Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత, సినీ గీతరచయిత శ్రీ భువనచంద్ర ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘మహతి’ అనే నవల వెలువరించిన భువనచంద్ర గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం భువనచంద్ర గారూ.

భువనచంద్ర: నమస్కారం.

~

ప్రశ్న 1. సంచికలో ధారావాహికగా ప్రచురితమైన మీ మహతినవలని పుస్తక రూపంలో వెలువరించినందుకు అభినందనలు. ఇది మీ ఎన్నో నవల? మీ ఇతర నవలల గురించి చెప్పండి.

జ: ధన్యవాదాలు. ఇది నా 18వ పుస్తకం. ఇక నా ఇతర పుస్తకాల గురించి చెప్పాలంటే, నేను ముందు డిటెక్టివ్ నవలలు రాశాను. మొత్తం 5 డిటెక్టివ్ నవలలు రాశానండీ, అందులో 3 నా దగ్గరున్నాయి. మిగతావి మిస్సింగ్. అది డిటెక్టివ్ నవలల కథ. మిగతావి 11 ప్రచురితమయ్యాయి. 11+3=14. మొన్న ఈ మధ్య రెండు పుస్తకాలు వచ్చాయి. పాండీబజార్ కథలు, మహతి. మహతితో కలుపుకుంటే 16. మిస్సింగ్‌వి కూడా లెక్కిస్తే 18. ఇవీ నా నవలల హిస్టరీ అండీ.

ప్రశ్న 2. మీరు కథా, నవలా రచయితగా, సినీ గేయ రచయితగా సుప్రసిద్ధులు. తొలిసారిగా ఏ ప్రక్రియతో రచనా రంగంలోకి అడుగుపెట్టారు? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరించండి.

జ: న్యాయంగా చెప్పాలంటే, భారతి అనే పత్రిక వచ్చేది. ఆంధ్ర పత్రిక వారిది. కాశీనాథుని నాగేశ్వరరావు గారిది. ఆ భారతిలో ‘కూలిన గోడలు’ అనే చిన్న కవిత ప్రచురితమైంది. సరదాగా పంపించాను, ప్రింట్ చేస్తారో లేదో తెలియదు. First time I wrote. అది పబ్లిష్ అయింది. అలాగే Rain Rain And Rain అని ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకి ఇంగ్లీషులో ఒక చిన్న కథ వ్రాసి పంపించాను. అది నేను ఎయిర్ ఫోర్స్‌లో ఉండగానే I think 1973 or 74లోనో, ఇంకా ముందరో పబ్లిష్ అయింది. అది నా దగ్గర లేదు ప్రస్తుతం. ఎయిర్ ఫోర్స్‌లో ఉండగా నా సామాన్లు కొన్ని పోయాయి. వాటిల్లో ఈ పత్రిక కాపీ కూడా ఉంది. ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ బాధ్యతల్లో పడిపోయాను. సినిమాల్లోకి రాకముందు 1982లో ‘సర్పశిల’ అని ఒక నవల దాదాపు 1700 పేజీలు రాసి ఉంచాను. ‘అతడు ఆమె ఆనందం’ అని ఓ 160 పేజీలు వ్రాశాను. అంటే మొదలుపెట్టడం, మధ్యలో పక్కన పడేయడం జరిగింది. ఇన్‍కంప్లీట్‌గా వదిలేసిన ‘సర్పశిల’ నవలని భాష అన్నీ మార్చాను. నాలుగేళ్ళ క్రితం కౌముదిలో ధారావాహికగా ప్రారంభమైంది. సో, రైటింగ్ ఎక్కడ్నించి మొదలుపెట్టాననేది కరెక్ట్‌గా చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే, 17, 18 ఏళ్ళొచ్చేసరికి రోడ్ మీద ఏది కనిపిస్తే, దాని మీద కవితలు వ్రాయడం; ఎవరు ఏ మాటంటే ఆ మాట మీద.. ఉదాహరణకి కుండ అన్నారనుకోండి, కుండ మీద, బండ అంటే బండ మీద కవిత రాశాను. అలా రోజుకి ఇరవై, ముప్ఫై.. ఏదో కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా రాసేవాడిని. అలాగే పాటలు రాసుకున్నాను. నాలుగువేలకు పైగా పాటలు, సినిమాల్లోకి రాకముందు.. ఎయిర్ ఫోర్స్‌లో ఉండగానే రాసుకున్నాను. గట్టిగా చెప్పాలంటే 18వ ఏట నుంచి ఇప్పటి వరకూ అంటే 75 ఏళ్ళ వరకూ ఏదో ఒకటి రాయని రోజు లేదు.

ప్రశ్న 3. సాధారణంగా ఒక నవల రాయడానికి మీకెంత కాలం పడుతుంది? రోజుకి ఎన్ని పేజీలు రాయాలని ప్రణాళిక వేసుకుంటారు? ఈ నవలా రచన మీ ప్రణాళికలకు అనుగుణంగానే సాగిందా లేక ఏవైనా ఆటంకాలు ఎదురయ్యాయా? ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?

జ: అస్సలు లేదండీ. ప్రణాళికలేవీ లేవు. ప్రణాళిక అన్నది ఎప్పుడు వస్తుందంటే, రాయదలచినది ఏదో మీరు డిసైడ్ చేస్తే, ప్రణాళిక వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రైమ్ కథ రాయాలి అనుకుంటే – క్రైమ్ ఎప్పుడు మొదలుపెట్టాలి?, కేరక్టర్స్ ఏమిటి? ఎలా మొదలుపెట్టాలి, ఏం చేయాలి? అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. అట్లాగే ఒక సోషల్ నావెల్ రాయాలి.. సాంఘికమైనట్టిది.. దీనిని ఎలా మొదలుపెట్టాలి, ఎన్ని కేరక్టర్లు ఉండాలి, ఎప్పుడు ఏ కేరక్టర్ రావాలి.. అని ప్రణాళిక ఉంటుంది. ఇప్పటి వరకు నేను రాసినదాంట్లో ఏనాడు నేనొక ప్లాట్ అనుకుని రాయలేదు. ఉదాహరణకి ‘మహతి’ నవలే తీసుకుందాం. మహతి నవల ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది ఒక చిన్న ఇన్సిడెంట్‌తో. ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరు అక్కడ అడ్మిట్ అయ్యారు. అక్కడి ప్రెమిసెస్ ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పలేను. అ ఊరి పాలిటిక్స్ సంగతి చెప్పలేం. ఇంతమంది  ఉన్నారన్నారు, మేం సేవ చేయడానికి వస్తున్నాం అన్నారు, ఒక్కడు సేవ చేసే నాయకుడు నాకు కనిపించలా. సేవ చేసేటి ఉద్దేశం ఉన్న చదువుకున్నవారెవరూ నాకు కనిపించలా. చదువుకోని వాళ్ళని అడిగితే, వాళ్ళేం చెబుతున్నారంటే – మేమేం చేయగలమండి, మాకు అధికారం లేదు, చదువు లేదు, డబ్బు లేదు అన్నారు. అంతలో ఒక చిన్నపిల్ల అటుగా వెళ్తూ, నన్ను చూసి, “Uncle have you newly come to this place?” అని ఇంగ్లీషులో అడిగింది. “అవునమ్మా” అని, “నీ పేరేంటి?” అని అడిగాను. చెప్పింది. “కానీ ప్రెమిసెస్ చూడండి అంకుల్, ఎంత అసహ్యంగా ఉందో” అంది. She is around 18 years. అప్పుడు నాకనిపించింది, ఈ ప్రెమిసెస్ అసహ్యంగా ఉన్నాయని ఓ 18 ఏళ్ళ పిల్ల రికగ్నైజ్ చేసి, what should be done అని అడిగి, మనం ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. అక్కడ ప్రారంభమైంది మహతి అనే నవల. నవల ప్రారంభం మహతి చిన్నప్పటి నుంచి విలేజ్‌లో మొదలైనా, వేదిక ఏమిటంటే, ఇంటర్మీడియట్. నేను తీసుకున్న వేదిక, ఇటు హైస్కూలూ కాదూ, అటు కాలేజీ కాదు. ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే, డిఫరెంట్‌గా ఉండడమే కాదు, అప్పుడు ఎదుగుతున్నటువంటి ఆడపిల్లల మనసులోని ఆలోచనలన్నీ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుందని అలా చేశాను.

ప్రశ్న 4. “జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ నా విషయంలో తిరిగింది. ఒక సామాన్య మధ్య తరగతి ఆడదాని జీవితంలో ఏవుంటుందీ జరగడానికీ, అనే ప్రశ్న అందరిలోనూ వుదయిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఏది అయినా జరిగింది జరిగినట్టు యథాతథంగా రాస్తే? భారతీయ పవిత్రాత్మలు పగిలి ముక్కలైపోవూ? అందుకే ఏ ఆడదీ పెదవి విప్పదు. విప్పితే భూనభోంతరాళాలు పిక్కటిల్లిపోతాయి. బట్.. హు కేర్స్? నేను లెక్క చెయ్యదలచుకోలేదు. అందుకే పాఠకులారా.. తరవాత నేను రాసేదాన్ని చదవాలో వద్దో మీరే నిర్ణయించుకోండి.” – నవల ప్రారంభంలోనే పాఠకులకు ఆసక్తి కలిగించేటటువంటి వాక్యాలతో సన్నివేశాన్ని సృజించటం చక్కని టెక్నిక్. ఈ సందర్భంగా – మీరు నవలలు వ్రాసే పద్ధతి ఎలా ఉంటుందో (ప్లాట్, సినాప్సిస్, ఛాప్టర్/సెక్షన్ డివిజన్ – తదితర అంశాలు) పాఠకులకు వివరిస్తారా?

జ: నా నవలా రచనా పద్ధతి గురించి పై ప్రశ్నలో కొంత చెప్పుకున్నాం. మీరు నా గురించి ఎక్కువగా ఊహించుకున్నారు. కానీ నేనది కాదండి. ఎందుకంటే, నేను మిలిటరీ వాడినని ఊహించుకుంటే, నేను మిలిటరీవాడిని. రైటర్ అనుకుంటే నేను రైటర్‍ని. సినిమా పాటల రచయితని అనుకుంటే పాటల రచయితని. కానీ, దయచేసి నన్ను ఎసెస్ చేసే ముందర ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను కేవలం మానవుడిని. This is the beginning of the novel. దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. Anything can be written. ఒక కోకిల కుహూ అని అరిచింది, వెంటనే నేను కుహూ అని దాన్ని ఇమిటేట్ చేస్తూ అరిచాను. అది మళ్ళీ అరిచింది. నేను మళ్ళీ అరిచాను. సడన్‌గా చూస్తే మూడవసారి కుహూ అని వినిపించింది. ఎక్కడా అని చూస్తే, ఎదురింటి సత్యవాణి. నా వంక చూస్తూ కుహూ అని కూసింది. అంతే, ఇదొక రచనకి ప్రారంభం అయింది.

ప్రశ్న 5: “కుటుంబం కూడా శరీరం లాంటిదే. శరీరంలో ఏ పార్టుకి దెబ్బ తగిలినా మొత్తం శరీరం బాధపడ్డట్టుగానే, కుటుంబంలో ఏ ఒక్కరి మనఃస్థితి సరిగ్గా లేకపోయినా, ఆ ఎఫెక్టు మొత్తం కుటుంబం మీద పడుతుంది.” అన్నారు ఓ సందర్భంలో. కేవలం నాలుగైదు వాక్యాలలో కుటుంబ వ్యవస్థ స్వరూప స్వభావాలని కళ్ళకు కట్టడం ఎలా సాధ్యమైంది?

జ: కాలి బొటనవేలిలో తుమ్మముల్లు గుచ్చుకుంది. అబ్బా అంటుంది నోరు. ముల్లు గుచ్చుకున్నది కాల్లో అయితే నోరు ఎందుకు అరిచింది? అంటే, గుచ్చుకున్నది కాల్లో అయినా, మొత్తం శరీరానికి ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో, ఒక కుటుంబంలో ఒకడు చెడిపోయాడనుకోండి, entire family will suffer. ఒక కుటుంబంలో ఒకడి ఆలోచనా పద్ధతి సరిగా లేదు, అప్పుడు entire family will affect. ఒక కుటుంబంలో ఒకడు వ్యసనపరుడనుకోండి, పేకాడుతాడు, వ్యభిచారం చేస్తాడు.. ఎట్సట్రా ఎట్సట్రా.. ఆ కుటుంబానికి పిల్లనివ్వాలి అంటే ప్రతి వాళ్ళూ భయపడతారు. “అది కాదయ్యా, ఆ ఒక్క పిల్లాడే కదా, మిగతా ఫ్యామిలీ అంతా మంచిదే కదా” అని ఎవరైనా అంటే, “అటువంటి వాడు ఒకడున్నాడంటే, ఇక ఫ్యామిలీ సంగతి మనమేం చూశాం”,  అంటారు. అర్థమవుతోందా? So, your body is a combination of many things. తమ్ముడు తమ్ముడు, అన్నలు అన్నలు, తండ్రి తండ్రి, తల్లి తల్లి లాగా తల తల, కళ్లు కళ్ళు, చేతులు చేతులు, కాళ్ళు కాళ్ళు కావు.. ఇదీ ఒక సంఘటితమైనదే. సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అంటే బుద్ధుడిని శరణం వేడుకోమని కాదు; నీ బుద్ధిని శరణం వేడుకోమని! అలాగే సంఘం.. శరీరంలో ఉండే భాగాలన్నీ మీరు ఏదైతే ఆలోచిస్తారో అది చేయడానికి ఎలాగైతే ఉంటాయో; ఈ సంఘం కూడా – ఒకటి చేద్దామనుకున్నప్పుడు, అందరూ కలిసి మెలసి చేయాలి. ఉదాహరణకి, ఇప్పుడు నేను బజారుకి వెళ్ళి ఒక ఐటమ్ కొనాలి. నా కాళ్ళూ సహకరించాలి, చేతులూ సహకరించాలి, జేబూ సహకరించాలి. అన్నీ సహకరిస్తేనే కదా, నేను బజారుకి వెళ్ళగలను? నా కాళ్ళు మేము రాము అని మొండికేసి, కదలకుండా ఉంటే ఏం చేయగలను? పోనీ, కాళ్ళున్నాయి. కానీ చేయి జేబులోకి వెళ్ళడం లేదు, ఎంత ప్రయత్నించినా చేయి లోపలికి వెళ్ళడం లేదు, can I buy? అనేక అవయవాల యొక్క పొందిక శరీరమైతే, అనేక కోట్ల జీవుల యొక్క పొందిక సమాజం.

ప్రశ్న 6. “మనిషి కనిపెట్టినవి అతి ముఖ్యమయినవీ, అతి అనాలోచితమైనవీ రెండు. ఒకటి డబ్బు, రెండోది ఎండమావి లాంటి పరువు-ప్రతిష్ఠ.” ఈ వాక్యాల ఆధారంగా ఎన్నో కథలూ నవలలూ వ్రాయచ్చు. వ్యక్తిగా మీకున్న స్థిర అభిప్రాయాలను రచయితగా పాత్రలకు ఆపాదించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

జ: మొట్టమొదటగా, మనిషి కనిపెట్టిన వాటిల్లో డబ్బు, పరువు-ప్రతిష్ఠ కాకుండా ఇంకోటి ముఖ్యమైనది ఉంది.. దేవుడు.. ఇప్పుడు ఒకడు పుట్టాడు. తల్లి గర్భంలో ఉన్నాడు.. వాడికి వాడి లోకం తెలుసా? ఎవరి కడుపున ఉన్నాడో ఆ స్త్రీ పేరు తెలుసా? వాడి పుట్టుకకు కారణమైన వాడి తండ్రి పేరు తెలుసా? అసలు తను ఆడో మగో కడుపులో ఉండగా గర్భస్థ శిశువుకి తెలుసా? తెలియదుగా! పుట్టిన తరువాత, ఏవండోయ్ ఫలానా వారు పుట్టారు, పేరు ఏదో సుబ్బారావు, వెంకట్రావు అని చెప్తారు. వెంటనే అడుగుతారు ఏ సుబ్బారావు గారండీ అని. కమ్మ సుబ్బారావు గారా, కాపు సుబ్బారావా, రెడ్డి సుబ్బారావా లేక బ్రాహ్మణ సుబ్బారావా అని. అంటే తల్లి కడుపులో ఉండేటప్పుడు బిడ్డకి మతం లేదు, కులం లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, డబ్బు లేదు; తల్లిదండ్రుల్లేరు, ఏదీ లేదు! పుట్టిన మరుక్షణం అన్నీ తగులుకున్నాయి. కొత్తగా తగులుకున్నవి – వీడి మతమేమిటి? వీడి కులమేమిటి? వీడు ఏ ప్రాంతంలో పుట్టాడు? వీడి భాష ఏమిటి? వీడి తల్లిదండ్రులెవరు? వాళ్ళ పూర్వీకులెవరు? వీడి సోషల్ స్టేటస్ ఏమిటి? అంటే ఎన్ని తగులుకున్నట్టు? పుట్టిన మరుక్షణమే, ఏవండోయ్, ఫలానా వారికి మగపిల్లాడు పుట్టాట్ట అంటారు.. అంటే ఆడా మగా – జెండర్ ప్రస్తావన వస్తుంది. అప్పటి దాకా అమ్మ కడుపులో ఉన్నప్పుడు తన తల్లి ఎవరో వాడికి తెలియదు. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకున్నందుకు ఒక స్త్రీకి మనం  ‘మాతృదేవోభవ’ అని గౌరవమిస్తున్నాం కదా, 90 ఏళ్ళు ఈ నేల తల్లి ఒడిలో  బతుకుతున్నాం కదా మనం? మరి నేలతల్లిని ఇంకెంత గౌరవించాలి? Are we respecting it? డబ్బు కోసం సర్వనాశనం చేస్తున్నాం పర్యావరణాన్ని. డబ్బు కోసం భూమిలో గోతులు తీస్తున్నాం, తవ్వి, ఐరన్ ఓర్ బయటకు తీస్తున్నాం, ఖనిజాలు బయటకి తీస్తున్నాం, మైకా, రాగి, అబ్రకం.. ఎవ్విరీథింగ్.. చీల్చి చీల్చి గుండెను కుళ్ళబొడిచేస్తున్నాం.. పోనీ ఎట్మాస్ఫియర్‌నైనా శుభ్రంగా ఉంచాడా? తనకి ప్రాణవాయువునిచ్చే చెట్లనే నరికిపారేశాడు. భయంకరమైన సూర్యతాపాన్ని తమలో నింపుకునే కొండలున్నాయి, వాటిని ముక్కలు చేసి, కంకర కింద తయారుచేసాడు కదండీ మనిషి. కోటానుకోట్ల జీవులున్నాయి, అన్నిటినీ చంపేశాడుగా! ఇవాళ, రాబందు కనిపించదు, గ్రద్ద కనిపించదు, కృష్ణ పక్షి కనిపించదు, పిచ్చుక కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ దరిద్రుడి దాహానికి.. ధన దాహానికి బలైపోయాయి. ప్రతీ రోజు నలభై టన్నుల కప్ప కాళ్ళు మనం ఎగుమతి చేస్తున్నాం భారతదేశం నుండి. అంటే వాటి కాళ్ళు విరిచి, మొండేలు అవతల పారేస్తున్నారు, వీడి డబ్బు కోసం! రోడ్డు మీద మీరు వెళ్తూ ఉంటే, తల కాళ్ళూ నరికేసిన కోళ్ళు వేలాడుతూంటాయి. ఊహిచండి.. నిజంగా అవి పెద్దవైపోయి మనల్ని ప్రశ్నిస్తే? ఒక పులి ఊర్లోకి వస్తే, దాన్ని వెంటాడి కాల్చేస్తాం, మరి మనిషి ఎన్ని ఎకరాల అడవిని నాశనం చేశాడు? అంటే వీడు చేసే ప్రతీదీ దెబ్బే. ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేసేశాడు. ఇక పరువు-ప్రతిష్ఠ! ఏమయ్యా, ఎవడినో ప్రేమించిందని కన్న కూతురునే చంపుతావా? లేదంటే, నీ కూతురుని ప్రేమించాడని, ఎవరో అమాయకుడిని చంపిస్తావా? పరువు కోసం హత్యలా? 2025.. రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా పరువు హత్యలా? ఏమిటీ పరువు? కన్నతల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ స్టేటస్సూ లేదు, ఏ మతమూ లేదు, ఏ కులమూ లేదు. ప్రేమించి పెళ్ళి చేసుకోవడంతో ప్రారంభమా? అసలు ప్రేమ అనేది యూనివర్సల్. ఒక కుక్కని జూ జూ అంటే, అది  మీ వెనుక తోకాడించుకుంటూ వస్తుంది. ప్రేమకి కారణం ఏమై ఉండాలి? Is there any reason for love? Should there be any reason for loving? ఇంకొకరిని అసహ్యించుకోవాలంటే, కారణాలుంటాయి. ఇంకొకరిని ద్వేషించాలంటే కారణాలుంటాయి. ప్రేమించడానికి కారణం ఎందుకు? దానికి పరువు-ప్రతిష్ఠా? నిజంగా చెప్పండి.. మానవుడు తయారు చేసిన నీచాతినీచమైన సృష్టి ఈ రెండు కావా? డబ్బు కోసమే కదా? నిన్ననే యుద్ధం జరిగింది.. అగ్రరాజ్యం వాళ్ళు పొరుగురాజ్యం ప్రెసిడెంటుని రాత్రికి రాత్రి ఐదు నిమిషాల్లో కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. దేనికోసం, అక్కడి పెట్రోలియం కోసం. కారణం, డబ్బేగా? పోనీ ఈ డబ్బుని చనిపోయినవాళ్ళేమయినా తమతో తీసుకెళ్తారా? లేదుగా. ప్రకృతి సృష్టించిన ప్రతీదాన్ని ఇక్కడ వదిలి మనం వెళ్ళాల్సిందే. ఇప్పటి వరకు, రాజులు, మహారాజులు, చక్రవర్తులు, చారులు, ఎవడైనా ఒక్కటి తీసుకెళ్ళాడా? కనీసం పౌడర్లు, స్నోలు,. అంతెందుకు శరీరాన్ని తీసుకువెళ్ళగలిగాడా? శరీరంలో ఉండే ఒక గోటిని తీసుకెళ్ళగలిగాడా? Why do you collect when you cannot carry? ఎందుకు పోగు చేస్తున్నావ్ తీసుకువెళ్ళలేనప్పుడు? అదండీ నా ఆన్సర్!

ప్రశ్న 7. ఇటీవల ఓ హీరోయిన్ సినిమా రంగంలో వర్కింగ్ అవర్స్ గురించి ప్రస్తావించడం కాస్త వివాదస్పదమైంది. కానీ ఈ ఉదంతం జరగడానికి చాలా రోజుల ముందే మీరీ నవలలో సినిమా అనేది ఓ తపస్సు లాంటిది. అది 9 టు 5 ఆఫీసు వర్క్ కాదు.అనిపించారు సదాశివరావు అనే పాత్రతో. ఆ తరువాతి వాక్యంలో “అందుకే అది పర్సనల్ లైఫ్‌ని బలిగోరుతుంది” అనిపించారు. మరికాస్త వివరిస్తారా?

జ: ఉదాహరణతో చెప్తాను. నేనొక పాట రాయాలి. అందమైన ఆకాశంలో నీలి నీలి మబ్బులు తేలుతూ ఉంటే చల్లటి గాలి వీస్తూ ఉంటే ఒక వర్షం పాట రాయాలని నాకు అనిపిస్తే, అర్జెంటుగా నేను రాయగలను. ఎందుకంటే, అది నాకు సొంతంగా వచ్చిన ఆలోచన. ఇదే ఒక ప్రొడ్యూసర్, డైరక్టర్, హీరో కలిసి, “ఏవండీ మీరో రెయిన్ సాంగ్ రాయండి, ఇది సిట్యుయేషన్” అని చెప్పారు. ఇప్పుడు నేనెంత ఆలోచించాలి మరి? నా అంతట నేను వ్రాసుకునేది అది కథ కావచ్చు, నవల కావచ్చు పాట కావచ్చు.. వేరు. సినిమాకి వచ్చేసరికి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, వాళ్ళకి ఉండే పబ్లిక్ ఇమేజ్ ఏమిటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కామన్ మ్యాన్‌కి.. అందులో క్లాసు మాసు ఇద్దరికీ సరిపోయేట్టుగా నేను రాయాలి. అంటే మామూలుగా నేనొక పాట రాయడానికి ఐదు నిమిషాలు పట్టినట్టయితే; ఒక చిరంజీవికో, నాగార్జునకో, ఒక ఆలీకో.. ఎవరికైనా సరే, ఒక పాట రాయాలంటే వాళ్ళ ఇమేజీని, సిట్యుయేషన్‌ని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాయాలి, అది అందరికీ నచ్చాలి. డైరక్టర్‌కి నచ్చాలి, ప్రొడ్యూసర్‍కి నచ్చాలి. అదే ఇంట్లో భార్య.. భర్త ఏదో తిట్టాడు.. కోపం వచ్చింది, ఏడుస్తోంది.. ముక్కు ఎగబీలుస్తుంటూంది.. బేర్ బేర్ మంటూ ఇష్టం వచ్చినట్టు ఏడ్చేస్తుంది.  ఇదే సినిమాలో అయితే, ఆ భర్త తిట్టాడు. సినిమా పాత్ర ఏడవ్వాలి, ఏడవ్వాలంటే అందంగా ఏడవ్వాలి.. ఇది గుర్తుంచుకోవాలి.. (నవ్వుతూ).. ఇంట్లో మామూలు స్త్రీ చిక్కిరిబిక్కిరిగా ఏడవడం వేరు, సినిమా పాత్ర ఏడవడం వేరు.. ఎందుకంటే ఎదురుగా కెమెరా ఉంది. And that is capturing every fracture. అంటే కళ్ళ లోంచి వచ్చే కన్నీళ్ళను కూడా కాప్చర్ చేస్తోంది. మామూలుగా అయితే ఎవరైనా ఏడ్చినా, గట్టిగా నవ్వినా పళ్ళు లోపలే ఉంటాయి, బయటకు కనబడవు. హహ్హహ్హా అని గట్టిగా నవ్వినా కూడా కనబడదు. మరి సినిమాల్లో ఎందుకు పళ్ళు బయటకొస్తాయి? అందం ఉంది కనుక. ఆ టీత్‍లైన్ అందం లేకపోతే మాధురీదీక్షిత్‌ని ఎవరు చూస్తారు? She is famous for her teeth line. అలాగే సాధన.. పెదవుల యొక్క కదలిక! ఇక్కడేంటంటే ప్రతీది కెమెరాకి అద్భుతంగా కనిపించాలి. అది సౌందర్యవంతంగా ఉండాలి. People should connect. ఇన్ని వ్యవహారాలున్నాయి. అంటే ఏంటి? You have to concentrate every minute on what you are doing.  మీరు చేసే పని మీద ప్రతీ క్షణం కాన్‍సన్‌ట్రేట్ చెయ్యాలి. So it is not easy. రెండోది.. ఏదో కామెడీ నవల చదివాం. బాగా నవ్వొచ్చింది.. ఇంతలో డైరక్టర్ పిలిచాడు, షాట్ రెడీ అన్నాడు. ఇప్పుడు సీన్‍లో మీరు ఏడవ్వాలి. అంటే ఈ నవ్వులోంచి ఆ ఏడుపులోకి వెళ్ళాలి అంటే you need time. అలాగే ఒక డైలాగ్.. కంటిన్యూయస్‌గా రెండు నిమిషాలు డైలాగుంది. ఓ 30 సెకన్స్ తీశారు. ఇంకో 90సెకన్స్ ఉంది. యాంగిల్ మార్చాడు. మార్చి మళ్ళీ కంటిన్యూ చెయ్యాలి. లేదంటే మిగిలిన వన్ అండ్ హాఫ్ మినిట్ రేపు తీసుకుందాం అంటారు.. ఇవాళ ఉండే మూ‌డ్‍కీ, ఇవాళ ఫేస్‌లో ఉన్న గ్రేస్‌కి రేపు ఖచ్చితంగా తేడా వస్తుంది. It will not match, because camera captures even minute things. “రాత్రి తొమ్మిదయిందండీ, నాకు నిద్రొచ్చేస్తోంది రేపు చూసుకుందాం” అనలేరు, రేపు చూసుకోవచ్చు.. కానీ వాళ్ళు ఎంత గ్లిజరిన్ పెట్టినా, ఫిల్మ్‌ని ఎంత గ్రేడింగ్‌లో పెట్టినా, కన్నీటిలో minute difference you can see. అందుగురించి “ఏవండోయ్ టైమ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను” అంటే కుదరదు. ఇంకోటి.. Combination of artists.. ప్రస్తుతం ఎనిమిది మంది స్టేజ్ మీద ఉన్నారనుకోండి, రేపు ఆ ఎనిమిది ఉంటారన్న నమ్మకం లేదు. ఎవరికైనా వేరే సినిమా షూటింగ్‌కి వెళ్ళిపోయేవారుంటారు కదా. మళ్ళీ ఆ కాంబినేషన్ అంటే రెండు నెలల తర్వాత కానీ కుదరకపోవచ్చు. అప్పటిదాకా వడ్డీలు కట్టుకుంటూ సినిమాని can you continue? అందువల్ల సినిమా అనేది it is not a work of hours. It is not the work of all time also. ఎందుకంటే ఇవాళ సినిమా ఉంది, రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు కదా. కనుక we have to be careful. ఎంత మనం ఎఫర్ట్ పెడితే, అంత మనం బిజీగా ఉంటాం. ఎంత సిన్సియర్‍గా ఉంటే, అంత ఇది ఉంటుంది. ఒక రైటర్‍గా నేనే స్థితిలో ఉన్నా పాట నా మనసు విడిచి రాదో, ఆర్టిస్టులుగా వాళ్ళ పరిస్థితీ అదే, డైరక్టర్ల పరిస్థితీ అదే. ఈ షాట్‌ని ఇంకెంత బాగా తీయొచ్చు, ఈ సీన్‍ని ఇంకెంత బాగా తీయొచ్చు.. అని! 24 గంటలూ ఆ ఆలోచనే. ఒక సినిమా మొదలుపెట్టి పూర్తి అయ్యేంత వరకూ అది ఒక తపస్సు. మహా తపస్సు.

ఇక “అందుకే అది పర్సనల్ లైఫ్‌ని బలిగోరుతుంది” అనేదాని విషయానికొస్తే – సినిమా వాళ్ళలో విడాకులు ఎందుకు ఎక్కువ ఉంటాయండీ? షాట్ రెడీ అవడానికి ముందు హీరోగారు, హీరోయిన్ గారు ఎవరి దారిన వాళ్ళు సెట్‌కి వెళ్ళి కూర్చుంటారు. షాట్ రెడీ అనగానే ఇద్దరూ వచ్చారు. బెడ్ రూమ్ సీన్స్ చెయ్యాలి. మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ ఉండాలి కదా. కొద్దిగా పర్సనల్ రాపోర్ట్ ఉందనుకోండి, కొంచెం మాట్లాడుకుంటారు, నువ్విలా చెయ్యి, నేనిలా చేస్తాను అనుకుంటారు, ఒక బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఇది తప్పుగా అర్థం చేసుకుంటే? ఓ గొప్ప డైరక్టర్ కమ్ హీరోని ఒకరెవరో అడిగారట.. You try to spend more time with heroine.. Why? అని. అప్పుడాయన, unless I see her beauty, I cannot show it on the screen అన్నాడట. మీరు హీరోయిన్‌తో ఎక్కువ సేపు సమయం గడపడానికి ప్రయత్నిస్తారట కదా, దేనికి అని అడిగితే, అవును.. ఆమె సౌందర్యాన్ని నేను చూసినప్పుడే కదా, నేను ఆ సౌందర్యాన్ని సెల్యూలాయిడ్ మీద మలిచి అమరత్వాన్ని ఇస్తాను అన్నాడట. మధుబాల చనిపోయింది, ఇప్పటికి బ్రతికి ఉన్నట్టయితే, ముసలిదై ఉండేది. కానీ ఈ రోజుకు కూడా మీరు మొఘల్-ఎ-ఆజామ్ చూసేటప్పుడు మధుబాల అదే అందంతో, అదే గ్లామర్‍తో ఉంది కదా! అంటే సెల్యులాయిడ్ అంటే మీ అందానికి, మీ యవ్వనానికి, మీ సౌందర్యానికి అమరత్వం కల్పించేది. అందుకే సినిమా నటులు చనిపోయినా గానీ బ్రతికే ఉంటారు. ఇవాళ సూర్యకాంతం గాని, రమణారెడ్డి గాని, నాగేశ్వరరావు గాని, రామారావు గాని, రేలంగి గాని, గిరిజ గాని.. ఎవ్వరూ మన మధ్య లేరు. కానీ వాళ్ళ సినిమా వచ్చినప్పుడు మనం వాళ్ళని చూస్తున్నాం, పకపకా నవ్వుతున్నాం, వాళ్ళతో పాటు మనం దుఃఖిస్తున్నాం.. అంటే అమరత్వాన్నిచ్చేది సినిమా. అందుకని అది మీ మనసులో ఉండే శక్తినంతటినీ అది లాక్కుంటుంది. దీనివల్ల ఆయా నటీనటుల పార్ట్‌నర్స్ ఏమనుకుంటారు? ‘నేను పొద్దున్నే కాఫీ పెట్టమంటే, అవతల షూటింగ్ అని వెళ్ళిపోతావా? మొగుడంటే లెక్కలేదా? నన్ను తేలిగ్గా తీసుకుంటున్నావు. After all, can’t you give me bloody coffee?’ అని అడుగుతాడు. కానీ వీడికి తెలియనిది, తెలిసినా కూడా చేసేది ఏమిటి? నటి/నటుడు టైమ్‌కి కనక వెళ్ళకపోతే వేరేవాళ్ళ కాల్‍షీట్ వేస్ట్ అయిపోతుంది. కొంతమందికి కాల్‌షీట్ చెప్పేటప్పుడు వన్ అవర్ జాబ్ అంటాం. ఆ వన్ అవర్ లోనే వాళ్ళతో చేయించుకోవాలి. భార్య (నటి) “నేను చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోవడం లేదు, రోజూ పెడుతున్నా కదా” అంటుంది. ఒకవేళ ఈవిడ లేట్‍గా వెడితే, అక్కడ డైరక్టర్ తిడతాడు. Out of mood తో you cannot act. అలాగే భర్త (నటుడు) విషయం – “ఏవండీ, నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు, ఇప్పుడు పట్టించుకోడం లేదు. హీరోయిన్‍లతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు.. వాళ్ళని కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుంటున్నారు.. నాకు అస్సలు టైమ్ ఇవ్వడం లేదు. ఇది కాదు నేను కోరుకుంది” అంటుంది ఆ ప్రేమించి పెళ్ళాడిన భార్య. పులిని ఎక్కినవాడు చచ్చినట్టు స్వారీ చెయ్యవలసిందే. స్వారీ ఆపితే, అదే పులి తినేస్తుంది. పులిని ఎక్కడం లాంటిదే సినిమా. అది బలి కోరుతుంది. ఎందుకంటే he won’t be able to allot his entire time to the family. అలాగే she also won’t be able to give her   total  time to her husband or children and family. ఇందువల్ల సినిమా బలి కోరుతుంది.

ప్రశ్న 8. నవలలో అభిమాన్యు పాత్ర ప్రవేశించే సందర్భంలో మృత్యువు గురించి వ్రాసిన వాక్యాలలోనూ, కమల్‌జీత్ అలకి ప్రాణాయామం గురించి చెప్పే సందర్భంలోనూ లోతైన ఆధ్యాత్మిక భావాలున్నాయి. మీ రచనలలో సందర్భోచితంగా ఆధ్యాత్మికత వ్యక్తమవటం కద్దు. మీకు ఆధ్యాత్మికత ఒంటబట్టానికి, అది ఓ తాత్త్వికతగా మారి రచనల్లో ప్రవహించడానికి గల కారణాలు చెప్తారా?

జ: ఇక్కడ ఓ మంచి విషయం చెప్పాలి. ఆధ్యాత్మికత అంటే అర్థమేమిటంటే – ముక్కు మూసుకుని మనమేదో చేయటం కాదు. Indian philosophy is the purest form of Science and Science is the purest form of philosophy. GOD గాడ్ అంటే భగవంతుడు. ఇది జనరల్‌గా చూసుకునేది. G for Generation, O for Organization, D for Destruction.  Generation, Organization, Destruction – GOD – అంటే సృష్టి, స్థితి, లయ! ఈ మూడు శక్తులు దేనిలో ఉంటాయో దాన్ని భగవంతుడని అంటాం. అలాగే బ్రహ్మని చతుర్ముఖుడని చెప్తాం. అంటే నాలుగు ముఖాలున్నాయని. There are only 4 types of chemical reactions. What is a chemical reaction; here heat is absorbed or evolved.  ఈ పద్ధతిలో చూస్తే బ్రహ్మకి నాలుగు ముఖాలు ఎందుకున్నాయో అర్థమవుతుంది. సృష్టి అంతా ఏర్పడింది నాలుగు విధాల ప్రవహించే రసాయనిక చర్యలతోటే! There are only four types of chemical reactions in which the entire universe is created. అలాగే Atom. Atom can neither be  created  nor destroyed అని ఉంది. అంటే అణువుని సృష్టించలేము, అణువుని నాశనం చేయలేము. ఇది డాల్టన్ అటామిక్ థీరీ. అణు సిద్ధాంతం ప్రకారం ఆత్మ ఏమిటి? ఆత్మని చంపలేము, ఆత్మని సృష్టించలేము అంటాం. మరి, ఆత్మకీ, అణువుకీ రెండిటికీ పద్ధతులు ఒకటే కదా? Both cannot be created or destroyed. అంటే ఆత్మ అనేది వేరుగా ఏదో ఉందని అనుకోకుండా, atom కింద తీసుకుంటే, there are electrons, protons, neutrons. ఒకటి ప్లస్సు – అంటే బ్రహ్మ. ఒకటి మైనస్సు – అంటే శివుడు. ఒకటి ఆ రెండిటిని కలిపిచ్చేది – విష్ణువు. అణువులో కూడా మనం దైవాన్ని చూడచ్చు. అందుకే ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ అని చెప్తారు. అణువులో అణువుగా విశ్వమంతా వ్యాపించినంటువంటి విష్ణుతత్త్వం! నా ఉద్దేశంలో ఆధ్యాత్మికత అంటే అర్థమేమిటంటే truest truth! ఇప్పుడు నేను పాట రాశాను. నేను రాశానా ఆ పాటని? లేదు. పాట రాయాలని నేను సంకల్పించా. సంకల్పించగానే అనేక వేల పదాలు నాకు స్ఫురిస్తాయి. వాటిల్లో ఈ ట్యూన్‌కి ఏవి మేచ్ అవుతాయో ఆ పదాలని ఒడిసిపట్టుకుని పాట రాశాను. ఇంతకు ముందు నా బుర్రలో ఆ పాటలు లేవుగా? ‘బంగారు కోడి పెట్ట’ దానంతట అది రాదుగా.. ట్యూన్ ఇచ్చినప్పుడేగా వచ్చింది? అంటే అర్థమేమిటి? మీరు మాట్లాడిన మాట గానీ, మీ ఆలోచన గాని విశ్వంలోనే ఉంటుంది. విశ్వ పరిధిని దాటి అవతలకి వెళ్ళట్లా. ఆక్సీజన్ ఎట్లాగైతే భూమి పరిధిని దాటి అవతలికి వెళ్ళదో. అట్లాగే మన ఆలోచనలు, మన చేతలు, మన ఊహలు ఈ విశ్వంలోనే ఉంటాయి. ఎవడో ఒకడు కంటాడు కల, ఇంకోడెవడో దాన్ని డిజైన్ చేస్తాడు. ఉదాహరణకి జూల్స్ వెర్న్ అనే రచయిత ‘సాగరగర్భంలో సాహసయాత్ర’ అనే అద్భుతమైన నవల రాశాడు. ఇంకొకడు సబ్‌మెరిన్‌ని కనిపెట్టి ఈ నవలలో ఉండేటటు వంటి ఊహని నిజం చేశాడు. హెచ్.జి. వెల్స్ గాని, అలెక్సి టాల్‌స్టాయ్ గాని వాళ్ళేం చేశారు? అంతరిక్ష యాత్రల గురించి రాశారు.. చందమామ మీదకి మనుషులని పంపించడమనేది వాళ్ళు ఆ రోజుల్లోనే ఊహిస్తే, ఆ తర్వాత అపోలో-11లో అది నిజమైంది. అంటే మానవుడు చేసే ఏ ఊహా తప్పు కాదు. ఒకప్పుడు అనుకునేవారు యంత్రాలు మనుషుల్లా మాట్లాడితే.. అని; మనిషి లాగా యంత్రాన్ని తయారు చేయగలిగితే.. అని. ఇవాళ ఇల్లు ఊడ్చే రోబోలున్నాయి, వంట చేసే రోబోలున్నాయి. రేపో ఎల్లుండో పిల్లల్ని పుట్టించే రోబోలు వస్తాయి. అంటే ఊహ ఊహగా ఉన్నప్పుడు మీకది ఆధ్యాత్మికంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్‌గా ట్రై చేసినట్లయితే, your imagination becomes your truth. అందుకే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అద్భుతమైన మాట అన్నాడు – Imagination is more important than knowledge అని. కంటికి కనిపించేటటువంటి దానికంటే ఇమాజినేషన్ గొప్పది.

ప్రశ్న 9. నవలలో చాలా సందర్భాలలో నాయిక మహతియా లేక అలనా అన్న సంశయం కలుగుతుంది పాఠకులకు. కొన్ని చోట్ల అల మహతిని డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది! ఆ పాత్రల సృష్టికర్తగా మీరు ముందే ఊహించి రాశారా లేక, సందర్భాన్ని బట్టి పాత్రలే నడుచుకునేలా వాటిని ముందుకు తీసుకువెళ్ళారా?

జ: ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండీ. ఇప్పటి వరకు నావి 17 పుస్తకాలు కనుక బయటకొచ్చినట్లయితే, వీటిల్లో ఏ కథ అయినా చదవండి, ఏ నవలైనా చదవండి, ఏదైనా చూడండి.. పాత్ర గురించి నేను ఏనాడు వివరించను. అంటే ఆవిడ నల్లగా ఉంది, ఈవిడ తెల్లగా ఉంది.. పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది, నీలం చీర కట్టుకుంది, తెల్ల జాకెట్టు వేసుకుంది etc etc. ఇలాంటివి ఎక్కడా మీకు కనిపించవు. నా ఏ రచనలోనూ, అందులో ఉండే పాత్రల గురించి నేను వివరణ ఇవ్వను. ఎందుకంటే I want you to imagine. ఇప్పుడు ‘అల’ ఎలా ఉండాలి? ఆ అమ్మాయి ఐదు అడుగుల పదకొండు అంగుళాలని నేను చెప్పాననుకోండి, మీరు పొడుగ్గా ఊహిస్తారు, నేనేం చెప్పలేదనుకోండి, నల్లగా ఊహిస్తారు లేదా పొట్టిగా ఊహిస్తారు, ఎర్రగా ఉంటుందని ఊహిస్తారు. నేనేందుకు మీ ఇమాజినేషన్‌ని స్పాయిల్ చెయ్యాలి? అందుకని పాఠకుల ఊహకే వదిలేస్తాను. మీ ఊహలో ఉండే ‘అల’ మీది. రెండువేల మంది ఆ  నవల చదివితే, రెండువేల ‘అల’లు తయారవుతారు. ఈ రెండువేల మందికి పెయింటింగ్ కనక వచ్చినట్టయితే, రెండువేల వేర్వేరు ముఖాలు చిత్రిస్తారు. కానీ.. రెండువేల ముఖాలలోనూ కనిపించే వ్యక్తిత్వం ఒకటే. సో, నేను నా రచనలలో ప్రవేశపెట్టేది పాత్ర వ్యక్తిత్వమే తప్ప వ్యక్తి యొక్క రూప స్వభావాల్ని కాదు. ఇప్పుడు ‘అల’ ని తీసుకుంటే, she has her own character. వ్యక్తిత్వం! ఇక ఇందిరకి ఉండాల్సిన వ్యక్తిత్వం ఆవిడకి ఉంది. ఏ పాత్రని తీసుకున్నా, వాళ్ళ వ్యక్తిత్వాలే కనిపిస్తాయి. ఈ వ్యక్తిత్వాలు కలవాళ్ళు మీకు లక్షల మంది కనిపిస్తారు మనుషులలో.  You can identify yourself. సో, ఇక్కడ ఏ పాత్ర ముఖ్యం? నలుగురు పిల్లలున్నారు, వాళ్ళు పుట్టింది తల్లిదండ్రీకే కదా, వీళ్ళల్లో ఎవరిని మెచ్చుకుంటారు? సరే, పెద్ద కొడుకు స్కూలు ఫస్ట్ వచ్చాడు, వాడిని మెచ్చుకుంటాడు. ఆఖరి కొడుకు స్పోర్ట్స్‌లో ఫస్ట్ వచ్చాడు, వాడిని మెచ్చుకుంటాడు. సో, ఆయా ఎపిసోడ్స్‌లో జరిగే ఇన్సిడెంట్‌కే ప్రాధాన్యత ఉంటుంది కాని పాత్రలకి కాదు. కానీ ప్రతి పాత్ర వ్యక్తిత్వాన్ని నేను క్రిస్టల్ క్లియర్‍గా ప్రెజెంట్ చేశాను. అది చిన్న కారక్టర్ కావచ్చు, ఆ ఎపిసోడ్ లోనే వచ్చి వెళ్ళిపోయే కారెక్టర్ కావచ్చు. ఇందులో ఒక అమ్మాయి ఉంటుంది, మహతి వెళ్ళి చెప్తుంది.. మాట్లాడుతుంటే దుర్వాసన వస్తోంది, అప్పుడామె పిచ్చి కోపంతో రియాక్ట్ అవుతుంది. కానీ తర్వాత నిజం గ్రహిస్తుంది. ఇంకో అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి నేతి బీరకాయ పచ్చడి అద్భుతంగా చేయగలదని చెప్పి, ఆ అమ్మాయి చేత పచ్చడి చేయిస్తుంది మహతి. అంటే ఏమిటి? నాలుగు మాటలు చెప్పి కాదు, you make her do. మహతి చెప్పినందువల్ల ఆ అమ్మాయికి గౌరవం వచ్చిందా? లేదు. ఆ అమ్మాయి చేత చేయించడం వల్ల ఆ అమ్మాయికి గుర్తింపు వచ్చింది, public came to know. That means ఉత్తి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నది పాటించింది కదా! ఒక చిన్న ఇన్సిడెంట్‌లో కూడా, you find that there is a purpose.

ప్రశ్న 10. నవలలో కొన్ని పాత్రలు అసంపూర్తిగా ముగిసినట్టు అనిపిస్తాయి. ఉదాహరణకి సదాశివరావు, సర్రీ, మహతి అన్నయ్య సురేంద్ర, తిమ్మూ లాంటి వాళ్ళు నవలలో కొద్దిసేపే ఉన్నా, తమదైన ముద్రవేసి వెళ్తారు. ఈ పాత్రలను కొనసాగించకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? లేక కథ విస్తరిస్తూపోతూ, కొత్త పాత్రలు బలంగా వేళ్ళూనుకుపోతే, ఆ పాత్రల అవసరం పడలేదా?

జ: న్యాయంగా చెప్పినట్లయితే.. ఇప్పుడు సురేంద్ర పాత్ర ఉంది. అతని ఇంటెన్షన్ ఏమిటి? తండ్రి ఉద్దేశం ఏమిటంటే కొడుకు డిగ్రీ చేయాలని. వాడికేముంది? చిన్నప్పటి నుంచి ‘I want to be this..’. ఇప్పుడు నేనొక మాట చెప్తాను. నేను సినిమా రైటర్‌ని కావాలని నాకు కోరిక. ఎయిర్‌ఫోర్స్‌లో 18 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంది కనుక I could not come. సరే, 4000 పాటలు రాసుకున్నా గాని రాలేదు. కాంట్రాక్ట్ అయిపోయింది. I came out. ONGC లో ఇంజనీరుగా నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇంజనీరుగా జాయిన్ అవుతాను అనుకోండి. ఇంజనీరు జాబ్ వచ్చింది, హైయ్యస్ట్ పెయిడ్, ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక జీపు ఉంటుంది, క్వార్టర్స్ ఉంటాయి, ఈ సెక్యూరిటీని అంతా వదిలేసి – పాండిబజార్ లోనో, టినగర్ లోనే ప్రతివాడి వెనకాల నాకు అవకాశం ఇవ్వండి అని అడుక్కుంటూ తిరగలా? అంటే నేను జాబ్‌లో చేరితే, ఈ సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడేం చేయాలి? రెండు మూడేళ్ళు ఉద్యోగం చేసి, డబ్బులు దాచుకుని, అప్పుడు సినిమా ఫీల్డుకి వెళ్దాం అనుకున్నా; కానీ అది అంత ఈజీ కాదు. మూడేళ్ళ తర్వాత అందులోంచి బయటకు రాలేం. నా ఉద్దేశం ఏమిటి? మనిషి జీవించేది ఒకే ఒక్కసారి. రెండోసారి, మూడోసారి జీవించడు. ఈ జీవించినప్పుడు యవ్వనం ఉంది. మీరు ఏం చేయదల్చుకున్నా, యవ్వనంలో మాత్రమే చెయ్యాలి. మీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, you may jump, you may run.. కొత్తకొత్తవి నేర్చుకోవచ్చు, but you cannot compete. Rare people.. వెయ్యి మందిలో ఒకడు competition కు వెళ్ళచ్చు.. నటి ప్రగతి లాగా. ఆమె నలభై ఏళ్ళు వచ్చిన తరువాత, she became a champion. చాలా తక్కువ మంది అలాంటివాళ్ళు. టి.జి. కమలాదేవి, పి. లీల లాగా.. చాలా తక్కువ మంది మాత్రమే చెయ్యగలరు. You cannot take them for granted. ఇప్పుడు క్రికెట్ ఉదాహరణ తీసుకుందాం. Everybody cannot become a Sachin Tendulkar. But everybody start at an early age. అలాగ, నేనేమనుకున్నాను, ఒక సినిమా.. అమరత్వం ఇచ్చేది.. దీనిలో ప్రయత్నించాలంటే.. నేను ఎర్లీ గానే వెళ్ళాలి. సో, ఐ కేమ్. ఇక నవలలో సురేంద్ర విషయం కూడా అంతే. I want to be a military person అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు President of India can be the President of India 100 times, but he cannot be a soldier. సోల్జర్ అంటే మీకో ఏజ్ ఉంది, ఆ ఏజ్ మరీ తక్కువ ఉండకూడదు, పెద్ద ఎక్కువా ఉండకూడదు. So he found that this is the right time. ‘నా ఆలోచనని ప్రాక్టికల్‍గా నేను చేయాలి, దాని ఇదే సరైన సమయం’ అనుకుంటాడు. అందుకని తండ్రిని ఒప్పించడానికి ట్రై చేశాడు. ఆయన ఒప్పుకోక సాగదీస్తుంటే, ఈ లోపు వాడు చేయాల్సింది వాడు చేశాడు. అప్లై చేశాడు, సెలెక్ట్ అయ్యాడు.. Then he told his father. అంటే right decision at right time and right age. అది indirect గా ఆ పాత్రలో సృష్టించాను. అట్లాగే ఫాలాక్ష.. ఒక ఇన్సిడెంట్.. ఒక మిలిటరీ పర్సన్.. How he takes? Where police people fail, military people take over. మిలిటరీ టేకోవర్‌కీ, పోలీస్ టేకోవర్‌కీ తేడా ఉంది. పోలీసువాడు అర్జంటుగా లాఠీ ఛార్జ్ అంటాడు, షూట్ అంటాడు. మిలిటరీ వాడు అలా అనడు.  He takes his time. He know how to, what to, where to do, before doing. అలాగే ఫాలాక్ష.. ఆ ఇన్సిడెంట్. అమ్మాయిని సేఫ్‌గా తీసుకురావాలి. తీసుకువెళ్ళిన తర్వాత సిస్టర్ దగ్గర పెడతాడు. తర్వాత స్టూడియోకి తనే వెళ్తాడు. ఒక మినిస్టర్ కొడుకు, వాడి ఫ్రెండ్ ‘అల’ని ఇబ్బంది పెడుతున్నప్పుడు. తనెందుకు వెళ్ళాడు? ఫాలాక్ష పర్సనాలిటీని చూశాకా, వాళ్ళు సగం సైలెంట్ అయిపోతారు. ఫాలాక్ష సిక్స్ ఫీట్ ఉంటాడు.. వీడి విషయంలో నేను తల దూరిస్తే, ఇబ్బంది పడతానని మినిస్టర్ కొడుకు గ్రహిస్తాడు. నేనే హీరో అంటూ ఆ అమ్మాయి ముందు పోజు కొట్టినవాడు, ఫాలాక్షని చూడగానే.. సైలంట్ అయిపోతాడు. నేను అందగాడిని ఓ అమ్మాయి ముందు పోజు కొట్టాను, నా కన్న అందగాడు వస్తే, what will be my condition అని అనుకుంటాను కదా. అంటే, ఇక్కడేంటంటే, simple things అండీ ఇవి. But, do people analyses or not అనేది నాకు తెలియదు. మీరు ఎనలైజ్ చేస్తే, every character is a wonderful character. ఒక ఇందిర.. బావకి పెళ్ళయి పాతికేళ్ళయినా, అతన్నేమీ డిస్టర్బ్ చేయలేదే. పాతికేళ్ళ తరువాత ఎందుకు చేసింది? ఆలోచించి చూడండి. ఆమె పెళ్ళి చేసుకోలేదు.. తల్లీ తండ్రి చచ్చిపోయారు. Nobody is there for her. But, still 25 years she lived her own life. ‘నేను చనిపోతున్నాను, చనిపోయాకా, ఈ ఆస్తి ఎవరికివ్వాలి, దేనికివ్వాలి, ఎందుకివ్వాలి, నా జీవితాన్ని నేనెందుకు ఇలా చేసుకున్నాను? తల్లిదండ్రులతో నేనెందుకు అలా బిహేవ్ చేశాను? ఒక మొండితనం.. నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వత nothing will come to me.’ ఆ మొండి ధైర్యం వచ్చింది. ఇక్కడ మీకు మహతి కేరక్టర్ విలువ తెలుస్తుంది. కారులో వచ్చేటప్పుడు she allows both of them to be free for some time. ఎందుకంటే గౌతమ్ హాస్పటల్‌లో ఉన్నంత కాలం భార్య పక్కనే ఉంది. She cannot speak anything. కారులో వస్తున్నప్పుడు డ్రైవర్‌ని తీసుకుని టీ తాగి వద్దాం, టిఫిన్ చేసి వద్దాం అంటూ బయటకు వెళ్తుంది మహతి. ఎంత మెచ్యూర్డ్ కారెక్టర్? రేపు వీళ్ళు కలుస్తారో లేదో.. But this time they should be together అనుకుంటుంది మహతి. వాళ్ళల్లో ఉండే డిఫరెన్సెస్ కరిగిపోయాయనుకోండి, ఆ మౌనం కరగడం, గడ్డ కట్టుకుపోయిన మౌనం కరగడం ప్రారంభిస్తే, అద్భుతం! ఆ కారెక్టర్‌ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా, ఆ కారక్టర్‌ని మళ్ళీ మీరు చూసినట్లయితే, ఒక మూర్ఖపు స్టేజ్ నుంచి.. చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా.. అలాంటి దశ నుంచి.. చివరికి వచ్చేసరికి ఎంత stable అవుతుందో. అంటే మౌనం కరిగింది. మనసు మళ్ళీ మెత్తగా, సున్నితంగా ఆలోచించడం మొదలయింది. నవలలో మనం మామూలుగా ఒక రీడింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం, కానీ జాగ్రత్తగా చూస్తే, every incident.. it has got something to do with the story. ఆఖరికి హరగోపాల్ విషయం కూడా. అంటే పరిస్థితులు మనుషుల్ని ఏ విధంగా చేస్తాయి? వాడి అహంకారం కనిపిస్తుంది. అది అహంకారామా? మనం చాలామంది గురించి అంటుంటాం.. వాడు ఈగోయిస్ట్ రా అని. కానీ ఆ ఈగో ఇన్ఫీరియారిటీ తోటి వచ్చినది. నిజానికి it is not ego, but inferiority complex. మన దృష్టిలో అది ఈగోలా కనిపిస్తుంది. So, actually Mahati is a psychological bonanza. వ్యక్తులు అక్కడ లేరు. వ్యక్తిత్వాలు మాత్రమే ఉన్నాయి.

ప్రశ్న 11. నవలలో చాలా సందర్భాలలో ఆయా పరిస్థితులకు తగ్గట్టు చక్కని కవితలు వ్రాసారు. కొన్నిటికి పాదచారి అన్నారు, కొన్ని మహతి, అల వ్రాశారని అన్నారు. కానీ పాదచారి మీరేనని అర్థమవుతుంది పాఠకులకు. పాదచారి నేపథ్యం, కవిత్వంలో మీకున్న ప్రావీణ్యం గురించి పాఠకులకు చెప్తారా?

జ: ఇది చాలా మంచి ప్రశ్న అండీ. అన్నిటికన్నా గొప్పది నాటకం అని మనకొక పద్ధతి ఉంది. అన్ని కళలలోకి గొప్ప కళ ఏది అంటే నటన అని చెప్తారు. నాట్యం.. నాట్యమంటే ఏమిటంటే, శరీరంలోని అన్ని అంగాలు, కథకి తగ్గట్టుగా కదులుతాయి. ముఖం, పళ్ళు, పెదవులు, కనుబొమలు, నుదురు, తల, భుజాలు, చేతులు, కాళ్ళూ – సర్వాంగాలు కూడా ఇన్వాల్వ్ అయితే తప్ప నాట్యం రాదు. అలాగే నటన. నటనలో కూడా అన్ని అంగాల పని ఉంటుంది. ఎస్.వి.ఆర్. లాగా “హు, బానిసలు” అంటూ ఒక చేతి విసురుతో అవతలివాడిని సైలెన్స్ చెయ్యచ్చు. రసాలలో శృంగారం ఎలాగో, దీనిలో నాట్యం, నటన అలాగ. కానీ అన్నిటి కంటే రచన గొప్పది అని నేనంటాను. ఎందుకు రచన గొప్పది? ఒక దుష్యంతుడి పాత్ర పోషించేవాడు దుష్యంతుడి పాత్రని మాత్రమే వహిస్తాడు. ఆ మహా భారతంలో శకుంతల పాత్రధారిణి శకుంతల పాత్ర మాత్రమే చేస్తుంది. అంటే, అందులో వెయ్యి పాత్రలున్నట్లయితే, వెయ్యి మంది ధరించాలి. కాని రాసినవాడు? ఒక్కడే! వెయ్యి మంది పాత్రలలోనూ పరకాయ ప్రవేశం చేసి రాయాలి. రామాయణం వ్రాసిన వాల్మీకి – రాముడి పాత్రలోనూ ఆయనే ఉన్నాడు, రావణుడి పాత్రనీ అతనే రాశాడు. రామాయణం సత్యం. రాముడు పుట్టాడు.. రావణుడు పుట్టాడు.. రావణుడు రాముడి కంటే ముందర పుట్టాడు. రావణుడిది హింసాప్రవృత్తి అయినప్పుడు, ఆ హింసాప్రవృత్తిని తన శ్లోకాలలో చూపించాలి కదా, ఇక హనుమంతుడిది భక్తిమార్గం, అప్పుడు భక్తి చూపించాలి కదా. అంటే ఎన్ని కేరక్టర్లు ఉంటాయో, అన్ని కేరక్టర్ల లోనూ పరకాయ ప్రవేశం చేసేది రచయితే. నాట్యంలో కాని, నటనలో కాని ఆ పాత్ర మాత్రమే ఉంటుంది. ఇప్పుడు, ఇందులో మహతి మాట్లాడినా, అల రాసినా, లేదా మరో కేరక్టర్ ద్వారా ఒక కవిత వినిపించినా, మొత్తం రాసింది రైటరేగా! సో, రైటరు ఆ సిట్చుయేషన్‌కి తగినట్టుగా.. వాళ్ళ చేత ఏది పలికిస్తే బాగుంటుందో అదే రాస్తాడు. ఒక్కోసారి అది సంభాషణాపూర్వకంగా వస్తుంది, ఒక్కోసారి కవితాపూర్వకంగా వస్తుంది. కవితాపూర్వకంగా ఎందుకొస్తుందీ అంటే, సంభాషణలలో బరువుని తగ్గించడం కోసం. ఇప్పుడు.. ఒకడు చాలా బాధపడుతున్నాడు.. ఏడుస్తున్నాడు.. తల బాదుకుంటున్నాడు.. తల గోడకేసి కొట్టుకుంటున్నాడు.. అందరి దగ్గరకెళ్ళి ఏడుస్తున్నాడు.. ఇదంతా నిజమే. ఒక రైటర్‌కి ఈ సిట్చుయేషన్‌ చెప్పి, వాడి అనంతమైనటువంటి బాధను నువ్వు చెప్పవయ్యా, రెండు రోజుల నుంచి ఆ బాధ చూడలేక చస్తున్నాం, పిచ్చెక్కుతోంది.. వాడి బాధ పోయేటట్టుగా ఏదైనా నువ్వు చెప్పు సింపుల్‍గా అంటే, – ‘పెను చీకటాయె లోకం చెలరేగే నాలో శోకం విషమాయె మా ప్రేమ విధియే పగాయె’ అని రాశాడు కవి. అయిపోయిందిగా.. ప్రపంచమంతా పెను చీకటయిందట, చెలరేగెను నాలో శోకం – ఎప్పుడైతే ప్రపంచం చీకటైందో, వెలుగు కనబడక శోకం చెలరేగిందట, విషమాయెను ప్రేమ – అమృతం లాంటి ప్రేమ విషం అయిపోయింది, విధియే పగాయె – ఇక్కడ పగ అంటే శత్రువు ఉండాలి, ఇక్కడ శత్రువు ఎవరు? విధే శత్రువు అయిందట. అంటే వాడి ఎంటైర్ కేరక్టర్‌ని ఒక్క పల్లవిలో చెప్పేసాడు కవి. సో, ప్రేమలో పడ్డ ‘అల’ భావన ఎలా ఉంటుంది? నిద్ర పట్టడం లేదు, తినబుద్ధి కావడం లేదు.. ఇదంతా చెప్పి రీడర్‌కి చిరాకు కలిగించేదానికంటే – నాలుగు లైన్లు రాశామనుకోండి.. అది బావుంటుంది కదా. అందుకని నేను కథల్లోనూ, నవలల్లోనూ కవితలు రాస్తాను. నా నవల ‘మనసు పొరల్లో’ అయితే వందల కొద్దీ కవితలు, హిందీ పాటలొస్తాయి.. హిందీ పాటలను ఎందుకు పెట్టాను? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.. ఆ పాటల వీడియోలు వేసుకుని చూస్తారు/వింటారు. ఈ పుస్తకంలోనేమో కవితలు.. కవితైనా రీ-రీడింగ్ చేసుకుని ఎంజాయ్ చెయ్యచ్చు. అయితే కవితని పాడి వినిపించలేకపోవచ్చు.. కానీ పాట విన్నట్టయితే హృదయం దానితో పాటు నడుస్తుంది. ఎందుకంటే భగవంతుని భాషలలో సంగీతం ఒకటి. అందువలన కవితలు రాయాల్సి వచ్చింది. రాసింది నేనే. పాదచారి పేరు మీద వ్రాసినా, మహతి పేరు మీద రాసినా, అల పేరు మీద వ్రాసినా కవితలు నావే. సంగీతం భగవంతుడి భాష అయినట్లయితే, మానవుడి యొక్క హృదయ ఘోష సాహిత్యం.

ప్రశ్న 12. ‘ధీర’ హిందీ వెర్షన్ చిత్రీకరణకు హర్యానా లోని ‘సిర్సా’ ఎంచుకున్న నేపథ్యంలో హర్యానా గురించి, సిర్సా గురించి, గ్రామీణుల ఆచార వ్యవహారాల గురించి, ఆహారపద్ధతుల గురించి వివరంగా చెప్పారు. పూర్వరంగంలో ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పనిచేశారా?

జ: నా ఫస్ట్ పోస్టింగ్ గుర్‌గాఁవ్‌లో. అది హర్యానాలో ఉంది. రాజస్థాన్ ఎడారి, హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో నాలుగు సంవత్సరాలు పనిచేశాను. నేను సిర్సాలో ఉన్నాను. రాజస్థాన్ మొత్తం తిరిగాను. రాయ్‌గఢ్‌లో ఉన్నాను. సో, రాజస్థాన్, పంజాబ్, హర్యానాల మతాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ బాగా నిశితంగా గమనించాను. మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి నాకు పులిహోర కావాలని మీరు అడగకూడదు. మీరు నిజంగా ఢిల్లీని చూడాలనుకుంటే, మీరు ఢిల్లీని అడాప్ట్ చేసుకోవాలి. మీరు హృదయంలో ఢిల్లీని గౌరవించాలి. అక్కడ దొరికే భోజనాన్నే తినాలి. అప్పుడేమవుతుంది? లోకల్‌తో మీకు అలవాటవుతుంది. నేను ఒకసారి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆయన హిందీ పాటలు పాడుతున్నాడు. అక్కడి భాషని హర్యాన్వీ అంటారు. “మీకు హర్యాన్వీ పాటలు లేవా?” అని అడిగాను. ఉన్నాయన్నాడు, అవి పాడు అని చెప్పాను. పాడాడు. అప్పటికప్పుడు నేను తెలుగులో రాసుకున్నా. ‘గోరీ తు మత్ జా మేలే మే..’ అంటూ సాగే ఆ పాట రస్టిక్‌గా ఉంటుంది. కానీ భావమేంటి? – గోరీ తు మత్ జా మేలే మే – ఓ సుందరీ, నువ్వు సంతకి వెళ్ళకు. సంతలో ఏముంది? మనమిద్దరం ఇక్కడ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటున్నప్పుడు, సంతకి వెళ్తానంటూ నువ్వు బయల్దేరుతావేంటి? అక్కడ ఏముంది కనక? అంటాడతను. ఆమె ఏమో – నేనక్కడికి వెళ్ళాలని చిలిపిగా చెప్తుంది. ఇది చెవులకు వినసొంపైన భాష కాదు, కానీ భావం ఎంత సున్నితంగా ఉందో చూడండి. ఇలాంటివే మనకి – ‘టౌను పక్కకెళ్ళద్దుగా డింగరీ, డాంబికాలు పోవద్దురో’ – లాంటివి ఉన్నాయి. భాష ఏదైనా భావం అనేది ఒకటే. అందుకే నేనేమంటానంటే – wherever you go, eat local food.  తిరుపతికి మీరు వెళ్ళారు, తిరుపతిలో దొరికేది తినండి. అలాగే అక్కడి భాషని ఆస్వాదించండి. ఒకసారి నామిని సుబ్రమణ్యం నాయుడు గారి ‘పచ్చ నాకు సాక్షిగా’ పుస్తకం  చదివాను. అరె, భలె ఉంది ఈ యాస అనుకున్నాను. తర్వాత ఆయనవి మొత్తం పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆయన పుస్తకాలు నేను కొని కనీసం ఓ యాభై మందికి పంచాను. ఎందుకు? అప్పుడు చిత్తూరు, తిరుపతి యాసలోని సౌందర్యమూ, ఆ యాస లోని మాధుర్యమూ నాకు కనిపించింది. కనుక నేనేమంటానంటే, భాషకి యాస అనేది శ్వాస. ఇప్పుడు నేను అక్కడున్నానంటే, ఆ భాషని నేను పట్టుకోవాలి. It is musical. మీరు notes వ్రాయొచ్చు. పత్రికల భాషే మాట్లాడతానంటే, నువ్వు పట్టుకున్నది సగం భాష కూడా కాదు. కొబ్బరి కాయ కొట్టి, అందులో చిన్న ముక్క తిన్నట్టు. కొబ్బరి మొత్తాన్ని, నీటితో సహా తినాలంటే/తాగాలంటే – ఆ భాష యొక్క యాస పట్టుబడాలి.

ప్రశ్న 13. “జీవితం ఎంత తొందరగా గడుస్తోందంటే ఆ తొందర మనసులకీ శరీరాలకీ కూడా పట్టేసినంత. దాన్ని యాంత్రిక పరిభాషలో ‘డైనమిక్ ఇనర్షియా’ అంటారు” అన్నారొక చోట. దీని గురించి మరింత వివరిస్తారా

జ: మనకు రెండు ఇనర్షియాలున్నాయి. ఒకటి డైనమిక్ ఇనర్షియా. రెండవది స్టాటిక్ ఇనర్షియా. ఫిజిక్స్ లోని టెర్మ్స్ ఇవి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బస్టాండ్‌కి వెళ్ళి బస్‌లో కూర్చున్నారు. మీరు హైదరాబాద్ నుంచి బెజవాడ రావాలి. బస్ లోకి వెళ్ళారు. ఆగి ఉన్న బస్‌లో కూర్చున్నారు. బస్ స్టార్ట్ అయింది. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే, నిటారుగా కూర్చున్నటువంటి మీరు, మీ బాడీ వెనక సీట్‌ని ఆనుకోడానికి వెనక్కి వెళ్తుంది. అలాగే, డ్రైవర్ బ్రేక్ వేశాడు. మీ బాడీ ముందరకి వెళ్తుంది. ఇలా ముందరకి వెళ్ళడాన్ని డైనమిక్ ఎనర్షియా అంటారు. సో, ఎనీ థింగ్, పయనంలో ఉన్నప్పుడు దానితో పాటు పయనం చేయటానికి బాడీ కూడా సిద్ధమవుతుంది. ఇంకా విచిత్రంగా చెప్పాలి అంటే ఒక ఈగ మీ భుజం మీద వాలింది, ఏదీ బస్‌లో మీరు కూర్చుని ఉండగా! బస్సు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఈగ ఎగురుతోంది. ఈగ వెనక్కి వెళ్ళిపోవాలి కదా, కానీ, బస్‌లో మీతో పాటు ఎలా వస్తోంది? బస్సు ముందుకు వెడుతోంది. ఈగ అక్కడే ఉంది. అరగంట సేపయినా అక్కడే ఉంది. ఎందుకలాగా? Because it picked up the inertia of the bus. మీ భుజం మీద వాలింది, మీరు ట్రావెల్ చేస్తున్నారు. It picked up the same energy. ఇక స్టాటిక్ ఇనెర్షియా అంటే, ఇప్పుడు డ్రైవర్ బస్ ఆపాడు. ముందరకు వెళ్తున్న మీ బాడీ ముందుకే వెళ్ళాలని చూస్తుంది తప్ప, ఆగడానికి ప్రయత్నించదు. వెంటనే వెనక్కి వెళ్ళదు. కొంచెం టైమ్ పడుతుంది. అలాగే ఆగి ఉన్న బస్ లోంచి ముందరకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు బాడీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది గానీ ముందరకి వెళ్ళడానికి ట్రై చేయదు. అదీ స్టాటిక్ ఇనెర్షియా. సో, జీవితమూ, జీవిత పయనమూ కూడా డైనమిక్ ఇనెర్షియాలోనే ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ ఒక చోట జరిగింది, దానికి మీరు ఆన్సర్ చేయాలి. మీరు భోజనం చేస్తున్నా, నిద్ర పోతున్నా, ఇతరులు వందమంది ఉన్నా ఈ ఆలోచన మీ లోపలి నుంచి పోదు. అంటే it is travelling like dynamic inertia.

ప్రశ్న 14. ప్రస్తుత కాలంలో తెలుగులో, నవలలని సినిమాలుగా మలచే ధోరణి బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకని?

జ: మనం అల్రెడీ గాడి తప్పాం అండీ. ఎందుకు గాడి తప్పామంటే, ఒక మాట నేను చెప్తాను. శూర్పణఖ లేకపోతే రామాయణం ఉందా? మయసభలో ద్రౌపది నవ్వింది అనడం సినిమాల్లో చూపించేది. అసలు మయసభ అనేదే లేకపోతే ఏమయ్యేది? మయసభ వల్ల అసూయ కల్గింది. రాజసూయం చేసినప్పుడు అసూయ ప్రజ్వరిల్లింది. ‘ఓహో! నేను కూర్చోవాల్సిన చోటు కదా ఇది.. ఎక్కడ ఇంద్రపస్థం ఇచ్చాను, పాలించుకోమని. అక్కడ కట్టుకున్నాడు. నా రాజధానికి లేని ఇంపార్టెన్స్.. దీనికొచ్చిందా? ఏం విలువ? ఇన్నేళ్ళ నుంచి నేను రాజభవనంలో ఉన్నాను. నా ప్రజలందరూ లక్షల మంది అక్కడున్నారు. తీరా చూస్తే, వీడొక ఇల్లు కట్టాడు, దీని చుట్టూ జనాలొచ్చేసారు. వీడికి అంతులేని గౌరవం వచ్చేస్తోంది’ అని అసూయ పడ్డాడు దుర్యోధనుడు. ఆ పగ అతన్ని దారితప్పించింది. ద్రౌపది నవ్విందన్నది మనం సినిమా కోసం కల్పించుకున్నది. సో, ఆ ఇన్సిడెంట్ లేకపోతే, ఇది జరిగేది కాదుగా. దీనికి బాబాగారు అద్భుతమైన ఉదాహరణ చెప్పారు: “ఏ కట్టెకి నిప్పు అంటుకుంటుందో, ఆ కట్టే పూర్తిగా కాలుతుంది” అని.  అసూయ అనేది నిప్పు లాంటిది. అది ఆ కట్టెనే దహిస్తుంది. దుర్యోధనుడు అలాగే దహించుకుపోయాడు. ఇలా గనక మనం చూసుకున్నట్లయితే, everything is in a story. కానీ మనం ఏం చేస్తున్నాం? రెండు పాత్రలని హైలైట్ చేస్తున్నాం. ఇక్కడ ధర్మరాజుని, అక్కడ రాముడిని హైలైట్ చేశారు. రామాయణమేది? మహాభారతమేది?

ప్రతీ పాత్రకీ దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికివ్వాలి. కేవలం రేలంగి, గిరిజ, రమణారెడ్డి కోసం సినిమాలు చూసినవాళ్ళు అనేక వేలమంది ఉన్నారు, ఆ లక్షల మందిలో నేను కూడా ఒకడిని. రేలంగోడున్నాడా అయితే ఛలో.. లేకపోతే లేదు. అంటే అర్థమేమిటి? Every character has got its importance. Whereas, ఈరోజు నాయికానాయకులకి.. ముఖ్యంగా నాయకుడికి తప్ప ఎవరికీ ఇంపార్టెన్స్ లేదు. సినిమా మొదట్లోనే.. నాయకుడి ఎంట్రీ.. బ్యాంగులు.. ఇంట్రడక్షన్ సీన్..! దీనికి ఓ జోక్ ఉంది. రామారావు గారు, సావిత్రి సినిమా. చక్రపాణి గారి దగ్గరకి ఒకడెళ్ళి, చెప్పడం మొదలుపెట్టాడట.. “సార్.. హీరో గారు ఇలా ఇంట్రడ్యూస్ అవుతారు..” అంటూ కొత్త ఇంట్రడక్షన్ చెప్పాడు. పది నిమిషాల తర్వాత, చక్రపాణి గారు వాడ్ని ఆపి, “బాబూ, లే, నువ్వు బాగా చదువుకున్నవాడివే. సరైన చదువు చదువుకుని ఆ తర్వాత రా!” అన్నారట. వాడికి అర్థం కాలేదు. ఇన్‌డైరెక్ట్‌గా చెబితే, గెట్ ఔట్ ఆప్ దిస్ ప్లేస్.. అని అర్థం. ఏం జరిగింది సార్, ఎందుకని అలా అన్నారని అడిగిన మీదట చక్రపాణిగారు చెప్పారట.. “ఏమయ్యా, హీరో హీరోయిన్లు రామారావు, సావిత్రి.. నువ్వు ఏ ఇంట్రడక్షన్ ఇస్తే ఏంటి? ఇంట్రడక్షన్ కోసం 15 నిమిషాల ఫిల్మ్ వేస్ట్ చెయ్యాలా? వాల్ పోస్టర్ చూస్తే తెలీదు? హీరో హీరోయిన్‍లు ఎవరో? వాల్ పోస్టర్ ఎప్పుడు వేస్తాం? సినిమా రిలీజయ్యే ముందే కదా, దానికోసం ఇంతపెద్ద కథ చెప్పాలా? ప్రతి పిచ్చోడికీ తెలుసు రామారావు ఉన్నాడంటే ప్రేమించేది సావిత్రినే గాని వేరే ఇంకోళ్ళను కాదు కదా” అని.

సో, ఇవాళ నూటికి ఎనభై సినిమాలు బకెట్ తంతున్నాయంటే ఇదే కారణం. ఇంకోటి.. చాలామంది అంటారు.. మేం మా సినిమాలో నీతులు బోధిస్తాం అని. వంద రూపాయలో, రెండు వందలో పెట్టుకుని సినిమాకి వచ్చేది నీతుల కోసం కాదు కదా, కాస్త ఎంటర్టెయిన్‌మెంట్ ఉండాలి కదా. జీవితంలో ఎలాగూ ఎంటర్టెయిన్‌మెంట్ లేదు. కనీసం సినిమాల్లోనైనా కుర్చీలో ఏసిలో కూర్చుని చూడాలని అనుకుని వస్తారు ప్రేక్షకులు. నువ్వు భగవద్గీత, భర్తృహరి సుభాషితాలు చెబితే ఎట్లాగ? నవలలో కూడా అన్ని ఉంటే తప్ప ఎవరూ చదవరు. ‘నవరసభరితం నవల’. నవరసాలు అందులో ఉండాలి. ఆ రోజుల్లో హ్యూమన్ ఎమోషన్స్‌కి ప్రాధాన్యతనిచ్చారు, ఇవాళ హ్యూమన్ బాడీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, not for emotions. ఒకప్పుడు ‘శభాష్ రాముడు’లో దేవికని చూసినప్పుడు వదినంటే ఇలా ఉండాలిరా అని అనిపించేది. ఇప్పుడు అలాంటి కేరక్టర్లు.. వదినంటే ఇలా ఉండాలి.. అమ్మంటే ఇలా ఉండాలి.. అన్నంటే ఇలా ఉండాలి అనిపించే కేరక్టర్లు చూపించండి? లేవు. Because you are focusing on the individual, heroes and heroines, not their characters also. అందువల్ల నవలలని సినిమాలుగా తీసే రోజులు పోయాయి. ‘తోడికోడళ్ళు’ సినిమా ఎంత అద్భుతమైన నవలండీ? రాసినది శరత్‍చంద్ర. బెంగాలీ నవల. ‘దేవదాసు’ బెంగాలీ నవల. ఎన్ని సినిమాలు.. ‘మా భూమి’, ‘మా బాబు’.. ఇవన్నీ అక్కడ్నించి తెచ్చుకున్నాం మనం. మరి మనకి రచయితలు లేరా? ఎందుకంటే, అవన్నీ సినిమాకి పనికొచ్చే నవలలు, హక్కులు కొనుక్కుని చిన్న చిన్న మార్పులు చేసుకునేవారు. ఇంకోటి ‘విప్రదాసు’.. ఈ రోజు కూడా అద్భుతమైన నవలలు ఉన్నాయి. నేను కొన్ని వేల పుస్తకాలు చదివాను.. నన్ను అడిగితే, నిలబెట్టి నేను పుస్తకాల పేర్లు చెప్పగలను. మీరు చదువుకోండి.. నవలలని సినిమాలుగా తీయండి. అద్భుతమైన నవలలున్నాయి తెలుగులో. వందల కొద్దీ చెప్తాను. నాకు మీరు పైసా ఇవ్వక్కర్లా. కానీ మేం వండుతాం అంటున్నారు (నవ్వుతూ). వంట బాగా రావచ్చు, కొద్దిగా ఉప్పు ఎక్కువై ఎందుకూ పనికిరాకుండా పోవచ్చు కూడా. That depends upon the expertise of the filmmaker.

ప్రశ్న 15. తమకంటూ ప్రత్యేక అభిమానులున్న అతి కొద్దిమంది రచయిత/రచయిత్రులలో మీరొకరు. మీ అభిమానుల గురించి చెప్పండి. ఈ నవలకి మీ అభిమానుల నుంచి, పాఠకుల నుంచి స్పందన ఎలా ఉంది?

జ: ఒక విషయం చెప్పాలి. ఇది పూర్తిగా నిజం. ‘వాళ్ళు’ అన్న పుస్తకం రాసినప్పుడు రాజేశ్వరి గారని లెక్చరర్. రిటైర్డ్ లెక్చరర్. ఆ పుస్తకం కొన్నారు. ఆరు నెలలు పక్కన పారేశారట. ఆ తర్వాత ఎక్కడికో వెడుతూ, ప్రయాణంలో అది చదివారు. చదివిన తరువాత, వారి భర్త గాలి జయచంద్ర నాయుడు పబ్లిషర్స్‌కి ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. తర్వాత నాకు ఫోన్ చేశారు. “ఏవండీ మీ పుస్తకం తీసుకున్నాను. సినిమా పాట్లలా, ఇది కూడా ఎంటర్టెయినింగ్‌గా ఉంటుందేమో, తర్వాత చదువుదామని పక్కన పడేశాను. కానీ చదివిన తర్వాత, నాకున్న ఆధ్యాత్మిక సందేహాలను, చాలా చాలా సింపుల్‌గా మీరు క్లియర్ చేశారండీ” అని చెప్పారు. ఆ పుస్తకాన్ని ప్రేమించడమే కాకుండా 300 పుస్తకాలు ఆవిడ కొని స్నేహితులకు బహుకరించారు. అది పక్కన పెడితే, కోవిడ్ పీరియడ్‌లో ఆమె చనిపోతూ భర్తకీ, కొడుకు చక్రి.. అసలు పేరు శ్రీనివాస్‌.. అతనో ప్రొఫెసర్.. చెప్పారట. తను చనిపోయాకా కార్యక్రమాలకి వచ్చినవాళ్ళకి ఈ పుస్తకాన్ని పంచిపెట్టమని. రెండవది ఈ పుస్తకాన్ని కన్నడంలో ట్రాన్స్‌లేట్ చెయ్యాలని. జయచంద్రనాయుడి గారికి నా పాద నమస్కారాలు! వాళ్ళ అబ్బాయి చక్రికి నా గుండె నిండుగా ఆశీర్వాదాలు. ఎందుకంటే, అమ్మ పోయింది కదా అని ఆమె కోరికని వదిలేయలేదు. ఆవిడ పోయిన రోజున వచ్చిన ప్రతి ఒక్కరికీ ‘వాళ్ళు’ పుస్తకం పంచారు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా, ఆవిడ కోరికని దృష్టిలో పెట్టుకుని ‘వాళ్ళు’ అనే పుస్తకాన్ని కన్నడంలో ‘ಅವರು’ (Avaru) పేరుతో అనువాదం చేయించారు.

కల్పనలు కాకుండా, మీరు జీవితాన్ని జీవితంగా నవలగా రాయగల్గితే.. బాగుంటుంది. అంటే నాకు అనుభవంలో లేనిది నేనెప్పుడూ రాయలేదు. నేను ఆస్ట్రేలియాలో సముద్రం దగ్గరకెళ్ళాను, ఈ పని చేశాను అని రాయడం తప్పు కదా, నేను వెళ్ళలేదు కదా. నాకు తెలియదు అది. నెట్‌లో చూసి నేను ఆస్ట్రేలియా గురించి రాస్తే, ఎంత సిల్లీగా ఉంటుంది? నేను అమెరికా వెళ్ళాను. అక్కడి వాటి గురించి రాశాను. దాన్ని చదివిన అమెరికా వాళ్ళు “అదేంటి మీరున్నది కేవలం 28 రోజులు, కానీ ఏదో పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నట్టు రాయగలిగారు” అన్నారు. అక్కడ నేను వ్యక్తులను కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలను కలిసాను. వాళ్ళ జీవితాలను కలిసాను. అందుకని అంత బాగా రాయగలిగాను. అలాంటి వాళ్ళు నా అభిమానులు. నా అదృష్టం ఏంటంటే, ఇప్పటికీ నా పుస్తకాలు బాగా అమ్ముడవుతాయి.. ‘పాండీబజార్ కథలు’ పుస్తకానికి మంచిపేరొచ్చింది. అలాగే ‘మహతి’ కూడా. నేను లక్ష్మిగారిని అడిగాను. బాగా వెళ్తున్నాయని చెప్పారు. అలా అని ఇది బాగా సేల్ అవ్వాలలో అకాడమీ అవార్డు రావలనో నేను అనుకోను. ఏ అకాడమీ ఆఫీసులవీ నాకు ఎడ్రసులు తెలియవు.  దేనికీ నా పుస్తకాలను పంపలా. ఆఖరికి ఈ రోజు వరకు నంది బహుమతికి కూడా ఏ పాట నేను పంపలేదు. ఎందుకంటే బహుమతి మీరు మెచ్చి ఇచ్చేది, నేను మిమ్మల్ని అడిగితే, అడుక్కున్నట్టు అవుతుంది. నా దృష్టిలో నాకున్న మంచి బలం ఏంటంటే నా అభిమానులు. వాళ్ళని కూడా వ్యక్తులుగా నేనెప్పుడు రాయను. వారి యొక్క అందచందాలను, చదువును నేను వివరించను. నేను  వ్యక్తిత్వాన్ని మాత్రమే పాత్రలుగా తీసుకుంటాను. ఆ వ్యక్తిత్వాలనే వాళ్ళు కూడా తీసుకుని ఆనందించి, every time నన్ను సంప్రదించేవారు. మహతికి ఎంతమంది ఫోన్లు, మెసేజ్‍లు చేశారో తెలుసా? ఎప్పుడు ఇది పుస్తకంగా వస్తుంది? ప్రతీ వారం పది మంది మెయిల్స్ రాస్తే, కనీసం ఇరవై మంది ఫోన్లు చేసేవారు. అభిమానులు అంటే నా దృష్టిలో.. నేను గుడ్డి అభిమానుల గురించి చెప్పడం లేదండీ.. ఇప్పుడు సుశీలమ్మగారున్నారు. “అసలీ ఇందిర కేరక్టర్‌ని మీరెలా సృష్టించారు?” అని అడిగారు ఆవిడ. “భార్యాపిల్లలున్న ఒక కేరక్టర్‌ని తీసుకెళ్ళి ఈ ఇందిర పాలు చేశారేమిటి?” అన్నారు. “అమ్మా, వ్యక్తిని నేను సృష్టించలేదు, నేను వ్యక్తిత్వాన్నే సృష్టించాను. తర్వాత ఏమవుతుందో నాక్కూడా తెలియదు..” అని చెప్పాను. నవల చివరికొచ్చేసరికి she also became a very sweet character. ఎందుకంటే, లోకంలో ఎవరూ పుట్టుకతో దుర్మార్గులు కారు. పుట్టిన ప్రతివాడూ కత్తి తోనో, కలంతోనో పుట్టలేదు. కత్తో, కలమో, నాగలో, మరొకటో – వాడు పుట్టిన తరువాత ఎడాప్ట్ చేసుకున్నాడు. నేను వ్రాసినదాంట్లో లోపాలున్నా, గ్రహించి, హెచ్చరించగల అభిమానులున్నారు నాకు. అది మంచిది కదా! ఇప్పుడు యాంటీ-సోషల్ సబ్జెక్టు తీసుకుని నా ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ గురించి, వ్యభిచారం గురించి, అన్నిటి గురించి రాయచ్చు, రకరకాలుగా ఎడాప్షన్స్ చేయచ్చు. బట్, ఒకటేమిటంటే, why should we think about it, when so are so many things in this world. అదీ విషయం!

ప్రశ్న  16. రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేమయినా సిద్ధమవుతున్నాయా?

జ:  పుస్తకాలు రెండు – ‘పాండీబజార్ కథలు’, ‘మహతి’ ఈ మధ్యే వచ్చాయి. ఇక ప్రణాళికలంటారా, నేనేనాడు ప్లాన్ చెయ్యనండీ. పాట కూడా అంతే. ఇప్పుడు రాయాలని అనిపిస్తే, రాస్తాను. పాట రాయాలనుకోండి, దగ్గరలో ఏది ఉంటే అది తీసుకుని రాస్తాను. పుస్తకాలకి వాళ్ళు పంపించే రాపర్స్ ఉంటాయి, లేకపోతే, ఇన్‍లాండ్ కవరు, లేకపోతే బిల్లుల వెనుక వైపు రాస్తాను.  నాకేమీ ఫలానా పేపరు మీదే వ్రాయాలని ఉండదు. ఏదైనా వ్రాయాలని అనిపించినప్పుడు, ఇమ్మీడియట్‌గా ఏది దొరికితే, దాని మీద వ్రాసుకుంటాను. సిగరెట్ పెట్టెలు చింపి, లోపల ఉండే వైట్ స్థలంలో ఎన్ని పాటలు రాసుకున్నానో.. నాకే తెలియదు. నాకూ పెళ్ళాం కావాలి సినిమాలో నా ఫస్ట్ సాంగ్ ‘వినోదాల విందు రా’ అలా సిగరెట్ పెట్టె మీద రాసినదే. నాకు ప్లానింగ్ ఉండదు. కానీ, ఇప్పుడు కౌముది పత్రికలో ‘సర్పశిల’ వస్తోంది, అది కాక, రెండు మూడేళ్ళ క్రితం మొదలుపెట్టాను ‘వాలీ ఆఫ్ సోల్స్’ (Valley of Souls) అని, ‘నా కథ’ ఒకటి. ఈ ‘వాలీ ఆఫ్ సోల్స్’ దగ్గరదగ్గరగా 80 పేజీలు రాశాను. తర్వాత ‘నా కథ’ 60 పేజీలు రాశాను. ఈ రెండు మొదలుపెట్టి మూడు నాలుగు సంవత్సరాలైతోంది. 80 పేజీల దాకా వచ్చి, అక్కడ ఆపి, ‘మహతి’ మొదలుపెట్టాను. అది రాస్తునే ‘ఖుషీ కార్నర్’ ఒకటి. ఇలా నాలుగైదు – సగం సగం, పాతికా పావు – రాసి ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యాలన్నది ఆలోచన.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు భువనచంద్ర గారూ.

భువనచంద్ర: ధన్యవాదాలు.

***

మహతి (నవల)
రచన: భువనచంద్ర
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ.
పేజీలు: 480
వెల: ₹ 300/-
ప్రతులకు:
సాహితీ బుక్స్, చుట్టుగుంట,
విజయవాడ. ఫోన్: 9849992890
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్ 9000413413
~
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Mahathi-Bhuvanchandra/dp/B0G4H5H4MJ/

~

‘మహతి’ నవల పరిచయం:
https://sanchika.com/mahati-book-intro-prof-chs/

Exit mobile version