్సరాల సర్వీసు. అయితే ఈ రోజు తలుచుకుంటే నిన్ననో మొన్ననో ఉద్యోగంలో చేరినట్టుంది. నేను పోచంపల్లి మండల కార్యలంలోకి ప్రవేశించి అక్కడ కనిపించిన వ్యక్తితో ‘నా పేరు వెంకట రమణ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను’ అన్నాను. అంతలో నా వెనక నుండి ‘హలో! వెంకటరమణ గారంటే మీరా కంగ్రాట్యులేషన్స్’ అంటూ ఒకామె నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి, ‘నా పేరు శోభారాణి నేనూ మీ బ్యాచే, మొన్నే జాయిన్ అయ్యాను’ అన్నది. ఇప్పటికీ వారంలో ఒకసారైనా మేం మాట్లాడుకుంటాం. ఫోన్లో హలో వెంకటరమణ గారూ అన్నప్పుడల్లా నాకు ఆనాటి దృశ్యం కళ్ళముందు మెదులుతుంది. నిన్న గాక మొన్న డ్యూటిలో చేరినట్టుంది. కాలం ఎంత వేగంగా తిరిగింది అనిపిస్తున్నది. శోభారాణి గారు మా ఫ్యామిలి ఫ్రెండ్. మొన్న రిటైర్మెంట్ రోజు మాటల సందర్భంలో ఈ మాటంటే గలగలా నవ్వేసింది.

ఈ మధ్యకాలంలో మీకు ఉద్యోగరీత్యా సంతోషం కలిగించిన అనుభవాలేమయినా పంచుకుంటారా?

జ: ఉద్యోగ జీవితంలో పదోన్నది ప్రతి ఉద్యోగి కల. అందరూ దాని కోసమే ఎదురు చూస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నా పదోన్నతులు నేను రిటైర్ అయ్యే లోగా పొందాలి అనే పట్టుదలతో తిరిగి సాధించుకొన్నాను. ముందు జిల్లా రిజిస్ట్రారుగా, ఆ తర్వాత డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి లభించింది. రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో ఒక ఉన్నతాధికారిగా.. డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా రిటైర్ కావడం నాకు సంతోషం కలిగించే అంశమే!

మీ కుటుంబ వివరాలు మా పాఠకులతో పంచుకుంటారా?

జ: మా శ్రీమతి లక్ష్మీదేవి డిగ్రీ చదువుకున్నది. ఇంటిపట్టునే ఉండి ఇంటిని తీర్చిదిద్దే పని చేస్తుంది. మా అబ్బాయి శరత్ చంద్ర ఇండస్ట్రియల్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేశాడు. సొంతంగా డిజైనింగ్ స్టూడియో నిర్వహిస్తూన్నాడు. కోడలు నేహ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అమ్మాయి డా. శ్రావణి ఎం.డి. సైకియాట్రి. అల్లుడు సమీర కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.

మీకు డాక్టరేట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆచరణలో ఎలా పెట్టారు?

జ: నాలో సాహిత్యంలో డాక్టరేట్ చేయాలన్న ఆలోచనకు నలభై రెండేళ్లు. ఇంటర్మీడియట్‌లో నాది బై.పి.సి. డాక్టర్ కావాలనేది కల. కానీ మొదటి ప్రయత్నంలో సీటు రాలేదు. నిజాం కాలేజిలో బి.ఎస్.సి.లో చేరాను. నిజం చెప్పొద్దూ డిగ్రీలోని కెమిస్ట్రీ బుక్ సైజ్ చూసి నాలో గుబులు బయలుదేరింది. దాన్ని చదివి వంట బట్టించుకొని, మళ్ళీ మెడికల్ ఎంట్రెన్స్ రాసి, సీటు రాకపోతే, డిగ్రీ చదివి పాసై ఆనక ఏం చేయాలి? డాక్టరు అయ్యే కోరిక తీరుతుందా? అసలు ఈ కెమిస్ట్రీ చదవడం నా వల్ల అయ్యే పనేనా? మనకు డాక్టర్ అయ్యే వ్రాత లేనట్టుంది. నేను నాకు ఇష్టమైన తెలుగు సబ్జెక్ట్‌కు మారుతాను. అవసరం అయితే ఎమ్మే తెలుగు చదివి సాహిత్యంలో డాక్టరేట్ చేస్తాను అనే నిర్ణయానికి వచ్చాను. ప్రిన్సిపాల్ గారిని కలసి బి.ఏ. స్పెషల్ తెలుగులో చేరాలనే నా ఆలోచన చెప్పాను. ఆయన చాలా మంచివాడు. ఓపిక వున్నవాడు. మధ్యలో అలా మారడం కష్టం అని నా మనసు మార్చడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. రెండు మూడు రోజుల తర్వాత నా పట్టుదల సడలక పోయేసరికి, అలా మారడానికి అవకాశం ఏమైనా ఉన్నదా అనే కోణంలో సెక్షన్ వాళ్ళను పిలిచి మాట్లాడాడు. నేను అప్లికేషన్ పెట్టుకొన్నప్పుడు బి.ఎస్.సి.తో పాటు బి.ఏ. కూడా పెట్టుకొని వుంటే అలా మారే అవకాశం ఉన్నది అని తేల్చేశారు. నేను కాళ్ళీడ్చుకుంటూ నిరాశగా వచ్చేశాను. కాలేజీకి మొక్కుబడిగా వెళ్లి వస్తున్నానే తప్ప, పాఠాల మీద మనసు లగ్నం కాలేదు. అప్పుడప్పుడు ఆదివారం పాత పుస్తకాల కోసం ఆబిడ్స్‌కు వెళ్ళడం నాకు అలవాటు. అయితే ఒకరోజు ఫుట్‌పాత్ మీద పుస్తకాలు కొన్నాక కోటి వైపు కాకుండా తిలక్ రోడ్‌లో కాస్త ముందుకు వెళ్లాను. అప్పుడు కనిపించింది ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే బోర్డ్. కుతూహలంతో లోపలి వెళ్తే, ప్రాచ్య కళాశాల అనే బోర్డు, ప్రిన్సిపాల్ గది కనిపించాయి. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే సరిగ్గా అదే. నా అదృష్టం కొద్దీ ప్రిన్సిపాల్ కే.కే.రంగనాథాచార్యులు ఏదో పని చేసుకుంటూ కనిపించారు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పారు (ఇప్పుడు చెన్నయ్య గారు కూర్చొనే గది నాడు ప్రిన్సిపాల్ గది. ఇప్పుడు ప్రిన్సిపాల్ సిల్మా నాయక్ కూర్చొనే గది ఆనాడు దేవులపల్లి రామానుజ రావు ఆఫీసు గది.). నెక్స్ట్ అకాడమిక్ సంవత్సరం అక్కడ బి.ఏ.ఎల్. లో చేరాలని నిశ్చయించుకొని, నిజామ్ కాలేజీకి వెళ్ళడం మానేశాను. అది ఎలాగూ ఈవినింగ్ కాలేజీ. ఖాళీగా ఉండటం ఎందుకని మా ఇంటి పక్కనే వున్న స్కూళ్లో టీచర్‌గా జాయిన్ అయ్యాను. బి.ఏ.ఎల్.లో జాయిన్ అయ్యాను. సారస్వత పరిషత్ పరిచయం నా జీవితంలో గొప్ప మలుపు. కే.కే.రంగనాథాచార్యులతో పాటు అక్కడ నాకు ఎం.నరహరి, చంద్రశేఖర రెడ్డి, జితేంద్ర రెడ్డి, కాకాని చక్రపాణి, కే.సింగరాచార్యులు, కే.వి.సుందరాచార్యుల వంటి మహామహుల సాహితీ సుగంధం నాకు వంట బట్టింది. డిగ్రీ దాదాపు 75% మార్కులతో క్లాసు ఫస్ట్, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. తెలుగు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి అది సాధ్యం అయ్యింది. ఆ వెంటనే VDO జాబ్ రావడంతో ఎమ్మే ఎక్స్టర్నల్‌గా పూర్తి చేశాను. తర్వాత సబ్-రిజిస్ట్రార్‌గా జాయిన్ అయ్యాను. డాక్టరేట్ కోరిక తాత్కాలికంగా అటకెక్కింది. ఒకసారి లాల్ బహాద్దూరు స్టేడియంలో రిజిస్ట్రేషన్ శాఖ క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. పాటల పోటీలు, ఏక పాత్రాభినయం పోటీలకు ఒక జడ్జీగా మా గురువు డా. చంద్ర శేఖర రెడ్డి గారిని, పిలిచాను. ఆయన కాదనకుండా వచ్చారు. మాటల మధ్యలో తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి చేయాలన్న నా కోరికను సార్‌తో వ్యక్తపరిచాను. ఆ తర్వాత జరగవలసిన తతంగమంతా చంద్రశేఖరరెడ్డిగారే చూసుకున్నారు. నా డాక్టరేట్ క్రెడిట్ వారిదే!

మీరు చేసినది ఉన్నత స్థాయి ఉద్యోగం. అనేక ఉద్విగ్నతలుంటాయి. తీరిక సమయం దొరకటం తక్కువ. ఇన్ని ఒత్తిళ్ళ నడుమ మీరు రిసెర్చ్ కోసం ఎలా ప్రణాళిక వేసుకున్నారు?

జ: అందుకే నా పరిశోధన పూర్తి కావడానికి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది. ఉద్విగ్నతలు మామూలుగా ఉండవు. ఎక్కడో చదివాను నీవు ప్రశాంతంగా ఉండాలంటే ఇంటిని ఆఫీసు చేయకు ఆఫీసును ఇల్లు చేయకు అని. ఎక్కడిదక్కడ వదిలేయాలి. అది అక్షర సత్యం. అలా వదిలేయ గలిగినవాళ్ళు మహానుభావులే! కానీ అది అందరికీ సాధ్యం కాదు, ముఖ్యంగా మా డిపార్టుమెంట్‌లో. ఈ మధ్యనే నన్ను ఇదే ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా నేను “ఇలాంటి ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవటానికి చాలా మంది క్లబ్బుల కెళ్ళి మత్తును ఆశ్రయిస్తారు. నేను మాత్రం ఇంటికి వెళ్లి మనసును ఆశ్రయిస్తాను. కథా, కవిత ఏది రాసినా అదొక ధ్యానంలా పనిచేసి చాలా ఉపశమనంగా ఉంటుంది. రాత్రి పది తర్వాత ఏదైనా మొదలు పెట్టి రాసుకుంటూపోతే అప్పుడప్పుడు కిటికీ తెల్లగవుతుంది. వెంటనే కాసేపు పడుకొని లేచి తిరిగి విధులకు హాజరయిన రోజులున్నాయి. నాకు బద్ధకం ఎక్కువ, రాసే పనిని రేపు రేపు అంటూ పోస్ట్‌పోన్ చేయడం ఒక అలవాటు. దీనికి ఏదీ కారణం అని ఇదమిత్థంగా నేను చెప్పలేను. పీహెచ్.డీ. చేయడానికి నాకు అనుమతి లభించడానికి ముందు ఒక సినాప్సిస్ సమర్పించాలి. ఆ పని ప్రతిరోజూ రేపు చూద్దాం అంటూ పోస్ట్‌పోన్ చేస్తూ, ఎంతకూ చేయలేక పోయాను. చంద్రశేఖర్ రెడ్డి గారు సినాప్సిస్ సబ్‌మిట్ చేయడానికి రేపు చివరి తేదీ ఒకవేళ ఆ పని చేయలేకపోతే, పీహెచ్.డీ. గురించి మర్చి పోవాల్సిందే అన్నారు. అంతే ఆ రోజు రాత్రి చాలా మథనపడ్డాను. రాత్రి పన్నెండయినా అక్షరం ముక్క రాయలేదు. అప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ పీహెచ్.డీ. చేయవలసిందే అని మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకొని బాగా ఊపిరి తీసుకొని వదిలి రాయడానికి ఉపక్రమించాను. ఒక పూనకం వచ్చిన వాడిలా రాస్తూ పోయాను. పూర్తి చేసేసరికి తెల్లవారింది. దాన్ని బయటికి వెళ్లి DTP చేయించి మధ్యాహ్నం వరకు ఆఫీసులో సబ్‌మిట్ చేశాను. అప్పుడప్పుడు దాన్ని రాసింది నేనేనా అనే అనుమానం నాకు తరచూ కలుగుతూ ఉంటుంది. అది అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక పరిశోధన ఎలా చేయాలి? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? అనే ఆలోచన తెగడానికి చాలా కాలం పట్టింది. చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే వున్నారు. ఆయన కొంత కాలం వెంటబడి నా ఉద్యోగ స్థితిని దృష్టిలో పెట్టుకొని అడగడం గుర్తు చేయడం మానేశారు. మిత్రులు ఎవరు కలసినా చందమామ పీహెచ్.డీ. ఎంతవరకు వచ్చింది అని అడిగే వాళ్ళే. కొనసాగుతోంది అంటే సా….గుతోందా అంటూ కాస్త చమత్కారంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది మిత్రులు పీహెచ్.డీ. తెచ్చుకోడానికి కొన్ని అడ్డదారులు కూడా చెప్పారు. కొంత డబ్బు ఇస్తే థీసిస్ రాసిపెట్టేవాళ్ళు ఉంటారని, మరికొంత డబ్బు ఇస్తే అదేదో యూనివర్సిటీ ఏకంగా డాక్టరేటే ఇస్తుందని అంటూ చెప్పేవాళ్ళు. నేను వింటూ పోయేవాణ్ణి. పరిశోధన నేనే చేయాలి. థీసిస్‌ నేనే రాయాలి. అడపా దడపా నేను చందమామ గురించి రాసిన వ్యాసాలూ రచన మాస పత్రికలోనూ, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల ఆదివారం అనుబంధం లోనూ వచ్చాయి. నా థీసిస్‌ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఒకరోజు మనసు ఫౌండేషన్ రాయుడుగారు ఈ టాపిక్ తీసుకువచ్చి, కొన్ని టిప్స్ చెప్పారు. వాటి ఆధారంగా థీసిస్‌ రాయడం మొదలు పెట్టాను. కానీ కుదురుగా కూర్చొని రాయలేక పోయాను. కాలం గడిచింది. 2021 డిసెంబర్ 26 మా అమ్మాయి పెళ్లి. నేను పెళ్లి పనుల్లో వున్నాను. డిసెంబర్ మొదటి వారంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేసి, థీసిస్ పెనాల్టితో సబ్‌మిట్ చేయాడానికి ఈ నెల ఆఖరు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోవలసిందే అన్నారు. పెళ్లి పనులు పక్కన పెట్టి థీసిస్ రాయడం దాదాపు అసంభవం. మనకు డాక్టరేట్ వ్రాత రాసి లేదు అని సరిపెట్టుకొని, పూర్తిగా పెళ్లి పనుల్లో మునిగి పోయాను. పెళ్ళికి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారు పెళ్లి వేదిక మీద ‘రమణా నీ కొక శుభవార్త నీ థీసిస్ సబ్‌మిట్ చేయడానికి చివరి తేదీ జనవరి 31 వరకు పొడిగించారు’ అని చెప్పారు. అప్పుడు నాకు ఎంత సంతోషం అయిందో చెప్పలేను. అమ్మాయి పెళ్లి కోసం పెట్టిన సెలవు పొడిగించి, నెల రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి హడావిడిగా దాదాపు ఎనిమిది వందల పేజీల థీసిస్ రెడీ చేశాను. రెండు రోజుల ముందు చివరి తేదీని మార్చి 31 వరకు పొడిగించారని తెలిసింది. ఇంకొంచెం ఊపిరి పీల్చుకొని, ఆ రెండు నెలలు హడావిడి థీసిస్‌ను చక్కగా చెక్కి అయిదు వందల పేజీలకు కుదించి విజయవంతంగా సమర్పించాను.

అసలు మీకు చందమామ ఎప్పుడు పరిచయం అయ్యింది. మొదటి సారి చందమామను చూసినప్పటి మీ భావాలు పంచుకుంటారా?

జ: నేను మొట్టమొదటిసారిగా ‘చందమామ’ను చూసింది నా పదో ఏట. 1975 ఆగస్టు 23వ తేదీ సాయంత్రం ఆరూ.. ఏడూ గంటల మధ్యలో. ఇంత కరెక్టుగా తేదీ, సమయం గుర్తుండటానికి ఒక కారణం వుంది. మా అన్నయ్య కొడుకు వాసుదేవ్ 1975 ఆగస్టు 3న పుట్టాడు. 23వ తేదీ, 21 రోజులకు వాడిని ఉయ్యాల్లో వేసి నామకరణం చేస్తున్నారు. ఆ వేడుకకు నేను తొలిసారిగా హైదరాబాదు వచ్చాను. అంతకు ముందురోజు సాయంత్రం మా పిన్న ఓబులమ్మతో కలసి ఉయ్యాలవాడలో బయలుదేరి రాత్రి 12 గం.లకు రైలెక్కి ఉదయం 6 గం.లకు సికింద్రాబాదులో దిగి పాటిగడ్డ కాలనీలోని C-21 ఇంటికి వచ్చాం. ఆ ఇల్లు మా వదిన తండ్రి రామకృష్ణ గారిది. ఆయన సెక్రటేరియట్‌లో పని చేస్తారు. రాష్ట్ర రాజధాని కర్నూలు నుండి హైదరాబాదు వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.

ఉదయం ఆ యింటికి వచ్చిన నాకు చందమామ సాయంత్రం దొరికింది. మామూలుగా అయితే ఆ యింటిని సగబెట్టడానికి నాకు ఒక గంట పని. కానీ మా ప్రయాణానికి ముందురోజు నేను మా ఊళ్ళో కచేరి కాడ ఆడుకుంటూ కింద పడిన. నా ఎడమ చేయి మణికట్టు దగ్గర విరిగింది. మా ఊరి వేముల సిద్ధారెడ్డి మా యింటి అరుగు మీదున్న తడక దబ్బలు రెండు తీసుకొని వెళితే సరిచేసి పురికోసతో కట్టు కట్టారు. హైదరాబాదు వస్తున్న ఆనందంలో ఆ నొప్పి తెలియలేదు కానీ, వచ్చాక నొప్పి కొద్దికొద్దిగా సలపరం పెట్టసాగింది. అందువలన ఇల్లు సగబెట్టడానికి కాస్త సమయం పట్టింది.

మా వాసును తొట్లో వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇనుప స్టాండ్‌తో ఊగే ఉయ్యాలను రంగుల కాగితాలతో అలంకరిస్తున్నారు. నేను మధ్యాహ్నం పడుకొని, లేచి మా అత్త రంగమ్మగారు స్టీలు పలకల గిలాసలో ఇచ్చిన టీ త్రాగి మెల్లగా ఇంట్లోకి, పెరట్లోకి రెండు మూడు సార్లు తిరిగాను. పెరడు వైపున్న గదిలో గూట్లో చిందర వందరగా వున్న పుస్తకాల మధ్య కనిపించింది రంగుల బొమ్మలతో వున్న పుస్తకం. గబుక్కున బయటకు లాగాను. ‘యక్ష పర్వతం – 16’ అని వుంది. కుక్కలు వెంటపడుతుంటే (చదివితే తెలిసింది.. అవి కుక్కలు కావు, తోడేళ్ళని!) త్రిశూలం పట్టుకున్న ఒక బైరాగి, ఇద్దరు ఎలుగ్గొడ్డు మనుషులు పొదల్లోకి పరుగెత్తుతున్నారు. పుస్తకం వెనకాముందు అట్టలు ఊడిపోయి వున్నాయి. పేజీలు బాగా నలిగిపోయి పుస్తకం శిథిలావస్థలో వుంది. అయితేనేం నన్ను ఆకట్టుకుంది. దాన్ని ‘చందమామ’ అంటారని అప్పటికి నాకు తెలియదు. పుస్తకం మొత్తం తిరగేశాను. మళ్ళీ మొదటికి వచ్చి పేజీలు తిరగేస్తూ, దెబ్బకు దెబ్బ అనే కథ దగ్గర ఆగిపోయాను. (చందమామలో నేను చదివిన మొదటి కథ అదే వేమూరు వెంకయ్య నాయుడు గారి దెబ్బకు దెబ్బ కథ). ఇంట్లోంచి బయటకు వచ్చిన ఇల్లాలితో ఒక కుర్రవాడు పై పంచె జోలె పట్టుకుని నిలబడి వున్న వాడు ఏదో మాట్లాడుతున్నాడు. దూరంగా రెండు కొబ్బరి చెట్ల దగ్గర లారి ఆగి వుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే కుతూహలంతో కథ చదవడం మొదలుపెట్టాను.

వెంకన్న అనేవాడికి ఉర్లగడ్డల కూర అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఊళ్ళో ఉర్లగడ్డలు దొరక్క, ఉర్లగడ్డల కూర తిని వద్దామని ఇంట్లో చెప్పకుండా బస్తీ వచ్చాడు. అక్కడ ఉర్లగడ్డల లారీలో బస్తాలు దించడంలో సాయం చేస్తే కాసిని ఉర్లగడ్డలు పెట్టారు. వాడు వాటిని ఒక ఇల్లాలికి వండిపెట్టమని ఇచ్చి, బస్తీ తిరగబోయాడు. ఆవిడకు కూడా ఉర్లగడ్డలంటే చాలా యిష్టం. వాటిని వండి ఆత్రంకొద్ది అంతా తానే తినేసింది.

వచ్చిన వెంకన్నకు కాస్త అన్నం పెట్టి గోంగూర పచ్చడి వేసింది. అదేమిటని వెంకన్న అడిగితే “మంట కాస్త ఎక్కువై, ఉర్లగడ్డలు మాడి గోంగూర అయ్యింది” అన్నది.

అప్పటికి వాడు వూర్కొని, మామూలుగా ఇంటిముందు నీళ్ళు కాగబెట్టి పోసుకోడానికి ఆమెను ఒక అండ అడిగి తీసుకున్నాడు. దాన్నితీసుకు వెళ్లి దగ్గరలో వున్న ఒక కుళాయి దగ్గర పెట్టి, అక్కడొక కుండ తెచ్చి నీళ్ళు పోసి కాచసాగాడు. ఇల్లాలు బయటికి వచ్చి అండ ఏదని అడిగింది. “అయ్యయ్యో! మంట ఎక్కువైనట్టుంది. అండ కాస్త కుండగా మారింది” అన్నాడు.

“నన్ను మోసం చేయకు. మర్యాదగా నా అండ ఎక్కడ దాచావు? చెప్పు” అంది.

“ఎవరిదమ్మా మోసం? మంట ఎక్కువై ఉర్లగడ్డలు గోంగూరగా మారినప్పుడు అండ కుండగా మారకూడదా?” అన్నాడు. పెద్ద గొడవ అవుతదేమో అని ఆ ఇల్లాలు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నది.

వెంకన్న కుండను యథాస్థానంలో పెట్టి, అండను బజారులో అమ్మి, పది కిలోల ఉర్లగడ్డలు కొనుక్కొని అవి అయిపోయేదాక వాళ్ళ అమ్మతో వండించుకొని తిన్నాడు.

ఈ కథ నాకు భలే నచ్చింది. నాక్కూడా ఉర్లగడ్డల కూర చాల యిష్టం. బహుశా అందుకే నచ్చిందేమో.

ఆ తర్వాత పుస్తకం తిరగేస్తూ బొమ్మలు చూస్తూ చదవాలనిపించిన కథలన్నీ చదివాను. విరిగిన చెయ్యి నొప్పి తెలియడం లేదు. పుస్తకం మీద కట్టు కట్టిన నా ఎడమచేయిని ఆనించి నిదానంగా చదువుతున్నాను. గంటలో ఆ చందమామ పుస్తకం సాంతం చదివేశాను. అన్నీ చదువలేదు. బొమ్మలు చూస్తూ.. ఈ కథ బాగుండొచ్చు ఈ కథ బాగుండొచ్చు అనుకుంటూ ఒక ఆర్డర్‌లో కథలన్నీ చదివాను. దెబ్బకు దెబ్బ, తిండిదొంగ, అత్తకు తగిన అల్లుడు, లాభించిన కల, ధనానికి ధన సహాయం, కాళిదాసు గురువు కథలు బాగా నచ్చాయి. సీరియల్స్‌కు వేసిన రంగుల బొమ్మలు ఎంత బాగున్నాయో నేను పుస్తకాల్లో అంత అందమైన బొమ్మలను చూట్టం అదే మొదటిసారి. బొమ్మల్లో యక్షపర్వతం సీరియల్‌లో సైనికాధికారి సెలయేటి ఒడ్డున కూర్చొని చికెన్ లెగ్ పీస్ తింటున్న బొమ్మ నాకు చాలా నచ్చింది. అలాగే మహాభారతానికి వేసిన శంకర్ బొమ్మలు.

మీ రీసెర్చ్ చందమామ పత్రికకు నీరాజనం. చందమామ మీదే రీసెర్చ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది?

జ: నేను ఐదో తరగతి వరకు మా వూళ్ళో.. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో చదువుకున్నాను. ఆరో తరగతి నుండి హైదరాబాదులో చదువుకున్నాను. మేము అమీరుపేటలోని ధరమ్‌కరణ్ రోడ్‌లో దర్జీ చంద్రయ్య ఇంట్లో, అద్దె కుండేవాళ్ళం. మా ఓనర్స్ ఇంట్లో ముందుగదిలో బీరువాపై కట్టలు కట్టలు పాత చందమామలు ఉండేవి. వాటిని ఎంత దూరం నుండైనా సులువుగా గుర్తు పట్టొచ్చు. వాళ్ళింట్లో భాగ్య అని 8వ తరగతి చదివే అమ్మాయి వుండేది. నేను ఆమెను అడిగి చందమామలు తీసుకొని వెళ్లి చదివి తెచ్చిస్తూ ఉండేవాడిని. వాళ్ళ అన్నయ్య రాజా అని ఉండేవాడు. నేను చందమామల కోసం వాళ్ళ ఇంటికివస్తే కసురుకునే వాడు. ఆతను వాడే స్కూటర్ ‘బజాజ్ ప్రియ’. వాళ్ళ పోర్టికోలో అంబాసిడర్ కారు పక్కన ఆ స్కూటర్ కనబడితే అటువైపు చస్తే వెళ్ళేవాడిని కాదు. ఆ స్కూటర్ లేనిది చూసి “భాగ్యక్కా!” ఆ అమ్మాయిని పిలిచే వాడిని. అదేం విచిత్రమో, అడిగినపుడల్లా ఆ అమ్మాయి లోపలి గదిలోంచి స్టూల్ తీసుకొచ్చుకొని, ముందుగదిలోని బీరువా మీదనుంచి ఒక్కటే పుస్తకం తీసి ఇచ్చేది.

చందమామ చేతిలో పడగానే ఆత్రంగా రెండు మూడు పేజీలు ఇలా… తిరిగేసి “ఇది చదివిందే అక్కా ఇంకోటి ఇవ్వు” అంటే ముఖం చిట్లించి విసుక్కునేది. ఆ విధంగా మళ్ళా ఆ అమ్మాయిని విసిగించలేదు. నేను చదివేసిన పుస్తకం ఇచ్చినా సరే, బుద్ధిగా తీసుకొని వెళ్లి, చదివినట్లు చేసి దాన్ని వాపసు చేసి మరో పుస్తకం అడిగే వాడిని. కాకపోతే ఆ అమ్మాయి పుస్తకం ఇచ్చేటప్పుడు మాత్రం మనసులో ‘నేను చదివేసిన పుస్తకం రాకుండా వుంటే బాగుండు’ అని అనుకునేవాడిని. ఒకవేళ చదివేసిన పుస్తకం వచ్చినా, చదివిన కథలనే మరలా ఒకసారి చదవడంలో కొత్త ఆనందాన్ని ఆస్వాదించే వాడిని. ఆరో తరగతి అయిపోయాక, వేసవి సెలవుల్లో ఒక ఆదివారం రోజు ఉదయం మూడు సార్లు భాగ్యను ఇబ్బంది పెట్టి, పుస్తకాలు తెచ్చుకొని చదివి ఇచ్చేశాను. మూడోసారి పుస్తకం ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయి వాలకం నాకు అదోలాగు అనిపించింది. ఆ పుస్తకం చదివేశాక మరోసారి పుస్తకం అడగడానికి ధైర్యం సరిపోలేదు. అలాగని ఆ ఆదివారం వృథా పుచ్చడం కూడా నచ్చలేదు. ఏమైతే అదవుతుందని ధైర్యంగా నాలుగోసారి వెళ్లి పుస్తకం అడిగాను. ఆ అడగటంలో నా గొంతు నాకే కొత్తగా అనిపించింది.

నేను భయపడినట్టే జరిగింది. నేను అడగడం ఇంకా పూర్తి కానే లేదు, “నాకేం పని లేదా ఛల్నడువ్” అన్నది. నేను బిక్కమొఖం వేసుకొని తిరిగి వచ్చాను.

పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన ప్రాణం వూరికే ఉండలేక పోతోంది. ఆ ఆదివారం ఇంకా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు.. అప్పుడు వచ్చింది ఆలోచన!

ఎంతసేపూ చదవడమేనా ఇలాంటి కథలు నేనెందుకు రాయకూడదు అని.

అప్పటికప్పుడు పాత నోటుబుక్స్ లోని మిగిలిపోయిన తెల్ల కాగితాలు చింపి చిన్న పుస్తకం కుట్టి. నేను చదివిన కథల్లోంచి, పాత్రలను, సంఘటనలను ఏరి ‘మాయదారి సింహం’ అనే కథ రాశాను. ఆ విధంగా చందమామ నాలో ఒక రచయిత కావాలనే ఆలోచనకు బీజం వేసింది.

ఆ తర్వాత మేము ఇల్లు మారి బేగంపేటకు వచ్చాం. మా ఇంటి ఓనర్ పేరు పబ్బిశెట్టి సత్యనారాయణ, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసులో పనిచేసేవాడు. ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడుతారు. వారి శ్రీమతి సుశీలమ్మ, ఇంట్లో మిషన్ కుడుతుంది. తన దగ్గరికి వచ్చేవాళ్ళకు మిషన్ కుట్టడం నేర్పుతుంది. తీరిక వేళల్లో పుస్తకాలు చదువుతుంది. వాళ్లింట్లో లెక్కలేనన్ని చందమామ పుస్తకాలు. ఒక్క చందమామలే కాదు. బొమ్మరిల్లు, పొదరిల్లు, హరివిల్లు, వసంత బాల, బాల భారతి, బుజ్జాయి వంటి పాత పిల్లల పత్రికలు కూడా చూశాను. నాకు పండుగే పండుగ. ఒకరిని అడగాల్సిన పనిలేదు. ఆ పుస్తకాలు వున్న గదిలోకి వెళ్లి, నాకు కావాల్సిన పుస్తకం తెచ్చుకొని స్వేచ్ఛగా చదివి మళ్ళీ వెళ్లి దాన్ని అక్కడ పెట్టి రావడమే. నేను పుస్తకాలు తెచ్చుకోవడం ఎప్పుడైనా సత్యనారాయణగారు చూస్తే చూసినపుడు, నేను కంగారు పడుతూంటే, “ఏం ఫరవాలేదు. తీసుకుపో, చదువుకో కానీ మళ్ళీ తీసుకువచ్చి, ఎక్కడ నుండి తీశావో అక్కడే పెట్టు. ఏం లేదూ.. ఎందుకంటే ఇదివరకు చాలా మంది చదివి తెచ్చిస్తామని తీసుకు వెళ్లి మళ్ళీ తెచ్చింది లేదు.” అన్నాడు. ఆయన మాటలు వినగానే ముందు అర్థం కాలేదు. పుస్తకాలు తీసుకు వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెనక్కి తీసుకురారు? వెనక్కు తీసుకు రాకపోతే మళ్ళీ పుస్తకం అడగలేరుగా.. అంటే వాళ్ళు చదవడం ఆపేశారని అర్థమా?

ఒకరోజు సుశీలమ్మ రెండు కార్డులు ఇచ్చి, “రమణా! ఇవి తీసుకు వెళ్లి మీ స్కూలు పక్కన లైబ్రరీ వుందే అందులో ఇచ్చి వేరే పుస్తకాలు తీసుకురా!” అన్నది. అగ్గిపెట్టె సైజులో వున్న ఆ రెండు లైబ్రరి కార్డులు నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతాయని అప్పడు ఏమాత్రం అనుకోలేదు.

మా స్కూల్లో పండిట్ జీని అడిగితే లైబ్రరీ స్కూలు పక్కనే అని చెప్పి దారి చూపించారు.

మరునాడు పొద్దుటే లైబ్రరీ తెరవక ముందే వెళ్లి పుస్తకాలు తీసుకొని, సాయంత్రం స్కూలు అయిపోయాక సుశీలమ్మగారికి ఇచ్చాను. నేను తెచ్చే పుస్తకాలు ఆమెకు నచ్చేవి కావు. ఆమెకు నచ్చిన పుస్తకాలు తీసుకురావడం అనేది అయిదారు సార్ల వరకు లైబ్రరిలో పుస్తకాలు మార్చితే తప్ప నాకు సాధ్యం కాలేదు. నాకు లైబ్రరీ పరిచయం చేసిన ఆమెను జీవితాంతం మరిచిపోలేను. ఆమె కోసం తెచ్చిన పుస్తకాలు నేనూ చదివేవాడిని. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల లోనే నేను యద్ధనపూడి సులోచనారాణి, అరికెపూడి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన వాళ్ల నవలా సాహిత్యం చాలా వరకు చదివేశాను.

చందమామ మీద నా అభిమానం 1980 మే సంచిక తర్వాత రెట్టింపు అయ్యింది. ఆ సంచికలో తోకచుక్క అనే కొత్త సీరియల్ ప్రారంభమయ్యింది. ఆ సీరియల్ చూడగానే, నాకొక ఆలోచన వచ్చింది, ‘ఎంతసేపు అరువు చందమామలను తెచ్చుకొని చదివి ఇచ్చేయడమేనా, నాకంటూ పుస్తకాలు ఉండొద్దా’ అని. అంతే కాదు, పాత చందమామల్లో జానపద సీరియల్, పౌరాణిక సీరియల్ విడివిడిగా బయటికి తీసి బైండ్ చేయించినవి ఓనర్ వాళ్లింట్లో ఎన్నో వున్నాయి. కంచుకోట, భువనసుందరి కథ, రూపధరుని యాత్రలు, మొదలైన చందమామ 1955 ప్రాంతంలో వచ్చిన సీరియల్స్. నాకు ఆ బౌండ్ పుస్తకాలు చాలా నచ్చాయి. ఒకేసారి సీరియల్ మొత్తం చదివేయడం మంచి అనుభూతి. అలా కాకుండా ప్రతి నెలా సీరియల్ చదివి తరువాత ఏమవుతుందా అని మరుసటి నెల వరకు ఎదురు చూడటం ఇంకో రకమైన అనుభూతి. నేను కూడా ఆ తోకచుక్క సీరియల్ అయిపోయాక అలాగే బైండ్ చేయించుకుంటాను, అని ఆ నెల నుండి చందమామ కొనడం మొదలు పెట్టాను. ఆ రోజు నుండి చందమామతో నా అనుబంధం బలపడుతూ వచ్చింది.

ప్రతి మనిషిలోనూ కొంత బలం వుంటుంది కొన్ని బలహీనతలుంటాయి. ప్రతి నెలా చందమామ చదువుతున్న నేను, అందులోని కథలను, ఆ కథలు రాసే వాళ్ళను చాలా పెద్దగా ఊహించుకొని, అందులో కథలు రాయాలంటే, అబ్బో, అదో పెద్ద వ్యవహారంలే అని ఒక విధమైన ఆత్మన్యూనతా భావంతో చాలా కాలం చందమామకు కథలు పంపాలన్న ఆలోచన చేయలేదు. మనది అందులో కథలు రాసే స్థాయి కాదు అనేది మనసులో ఎక్కడో మూలన ఒక చిన్న అనుమానం. ఒకసారి మొండిగా రెండు కథలు రాసి చందమామలో వున్న అడ్రెస్‌కు పోస్ట్ చేశా. వారం తిరక్క ముందే ఒక కవరు వచ్చింది. అందులో ఒక ఉత్తరం మరో కథా ఉన్నాయి. ‘చందమామ’ లెటర్‌ప్యాడ్ మీద తేది: 13-11-81న రాయబడిన ఆ ఉత్తరంలో ఇలా ఉంది – ‘శ్రీ దాసరి వెంకటరమణగారికి, నమస్కారాలతో.. మీరు పంపిన రెండు కథల్లో సోమరిపోతు అన్న కథ ప్రచురణకు అంగీకరించబడింది. రెండవ కథను దీనితోపాటు తిప్పి పంపుతున్నాం. – దాసు. ఫర్ ఎడిటర్.’ ఆ ఉత్తరం ఎన్ని సార్లు చదువుకున్నానో. మార్చి 1982 చందమామలో నా కథ వచ్చింది. కథ పేరు నీకేలాభం. ఆ కథ ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. చదువంగ చదువంగ నాకు ఒక విషయం అర్థమయ్యింది. నేను పంపిన కథకు ఇప్పుడు ప్రచురించిన కథకు అసలు పోలికే లేదు. కథ పేరు నాది కాదు. అందులో పాత్ర పేరు నేను పెట్టింది కాదు. కథ మాత్రం నాదే. అంటే కథ కేంద్ర బిందువు తీసుకున్నారు. నన్ను రచయితను చేసింది చందమామ అని నాకు అర్థం అయింది.

ఆ తర్వాత చందమామకు అడపా దడపా కథలు రాస్తూనే వున్నాను. అవి అచ్చవుతూనే వున్నాయి. ఒక్కటి మాత్రం మరచి పోలేదు. నన్ను రచయితను చేసింది చందమామ. చందమామకు తిరిగి నేను ఏం చేయగలను అని ఆలోచిస్తే, అప్పుడు అనిపించింది. చందమామ మీద పరిశోధన చేయాలని. నన్ను రచయితను చేసిందీ, మంచి రచయితగా తీర్చిదిద్దిందీ చందమామే! అందుకే చందమామ మీద పరిశోధన చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

చందమామ పత్రిక భారతీయ సంస్కృతినీ, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భారత సాంస్కృతిక రాయబారి. పదహారు భాషలలో వెలువడిన అరుదైన పత్రిక. మూస పద్ధతికి స్వస్తి చెప్పి, తనదైన శైలిలో తెలుగు పిల్లలకు కొన్ని, తరాల పాటు వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పంచి, సంస్కారాన్ని నేర్పిన విశిష్ట పత్రిక చందమామ. అటువంటి చందమామ పత్రిక బాలల వ్యక్తిత్వ వికాసం పై ఎటువంటి ప్రభావం చూపించింది అనే కోణంలో పరిశోధన చేయాలని సంకల్పించాను.

చందమామ ప్రభావాన్ని సమాజంపై విశ్లేషించేందుకు మీరు ఎలాంటి పరిశోధన చేశారు?

జ: చందమామ ప్రభావం అప్పటి సమాజంపై ఏ మేరకు ఉంది అనే విషయాన్ని సహేతుకంగా నిర్ధారించడానికి నేను ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వంద మందిని వివిధరంగాలకు చెందిన వారిని, ఉదా: రచన, సినిమా, ఉద్యోగం ఇలా ఎంపిక చేసుకొని, వారికి ఒక ప్రశ్నావళి ఇచ్చి సమాధానాలు తీసుకున్నాను. వాటిలో ప్రముఖమైన ప్రశ్న మీకు చందమామ పత్రిక తెలుసా అనే దానికి వందకు వందమంది కూడా తెలుసనే చెప్పారు. ‘మీ జీవితం మీద చందమామ ప్రభావం ఉందా? ఉంటే ఏ విధంగా చందమామ మీ జీవితాన్ని ప్రభావితం చేసింది?’ అనే ప్రశ్నలకు 83 మంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ఇద్దరు మాత్రం ఏ మాత్రం ప్రభావం లేదని నిక్కచ్చిగా చెప్పారు. పదిహేను మంది ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. అంటే ఆ రోజుల్లో చందమామ చదివిన వాళ్ళల్లో 83శాతం మందిపై ప్రభావం చూపిందని నిర్ధారణ.

మీ జీవితంలో, రచనా జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చందమామ ప్రాధాన్యం, ప్రభావాలు వివరిస్తారా?

జ: చందమామ పుస్తకాన్ని కేవలం ఒక మామూలు పుస్తకంగా చూడలేం. అందులో పిల్లల మనసులను ఆకట్టుకొని ఊగిసలాడుతున్న పిల్లల మనసులను ఒక క్రమ పద్ధతిలో తన వైపు ఆకర్షించి ముందు వారికి చదివే అలవాటు నేర్పి, తర్వాత వినోదం విజ్ఞానం ద్వారా వికాసం కలిగించే దిశగా వారి ఆలోచనలు సాగింప చేసి, నిదానంగా వారిలో సహనం, ధైర్యం, సత్యం, నిజాయితీ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, దయా, క్షమా, ధర్మగుణం ఇత్యాది కొన్ని మౌలిక భావాలను మెల్లగా నూరిపోస్తుంది. చందమామలోని కథలన్నీ ఏదో ఒక మౌలిక భావాన్ని పిల్లల్లో నాటుతుంది. మంచికి చెడుకు నిరంతర ఘర్షణ జరిగి చివరికి మంచిని విజయం వరిస్తుంది. దురాశా, అసూయా, అహంకారం, అధర్మం వంటివి తాత్కాలికంగా ఉనికిని ప్రదర్శించినా క్రమంగా ఓటమి పాలవుతాయి. అన్యాయం శిక్షించబడి, న్యాయానికి పట్టాభిషేకం జరుగుతుంది.

లక్ష్య సాధన అనే విషయం అనేక కథల్లో కనబడుతుంది. ఉత్తమ వ్యక్తి ఒక సంకల్పం ద్వారా ఒక స్థిర నిశ్చయానికి వచ్చి, ఒక లక్ష్యం ఏర్పరుచుకున్నాక ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని ప్రలోభాలు దారి మల్లించినా చెక్కు చెదరని మనోస్థైర్యంతో లక్ష్యాన్ని చేరుకుంటాడు; అనుకున్నది సాధిస్తాడు. ఇలాంటివి అనేక కథలు పదేపదే చదవడం వలన పిల్లల్లో శీల నిర్మాణం జరిగి చక్కని సంస్కారం ఏర్పడుతుంది.

నా మీద చందమామ ప్రభావం చాలా వుంది. ఒక్క ఉదాహరణ చెబుతాను. చందమామ 1973 సెప్టెంబర్ సంచికలో ‘తిండిదొంగ’అనే ఒక పేజీ కథ ఉంది. ఆ కథ ప్రభావం నా జీవితంలో చాలా ప్రభావాన్ని చూపించింది.

ఒక ధనికుడి ఇంట సంతర్పణ జరుగుతోంది. ఒక వంటవాడు పళ్ళెంనిండా బొబ్బట్లు పెట్టుకొని దొంగతనంగా దొడ్డిదోవన వెళుతుండగా కాపలావాడు పట్టుకొని ధనికుడి ముందు వుంచాడు.

ధనికుడు “ఇదేం పనయ్యా?” అని అడిగాడు.

అందుకు వంటవాడు భయంతోను, అవమానంతోను “అయ్యా! మన్నించండి. నేను కడుపునిండా తిన్నాను. నాకు గంపెడు పిల్లలు. వాళ్ళు తినలేదనే బాధతో ఈ తప్పుడు పని చేశాను” అన్నాడు.

“తప్పు కాదా మరి? ఈ బొబ్బట్లు తిని నీ పిల్లలు కడుపునొప్పితో బాధపడరూ? లోపలికి వెళ్ళి చెంబునిండా నెయ్యి కూడా పట్టుకుపో” అన్నాడు ధనికుడు.

ఆ ఒక్కమాటలో ధనికుడి ఉదారత్వం, ఔదార్యం, బీదలపట్ల సానుభూతి, ఆకలి గురించిన అవగాహన, వితరణ, మాటలో చతురత ఇవన్నీ కనిపించాయి. తప్పు చేసి, దొరికిపోయిన వంటవాడు దండిస్తా డనుకున్న ధనికుడు అలా మాట్లాడేసరికి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఆ వంటవాడి కళ్ళల్లో ప్రతి ఫలించిన కృతజ్ఞత చూసిన ఆ ధనికుడికి కలిగిన ఆనందం డబ్బుతో ముడిపెట్టలేనిది.

వంటవాడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కాపలావాడు తన ధర్మం నిర్వర్తించాడు. ఒకవేళ ధనికుడు వంటవాడిని కోప్పడి వుంటే, ఆ దృశ్యం విషాదాంతం అయ్యేది. అయ్యో పాడు పని చేశానే అని ఆ రోజంతా వంటవాడు బాధపడేవాడు. అయ్యో కాసేపు చూసి చూడనట్టు వుంటే ఆ పేదవాడు ఆ బొబ్బట్లు ఇంటికి తీసుకు పోయి పిల్లలకు పెట్టుకునే వాడు కదా అని కాపలావాడు అనుకునేవాడు. ధనికుడికి ఎంత కరకు గుండె కలవాడైనా ఆ రోజు ఎదో ఒక క్షణంలో ‘అయ్యో పిల్లల కోసం తీసుకు వెళ్తున్న ఆహారాన్ని అడ్డుకున్నానే’ ఒక్క క్షణమైనా బాధపడి వుండే వాడు. కానీ ధనికుడు అన్న ఒక్క మాటతో అక్కడ వాతావరణం తేలికపడి ముగ్గురికీ ఆనందం కలిగింది.

ధనికుడు “సరేలే. ఇంత నెయ్యి కూడా తీసుకుపో” అని వుంటే కూడా ఈ కథ ఇంత బాగా వచ్చేది కాదు. “తప్పు కాదా మరి?” అనే వాక్యంతో కథకు కిరీటం తొడగబడింది.

చందమామలో నాకు బాగా గుర్తుండి పోయిన కథలలో ఇది ఒకటి. నా ప్రవర్తనను ప్రభావితం చేసిన కథలలో ఇది ఒకటి. నా సంభాషణలో ఇలాంటి పాజిటివ్ మాట-విరుపు తొంగిచూస్తూ వుంటుంది.

చందమామలో ఇంకా చాలా గొప్ప కథలుండొచ్చు. కానీ నా జీవన పర్యంతం చాలా సందర్భాల్లో తరచుగా గుర్తుకొచ్చే కథల్లో ఇదొకటి.

అలాంటి సందర్భం మచ్చుకు ఒకటి.. నేను నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలో గ్రామాభివృద్ధి అధికారిగా పని చేస్తున్నప్పుడు మండలాభివృద్ధి అధికారిగా శ్రీ రామిరెడ్డి గారు కొత్తగా వచ్చారు. నా పరిధిలో ఎనిమిది గ్రామాలు ఉండేవి. మేము ప్రతినెల ఏయే గ్రామాలు టూర్ తిరిగామో టూర్ డైరీ సమర్పించాలి. నాలుగైదు నెలలకు ఒకసారి బడ్జెట్ వచ్చినపుడు ఆ టూర్ బిల్లులు క్లియర్ చేస్తారు. ఒకసారి అలా బడ్జెట్ వచ్చినపుడు నేను ఆగస్ట్ నెల టూర్ డైరీ సబ్మిట్ చేయలేదని అక్కౌంటెంట్ ఫిర్యాదు చేయడంతో, రామిరెడ్డిగారు నన్ను పిలిచి “వెంకటరమణా! నీవు ఆగస్ట్ నెల టూర్ డైరీ ఇచ్చావా?” అని అడిగారు.

నేను ఇవ్వలేదు. దానికి కారణ వుంది. నాకు ఇక చీవాట్లు తప్పవనుకున్నా. కారణం చెప్పాలని ప్రయత్నిస్తూ “సార్! ఏం జరిగిందంటే..” అంటూ చెప్పబోయాను.

“నీవు ఆగస్ట్ నెల టూర్ డైరీ ఇచ్చావా? లేదా?”

“సార్.. నేను..”

“ఆగస్ట్ నెల టూర్ డైరీ ఇచ్చావా? లేదా?”

“అది కాదు సార్..”

“టూర్ డైరీ ఇచ్చావా? లేదా?”

“అసలేం జరిగిం..”

“ఇచ్చావా? లేదా?” ఆయన స్వరం పెంచారు.

నేను నిర్లిప్తంగా, స్థిమితంగా, ప్రశాంతంగా “ఇవ్వలేదు సార్!” అన్నాను.

“ఇప్పుడివ్వు”

నేను చప్పున తలెత్తి ఆయన వంక చూశాను. ఆయన యథావిధిగా తన పనిలో నిమగ్నమై వున్నారు. ఆయన ముఖంలో ఏ భావమూ లేదు. నాకు చప్పున పై కథ గుర్తుకు వచ్చింది.

నా వ్యక్తిగత జీవితంలో ఈ కథ ప్రభావం చాలా వుంది. సాధ్యమైనంత వరకు అవతలి మనిషికి మానసిక ఒత్తిడి లేకుండా చూస్తాను. వీలయితే వాళ్ళు మరింత సంతోష పడేలా నా భాష ఉండేలా జాగ్రత్త పడతాను. కొంత మంది నా వాక్య ప్రయోగాన్ని చప్పున ఎగతాళిగా భావిస్తారు. వారికి అందులోని సొగసు నిదానంగా అర్థం అవుతుంది. నా కింది ఉద్యోగులు ఏదైనా తప్పు చేస్తే దీన్ని సరిచేయడానికి నీకు ఎంత సమయం కావాలని అడిగితే వాళ్ళు పది నిమిషాల్లో పూర్తి చేస్తాం సార్ అంటారు. లేదు మీరు ఇరవై నిముషాల్లో పూర్తి చేయండి అంటాను. వాళ్లకు అది అర్థం కావడానికి రెండే సెకన్లు పడుతుంది. అర్థం కాగానే అంతసేపు టెన్షన్‌తో వున్న వాళ్ళ ముఖం ఒక్కసారిగా మెల్లగా విచ్చుకుంటుంది. చిన్న చిరునవ్వుతో థాంక్యూ సార్ అంటూ వెళ్తారు. నాకు ఎదుటి వాళ్ళల్లో అలాంటి ఫీలింగ్ చూడటం చాలా ఇష్టం.

నేను నిజామాబాదు డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ గా FAC (Full Additional Charge) గా చాలా కాలం పని చేశాను. నాకు ప్రమోషన్ వచ్చిన రోజు ఆర్డర్స్ తీసుకున్నాక మా సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అమ్మా శ్రీరాములుకు చెప్పి పెయింటర్‌ను పిలిపించి నా నేమ్ బోర్డులో వున్న FAC అనే అక్షరాలు తీసేయమని చెప్పు అన్నాను. ఆమె వెంటనే ఎందుకు సార్? అని వెంటనే ఒక్క క్షణంలో సార్ మీకు కంగ్రాచ్యులేషన్స్ అన్నదామె. ఈ తత్వం నాకు చందమామ నేర్పితే, రామిరెడ్డిగారు చిరస్మరణీయంచేసి నా జీవితాన్ని రమణీయం చేశారు. నా ఈ తత్త్వం నూటికి ఒకరిద్దరికి నచ్చదు. వారికి నేను అహంకారిగానో, ఎకసెక్కాలు ఆడుతున్న మనిషిగానో కనపడతాను. వాళ్ళ తత్త్వం నాకు ముందుగ తెలిస్తే మాత్రం వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను.

చందమామ నాకు చాలా విషయాలు నేర్పింది. మనసులో మెదిలే భావాలను అక్షరాలుగా మార్చి అందంగా ప్రెజెంట్ చేయడం నేర్పింది. మన జీవితంలో ఎదురయ్యే రకరకాల మనుషులతో ఎలా మసులుకోవాలో నేర్పింది. సమస్య ఎదురయినప్పుడు కంగారు పడకుంగా సమస్యను విశ్లేషించడం నేర్పింది. దాని పరిష్కారం దిశగా ఆలోచించడం నేర్పింది. ముఖ్యంగా నాకు అందమైన రచనా శైలి నేర్పింది. తెలుగంటే వల్లమాలిన ఇష్టంగా మార్చింది.

చందమామ మీకు పరిచయం కాకుండా ఉంటే మీ జీవితం ఎలా ఉండివుండేదో ఊహించి చెప్తారా??

జ: కచ్చితంగా ఇప్పుడున్న స్థితిలో ఉండేవాడిని మాత్రం కాదు. ఈ జీవితాన్ని నాకు కచ్చితంగా చందమామే ఇచ్చింది. నాకు చందమామ పరిచయం కాకుండా వుంటే అసలు రచయితను కాక పోదును.

ఇప్పుడు మనం చందమామ తెలియని తరాలను చూస్తున్నాం. ఆకాశంలో చందమామను చూసే తీరిక లేదు. చందమామ పత్రికా లేదు. ఈ తరాలు ఏం కోల్పోతున్నాయనుకుంటున్నారు?

జ: చాలా కోల్పోతున్నాయి. తీరిగ్గా కూర్చొని లెక్కేస్తే ఆ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. ఒక్క విషయం చెబుతాను. గతంలో అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు ఎన్నడైనా విన్నామా? మరి ఎందుకు ఇప్పుడు పిల్లలు టప టప రాలిపోతున్నారు? మార్కుల మాయలో వాళ్ళ చదువును కేవలం తరగతి పుస్తకాలకు మాత్రమే పరిమితం చేస్తూ, కనీసం వాళ్లకు ఆహ్లాదం కలిగించే నాలుగు మాటలు కూడా చెప్పటం లేదు. ఎందుకంటే టైమ్ వేస్ట్. ఆ సమయంలో తరగతి పుస్తకాల్లో కొంత సిలబస్ పూర్తి చేస్తారు. ఇదీ లెక్క. అయితే దారుణంగా వ్యవస్థ లెక్క తప్పిన కారణంగా పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. గతంలో పరీక్షలు ఫెయిల్ అయితే అబ్బాయిలు అమ్మాయిలు చనిపోయిన సందర్భాలు చాలా తక్కువ. అసలు లేవని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్నాయి. ఓటమిని ఏమాత్రం భరించడం లేదు పిల్లలు. వీటన్నిటికీ కారణం ఒక్కటే. వాళ్లకు ప్రస్తుతం సమాజంలో బ్రతకడానికి అవసరమైన చదువు లభించడం లేదు. వాళ్లకు తరగతి సిలబస్ లోని చదువుతో పాటు ఇంకో చదువేదో కావాలి. ఆ చదువు ఎక్కడ దొరుకుతుంది? చందమామ పత్రిక ఆ రోజుల్లో పిల్లలకు ఈ చదువే అందించింది. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో చదువు పూర్తి చేసుకొని, ఒక డాక్టరు, ఒక ఇంజినీర్, ఒక సైంటిస్ట్, ఒక లాయర్, క్షణాల్లో లెక్క వేసి అప్పజెప్పే కంప్యూటర్ మేధావులు బయటికి వస్తున్నారు తప్ప పరిపూర్ణ మానవుడు రావడం లేదు. చందమామ కథల వంటివి చదవడం ద్వారా మాత్రమే మనిషికి పరిపూర్ణత్వం లభిస్తుంది.

బాల సాహిత్య రచయితగా మీ ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఏమిటి?

జ: మనిషి మనసును సంస్కరించి, మంచి వైపు మరల్చగల మహత్తర శక్తి సాహిత్యానికి వుంది. అయితే అది చాలా లేత వయసులో జరిగితేనే మిక్కిలి ఉపయుక్తంగా వుంటుంది. బాలసాహిత్యం చాలా శక్తివంతమైనది. అది రేపటి తరాన్ని శాసిస్తుంది నేటి పిల్లల్ని ప్రతిభావంతంగా సంస్కరించి రేపటి ప్రపంచాన్ని మారుస్తుంది. ఈ లక్ష్యం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం బాల సాహిత్య సృజన జరగాలి. ప్రస్తుతం బాల సాహిత్యం రాసే వాళ్ళు చాలా మంది వున్నారు. ప్రచురించే వాళ్ళూ బాల సాహిత్యం అంటే ఆసక్తి చూపుతున్నారు. పిల్లల్లో కూడా రచనలు చేసేవాళ్ళు తయారవుతున్నారు. కానీ చదివేవాళ్ళే తక్కువయారు. బాలసాహిత్యం ప్రథమ లక్ష్యం ఎక్కువ మంది పిల్లలకు చేరడమే. బాలసాహిత్యాన్ని, రచయితలను ప్రోత్సహించే దిశగా నేను ఏమైనా చేయగలనా.. ఆలోచించాలి..

మీకు బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ రచన గురించి చెప్పండి.

జ: 2014లో ఆనందం అనే నా పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (రూ.50,000 నగదు పురస్కారంతో) వచ్చింది. గతంలో చందమామలోనూ ఇతర పత్రికలలోనూ ప్రచురించబడిన కొన్ని కథలను తీసుకొని సంకలనంగా వేసిన పుస్తకమే ఆనందం.

ఆనందం ప్రచురించబడిన 2009లో ఈ సంపుటి లోని 7 కథలను విజయవాడ సమీపంలో గల పోరంకి లోని వికాస విద్యావనం హై స్కూల్ (CBSC) లో 6వ తరగతికి పాఠ్యాంశాలుగా తీసుకున్నారు.

కర్నాటకకు చెందిన డా. సి. గోవిందరెడ్డిగారు ఈ ఆనందం పుస్తకాన్ని 2018లో ‘ఆనంద’ పేరున కన్నడం లోనికి అనువాదం చేయగా, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తరుపున భాషాభారతి ప్రాధికార సంస్థ దానిని ప్రచురించింది.

షోలాపూర్‌కు చెందిన రచయిత్రి శ్రీమతి రేణుకా బుధారంగారు ఈ ఆనందం పుస్తకాన్ని ‘ఆనంద్’ పేరున మరాఠి భాషలోనికి అనువాదం చేశారు. అందులోని ‘ఆనంద్’ అనే మొదటి కథను షోలాపూర్ లోని పుణ్యశ్లోక్ ఆహిల్యా దేవి హోల్కర్ అనే యూనివర్సిటిలో బి.ఏ. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా సిలబస్‌లో చేర్చారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఆనందం పుస్తకాన్ని మొత్తం 24 భారతీయ భాషలలోనికి అనువాదం చేయించి, ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట శ్రీమతి పారనంది నిర్మలగారు ‘ఆనందం’ పేరుతోనే హిందీలోకి అనువాదం చేశారు.

మీ రచనల వివరాలు తెలపండి

జ: రాసిన మొదటి కథ: మాయదారి సింహం (అముద్రితం) ఆరోతరగతి పరీక్షలయ్యాక 12 ఏళ్ళ వయసులో రాశాను.

అచ్చయిన మొదటి కథ: నీకేలాభం (02.07.1981) చందమామ 1982 మార్చి సంచికలో వచ్చింది. చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాలచంద్రిక, తెలుగు నాడి (అమెరికా మేగజైన్), బాలమిత్ర, బుజ్జాయి, బాలరంజని, బలచెలిమి, బాలబాట, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, స్వాతి, ఉదయం, ఆంధ్రప్రదేశ్ ఈనాడు, చతుర, రచన, నమస్తే తెలంగాణా, బాలభారతం, తాండూర్ టుడే, శ్రీకృష్ణ మంత్ర, ప్రజాశక్తి, దిశ, శ్రీవాణి పలుకు మొదలగు దిన, వార, మాస పత్రికలలో ఇంకా SumanTV, Sukatha.com, gotelugu.com, kahaniya.com, pustaka.com and pratilipi మొదలైన వెబ్ సైట్లలో దాదాపు 500 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురితం.

పుస్తకాలుగా వచ్చినవి: అమ్మ మనసు, ఏది దానం?, ఆనందం, పురాణబాలలు, చేదు మాత్రలు, మా పిల్లికి లెక్కలొచ్చు, చందమామ కథలు – వ్యక్తిత్వ వికాసం (ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్.డీ. డాక్టరేట్ పొందిన పుస్తకం ముద్రణలో ఉంది.), భవిష్యత్తును రక్షించండి (ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ బహుమతి పొందినది.. అముద్రితం) ఈ రాగాలింతే.. స్త్రీ పాత్ర లేని నాటిక (అముద్రితం 1985-87 ప్రాంతంలో నాలుగైదు ప్రదర్శనలు జరిగాయి.), తపస్సు (నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ఆంగ్లం నుండి అనువాదం), ఆకాశం లోకి..( నేషనల్ బుక్ ట్రస్ట్ ఆంగ్లం నుండి అనువాదం).

ఇతర భాషలలోనికి అనువాదమైనవి: ఆనందం పుస్తకాన్ని డా. సి. గోవిందరెడ్డిగారు ‘ఆనంద’ పేరున కనడం లోనికి అనువాదం చేయగా, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తరుపున భాషాభారతి ప్రాధికార సంస్థ దానిని ప్రచురించింది. ఆనందం పుస్తకాన్ని శ్రీమతి రేణుకా బుధారంగారు ‘ఆనంద్’ పేరున మరాఠి భాషలోనికి అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడెమీ ఆనందం పుస్తకాన్ని మొత్తం 24 భారతీయ భాషలలోనికి అనువాదం చేయించి, ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట శ్రీమతి పారనంది నిర్మలగారు ‘ఆనందం’ పేరుతోనే హిందీలోకి అనువాదం చేశారు. కొన్ని కథలు, కవితలు హిందీ, కన్నడ, మరాఠీ, ఆంగ్ల భాషలలోనికి అనువాదం జరిగి వివిధ పత్రికల్లో, మాధ్యమాల్లో ప్రచురితం అయినాయి. నా కథ ‘ఆటలో ఆనందం’ 22 భారతీయ భాషలలోనికి అనువాదం చేయడానికి కేంద్ర సాహిత్య అకాడెమీ ఎన్నిక చేసింది. తెలుగులో 2021లో ‘మంచి కథలు’ పేరుతో అకాడెమీ ప్రచురించిన పుస్తకంలో ఈ కథ ఉంది.

పాఠ్యాంశాలుగా నా కథలు: ‘ఆనందం’ కథ మరాఠి అనువాదం ‘ఆనంద్’ షోలాపూర్ యూనివర్సిటిలో బి.ఏ. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా సిలబస్‌లో చేర్చారు. ‘పల్లెకు పోదాం’ అనే కథ మహారాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లోనూ, ‘వేగుచుక్క’ అనే కథ మహారాష్ట్ర ప్రభుత్వం 12వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లోనూ తీసుకున్నారు. ఆనందం కథల సంపుటి లోని 7 కథలను విజయవాడ సమీపం లోగల పోరంకి లోని వికాస విద్యావనం హై స్కూల్ (CBSC) లో 6 వ తరగతికి పాఠ్యాంశాలుగా తీసుకున్నారు.

సినిమా: ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాలో రాసిన ‘అందాలోలికే మా ఇల్లు..’ అనే పాట మంచి పేరు తీసుకు వచ్చింది. 2024 డిసెంబరు 27 రోజున ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ‘రోహిణి’ అనే సినిమాకు అన్ని పాటలు (సింగిల్ కార్డు) నేనే రాశాను. పాటల రికార్డింగ్, చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. ఇంకా విడుదల కాలేదు.

లఘు చిత్రాలు: అద్దంలో చందమామ 10 ని. నిడివి కల ఈ లఘు చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించాను. ఈ చిత్రం శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లఘు చిత్రాల పోటీలో రెండవ ఉత్తమ చిత్రంగా రూ. 20,000/- నగదు బహుమతి పొందింది.

జాగ్రత్త.. స్థిరాస్తి కొనేముందు 15 ని.ల లఘు చిత్రానికి రచన- దర్శకత్వం వహించాను. ఆస్తులు కొని రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తుంది. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ, అధికారిక వెబ్సైటు లోనూ, యూ ట్యూబు లోనూ ఉంది.

ప్రగతి.. 1 ని. నిడివి గల చిత్రం చదవడం ఆపేసినవాడు ఎదగడం మానేసిన నాడు ప్రగతి ప్రశ్నార్థకం అనే సందేశంతో తీసిన లఘు చిత్రం.

దూరదర్శన్: మహాకవి భారవి: నేను కథ, మాటలు, పాటలు సమకూర్చిన ఈ టి.వి. సీరియల్ దూరదర్శన్ లో 1998లో 13 వారాల పాటు ప్రసారమైంది. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వివిధ కేటగిరీలలో మొత్తం 4 నంది బహుమతులను గెలుచుకుంది)

ఆకాశవాణి: ‘శిక్ష’, ‘చిన్న చేపను చిన్న చేపే..’ వంటి శ్రవ్య నాటికలను రచనతో పాటు పాత్రధారిగా రికార్డింగ్ లో పాల్గొన్నాను. ఇంకా ఆకాశవాణి వివిధ కేంద్రాలలో అనేక కథలు, కవితలు, వ్యాసాలు ప్రసారితం.

మీకు జరిగిన సత్కారాలు, వచ్చిన బహుమతులు, బిరుదుల వివరాలు ఇవ్వండి.

జ: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు: ‘ఆనందం’ పిల్లల కథల పుస్తకానికి (2014) లో 50,000 నగదుతో ఈ పురస్కారం లభించింది.

పిల్లల్లో సృజనాత్మకతతో పాటూ పఠనాసక్తి పెంచాలంటే ఏం చేయాలంటారు?

జ: అది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. మన పెరట్లో మొక్క మనం ఎటు వంచితే అటువంగి పెరుగుతుంది. ఆ పధ్ధతి మన పిల్లల విషయంలో ఆచరించలేక పోతున్నాం. అందుకు కారణాలనేకం. పిల్లల ముందు ఒలిచి గిన్నెలో పెట్టిన వేరుసెనగ గింజలు వొలవని వేరుసెనగ కాయలు పెడితే, వాడు కచ్చితంగా ఒలిచిన గింజలు తీసుకొని తింటాడు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి అలా వుంది. కార్టూన్ నెట్‌వర్క్‌లో సినిమాలు, ఇంటర్నెట్‌లో ఆటలకు అలవాటు పడిన పిల్లలకు సృజనాత్మకత అలవడదు. వాళ్లకు రోజూ కథ చెప్పాలి. ఎవరో ఒకరు ప్రతిరోజూ చెప్పాలి. కథ చెప్పడం, వినడం అనేది ఏమాత్రం సమయం తెలియకుండా చేసే ఒక విధమైన ధ్యానం. వాళ్ళు ఒక అలౌకిక రస జగత్తులో ఓలలాడుతూ ఉంటారు. కథ వినడం అనేది వినడం అనే ప్రక్రియకు నాంది. ఒక ఆసక్తికి సంకేతం. ఓర్పుకు, సహనానికి గుర్తు. ముందు జ్ఞాపక శక్తి పెరగడానికి మందు. కథల పట్ల వారికి బాగా ఆసక్తి పెరిగాక వారికి అక్షరజ్ఞానం వచ్చి చదవడం రాయడం అలవాటు అయ్యాక వారికి కథల పుస్తకాలను పరిచయం చేయాలి. ఒక్కసారి ఆ పుస్తకాలకు అలవాటు పడితే ఆ పిల్లల భవిష్యత్తు ఊహించలేనంత చక్కగా ఉంటుంది.

మీరు పదవీ విరమణ చేశారు. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: నేను తెలుగు యూనివర్సిటీ లో పీ.జీ.డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాను. కోర్సులో భాగంగా నా రచన, దర్శకత్వంలో నిర్మించిన ‘అద్దంలో చందమామ’ అనే పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కథామృతం అనే నా యూట్యూబ్ ఛానెల్ లో వుంచితే మంచి స్పందన వచ్చింది. పరుచూరి గోపాలకృష్ణ గారి నేతృత్వంలో స్క్రీన్ ప్లే, లిరిక్ రైటింగ్ వంటి సర్టిఫికేట్ కోర్సులు చేశాను. సినిమా ఫీల్డ్ కు సంబంధించి లిరిక్ రైటర్ గా ప్రయత్నం చేస్తున్నాను. ‘ఓ తండ్రి తీర్పు’ (విడుదల తేది: 27.12.2024) అనే సినిమాకు అందాలోలికే మా ఇల్లు అనే ఒక పాట రాశాను. దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రోహిణి అనే సినిమాకు అన్ని పాటలూ నేనే రాశాను. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావలసి వుంది. ఈ మధ్యే ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్ లో పాటల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వచ్చిన అతిథులు పాటలు బాగున్నాయని మంచి మేలోడీలని మెచ్చుకోవడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు దాసరి వెంకట రమణ గారూ.

దాసరి వెంకట రమణ: ధన్యవాదాలు.

🙏

~

శ్రీ దాసరి వెంకట రమణ పదవీవిరమణ ప్రత్యేక సంచిక ‘విరమణీయమ్’ పుస్తక పరిచయం:
https://sanchika.com/viramaneeyam-book-intro-kss/

Exit mobile version