Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, బాలసాహితీవేత్త శ్రీ కాశీ విశ్వనాథం పట్రాయుడు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘బుంగమూతి’, ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే పిల్లల పుస్తకాలు వెలువరించిన శ్రీ కాశీ విశ్వనాథం పట్రాయుడు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కాశీ విశ్వనాథం పట్రాయుడు గారూ.

కాశీ విశ్వనాథం పట్రాయుడు: నమస్కారమండీ.

~

ప్రశ్న 1: ఇటీవల మీరు బాలబాలికల కోసం ‘బుంగమూతి’, ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే పుస్తకాలు ప్రచురించినందుకు అభినందనలు. పలుకుబడులు, సామెతలపై పిల్లలకి కథలు అందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వివరిస్తారా?

జ: యాదృచ్ఛికంగానే జరిగింది. ‘ఇచ్చకాలు’ అనే కథ ప్రజాశక్తి స్నేహలో ప్రచురితమైంది. ఈ కథలో ఎక్కువ సామెతలు ఉపయోగించడం జరిగింది. చాలామంది పాఠకులనుంచి ప్రశంసలు లభించాయి. మరికొద్ది రోజులకు, ‘రోలు మొర మద్దెల చుర చుర’ అనే కథ ప్రజాశక్తి చిన్నారిలో ప్రచురితమైంది. ‘రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకుందిట’ అనే సామెత ఏ సందర్భంలో వాడుతారో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో, పిల్లలకు అర్థమయ్యే విధంగా వారి స్థాయికి తగినట్లు ఊహించి రాయడం జరిగింది. కథ ప్రచురితమయ్యాక శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు, శ్రీ గరిపెల్లి అశోక్ గారు “ఈ రకమైన కథలు ఎవరూ రాయలేదు. ఈ కథలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. రేపటి తరానికి సామెతలు, జాతీయాలు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కొనసాగించండి” అని ప్రోత్సహించారు. వారి మాట వేదవాక్కుగా భావించి రాయడం కొనసాగించాను.

ప్రశ్న 2: మీ రచనా ప్రస్థానం కవిత్వంతో మొదలయింది. బాలసాహిత్యం వైపు ఎప్పుడు ఎలా మళ్ళారు? బాలసాహిత్యం వైపు మళ్ళేందుకు ప్రేరణ ఏమిటి/ఎవరు?

జ: కొన్నేళ్ల క్రితం తెలుగు వెలుగు పత్రికలో ‘అటకెక్కిన రచయిత’ అనే కథ చదివాను. ఆ కథ నాకెంతో నచ్చింది. కథ చివర ఇచ్చిన ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి ‘మీ కథ నాకెంతో నచ్చింద’ని రచయితకు చెప్పాను. వారెంతో సంతోషించారు. అప్పటి వరకు వారితో నాకు పరిచయం లేదు. ఈ కథ మా ఇద్దరినీ కలిపింది. ఆ పరిచయం కాస్త వారు నన్ను బాలసాహిత్యం వైపు నడిపించేందుకు కారణమయ్యింది. వారు మా శ్రేయోభిలాషి. వారే నారంశెట్టి ఉమామహేశ్వర రావు గారు.

నన్ను ప్రోత్సహించి బాలసాహిత్యంలో ఈ స్థాయికి రావడానికి కారణమైన మరొక వ్యక్తి ఓట్ర ప్రకాష్ రావు గారు, చెన్నై నివాసి.

ప్రశ్న 3: ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ, రోజులో ఎక్కువ భాగం పిల్లలతో గడపడం వల్ల మీ రచనా శైలి.. ముఖ్యంగా బాలసాహిత్యంలో ఏ విధంగా ప్రభావితమైంది?

జ: రచయితకి పరిశీలన, పరిశోధన రెండూ ఉండాలి. నేను ఉపాధ్యాయుడిని కావడంతో పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కలిగింది. దాని వల్ల నా శైలి వారి ఇష్టాలకు, ఆలోచనలకు స్థాయికి తగ్గట్టుగానే ఉంటుంది. పిల్లల మనస్తత్వాలు, యిష్టాయిష్టాలు దగ్గరి నుంచి చూస్తాం కాబట్టి వారి ప్రభావం నా రచనల్లో ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి.

ప్రశ్న 4: పిల్లలకి కథలు వ్రాయడం కష్టమా? పాఠాలు బోధించటం కష్టమా?

జ: రెండూ కష్టమైనవే.. పిల్లలకు నచ్చినట్లు, ఆసక్తి కలిగేటట్లు, వారు చదవగలిగేటట్లు సరళంగా, వారి స్థాయి కెదిగి రాయడం ఆషామాషీ విషయం కాదు.

బోధన కూడా అంతే.. ఒక్కో విద్యార్థిదీ ఒక్కో స్థాయి. వారి వారి స్థాయిలను బట్టి వారికి అర్థమయ్యే విధంగా బోధించాలి. నేను చెప్పిన అంశం వారు అవగాహన చేసుకుని తిరిగి చెప్పగలగాలి, అప్పుడే వారికి నేను చెప్పినది అర్ధమైనట్లు. కథ కల్పితం. బోధన వాస్తవం. ఉపాధ్యాయుడు చెప్పినది విని నేర్చుకోవడం అనేది విద్యార్థి చేతిలో ఉంది. పాఠకులకు లేదా పిల్లలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా రాయడం అనేది రచయిత చేతిలో ఉంది.

ప్రశ్న 5: ఉపాధ్యాయుడిగా మామూలు పాఠాలు కాకుండా, తరగతి గదుల్లో పిల్లలకి మీ కథలు చదివి వినిపించే అవకాశం వచ్చిందా?

జ: ప్రతీ శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా నా కథలతో పాటు ఇతర కథలు కూడా పిల్లలకు వినిపిస్తాను.

‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎం.ఎల్.సి. శ్రీ ఇందుకూరి రఘురాజు

ప్రశ్న 6: మీ రచనల ద్వారా పిల్లలలో మాతృభాష పట్ల మమకారం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆంగ్ల అధ్యాపకుడిగా నిత్య జీవితంలో ఇంగ్లీషు ప్రాధాన్యతని, ఆంగ్లం నేర్చుకుని ఉపయోగించుకోవాల్సిన పద్ధతిని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం సాధ్యమవుతోందా?

జ: పరకాయ ప్రవేశం చెయ్యాల్సిందే. లేకుంటే మనుగడ సాగించలేము. ఉపాధ్యాయ శిక్షణ తీసుకుని వృత్తిలోకి వచ్చాము. తదనంతరం మారుతున్న పాఠ్యాంశాలకనుగుణంగా ఎప్పటికప్పుడు దీక్ష యాప్, లీప్ యాప్, కర్మ యోగి యాప్ ల ద్వారా ప్రభుత్వం మాకు శిక్షణ ఇస్తోంది. తద్వారా మా నైపుణ్యాలను మెరుగు పరచుకొని పిల్లలకు నాణ్యమైన విద్యని అందిస్తున్నాము.

ప్రశ్న 7: ఒక పలుకుబడిని/సామెతని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పేందుకు ఒకటి కన్నా ఎక్కువ కథలు చెప్పే అవకాశం ఉన్నప్పుడు మీరు దేనిని ఎంచుకుంటారు? ఎందుకు?

జ: ఒక సామెతకు లేదా పలుకుబడికి ఒకటి కన్నా ఎక్కువ కథలు ఉన్నప్పుడు అవతలి వారి స్థాయిని బట్టి, సమయం, సందర్భాన్ని బట్టి కథని ఎంచుకుని చెప్తాను.

స్నేహితుల సమక్షంలో ‘బుంగమూతి’ పుస్తకావిష్కరణ

ప్రశ్న 8: తెలుగు పలుకుబడులకు సమానమైన ఆంగ్ల ఇడియమ్స్/ఫ్రేజెస్ ఏవైనా మీ దృష్టికి వచ్చాయా? ఉంటే వాటిని పిల్లలకి ఎలా వివరిస్తారు?

జ: కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు – New brooms sweeps clean దీనికి ఒక చిన్న ఇంగ్లీష్ మోరల్ స్టోరీ తీసుకుని వారికి అర్థమయ్యే రీతిలో చెప్తాను.

ప్రశ్న 9: ‘బుంగమూతి’ సంపుటి లో ఆయా పలుకుబడులకు సృజించిన కథలలో, రాజులు రాజ్యాల కథలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది యాదృచ్ఛికమా? ఎందుకంటే కొందరు బాలసాహితీవేత్తలు – రాజూలూ, రాజ్యాల కథలు నేటి తరపు పిల్లలకి అవసరం లేదని, సమకాలీన అంశాలలో కథలు అల్లి చెప్పాలని అంటున్నారు. మీ అభిప్రాయం ఏమిటి?

జ: పిల్లలు ఊహా లోకాల్లో విహరిస్తారన్నది వాస్తవం. అయితే అప్పటి పిల్లల ఊహాలోకం వేరు ఇప్పటి పిల్లల ఊహాలోకం వేరు. అందుకే సమకాలీన అంశాలతో చెప్తేనే పిల్లలు ఇష్టపడతారు. నా కథల్లో రాజ్యాలు, రాజులు తక్కువగా కనిపించడానికి కారణం ఇదే.

ప్రశ్న 10: ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ పుస్తకంలో పదవ కథలో ‘గడియ గటక్ దివ్వె దిటక్’ అని వాడారు. వాటి గురించి వివరిస్తారా?

జ: చక్కని ప్రశ్న. ఇది ప్రాసతో కూడిన పురాతన పల్లెటూరి పదబంధం. ‘గడియ గటక్, దివ్వె దిటక్, కుక్కి మంచం మీద కూలబడి..’ అనే వారు. అంటే ‘తలుపుకి గడియ పెట్టి, దీపం ఆర్పి, మంచం మీద పడుకుంటున్నాను’ అని చెప్పడం.

ప్రశ్న 11: ‘ఆటలో అరటి పండు..’ తెలుసు. కానీ ‘పాటలో పనసపండు..’ అంతగా వినలేదు. దీని గురించి వివరిస్తారా?

జ: ఇది కూడా ప్రాస పదబంధం. పిల్లలు ఆటల్లో వాడేది. పూర్వం నలుగురిలో పాటలు/పద్యాలు పాడేటప్పుడు వింటున్న శ్రోతలు ఆనందం పట్టలేక ఏదో ఒక కానుక చదివించేవారు. గాయకుడు పాటను మద్యలో ఆపి ఆ దాతను దీవించేవాడు. అలా ఒక సందర్భంలో ఒక వ్యక్తి గాయకుడికి పనసపండు చదివించాడు. చూసిన అందరూ గొల్లున నవ్వారు. గాయకుడు కూడా తప్పనిసరి అయి ఆ కానుకను స్వీకరించాడు. ఇలాగే తమ ఈడు కాని పిల్లలను ఆటలలో చేర్చుకోవలసి వచ్చినప్పుడు ఈ పదబంధం వాడుతున్నారు.

ప్రశ్న 12: ఈ రెండు పుస్తకాలలోని సామెతలు/పలుకుబడులు – సార్వజనీనమైన వాటితో పాటు – స్థానికంగా/ప్రాంతీయంగా ప్రసిద్ధికెక్కినవి ఏవైనా జోడించారా?

జ: ‘జంబాలు కోరు పిందె’ ఇది తెలంగాణలో వాడే జాతీయం. ఆంధ్రాలో అయితే తడి తక్కువ తమాషా ఎక్కువ లేదా మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అని అంటారు.

సున్నప్పిడత, పుల్లారు బుడ్డి, ఎగిరే పిట్టకు మసాలా నూరడం, పూట బత్తెం పుల్ల వెలుగు, ఏడ్చిన దానికి మొగుడొస్తే ఏడవని దానికి వస్తాడు మొదలగునవి జోడించాను.

ప్రశ్న 13: ‘బుంగమూతి’ సంపుటి లోని కథలలో ఏ కథ మీకు బాగా నచ్చింది? అలాగే ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ ఏది నచ్చింది? ఎందువలన?

జ: అన్ని కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమై పాఠకాభిమానుల ప్రశంసలు పొందినవే. అయితే ‘నల్లేరు మీద నడక’ అనే కథలో మా స్వగ్రామం చామలాపల్లి అగ్రహారం పేరు, పెద్ద బుగత గారి పేరు రాయడంతో గ్రామస్తులు మరియు ఆ కుటుంబీకులు ఆ కథ చదివి ఈ రకంగా నైనా మన గ్రామం పేరు, బుగత గారి పేరు వెలుగులోకి వచ్చిందని ఆనందించారు. నన్ను అభినందించారు.

అలాగే ‘రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి’ అన్న కథకి కూడా పలువురి ప్రశంసలు లభించడమే కాక 70 ఏళ్లు పైబడినవారు కూడా, ‘ఈ సామెత కొత్తగా ఉందండీ.. దీని గురించి ఇప్పుడే తెలుసుకున్నాము.. దీని వెనుక ఇంత కథ ఉందా? చాలా బాగుందండీ’ అంటూ ప్రశంసించడం నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రశ్న 14: ఈ రెండు పుస్తకాలలో ఏదైనా సామెత/పలుకుబడి గురించి కథ అల్లడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘మసిబూసి మారేడుకాయ చెయ్యడం’ కథ కాస్త సమయం తీసుకుంది.

ఇంకా మెరుగ్గా రాస్తే బాగుండును అని ఏ కథకు అనిపించలేదు. ఎందుకంటే ఒకటికి పదిసార్లు చూసుకుని మార్చి మార్చి తప్పులు సరిదిద్దుకుని కథ పూర్తి చేస్తాను. గబ గబ రాసేసి తొందరపడి పత్రికకు పంపాలి అనుకోను. మరికొన్ని సంవత్సరాల తరువాత చదివినా అద్భుతమైన కథ రాసేనని నా మనసుకు, మంచి కథ చదివేనని పాఠకుని మనసుకు అనిపించాలి.

ప్రశ్న 15: ఈ కథా సంపుటిని పుస్తక రూపంలో తీసుకురావడంలో ఏవైనా ప్రత్యేక అనుభవాలున్నాయా? ఉంటే, వాటిని పాఠకులతో పంచుకుంటారా?

జ: ప్రచురితమైన ప్రతీ కథ పాఠకుణ్ణి నాకు దగ్గర చేసింది. వివిధ సమూహాల్లో, నా స్టేటస్‌లో పెట్టుకున్న కథలు చదివి స్పందన తెలియచేయడమే కాక ఆ కథలు పుస్తక రూపంలో కావాలని కోరారు. వారి కోరికమేరకు ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ సామెత కథల సంపుటి తీసుకురావడం జరిగింది.

ఇక రెండవ పుస్తకం ‘బుంగమూతి జాతీయాల కథల సంపుటి’ని నా బాల్య మిత్రురాలు శ్రీమతి పిల్లా కృష్ణవేణి ప్రచురించారు.

ప్రశ్న 16: కాశీ మావయ్యగా మీరు సుపరిచితులు. ఎన్ని కథా సంపుటాలను మీరు వెలువరించారు? అందులో మీకు గుర్తింపు తెచ్చినవి ఏవి?

జ: జన జీవన రాగాలు (కవితా సంపుటి), జిలిబిలి పలుకులు (బాల గేయ సంపుటి), దేవునికో ఉత్తరం (బాలల కథా సంపుటి), అద్భుతం (బాలల కథా సంపుటి), కాశీమావయ్య కథలు (బాలల కథా సంపుటి), తాతయ్య కల (బాలల కథా సంపుటి), మౌన మేలనోయి (సాంఘిక కథలు), ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి (సామెత కథల సంపుటి), బుంగ మూతి (పలుకు బడి కథల సంపుటి) , పెద్దమ్మ చూపిన మార్గం ( పేదరాశి పెద్దమ్మ చెప్పిన కథలు) వెలువరించాను

వీటిలో కాశీమావయ్య కథలు, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి (సామెత కథలు), బుంగ మూతి (పలుకు బడి కథలు) నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ప్రశ్న 17: సామెతల మీద, జాతీయాల మీద కథలు రాయడానికి మీరు ఎందుకు ఆసక్తి కనబర్చారు?

జ: నాగరికత పెరిగి, పల్లె సంస్కృతి నుంచి పట్టణ సంస్కృతికి రూపాంతరం చెందడంలో పరభాష మీద మోజు పెరిగి మాతృభాష మీద పట్టు తగ్గింది. భాషకి సౌందర్యాన్ని ఇచ్చే లోకోక్తులు, పలుకుబడుల వాడకం తగ్గింది. సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు కానీ, ప్రసంగించేటప్పుడు కానీ సామెతలు లేదా జాతీయాలు ఉపయోగించినట్లయితే వీనులవిందుగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సామెతలను, పలుకుబడులను అంతగా ఉపయోగించకపోవడంతో ఏ సామెతను ఏ సందర్భంలో వాడాలన్న విషయం నేటి తరానికి తెలియకుండా పోయింది. అందుకే నేను సామెతను వాడే సందర్భం తెలియచేస్తూ వాటిని కథల రూపంలో చెప్పడానికి ఆసక్తి కనపర్చాను.

ప్రశ్న 18: మీ కుటుంబంలో ఎవరైనా రచయితలు ఉన్నారా? మీరు కథలు మీ ఇంట్లో వారు చదువుతారా?

జ: నా భార్య నాగమంజరి గుమ్మా పద్య కవయిత్రి, రచయిత్రి కూడా. నా కథలకు మొదటి పాఠకురాలు, విమర్శకురాలు కూడా నా భార్యే. మా అమ్మగారు, నా పిల్లలు కూడా నా ప్రతీ కథని చదివి అభిప్రాయం చెప్తారు.

రచయిత రాసిన కథల పుస్తకాన్ని చదువుతున్న అమ్మగారు

ప్రశ్న 19: రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

జ: సరస్వతీ మాత దయతో పిల్లలు, పెద్దలు చదివి ఆనందించే మంచి కథలు కడ దాకా రాస్తూనే ఉండాలని, మంచి కథకుడిగా పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని, నా ఇంటిపేరు, ఊరిపేరు వెలుగులోకి రావాలని నా ఆశ.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కాశీ విశ్వనాథం పట్రాయుడు గారూ.

కాశీ విశ్వనాథం పట్రాయుడు: సంచిక ఆబాలగోపాలాన్ని అలరించే చక్కని అంతర్జాల సాహిత్య పత్రిక. 2019 నుంచి నా కథలు ప్రచురిస్తూ, నా సాహిత్యాభివృద్ధికి సహకరిస్తున్న సంచిక యాజమాన్యానికి హృదయ పూర్వక ధన్యవాదాలు!

***

బుంగమూతి
(పలుకుబడి కథలు)
రచన: కాశీ విశ్వనాథం పట్రాయుడు
ప్రచురణ: పి.ఆర్. పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 110
వెల: ₹ 400/-
ప్రతులకు:
కాశీ విశ్వనాథం పట్రాయుడు
ఆంగ్ల ఉపాధ్యాయులు,
భవానీ ఐటిఐ దగ్గర, ఎస్. కోట,
విజయనగరం జిల్లా. 535145
ఫోన్: 9494524445

 

~

ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి
(సామెత కథలు)
రచన: కాశీ విశ్వనాథం పట్రాయుడు
ప్రచురణ: పి.ఆర్. పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 110
వెల: ₹ 250/-
ప్రతులకు:
కాశీ విశ్వనాథం పట్రాయుడు
ఆంగ్ల ఉపాధ్యాయులు,
భవానీ ఐటిఐ దగ్గర, ఎస్. కోట,
విజయనగరం జిల్లా. 535145
ఫోన్: 9494524445

 

~

‘బుంగమూతి’, ‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’ అనే పిల్లల పుస్తకాల సమీక్ష:
https://sanchika.com/kvp-two-children-books-review-kss/

Exit mobile version