[2026 మార్చ్ 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘శ్రీరాముడి న్యాయ విచారణ’ అనే పౌరాణిక కథని పాఠకులకు అందిస్తున్నాము.]
శ్రీరాముడి వనవాసం ముగిసి అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన రాజు కాగానే ప్రజలందరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. శ్రీరాముడి రాజ్యంలో పురుషులందరూ ధర్మపరులే! స్త్రీలందరూ పతివ్రతలే! తల్లిదండ్రులు జీవించి ఉండగా పుత్రులు అకాల మరణం చెందటం ఎక్కడా జరగలేదు. కరువుకాటకాలు, వ్యాధులు మొదలైనవి ఏమీ లేకుండా ప్రజలందరూ ధనధాన్య సమృద్ధులై సుఖంగా జీవిస్తున్నారు.
శ్రీరాముడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి, సంధ్యావందనం వంటి విధ్యుక్త ధర్మాలు నిర్వర్తించి సభకు వస్తాడు. ఆ సభలో భృగువు, అంగీరసుడు, వశిష్ఠుడు, కశ్యపుడు వంటి మహర్షులు, వ్యవహార దక్షులైన మంత్రులు, నీతి శాస్త్ర విశారదులైన పెద్దలు మొదలైన వారందరితో కూడి దేవసభను తలపిస్తూ ఉంటుంది. లక్ష్మణుడు ప్రతిరోజూ ద్వారం దగ్గర నిలబడి కార్యార్థులు ఎవరైనా ఉంటే సభకు తోడ్కొని వస్తాడు. రాముడు న్యాయ విచారణ చేస్తూ ఉంటాడు. సాధారణంగా అలా ‘నా సమస్య ఇదీ’ అంటూ వచ్చేవారు ఎవరూ ఉండరు. రాజ ధర్మంగా మాత్రమే రాముడు లక్ష్మణుడిని నియోగిస్తాడు.
ఆ రోజు కూడా ఎప్పటి లాగే రాముడు “లక్ష్మణా! నువ్వు ముఖద్వారం దగ్గరకు వెళ్లి ‘నాకు ఈ పని కావాలి’ అని ఎవరైనా వస్తే ఇక్కడకు తీసుకునిరా!” అని ఆజ్ఞాపించాడు.
లక్ష్మణుడు సరే నని ముఖద్వారం దగ్గరకు వెళ్ళాడు. జార చోర భయాలు లేక సుఖజీవనులై ఉండటం వలన అక్కడకి కార్యార్థులు ఎవరూ రాలేదు. కొద్ది సేపు నిలబడి ఎదురుచూసిన తర్వాత తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో అక్కడికి ఒక శునకం వచ్చింది. “నీకు కావలసిన పని ఏమిటి? నిస్సంకోచంగా చెప్పు” అన్నాడు లక్ష్మణుడు.
అప్పుడు శునకం మానవభాషలో “శ్రీరాముడు ఎటువంటి క్లిష్ట సమస్యనైనా అవలీలగా సాధించగలడు. ఆ స్వామితో స్వయంగా విన్నవించుకోవడానికి వచ్చాను. కానీ దేవుడి మందిరంలో, బ్రాహ్మణుడి ఇంటిలో, రాజభవనం లోనూ సూర్యుడు, వాయువు, అగ్ని వంటి దేవతలు ఉంటారు అని అంటారు. నా వంటి అధమ జాతికి చెందిన ప్రాణికి అందులోకి ప్రవేశం లేదు. శ్రీరాముడి ఆజ్ఞ లేకుండా నేను సభలో ప్రవేశింపలేను. కాబట్టి ఈ విషయం ఆయనకు తెలియజేయండి” అని అన్నది.
లక్ష్మణుడు సభలోకి వెళ్లి శునకం చెప్పిన మాటలు రాముడితో చెప్పాడు. “కార్యార్థులై ఎవరు వచ్చినా వారిని వెంటనే లోపలి తీసుకుని రా!” అని అన్నాడు రాముడు.
లక్ష్మణుడు మళ్ళీ ద్వారం దగ్గరకు వెళ్లి ఆ మాటలు చెప్పి శునకాన్ని సభలోకి తీసుకుని వచ్చాడు. “ప్రణామాలు శ్రీరామా!” అన్నది శునకం.
“శ్వానమా! నువ్వు నిర్భయంగా నీ సమస్య చెప్పు” అన్నాడు రాముడు.
“ప్రభూ! ప్రజలకు రాజు తండ్రి వంటివాడు. రాజే ప్రజల మంచి చెడ్డలకు కర్త. ప్రజలు నిద్రాణావస్థలో ఉన్నా, రాజు జాగరూకుడుగా ఉండాలి. రాజు ధర్మాన్ని అనుసరిస్తే అతని శత్రువులు అణగారిపోతారు. సమస్త ధర్మాలకు నువ్వే ఆదర్శప్రాయుడివి. నీ మార్గాన్నే సత్పురుషులు అనుసరిస్తూ ఉంటారు. నువ్వు సముద్రుడిలా గంభీరంగా కనిపించినా గుణనిధివి.”
“ఇంకా స్తోత్ర పాఠాలెందుకు? నీకిక్కడ ఏ ఆపదా రాదు. నిస్సందేహంగా నీ సమస్య చెప్పు.”
“రఘునాయకా! సర్వార్థ సిద్ధుడు అనే భిక్షువు ఒక బ్రాహ్మణ గృహంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఉదయం నా తప్పు ఏమీ లేకపోయినా అకారణంగా నా తల మీద కర్రతో కొట్టి గాయం చేశాడు. నిరపరాధులకు న్యాయం చేస్తావనే నమ్మకంతోనే నేనిక్కడికి వచ్చాను” అన్నది.
“ఆ భిక్షువు ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి తీసుకురండి” అని భటులను ఆజ్ఞాపించాడు రాముడు. భటులు వెంటనే ఆఘమేఘాల మీద వెళ్లి ఆ బ్రాహ్మణ భిక్షువుని తీసుకువచ్చారు.
“నువ్వు కర్రతో ఈ శునకాన్ని అకారణంగా కొట్టావట. ఇది నీకు చేసిన అపకారం ఏమిటి? ఏ కారణంతో దండించావు?” అని అడిగాడు రాముడు.
“స్వామీ! నేను ప్రతిరోజూ భిక్షాటన చేసి జీవిస్తూ ఉంటాను. ఈ రోజు నా దురదృష్టం ఏమిటో గానీ ఎక్కడా భిక్ష దొరకలేదు. అసలే నేను ఆకలితో నకనకలాడుతూ ఉంటే ఈ కుక్క నా దారికి అడ్డు వచ్చింది. ‘తొలగిపో, తొలగిపో’ అని నేను మందలిస్తూ ఉన్నా తప్పుకోకుండా ఇది స్వేచ్ఛగా తిరుగుతూ అడ్డు వచ్చింది. ఆకలి బాధతో ఉన్న నాకు చాలా కోపం వచ్చింది. నిగ్రహించుకోలేక క్షణికావేశంలో కొట్టాను” అన్నాడు సర్వార్థ సిద్ధుడు.
“ఓయి ద్విజుడా! క్రోధం అనేది పైకి మిత్రుడిలా కనబడుతూ ఉండే శత్రువు వంటిది. ఎన్ని సద్గుణాలు ఉన్నా క్రోధం వల్ల అవన్నీ నిష్పలం అవుతాయి. మనో నిగ్రహం లేని వాడికి అనేక కష్టనష్టాలు, అనర్థాలు కలుగుతాయి. కోపాన్ని నిగ్రహించుకుని మనసు చేత, వాక్కు చేత, కర్మల చేత తోటి వారికి మంచి చేసేవాడికి ఎలాంటి పాపాలు అంటవు.. సరే! సభాస్తారులారా! సాపరాధికి ఎలాంటి దండన విధిస్తే సముచితంగా ఉంటుందో చెప్పండి” అన్నాడు రాముడు.
సభలో వారంతా రాజధర్మం తెలిసిన వారు. సర్వ శాస్త్రాలు చదివిన వారు. “ప్రభూ! బ్రాహ్మణుడికి మరణ శిక్ష విధించకూడదు అని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి” అన్నారు ఒకరు.
“రాజు ప్రజలందరినీ శాసించేవాడు. ఈ విషయంలో మేము చెప్పేది ఏమున్నది? మీరే నిర్ణయించండి” అన్నారు మరొకరు.
“‘యథాపరాధ దండానాం’ అన్నట్లు న్యాయశాస్త్ర కోవిదులైన రఘువంశ రాజులు అపరాధానికి తగినట్లుగానే దోషులను శిక్షిస్తారు. మీరే ధర్మనిర్ణయం చేయండి” అన్నారు ఇంకొకరు.
అప్పుడు శ్రీరాముడు “ఇక్కడికి కొద్ది దూరంలో కౌలంచర మఠం అనే మఠం ఉన్నది. ఈ బ్రాహ్మణుడిని ఆ మఠానికి అధిపతిగా చేస్తున్నాను” అని ప్రకటించి అప్పటికప్పుడు అతడిని అభిషిక్తుని గా చేశాడు. సర్వార్థ సిద్ధుడు ఎంతో సంతోషంతో ఏనుగు మీద ఎక్కి అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు.
రాముడు చేసిన పనికి సభికులు అందరూ ఆశ్చర్య పోయారు. భిక్షువు వెళ్ళేదాకా నిగ్రహించుకుని, అతడు వెళ్ళిన తర్వాత “రామా! ఆ సిద్ధుడిని మఠాధిపతిగా చేశావు. అది అతడికి సన్మానం అవుతుంది గానీ, శిక్ష ఎలా అవుతుంది?” అని అడిగారు.
“నీతిశాస్త్రం లోని లోతుపాతులు మీకు బాగా అర్థం కాలేదు. దేవాలయ ద్రవ్యం, బ్రాహ్మణుల ధనం, స్త్రీల ధనం, బాలల ధనం అపహరించిన వాడు, ఇతరులకు దానమిచ్చిన దానిని తిరిగి తీసుకోవటం చేసినవాడు ‘అవీచి’ అనే ఘోరమైన నరకంలో పడిపోతాడు. ఈ భిక్షువు కోప స్వభావం కలవాడు, క్రూరుడు, కఠినాత్ముడు, మూర్ఖుడు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే స్వభావం కలవాడు. ఇటువంటి వాడు మఠాధిపతి అయితే దేవద్రవ్యాపహరణ చేయకుండా మానడు. ఇతడికి అవీచి నరకం తప్పదు. ఇతడి వలన ఇతడి ముందు తరాల వారు కూడా నరకం పాలవుతారు. ఓ సారమేయమా! నీ అభిప్రాయం చెప్పు. అతడికి తగిన శిక్ష పడిందని నువ్వు భావిస్తున్నావా!” అని అడిగాడు రాముడు.
“శ్రీరాముడు చేసినది నూటికి నూరు పాళ్ళు న్యాయ సమ్మతమైనది. ఎందుకని అంటారా! నా గతజన్మే ఉదాహరణ. నేను కూడా పూర్వజన్మలో మఠాధిపతిగానే ఉన్నాను. అప్పుడు నేను యజ్ఞాన్నము దేవతలకు నైవేద్యం పెట్టకుండానే భుజించేవాడిని. అంతేకాదు నా దాసదాసీ జనులకు దేవతా ప్రసాదం ఇచ్చేవాడిని కాదు. దేవద్రవ్యాపహరణ చేసి నా దగ్గర పనిచేసే వారి మీద అభియోగం మోపేవాడిని. అందువలన ఈ జన్మలో నేను నీచమైన శునక జన్మను పొందవలసి వచ్చింది. అందువలన ఎవరినైనా శిక్షింపదలచితే దేవాలయముల పైన గానీ, గోశాలలపైన గానీ, బ్రాహ్మణ సమాజం పైన గానీ అధిపతిగా చేయాలి. సర్వార్థ సిద్ధుడికి తగిన శిక్షే విధించినట్లుగా నేను భావిస్తున్నాను. నాకు జ్ఞానోదయమైంది. కాశీకి వెళ్లి, నిరశన దీక్ష వహించి తనువును విడిచిపెడతాను. సెలవు” అని చెప్పి అక్కడ నుంచీ వెళ్ళిపోయింది శునకం.
శ్రీరాముడి ధర్మ నిర్ణయానికి అందరూ సంతోషించారు.
కాబట్టి అపరాధులను శిక్షించటం ప్రభువు యొక్క విధులలో ముఖ్యమైనది. రాజు తగిన రీతిలో శిక్ష విధిస్తే ఆ దండనకు భయపడి, ప్రజలలో నేరాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. క్రమక్రమంగా నేరప్రవృత్తే లేకుండా పోతుంది. నేరస్థుల వలన కలిగే బాధలు పోయి సత్ప్రవర్తన కలిగిన వారు నిశ్చింతగా జీవిస్తారు. మనం హీన జంతువుగా పరిగణించే కుక్కకు కూడా ఆ విధంగా న్యాయం చేసాడు శ్రీరాముడు. అందుకే శ్రీరామరాజ్యం అన్ని కాలాలకూ ఆదర్శప్రాయమైనది.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.
