Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథకుడు, అనువాదకుడు శ్రీ కస్తూరి రాజశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘మనో విహారి’ అనే అనువాద కవితాసంపుటి వెలువరించిన కస్తూరి రాజశేఖర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కస్తూరి రాజశేఖర్ గారూ.

కస్తూరి రాజశేఖర్: నమస్కారం.

~

ప్రశ్న 1: మీరు అనువదించిన ఆంగ్ల కవితా సంపుటి Echoes of Life కి తెలుగులో మనో విహారిఅనే శీర్షికని ఎంచుకోవడంలోని కారణం వివరిస్తారా?

జ: నిజానికి ramblings అనే కవితా శీర్షికని సంపుటి శీర్షికగా పెడదామనుకుని, సరయిన పదం కోసం పాట్లు పడుతున్నప్పుడు, మా అమ్మాయి శ్రీకీర్తి అటువైపు వెళుతూ ‘మనో విహారి’ అని పెట్టొచ్చుగా అని వెళ్ళింది. అమ్మవారే ఆ మాటలు పలికించినట్లనిపించింది. అదే ఖాయం చేసాను.

ప్రశ్న 2: వృత్తి రీత్యా బ్యాంకింగ్ రంగంలో ఉన్నతాధికారిగా పని చేసి రిటైరైన మీకు సాహిత్యం మీద అభిరుచి ఎప్పుడు ఎలా కలిగింది? మీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా?

జ: మాది తెనాలి. చిన్నప్పట్నుంచీ మా ఇంటి ప్రక్కనే ఉన్న ప్రభుత్వ గ్రంథాలయంలో చందమామ, బాలమిత్రలు క్రమం తప్పకుండా చదివేవాడిని. మా అమ్మ నాకు పురాణ కథలు చెప్పేది. టీచర్‌గా పనిచేసే మా నాన్నకి కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి. ఆ రకంగా మాకు ప్రపంచ చరిత్ర గురించీ చెబుతూ, దేశభక్తి పాటలు నేర్పేవారు. నేను స్కూల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవాణ్ని. అప్పుడు మా నాన్నే ముందు రోజు నా చేత రాయించి, మెరుగులు దిద్ది నాకు తర్ఫీదు ఇచ్చేవారు. నేను ప్రైజ్‌లతో ఇంటికి వచ్చేవాణ్ని. అమ్మా, నాన్న ఎంతో సంతోషించేవాళ్ళు. కాలేజీ చదువుకు వచ్చేసరికి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతిలో కథలు చదివే అలవాటు అయింది. దాంతో పాటే పది పైసలు అద్దె కట్టి తెచ్చుకున్న డిటెక్టివ్ నవలలు కూడా విపరీతంగా చదివేవాడిని. అప్పట్లో మధుబాబు షాడో స్పై థ్రిల్లర్ పుస్తకాలు పెద్ద obsession. ఆ సమయంలోనే కవితలు వ్రాయటం మొదలైంది. ఆ రోజుల్లో trend గా ఉండే విప్లవ కవిత్వం కూడా చదివాను. శ్రీశ్రీ, ఆరుద్ర, దేవులపల్లి, దాశరథి, దేవరకొండ బాల గంగాధర తిలక్ వంటి లబ్ధ ప్రతిష్ఠుల రచనలు చదివాను. మరీ ముఖ్యంగా చలం రచనలు చదివాను. అక్షరం ఎక్కడ కనిపించినా భావజాలంతో సంబంధం లేకుండా చదివేస్తూ ఉండేవాడిని. భావజాలాల మధ్య ఉన్న మౌలికమైన తేడా ఏమిటో కూడా తెలీదు. సాహిత్యం చదవటం, ఆనందించటం, అంతే! గమ్మత్తు ఏమిటంటే, అదే సమయంలో మా మేనమామ (మా పెద్దక్క భర్త) పిల్లల కోసం కొన్న ఉషశ్రీ రామాయణ, భారత వచన సంపుటాలు వరుస పెట్టి చదివేవాడిని. వాటి కోసమే, కాలేజీ నుంచీ అక్కా వాళ్ళింటికి వెళ్ళి అక్కడే ఉండిపోయేవాడిని. చిన్నప్పటినుండీ తెనాలి మా బ్రాహ్మణ వీధిలోని మా కంటే పెద్ద వాళ్లయిన యువకులతో పాటు విధిగా RSS కు ప్రతిరోజూ వెళ్ళేవాడిని. మా అక్క కొడుకుల్ని కూడా సంఘానికి పరిచయం చేశాను. ఈ ప్రస్థానంలో కొసమెరుపు ఏమిటంటే, నేను జీవనపోరాటంలో అన్నీ భావజాలాలకీ దూరమైపోయాను కానీ మా మేనల్లుళ్ళు మాత్రం సంఘానికి అంకితమై, ఇప్పటికీ ప్రభావవంతమైన జీవితం కొనసాగిస్తున్నారు. నా పెద్ద మేనల్లుడు నా కవితల్ని ఎంతగానో అనుభూతించేవాడు. నా కవితలన్నీ ఒక్కచోట పొందుపరచమని ఒక లాంగ్ నోట్ బుక్ కూడ ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ విధంగా నేనేది వ్రాసినా మురిసిపోయే నా మొదటి శ్రోత మా అమ్మ, దిద్దుబాటు చేసే నాన్న, ప్రోత్సహించే అన్నయ్యలు, అక్కయ్యలు, వారి పిల్లలు, మరీ ముఖ్యంగా స్నేహితులు ఇంత మంది భరోసాతో నా కలానికి బలమెక్కింది. పెళ్ళయ్యిన తర్వాత కూడా అదృష్టవశాత్తూ, నా కుటుంబ సభ్యులంతా నాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు.

నదీనాం సాగరో గతి అన్నట్లుగా అప్పట్లో డిగ్రీ పూర్తయిన వాళ్ళంతా హైదరాబాద్‌కి వచ్చేవారు. మా 9 మంది సంతానంలో నేను కనిష్ఠుడిని. మా పెద్దన్నయ్య 1964 లోనే హైదరాబాద్ వచ్చి బ్యాంక్ ఉద్యోగం చేస్తూ, మా ఇంటిల్లిపాదికీ ముందు ఉండి జీవితంలో స్థిరపరచారు. హైదరాబాద్లో మా డాక్టర్ మామయ్య, ప్రసన్న అక్క సహాయంతో అల్ ఇండియా రేడియోలో భావ వీచికలు అనే కార్యక్రమంలో స్వీయ కవితలు చదివాను. నేను ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, చివరికి ఈనాడులో నాకు ఇష్టమైన సబ్ ఎడిటర్ ఉద్యోగంలో జేరాను. అప్పట్లో నేను, మా బాబాయి కొడుకు కలిసి రాసిన జైత్ర యాత్ర నవల, కాలనాళిక లోంచీ ఈ మధ్యనే బయటపడి, మన ‘సంచిక’లో ధారావాహికమయ్యింది. అందుకు మీకు నా కృతజ్ఞతలు.

నేను ఆంధ్రా బ్యాంక్ జనగామలో పనిచేస్తున్నప్పుడు 1995 దీపావళి పోటీకని ఆంధ్ర ప్రభ వారు ప్రకటించిన నవలల పోటీకి నా సహోద్యోగి ఇచ్చిన కథాంశం మీద 10 రోజుల్లో నవల వ్రాసి పంపాను. అందులో నాకు 3వ బహుమతి వచ్చింది. ఆ సభలోనే పరిచయమైన మన మిత్రుడు కస్తూరి మురళీకృష్ణకి 2వ బహుమతి వచ్చింది. అలాగే, రచనా వ్యాసంగంలో చెప్పుకోవాలంటే, 2007లో ఢిల్లీ బదిలీ అయిన తర్వాత, ఢిల్లీ తెలుగు సంఘం వారితో పరిచయం అయి, వారి అనుబంధ శ్రీ కృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారికి నాటకాలు వ్రాసాను. అజో-విభొ-కందాళం వారి పోటీలో ప్రత్యేక బహుమతి , అలాగే పరుచూరి రఘుబాబు నాటక పోటీలో నా త్వమేవాహం అనే నాటకానికి 8 అవార్డులు వచ్చినాయి. అప్పుడే నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కోసం అనువాద రచనలు చేయటం మొదలైంది. పత్తిపాక మోహన్ గారి ప్రోత్సాహంతో చాలా రచనలు చేశాను. చాలాఏళ్ల తర్వాత నేను వ్రాసిన కథ ఈనాడులో ప్రచురితమైంది. దాంతో మళ్ళీ, మనసు రచనెత్తుకుంది. రిటైర్ అయిన తర్వాత Kasturi DreamWorks అనే యూట్యూబ్ చానెల్ మొదలెట్టి, short movies, ఆధ్యాత్మిక, దైవభక్తి కార్యక్రమాలు చేస్తున్నాను.

ప్రశ్న 3: మీరు స్వయానా కవి, కథకులు. నాటకాలూ నవలలూ వ్రాశారు. అనువాదాల వైపు మళ్ళేలా మిమ్మల్ని ఏది ప్రేరేపించింది?

జ: నేను ఈనాడులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్నో పుస్తక సమీక్షలు చేశాను. మా ఎడిటర్ చలసాని గారు నాకు ఎంతో స్వేచ్ఛ  ఇచ్చేవారు. ఆయన శిక్షణలో నా కలం పదునుగా మారింది. తర్వాతి కాలంలో నేను బ్యాంక్‌లో పనిచేస్తున్నప్పుడు నవసాహితి బుక్ హౌస్ వారు నిర్వహించిన సమీక్షా పోటీల్లో, ‘యండమూరి గారి 25 ఏళ్ల నవలా ప్రస్థానం’ మీద నేను వ్రాసిన సమీక్షకి బహుమతి ఇవ్వటమే కాక, యండమూరి గారు స్వహస్తాలతో నన్ను మెచ్చుకుంటూ ఉత్తరం వ్రాయటం నాకు కితాబు. అంతేకాదు, మన ‘సంచిక’ పత్రికలో నేనుచేసిన రెండు సమీక్షలు ‘ఆ అరగంట చాలు’, ‘అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్’ సమీక్షలకి పాఠకులే కాక స్వయానా ఆ పుస్తక రచయితల మెప్పు పొందటం నాకు కలికితురాయి. ఈ వారం ప్రత్యేకంలో ఎన్నో కథనాలు వ్రాసాను. ఎయిడ్స్ మీద తెలుగులో మొదటి వ్యాసం నాదే. అలాగే, ఆదివారం అనుబంధంలో ఎన్నో కథనాలు అనువాదాలే! నాకు అనువాదంలో ఓనమాలు నేర్పింది కీ.శే. చలసాని ప్రసాద రావు గారు అయితే, నాకంటూ ఒక ప్రత్యేకతని తెచ్చిపెట్టింది పత్తిపాక మోహన్ గారే! అదే నేను అనువాదం చేయగలనన్న నమ్మకాన్ని, బలాన్ని ఇచ్చింది. కొన్నేళ్ళ క్రితం మా అన్నయ్య గారి చీఫ్ జనరల్ మేనేజర్, మిత్రులూ అయిన శ్రీ పసుపులేటి దినకర్ రావు గారు రచించిన Echoes of Life అనే పుస్తకంలోని కవితల్ని తెలుగులో వ్రాస్తే బాగుంటుంది అని చర్చ జరిగినప్పుడు, మా వదిన గారు నన్ను ప్రయత్నించమన్నారు. నేను రెండు కవితలు అనువాదం చేసి పంపాను. అది చదివిన దినకర్ రావు గారూ, వారి కుమార్తెలు కూడా ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగులో భావ పుష్టి మెండుగా ఉందని, నన్ను మిగిలిన కవితలు కూడా తెనిగించమని కోరారు. నా ఉద్యోగంలోని ఒత్తిడి వల్ల, అప్పుడప్పుడు రాసుకుంటూ పోయాను. ఈ లోపు మా వదినగారు జబ్బుచేసి జరిగిపోయారు. నేను వ్రాయటం ఆపేశాను. ఆమెకు నివాళిగా, మా అన్నయ్యగారు పూనుకుని, నా వెన్నంటి ఉండి ఇంత దూరం తీసుకు వచ్చారు. వాళ్ళు నన్ను youngest brother – eldest son గానే చూసుకుంటారు. మా వదిన ఈ పుస్తకాన్ని చూడలేదే అన్న బాధ ఎప్పటికీ ఉంటుంది.

ప్రశ్న 4: స్వంతంగా కవిత రాయడం లేదా ఒక కవితని అనువదించడం – ఈ రెండిటిలో ఏది కష్టం? ఎందువల్ల? కవిత్వాన్ని అనువదించడానికి మూల భాష, లక్ష్య భాషలపై పట్టు ఉండడమే కాకుండా, ఇంకా ఏవేవి కీలకమని మీరు భావిస్తున్నారు?

జ: ఖచ్చితంగా అనువాదమే కష్టం. కవిత అంటేనే భావ స్వేచ్ఛతో ఉరుకులెత్తే అక్షర జలధార. కవికి ఆకాశమే హద్దు. వాస్తవికతకు దూరంగా కూడా ఊహించే స్వేచ్ఛ ఒక్క కవికి మాత్రమే ఉంది. ప్రియుడు, ప్రియురాలు పాడుకునే పాటలో నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ అని వ్రాసిన వేటూరి గారిని ఎవరో అడిగారు. నింగీ నేలా కలవవు కదా.. అంటే వాళ్ళిద్దరూ కలవకూడదు అని పాడుకున్నారా అని అడిగితే, అది ‘కవిసమయం’ అని సమాధానమిచ్చారాయన! అంటే ఎంత స్వేచ్ఛ తీసుకున్నారో చూశారా? “అశాస్త్రీయమలౌకికం చ పరంపరాయాతం యమర్థముపనిబధ్నంతి కవయః స కవిసమయః” భావం: శాస్త్రాలకు విరుద్ధమైనదైనా, ప్రత్యక్షంగా లోకంలో కనిపించనిదైనా, కేవలం కవుల పరంపర (సంప్రదాయం) ద్వారా వస్తున్నదానిని, కవులు తమ కావ్యాలలో నిబంధిస్తే (వాడుకుంటే) దానిని కవిసమయం అంటారు.

అదే అనువాదం అయితే, పరిధులు, పరిమితులు ఉంటాయి. ‘అనువాద కళ’ ప్రకారం, శబ్దానువాదం, రూపాంతరం, సరళానువాదం, అర్థానువాదం వంటి ప్రక్రియల ద్వారా రచన సాగాల్సి ఉంటుంది. అనుశీలనాత్మకంగా స్వేచ్చానువాదంలో కాస్త వెసులుబాటు ఉంటుంది.

నేను చిన్నప్పటినుంచీ కూడా అనువాద రచనలు చాలా చదివాను. మాకు సోవియట్ రష్యా రచనలు లైబ్రరీలో దొరికేవి. మాక్సిం గోర్కీ ‘అమ్మ’ , ఓస్ట్రోవస్కీ ‘how the steel was tempered?’, వంటివే కాక, రాహుల్ సాంకృత్యాయన్ రచన కు తెలుగు రూపం ‘ఓల్గా నుంచీ గంగకు ‘ , ఇంకా ‘a tale of two cities’, ‘Sindbad stories’, అలెక్స్ హేలీ ‘ఏడు తరాలు’, mark twain ‘విచిత్ర వ్యక్తి’ , ఇంకా ఇతర రచనలు.

నిజానికి, అనువాదానికి కీలకం – మూల రచయిత భావ ప్రపంచాన్ని, రచనా సమయంలో అతని మనస్థితినీ, అవగాహనా స్థాయిని, అదికూడా సంబంధిత గ్రంథ రచనా కాలంలో అతని thought process ని అర్థం చేసుకోవటం కీలకం.

ప్రశ్న 5: “ఆంగ్ల ఆత్మకి తెలుగు అనుభూతి జోడించి జీవన భావనా లహరిని మన మనసులలో ప్రవహింపజేశారు” అని వ్యాఖ్యానించారు మద్దాళి రఘురామ్ గారు తమ ముందుమాటలో. ఆంగ్లంలో వ్రాసినప్పటికీ, మూలకవి తెలుగువారే కావడం వల్ల ఆంగ్ల కవితలలోని భావానుభూతిని తెలుగులో ఒదిగించడం సులువైందా? మూల కవే, ఆంగ్లంలో కన్నా తెలుగులో కవితలు బాగా వచ్చాయి అని చెప్పడం ఒక చక్కని కితాబు కదా!

జ: నిజమే. కవితలు ఆంగ్లంలో ఉన్నా, చాలా చోట్ల భావరీతులు మన ప్రాంతీయత కలిగి ఉండటం వల్ల, అనువాదం వన్నెకెక్కింది. దినకర రావు గారు తెలుగు కవితల్ని మెచ్చుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం.

ప్రశ్న 6: ఆంగ్లంలో 8 అధ్యాయలుండగా, తెలుగులో 5 అధ్యాయాలుగా ఎందుకు సర్దుబాటు (rearrange) చేయాల్సి వచ్చింది? మూలంలో 180 కవితలుండగా మీరు 108 కవితలనే ఎందుకు అనువాదానికి ఎంచుకున్నారు?

జవాబు: ఇంగ్లీష్‌లో కవితలన్నీ చదివాక, Experience and Wisdom (అనుభవం-విజ్ఞత), Old Age & Death (వార్థక్యం-మరణం) లను యధాతథంగా ఉంచేసి, Creation & Nature, God లను దైవం-సృష్టి అనే ఒక విభాగంగా, Young Love, Companionship లను ‘తొలిప్రేమ-అనుబంధం’ గానూ, Quest , Suffering లను ‘అన్వేషణ-వేదన’ గానూ కలపటం వల్ల, జీవితం లోని వివిధ దశల్ని 5 దశలుగా ఒక క్రమం లో పెట్టగలిగాను. దీనికి స్పూర్తి మనిషి జీవితం పంచ భూతాత్మకం అన్న భావన.

ప్రశ్న 7: కవిత్వానికి యథాతథ అనువాదం నప్పుతుందా లేక స్వేచ్ఛానువాదమా? ఈ సంపుటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?

జ: యథాతథంగా ఉండే అనువాదం పూర్వం వచ్చిన సోవియట్ యూనియన్ తెలుగు రచనల లాగానే ఉంటాయి. అది చదువరి మనసుని హత్తుకోవు. అలా అని స్వేచ్ఛానువాదం అంటే ఇంగ్షీషు నవలలని, సినిమాలని ఎలాంటి అనుమతులూ లేకుండా వాడేసుకుంటున్నట్లు కాదు. స్వేచ్ఛకి కూడా బాధ్యత ఉంటుంది. ‘మనో విహారి’లో మీకు అనుశీలనాత్మకమైన నడక కనిపిస్తుంది.

ప్రశ్న 8: పుస్తకంలో ఆయా కవితలకి సంబంధించిన చిత్రాలుంచడం బావుంది. ఆంగ్ల సంపుటిలో ఉన్నాయా లేక అనువాదంలోనే చేర్చారా?

జ: ఆంగ్లంలో చిత్రాలు లేవు. చిత్రాలు ఉంటే బాగుంటుందని నాకే అనిపించి, గీశాను. దీనికి ఒక కారణం ఉంది. ఈ రోజుల్లో మామూలు తెలుగు కూడా చదవలేని, చదివినా అర్థం కాని పరిస్థితి ఉంది. కవిత యొక్క అర్థం చిత్రం రూపంలో ఉంటే, కొంత అవగాహన, ఆ పైన కొంత ఆసక్తి కలిగి readership పెరుగుతుంది కదా.

ప్రశ్న 9: ‘భావామృతం’ అనే కవితలో “ఒడిసిపట్టి వడగడితే/ప్రాఙ్మయ పీయూషాలు!/అభ్యున్నత దారిలో ఆశల పల్లకీలు మోస్తాయి” అనే పాదాలు హైలైట్. ఆ కవిత మూలం లోని సంబంధిత పదాలను తెలిపి, అనువాదంలో ఎలా ఒదిగాయో వివరిస్తారా?

జవాబు: ఈ కవితలో నల్లేరు మీద నడక, నివురుగప్పిన నిప్పులు వంటి జాతీయాలు తెలుగుదనాన్ని రుచి చూపిస్తాయి. మూల ఆంగ్ల కవిత – Mastering Emotions ఈ విధంగా సాగుతుంది –

Most emotions are like an unbridled horse

Using them without caution will end in remorse.

To channel them properly is not an easy task

But to suppress them and act is like wearing a mask

Our emotions seem like they rise like waves of heat

But if we look carefully, they are based on thought

Exercise control over the way thoughts form

Then you will the master of your emotional dam

దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది – అనుశీలనాత్మక అనువాదం అంటే ఏమిటో.

ప్రశ్న 10: అవసాన దశలో మృత్యువు కోసం ఎదురుచూస్తున్న వారి అంతరంగాన్ని దర్శింపజేసిన మ-రణంకవిత నేపథ్యం గురించి చెప్తారా?

జ: ఇది 99 శాతం ఇంగ్లీష్ లైన్లకి తెలుగు అనువాదమే. ఇంగ్లీష్ – Inevitable Embrace కవితకి తెలుగు రూపం. మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు మనిషి ఆలోచన ఏ విధంగా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు వ్రాసారు మూల రచయిత. దీనికి తెలుగు అనువాదానికి నాకు స్ఫూర్తి గా నిలిచిన రచనలు – యండమూరి వ్రాసిన ‘అంతర్ముఖం’ నవల, ఆనంద్ నీలకంఠ వ్రాసిన ‘Asura’ ఇంగ్షీషు నవల. రెండింటిలోనూ last minute musings అద్భుతంగా వర్ణించారు.

ప్రశ్న 11: ఈ పుస్తకం లోని ఏ కవిత మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: చాలా ఉన్నాయి. కానీ, అమ్మ మీద వ్రాసిన ‘వీడ్కోలు’ కవిత నా మనసుకు దగ్గరైన రచన. నాకు మా అమ్మ అంటే ప్రాణం. కనిష్ఠుణ్ని అవటం వల్లనేమో నాకు ఆవిడ privileged affection దొరికింది చివరి వరకూ. నాకు పెళ్ళయ్యినప్పుడు మా అత్తగారితో ‘మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పిందట! ఇంతకంటే height of care and concern ఏముంటుందీ చెప్పండి? మా అమ్మకి జబ్బు చేసి చికిత్స జరుగుతున్న రోజుల్లో దగ్గరే ఉన్న నేను చివరి రోజు జనగామలో బ్యాంక్‌లో ఉన్నాను. ఒకవేళ ఆమె death bed ప్రక్కనే ఉండి ఉంటే, నా మనః స్థితి ఎలా ఉండేదో ఆ కవితలో తెలుస్తుంది. ఆ కవిత వ్రాసినంత సేపూ, ఆది శంకరాచార్యుల వారి మాతృ పంచకం మనసులో కదలాడుతూనే ఉంది.

ప్రశ్న 12: ఈ సంపుటిలోని ఏదైనా కవిత అనువదించటం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కవితనైనా ఇంకా మెరుగ్గా అనువదించి ఉండచ్చని అనిపించిందా?

జ: ప్రతి రచనా పురిటి నొప్పుల ఫలితమే. కానీ, కొన్ని కవితలు రెండు మూడు versions వ్రాస్తే గానీ తృప్తిగా అనిపించలేదు. అలాంటి వాటిల్లో – మళ్ళీ జన్మిస్తాను, నా(లో) కం, చరమాంకం, జ్ఞాపకాలు, వీడ్కోలు, వాన చినుకులు, అన్వేషణ, అనుభూతి వంటివి కొన్ని.

ప్రశ్న 13: మనో విహారిపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకాన్ని పాఠకుల వద్దకు చేర్చేందుకు ఏయే ప్రయత్నాలు చేస్తున్నారు?

జ: ఈ పుస్తక ప్రచురణ మా మొదటి అనుభవం. కస్తూరి మురళీకృష్ణ గారు లేకపోతే, ఇది వెలుగు చూసేందుకు మరికొన్ని నెలలు పట్టేది. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే, అవసరం తెలుసుకుని ఆగమేఘాల మీద అచ్చోత్తించి ఇచ్చిన సాహితీ ప్రచురణకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మనోవిహారి మీద సమీక్ష ప్రచురిస్తున్న పత్రికల వారికీ, ఇప్పుడు రవళి పత్రికకి వ్రాస్తున్నశ్రీమతి నండూరి సుందరీ నాగమణి, సంచిక కి వ్రాస్తున్న కొల్లూరి సోమ శంకర్ గారికి నా ధన్యవాదాలు.

ఈ ప్రయత్నం మా పెద్దన్నయ్య గారి వల్ల విజయవంతం అయ్యింది. ఆయన పూనిక లేకపోతే, ఈ పుస్తకం లేదు. It is an emotional drive! మా వదిన గారి చిరకాల కోరిక. అందుకే, ప్రచురించిన 500 కాపీల్లో 99 శాతం ఉచితంగా పంచిపెట్టాం.

ప్రశ్న 14: రచయితగా, అనువాదకుడిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?

జ: ప్రస్తుతం, గోదాదేవి తిరుప్పావై కి మా స్నేహితుడి తండ్రి గారు వ్రాసిన తెలుగు గీతాలని స్వరాలు కూర్చి, మా KasturiDreamWorks లో ధనుర్మాసం ప్రతిరోజూ విడుదల చేస్తున్నాం. కొన్ని పుస్తకాల మీద సమీక్షలు వ్రాయాల్సి ఉన్నాయి. Short Movie ఒకటి చర్చల్లో ఉంది. ఇలా బహుముఖాలతో బాహాబాహీ నడుస్తోంది (నవ్వుతూ).

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కస్తూరి రాజశేఖర్ గారూ.

కస్తూరి రాజశేఖర్: ధన్యవాదాలు.

***

మనో విహారి
ఆంగ్ల మూలం: దినకర రావు పసుపులేటి
తెలుగు సేత: కస్తూరి రాజశేఖర్
ప్రచురణ: కస్తూరి ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 127
వెల: ₹ 100/-
ప్రతులకు:
కస్తూరి నాగేశ్వరరావు,
ఫ్లాట్ నెంబర్ 301, సిరి నిలయం,
కాకతీయ నగర్, రోడ్ నెం. 3,
హబ్సీగూడా
హైదరాబాద్ 500007
ఫోన్: 98493 30930, 9848378034
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Kasturi-Rajasekhar/dp/9334387882

~
‘మనో విహారి’ అనువాద కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/mano-vihari-book-review-kss/

Exit mobile version