[కోవెల సుప్రసన్నాచార్య గారు వ్రాసిన ‘శ్రీ నృసింహ ప్రపత్తి’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]
వంశానుగతంగా కోవెల సుప్రసన్నగారి బాల్యమంతా సంప్రదాయబద్ధమై, విశేష భక్తి ప్రపత్తుల ఆరాధనలతో, పురాణ, ఇతిహాస, కావ్య మధువులను ఆస్వాదిస్తూ, అధ్యయనం చేస్తూ సాగింది. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారంగా ఒకవైపు భక్తి మార్గంలో తరిస్తూనే మరోవైపు ఆత్మాన్వేషణ దిశగా అరవిందుల యోగాన్ని అనుసరిస్తూ, సద్గురు శివానందమూర్తి ఆశీస్సుల ఆలంబనగా ఆధ్యాత్మిక, తత్త్వ, ఆధునిక చైతన్యంతో ఆయన శిఖరస్థాయికి చేరుకున్నారు.
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ।
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన॥
అచంచలమైన విశ్వాసంతో, పరిపూర్ణ భక్తితో అహంకారం నశించిన భక్తుడు శరణాగతి కోరుతూ భగవంతునికి తనను తాను సమర్పించుకుంటాడు.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥
(భగవద్గీత 18.66)
సర్వధర్మాలను వదిలిపెట్టి తనను ఒక్కడినే శరణు వేడుకొనుమని, అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పుకున్నాడు. సకల ధర్మాలను వదిలి ఆత్మ ధర్మాన్ని పాటించాలని, ఆత్మాన్వేషణ దిశగా సాగాలని అర్జునునికి కర్తవ్యాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు.
‘నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్’ అని పోతన భాగవతంలో గజేంద్రునిచేత పలికించాడు.
సుప్రసన్నాచార్యులు గారు కూడా శ్రీ నరసింహ స్వామికి శరణాగతులై ‘శ్రీ నృసింహ ప్రపత్తి’ రచించారు.
అనేకాలైన మకుటాలు ఉండడం వల్ల శతకం కావచ్చు, కాకపోవచ్చునని జీవుని బాహ్యాంతర్గత ప్రయాణంలో సంభవించే అవరోధాలే దీనికి మూలద్రవ్యాలుగా ఆయన చెప్పుకున్నారు. ఉభయ లోకాలకు అనుసంధానమై సామరస్యాన్ని సాధించి, ఐహిక జీవిత సంకటాలను దూరం చేసే అసామాన్య నారసింహ స్వరూపాన్ని దివ్య ప్రబంధంగా వెలయించారు. గురువు శివానంద మూర్తిని స్వామిలో దర్శించారు. రచన కొనసాగినంత మేర అభేద భావనతో గురువు సాన్నిధ్యాన్ని ఆయన అనుభూతి చెందారు.
వరంగల్లు సమీపంలో ఉన్న వేల్పుకొండ క్షేత్రంలో వెలసిన ‘శ్రీలక్ష్మీ నరసింహస్వామి’ కోవెల వంశీయులకు ఇలవేలుపు. ఆ క్షేత్రం చుట్టూ ఉన్న పంచ నారసింహ క్షేత్రాలలో నైఋతి దిశలో ఉన్న ‘సుప్రసన్న నారసింహ క్షేత్రం’ లోని స్వామి పేరును తనకు పెట్టడం మూలంగానేమో ఆయన నరసింహ స్వామి పట్ల అపార భక్తివిశ్వాసాలను ఏర్పరచుకున్నారు. అంతర్జగద్వి షయాన్ని చెప్పినందువల్ల ధ్వని పూర్వకంగా దీన్ని ప్రబంధమని ‘సంవిత్కళ’ గా దీనికి ముందుమాట రాసిన ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు పేర్కొన్నారు.
మున్నేనెప్పుడొ నల్వదేండ్లయినదో ముఖ్యాదృతీ, కావ్య సం
పన్నుజేయగనై యుదాహరణ కావ్యం బొండు నిర్మించితిన్
నన్నొక్కప్పుడునైన వీడవు, మనోజ్ఞ స్వాదు రమ్యాకృతీ
మిన్నేరయ్యెదవో శిరంబుపయి, స్వామీ నారసింహ ప్రభూ!
శ్రీ వైష్ణవ సంప్రదాయ వారసత్వాన్ని అణువణువునా నింపుకున్న కవి నారసింహ తత్త్వాన్ని పరిపూర్ణంగా మనోవిహాయసంలో దర్శించారు. అంతకుముందు నలభై సంవత్సరాల క్రితం ఎం.ఏ విద్యార్థిగా ఉన్నప్పుడే ‘లక్ష్మీ నృసింహోదాహరణం’ రచించారు. ఆయన అంతఃకుహరంలో నిక్షిప్తమై ఉన్న స్వామి లీలా చేతనాన్ని సదా అనుభవిస్తూనే ఉన్నారు. తిరిగి ఇన్నేళ్లకు ఈ రచనకు పూనుకున్నారు. ఏ క్షణమూ దూరం కాని ఆ మనోజ్ఞ రమ్యాకృతి కవికి సహస్రార స్థానంలో తేజోమయమై విరాజిల్లుతున్నది. భగవంతునితో అనుసంధానమై ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఆయనను ప్రేరేపిస్తున్నది. చిన్ననాట నుండే ఉన్న భక్తి పరిపక్వతకు చేరుకున్న స్థితి.
“..సహస్రారాంబుజారూఢా సుధాసారాభి వర్షిణీ”
లలితా సహస్ర నామ స్తోత్రంలో వేయిదళములు కలిగిన పద్మమును అధివసించి అమృతధారను కురిపించే తల్లిగా జగన్మాతను శంకరాచార్యులు స్తుతించారు.
ప్రాణారణ్యములం జరింతు భయ విభ్రాంతుల్ మనంబేర్చగా
తానై సంకట వీధులం దిరిగి యార్తారావముల్ సేయగా
నేనై ఆజిముఖమ్ములన్నిలచి సందేహాత్మ కార్పణ్య తా
స్థానంబయ్యెద నీవె దిక్కయితి వెంచన్ నారసింహ ప్రభూ!
పోతన మహాభాగవతంలో నారాయణ కవచంలో.. “అడవుల సంకట స్థలులనాజి ముఖంబుల నగ్ని కీలలం” అనే పద్యానికి ఇది అనుసరణ పద్యంగా కవి పేర్కొన్నారు.
దుర్గేష్వట వ్యాజి ముఖాదిషు ప్రభుః
పాయాన్న్రసింహోఽసుర యూథ పారిః
విముంచతో యస్య మహాట్టహాసం
దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః
(వ్యాస ప్రణీత భాగవతం నారాయణ కవచం-14)
అత్యంత భయంకర అట్టహాసంతో కూడిన ముఖం కలవాడై, దేవతారులైన రాక్షసులను సంహరించడంలో ఉగ్రత్వం చూపేవాడు, తన కోరల నుండి బయల్పడిన అగ్ని జ్వాలల చేత దిగంతాలను చెదరగొట్టిన వాడు, ఊహించశక్యంకాని మహిమాన్వితుడైన నృసింహదేవుడు అడవులు, సంకటపరిస్థితులు, యుద్ధ భూములు, నిప్పులు మొదలగు ప్రమాదాల నుండి కాపాడుగాక!!
అని వేడుకున్నట్టు సుప్రసన్నగారు తనను అన్ని వైపుల నుండి అనిశ్చితమైన అనేక స్ధితుల నుండి కాపాడగలుగువాడు ఆ నారసింహ ప్రభువేనని పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.
కదలంగా వలె శ్రీ వికుంఠనగరీ కల్యాణ మార్గంబు, సం
పద వెల్లొత్తెడు క్షీర వార్ధి, హృదయ ప్రారూఢ గూఢాంశమై
చెదరంజేయవె నాతనమ్మిచ్చట నీ చిద్భావ సంపత్తి, యో
గద, యోగేశ్వర, యోగినాథ నుతి సంజ్ఞా నారసింహ ప్రభూ!!
‘పర’- శ్రీవైకుంఠంలో ఉండే సర్వోన్నత మూల రూపం వ్యూహ- క్షీరాబ్ధిలో ఉండే రూపం
‘విభవ’- నారాయణుని వివిధ అవతారాల రూపం
‘అంతర్యామి’- జీవులన్నింటిలో ఉండే పరమాత్మ
‘అర్చా’- భక్తులకు అత్యంత సన్నిహితంగా ఆలయాలలో ఉండే విగ్రహ రూపం
కవి అటువంటి పరమాత్మ దివ్య స్వరూపాలలో పర, వ్యూహ, అంతర్యామి స్థితులను స్మరిస్తున్నారు. వైకుంఠపుర కళ్యాణ మార్గమునుండి, సంపద్విభవ పాల సంద్రం నుండి కదలి తన హృదయాంతరంగంలో ప్రవేశించుమని, భగవంతుని చైతన్య భావనా సంపత్తి చేత ‘నా’ తనాన్ని దూరం చేయమని వేడుకుంటున్నారు.
‘నా తనం’ అనే పద ప్రయోగం నిగూఢమైనది. నేను, నా అనే అహంకార ప్రవృత్తి మానవుని ముక్తి సాధనకు దూరం చేస్తుంది. ఈ ‘నేను’ అనేదాన్ని కేవల శరీర బాహ్యస్థితిగా కాక అంతర్గత శోధన చేసుకున్నప్పుడే ఆత్మ నిజస్వరూపం అర్థమవుతుంది.
ప్రకృతేః క్రియ మాణాని గుణైఃకర్మాణి సర్వశః।
అహంకార.విమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే॥
(భగవద్గీత. కర్మయోగం. 27)
ప్రకృతి అనబడే శక్తి శరీరాది రూపంలో అన్ని క్రియలను నిర్వర్తిస్తుంది. ఈ ప్రకృతి బలం చేత జీవునిలో అహంకారం ప్రవేశించి, ఈ పనులన్నింటికీ కర్తను ‘నేనే’ అనే సమ్మోహంలో జీవుని యందున్న పరమాత్మ పట్ల ‘మాయ’ ను ఆవరింపజేస్తుంది. అని గీత చెప్తున్నది.
కవి ఆ మాయాజాలం నుండి తనను వేరుపడజేయమంటున్నారు.
స్వామివారిని కవి యోగేశ్వర, యోగినాథ అని సంబోధించారు. హిరణ్యకశిపుని వధించి ఉగ్రరూపాన్ని ఉపసంహరించి యోగముద్రలో విష్ణుమూర్తి ప్రశాంతచిత్తుడై దర్శనమిస్తాడు. అపారశక్తి, ప్రశాంతతల సమ్మేళనం ఈ రూపం. అంతర్గత శాంతి, ఆత్మపరిశీలనతకు చిహ్నం. పద్మాసనంలో లౌకికేతర జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని సూచించే సాంప్రదాయ యోగభంగిమ. కవి తనలోని చిత్తభ్రమలను తొలగించుకునే మార్గాన్వేషకుడై యోగ నారసింహుని సంభావించడం ఆయన ఔచితీ సామర్థ్యం.
ఆవాహించు తమమ్ము కాల్చవలె సాధ్యంబైన యీ మన్కిశో
భావేలావనిగా రజః ప్రస్రుతి తీర్పన్ ధర్మమార్గంబునన్
జీవింపదగు పూర్ణయోగమున అర్చిస్సెప్పుడుద్దీప్తమై
లోవెల్గుల్ నిరత ప్రసారములు నాలో నారసింహ ప్రభూ!
మానవునిలోని సర్వప్రేరణలు, ఆచరించు సర్వకర్మలు భగవన్మయం కావడమే పూర్ణత్వం. సాధకుడు తన జీవితంలోని ప్రత్యంశాన్ని ఈశ్వర సమర్పణ కావించాలి. శ్రీకృష్ణుడు గీతలో ద్వంద్వాతీతులు కావాలని చెప్తాడు. అన్నింటిలోను సమానత్వాన్ని చూడగలగాలి. దేనినీ తిరస్కరించకూడదు. దేని పట్ల వ్యామోహమూ తగదు. ఇహపరాల అనుబంధాలను సమన్వయిస్తూ సాగాలి.
లోకాన్ని దుఃఖరహితంగా ఈశ్వరతేజోవిరాజితం చేయడమే పూర్ణయోగం.
హృదయాన్ని ఆవరించిన అంధకారాన్ని కాల్చివేసి, ధర్మమార్గం ద్వారా జీవనశోభను పొందేటట్లు పూర్ణయోగాన్ని అవలంబించి నిరంతరం అంతశ్చేతన కాంతులను ప్రసరింపజేయునట్లు తనను అనుగ్రహించమంటున్నారు కవి.
సర్వ కర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్య పాశ్రయః।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పద మవ్యయమ్॥
(భగవద్గీత. 18. 56)
మానవుని విహితమైన కర్మలలో దోషయుక్తమైనవి కూడా ఉంటాయి. కానీ సాధకుడు దాన్ని కూడా వదిలిపెట్టరాదు. ఏ పనినైనా సర్వకాల సర్వావస్థలలో, సర్వాత్మ భావనతో పరమాత్ముని శరణుపొంది ఈశ్వరార్పణం చేయాలి. అదే పరిపూర్ణ యోగం. దీన్ని ఆచరించిన సాధకుడు నిత్య నూతనమైన, నాశరహితమైన మోక్షస్థానాన్ని అందుకుంటాడు. అటువంటి పూర్ణయోగాన్ని కవి అభిలషిస్తున్నారు. జిజ్ఞాసువు, సామాన్య మానవుని లాగా ఇంద్రియజన్య ప్రపంచంతోను, భౌతికమూలకాల అద్భుతరూపాలకు తనివి చెందక పరమాత్మ స్థితిని అనుభవించే లోకాలలో విహరిస్తాడు.
పరతత్త్వంబవు దుర్గమం బతితరింపన్ నామమొక్కండె చా
లు, రహోవేళల క్లిష్టసంధుల మహర్లోకీ సమాసన్న, వి
స్ఫురతన్ బొందెదు నీ రాక తొం
దరలో తీర్చెడు దారి న్యాసమె అనంతా నారసింహ ప్రభూ!!
నవవిధ భక్తిమార్గాల్లో స్మరణం ఒకటి. యజ్ఞాలు, తపస్సులకంటే నిరంతర భవన్నామ స్మరణ కలియుగంలో ప్రశాంతతకు, ముక్తికి సులభమైన, అత్యుత్తమమైన ఏకైక సాధనమని శాస్త్రాలు చెబుతున్నాయి. దుర్గమమైన పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి సర్వవ్యాపక చైతన్యంలో తరించడానికి నరసింహ స్వామి నామమొక్కటి తప్ప మరేమార్గం లేదని కవి నిర్ధారించుకున్నారు. శ్రీ అరవిందుల ప్రకారం మనస్సును నియంత్రించి, దానిపైనున్న అతి మనస్సును (సూపర్ మైండ్) చేరుకోవడం ఒక ఉన్నత స్థితి. ఇది దైవిక చైతన్యాన్ని, భూమిపై దివ్యజీవనాన్ని సూచిస్తుంది.
సాధారణ మానసికస్థితినుండి అసాధారణ మానసికస్థితికి చేరుకోవడానికి పొందే తపన ఇక్కడ కనిపిస్తుంది. పరమాత్మ సన్నిధిని చేరాలంటే సమస్త సమర్పణ భావన కలగాలి. అది సులభసాధ్యం కాదు. మనస్సును ఏకాగ్రచిత్తంలో నిలిపి, శరీరాన్ని దేవాలయంగా మార్చి ధ్యానమగ్నులవ్వాలి. సుప్రసన్న గారు తమ తాత్త్విక భావనా పరంపరలో భగవంతుని సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ అవస్థా త్రయాలను అధిగమించే దిశగా పయనాన్ని సాగిస్తున్నారు.
అవతారంబులవెన్ని తాల్చినను పాపారణ్య దావాగ్ని వై
ష్ణవతన్ శ్రీ నరసింహ మూర్తి శివతా సంయుక్తి యోగాసన
స్థ విరాకారత, సర్వధోజ్జ్వలసహస్రారంబునై యుంట సే
వ్యవరీయాంసుడవైతి వేల్పుమల వెల్గై నారసింహప్రభూ!
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తం భగవంతుడు వివిధకాలాలలో, వివిధరూపాలను ధరిస్తూనే ఉంటాడు.
దశావతార రూపుడైన శ్రీమన్నారాయణుడు ఏవిధంగానూ తనకు మృత్యువు సంప్రాప్తించ కూడదని వరాన్ని పొందిన హిరణ్యకశిపుని సంహరణార్థం నృసింహస్వామి అవతారాన్ని ధరించాడు. దశావతారాలలో నాల్గవ అవతారమైన ఈ రూపానికి ప్రత్యేకత ఉంది. సగభాగం మానవ రూపంలోనూ, సగభాగం సింహరూపంలో మర్త్య, అనంత లోకాలకు వారధిగా ఉగ్రాకృతిని దాల్చిన రూపం. ఈ రూపం శైవ, వైష్ణవ తత్త్వాలకు సమన్వయంగా ఉండడం విశేషం.
పాపములనెడి అరణ్యాలలో వ్యాపించే దావాగ్ని నుండి తప్పించడానికి నృసింహుడు శివతత్త్వ సంయోగంగా ముక్కంటిగా, పినాకమును ధరించి హృదయోపాసనకు లక్ష్యంగా నిలిచాడు. భౌతిక, ఆధ్యాత్మికతలకు వారధియైన అనాహత చక్రంలో సూర్యునిలా భాసించి, బ్రహ్మానందాన్ని అనుభవించే ఆత్మసాక్షాత్కార స్థితిని కలిగించే సహస్రారమే తానవుతాడు. హరిహరాభేదతత్త్వానికి ప్రతీక. భక్త వరదుడు అయినట్టి నారసింహుడు వేల్పుమల క్షేత్రంలో వెలుగై నిలిచి సేవలందుకోవడం సుకృత విశేషంగా భావిస్తూ కవి పరవశిస్తున్నారు.
ఆది శంకరాచార్యుల వారు కూడా..
సత్యజ్ఞాన సుఖస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్ ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||
(శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ధ్యానశ్లోకం)
సత్య జ్ఞాన సుఖాలను అందించే నిర్మల స్వరూపుడు, క్షీరాబ్ధి మధ్యమున వసించువాడు, యోగముద్రచేత ప్రశాంతుడు, సహస్ర భూషణాలతో శోభిల్లువాడు, త్రినేత్రములు కలిగి, చక్రం, పినాకములను ధరించి, వరద, అభయముద్రలు ధరించిన భాను ప్రకాశుడు, ఆది శేషుడు ఛత్రం పట్టగా చంద్రకాంతితో శోభిల్లే లక్ష్మీ నృసింహుని శివకేశవాభేదంగా స్తుతించారు.
శంసా మార్గములన్ చరించిరి కులస్వాముల్ మిముం గొల్చి నిల్చి, రి
ర్వంశంబుల్ తమ జీవనంబె తపమై వర్తించి రాత్రోవ ద్వా
త్రింశద్బాహు న్రృసింహ! సాగినది ఇంతేచాలు కల్పాగమై
అంశీభూత సమస్త జీవ, జడగర్భా నారసింహ ప్రభూ!
కోవెల సుప్రసన్న గారి పితామహులు కోయెల కందాడై రంగాచార్యులు, మాతామహులు ఠంయాల లక్ష్మీ నరసింహాచార్యులు గారు పురాణేతిహాస కావ్య విభవద్విలాసాల చేత సంతృప్తి చెందినవారు. తమ జీవనాన్ని తపస్సుగా జేసి ఇలవేలుపు నృసింహస్వామిని భక్తి శ్రద్ధాళువులై స్తుతించినవారు, సేవించినవారు. అనువంశికంగా తాను పొందిన ఆ మహద్భాగ్యానికి పరితృప్తి చెందిన సుప్రసన్న గారు ఈ జీవితానికి ఇంతకుమించి ఇంకేమీ అక్కర్లేదంటారు.
పాంచాలరాయ శతకంలో..
ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాము
అటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధాను
డిటుల నా తలిదండ్రులిర్వురీ చెట్ల మధుర ఫలములు
చిటిలిన మధువేనో కానో చేకొమ్ము పాంచాలరాయా!
అని ఇరువంశాల ప్రస్తావన చేయడం కనిపిస్తుంది.
‘ద్వాత్రింశద్బాహు’ నరసింహుడని స్వామిని సంభావించడంలోని అంతరార్థం..
నృసింహ మహామంత్రం
“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం!!”
అనుష్టుప్ ఛందస్సులో ముప్పయి రెండు అక్షరాల మంత్రం.
ఉగ్రుడు, వీర పరాక్రమవంతుడు, సర్వవ్యాపి, జ్వలించే తేజస్సుతో అన్ని ముఖాలు కలిగిన నృసింహుని, భయంకరుని, శుభప్రదుని, మృత్యువుకే మృత్యువైన స్వామికి నేను నమస్కరిస్తున్నాను.
భక్తులను రక్షించేందుకు ఈ మంత్రంలోని 32 అక్షరాలే బాహువులుగా మారి స్వామి ఆర్తత్రాణ పరాయణుడు అవుతున్నాడు. అటువంటి స్వామి తమను ఎల్లవేళలా సంరక్షిస్తున్నాడని, ఇంతగా స్వామి అనుగ్రహానికి పాత్రులైనందుకు తృప్తి చెందుతారు.
రచన ఆసాంతం భక్తిరసవాహినిగా సంపూర్ణ శరణాగతి కోరుతూ కవి ఆర్తిని, కవితాప్రదీప్తిని వెలయిస్తూ సాగుతుంది. పద సారళ్యంతో పాటు అక్కడక్కడ కొన్ని పద్యాలు ప్రౌఢ గాంభీర్యతను సంతరించుకున్నాయి. గుప్తమైన కవిలోని ఆత్మచేతన ఎగిసి సుందర పదబంధురంగా ఒదిగిపోయింది. ఆత్మాశ్రయంగా భగవంతుని పట్ల అనురక్తిని దృశ్యీకరిస్తూనే సమష్టి చైతన్యానికి ప్రతీకగా కొనసాగుతుంది.
“కుంఠంబయ్యెను నేడు దైవత జగత్కోటీ సుఖంబు..”
“అదుపుల్ మాలిన జీవితంబులు
భయాయత్తంబులెన్నాళ్లు..”
“ఆక్రోశింపను లేని మూఢ ధిషణా హం వ్యక్తి మిథ్యా వచః
ప్రక్రాంతిన్ బడిపోవుచుంటి..”
“ఎదుగం జాలక పాప భారమున తా నీ గుండె యోగాడుచున్..”
వంటి పంక్తులు ఆత్మాన్వేషణ కావిస్తూ ఉషస్సులోకి ప్రవేశించడానికి నృసింహుని ఆసరాను వాంఛిస్తాయి. బంధనాల నుండి విముక్తి పొందడానికి చేస్తున్న జీవుని అంతరంగపు పొరలలో పొందుతున్న తాపత్రయం.
ఊర్ధ్వ అధోలోకాలకు వ్యాపించిన విశ్వరూపునిగా, సగుణ, నిర్గుణ పరబ్రహ్మగా, దివ్యాదివ్య లోకాలకు వేసిన జంట నిచ్చెనగా వివిధ స్వరూపాలలో నృసింహుని దర్శిస్తూ..
ఆరాధింపను వీలులేని కృతక వ్యాపారమౌ బుద్ధియున్
ఆరాధింపగ చేర్చలేని ఉపచారానేక సామగ్రితో
శ్రీ రమ్యాక్షర జాతవేద నృహరీ చెక్కిళ్లపై జారు క
న్నీరే నీ పరితోర్చగా గొనుము తండ్రీ నారసింహ ప్రభూ!!
అంటూ సుప్రసన్న గారు తమ నిర్మలమైన హృదయ పుష్పాన్ని స్వామికి త్రికరణ శుద్ధిగా సమర్పిస్తారు.
🪷
ధూళిపాళ అరుణగారు అధ్యాపకురాలిగా పనిచేసారు. తెలుగు ఎమ్.ఏ., టిపిటి చేశారు. 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం గడించి, స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్‌గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 28 మందిని ఇంటర్వ్యూలు చేశారు.
ప్రచురణలు: ‘జ్ఞాపకాల సంతకం’ తొలి కవితా సంపుటి. ‘మిగిలేవి గురుతులే’ తొలి కథా సంపుటి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం, మయూఖ ముఖాముఖి (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం), చేతనాశిల్పం (కవితా సంపుటి), మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం ఇతర ముద్రిత గ్రంథాలు. ఫోన్: 8712342323
