[‘గురుదక్షిణ’ అనే కథాసంపుటి వెలువరించిన దినవహి సత్యవతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం దినవహి సత్యవతి గారూ.
దినవహి సత్యవతి: నమస్కారం.
~
ప్రశ్న 1: మీరు రచించిన 20 కథల సంపుటికి శీర్షికగా 3వ కథ ‘గురుదక్షిణ’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
ప్రశ్న 2: కవయిత్రిగా, కథా రచయిత్రిగా, నవలా రచయిత్రిగా, బాలసాహితీవేత్తగా, అనువాదకురాలిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: సాహితీరంగంలోకి నా ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగింది. బి.టెక్. చదువు ముగించి, ఇంజనీరుగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసాక, ఎం.సి.ఎ. చేసి ఉపాద్యాయవృత్తిలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్‌గా కొనసాగి, కుటుంబ కారణాల వలన ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. కానీ ఏదో ఒకటి చేయాలి అనే తపన మనసులో నిరంతరం కదలాడుతుండేది. అలాంటి సమయంలో టి.వి. లోని ఒక ప్రకటన నాలో ఆసక్తిని రేపి, దానిపైన వ్యాసం వ్రాసేలా పురిగొల్పింది. అలా ప్రప్రథమంగా, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో, ‘ఆలోచించండి’ అనే శీర్షిక ద్వారా నా సాహితీ ప్రయాణం ఆరంభించాను. ఆ వెనువెంటనే కథలు, వ్యాసాలు ప్రచురితమవడం నాలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేసింది. తదుపరి తెలుగువేదిక.నెట్ అనే అంతర్జాల పత్రికకు (ముంబై వాస్తవ్యులు మేడం రవీనాచవాన్ గారు, శ్రీ అవేరాగారు సంపాదకులుగా నడిచిన అంతర్జాల పత్రిక) కథలు పంపడం, అవి ప్రచురితం కావడం జరిగింది. ముఖ్యంగా కథలు, నాటికలు, పద్యరచన నాకు ఇష్టమైన సాహితీప్రక్రియలు. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. నూతన సాహితీప్రక్రియలు నేర్చుకుని వాటిలో రచనలు చేయాలనే ఆసక్తితోనే నానీలు, హైకూలు, తెలుగుదోహాలు, గజల్స్, పంచపదులు, సప్తపదులు, సిసింద్రీలు, అష్టపదులు.. ఇత్యాది నూతన ప్రక్రియలు నేర్చుకుని రచనలు చేసాను. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ కాటేగర్ పాండురంగ విఠల్ గారి సృజన, పంచపదుల ప్రక్రియ నేర్చుకుని, శ్రీమద్రామాయణం ఏడు కాండములలో మొదటిదైన ‘బాలకాండము’ పంచపదులలో వ్రాసాను. అలాగే సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ సుధామగారి సృజన, సప్తపదులనే నూతన ప్రక్రియ నేర్చుకుని, శ్రీ విహారిగారి పర్యవేక్షణలో, ‘సంక్షిప్తరామాయణం మరియు సుందరకాండము’ సప్తపదులలో వ్రాసాను.
అంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ నిర్వహించిన నాటిక పోటీలలో, ‘షరతు’ నాటికకు ప్రత్యేక బహుమతి లభించింది.
Women’s Era ఆంగ్లపత్రికలో ప్రచురణకై నేను వ్రాసిన ఆంగ్ల కథ ఎంపికైనది. త్వరలో ప్రచురించబడుతుంది.
బ్రౌన్ పబ్లికేషన్స్ వెలువరించిన ప్లానెట్స్ పాలెట్ట్ అనే ఆంగ్ల పుస్తకంలో నా ఆంగ్ల కవిత ప్రచురితమైంది.
ప్రశ్న 3: కవిత/కథానిక/నవల/అనువాదం – వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: ఎటువంటి ప్రక్రియలో రచనలు చేసినా పాఠకుల మనసులకు హత్తుకునేలా రచనలు చేయడం ముఖ్యం. కొంతమందికి కవితలు వ్రాయడం సులువనిపిస్తే, మరికొంతమందికి కథలు లేదా నవలలు వ్రాయడం తేలిక అనిపిస్తుంది. అయితే అన్నిటిలోనూ అనువాద ప్రక్రియ కష్టతరమని నా అభిప్రాయం, ఎందుకంటే మిగిలిన ప్రక్రియలలో రచయిత తన మనోభావాలని తాననుకున్న విధంగా వ్యక్తపరచగలరు కాని అనువాద ప్రక్రియలో, మూలరచనలో సదరు రచయిత వెలిబుచ్చిన భావాలని యథాతథంగా చెప్పగలగడం నిజంగా ఒక సవాలని నా అభిప్రాయం.
ప్రశ్న 4: మీరు త్రిభాషా రచయిత్రి. తెలుగు కాకుండా, హిందీ, ఇంగ్లీషులలో ఏ ప్రక్రియలలో రాశారు? వివరంగా చెప్పండి.
జ: ఇప్పటివరకు తెలుగులోనే ఎక్కువ రచనలు చేసాను. మాతృభాష తెలుగులో పదవ తరగతి వరకూ చదివి, ఆపై ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల ఆంగ్లభాషా జ్ఞానం అలవడింది. రాష్ట్రభాష హిందీ అంటే చిన్నప్పటి నుంచీ మక్కువ ఎక్కువ. చిన్నతనంలోనే దక్షిణభారత హిందీ ప్రచారసభ ద్వారా ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాషా పరీక్షలలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ఉద్యోగరీత్యా ఎక్కువకాలం ఉత్తరభారతదేశంలో ఉన్నందు వల్ల హిందీ భాషపై పట్టు ఏర్పడింది. ఆంగ్లం, హిందీ భాషలలో రచనలు చేయగలిగినప్పటికీ, ప్రచురణ మాధ్యమాల గురించి అవగాహన లేనందువల్ల వ్రాయడం జరగలేదు. ఈ మధ్యకాలంలో తపస్విమనోహరం అంతర్జాల వార, మాసపత్రికలు మరియు రవళి అంతర్జాల మాసపత్రిక ఆంగ్ల, హిందీ భాషలలో రచనలు ఆహ్వానించి, ప్రోత్సహిస్తూ ఉండడంతో ఆ భాషలలో కూడా కథలు, కవితలు, వ్యాసాలు వ్రాస్తున్నాను.
ప్రశ్న 5: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: కథా వస్తువు, శిల్పం, శైలి.. ఈ మూడూ కూడా ఒక కథని ఆసక్తిగా చదివించడానికి సమానంగా దోహద పడతాయని అనుకుంటాను. వీటిలో ఏ ఒక్కటి లోపించినా ఆ కథ అసంపూర్తిగానే ఉంటుందని నా అభిప్రాయం.
ప్రశ్న 6: “ఈ కథాసంపుటిలోని కథలన్నీ చిన్న చిన్న సంఘటనల నేపథ్యంలో సూటిగా సాగాయి” అని వ్యాఖ్యానించారు డా. ఎమ్. సుగుణరావు తమ ముందుమాటలో. కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత సన్నిహితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు, అభ్యర్థించిన వెంటనే ‘గురుదక్షిణ’ కథల సంపుటికి ముందుమాట వ్రాసి యిచ్చిన ‘కథామయుడు’ బిరుదాంకితులు శ్రీ సుగుణరావుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇక ఈ సంపుటిలోని కథలన్నిటికీ, నా చుట్టూ జరిగిన సంఘటనలు, జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలు, స్వీయ లేదా మిత్రులు తెలిపిన వారి అనుభవాలను కథా వస్తువులుగా ఎంచుకోవడం జరిగింది. ఎన్నుకున్న ఒక అంశాన్ని కథగా మలచాలని అనుకున్నప్పుడు, ముందుగా కథాశీర్షిక నిర్ణయించుకుని, దాని చుట్టూ కథని అల్లుతాను. ఇప్పటివరకూ దాదాపు అన్ని కథలూ ఆ విధంగానే వ్రాయడం జరిగింది, రెండు లేదా మూడు కథలు మినహాయించి.
ప్రశ్న 7: అయిదో ఆరో తప్పితే, మిగతా కథలన్నీ సుమారు మూడు – నాలుగు పేజీలలో ముగిసాయి. ఎంచుకున్న ఇతివృత్తాలకీ, సన్నివేశాల కల్పనకీ, క్లుప్తత ఆటంకం కాలేదా? క్లుప్తంగా రాస్తూనే కథను ప్రభావవంతంగా చెప్పడం ఎలా వీలయింది?
జ: ఎంచుకున్న ఇతివృత్తాని బట్టి, కథ ద్వారా తెలియజేద్దామనుకున్న సందేశాన్నిబట్టి, కథ నిడివి అమరేది. అందులో కొన్ని కథలు వివిధ పత్రికలు నిర్వహించే పోటీల కోసం వ్రాసినప్పుడు, పోటీ నియమాలు పాటించాల్సి వచ్చేది కనుక క్లుప్తత తప్పనిసరిగా అవసరమయ్యేది. ఒక చక్కని కథగా మలిచిన తృప్తి కలిగేవరకూ పలుమార్లు సవరణలు అవసరమయ్యేవి. ఆ పైన ఇంకా పదాల పరిమితి ఉంటే దానిని కుదించి మరింత క్లుప్తత తేవడంలో నిజంగానే కొంత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇందులో అన్ని కథలూ, మనసుకి ఆహ్లాదం కలిగించే కథలు అనే కితాబు అందుకున్నాయి. షరతు, పునర్జన్మ లాంటి కథలు పాఠకులనుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి.
ప్రశ్న 8: ‘థాంక్స్ నానమ్మ’ కథ ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంత అవసరమో చెబుతుంది. ఈ కథ నేపథ్యం గురించి చెప్తారా?
జ: ఆపత్కాల పరిస్థితులలో ఆడపిల్లలు తమని తాము రక్షించుకునేలా ఎప్పుడూ సన్నద్ధులై ఉండాలని నేను అభిప్రాయపడతాను. ఈ కథలోని ముఖ్యపాత్ర రమ్య, కరాటే నేర్చుకుంటానని అడిగినప్పుడు ఆమె తండ్రి నిరాకరిస్తాడు. కానీ రమ్య నాన్నమ్మ, మనుమరాలిని ప్రోత్సహించి, కాలమాన పరిస్థితులని బట్టి ఆడపిల్లలు ఆత్మరక్షణ పద్ధతులు తెలిసి ఉండాలని తన కొడుకుకి నచ్చజెప్పి ఒప్పిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నాన్నమ్మ, అమ్మమ్మ, తాతలు పిల్లలకి కేవలం మంచి విలువలను నేర్పించడమే కాకుండా, మారుతున్న కాలంతోపాటు తమని తాము మార్చుకుంటూ పిల్లలకి అండగా నిలబడతారని, అభ్యుదయభావాలు కలిగి ఉంటారని చెప్పాలన్నదే నా ముఖ్యోద్దేశం.
ప్రశ్న 9: ‘ప్రతిభ’ కథలోని ప్రతిభ స్వయంశక్తిని నిలువెత్తు నిదర్శనం. ప్రతిభ కల్పిత పాత్రా లేక నిజజీవితంలో మీకు తారసపడిన వ్యక్తా?
జ: వార్తాపత్రికలో వచ్చిన ఒక యథార్థ కథనం, ప్రతిభ పాత్రకి ప్రేరణ. పట్టుదల, కృషి ఉంటే ఎవ్వరికైనా అసాధ్యమన్నది లేదని నిరూపించిన ఒక పేదవిద్యార్థి జీవితాన్ని ఇతివృత్తంగా ఎంచుకుని, కొంత కాల్పనికతను జోడించి ఈ కథను వ్రాయడం జరిగింది.
ప్రశ్న 10: ‘పునర్జన్మ’ కథలో ఒక సైకాలజిస్టుగా అర్చన పాత్రని బాగా తీర్చిదిద్దారు. సైకాలజిస్టులు ఎవరైనా మీకు పరిచయం ఉన్నారా? మానసికశాస్రవేత్తల పనితీరుని గమనించడం కోసం ఏదైనా ప్రత్యేక అధ్యయనం చేశారా?
జ: మా అమ్మాయి, దినవహి శేషలక్ష్మీ అమూల్య, ఎం.ఎస్.సి. కౌన్సిలింగ్ సైకాలజీలో స్వర్ణపతక విజేత. నేను వ్రాసే కథలలో మానసిక సమస్యలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, ఆమెని సంప్రదిస్తూ ఉంటాను. నా కథను చదివి తగిన సూచనలు ఇస్తూ ఉంటుంది. వాటితోపాటు నేను కూడా ఆ విషయాలకి సంబంధించిన సమాచారం సేకరించి, చదివి, ఆకళింపు చేసుకున్నాకే కథలో పొందుపరచడం జరుగుతుంది.
ప్రశ్న 11: ‘క్షమా భిక్ష’ కథలో ఓ యాచకురాలు తనని క్షమించేందుకు ఎన్నో ఏళ్ళు వేచిచూస్తుంది నందిని. అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకునే క్రమంలో నందిని బిచ్చగత్తెను మన్నింపు కోరడంలో అభ్యంతరం లేకపోయినా, ఏళ్ళపాటు ఆ క్షమాపణకై/ఆ బిచ్చగత్తెకై ఎదురుచూడడం పాఠకులకు కాస్త అసహజంగా అనిపించే అవకాశం ఉంది కదా. దీని గురించి మీరేమంటారు?
జ: ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు లేదా తప్పు చేసామని గ్రహించిన తదుపరి కూడా తామెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అహంకరించినా, వాళ్ళ అంతరాత్మ మాత్రం నిరంతరం ప్రశ్నిస్తూ వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనీయదు. ఒక్కొక్కసారి ఆ క్షోభ ఎంతగా వాళ్ళని మథనపెడుతుందంటే, ఎవరితోనైతే ఆ విధంగా ప్రవర్తించామో వారిని కలిసి మన్నింపు కోరడమొక్కటే జీవిత లక్ష్యంగా మారి, తతిమా భౌతిక విషయాలపట్ల ఆసక్తి నశిస్తుంది. ఆ పశ్చాత్తాపం ఒక చెదపురుగులా వారి మనఃశరీరాలను తొలిచివేస్తుంది. ఆ వేదననే క్షమాభిక్ష కథలోని నందిని అనుభవించింది. ధనికురాలిననే అహంకారంతో బిచ్చగత్తెను నిందించింది నందిని. అయితే “మాకంటే పెద్ద బిచ్చగాళ్ళూ మీరే..”నన్న బిచ్చగత్తె పలుకులు ఆమె అహంకారాన్ని దెబ్బతీసి, ఉక్రోషాన్ని రగిలించాయి. ఆ ఆలోచనలతోనే నిద్రకుపక్రమించిన నందినికి, తను నమ్మిన దైవమే అపరిచితుడిలా వచ్చి తనని ప్రశ్నించినట్లుగా కలగని ఆత్మవిమర్శ చేసుకుని, తనవల్ల తప్పు జరిగిందని గ్రహించి, మనశ్శాంతిని కోల్పోయింది. తప్పు సరిదిద్దుకోవాలని ఎంతలా తాపత్రయపడిందంటే, బిచ్చగత్తె క్షమార్పణ ఒక్కటే తనకి మనశ్శాంతిని ఇవ్వగలదని గ్రహించింది. బిచ్చగత్తెని మళ్ళీ తన జీవితకాలంలోనే కలుసుకోగలగడం, ఆమె క్షమాభిక్ష పొందగలగడం నందిని అదృష్టమనే చెప్పవచ్చు.
కానీ అలా అందరి విషయంలోనూ జరుగుతుందని రూఢీగా చెప్పలేము. తప్పు గ్రహించి పశ్చాత్తాపానికి లోనైనా, మన్నింపుకోరుకునే అవకాశం మాత్రం కొందరికి వెంటనే లభిస్తే, కొందరికి జీవిత కాలం పట్టవచ్చు. కొంతమందికి అది కూడా లభించకపోవచ్చు జీవితకాలంలో!
ప్రశ్న 12: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: గురుదక్షిణ కథల సంపుటలోని కథలన్నీ (అలాగే ఇప్పటివరకూ నేను వ్రాసిన కథలన్నీ కూడా) నా మనసుకి దగ్గరైనవే అయినప్పటికీ, వాటిలోని ఒక కథ, జ్ఞాపకాల కడలిలో.. నా మనసుకెంతో దగ్గర, కారణం అది నేను వ్రాసిన మొదటి కథ కావడమే!
కథానేపథ్యం.. తొమ్మిది, పది తరగతులలో మాకు జీవశాస్త్రం బోధించిన టీచర్ శేషసరస్వతిగారు. పాఠ్యాంశాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత చక్కగా చెప్పడం ఆవిడ ప్రత్యేకత. అప్పుడే క్లాసులో రన్నింగ్ నోట్స్ (టీచర్ పాఠం చెప్తున్నప్పుడే ముఖ్యాంశాలని నోట్ పుస్తకంలో వ్రాసుకోవడం) వ్రాయడం అలవడింది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అప్పుడు తెలియకపోయినా, ఎప్పటికైనా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడమంటూ జరిగితే, ఆ విధంగా విద్యార్థులను ప్రభావితం చేసేలా బోధించాలని అనుకునేదాన్ని. విద్యాభ్యాసం ముగించి, కాలగమనంలో, కాలేజీ లెక్చరర్ పదవిని చేపట్టినప్పుడు, “మేడం మీరు ఎంతోబాగా చెప్తారు, మీ క్లాసులు ఉత్సాహకరంగా ఉంటాయి” అని విద్యార్థులు, “మేడం, మీరు ఏం మంత్రం వేస్తారో ఏమో కానీ మీ క్లాసుల్లో మాత్రం ఎప్పుడూ పూర్తి హాజరు ఉంటుంది.., మీరు చాలా బాగా బోధిస్తారని విద్యార్థులు చెప్తుంటారు..”. అనే సహోద్యోగుల ప్రశంసలూ విన్నప్పుడు, అది కీ.శే. శేషసరస్వతి టీచర్ ఆశీర్వాదమే అనిపించేది. శేషసరస్వతి టీచర్ గారి అంతిమ ఘడియల్లో ఆవిడని చూడగలిగే అవకాశం దక్కింది. మా పిల్లలు, ఫలానా టీచర్ చాలా బాగా చెప్తారమ్మా అని చెప్పినప్పుడల్లా, ఆవిడ జ్ఞప్తికి వచ్చి మనసు భావోద్వేగానికి లోనయ్యేది. అంతటి ఉత్తమగురువుకి నివాళిగా, ఈ కథను వ్రాయడం జరిగింది.
ప్రశ్న 13: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఇందులోని ఒక కథ, ‘కల నిజమాయెగా’, ట్రాన్స్‌జెండర్ జీవితాన్ని కథావస్తువుగా ఎంచుకుని వ్రాయడం జరిగింది. కథ వ్రాయడానికి కొంచం కష్టపడిన మాట నిజమే అయినా, దానికోసమై వారి జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను గురించిన నిజాలను తెలుసుకున్నప్పుడు కలిగిన వ్యథ ముందు ఆ కష్టం అణుమాత్రమే అనిపించింది. ఒక చక్కని ఇతివృత్తాని ఎంచుకుని కథ వ్రాసాను అనే తృప్తి కలిగింది.
ప్రశ్న 14: ‘గురుదక్షిణ’ పుస్తకం ప్రచురణ/ఆవిష్కరణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: గురుదక్షిణ కథల సంపుటి ఆవిష్కరణ, 2023వ సంవత్సరం వైజాగ్‌లో జరిగిన కథారవళి ఆత్మీయ సమావేశోత్సవంలో, ప్రఖ్యాత రచయిత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి చేతులమీదుగా జరిగింది.
2024 సంవత్సరంలో కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్యవేదిక, ప్రొద్దుటూరు వారినుండి గురుదక్షిణ కథల సంపుటికి ‘గౌరవపురస్కారం’ లభించడం అత్యంత ఆనందాన్ని కలిగించింది. పురస్కార మహోత్సవం జీవితంలో మరిచిపోలేని అనుభవం.
ఈ కథల సంపుటికి పాఠకుల ఆదరణ సంతృప్తికరంగానే ఉన్నది. ఈ పుస్తకం అచ్చంగాతెలుగు ప్రచురణల వెబ్ సైట్ లో లభ్యమౌతుంది.
ప్రశ్న 15: సాహిత్యపరంగా మీ రచనలకు / పుస్తకాలకు లభించిన గౌరవాదరాల గురించి చెప్పండి.
జ: నా ప్రథమ ముద్రిత బాలసాహిత్య పుస్తకం ‘చైతన్యదీపికలు’ నారంశెట్టి బాలసాహిత్యపీఠం ప్రశంసాపత్రం అందుకున్నది.
చైతన్యదీపికలు పుస్తకంలోని ఒక కథ, ‘దీక్ష’ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతి విద్యార్థుల ‘యువభారతి’ 2019- 20 వ సంవత్సరం, తెలుగు వాచకంలో, పాఠ్యాంశంగా చేర్చబడింది.
నా నవల ‘కొత్తకెరటం’ మనతెలుగుకథలు.కాం కథల పోటీలో ప్రోత్సాహక నగదు బహుమతి అందుకున్నది.
ఇవేకాక వివిధ పోటీలలో బహుమతి పొందిన కథలు, కవితలు పలుసంకలనాలలో చోటు చేసుకున్నాయి.
ప్రశ్న 16: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: పంచపదులలో బాలకాండము వ్రాసి పుస్తక రూపంలో తెచ్చిన తరువాత ప్రస్తుతం అయోధ్యకాండము వ్రాస్తున్నాను. మిగిలిన ఐదు కాండములు కూడా వ్రాయాలని సంకల్పం.
ఆటవెలది ఛందస్సులో సామాజిక శతకం వ్రాయడం జరిగింది. అలాగే ఒక భక్తి శతకం కూడా వ్రాయాలని కోరిక.
సమాజ హితమైన రచనలు చేయడం కొనసాగిస్తూనే, సాధ్యమైనన్ని నూతన సాహితీ ప్రక్రియలు నేర్చుకుని, వివిధ సాహితీప్రక్రియలతో ఒక పుస్తకం తేవాలన్నది కోరిక.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు దినవహి సత్యవతి గారూ.
దినవహి సత్యవతి: ధన్యవాదాలు.
***
రచన: దినవహి సత్యవతి
పేజీలు: 112
వెల: ₹ 125/-
ప్రతులకు:
దినవహి సత్యవతి
26-28-31/B,
గాయత్రిమాత దేవాలయం వీధి,
1వ లైను, ఏ.టి. అగ్రహారం,
గుంటూరు 522004
ఫోన్: 9790752180
~
ఆన్‌లైన్‌లో
https://books.acchamgatelugu.com/products/guru-dakshina-1?
~
‘గురుదక్షిణ’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/gurudakshina-book-review-kss/

