Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, అనువాదకులు శ్రీ వారాల ఆనంద్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ఇరుగు పొరుగు’ అనే అనువాద కవితాసంపుటిని వెలువరించిన వారాల ఆనంద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం వారాల ఆనంద్ గారూ.

వారాల ఆనంద్: నమస్కారం.

~

ప్రశ్న 1. భారతీయ భాషలలోని కవితలను ఇరుగు పొరుగుపేరిట అనువదించాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? వివరించండి.

జ: వాస్తవానికి ‘అనువాదం’ నా ఫస్ట్ లవ్ కాదు. సృజనాత్మక రంగంలో అర్థవంతమయిన సినిమా, కవిత్వం, జర్నలిజం నా సహచరులయ్యాయి. అట్లా వాటితో నా ఇష్టం కృషీ కొనసాగాయి. ఒక రోజు కాదు దశాబ్దాలపాటు ఆ ప్రేమ ఇష్టం కొనసాగాయి. అవన్నీ నా జీవిత గమనంలో నాతోపాటు కొనసాగాయి. అయితే 2014లో ఊహించని విధంగా అనారోగ్యం చుట్టేయడం తర్వాత 2016 ఉద్యోగ విరమణ అనంతరం అప్పటివరకు నాకున్న ఫిలిం సొసైటీ కార్యక్రమాలు, సాహితీ సంస్థల సభలు వీటన్నింటి నుంచి కొంత విరామాన్ని తీసుకున్నాను. అంతేకాదు దాదాపు నా పూర్తి సమయాన్ని చదవడానికి రాయడానికి పూనుకున్నాను. అప్పుడు అనిపించింది నిజంగా ఇది కదా నా ఉనికీ, చిరునామా అని. తొలి రోజుల్లో అంటే 80లలో కొన్ని కథలు రాసినప్పటికీ కవిత్వమే నా ఉచ్వాస నిశ్వాస అయిపొయింది. అంటే దాదాపుగా నా ఫస్ట్ లవ్ అయిపొయింది. ఎంతగా అంటే “నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు/సగం శబ్దం సగం నిశబ్దం/శబ్దమేమో బతుకు ఏడుపులోంచి ఎగిసిపడుతున్నఎక్కిళ్ళు/నిశబ్దమేమో బతుకు చేతగానితనం లోంచి వ్యక్తమవుతున్న మౌనం”. అంతే కాదు “కవిత్వం సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప/బతుకు సమరంలో నిలబెట్టే లంగరు” అని రాసుకున్నాను. అదే క్రమంలో తెలుగు కవిత్వం చదవడం రాయడం మాత్రమే కాదు వివిధ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, కవితా వ్యక్తీకరణలు ఎట్లా వున్నాయో చూద్దాం అని వివిధ భాషా కవులని చదవడం ఆరంభించాను. నిజానికి హిందీ మొదటినుంచీ నాకు చాలా బాగా కాదు కానీ కొంత తెలుసు. నేను సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచీ హిందీ సినిమాలు పాటలు బాగా ఇష్టపడ్డాను. ఆ క్రమంలో గుల్జార్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. ‘ఆనంద్’ సినిమాలో ఆయన రాసిన మాటలు, తర్వాత ఆయన దర్శకుడిగా తీసిన కోషిశ్, ఆంధీ లాంటి అనేక సినిమాలు, టీవీ సీరియల్ ‘మీర్జా గాలిబ్’ నా స్మృతిలో అట్లా ఉండిపోయాయి. అందుకే ఇతర భారతీయ భాషా కవులు అనగానే నాకు మొదట గుల్జార్ కవిత్వం గుర్తు కొచ్చింది. ఆయన కవితా సంకలనాలు ‘Green Poems’, ‘Neglected Poems’, ‘Suspected Poems’, ‘Foot Prints on Zeroline’ తదితరాలు తెప్పించుకుని చదవడం మొదలు పెట్టాను. వాటిల్లో నాకు నచ్చిన ‘గ్రీన్ పోయెమ్స్’ని ‘ఆకుపచ్చ కవితలు’ పేర తెలుగులోకి అనువదించాను. అది చాలామందికి నచ్చింది. అంతే కాదు కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం కూడా వచ్చింది. అదంతా అట్లా ఉండగానే నా కవితాధ్యయనం కొనసాగుతూనే వచ్చింది. గుల్జార్ అనువదించిన టాగోర్ ‘భాగ్ బాన్’ నాకో పెద్ద ఐ ఓపెనర్. దాంతో వివిధ భాషల కవిత్వం చదవే ఉధృతిని పెంచాను. సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ బి. నరసింగ్ రావు రూపి కౌర్ రాసిన ‘మిల్క్ అండ్ హనీ’ పంపారు. మరో పక్క సాహిత్య అకాడెమి వెలువరిస్తున్న ‘Indian Literature’ ను క్రమం తప్పకుండా చదవడం సాగించాను. మన దేశంలోని వివిధ భాషల్లో వస్తున్న కవితల్ని మరింత విస్తారంగా చదవాలని తలపోసాను. అప్పుడు నాకు లభించిన గొప్ప సంకలనం గుల్జార్ అనువదించిన ‘A Poem A Day’. ఈ సంకలనాన్ని ఆన్‌లైన్‌లో తెప్పించడానికి దాని ధర చూసి నేను కొంత ముందూ వెనకా ఆలోచించాను. కానీ మా అబ్బాయి అన్వేష్ నాకు చెప్పకుండానే తెప్పించాడు. దాన్ని చూసిన నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అది ఒక బృహత్తర సంకలనం. దాదాపు వెయ్యి పేజీలతో మూల కవితల హిందీ ఇంగ్లీష్ అనువాదాలతో వుంది. అందులో గుల్జార్ తాను చదివి తనకు నచ్చిన 279 మంది 34 భారతీయ భాష కవులు రాసిన 365 కవితల సంకలనమది. ఒక్కసారిగా నా కాన్వాస్ మొత్తం భారతీయ భాషా పరిధిని సంతరించుకుంది. దాదాపు ఎనిమిదేళ్ళ పాటు ఒక ప్రాజెక్ట్‌గా గుల్జార్ చేసిన ఈ అనువాదాలు చాలా గొప్పగా వున్నాయి. ఆ సంకలనంతో పాటు కే. సచ్చిదానందన్ సంపాదకత్వంలో వచ్చిన NBT వారి ‘Signatures-One Hundred Indian Poets’, ఆయన సంపాదకత్వంలోనే కరోనా కాలంలో వెలువడ్డ ‘Singing In The Dark’ (A Global Anthology of Poetry Under Lockdown), ఇంకా ‘GESTURES-Poetry From SAARC Countries’ లాంటి అనేక కవితా సంకలనాలలోని ఆయా భాషల కవిత్వాన్ని ఇంగ్లీష్‌లో చదువుతూ ఎంతో ఉత్సాహాన్ని పొందాను. చీకటి రోజుల్లో కవిత్వం వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది చీకటి రోజుల గురించే వస్తుంది అన్నట్టుగా నా అధిక కాలమంతా కవిత్వాన్ని చదవడం కొనసాగించాను. అవి చాలా సృజనాత్మకమయిన గొప్ప అనువాదాలు.

తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం నా బాధ్యత అని అనుకుని నాకు నచ్చిన కవితల్ని తెలుగులోకి అనువదించి అందించాలనుకున్నాను. ఆ దిశలో మన ఇరుగు పొరుగు భాషలనుంచి చేసిన అనువాదాలే కనుక ‘ఇరుగు పొరుగు’ పేర ప్రచురించాను. వీటిని మొదట మిత్రుడు కాసుల ప్రతాప రెడ్డి సంపాదకత్వంలో ఆసియా నెట్ ఆన్‌లైన్ పత్రికలో వారం వారం వేసారు. అట్లా రూపొందిందే ఈ ‘ఇరుగు పొరుగు’.

ప్రశ్న 2. మూల కవితలలోని ఏ అంశం మిమ్మల్ని ఆకర్షించి అనువాదానికి పురికొల్పింది? కవి భావజాలమా? కవిత లోని ఉద్వేగమా? లేక ఆ కవిత కలిగించిన అనుభూతా?

జ: నిజానికి అనువాదం అంటే అనుసృజనే. సాహిత్యానికి సృజన అనువాదాలు రెండూ రెండు కళ్ళ లాంటివి. అనువాదం భాషా సంస్కృతుల వారధి. అనువాదం అంటే కేవలం ఒక భాషలోంచి మరో బాషలోకి మాటల్ని అనువదించడం మాత్రమే కాదు. ఆయా భాషలు, వాటిని మాట్లాడే ప్రజలు, వారి సామాజిక నేపథ్యం అన్నీ అనువాద క్రమంలో పరిగణనలోకి వస్తాయి. భిన్న భాషలు విభిన్న వ్యక్తులు వారి వ్యక్తీకరణలు అన్నీ అనువాదానికి భూమికలవుతాయి. ఆందుకే అనువాదం కనిపించినంత సులభమయింది కాదు. అందులో కవిత్వం మరింత క్లిష్టం. మూల రచనను అర్థం చేసుకుని ఆ కవిని ఆయన చెప్పదలుచుకున్న విషయాన్నీ అవగతం చేసుకోవాలి. ప్రతి భాషకూ తమవయిన జాతీయాలూ, పదబంధాలూ వుంటాయి అవన్నీ పరిశీలించాల్సిన అంశాలే. ఇక ఇరుగుపొరుగు కోసం నేను ఎంచుకున్న కవితలన్నీ నాకు బాగా నచ్చినవి. మనసుకు హత్తుకున్నవి. యాంత్రికతా కృత్రిమతా లేకుండా అనువాదానికి అనుకూలమయినవి తీసుకున్నాను. నిజానికి భారతీయ భాషలు ఒకదాని నుంచి మరొక దానికి అనువదించడానికి ఎంతో అనువయినవి. ఎక్కువ అవకాశాల్నిచ్చేవి. నేను చూసినంత వరకు భారతీయ కవుల్లో అధిక శాతం తాము తీసుకున్న వస్తువుల్లో కాని, వారు కలిగించే ఉద్వేగం కానీ ఒకే స్థాయిలో ఉంటాయి.. నేను ఎంచుకున్న కవితలన్నీ దాదాపుగా వర్తమాన కవులవే. అంటే ఇప్పుడు ఈ సంఘర్షణాత్మక కాలంలో భారతీయ కవులు ఏ రీతిగా ఆలోచిస్తున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు అన్నది ఈ కవితలు చదివితే అర్థం అవుతుంది.

ఇరుగు పొరుగు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డి

ప్రశ్న 3. ఈ పుస్తకంలో ఎక్కువగా ఏ కవి కవితలున్నాయి? ఏ భాష నుండి ఎక్కువ కవితలను అనువదించారు? వివరించండి.

జ: ఇరుగు పొరుగు అనువాదాల్ని ఒక ప్రణాళికతో కాని లేదా ప్రాజెక్ట్ లాగా అనుకుని మొదలు పెట్టలేదు. నేను ఆర్తితో అభిమానంగా చదువుతూ వచ్చిన కవులు వారి కవితల్ని అనువదించాలి అనుకుని మొదలు పెట్టాను. ఏదో ఒక భాష నుంచి ఎక్కువా మరో భాష నుంచి తక్కువా అని ఆలోచించలేదు. ఇప్పటికి భారత రాజ్యాంగం తన 8వ షెడ్యూల్ లో అధికార భాషలుగా 22 భాషల్ని ఆమోదించింది. కాని మన దేశంలో లిఖిత మౌఖిక భాషలు మరెన్నో వున్నాయి. నేను ఇప్పటికీ 29 భారతీయ భాషల నుంచి 90 మందికి పైగా కవులు రాసిన కవితల్లోంచి 150కి పైగా కవితల్ని అనువదించి ఈ సంకలనంలో చేర్చాను. వాటిల్లో అస్సామీ, కాశ్మీరీ, గుజరాతీ, మలయాళీ, కొంకణీ, సంబల్పురి, ఒడియా, డోగ్రీ తదితర భాషలున్నాయి. ఈ కవితల్ని అనువదించే క్రమంలో ఆయా కవుల జీవితమూ ఇతర రచనలు, జీవిత దృక్పథాలూ అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. వాళ్ళ గురించి చదివాను. ఆ దిశలోనే దాదాపు ముప్పై మంది కవుల ప్రొఫైల్ ఆర్టికల్స్ రాసాను. అవి వివిధ పత్రికల్లో వివరంగా వచ్చాయి. టాల్ ఆన్లైన్ రేడియోలో PODCAST చేసాను. వాటి సంకలనం కూడా తెవాల్సివుంది.

ప్రశ్న 4. మూల భాషల కవితలను ఆంగ్ల భాషామాధ్యమం ద్వారా అనువదించారు కదా, ఏ సందర్భంలోనైనా losses in translation సమస్య మీకెదురయిందా? ఒకవేళ ఆ సమస్య తలెత్తితే, ఎలా పరిష్కరించుకున్నారు?

జ: అనువాదం ఒక సృజనాత్మక ప్రక్రియ. ఏదయినా అనువాదం కృత్రిమంగా మక్కీ టు మక్కీగా లేకుండా వుండాలంటే అనువాదకుడు సృజనశీలి అయివుండాలి. మూలం నుంచి అనువాదం చేసినప్పుడు లక్ష్యభాషలో అనువాదోచితమయిన భాషను జాతీయాల్ని పలుకుబళ్ళను ఉపయోగించడానికి అనువాదకుడు సృజనాత్మకత కలిగి వుండాలి. మూల రచయితకు విధేయుడు కూడా అయి వుండాలి. ఇక కవిత్వంలో ధ్వనించే శబ్దం అనువాద సాధ్యం కాదనే అనుకుంటాను. కాని మూల భాషలోని ధ్వనిని లక్ష్య భాషలోకి తేవాలనుకున్నప్పుడు ఆ భాషలో శబ్ద గౌరవం తెచ్చే పని చేయాలి. ఇదంతా మూల భాషలోంచి నేరుగా అనువదించినప్పుడు. ఇక కవిత్వాన్ని ఇంగ్లీష్ భాషా మాధ్యమంగా చేసినప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. మూలంలోంచి ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికే loss in translation వుంటే తెలుగులోకి తెచ్చినప్పుడు మరింత లోటు జరిగే అవకాశం లేకపోలేదు. నేను ఇరుగుపొరుగు కోసం అనువాదాలు చేసినప్పుడు కేవలం ఇంగ్లిష్ మాత్రమె కాకుండా వాటి హిందీ వెర్షన్స్ కూడా చూసాను. ఇక ఏమయినా అనుమానాలు, ఇబ్బందులు ఎదురయినప్పుడు సాధ్యమయినంత వరకు అందుబాటులో వున్న మూల కవుల్ని ఫోన్లోనో మెయిల్ లోనో సంప్రదించే ప్రయత్నం చేసాను. ఇక మూల కవి స్వరాన్ని పట్టుకోవాలి. దానికోసం నేను అనువదించాలనుకున్న కవితలతో పాటు ఆ కవి రాసిన ఇతర కవితలనీ చదివే ప్రయత్నం చేసాను.

ప్రశ్న 5. ఈ పుస్తకంలో ఏవైనా కవితలు ప్రతీకాత్మకంగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి అనువాదంలో సులువుగా ఒదిగాయా?

జ: ఈ సంకలనంలో వున్న కవుల్లో గొప్ప వైవిధ్యముంది. ఎందుకంటే ఆయా కవులు పుట్టి పెరిగిన ప్రాంతాలు, సంస్కృతులు వేర్వేరు. ఎందుకంటే నిలిం కుమార్ ఆస్సామీ, కుసుమాగ్రజ్ మరాఠీ, ఆఘా షాహిద్ అలీ కాశ్మీరి, సచ్చిదానందన్ మలయాళీ, హల్దార్ నాగ సంబల్పురి ఇట్లా వివిధ ప్రాంతాలు వివిధ నేపథ్యాలు వున్న కవుల రచనల్లో ఎంతో వైవిధ్యం వుంది. మనుషుల పట్ల ఆర్తి, అణచివేత పట్ల కోపం, ప్రకృతి పట్ల ప్రేమ సాధారణంగా కన్పించినప్పటికీ ఒక్కో కవి కంఠ స్వరం వేరు.. వారి రచనల్లో కనిపించే ప్రతీకలూ భిన్నమయినవి. గుల్జార్ ఇమేజెస్, జావేద్ అక్తర్‌లో వ్యంగ్యం ఆవేశం, సుగతకుమారిలో కనిపించే సామాజిక అంశాలు భిన్నమయినవి. అట్లే ఆఘా షాహిద్ అలీలో కనిపించే వేదన, రూపి కౌర్‌లో కనిపించే ప్రేమ సున్నితత్వం వేర్వేరు. వాటన్నింటిని సాధ్యమయినంత మేర తెలుగులోకి తెచ్చాను. ఎంత మేరకు సాధించగలిగానో పాఠకులే చెప్పాలి.

ప్రశ్న 6. ఏదైనా కవితని అనువదిద్దామని అనుకుని, తెలుగులో భావమో, పదాలో కుదరక – వదిలేసిన సందర్భాలున్నాయా?

జ: ప్రతి కవీ తనదయిన శైలీ, భాష, వ్యక్తీకరణలని కలిగి ఉంటాడు. అంతే కాదు ఆ కవిత రాసినప్పతటి కాలం, అప్పటి సామాజిక నేపథ్యం కవికుండే అవగాహన తదితర అనేక కారణాలు ఆ కవిత రూపొందే క్రమాన్ని నిర్దేశిస్తాయి. అట్లా వివిధ స్థాయిలలోని కవులు రాసిన కవితల్లో భిన్న స్థాయిలుంటాయి. చదివినప్పుడు అర్థం అవుతాయి. మనసుకు హత్తుకుంటాయి. కాని వాటిని అనువదించాల్సి వచ్చినప్పుడు ఒక కవి రాసిన అన్ని కవితల్ని అనువదించడం సాధ్యపడదు. యథాతథానువాదానికి పూనుకుంటే కృత్రిమంగా వుండి ఇబ్బంది పెడుతుంది. ఇరుగుపొరుగు విషయంలో నేనూ చాలానే ఎదుర్కొన్నాను. మమాంగ్ దాయి, కుసుమాగ్రజ్, మోహన్ ఆలోక్ లాంటి వారి కవితల్ని అనువదించినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. వాళ్ళవే కొన్ని సులువుగా చేయగలిగాను.

నిజానికి అనువాదకునికి తనదయిన ఒక శైలి వుండాలి. అట్లాగే తన స్వీయ సృజనాత్మకత కూడా మంచి అనువాదానికి తోడ్పడుతుంది. అప్పుడే అనువాదంలో కూడా మూలంలో వున్న భావ లయ ప్రతిఫలిస్తుంది. విస్తృత అధ్యయనమే మంచి అనువాదానికి తోడ్పడే ప్రధాన పనిముట్టు.

ప్రశ్న 7. అనువాద కవితలకు మీరిచ్చిన శీర్షికలు కొన్ని సాధారణంగా ఉంటే, మరికొన్ని విభిన్నంగా ఉన్నాయి. కలల ప్రవేశ ద్వారం మూసుకుపోయింది’, ‘మిత్రమా యవ్వనాన్ని కోల్పోయాం’, ‘ఓ వింతయిన రోజు’, ‘వాళ్ళల్లో ఒకన్నివంటి శీర్షికలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవి మూల కవి/ఆంగ్ల అనువాదకులు పెట్టిన పేర్లకు సమానమైనవా లేక మీరు కవితలోని సారాంశాన్ని బట్టి ఆ శీర్షికలను ఎంచుకున్నారా?

జ: ఏ కవితకయినా శీర్షిక ప్రధాన ద్వారం. చాలా సార్లు చదువరి శీర్షికను చదివి కవితలోకి వెళ్తాడు. మీరన్నట్టుగా కొన్నిశీర్షికలు విభిన్నంగా వున్నాయి. చాలా సందర్భాల్లో మూల కవినే అనుసరించాను. ఎక్కడో ఒక చోట తప్ప. అది కూడా తెలుగు భాషానుగుణంగా నిర్ణయం తీసుకున్నాను.

ప్రశ్న 8. గుల్జార్ గారి ‘మేల్కొను, మేల్కొనూ, మెలకువగా ఉండు’ అనే ఉర్దూ కవిత శీర్షిక – మేల్కొనమని, మెలకువగా ఉండమని చెప్తోంది. ఆ రెండు పదాలకు సామన్యార్థం ఒకటే అయినా.. శీర్షికలో రెండింటినీ ఉపయోగించారంటే.. తప్పకుండా అంతరార్థం ఉండి ఉంటుంది. ఆ కవిత ఇంకా చదవని పాఠకుల కోసం ఆ అంతరార్థాన్ని వివరిస్తారా?

జ: కవిత, నవల, కథ ఏదయినా సృజనాత్మక రచనల్లో ఒక మాటను లేదా కొన్ని మాటల్ని పునరావృతం చేస్తారు. అట్లా చేయడం ద్వారా ఆ కవి లేదా రచయిత తాను చెప్పదల్చుకున్న భావాన్ని మరింత స్పష్టంగా సూటిగా నొక్కి చెప్పినట్టు అవుతుంది. నవీన్ గారి ‘అంపశయ్య’ నవలను తీసుకుంటే అందులో తాళం వేస్తున్నాడు తీస్తున్నాడు అంటూ రిపీట్ చేస్తాడు. ఆ పాత్ర మానసిక స్థితిని అది ఆవిష్కరిస్తుంది. అట్లే గుల్జార్ రాసిన కవితలో ‘ఎవరయినా పేరేమిటని అడిగితే భయమేస్తుంది.. ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తుంది’ అంటాడు ఆ నేపథ్యంలో మేల్కొను మేల్కొను అనడంలో కూడా కవికున్న ఆందోళన మరింత స్పష్టంగా వ్యక్తమవుతున్నది. శ్రీశ్రీ కూడా పదండి ముందుకు పదండి తోసుకు అంటూ పదండి పదండి అని రిపీట్ చేయడం వల్లే ఆ ఊపు వచ్చింది కదా.

ప్రశ్న 9. ఈ పుస్తకం లోని కవితలను ఈ క్రమంలోనే (ఇండెక్స్) అమర్చడంలో ఏదైనా కారణం ఉందా లేక ఇది యాదృచ్ఛిక అమరికా?. కొందరు కవులు – అకారాది క్రమమో లేక, కవితల నేపథ్యం అనుసరించే వరుసక్రమాన్ని రూపొందిస్తున్నారు. మీరు ఏ పద్ధతిని పాటించారు?

జ: కవితల అమరిక కేవలం యాదృచ్ఛికమే. నేను అనువదించిన క్రమంలోనే రూపొందింది. అకారాది క్రమమో లేదా ఒక్కో భాషా కవితలన్నీ ఒక చోట అమర్చి ఇండెక్స్ అమరిస్తే బాగుండేది అని తర్వాత నాకు కూడా అనిపించింది.

ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏ కవిత మీకు బాగా నచ్చింది? ఎందుకు? నచ్చిన కవితలనే అనువదించి ఉంటారు, అయినా ఏదో ఒక కవిత మీ మనసులో జొరబడి, వేధించి, వెంటాడి తెలుగులోకి మారి ఉంటుంది కదా? అలాంటివి ఏవైనా ఉన్నాయా?

జ: నేను ముందే చప్పాను నేను చదివి నాకు నచ్చినవే అనువదించానని. వాటిల్లో బాగా నచ్చినవి అంటే ముఖ్యంగా ఇవ్వాళ గొప్ప కవిత్వం ఈశాన్య రాష్ట్రాల్లోంచి వస్తున్నది. మమంగ్ దాయి, నిలిం కుమార్, నీలమణి ఫూకన్ లాంటి కవుల కవితల్లో వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్, వ్యక్తీకరణ చాలా గొప్పగా వున్నాయి. ఈశాన్యంలో మంచి కవిత్వం ఎందుకొస్తున్నదంటే అక్కడ సంఘర్షణ వుంది.అదే కవితలలో కనిపిస్తున్నది. ఇక సంబల్పురిలో రాసిన హల్దార్ నాగ్ రాసిన కవితలు డౌన్ టు ఎర్త్. ఇక రూపికౌర్ రాసిన ఆధునిక వ్యక్తీకరణ ఈ తరానికి నచ్చే విధంగా వుంది. వాటిని ఇంస్టాగ్రాం కవితలు అంటాను.

ఇంకా నాకు నచ్చిన కవులు కవితల గురించి చెప్పాలంటే గుల్జార్, జావేద్ అక్తర్, జయంత్ మహాపాత్ర, సచ్చిదానందన్, పద్మా సచ్దేవ్, సుగత కుమారి ఇట్లా నచ్చిన వాళ్ళు చాలా మందే వున్నారు.

ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కవిత అనువదించడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కవితనైనా ఇంకా మెరుగ్గా అనువదించి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘Revisiting always Rejuvenate’. ఏ రచనయినా మరే కళా రూపమయినా పునర్దర్శించినప్పుడు లేదా మళ్ళీ చదివినప్పుడు కొత్త ఆలోచనలూ కొత్త చైతన్యమూ జనిస్తాయి. ఇంతకంటే బాగా రాసి లేదా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. దాదాపు మూడేళ్ళపాటు ఈ అనువాదాలు చేసాను. మళ్ళీ మళ్ళీ చదివాను రీరైట్ చేసాను. చాలావరకు ఇష్టంగానే శక్తిమేరకు చేసాను అనుకుంటాను. ప్రింటింగ్ విషయంలో మరింత జాగ్రత తీసుకోవాల్సింది అనుకుంటాను.

ప్రశ్న12. మరణంకవిత తేలికగా అర్థమవుతున్నట్టే ఉండి, కొద్దిగా లోతుకి వెళ్తే చాలా మార్మికంగా అనిపిస్తుంది. ఈ కవిత అనువదించినప్పటి అనుభవాలు పంచుకుంటారా?

జ: శక్తి చటోపాద్యాయ్ రాసిన ‘మరణం’ కవిత లోతయిన కవిత. అలతి అలతి మాటల్లో కవి గొప్ప తాత్వికతను చెప్పాడు. నిజానికి చావు గెలుపా? ఓటమా?. తనకిష్టమయిన నది ఒడ్డున కాలుతున్న శవం చితిమంటల వేడిని తట్టుకోలేక లేచి ఓ గుక్కెడు నీళ్ళు అడగొచ్చు అంటూనే అప్పుడు చావుకు ఓటమే ‘విజయం’ దక్కదు అంటాడు కవి. అత్యంత లోతయిన విషయాన్ని ఆలోచనాత్మకంగా సరళంగా చెప్పాడు. నన్ను బాగా ఆలోచనల్లోకి గుండెలోతుల్లోకి తీసుకెళ్ళిన కవిత.

ప్రశ్న13. నేను రూపొందించిన పాత్రకవితలో చివరి వాక్యాలలో కవి ఓ ప్రశ్న వేస్తాడు. మూల కవికి ఏం సమాధానం లభించిందో మీరు ఊహించగలరా?

జ: చంద్రశేఖర కంబార కన్నడ కవి, నాటక రచయిత. కేంద్ర సాహిత్య అకాడెమి అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. సినీ దర్శకుడు కూడా. ఆయన రాసిన ‘నేను రూపొందించిన పాత్ర’ కవిత అధివాస్తవిక ధోరణిలో సాగుతుంది. తన నాటకంలోని ఒక పాత్రనే వేదిక మీదినుంచి దిగివచ్చి పక్కనే కూర్చోవడం తాను బయటికి వెళ్తే వెంటే రావడం ఇదంతా ఇట్లా వుంటే ‘నా ఎదుట అద్దంలా నిలబడ్డాడు’ అంటే ఆ పాత్ర తానే అన్నట్టు సూచన. తానే కాదు లోకంవేదిక మీద పాత్రలన్నీ ఈ లోకంలోని మనుషులే అని కూడా సూచన. చిత్ర విచిత్రంగా ప్రవర్తించే లోకం పోకడల్ని కవితలో సూచించాడు కవి. మార్మిక కవిత.. ఈ కవితే కాదు ఆయన జానపద పౌరాణిక గాథల్ని వర్తమాన జీవితాలకు అన్వయించి కలగలిపి కవిత్వం రాసారు.

ప్రశ్న14. ఇరుగు పొరుగుపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా, ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: భిన్న భాషలు భిన్న సంస్కృతులతో అలరారుతున్న మన దేశంలోని వివిధ భాషల్లోని ఇంతమంది కవుల్ని చదవడం, అనువదించడమే గొప్ప అనుభవం. కాశ్మీర్ కవి ఆఘా షాహిద్ అలీ ఏమి రాసారు, సినీ రంగానికి చెందిన దర్శకుడు విశాల్ భరద్వాజ్, సీనియర్ నటి దీప్తి నావల్ లాంటి వాళ్ళు ఏం రాస్తున్నారో ఈ ఇరుగు పొరుగు వల్లే తెలుసుకోగలిగాను. ఇక ప్రవాసిని మహాకుద్, నిలిమ్ కుమార్, అపూర్వ నారాయణ్, సచ్చిదానందన్, గుల్జార్ తదితరులతో మాట్లాడ్డం గొప్ప అనుభూతి. ఎంతో గొప్ప ప్రేరణ.

ప్రశ్న15. చిన్నతనంలో రేడియోలో విన్న హిందీ సినిమా పాటల వల్లా, పెద్దయ్యాకా చూసిన ఆర్ట్ సినిమాల వల్ల ఇతర భాషలపై ఆసక్తి కలిగిందని ముందుమాటలో అన్నారు కదా, సినిమాలకీ, కవిత్వానికి సంబంధం ఉందని మీరు భావిస్తున్నరా?

జ: నేను చెప్పినట్టు సినిమా కవిత్వం రెండూ కళాత్మక వ్యక్తీకరణలే. కానీ కవిత్వం వ్యక్తిగత వ్యక్తీకరణ, సినిమా సమిష్టి కళల వ్యక్తీకరణ. అర్థవంతమయిన భావయుక్తమయిన ఆ రెంటినీ ఇష్టపడతాను. మనిషినీ సమాజాన్నీ పట్టించుకునే ఆ రెండూ నాకు ఊపిరుల్లాంటివి, ఇక అనువాదం సాహిత్య సృజన లాంటిదే.

ప్రశ్న16. ఇరుగు పొరుగుమీ నిరంతర అనుసృజనా ప్రక్రియలో మొదటిది అని అన్నారు. ఇరుగు పొరుగురెండవ సంపుటి సిద్ధమవుతోందా? పాఠకులకు ఎప్పటికి అందుబాటులోకి రావచ్చు?

జ: నేను ఇంతకు ముందే చెప్పినట్టు అధ్యయనం, రచన నా లైఫ్ లైన్. ఇరుగు పొరుగు రెండవ సిరీస్ అనువాదాలు ఆరంభించాను. కొనసాగుతున్నాయి. వీలయినంత తొందరలో రెండవ సంకలనం తీసుకురావాలి.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు వారాల ఆనంద్ గారూ.

వారాల ఆనంద్: ధన్యవాదాలు.

***

ఇరుగు పొరుగు (అనువాద కవిత్వం)
రచన: వారాల ఆనంద్
ప్రచురణ: పొయట్రీ ఫోరమ్, కరీంనగర్
పేజీలు: 235
వెల: ₹150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
వారాల ఇందిర రాణి,
ఇంటి నెంబరు 8-4-641, హనుమాన్ నగర్
కరీంనగర్. తెలంగాణ – 505001
ఫోన్: 94405 01281
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/irugu-porugu-anuvaada-kavitvam

~

‘ఇరుగు పొరుగు’ పుస్తక సమీక్ష
https://sanchika.com/irugu-porugu-book-review-kss/

Exit mobile version