Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, ప్రచురణకర్త, సంపాదకులు శ్రీ ఎన్. కె. బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘జీవాళి’ అనే కథాసంపుటిని వెలువరించిన రచయిత శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, ప్రచురణకర్త శ్రీ ఎన్. కె. బాబు గార్ల ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

రచయిత శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారి ప్రశ్నలు జవాబులు:

సంచిక టీమ్: నమస్కారం ద్వారం దుర్గా ప్రసాదరావు గారూ.

ద్వారం దుర్గా ప్రసాదరావు: నమస్కారం.

~

విజయనగరం లో సంగీత కళాశాల, ద్వారం కుటుంబం నుండి ఆరుగురు అధ్యక్షులు గా ఇక్కడే పనిచేసారు.

ప్రశ్న: మీరు ప్రధానంగా సంగీత విద్వాంసులు. ఈ పుస్తకం రాస్తూంటే ఎలా అనిపించింది? ముఖ్యంగా, వెనుతిరిగి జ్ఞాపకాలను, అనుభూతులను, అనుబంధాలనూ స్మరిస్తూంటే ఎలా అనిపించింది?

జవాబు:  నమస్కారం. ‘సంచిక’ పత్రికలో చోటిచ్చినందుకు ధన్యవాదాలు. కళాకారులకు జ్ఞాపకాలూ, అనుభూతులు, అనుబంధాలూ ఊపిరి కూడానే ఉంటాయి. వెనుతిరిగి చూడడం అరుదు.

ఆలిండియా రేడియో లో రికార్డింగ్

ప్రశ్న: “ఈ పుస్తకం నాలుగు తరాల సంస్కృతికి, సంప్రదాయాలకు వారధిగా వుంటుందని భావిస్తున్నాను” అన్నారు. ఈ భావనను విపులీకరిస్తారా?

జవాబు:  మా కుటుంబంలోనే ద్వారం వారు నాలుగు తరాలుగా ఈ వయొలిన్ విద్యను ప్రాణాధారంగా చేసుకున్నాము. విజయనగరం మహారాజులు నాలుగు తరాల వారు మమ్మల్ని అభిమానించేరు. 200 సంవత్సరాలుగా ఈ తూర్పు ప్రజలు సంగీతాది కళల్ని గొప్ప రసజ్ఞుల లాగా ఆదరించేరు. మార్పులను కూడా కాలజ్ఞానుల లాగా ఆమోదించేరు.

వేద ఆశీర్వాదం తీసుకుంటూ

ప్రశ్న:  మీపై తీవ్రమైన ప్రభావం చూపిన కళాకారులెవరు?

జవాబు: మహా విద్యాంసులూ, అతి సామాన్యులూ, విద్యార్థులూ అందరూ తీవ్రమైన ప్రభావాలే చూపిస్తారు. సద్గురువులు వాటిని వడకట్టగలిగే జ్ఞానం, సాధన మార్గం ఉపదేశించడం వలన తీవ్రత తగ్గి సాధు స్వభావం ఏర్పడుతుంది.

ప్రశ్న:  మూగ చెవిటి పిల్లల ముందు మీరు చేసిన కచేరీ గురించిన సంఘటన అద్భుతంగా వుంది. ఆ సంఘటన గురించి, మీ అనుభూతి గురించి మరింత విపులంగా తెలుసుకోవాలని వుంది.

జవాబు: మూగ చెవివి పిల్లల ముందు కచేరీ కేవలం కల్పన. ప్రతీకలతో వ్యంగ్య కథనంతో పరిస్థితులను వివరించే రచన.

ప్రశ్న: మీరు అనేక కచేరీలు చేశారు. మారుతున్న శ్రోతల అభిరుచి గురించి, వారి అభిరుచికి తగ్గట్టు సంగీతంలో ప్రయోగాలు చేయటం గురించి వివరిస్తారా?

జవాబు: శ్రోతల అభిరుచుల్ని కళాకారులూ, విపణి, టెక్నాలజీ కలిసి వారి స్వంత లాభాలకై మారుస్తున్నారు.

కృతి కర్త, కృతిస్వీకర్త

ప్రశ్న: రోణంకి హృదయం విశ్వంభర అన్నారు. ఇంకొంచెం విపులీకరించండి.

జవాబు: రోణంకి జీవనమంతా కవిర్వానుభవం కోసమే. మాటలపై ఆధారపడినది కవిత్వం. మాటలు బహు భాషలు. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క సంగీతం. అనువాదాలలో ఆ సంగీతం, ఆ వ్యంగ్యం తెలియదు. కనుక ఆ అనుభావాల కోసం ఆ భాషలు నేర్చి ఆ కవిత్వాలను, కావ్యాలను వల్లె వేసి కంఠస్థం చేసి గానం చేసేవారాయన. ఇది కొంతవరకైనా విశ్వంభరత్వమని అనుకున్నాను.

ప్రశ్న: ఆలిండియా రేడియోలో మీరు కొన్ని తరాలవారిని చూశారు. మీరు రేడియోలో ఆ కాలంలో ప్రోగ్రాంలు చేసిన అనుభూతికి, ఇటీవలి కాలంలో అనుభూతికి ఎలాంటి మార్పు వుంది? ముఖ్యంగా రజనీకాంతరావు లాంటి వారితో పనిచేసిన తరువాత ఇతరులతో కలసి పనిచేయటం ఎలా అనిపిస్తుంది?

జవాబు: ఆకాశవాణిని మిగతా ఆధునిక మాధ్యమాలు త్రోసిరాజన్నాయి. ఇప్పుడు ఎ.ఐ.తో కలిసి పని చేస్తున్నారు విజ్ఞులు.

ప్రశ్న: మీ అనుభవాల్లో, ఉద్వేగాల్లో మీ జీవన సహచరి సమాన భాగస్వామి అన్నారు. ఏ రకంగా మీ ఎదుగుదలలో ఆవిడ తోడ్పడిందో కొన్ని ఉదాహరణలతో చెప్పండి.

జవాబు: మాటల్లో చెప్పలేను.

ప్రశ్న: సరస్వతి ఈనాడు జేబులో డిజిటల్ బొమ్మ అన్నారు. దీన్ని ఇంకొంచెం వివరిస్తారా?

జవాబు: గురువు ఈనాడు చెప్పుచేతల్లోకి, జేబుల్లోకి వచ్చిన మహనీయ సెల్ ఫోన్ అన్నాను. సరస్వతీ బజారు శ్రీ అత్తలూరి నరసింహారావు గారు రాసిన గొప్ప పుస్తకం.

ప్రశ్న: ఆనాటి సంగీత కళాకారులకు, ఈనాటి సంగీత కళాకారులకు మీరు గమనించిన తేడాలేమిటీ?

జవాబు: ఆనాటి కళాకారులందరూ సర్వస్వతంత్రులు.

ప్రశ్న: సింథసైజర్ లాంటి వాటి ద్వారా ఈనాడు అన్ని వాయిద్యాల శబ్దాలు సృష్టిస్తున్నారు. ఇది వాయిద్యకారులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది?

జవాబు: సింథసైజర్ లాంటి డిజిటల్ పరికరాలు శబ్దాలను సృష్టించగలవు – నాదాన్ని కాదు. జనసామాన్యం పైన అని చూపే ప్రభావాలపై పరిశోధన, చర్చ, కార్యక్రమం ముఖ్యం.

ప్రశ్న: ఆధునిక కాలంలో గతంలోలా సంగీత విద్యాంసులకు ఆదరణ, గౌరవాలు లభిస్తున్నాయా? లేకపోతే ఎందుకు?

జవాబు: కళలకు ఆదరణ, గౌరవాలు, నేర్పరితనం, ప్రదర్శనకు అవకాశాలూ, పూర్వం కంటే వేల రెట్లు అధికంగా ప్రస్తుతం ఉన్నాయి. ప్రజాస్వామికం అయ్యింది చాలావరకూ కళ కూడా.

ప్రశ్న: భవిష్యత్తు ప్రణాళికలేమిటి? మీ జీవిత చరిత్ర రచించే ఉద్దేశం వుందా?

జవాబు: మహామహుల చరిత్రలే మాయమైపోతున్నాయి. నాది అతి సాధారణమైన జీవనం, ప్రణాళికలు లేవు భవిష్యత్తు కోసం.

ప్రశ్న: ఇంతవరకూ మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి.

జవాబు: కొద్ది వ్యాసాలు. కొన్ని జర్నల్స్‌లో. ‘రంగులు – రచనలు’ అనే బొమ్మలు – పద్యాలు పుస్తకం ఎన్. కె. పబ్లిషర్స్ వారిదే.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు ద్వారం దుర్గా ప్రసాదరావు గారు.

ద్వారం దుర్గా ప్రసాదరావు: కృతజ్ఞతలు.


ప్రచురణకర్త, సంపాదకులు శ్రీ ఎన్. కె. బాబు గారి ప్రశ్నలు జవాబులు:

సంచిక టీమ్: నమస్కారం ఎన్. కె. బాబు గారూ.

ఎన్. కె. బాబు: నమస్కారం.

~

ప్రశ్న: ‘జీవాళి’ (సంగీత సాహిత్య జీవన అనుభవాలు) అన్న పుస్తకం ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జవాబు: ద్వారం దుర్గా ప్రసాదరావు గారు నాకు పరిచయం అయిన నాటి నుండి వారిని కలిసినపుడంతా వారు వారి సంగీత, సాహిత్య జీవన అనుభవాలను, ఎంతో వివరంగా చెప్పుతుండేవారు. అవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఉండేవి. అవి భావితరాలకు తెలియవలసి వున్నదన్న ఆలోచన నాకు కలిగింది. ఈ వివరాలన్ని కూడా విజయనగరం సంస్కృతి, సంప్రదాయం, మరియు ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని విశదీకరించేలా వున్నాయనిపించింది. ఆ అనుభవాలన్ని అక్షర రూపంలో అందించి రికార్డు చేసినట్లయితే అది విజయనగరం యొక్క బయోగ్రఫీలో కొంత భాగం అవుతుందని భావించాను. వారిని వ్రాయమని కోరగా, అంగీకరించి. వ్రాసారు. ఆ వెంటనే ప్రచురణ చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్రశ్న: ఈ ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టారు?

జవాబు: పుస్తకం వ్రాయించాలన్న ఆలోచన రాగానే వారిని సంప్రదించాను. పుస్తకం అవసరాన్ని వివరించాను, దాంతో ఆయన కన్విన్స్ అయ్యారు. అప్పటినుండి వారిని కలిసినప్పుడంతా మాటల సందర్భంలో ఎంతవరకూ వచ్చింది సార్, ఏమిటి వ్రాస్తున్నారు అంటూ అడుగుతూ ఉండేవాణ్ని. ఇదంతా వ్రాయడానికి వారికి నాలుగేళ్ళు పెట్టింది.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జలజాక్షి గారు. పబ్లిషరు, రచయిత, కృతి స్వీకర్త, సహా సంపాదకులు మోదుగుల రవికృష్ణ.

ప్రశ్న: మీరు అర్థం చేసుకున్నంతలో ద్వారం దుర్గా ప్రసాదరావు గారి వ్యక్తిత్వం గురించి చెప్పండి.

జవాబు: వారిది గొప్ప వ్యక్తిత్వం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవ్వరినీ నొప్పించడం తెలీదు. ద్వారం వారు పుట్టుక తోనే గొప్ప పేరున్న కుటుంబంలో పుట్టారు. వీరి పూర్వీకుల నుండి కూడా, ఉన్నత తరగతికి చెందిన కుటుంబాలైన కారణంగా, మంచి హుందా అయిన వ్యక్తిత్వం వీరిది. వీరి నడవడికలోనూ మాటల్లోను హుందాతనం కనిపిస్తుంది.

వీరి తాతగారు, తండ్రిగారు, చిన తాతగారు, వారి సంతితి – అందరూ కూడా వయొలిన్ విద్యార్థులు అయినందున వీరు జన్మతః వయొలిన్ వింటూనే వున్నారు. తాతగారి నుండి, స్వయంగా తండ్రిగారి నుండి వయొలిన్ విద్యను అభ్యసించడం, అలాగే, వయొలిన్ సాధనలను ప్రతి నిత్యం వినడం, వీరు కూడా సాధన చేయడంతో.. ప్రముఖ వాయులీన విద్వాంసులు కాగలిగారు. వీరు ఏం మాట్లాడినా, అందులో నాకు మన చరిత్ర, నాగరికత, సాహిత్యం, కళలు, వ్యక్తిత్వ వికాసం కనిపిస్తాయి. అందుకు వారితో మాట్లాడడానికి ఎప్పుడూ ఇష్టపడతాను. వారిలో నిబద్ధత నాకెంతో నచ్చుతుంది. ఉదాహరణకు. మా మాటల్లో ఏదయినా ఓ మాటకు అర్థం ఇది అన్నామనుకోండి అది తప్పు అయితే, ఆ మాట అది కాదండి, ఇది అని చెపుతారు, దానికి నిదర్శనం కూడా చూపిస్తారు. అలాగే ఏదయినా పొరపాటుగా చిన్న మాటకు తప్పు  అర్థం చెప్పారనుకోండి, అది మళ్ళీ శోధించి కరెక్ట్ చేసుకొని తిరిగి పోన్ చేసి, “సారీ అండీ ఆ మాటకు అర్థం పొరపాటుగా చెప్పాను, సరయిన అర్థం ఇందాక అన్నదే కరెక్ట్” అని ఎంతో హుందాగా చెప్పుకునే తత్వం వారిది.

ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. ఆదరిస్తారు. ఎంత చిన్నవారినైనా చాలా గౌరవంగా సంబోధిస్తారు. వారు మల్టీ-టాలెంటెడ్ పర్సనాలిటీ గల వ్యక్తి.

సంగీతం ప్రధానంగా అందరికీ తెలిసినదే, సంగీత రంగంలో వారి 11 ఏళ్ళ వయస్సు లోనే ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన అఖిల భారత సంగీతి సమ్మేళనంలో పురస్కారాన్ని పొందారు. వారి సంగీత సేవలను గుర్తించి కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి అత్యున్నత పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నారు.

వీరు మంచి చదువరి. అనేక ఉన్నత విలువలు గల ఆంధ్ర ఆంగ్ల సాహిత్యాన్ని అనువాద సాహిత్యాన్ని చదువుకున్నారు. వీరి స్వంత గ్రంధాలయంలో వేల కొలదీ పుస్తకాలున్నాయి.

వీరు కవిత్వం, కథలు రాస్తారు, అనువాదాలు చేస్తారు. వీరు ప్రముఖ చిత్రకారులు అంట్యాడ పైడిరాజు గారి నుండి చిత్రకళను అభ్యసించడంతో శిల్పకళలోనూ, చిత్రకళలోను మంచి ప్రవేశం వుంది. వారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మా పబ్లికేషన్ ‘రంగులు – రచనలు’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. వీరి కుటుంబమే మంచి సంస్కారాన్ని కలిగిన కుటుంబం. వీరి కుటుంబంలో అందరు కూడా మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉంటారు. వీరంతా మంచి హోస్ట్‌లు. ఆతిథ్యం ఇవ్వడంలో గొప్పగా వుంటారు. వీరింటిలో రుచికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు నా అదృష్టం కొద్దీ నాకెప్పుడూ అందుతుంటాయి.

ఇన్ని సుగుణాలు గల వీరితో నాకు పరిచయం కలగడం నా అదృష్టం కాక మరేమిటి? వారిని ఆవిష్కరించడంలో నాకున్న జ్ఞాన పరిమితి ఇంతే.

సభలో ప్రసంగిస్తున్న పబ్లిషర్ & ఎడిటర్ ఎన్. కె. బాబు

ప్రశ్న: మామూలుగా రాసే జీవిత చరిత్రలకు భిన్నంగా కేవలం రచయిత కలసిన గొప్ప వ్యక్తులతో ఉన్న జ్ఞాపకాలను మాత్రమే రాయించటానికి కారణం ఏమిటి?

జవాబు: ముందుగానే చెప్పినట్లు వీరి అనుభవాలను, వీరికున్న అభిప్రాయాలను, వీరి సాహిత్య అభిలాషను, పంచుకుంటే అదే వీరి జీవిత చరిత్ర అవుతుంది. సాధారణంగా మనం చదివే జీవిత చరిత్రలు పుట్టినప్పటి నుండి ప్రారంభం అవుతాయి. వారి మాటల్లోనే అలా సాగుతూ వుంటుంది. కానీ అందుకు భిన్నంగా ఓ కొత్త ఒరవడితో ఈ పుస్తకం వుండాలని భావించాను. వారి జీవన అనుభవాలే కాకుండా వారి సాహితీ సృజను కూడా జోడించాను. నిజానికి ఈ పుస్తక రచన మాత్రమే కాకుండా రూపకల్పన కూడా రచయితదే. అయితే, నా అభిరుచికి అణుగుణంగా వారు పుస్తక రూపకల్పన చేయడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రశ్న: జీవాళిఅన్న పేరు సంగీతంతో పరిచయం ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. ఈ పేరు అర్థం, ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టటం వెనుక ఉన్న ఆలోచనను వివరించండి.

జవాబు: ‘జీవాళి’ అంటే ఏమిటో మొదట్లోనే రచయిత వివరించారు. జీవాళి వ్యుత్పత్తిని వివరిస్తూ, మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చే తెలియజేశారు. వారి జీవన పరిమళమే ‘జీవాళి’. ఈ పుస్తకానికి ఇంత కంటే గొప్ప పేరు వుండదు. ప్రచురణకర్తనే గానీ, ఎక్కడా ఈ పుస్తక రూపకల్పనలో రచయితతోను సంపాదకులతోనూ, జోక్యం చేసుకోలేదు. నాకు పబ్లిషర్‌గా ఓ సౌలభ్యం ఏమిటంటే, ఈ పుస్తకానికి ప్రధాన సంపాదకుడిని కూడా నేనే. నా సహసంపాదకులు మోదుగుల రవికృష్ణ గారి తోడ్పాటు ఎంతో వుంది.

సభలో ప్రసంగిస్తున్న శ్రీ మోదుగుల రవికృష్ణ

ప్రశ్న: ఈ పుస్తకం ద్వారా మీరు సమాజానికి ఎలాంటి ప్రయోజనాన్ని అందించాలని భావిస్తున్నారు?

జవాబు: పై నున్న ప్రశ్నలలో ఒకదానికి సమాధానంలో చెప్పినట్లు ఇది విజయనగరం ఆటోబయోగ్రఫీలో బాగంగా కూడా చేసుకోవచ్చు అని. అంతే కాకుండా ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత విలువలు ఎలా పాటించాలో, జీవితం ఎలా కొనసాగించాలో కూడా ఈ పుస్తకం నేర్పుతుందని భావించాను. ఈ పుస్తకం ద్వారా రచయితను తెలుసుకోవడమే కాదు, మనం ఎలా ఉండొచ్చో కూడా నేరుకోవచ్చు, మనకు పరిచయం లేని అనేక వందల మందిని వ్యక్తిత్వాలను తెలుసుకోవడాని ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.

అభినందనలు అందుకుంటున్న ద్వారం దంపతులు

ప్రశ్న: మీ ప్రచురణ సంస్థల వచ్చిన పుస్తకాల గురించి చెప్తారా? అలాగే మీరు భవిష్యత్తులో ఎలాంటి పుస్తకాలు ప్రచురించాలని అనుకుంటున్నారు?

జవాబు: నా ప్రచురణ సంస్థ నుండి ఇప్పటికే అనేక మంచి పుస్తకాలను ప్రచురించి, మంచి అభిరుచి గల సంస్థగా పాఠక లోకాన్నుండి ప్రశంసలు పొందాను. డా॥ ఉపాధ్యాయుల అప్పల నరశింహమూర్తి గారి రచనలు ‘కన్యాశుల్కం – ఆధునిక భారతీయ నాటకాలు ఓ పరిశీలన’ అనే ప్రసిద్ధ గ్రంధాన్ని 2007 లో ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించాను. అలాగే ‘మహాభారతం- షానామా’, ‘కళాపూర్ణోదయం – పింగళి సూరన’, వారి స్మరణికగా ‘పరిణిత భారతీ’, చాగంటి తులసి గారి ‘యాత్ర’ నవల; ద్వారం వారిదే ‘రంగులు – రచనలు’, డా. డి. వి. జి. శంకర రావుగారి కవిత్వం, డా. రామసూరి గారి ‘అట్టహాసం’ కవిత్వంతో పాటు శ్రీరంగం నారాయణబాబు ‘రుధిరజ్యోతి’ – కవిత్వం, డా. దావులూరి కృష్ణకుమారి గారి ‘స్త్రీపర్వం’ వ్యాస సంకలనం; డా. నాగసూరి వేణుగోపాల్ గారి మీడియాపై 10 పుస్తకాలతో పాటు ప్రకృతి పర్యావరణం, పర్యావరణం సమాజం; అలాగే గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు, గొరుసు జగదీశ్వరరెడ్డి, కె.వరలక్షి గార్ల కధా సంపుటులు ప్రచురించాను.

ప్రస్తుతం ఆరేళ్ళుగా ‘నాకు నచ్చిన నా కథ’ పేరిట ఇప్పటికి 9 సంకలనాలు కథకుల పరస్పర సహకారంతో ప్రచురించాను. ఈ ప్రక్రియా ఇలా కొనసాగుతూనే వుంటుంది. ఇలా మా ప్రచురణ సంస్థ తెలుగుతో పాటు Gurajada Life and Works, Adibhatla Life and Works అనే ఇంగ్లీషు పుస్తకాలు; వెన్నెల పూలు, వెన్నెల కధలు, వెన్నెల బుజ్జాయిలు పేర్లతో బాలసాహిత్యాన్ని మొత్తంగా 54 పుస్తకాలు ప్రచురించి, అభిరుచి గల ప్రచురణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఇలాగే మంచి సాహిత్యాన్ని, పాఠకలోకానికి అందించాలన్నదే నా అభిలాష.

ప్రశ్న: తెలుగులో ఒకవైపు పుస్తకాలు అమ్ముడుపోవటంలేదని కొందరంటున్నారు. మా పుస్తకాలు లక్షల్లో అమ్ముడుపోతున్నాయని కొందరంటున్నారు. మరికొందరు, ఒక యాభై కాపీలు అచ్చువేసేసి, అఖండ ఆదరణ లభిస్తోంది, రెండవ ఎడిషన్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచురణకర్తగా అమ్మకాలపై, ఆబద్ధపు ప్రచారాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీ పుస్తకాల అమ్మకాలెలా వుంటున్నాయి. మీరు ప్రచారం ఎలా చేస్తారు?

జవాబు: పుస్తకంలో మంచి కంటెంట్ వుండి, అది రివ్యూల రూపంలో పాఠకులకు చేరితే, తప్పకుండా పాఠకులు ఆ పుస్తకాన్ని అందిపుచ్చుకుని ఆదరిస్తారు. ప్రస్తుతం ప్రింట్ పత్రికలు కరువయ్యాయి, ఉన్నవాటిలో ఒకటి రెండు తప్ప మిగతా  వాటిలో సాహిత్యానికి చోటు లేకుండా వున్నాయి. సాహిత్య పత్రికలు తగినన్ని లేవు. వెబ్ పత్రికలు కూడా వేళ్ళ మీద లెక్కబెట్టేవే వున్నాయి. అవి కూడా అన్నివర్గాల పాఠకులకు అందుబాటులో లేవు. కేవలం సాంకేతికతను అంది పుచ్చుకున్న పాఠకులకే లభ్యం అవుతున్నాయి.

కొందరు పాపులర్ రచయితలు కమర్షియల్ సాహిత్యం నుండి కెరీర్ డెవలెప్‌మెంట్ కంటెంట్ అందిస్తూ మరింత కమర్షియల్ రైటర్స్ అయ్యారు. అలాగే అనువాద సాహిత్యం కూడా కెరీర్ డెవలప్‍మెంట్ కంటెంట్‌కే 95% పరిమితమయ్యింది. ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో ‘ఆన్‍లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్’లు వచ్చాక, ఇంటి వద్దకే పుస్తకం వస్తుండడంతో, అప్‍లోడ్ కాబడిన పుస్తకాలు, మాత్రమే అమ్ముడవుతున్నాయి. కొన్ని పుస్తకాలలోని కంటెంట్ ఎలా వున్నా ప్రమోషన్ మోడ్‌లో ఉండడం వలన పుస్తకం కోసం వెదకగానే అవి కనిపిస్తూ, అమ్మకాలు చేసుకుంటున్నాయి. ఇలా వివిధ రకాల కారణాలతో పుస్తకం, అన్ని వర్గాల పాఠకులకు చేరడం లేదు. ఇందులో చాలా అసమతుల్యత వుంది.

ప్రచురణకర్తలను, రచయితలను – బుక్ సెల్లర్స్‌లో, ఒక్కరు తప్ప, మిగతా వారు దోచుకుంటున్నారు తప్ప మళ్ళీ పుస్తకాలు వేసే సాహసం చెయ్యనిచ్చే విధంగా వుండడం లేదు. బుక్ సెల్లర్‌కి 50% రాయితికి పుస్తకాలను ప్రచురణకర్త లేదా రచయిత స్వంత ఖర్చుతోనే పంపించాలి. ఆరు నెలలైనా, సంవత్సరమయినా, రెండళ్ళయినా, బుక్ సెల్లర్స్ నుండి ఎలాంటి స్పందన ఉండదు. ప్రచురణకర్త లేదా రచయిత బుక్ సెల్లర్‌ని ఫోన్‍లో సంప్రదిస్తే సరయిన సమాధానం వుండదు, ఒకవేళ ఫోన్‍లో జవాబు చెప్పవలసి వస్తే చూస్తాం, చూడాలి అనే సమాధానమే వస్తుంది. బుక్ సెల్లర్‌కి బుక్స్ పంపడం కంటే మానుకోవడమే మంచిది అన్న నిర్ణయానికి వచ్చేస్తాడు ప్రచురణకర్త.

లెక్కలు చూసి, ప్రతి యేటా ప్రచురణకర్తకు ఇవ్వవలసిన 50% సొమ్ము చెల్లించినట్లయితే, మరో పుస్తకం ప్రచురించడానికి ఉత్సాహం చూపిస్తాడు. మళ్ళీ బుక్స్ పంపిస్తాడు. దాంతో పాఠకులకు కొత్త పుస్తకం చేరుతుంది. దాంతో 50% బుక్ సెల్లర్‍కి వస్తుంది. ఇంత చిన్న లాజిక్ బుక్ సెల్లర్ ఎందుకు గమనించడో అర్థం కాదు. నా గురించే చూస్తే – విశాలంధ్ర, ప్రజాశక్తి వాళ్ళు నాకు 2012 నుండి లెక్క చెప్పడం లేదు; చూస్తాం. చూస్తాం అంటూనే వున్నారు.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎన్. కె. బాబు గారు.

ఎన్. కె. బాబు: ఇంటర్వ్యూ చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

***

జీవాళి (సంగీత, సాహిత్య, జీవన అనుభవాలు)
రచన: ద్వారం దుర్గా ప్రసాదరావు
ప్రచురణ: ఎన్. కె. ఎన్.కె. పబ్లికేషన్స్, విజయనగరం.
సంపాదకులు: ఎన్. కె. బాబు
సహ సంపాదకులు: మోదుగుల రవికృష్ణ
పేజీలు: 354
వెల: ₹ 600
ప్రతులకు:
ఎన్.కె. పబ్లికేషన్స్,
24-8-1, సమీరా రెసిడెన్సీ,
విజయనగరం 535002
Ph: 9440343479

 

~
‘జీవాళి’ పుస్తకం సమీక్ష లింక్:
https://sanchika.com/jeevaali-book-review-st/

Exit mobile version