[‘కలర్ఫుల్ కదంబం’ అనే పుస్తకం వెలువరించిన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం అల్లూరి గౌరీలక్ష్మి గారూ.
అల్లూరి గౌరీలక్ష్మి: నమస్కారమండీ.
~
ప్రశ్న 1. సంచికలో మీరు వ్రాసిన కాలమ్స్‌తో ‘కలర్‍ఫుల్ కదంబం’ అనే పేరుతో పుస్తకం వెలువరించినందుకు అభినందనలు. ఇది మీ ఎన్నో పుస్తకం? 32 వ్యాసాలున్న ఈ పుస్తకానికి 19వ వ్యాసం పేరు పెట్టడం వెనుక మీ ఆలోచన ఏమిటి?
జ: ఇది నా 13వ పుస్తకం. నాలుగు నవలలు, నాలుగు కథా సంపుటాలు, మూడు కవిత్వ సంపుటాలు వచ్చిన తర్వాత ఇది రెండవ కాలమ్స్ సంపుటి. ‘సంచిక’ ఆన్‌లైన్ మ్యాగజైన్లో ‘రంగుల హేల’ శీర్షిక కింద నేను రాసిన 32 కాలమ్స్‌ని కలిపి ఈ పుస్తకం వేసాను. వీటిల్లో నేను రకరకాల సబ్జెక్టులు తీసుకున్నాను. అందులో కొన్ని సీరియస్ టాపిక్స్ ఉన్నప్పటికీ అన్నిటినీ హాస్యంగా విశ్లేషిస్తూ రాశాను. ఈ పుస్తకాన్ని రంగురంగుల పూమాలగా భావించి, ఇందులో ఉన్న ఒక కాలమ్ పేరైనటువంటి ‘కలర్‌ఫుల్ కదంబం’ సరిగ్గా అమరుతుంది అని మా గురువుగారు శ్రీరామారావు గారు సూచించడంతో ఆ పేరు పెట్టాను.
ది.25-12-2025న బుక్‍ఫెయిర్‌లో ‘కలర్‍ఫుల్ కదంబం’ పుస్తకం ఆవిష్కరణ
ప్రశ్న 2. కాలమ్స్‌కి సంబంధించి ఇది మీ రెండవ పుస్తకం. మొదటి కాలమ్స్ పుస్తకం ‘భావవల్లరి’కి ఈ పుస్తకానికి మధ్య చాలా సంవత్సరాల ఎడం ఉంది. ఈ మధ్య కాలంలో మీరు కాలమ్స్ వ్రాయలేదా? లేక పుస్తకంగా తేలేదా?
జ: అవునండీ! 2008లో ‘విజేత’ దినపత్రికలో ‘ఊహల మాలిక’ పేరుతో ప్రచురితమైన 32 కాలమ్స్‌తో ‘భావవల్లరి’ పుస్తకం వచ్చింది. తర్వాత 2018 నుంచీ అంటే ‘సంచిక’ ప్రారంభ సంచిక నుంచీ రాసిన 32 కాలమ్స్‌తో ఈ రెండవ పుస్తకం ఇప్పుడు తేవడం జరిగింది.
ప్రశ్న 3. కాలమ్స్ వ్రాయడానికి మీరు ప్రేరణ ఎవరు? ఎవరి కాలమ్స్ అంటే మీకు బాగా ఇష్టం?
జ: కాలమ్స్ రాయడానికి నాకు ప్రేరణ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు. ఆమె రాసిన ‘ఆకులో ఆకునై’ కాలమ్స్ సంపుటి 2003లో అనుకుంటాను ఎవరి దగ్గరో చదివి ఆ బుక్ మొత్తం ఫోటో కాపీ తీసి పెట్టుకున్నాను. ఆ కాలమ్స్ నా ఆలోచనలకు ప్రతిబింబాలుగా అనిపించాయి. అలాగే శ్రీ రమణ గారు ‘శ్రీ కాలమ్’ పేరుతో రాసిన పొలిటికల్ సెటైర్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆత్మీయంగా కబుర్లు చెబుతున్నట్టుగా, కాస్త సున్నితమైన హాస్యంతో, కఠినమైన విషయాలను కూడా తేలిగ్గా నవ్వుకునేట్టు చేయడానికి కాలమ్స్ ఉపయోగపడతాయి. అలాగే సన్నగా గిచ్చినట్టు చురుక్కుమనిపించే శ్రీ రమణ గారి వ్యంగ్యం (Satire is a suppressed anger), వీరలక్ష్మిగారి సెన్సిబిలిటీ, భాషలో సారళ్యం ఇంకా ఆమె సున్నితమైన భావవ్యక్తీకరణ నాకు మరీ మరీ నచ్చుతాయి.
ప్రశ్న 4. కథా రచనకీ కాలమ్ వ్రాయటనికీ ప్రధాన వ్యత్యాసం ఏమని భావిస్తున్నారు?
జ: కాలమ్‌లో ఒక సబ్జెక్టును తీసుకుని దాన్ని రకరకాల కోణాల్లో వివరిస్తూ, విశ్లేషిస్తూ ఆ వస్తువుకి సంబంధించిన లోతుపాతులను, ముందువెనకలను చర్చిస్తూ సాగాలి. ఆ విషయం గంభీరమైనదైనా దాన్ని తేలికగా మార్చి హృదయానికి హత్తుకునేలా చెప్పొచ్చు. కథలో ఒక చక్కని నడక, ముగింపు ఉండాలి. కథ రాయడానికి ఒక బలమైన సన్నివేశం కానీ సందేశం కానీ ఉండి తీరాలి. చివరలో పాఠకుడికి ఒక మెరుపును కానీ మలుపును కానీ చూపించి ముగించాలి. కథలో ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకు రాస్తున్నాం? అన్నదానికి జవాబు ఉండాలి. కాలమ్‌కి అక్కర్లేదు. ఎక్కడో మొదలుపెట్టి ఇంకెక్కడో ఆపేయచ్చు, కానీ పాఠకుడిని అక్షరాల వెంట పరుగులు తీయించే రీడబిలిటీ ఉండేలా మాత్రం చూసుకోవాలి.
ప్రశ్న 5. కాలమ్‌కి ఇతివృత్తాన్ని ఎలా ఎంచుకుంటారు? ఓ ఆలోచనో లేక ఐడియానో తట్టిన తరువాత దాన్ని ఎలా డెవలప్ చేస్తారు?
జ: కాలమ్‌కి ఇతివృత్తం ఎంపిక కొంత కష్టమైన పనే! చుట్టూ ఉన్న సమాజపు ధోరణి నుండి కొన్ని దొరుకుతాయి. మనం ఇచ్చిన హెడ్డింగ్ లేదా టైటిల్ చుట్టూనే మనం చెప్పే పాయింట్లు అల్లుకోవాలి. చిన్న చిన్న సంఘటనలు మాత్రమే ఉండాలి. చెబుతున్న విషయం వదిలేసి ఎటో వెళ్లిపోకూడదు. మనం రాసే ప్రతి పేరా ఈ సబ్జెక్టుకి కచ్చితంగా రిలవెంట్ అయి ఉండాలి. ఇది కథ కాకపోవడం వల్ల మనం ఏదో చెప్తూ చెప్తూ శాఖా చంక్రమణం చేసి దారి తప్పిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. అది గమనించుకుంటూ చివరి వరకూ ఒక కంటిన్యూటీతో ముందుకు సాగాలి. ఆఖర్న సరదాగా ఒక వాక్యంతో ముగించాలి.
ప్రశ్న 6. కాలమ్‌కి ఇతివృత్తాలుగా నోస్టాల్జిక్ టాపిక్స్, పాటలు, స్కూలు/కాలేజీ మిత్రుల కలయిక, జీవన విధానాలు, తదితర అంశాలు ఎంచుకున్నప్పుడు, మీకు అలవాటైన రీతిలో రచన సాగిపోతుంది. కానీ ఎప్పుడైనా, సమీకాలీన సామాజిక అంశాలతో కాలమ్ వ్రాసినప్పుడు ఏ యే జాగ్రత్తలు తీసుకుంటారు?
జ: అవును. కేవలం వ్యక్తిగత అనుభవాలు కాకుండా నేను చాలా కాలమ్స్ సామాజిక అంశాల మీద కూడా రాశాను. నిత్యం మనం చూస్తున్న చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకులు, వారు చేసే రాజకీయాలు, వాటిని చూసి ప్రజలు విసిగిపోయిన తీరు, ఇంకా కొన్ని కాలమ్స్ రకరకాల మోడరన్ దుస్తుల్లో కనబడుతున్న మూఢనమ్మకాలు, జాతకాల పిచ్చి, పెరుగుతున్న భక్తులు, సమాజంలో పెరుగుతున్న అసహనం, హింస లాంటి సబ్జెక్టుల మీద కూడా రాశాను. ఇంకా కొన్ని కాలమ్స్ వ్యక్తిగత జీవితంలో కావలసిన డిటాచ్మెంట్, కరోనా, చలామణీ ప్రతిభావంతులు, ధృతరాష్ట్ర ప్రేమల గురించి ఉన్నాయి. నా చుట్టూ జరుగుతున్న సాంఘిక విషయాలను, ఇతర సంగతులను నిశితంగా గమనిస్తూ నాదైన పద్ధతిలో ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగానే వాటిని విశ్లేషించడం చేస్తాను. సామాజిక అంశాలను గమనించి బాధతో కూడిన వ్యంగ్యంతో రాస్తున్నప్పుడు వాటిని గురించిన అప్డేటెడ్ నాలెడ్జ్ ఉండడం తప్పనిసరి.
ప్రశ్న 7. ఒక కాలమ్ లోని వస్తువో, సన్నివేశమో – మరో కాలమ్‌కి దారితీసిన దృష్టాంతాలు ఉన్నాయా?
జ: ఒక్కోసారి మనం రాస్తున్న ఫ్లోలో మనకి తెలియకుండా మరో టాపిక్ కలిసి మనతో నడిచి వచ్చేస్తుంటుంది. అటువంటప్పుడు దాన్ని ఆపి మరో కాలమ్ కోసం ఆ మేటర్‌ని విడదీసి పక్కకి పెట్టి రాయాల్సిన అవసరం వస్తుంది. ‘డ్రీమ్ హస్బెండ్స్ అండ్ రియల్ హస్బెండ్స్’ అని ఒక కాలమ్‌లో అమ్మాయిలు కలల్లో ఊహించుకున్న భర్తల్లా వాస్తవభర్తలు ఉండరు వారికి చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అని నవ్విస్తూ రాశాను. నా మేల్ మిత్రులు కొందరు నాపై కోపగించుకొని మాకు కూడా ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయిగా! అంటూ నిష్ఠూర మెసేజెస్ పంపించారు. అప్పుడు నేను ‘ఊహా సుందరీమణులూ.. వాస్తవ భార్యామణులూ’ అని భర్తలను నిరాశపరిచే భార్యల గురించి హాస్యస్పోరకంగా రాశాను. అప్పుడు వాళ్ళలా అడగకపోతే ఈ కాలమ్ వచ్చి ఉండేది కాదు. అప్పటివరకూ, నాకు ఆ ఆలోచన రాలేదు నేను స్త్రీని కాబట్టి (నవ్వుతూ).
ప్రశ్న 8. చాలా కాలమ్స్‌లో మీరు పాత హిందీ, తెలుగు పాటల ప్రస్తావన తెచ్చారు. మీకు పాటలంటే ఎప్పుడు, ఎలా ఆసక్తి కలిగింది?
జ: మా గోదావరి జిల్లాల్లోని గ్రామాల్లో హిందీ మాట్లాడడం దాదాపుగా ఎవరికీ రాదు (హిందీ టీచర్లకు కూడా). మేం అప్పుడప్పుడూ వచ్చే ‘బాబి’, ‘షోలే’ లాంటి సినిమాలు చూసి మురిసిపోయేవాళ్ళం. సినిమా మొత్తం అర్థం కావడం లేదు, ప్రతి డైలాగ్ అర్థం అయ్యేలా హిందీ బాగా నేర్చుకోవాలి అని విపరీతమైన కోరిక ఉండేది. వివాహానంతరం హైదరాబాద్ వచ్చాక, ఉద్యోగరీత్యా మా సహోద్యోగులుగా తెలుగు రాని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉండేవారు. వాళ్ల వల్ల మాట్లాడే హిందీ త్వరగానే అబ్బింది. అయితే అంతటితో ఆగకుండా హిందీ సినిమా పాటల్లోని సంగీత, సాహిత్యాల పట్ల అభిరుచి ఏర్పడింది. ఆ పాటల సూక్ష్మమైన అర్థాన్నీ, వాటిని రాసిన కవి హృదయం, సినిమాలో కథా సందర్భం వంటివి కస్తూరి మురళీ కృష్ణ గారిని అడిగి రాసుకోవడం లేదా నెట్‌లో ఇంగ్లీష్ అర్థాన్ని ప్రింట్ తీసుకోవడం ఒక పిపాసగా మారింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. కారణం హిందీ సినిమా పాటల్లో సంగీతం, సాహిత్యం ఇప్పటికీ పల్చబడకుండా ఉన్నత స్థాయిలోనే ఉండడం. ఆనాటి ‘జోవాదా కియా ఓ నిభానా పడేగా’, ‘గాతా రహే మేరా దిల్’ నుండి నేటి ‘పెహలీ నజర్ మే కైసే జాదూ కర్ దియా’, ‘లుట్ గయే హమ్ తేరీ మొహబ్బత్ మే’, ‘తేరె బిన్ నై లగదా దిల్ మేరా’, ‘మై ఫిర్ భీ తుంకో చాహుంగా’ మొదలైన పాటల్లోని శ్రావ్యత ఎంత సున్నితంగా ఉంటుందంటే ఆ పాట పూర్తయి రిపీట్ అవుతున్నా లేచి ఆపాలనిపించదు. వాటిలో ఉండే మాధుర్యం అలాంటిది నా దృష్టిలో.
ప్రశ్న 9. ఓ కాలమ్‍లో రాసినట్టు, మీరెప్పుడైనా, నిజ జీవితంలో రచయిత్రిగా (కు)విమర్శకుల బారిన పడ్డారా?
అలాగే 2008లో నేను ‘వసంత కోకిల’ అనే కథల సంపుటిని వెలువరించాను. అందులో ఒక కథలో ఒకమ్మాయి రెండు సార్లు వివాహంలో మోసపోతుంది. ఆమె తల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడా అమ్మాయి “నాకు భవిష్యత్తు మీద ఆశ ఉందమ్మా!” అంటుంది. ఒక వారపత్రికలో పద్మ అనే ఒక జర్నలిస్ట్ సమీక్షకురాలు, ఈ బుక్ రివ్యూ చేశారు. ఈ కథ గురించి సూచిస్తూ “ఇలా ఈ అమ్మాయి పెళ్లిళ్ల ప్రయోగం చేస్తూనే ఉంటుందా?” అని వ్యంగ్యంగా రాశారు. “ఆ అమ్మాయి మీ చెల్లెలయితే ఇలాగే అంటారా?” అని ఆమెకు జవాబు రాశాను. సమీక్ష చేసే వాళ్ళు కథనంలో లోపాలు చెబుతూ Constructive Criticism, సద్విమర్శ చేస్తే అది రచయితకి ఉపయోగపడుతుంది. వాళ్లు రాయబోయే కథలలో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. ఆ సూచన రాసిన వారికి కృతజ్ఞులుగా కూడా ఉంటారు. ఇలా రచనల మీద గౌరవం లేకుండా ఆషామాషీగా విమర్శించే వాళ్ళు ఉంటూనే ఉంటారు.
ప్రశ్న 10. ఒక కాలమ్‍లో – “గతంలోని శాల్తీలను వర్తమానంలోకి పిలవకూడదని ఒట్టేసుకున్నాను” అన్నారు. ఇది వ్యక్తులకే కాక, ఒకప్పటి చేదు, బాధాకరమైన సంగతులకు కూడా వర్తిస్తుంది కదా? ఏమంటారు?
ప్రశ్న11. అచ్చంగా బతికిన రోజులదే అసలైన జీవితమని అన్నారు ‘కలర్‍ఫుల్ కదంబం’లో. ఈ వ్యాసం నేపథ్యం చెప్పండి.
జ: కాలేజ్ టీనేజ్ జీవితం ప్రశాంత సరస్సులో నావ ప్రయాణంలా నిదానంగా, చీకూచింతా లేకుండా ఉంటుంది. ఆ వయసులో ప్రపంచం పంచరంగుల్లో కనబడుతుంటుంది. క్లాసులో మిత్రులతో కలిసి నవ్వుకుంటూ తుళ్లుకుంటూ ఉంటాం. చదువుకోవడం, పరీక్షలు రాయడంలో బిజీగా ఉన్నా హాయిగా ఉంటుంది. ఆపై నవలలు, సినిమాలు ఊహాప్రపంచాన్ని ముందుకు తెచ్చి పెడతాయి, ఆ సమయం మళ్లీ జీవితంలో రాదు, ఆ తరుణం దాటిన తర్వాత జీవితం బాధ్యతలతో కూడి ఉంటుంది. అది ఉద్యోగమైనా, సంసారమైనా అందుకే అలాంటి రోజులే బంగారు రోజులు, అని నా ఉద్దేశం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి అనుభవం కూడా! కాదనగలరా!
ప్రశ్న12. ఒక కాలమ్‍లో ‘ఉచితజ్ఞత’ అనే పదం వాడారు. ఔచిత్యం, విజ్ఞత అనే రెండు పదాలను వాటి అర్థం కోసం జోడించారా? ఈ ప్రయోగం నేపథ్యం చెప్పండి.
జ: నేను వాడిన సందర్భం కామన్ సెన్స్ అని. ఈ పదం పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ‘సారంగధర నాటక ప్రదర్శనము’ అనే వ్యాసంలో వాడినది. Common sense is not so common అని కూడా!
ప్రశ్న13. పుస్తకాన్ని సినిమా టాపిక్‌తో మొదలుపెట్టి, సినిమా టాపిక్‌తో (పాటలు) ముగించటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టుంది? ఏమంటారు?
మా హృదయపుపొరల్లో బాల్య జ్ఞాపకాల అరల్లో నిక్షిప్తమైన అనుభవాల్లో వ్యక్తిగతమైనవీ, సినిమాల్లోవీ కలిసి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. వాటిని విడదీయలేం. మా జీవనయానంలో సంఘటనలూ, సినిమాల్లో సంఘటనలూ అన్న తేడా లేకుండా ఆ సినిమా నటులూ, మా లైఫ్ లోని మా బంధుమిత్ర గణం కలిసిపోయి ఉంటారు. ఇలా మొత్తానికి మాకు జీవితం, సినిమాలు వేరువేరు కాదు. అందుకే జీవితం సినిమా కాదు అని గుర్తు చేసుకుంటూ, ఆ సినీ గీతాల తీయదనాన్ని నెమరువేసుకుంటూ, అప్పుడప్పుడూ చవిచూస్తూ జీవనం గడుపుతుంటాం మేం.
ప్రశ్న14. మీరు దాదాపుగా వందకు పైగా కాలమ్స్ రాసారు మీ కథలకు సమానంగా. ఇన్ని కాలమ్స్ రాయడంలో మీకు కలిగిన సౌలభ్యం ఏమిటి?
జ: కాలమ్స్ ప్రక్రియలో లోకం పోకడ, తీరుతెన్నులు, వైచిత్రిని చూపిస్తూ మనదైన శైలిలో విశ్లేషించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఏమైనా సందేశం ఇచ్చినా కూడా అది నర్మగర్భంగా ఉంటుంది. అర్థమైన వాళ్లకు అవుతుంది కాని వాళ్లకు అది హాస్యంలా కనపడుతుంది. (వేస్తున్న చురకలు కూడా). ఇలా అనేకానేక సబ్జెక్టులని కథలుగా రాయలేము. అలా ప్రయత్నిస్తే బాలల కథల్లా ఒక సిరీస్‌లా తయారవుతాయి. ఒక వస్తువును కథ రూపంలో చెప్పినప్పుడు అది ఒక పాఠంలా రూపు దిద్దుకుంటుంది. కాలమ్స్ అనేవి పిచ్చాపాటీలా ఉంటాయి. మొహమాటం లేకుండా అనేక విషయాలు చర్చించవచ్చు. ఇందులో కఠిన నిజాలు, చేదైన సందేశాలు పైకి కనబడవు. పాఠకులకు కావలసినది అదే! ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌గా మెచ్చుకుంటున్న అధిక పాఠకుల స్పందన నాకు తెలియడం కూడా నన్నుత్సాహపరిచింది. మరిన్ని రాయడానికి కారణం అయ్యింది. నేను రాసిన కథ, నవల, కవిత్వం ప్రక్రియల కన్నా నా కాలమ్స్ బుక్స్ నా అభిమాన పుస్తకాలు.
ప్రశ్న15. సాహిత్యంతో మీ దోస్తానా ఎప్పుడు ఎలా ప్రారంభం అయింది?
జ: పదేళ్ల వయసప్పటినుండీ ఇంట్లో పెద్దవాళ్ళు చదివే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వంటి మ్యాగజైన్లు చదవడం అలవాటయ్యింది. వాళ్లు సీరియల్ నవలలను బౌండ్ బుక్స్‌గా కుట్టుకొని ఒకరికొకరు మార్చుకొని చదువుకుంటూ ఉండేవారు. వేసవి సెలవుల్లో తోచక అవి కూడా చదవడం ఒక హాబీగా మారిపోయింది. గత 34 ఏళ్లుగా సాహితీసృజన వైపు ఉన్నప్పటికీ నిత్యం సాహిత్యపఠన కార్యక్రమం మాత్రం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అది ఒక ఊపిరిగా, ఆలంబనగా నాతో పాటే ఉంటుంది. కొత్తదో, పాతదో ఏదో ఒకటి చేతిలో, ‘పుస్తకం హస్త భూషణం’ అన్నట్టుగా ఎప్పుడూ ఉంటుంది. ఇంటి నిండా నా హ్యాండ్ బ్యాగ్‌లో కూడా పుస్తకాలే! అవే తోడూ నీడా అనుకుంటాను. పుస్తకాల్లో మనుషుల్నీ, తోటి మనుషుల్నీ సమానంగానే పరిగణిస్తాను.
ప్రశ్న16. రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ: ప్రస్తుతానికి మరో నాలుగు కథలు రాసి ఒక కథల సంపుటి వెయ్యాలి. మిగిలిన కాలమ్స్‌తో మరో కొత్త కాలమ్స్ బుక్ రావాలి. ఒక దీర్ఘ కవిత రాయాలని ఉంది. భవిష్యత్తులో ఏం రాస్తామో ఇప్పుడు చెప్పలేం! నిత్యం కొత్త అనుభవాలు ఎదురవుతాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు. నూతన సాహిత్యం వస్తూ ఉంటుంది. ప్రపంచం మారుతూ ఉంటుంది. ఆ అనుభవంతో కూడా ఏమైనా రాస్తామేమో తెలియదు. మన జీవనగమనం నిత్య పాఠశాల కదా! అది ఏం నేర్పిస్తుందో వేచి చూడాలి.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు అల్లూరి గౌరీలక్ష్మి గారూ.
అల్లూరి గౌరీలక్ష్మి: ‘కలర్‌ఫుల్ కదంబం’ అనే నా కొత్త పుస్తకంపై సమీక్షను ప్రచురిస్తూ, ఆ సందర్భంగా నాతో మాట్లాడించి నాకు మరొకసారి సాహిత్యావలోకనం చేసుకునే అవకాశం కల్పించిన సంచిక టీమ్‌కి నా ప్రత్యేక ధన్యవాదాలు.
***
రచన: అల్లూరి గౌరీలక్ష్మి
ప్రచురణ: చంద్రకాంతీ పబ్లికేషన్స్
పేజీలు: 120
వెల: ₹ 120/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
పి.ఎస్. గోపాలరాజు,
జి-4, సి-బ్లాక్,
వర్టెక్స్ ప్రిస్టైన్,
నిజాంపేట్ రోడ్, హైదర్‍నగర్,
హైదరాబాద్ – 500090.
ఫోన్: 9948392357
~
‘కలర్‍పుల్ కదంబం’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/colourful-kadambam-book-review-kss/

