Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవలా రచయిత శ్రీ విజయ్ అప్పల్ల ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘అమలోద్భవిలో అర్జునుడు’ అనే నవల వెలువరించిన విజయ్ అప్పల్ల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం విజయ్ అప్పల్ల గారూ.

విజయ్ అప్పల్ల: నమస్కారం.

~

ప్రశ్న 1: ‘అమలోద్భవిలో అర్జునుడు’ అనే జానపద నవల వెలువరించినందుకు అభినందనలు. భగవద్గీతలోని సందేశాన్ని జానపద నవలగా మలచాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా వచ్చింది?

జ: ముందుగా అభినందనలకు ధన్యవాదాలు. జానపద నవల రాయాలని నిర్ణయించుకున్నప్పుడు, మహాభారతంలో చాలా మందికి తెలియని ఒక ఘట్టాన్ని తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. మహాభారతం పట్ల నాకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. భగవద్గీత చదివిన తర్వాత నా ఆలోచనా విధానంలో ఒక స్థిరత్వం, ఒక అంతర్ముఖ దృష్టి ఏర్పడింది.

ఆ అనుభూతినే కథారూపంలో వ్యక్తపరచాలని అనిపించింది. గీతలోని సందేశాన్ని జానపద శైలిలో మలిస్తే పాఠకులకు మరింత సన్నిహితంగా చేరుతుందని భావించాను. అలా ‘అమలోద్భవిలో అర్జునుడు’ రూపుదిద్దుకుంది.

ప్రశ్న 2: ఇది మీ నాల్గవ నవల. ఈ నాలుగు భిన్నమైన జానర్లవి. ఇది యాదృచ్చికమా లేక ప్లాన్ ప్రకారం డిఫరెంట్ జానర్లను ఎన్నుకున్నారా?

జ: మొదటి మూడు నవలలు ప్లాన్ ప్రకారం వేర్వేరు జానర్లలో రాయలేదు. నాకు కథను సస్పెన్స్‌తో, థ్రిల్‌తో చెప్పడం అంటే ప్రత్యేకమైన ఇష్టం. అందుకే కథల నేపథ్యం వేర్వేరుగా ఉన్నా, వాటిని చెప్పే విధానం, కథను నడిపించే తీరు మాత్రం పాఠకుడిని కట్టిపడేసేలా ఉండాలని చూసాను.

నాలుగో నవల మాత్రం ప్రత్యేకంగా జానపద శైలిలో రాయాలనే సంకల్పంతోనే ప్రారంభించాను. ఒక రచయితగా జానర్ ఏదైనా కావచ్చు, కానీ కథలో థ్రిల్, సస్పెన్స్ ఉండాలి; పాఠకుడిని ఒక ప్రత్యేకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లాలి. అదే నా రచనల ప్రత్యేకత అని చాలా మంది పాఠకులు చెబుతుంటారు.

ప్రశ్న 3: మీరు సాఫ్ట్‌వేర్ రంగానికి చెందినవారు. సాహిత్యం మీద అభిరుచి ఎప్పుడు ఎలా కలిగింది? మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?

జ: (నవ్వుతూ) – ఇది కొంచెం పెద్ద కథ!

నాకు చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం, వినడం అంటే చాలా ఇష్టం. కానీ నన్ను నిజంగా రచన వైపు మళ్లించింది సినిమాలే. ఇంటర్ చదువుతున్నప్పుడు సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్తో కూర్చుని “ఈ సీన్ ఇలా తీస్తే బాగుండేది కదా?” అని గంటల తరబడి చర్చించేవాడిని. ఒక సన్నివేశం ఎక్కడ రివీల్ చేయాలి, కథలో ఎక్కడ మలుపు ఇవ్వాలి – ఇలాంటి ఆలోచనలు అప్పుడే మొదలయ్యాయి. మనసులో ఎన్నో కథలు తయారవుతూ ఉండేవి.

కానీ వాటిని కాగితం మీద పెట్టడానికి చాలా ఆలస్యం అయింది. దానికి ఒక చిన్న కారణం ఉంది – నా హ్యాండ్ రైటింగ్! (నవ్వుతూ) 10th క్లాస్ వరకు అమ్మ నన్ను చూసి “డాక్టర్ అవుతావేమో రా!” అనేది. బహుశా ఆ దస్తూరి అలవాటైపోయిందేమో!

2001 నుంచి 2017 వరకు నేను ఏమీ రాయలేదు. కానీ కథలు మాత్రం నా లోపలే తిరుగుతూనే ఉండేవి. ఆ ఆలోచనలకు సరైన వేదిక దొరికింది కెనడాలో. Telugutalli.ca అనే ఆన్లైన్ పత్రిక మొదలవుతుండగా, కథలు పంపమని అడిగారు. అప్పుడు మొదటిసారి రాయడం మొదలుపెట్టాను. కంప్యూటర్లో టైప్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ సమస్య పోయింది – కానీ స్పెల్లింగ్ తప్పులు మాత్రం చాలా వచ్చేవి! అయినా ఆగలేదు.

అక్కడి నుంచి రచన నాకు మొదట అలవాటు అయింది, తర్వాత నెమ్మదిగా వ్యసనంగా మారింది.

“A good book is a good friend” అంటారు కదా? నేను మాత్రం “Writing is your best teacher” అంటాను. ఎందుకంటే రాయడం ద్వారా నన్ను నేను ఎక్కువగా తెలుసుకున్నాను. నా ఆలోచనలను పదాల్లో చూసినప్పుడు – అదే నా అసలైన ప్రయాణం మొదలైన క్షణం.

ప్రశ్న 4: ఈ నవలని మీరు మీ ‘మెదడు’కి, ‘మనోధైర్యం’కి అంకితం ఇచ్చారు. ఈ అంకితంలోని ఆంతర్యాన్ని మా పాఠకులకు వివరిస్తారా?

జ: అందరిలాగే నా జీవిత ప్రయాణం కూడా ఎప్పుడూ సాఫీగా సాగలేదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ గందరగోళ పరిస్థితులే నాకు ఎన్నో పాఠాలు నేర్పి, నా బలంగా మారాయి.

నా మొదటి మూడు నవలల కథలు 2021 నాటికే పూర్తయినా, అవి పుస్తక రూపంలో రావడానికి 2023–2024 వరకు సమయం పట్టింది. ఆ విరామంలో ఎన్నో కథలు రాసినప్పటికీ, ఏ నవలనూ పూర్తి చేయలేకపోయాను. ఆ సమయంలో నాలో ఎన్నో ప్రశ్నలు, అనిశ్చితి, అంతర్మథనం. ‘భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలా? ఇక్కడే స్థిరపడాలా?’ అన్న సందిగ్ధత, ఆరోగ్యంలో ఇబ్బందులు, నా ఉద్యోగ బాధ్యతలు.. ఇలా ఎన్నో వ్యక్తిగత ఆందోళనలు. పైకి ఎవరికీ కనిపించకపోయినా, నాలో ఒక తెలియని తడబాటు ఉండేది.

కొత్త కథ రాయాలన్న తపన ఉన్నా.. “మొదలుపెడితే పూర్తి చేయగలనా?” అన్న సందేహం నన్ను ఎన్నోసార్లు ఆపేసింది. కానీ కొంత విరామం తర్వాత, నన్ను నేను మళ్లీ కూడదీసుకున్నాను. నాలోని భయాన్ని, అనిశ్చితిని పక్కనపెట్టి, కొత్త ఉత్సాహంతో ‘అమలోద్భవిలో అర్జునుడు’ నవలను ప్రారంభించాను. ఈసారి ఎక్కడా ఆగలేదు, ఎంతో ఆత్మవిశ్వాసంతో పూర్తిచేశాను.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆలోచనలను ఆపని నా ‘మెదడు’కి, మధ్యలో వదిలేయకుండా నన్ను నిలబెట్టిన నా ‘మనోధైర్యం’కి.. కృతజ్ఞతగా ఈ నవలను అంకితమిచ్చాను. మన జీవితంలో కొన్నిసార్లు మనకు మనమే అండగా నిలబడాలి. ఈ అంకితం నేను నాకు చెప్పుకున్న ఆ కృతజ్ఞతే!

ప్రశ్న 5: ఈ నవల డైరక్ట్ నవలా లేక ఏదైనా పత్రిక/వెబ్ సైట్/బ్లాగులో ధారావాహికంగా వచ్చిందా?

జ: లేదు, ఈ నవల ఎక్కడా ధారావాహికంగా ప్రచురించబడలేదు. పత్రికలో గానీ, వెబ్‌సైట్‌లో గానీ ముందుగా రాలేదు. ‘అమలోద్భవిలో అర్జునుడు’ నేరుగా నవల రూపంలోనే పాఠకుల ముందుకు వచ్చింది.

ప్రశ్న 6: “ఈ నవలలో మీరు యుద్ధాల గురించి చదువుతారు. కానీ నిజంగా మీరు చూడబోయేది మనుషుల మనస్సుల మధ్య జరిగే సంభాషణలే” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు ఆరుద్ర ఈశ్వర్. ఈ వ్యాఖ్యపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: ఆరుద్ర ఈశ్వర్ గారు ఒక అద్భుతమైన పాఠకుడు, గొప్ప సాహిత్యాభిమాని. ప్రతిరోజూ కొత్త పుస్తకాలను పరిచయం చేస్తూ, మన సాహిత్య వాతావరణాన్ని సజీవంగా ఉంచుతున్న వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయన్ని నేను సోదరసమానుడిగా భావిస్తాను.

ఆయన ముందుమాటలో ఆ వ్యాఖ్య రాసినప్పుడు, నేను కూడా ఒకసారి లోతుగా ఆలోచించాను. ఒకే కథను ఒక్కో పాఠకుడు తమ తమ కోణాల్లో చూస్తారు. ఈ నవలలో బాహ్యంగా మీకు యుద్ధాలు, సంఘర్షణలు, వాటి పరిణామాలు కనిపిస్తాయి. కానీ అంతర్లీనంగా చూస్తే.. ప్రతి యుద్ధానికి బీజం పడేది మనిషి మనస్సులోనే! సందేహం, ధర్మసంకటం, భయం, ఆత్మపరిశీలన – ఇవన్నీ కూడా లోపల జరిగే యుద్ధాలే.

అందుకే, ఈ కథలో బాహ్య యుద్ధాలు ఎంత ముఖ్యమో, మనుషుల మనస్సుల మధ్య జరిగే అంతర్గత సంఘర్షణలు కూడా అంతే ముఖ్యం. పాఠకుడికి ఏ అంశం ఎక్కువగా కనెక్ట్ అవుతుందో, అదే వారికి కథకు కేంద్రబిందువులా అనిపిస్తుంది. ఆరుద్ర గారు పట్టుకున్న కోణం కూడా ఒక లోతైన పాఠకుడి దృష్టికోణానికి నిదర్శనమని నేను నమ్ముతున్నాను.

ప్రశ్న 7: “ఈ నవల చదువుతున్నంత సేపూ మీకు ఒక సినిమాటిక్ అనుభవం ఇవ్వడానికి చాలా కృషి చేశాను” అని మీరు పేర్కొన్నారు. సాధారణంగా రచయితలు మంచి పఠనానుభూతి కలిగించడానికి ప్రయత్నించామని అంటారు. మీరు ప్రత్యేకంగా ‘సినిమాటిక్ అనుభవం’ అని ఎందుకు చెప్పారు? అది కేవలం దృశ్యాన్ని కళ్లకు కట్టేలా రాయడమేనా? లేక మరేదైనా ఉందా?

జ: నేను సినిమాల్లో పనిచేయకపోయినా, నా కథను ప్రపంచానికి ఎలా చూపించాలనే ఆలోచన నుంచే నా రచనలు పుడతాయి. నేను రాసే ప్రతి కథనూ ముందుగా ఒక సినిమా లాగానే ఊహించుకుంటాను. పాఠకుడు చదువుతుంటే కేవలం వాక్యాలు మాత్రమే కాదు, ఆ సన్నివేశాలు వారి కళ్ల ముందు కదలాలి – అదే నా ప్రయత్నం.

అయితే, సినిమాటిక్ అనుభవం అంటే కేవలం దృశ్యాలను పేజీల కొద్దీ వర్ణించడం కాదు. అందులో రిథమ్, పేసింగ్, మలుపులు, సస్పెన్స్, ఎమోషనల్ బీట్స్.. ఇవన్నీ కలగలిసి రావాలి. ఒకప్పుడు రచయిత ప్రతి చిన్న వివరాన్ని వర్ణించాల్సి వచ్చేది. కానీ నేటి పాఠకులు విజువల్ మీడియాతో పెరిగారు. “హీరో వచ్చి సోఫాలో కూర్చున్నాడు” అని రాస్తే, మిగతా గదినంతా పాఠకులు తమ ఊహల్లోనే నిర్మించుకోగలరు. అందుకే కథకు ఎంత అవసరమో అంతే చెప్పి, మిగతాది పాఠకుడి ఊహాశక్తికే వదిలేయాలి.

కానీ పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేటప్పుడు – ఉదాహరణకు ‘అమలోద్భవిలో అర్జునుడు’లోని కొన్ని అధ్యాయాలు, ప్రదేశాల విషయంలో – కాస్త వివరంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ లోకాన్ని ముందుగా పాఠకుడి మనసులో నిర్మించాలి కదా!

సినిమా అయినా, పుస్తకం అయినా నా బేసిక్ రూల్ ఒక్కటే: ‘ల్యాగ్’ ఉండకూడదు. కథ ఎక్కడా ఆగకుండా పాఠకుడిని తనతో పాటు తీసుకెళ్లాలి. మనం ఒక సినిమాకి వెళ్తే మూడు గంటల మంచి అనుభవం వస్తుందో రాదో తెలియదు. కానీ నా నవల చేతిలోకి తీసుకున్న పాఠకుడికి మాత్రం.. ఆ సమయం అంతా ఒక అద్భుతమైన ప్రయాణంలా, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్‌లా, ఒక భావోద్వేగ తరంగంలా ఫీల్ అవుతారన్న నమ్మకం నాకుంది.

ప్రశ్న 8: ఈ నవల పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? సాధారణంగా మీరు ఎంత వేగంగా రాస్తారు? రోజుకు ఇన్ని పేజీలు రాయాలని ప్రణాళిక ఉంటుందా? ఈ నవల రచన మీ ప్రణాళికకు అనుగుణంగానే సాగిందా?

జ: ‘అమలోద్భవిలో అర్జునుడు’ పూర్తి చేయడానికి సుమారు ఆరు నెలలు పట్టింది. నాకు కొంచెం ఎక్కువ సమయం అనిపించింది, కానీ నా స్నేహితులంతా “అబ్బో! చాలా త్వరగా పూర్తి చేశావు రా!” అన్నారు.

నేను రోజుకి ఎన్ని పేజీలు రాయాలని ఎప్పుడూ టార్గెట్ పెట్టుకోను. అలా పేజీల లెక్క చూస్తూ రాస్తే, అనవసరమైన విషయాలు నింపి సాగతీతలా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ‘ఎన్ని పేజీలు’ కంటే ‘ఈ సన్నివేశం పూర్తిగా పండిందా?’ అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఒక అధ్యాయం లేదా ఒక దృశ్యం నాకు సరైన ఫీల్ ఇచ్చినప్పుడే ముందుకు వెళ్తాను. కొన్నిసార్లు 3–4 గంటలు ఆగకుండా రాసిన రోజులు కూడా ఉన్నాయి.

ఈ నవల మొదటి రెండు-మూడు అధ్యాయాలు రాసేసాక, వర్ణన ఎలా ఉండాలి, ఎంత చెప్పాలి, ఎక్కడ ఆపాలి అన్న విషయాల మీద దృష్టి పెట్టడానికి కొంత విరామం తీసుకుని ఇతర పుస్తకాలు చదివాను. ఈ కథ 15వ శతాబ్దంలో జరుగుతుంది కాబట్టి, భాష పూర్తిగా సహజంగా, అచ్చం తెలుగులో ప్రవహించాలని చాలా జాగ్రత్త పడ్డాను. ఆ కాలానికి సరిపోని ఆధునిక పదాలు ఎక్కడా రాకుండా చూసుకున్నాను.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కథ మొదలు పెట్టినప్పుడు నా మనసులో ఒక బలమైన, బోల్డ్ క్లైమాక్స్ ఉంది. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ ముగింపు అవసరం లేదనిపించింది. కథ తనంతట తాను తన దారిని మార్చుకుంది. చివరికి వచ్చిన ముగింపు నాకు చాలా సంతృప్తినిచ్చింది.

ఒక రచయితగా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఇదే – మనం కథను నడిపిస్తున్నాం అనుకుంటాం.. కానీ నిజానికి కథే మనల్ని నడుపుతుంది!

ప్రశ్న 9: నవల మధ్యలో సన్నివేశాలకి తగ్గ చిత్రాలు బాగా అమరాయి. వీటిని కృత్రిమ మేధ ద్వారా రూపొందించారని అన్నారు. మీరు ఎక్కువగా ఏ మాధ్యమాన్ని అంటే చాట్జిపిటి/జెమిని/అడోబ్ ఫైర్ ఫ్లై .. వంటి వాటిలో దేన్ని ఉపయోగించారు? దేనిలో బొమ్మలు కథకు తగ్గట్టుగా వచ్చాయి?

జ: నిజానికి, ఈ నవల తుది దశలో ఉన్నప్పుడు (2024 నవంబర్-డిసెంబర్ సమయంలో) నేను నా స్నేహితుడితో కలిసి AI చిత్రాలపై ప్రయోగాలు చేశాను. ఆ సమయంలో ప్రధానంగా DALL·E, Copilot వాడాము. వాటితో పాటు DeepAI ద్వారా కూడా కొన్ని ప్రయత్నాలు చేశాను. నా పుస్తకాలకి కవర్ పేజెస్ కూడా నేనే డిజైన్ చేసుకుంటాను.

AI ద్వారా చిత్రాలు రూపొందించడం అంటే.. కేవలం ఒక బటన్ నొక్కడం కాదు; దానికి సరైన ప్రాంప్ట్ (Prompt) ఇవ్వడం ఒక కళ. కథలోని వాతావరణం, ఆ కాలపు నేపథ్యం, పాత్రల భావోద్వేగాలు – ఇవన్నీ మనం ఎంత స్పష్టంగా వివరించగలిగితే, ఆ చిత్రం కథకు అంత కచ్చితంగా సరిపోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో, నా అనుభవం ప్రకారం జెమినీ ప్రో (Gemini Pro) కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తోంది. మనం వివరంగా, స్పష్టంగా ప్రాంప్ట్ ఇస్తే.. కథలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గ అద్భుతమైన దృశ్యాన్ని కళ్లముందు ఉంచుతుంది.

కానీ చివరగా నేను చెప్పేది ఒకటే – మనం ఏ ప్లాట్‌ఫామ్ వాడాము అన్నది కాదు, ఒక రచయిత తన కథలోని ప్రపంచాన్ని తన మనసులో ఎంత స్పష్టంగా ఊహించుకున్నాడు అన్నదే ముఖ్యం. రచయిత ఊహ స్పష్టంగా ఉంటే, ఆటోమేటిక్‌గా AI కూడా దాన్ని ఫాలో అవుతుంది.

ప్రశ్న 10: ఈ నవల రాయడానికి సమాచారం కోసం ఎటువంటి పరిశోధన చేశారు?

జ: ఈ నవల 15వ శతాబ్దంలో జరుగుతుంది కాబట్టి, ఆ కాలం గురించి చాలా లోతుగా అధ్యయనం చేశాను. అప్పట్లో భారతదేశంలో ఏయే రాజ్యాలు ఉన్నాయి, దక్షిణ భారతాన్ని ఎవరు పాలిస్తున్నారు, రాజుల పేర్లు, యుద్ధాల స్వభావం ఎలా ఉండేది – ఇలాంటి చాలా విషయాలు లోతుగా చదివాను.

అలాగే ఆ కాలపు భాష ఎలా ఉండేది అన్నది కూడా జాగ్రత్తగా చూశాను. హిందీ ఎంతవరకు వాడుకలో ఉండేది? ఆంగ్లం ఏ స్థాయిలో ఉండేది? అన్నీ విశ్లేషించాను. కథ పూర్తిగా సహజమైన, అచ్చం తెలుగులో ఉండాలని నిర్ణయించుకున్నాను కాబట్టి, ప్రతి పదం మీద చాలా శ్రద్ధ పెట్టాను. కొన్ని పదాలకు సరైన తెలుగు ప్రత్యామ్నాయాలు కనుగొనడానికి నిఘంటువులు కూడా తిరిగేశాను.

దుస్తులు, ఆయుధాలు, యుద్ధాలు మాత్రమే కాదు – నీటిలో తడవకుండా ప్రయాణించేటప్పుడు ఏ రకం బట్టలు వేసుకునేవారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడా ఎంతో శ్రద్ధ పెట్టాను. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి తెలుగు సాహిత్య ప్రముఖులను కూడా సంప్రదించాను.

అలాగే ‘బాహుబలి’, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలను మళ్లీ ఒకసారి నిశితంగా చూశాను. కానీ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా చూసుకున్నాను – ఆ సినిమాల ప్రభావం నా కథపై పడకూడదు. నా కథ పూర్తిగా స్వతంత్రంగా, తన సొంత స్వరంతో ఉండాలని మొదటి నుంచి బలంగా నిర్ణయించుకున్నాను.

ఇప్పటివరకు నేను రాసిన అన్ని నవలలతో పోలిస్తే, ఈ నవల కోసం అత్యధికంగా పరిశోధన చేశాను. మీరు కథలో చదివే ప్రతి చిన్న వివరం వెనుక ఒక లోతైన అధ్యయనం ఉంది. అదే ఈ రచనను నాకు ఎంతో ప్రత్యేకంగా, సంతృప్తినిచ్చేలా చేసింది.

ప్రశ్న 11: ఈ నవల కథాకాలం 15వ శతాబ్దమని అన్నారు. అప్పటి భౌగోళిక ప్రాంతాలు ఇప్పుడు పేర్లు మారి ఉంటాయి కదా. నవలలో మీరో చోట ఒక వస్త్రం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిందని రాశారు. కొన్ని చోట్ల ఆఫ్రికా రాణి అని వ్రాశారు. అప్పటికి ఆఫ్రికా ఖండం ఉన్నా, బహుశా ఆ పేరుతో లేదేమో. Kush, Aksum, Mali, Songhai, Asante వంటి భిన్న సామ్రాజ్యాలుగా ఉండేదని తెలుస్తుంది. మీరు ‘ఆఫ్రికా ఖండం’ అనే పదం వాడినప్పుడు modern African Continent అనే అర్థం స్ఫురించే అవకాశం ఉంది కదా! ఏమంటారు?

జ: అవునండీ! 15 వ శతాబ్దంలో కూడా ఆఫ్రికా అనేవారు. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. కానీ 15వ శతాబ్దంలో అక్కడ వందకు పైగా రాజ్యాలు ఉండేవి. నేను ఆ చారిత్రక వివరాలన్నీ లోతుగా చెప్పాలనుకోలేదు. ఎందుకంటే, కథకు ఏవి అవసరమో ఆ ముఖ్యమైన అంశాలను మాత్రమే ప్రస్తావించాను. “ఆఫ్రికాలో ఒక రాణి” అనడం కంటే, ‘ఆఫ్రికా రాణి’ అని వాడితే ఒక విలన్‌గా ఆమె పాత్రకు మంచి ఎలివేషన్ వస్తుందని నా ఉద్దేశం.

సాహితీవేత్త డా. ఏనుగు నరసింహారెడ్డి గారు కూడా నన్ను ఒక ప్రశ్న అడిగారు, “దీన్ని పూర్తిగా చారిత్రక నవలగా ఎందుకు రాయలేదు? దానికి తగిన అవకాశం ఇందులో ఉంది కదా!” అని. దానికి కారణం కూడా ఇదే. నేను దీన్ని పక్కా చారిత్రక నవలగా రాసుంటే, ఆరు నెలల్లో పూర్తయ్యేది కాదు. పైగా, “ఇది ఒకప్పుడు నిజంగా జరిగింది” అని మనం ఎప్పుడైతే చెబుతామో, దాన్ని చూసే పాఠకుల దృష్టికోణం కూడా మారిపోతుంది. ఎక్కడైనా చరిత్రకు విరుద్ధంగా ఏమైనా చిన్న తప్పు దొర్లిందేమో అని చూసే అవకాశం ఉంటుంది.

అందుకే దీన్ని స్పష్టంగా ‘ఫిక్షన్’ (కల్పిత కథ) అని చెప్పాను. కానీ చదువుతున్నప్పుడు పాఠకులకు ఆ కాలం నాటి పరిస్థితులు సులభంగా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో.. శ్రీకృష్ణదేవరాయల రాజ్యం, పులకేశి రాజ్యం లాంటి మనకు బాగా తెలిసిన చారిత్రక అంశాలను నేపథ్యంగా వాడుకున్నాను.

ప్రశ్న 12: ఏదైనా సన్నివేశం రాశాకా, బాగా లేదని అనిపించో, లేక అనుకున్నంత గ్రిప్పింగ్‌గా రాలేదనో – తిరగరాసిన సందర్భాలున్నాయా?

జ: అవును, అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఒక రచయితగా మొదటి డ్రాఫ్ట్‌నే ఫైనల్ అనుకోవడం సరైంది కాదు. కొన్ని సన్నివేశాలు మొదట రాసినప్పుడు భావోద్వేగం సరిగా రాలేదు, లేదా కథలో కావాల్సిన ఉత్కంఠ లేకపోయిందని అనిపించింది.

ముఖ్యంగా నవల రెండో సగంలో విక్రమవర్మ – అతని వదిన రాధ సఖి మధ్య జరిగే సంభాషణలను పూర్తిగా తిరగరాశాను. అలాగే క్లైమాక్స్‌లో యువరాజు నిజ స్వరూపం బయటపడే భాగం, కూట యుద్ధ ప్రణాళిక – ఈ అన్ని సీన్స్‌ను మళ్లీ రాశాను. మొదట రాసిన రూపం సరైన బలం ఇవ్వలేదని అనిపించడంతో, ఇంకా నాటకీయంగా, భావోద్వేగం ఎక్కువగా, తార్కికంగా కూడా సరైన ఫీల్ రావాలని మార్చాను.

నా దృష్టిలో తిరగరాయడం అంటే బలహీనత కాదు.. అది రచన పట్ల ఉన్న నిజమైన బాధ్యత. ఒక సన్నివేశం పాఠకుడిని పూర్తిగా లాక్కోలేకపోతే, అది ఇంకా పూర్తి కాలేదని నేను భావిస్తాను.

ప్రశ్న 13: ఈ నవలలో మీకు బాగా నచ్చిన సన్నివేశం, రచయితగా మీకు తృప్తినిచ్చినది ఏది? జానపద నవలాకారులలో మీకు ప్రేరణ ఎవరు?

జ: నాకు బాగా నచ్చిన, నాకు తృప్తినిచ్చిన సన్నివేశాలు ఈ నవలలో చాలానే ఉన్నాయి. పాఠకులు వాటిని ఎంతవరకు గమనించారో నాకు తెలియదు కానీ, నా మనసుకు దగ్గరైన కొన్ని సన్నివేశాల గురించి ఇక్కడ కచ్చితంగా చెప్పాలి.

ముఖ్యంగా మంత్రి ప్రేమలేఖ చదివే సన్నివేశం. ఆ లేఖలోని ప్రతి వాక్యం చదువుతున్నప్పుడు.. రాజుగారి కత్తికి ఎక్కడ బలి కావాల్సి వస్తుందో అన్న భయంతో అతను ముందుకు, వెనక్కి వెళ్తూ పడే టెన్షన్ అద్భుతంగా పండింది. ఇంకోటి గూఢచారుల పేర్లు.. వాళ్ళ బలాన్ని, నైపుణ్యాన్ని బట్టి వాళ్లకు ఆ పేర్లు పెట్టడం నాకు చాలా నచ్చిన అంశం. అలాగే విక్రమవర్మ, రాధాసఖి మధ్య జరిగే ప్రతి సన్నివేశం, వారి సంభాషణలు చాలా అందంగా ఉంటాయి. యుద్ధానికి ముందు విక్రమవర్మ ఇచ్చే ఉపన్యాసాలు, పరాక్రమవర్మ చెప్పే పదునైన మాటలు (quotes) అయితే స్వయంగా నాకే చాలా ఇష్టం.

ఇక నా ప్రేరణ విషయానికొస్తే.. ఆనంద్ నీలకంఠన్ గారు రాసిన ‘అజేయుడు’ (Asura/Ajaya) పుస్తకం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే చిన్నప్పటి నుంచి చదివిన విక్రమార్కుడు – బేతాళ కథల సిరీస్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. వాటి ప్రభావం, ఇష్టం నా రచనల్లో ఎక్కడో ఒకచోట ప్రతిబింబిస్తూనే ఉంటాయి.

ప్రశ్న 14: ఈ నవలకి పాఠకుల ఆదరణ ఎలా ఉంది? విమర్శకుల స్పందన ఎలా ఉంది? నవలని పాఠకులకు ఎలా చేరువ చేయాలనుకుంటున్నారు? ‘ష్.. గప్ చుప్’ అనే మీ పాడ్‌కాస్ట్ ద్వారా చేసిన ప్రచారం ఆశించిన ఫలితాన్నిచ్చిందా?

జ: నిజానికి, ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ ఎంతగానో మెచ్చుకున్నారు. కానీ, “ఇది చదవండి” అని అందరికీ చెప్పడానికి, వాళ్ల దగ్గరకు పుస్తకాన్ని తీసుకెళ్లడానికి నేను చాలా ప్రయత్నించాను. కొందరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు (Influencers) చదివి, “చాలా బాగుంది, బాహుబలిని మించిపోయింది” అని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కూడా ప్రశంసించారు. అయితే, జానపద కథలంటే మన వాళ్లకు చాలా ఇష్టం కదా అన్న ఉద్దేశంతో నేను ఇంకా పెద్ద స్పందనను ఆశించాను. బహుశా నా అంచనాలు కాస్త ఎక్కువయ్యాయేమో.

నాకు సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే.. ఈ నవలను వంద మంది చదివితే, ఆ వంద మంది అద్భుతంగా ఉందని చెప్పారు. ఒక్కరు కూడా అందులో నెగెటివ్ పాయింట్ చెప్పలేదు. కానీ, “ఇది నిజంగా ఒక మంచి నవల, దయచేసి చదవండి” అని ఎక్కువ మంది ప్రజలకి ఇంకా ఎలా చెప్పాలో, వారిని ఎలా చేరుకోవాలో నాకు అర్థం కావడం లేదు.

ఇక నా Shhgupchup Telugu పాడ్‌కాస్ట్ విషయానికొస్తే, దాని ద్వారా నేను నా పుస్తకాల సేల్స్ (Sales) పెంచుకోవాలని ఎప్పుడూ ఆశించలేదు. నా మనసులోని ఆనందాలను, బాధలను, భారాలను ప్రజలతో పంచుకుని కాస్త తేలికపడటానికి నేను వాడుకునే ఒక వేదిక మాత్రమే నా పాడ్‌కాస్ట్.

ప్రశ్న 15: భవిష్యత్తులో ఏయే అంశాలను, ఏ ఇతివృత్తాలను నవలలుగా రాయాలనుకుంటున్నారు? వివరించండి.

జ: ప్రస్తుతం నా మనసులో మరో 5-6 నవలల కథాంశాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా వాటన్నింటినీ పూర్తి చేయాలని పని చేస్తున్నాను.

అవన్నీ అయిపోయాక ఒక బలమైన ఆలోచన నా మనసులో ఉంది. గత 25 ఏళ్లలో మన సమాజంలో జరిగిన, చాలా సంచలనం సృష్టించిన నిజమైన కుట్రలు, రహస్యాల మీద ఒక పవర్‌ఫుల్ పుస్తకం రాయాలని ఉంది.

చరిత్రను ఊహించి రాయడం ఒక ఎత్తు అయితే, మన కళ్ల ముందే జరిగిన వాస్తవాలను లోతుగా విశ్లేషించి రాయడం మరో ఎత్తు. అందరికీ బాగా తెలిసిన, వార్తల్లో హల్‌చల్ చేసిన 7-8 పెద్ద సంఘటనలను తీసుకుని, వాటి వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను, అసలు నిజాలను లోతుగా పరిశోధించి రాయాలనుకుంటున్నాను.

కేవలం వార్తలు చదివి రాయడం కాదు – వాటి వెనుక ఉన్న రహస్యాలు, దాచిన కోణాలు, నా సొంత విశ్లేషణతో పాటు పాఠకుల ముందు ఉంచాలని ప్లాన్. ఆ పుస్తకం కేవలం చదివి ముగించేలా కాకుండా, పాఠకులను ఆలోచింపజేసి, కొత్త దృక్పథం ఇచ్చేలా ఉండాలని నా ఆశ. ఆ తరువాత కొంత విరామం తీసుకుంటాను.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, ‘సంచిక’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు విజయ్ అప్పల్ల గారు.

విజయ్ అప్పల్ల: ‘సంచిక’కు ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

***

అమలోద్భవిలో అర్జునుడు (జానపద నవల)
రచన: విజయ్ అప్పల్ల
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పేజీలు: 210
వెల: ₹ 250/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్: ఫోన్: 9000413413
~
శామ్ పబ్లికేషన్స్,
ఫోన్: 9247446497
~
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/AMALODBHAVILO-ARJUNUDU-Telugu-Vijay-Appalla/dp/9334344318/

~
‘అమలోద్భవిలో అర్జునుడు’ సమీక్ష:
https://sanchika.com/amalodbhavilo-arjunudu-book-review-kss/

Exit mobile version