Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాత్సల్య గవాక్షం నుండి ‘శ్రీకృష్ణ దర్శనం’

[విశ్వపతి గారు రచించిన ‘శ్రీకృష్ణ దర్శనం’ అనే పుస్తకాన్ని విశ్లేస్తున్నారు శ్రీమతి శ్రీదేవి మురళీధర్.]

‘శ్రీకృష్ణ దర్శనం’ అనే శీర్షికే ఈ గ్రంథ అంతస్సూత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది కృష్ణుని చారిత్రక జీవనక్రమాన్ని వల్లించే సాధారణ గ్రంథం కాదు. రచయిత తన అంతశ్చేతనలో దర్శించిన దివ్యానుభూతికి యిచ్చిన రసార్ద్ర అక్షరాకృతి.

భారతీయ ఆధ్యాత్మిక వాజ్మయంలో ‘దర్శనం’ అనేది కేవలం బాహ్య నేత్రాలతో వీక్షించడం కాదు. భక్తి ద్వారా సమీపించడం, ప్రేమ ద్వారా గ్రహించడం, జీవన గమనంలో పరమాత్మ సాన్నిధ్యాన్ని నిరంతరం గుర్తించడం అనే ఉదాత్త ఆధ్యాత్మిక స్థితి. ద్రష్టకు, దృశ్యానికి నడుమ ప్రవహించే అద్వైత చైతన్య ప్రవాహమే నిజమైన దర్శనం.

భౌతిక దృష్టి అంతర్ముఖమై దివ్యత్వంతో ఏకమయ్యే ఈ స్థితిని ఆధారంగా చేసుకునే రచయిత ఈ గ్రంథానికి ‘శ్రీకృష్ణ దర్శనం’ అని సార్థక నామకరణం చేశారు. రచయితకు కృష్ణుడు గతకాలానికి చెందిన ఒక చారిత్రక పురుషుడు కాదు, హృదయకమలంలో నిరంతరం స్పందించే సజీవ సాన్నిధ్యం.

కొన్ని గ్రంథాలు ఒక దైవస్వరూపాన్ని శ్లాఘిస్తాయి. మరికొన్ని ఆ స్వరూప సంబంధితమైన పురాణ వైభవాన్ని కొనియాడతాయి. కొన్ని రచనలు మాత్రం దైవాన్ని తెలుసుకోవడం కంటే, దైవసాన్నిధ్యంలో మానవుడు తనను తాను తెలుసుకునే అంతర్యాత్రకు ద్వారం తెరుస్తాయి. విశ్వపతి రచించిన ‘శ్రీకృష్ణ దర్శనం’ ఈ అరుదైన కోవకు చెందినది.

ఈ గ్రంథ పుటల్లో గోచరించే కృష్ణుడు సిద్ధాంతాల పరిధిలో బందీ అయిన తాత్త్విక ప్రతీక కాదు. రచయిత అంతరంగంలో నిరంతరం సంభాషించే ఆప్తసఖుడు, ప్రేమగా అనుభూతికి అందే దివ్య చైతన్యం, సందిగ్ధ సమయాల్లో మార్గదర్శనం, ఏకాంతంలో ఆత్మీయ సహచర్యం. జీవితాన్ని బయటి నుండి శాసించే పాలకుడు కాదు, జీవనానుభవాల అంతస్సారంలో తన ఉనికిని వెల్లడించే అంతర్యామి.

గ్రంథారంభంలోని ‘నివేదన’ ఈ సాధనాయాత్రకు తాత్త్విక ప్రవేశద్వారం. రచయిత అక్కడే తన అంతర్దృష్టిని స్పష్టం చేస్తారు. శ్రీకృష్ణుడు స్వయంగా ప్రేమతత్త్వ స్వరూపుడని, విశ్వయోగి, విశ్వగురువని ప్రబోధించే భావనలో ఈ రచన సమగ్ర స్వరూపం నిక్షిప్తమై ఉంది.

మహాభారత కృష్ణుడు అసాధారణ రాజకీయ దౌత్యవేత్తగా దర్శనమిస్తే, భాగవత కృష్ణుడు ప్రేమానందామృత మూర్తిగా ఆకర్షిస్తాడు. ఇక్కడ భక్తి చారిత్రక సత్యాన్ని తోసిపుచ్చదు, చరిత్రకు ఆవల ఉండే పారమార్థిక అనుభూతిని శోధిస్తుంది. భగవంతుడిని బాహ్యంగా ఆరాధించడం ఒక స్థాయి అయితే, ఆయనను తన అంతరంగంలో సంపూర్ణంగా దర్శించడం అత్యున్నతమైన సాధనాస్థాయి. విశ్వపతి కృష్ణుడిని ఈ అనుభూతి మార్గంలోనే ఆవిష్కరిస్తారు.

పాండిత్య భారంతో కూడిన శాస్త్ర వ్యాఖ్యాన పద్ధతిని ఆశ్రయించకపోవడమే ఈ గ్రంథానికి ప్రత్యేకతను సమకూర్చింది. శుష్క తార్కిక విన్యాసాలకు తావివ్వకుండా, తన అంతర్నేత్రానికి సాక్షాత్కరించిన కృష్ణచైతన్యాన్ని పాఠకుని హృదయపీఠంపై నిలపడమే రచయిత లక్ష్యం. “ఈ పుస్తకం నా భావనలతో కూడినదే” అన్న రచయిత వాక్యం కేవలం ఉపచార వినయం కాదు, ఈ సమగ్ర రచన తాత్త్విక స్వభావాన్ని నిర్దేశించే ప్రామాణిక ప్రకటన.

ఇక్కడ కృష్ణుడు తాత్త్విక పరిశోధనకు అంశం కాదు, నిరంతర ఆత్మానుభూతికి కేంద్రబిందువు. రచయిత చిత్తంలో సుదీర్ఘకాలంగా పరిపక్వమైన గోకుల స్మృతులు, భక్తి భావనలు, అంతుపట్టని ప్రశ్నలు, జీవనయానంలో అంతర్మథనం, అన్నీ కలగలిసి కృష్ణచైతన్యంలో లయమౌతాయి. ఈ అంతర్ముఖ సాధనా సౌరభం తొలి అధ్యాయపు మొదటి పుట నుంచే పాఠకుడిని ఆవహిస్తుంది.

యశోదాదేవి ఊయలలోని పసికందును వాత్సల్యభరిత నేత్రాలతో వీక్షిస్తున్న ఒక ప్రశాంతమైన సాధారణ సన్నివేశంతో గ్రంథం ప్రారంభమౌతుంది.

జగమంతా శ్రీకృష్ణుడిగా ఆరాధించే ఆ దివ్యశిశువుకు అప్పటికి నామకరణం కూడా జరగలేదు. అతడు అక్కడ విశ్వరూపధారి కాదు, గీతాచార్యుడు కాదు, ద్వారకాధీశుడు అంతకంటే కాదు, కేవలం మాతృహృదయాన్ని అంటిపెట్టుకున్న ముద్దుబిడ్డ. ఈ చిత్రణలోనే కృష్ణతత్త్వాన్ని చేరుకునే రహస్యం నిక్షిప్తమై ఉంది.

పరబ్రహ్మాన్ని విభూతుల పీఠంపై ప్రతిష్ఠించి ఆరాధించే ముందు, తల్లి ఒడిలో ఆదమరచి నిదురించే పసిపాపగా దర్శించాలని రచయిత సంకల్పించారు.

ఇది కేవలం బాలకృష్ణుని లీలా మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు అల్లిన కథనం కాదు. అనంత తత్త్వం సాకార పరిమితిని స్వీకరించడం, కాలాతీతమైన చైతన్యం కాలచక్రభ్రమణంలోకి అడుగు పెట్టడం, విశ్వాన్ని గర్భంలో ధరించిన జగన్నాథుడు తల్లి ఒడిలో నిస్సహాయ శిశువుగా ఒదగడం అనే మహత్తర అవతార రహస్యం ఇక్కడ పరోక్షంగా ప్రసక్తమైంది.

విశ్వపతి ఈ రహస్యాన్ని తాత్త్విక పదజాలంతో కాకుండా, యశోద ఆర్ద్ర నేత్రాలలోను, మాతృసహజమైన ఆమె ఆందోళనలోను, శిశువు దివ్యలక్షణాలను చూసి మురిసిపోయే విస్మయంలోను నిక్షిప్తం చేశారు. భగవత్ తత్త్వం ఇక్కడ రసవత్తరమైన కథనంలో సంపూర్ణంగా లీనమైపోయింది.

యశోద దృష్టిలో కృష్ణుడు భగవంతుడు కాదు, కేవలం తన ప్రాణసమానుడైన పుత్రుడు. పాఠకులకు మాత్రం ఆ చిన్నారి పరబ్రహ్మ స్వరూపమని తెలుసు. ఈ రెండు జ్ఞానస్థితుల నడుమ రచయిత సృష్టించిన సున్నితమైన అంతరం తొలి అధ్యాయానికి అపూర్వమైన మాధుర్యాన్ని చేకూర్చింది.

యశోదాదేవి ప్రేమకు శాస్త్రపాండిత్యంతో పనిలేదు. తత్త్వజ్ఞానం తెలియక పోయినా ఆమె వక్షస్థలంపై విశ్రమించేది సాక్షాత్ పరతత్త్వమే. భక్తి అత్యంత నిర్మల స్వరూపం బహుశా ఇదే కావచ్చు.

భగవంతుడని గ్రహించి పూజించడం కంటే, ప్రగాఢమైన ప్రేమలో ఆయన దైవత్వాన్నే మరచిపోయి సంపూర్ణంగా తనవాడిగా భావించడమే భక్తి చేరుకునే పరమోన్నత స్థాయి. వాత్సల్య భక్తి అంతరార్థాన్ని ఈ సన్నివేశాల ద్వారా రచయిత అత్యంత సహజంగా పాఠకుడిలో జాగృతం చేశారు.

గోపికల నిష్కామ ప్రేమలో, గోకులం పొలిమేరలతో కృష్ణుడు పెనవేసుకున్న అనుబంధంలో కనిపించేది కేవలం లీలావిశేషాలు మాత్రమే కాదు, సమస్త జీవులను తన వైపు ఆకర్షించే దివ్యప్రేమామృతం.

కృష్ణుడిని అద్భుత విభూతుల ద్వారా కాకుండా నిష్కల్మషమైన సంబంధాల ద్వారా అనుభవించడమే ఈ గ్రంథ విశేషం. యశోదకు పుత్రుడిగా, గోపికలకు ప్రాణనాథుడిగా, ఆర్తులకు శరణాగత రక్షకుడిగా, సాధకుడి అంతర్నేత్రంగా కృష్ణుడు గోచరిస్తాడు.

ఈ భిన్న అనుభూతులన్నింటినీ కలిపే మూలసూత్రం ప్రేమ. రచయిత ప్రేమతత్త్వ స్వరూపుడనే భావంతో కృష్ణుడిని దర్శించడం ఈ గ్రంథానికి కేవలం భక్తిపరమైన పరిధిని కాక, ఒక పారమార్థిక విస్తృతిని ప్రసాదిస్తుంది. ప్రేమ ఇక్కడ భావోద్వేగం మాత్రమే కాదు, జీవిని పరమాత్మతో కలిపే అంతర్గత శక్తిగా పరిణమిస్తుంది.

ఈ గ్రంథ పఠనం కృష్ణుని లీలా విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ లీలల అంతరార్థంలో దాగి ఉన్న ప్రణవనాదాన్ని ఆలకించడం. గోకులాన్ని భౌగోళిక ప్రదేశంగా కాక, భగవత్తత్త్వం మానవ సంబంధాల మాధుర్యంలోకి దిగివచ్చిన దివ్యక్షేత్రంగా దర్శించడం. బాల్యంలో అనంతాన్ని, ప్రేమలో భక్తిని, భక్తిలో జ్ఞానాన్ని, జ్ఞానానికి అతీతమైన దివ్యానుభూతిని స్పృశించడమే ఇందులోని పరమార్థం.

శ్రీకృష్ణ దర్శనం మొదటి పుటల నుంచే పాఠకునికి ఒక ప్రశాంత అంతర్ముఖ ఆహ్వానాన్ని అందిస్తుంది. మన హృదయాంతరాళాలలో ఆ పరమపురుషుని సాన్నిధ్యాన్ని ఎక్కడ అనుభవిస్తున్నామో అన్వేషించడానికి అది ప్రేరేపిస్తుంది. ఆ దివ్య ఆహ్వానమే ఈ గ్రంథానికి ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని సమకూరుస్తుంది.

రచయితకు కృష్ణుడు గతానుభవ స్మృతి కాదు, నిరంతరం స్పందించే సజీవ సాన్నిధ్యం. పుస్తక ముఖచిత్రం నుంచి తుది పుటల వరకు కృష్ణస్వరూపమే సర్వస్వమై ప్రకాశించడం రచయిత ఏకాగ్ర భక్తి సాధనకు సజీవ నిదర్శనం.

బాలకృష్ణుని లీలామాధుర్యాన్ని ఆవిష్కరించే క్రమంలో శ్రీకృష్ణదర్శనం అత్యంత ఆర్ద్రమైన భావప్రపంచంలోకి అడుగిడుతుంది. ఇక్కడ బాల్యం అనేది అవతారగాథలోని ఒక ప్రారంభ ఘట్టం మాత్రమే కాదు. పరమాత్మ మానవ హృదయానికి, నిష్కల్మషమైన ప్రేమకు సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చిన అత్యంత సాన్నిహిత్య రూపం.

కృష్ణుడు గోకులం వీధుల్లో బాలుడిగా తిరుగాడిన ప్రతి లీలలోనూ రచయిత ఒక దివ్యమైన అంతరార్థాన్ని దర్శిస్తారు. అందుకే ఈ లీలలను అద్భుతాల బాహ్య ప్రదర్శనగా కాక, ప్రేమ తన పరమోన్నత స్వరూపాన్ని సాధారణ మానవ జీవితంలో ఎలా ఆవిష్కరించుకుందో తెలిపే పారమార్థిక అనుభూతులుగా రచయిత తీర్చిదిద్దారు.

బాలకృష్ణుని గురించి రచయిత ఉపయోగించిన భాషలోనే గాఢమైన ఆత్మీయత తొణికిసలాడుతుంది. గ్రంథంలో పదే పదే వినిపించే ‘చిన్ని కృష్ణయ్య’ అనే పిలుపు దైవాన్ని సంబోధించటం కాదు. కన్నుల ఎదుట సాక్షాత్కరిస్తున్న చిన్నారిని మురిపెంగా వీక్షిస్తున్న భక్తిపూర్ణ హృదయ నివేదన.

ఒక సందర్భంలో రచయిత “చిన్ని కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి” అంటూ పాఠకుడిని సైతం తన అంతర్దర్శనంలో భాగస్వామిని చేస్తారు. ఈ ఒక్క పిలుపులోనే రచన తాత్త్విక స్వభావం స్పష్టమౌతుంది.

రచయిత ఇక్కడ కథను వినిపించడం లేదు, తన హృదయంలోని దివ్య దృశ్యాన్ని అక్షర రూపంలో సాక్షాత్కరింపజేస్తున్నారు. పాఠకుడిని తటస్థంగా ఉంచక, గోకులంలోని ఆ చిన్ని బాలగోపాలుని ముగ్ధమోహన సాన్నిధ్యంలోకి నడిపిస్తున్నారు.

ఇక్కడ యశోదాదేవి వాత్సల్యం కృష్ణతత్త్వానికి లభించిన తొలి సహజ వ్యాఖ్యానం. తన ఒడిలో సేదతీరుతున్నది జగత్తును భరించే పరబ్రహ్మమనే భావన ఆమెకు నిరంతరం ఉండదు. ఆమె నిండు మనసుతో చూసేది అమితంగా ప్రేమించే బిడ్డను మాత్రమే. అతడి చిలిపిచేష్టలు ఆమెకు కోపం తెప్పిస్తాయి, అమాయకమైన మోములోని వెన్నెలనవ్వులు ఆ కోపాన్ని కరిగించి నీరు చేస్తాయి. గోపికల ఫిర్యాదులు ఆమెను కలవరపెట్టినా, అంతిమంగా ఆమె హృదయం ఆ ముద్దుల కన్నయ్య వైపే యమునలా పరవళ్లు తొక్కుతుంది.

ఈ మాతృప్రేమలోనే రచయిత ఒక పరమసత్యాన్ని ఆవిష్కరిస్తారు. దైవాన్ని భక్తిమార్గంలో మాత్రమే గాక, మమకారపు మాధుర్యంతోనూ సంపూర్ణంగా చేరుకోవచ్చునని!

కృష్ణుని అల్లరిని నివేదించడానికి వచ్చిన గోపకాంతలు ఆగ్రహంతో వచ్చినా అదే ఆగ్రహంతో వెనుదిరగరు. ఆ మోహనమూర్తి సమక్షంలో వారి కోపతాపాలు కరిగి దివ్యానురాగంగా రూపాంతరం చెందుతాయి.

వెన్నను దొంగిలించడం, బాలసఖులతో కలిసి ఉట్టిని అందుకోవడానికి ఉపాయాలు పన్నడం వంటి చేష్టలు బాహ్యదృష్టికి చిలిపితనంగా తోచినా, వాటిలో అంతర్లీనంగా ప్రవహించే భావోద్వేగ ప్రవాహమే రచయితకు ముఖ్యం. గోపికలు అతడిపై ఫిర్యాదు చేస్తూనే అతని ముగ్ధమోహన రూపం నుండి దృష్టి మరల్చలేరు. యశోద మందలించాలని ఎంత యత్నించినా మాతృహృదయం కాఠిన్యం వహించలేక కరిగిపోతుంది.

ఈ దివ్య సన్నివేశాల్లో వెన్న కేవలం ఒక భౌతిక పదార్థం కాదు. రచయిత దానిని ఒక ప్రత్యేక తాత్త్విక సంకేతంగా ప్రకటించకపోయినా, కృష్ణుని ఆకర్షణ వెన్నపై గాక భక్తుల హృదయాలపైనే ఉందన్న సత్యం వ్యక్తమౌతుంది. అతడు అపహరించేది వెన్నను మాత్రమే కాదు, గోకులవాసులందరి చేతనను, వారి హృదయాలను.

ఇదే బాలలీలలోని అద్భుత రసస్వరూపం. చేష్ట చిన్నది, కానీ దాని తాత్త్విక స్పందన అనంతమైనది. ఆ దివ్యశిశువు దొంగలాగా జొరబడేది గోపెమ్మ ఇంటి లోపలికి మాత్రమే కాదు, భక్తుని అంతరంగంలోకి.. దానిని నిరంతర ధ్యానమందిరంగా మార్చడానికి.

రచయిత ఈ ఘట్టాలను వర్ణించిన విధానంలో మరొక విశేష గుణం గోచరిస్తుంది. కృష్ణుని దివ్యత్వం బాల్య సహజత్వాన్ని ఏనాడూ మరుగు పరచదు. అతడు తోటిపిల్లలతో మమేకమౌతాడు, ఆటలాడతాడు, అల్లరి చేస్తాడు, దొరికిపోయినప్పుడు ముద్దుగా సమర్థించుకుంటాడు.

ఒక పసిబాలుడికి ఉండే చురుకుదనం, చమత్కారం, మైత్రి, స్వేచ్ఛ అన్నీ అతడిలో సహజ వికాసం పొందుతాయి. అదే సమయంలో అతడి సాన్నిధ్యంలో ఉన్నవారు మాటలకందని ఏదో ఒక అలౌకిక దివ్యత్వాన్ని అనుభవిస్తుంటారు.

ఈ లౌకిక, అలౌకిక స్థితులు రెండూ సమరసంగా సాగడం వల్లనే కృష్ణుని బాల్యమంతా ఈ గ్రంథంలో ఒక సజీవ దృశ్యమై ప్రకాశిస్తుంది.

అందుకే గోకులం కూడా ఇక్కడ ఒక భౌగోళిక ప్రాంతంగా మిగలదు. పసిపిల్లలు, తల్లులు, గోపికలు, గోవులు, గృహాలు, వెన్నెల వంటి వెన్న, అమాయకపు ఆటపాటలు, చిన్న చిన్న అలకలు అన్నీ కలబోసిన రసమయ జగత్తు అది.

పరమాత్మ అక్కడ ప్రత్యేకమైన ఆరాధనాపీఠంపై గాక, నిత్యజీవన సంబంధాల మాధుర్యంలోనే కొలువై ఉంటాడు. దైవత్వాన్ని లోకానికి అతీతంగా నిలపక, లోకంలోని అత్యంత సున్నితమైన ఆత్మీయ బంధాల నడుమ ప్రతిష్ఠించడమే ఈ గ్రంథ సౌందర్యం.

ఈ భావం ఐదవ అధ్యాయపు ప్రారంభంలో మరింత వ్యక్తిగత ఆత్మానుభూతిగా పరిణమిస్తుంది. గ్రంథ రచన మధ్యలో రచయిత స్వయంగా స్పందిస్తూ “ఆ కృష్ణుని అనుగ్రహంతో ఈ శ్రీకృష్ణ దర్శనం దివ్యంగా సాగిపోతోంది” అని పేర్కొనడం గమనార్హం.

ఇది సాధారణ వ్యాఖ్యలా కనిపించినా, గ్రంథం ఆంతర్యాన్ని గ్రహించడానికి అత్యంత కీలకమైన అంశం. రచయిత తనను ఈ రచనకు కర్తగా భావించడం లేదు. తాను అక్షరబధ్ధం చేస్తున్న కృష్ణగాథకే తాను అనుగ్రహపాత్రుడినన్న శరణాగతి ఇందులో వినమ్రంగా వ్యక్తమౌతుంది. సాహిత్యాన్ని కేవలం ఒక సృజనగా కాక, నిరంతర ఉపాసనగా భావించే సాధకుని ఆర్ద్రహృదయం ఈ మలుపులో ప్రత్యక్షమౌతుంది.

ఈ కారణంగానే ‘లీల’ అనే భావనకు ఈ రచనలో విశాలమైన తాత్త్విక పరిపూర్ణత చేకూరింది. ప్రాపంచిక మానవ కర్మలకు ఏదో ఒక స్వార్థపూరిత ప్రయోజనం ఉంటుంది. బాలకృష్ణుని దివ్యచేష్టలు లౌకికమైన అటువంటి లెక్కలకు అతీతమైనవి.

అతడు సఖులతో విహరిస్తాడు, గోపికల ఇళ్ళకు వెళ్తాడు, అల్లరిఆగడాలు చేస్తూ యశోదను కలవరపెడతాడు, అంతలోనే సమస్త గోకులానికి ప్రేమపాత్రుడౌతాడు. ఈ చేష్టల వెనుక భౌతిక ప్రయోజనం ఉండదు. అవి పరమాత్మతో జీవాత్మకు ఆత్మీయ సంబంధాన్ని స్థాపిస్తాయి, నిద్రాణమైన భక్తిని మేల్కొల్పుతాయి, ద్వైతభావమనే దూరాన్ని కరిగిస్తాయి.

ఒక సందర్భంలో యశోదకు కృష్ణునిపై ఫిర్యాదులు అందుతాయి, మరొక సందర్భంలో అతడి చిలిపితనాన్ని చూసినవారే ఆ ముగ్ధమోహనత్వానికి దాసోహమౌతారు, ఇంకొక చోట గోపబాలకుల మధ్య అతడు సామాన్య సఖుడిగా ఒదిగిపోతాడు.

ఈ సన్నివేశాలన్నీ కేవలం వినోదాన్ని కలిగించే బాల్యకథలు కావు. భక్తుడు భగవంతుని అన్వేషించడం ఒక మార్గమైతే, భగవంతుడే స్వయంగా భక్తుని దరికి చేరి, తనను ప్రేమించకుండా ఉండలేని అనిర్వచనీయ స్థితిని కల్పించడం పరమోన్నతమైన మరొక మార్గం. ఈ పారమార్థిక సత్యం రచన అంతటా ఒక అంతర్వాహినిలా ప్రవహిస్తుంది.

ఇక్కడ ప్రేమకు అనేక ఉదాత్త రూపాలున్నాయి. యశోదాదేవిది నిష్కల్మష వాత్సల్యం, గోపికలది త్రికరణశుద్ధితో కూడిన సమర్పణభావం, దివ్యానురాగం, బాలసఖులది నిష్కల్మషమైన ఆత్మీయమైత్రి, గోకులవాసులది అమాయకపు ఆరాధన.

ఈ సమస్త సంబంధాల మధ్య కృష్ణుడు ఏకరూపంలో కాక, ప్రతి హృదయం స్వీకరించగల ప్రేమామృత రూపంలో సాక్షాత్కరిస్తాడు. రచయిత ప్రతిపాదించిన కృష్ణుని ‘ప్రేమతత్త్వ స్వరూపం’ అనే భావనకు ఇది సజీవమైన దృష్టాంతం.

ఇక్కడే ‘శ్రీకృష్ణదర్శనం’ సాధారణ భక్తిరచనల పరిధిని దాటి ఉత్కృష్ట తాత్త్విక శిఖరాలను తాకుతుంది.

అనంతమైన చైతన్యం పరిమితమైన బంధంలోకి ఎలా ఒదుగుతుంది? లోకసంరక్షకుడు ఒక తల్లి కోపానికి, ప్రేమ పూర్వకమైన మందలింపులకు ఎలా తల వంచుతాడు? విశ్వమంతటికీ ఆధారభూతమైన పరతత్త్వం ఒక చిన్న పల్లెలో పసిబాలుడిగా ఎలా కేరింతలు కొడుతుంది?

ఈ ప్రశ్నలకు రచయిత శుష్కమైన తార్కిక సమాధానాలు ఇవ్వరు, కృష్ణలీలల మాధుర్యాన్నే ప్రత్యక్ష సమాధానంగా నిలుపుతారు. ప్రేమ సమక్షంలో అనంతం తన ఔన్నత్యాన్ని కోల్పోదు, ఆ వైభవాన్ని దాచుకుని మరింత ఆత్మీయంగా చేరువౌతుంది. దైవత్వం తన సర్వోన్నత వైభవాన్ని చాటినప్పుడు మానవుడు భక్తిభావంతో నమస్కరిస్తాడు, అదే దైవత్వం పసిపాపగా ఒడిలోకి చేరినప్పుడు సర్వస్వాన్నీ అర్పించి నిర్ద్వందంగా ప్రేమిస్తాడు. ఈ స్థితినే శ్రీకృష్ణదర్శనం అత్యంత ప్రధానంగా ఆవిష్కరిస్తుంది.

భయంతో కూడిన భక్తి, పూజాపునస్కారాల ద్వారా కాక, సంపూర్ణ ఆత్మీయతతో కూడిన సాన్నిహిత్యం ద్వారా లభించే దివ్యానుభూతి ఇది. కృష్ణుని సర్వశక్తిమంతత్వాన్ని ప్రదర్శించడం కన్నా, అతడు మానవహృదయానికి ఎంత ఆప్తుడో, ఎంతగా తనవాడో నిరూపించడమే ఈ భాగంలోని ఆధ్యాత్మిక సౌరభం.

గోకులంలో ఆ చిన్ని కృష్ణయ్య అడుగుజాడలను అనుసరిస్తూ సాగే పాఠకుడు సైతం ఒకానొక దశలో కేవలం బాహ్య వీక్షకుడిగా మిగలడు. యశోదతో కలిసి ఆనందబాష్పాలు రాలుస్తాడు, గోపికల ముగ్ధభక్తిలో తన్మయత్వం చెందుతాడు, బాలగోపాలుని చిరునవ్వుల మాధుర్యంలో తనను తాను మరచిపోతాడు.

అక్కడే ఈ గ్రంథం సాధించిన అసలైన ఆధ్యాత్మిక విజయం దాగి ఉంది. ‘దర్శనం’ అనేది అక్షరాలకే పరిమితం కాక, పాఠకుని అంతరంగంలో నిరంతర దివ్యానుభూతిగా మారుతుంది.

ఈ బాలకృష్ణ లీలలను కేవలం చిన్ననాటి పురాణగాథలుగా భావిస్తే గ్రంథ సారాన్ని అందుకోలేము. అవి మానవప్రేమకు దైవత్వం సిద్ధించిన అమృత ఘడియలు, లౌకిక మానవ బంధాలు అలౌకిక పరమార్థాన్ని స్పర్శించిన పవిత్ర ఘట్టాలు, తల్లి ఒడిలో అనంతత్వం పరవశించిన క్షణాలు, చిన్నారి ముద్దుమోము ఎదుట సమస్త తర్కవితర్కాలు లయమైపోయిన అద్భుత రసస్థితి.

శ్రీకృష్ణదర్శనంలో గోకులమనేది ఒక గ్రామం కాదు, భగవంతుడు భక్తుడికి అత్యంత చేరువగా ఉండే అంతరాలయం. బాలకృష్ణుడు ఒక బాలరూపం కాదు, సుదూరమని భ్రమించే పరబ్రహ్మాన్ని హృదయానికి హత్తుకునేలా చేసిన ప్రేమస్వరూపం. లీల అనేది కేవలం ఒక సంఘటన కాదు, విశ్వచైతన్యం తన అనంతత్వాన్ని అమృత మాధుర్యంగా మార్చుకుని మానవ హృదయంలో కొలువైన పరమ రహస్యం. ఇదే ‘శ్రీకృష్ణదర్శనం’లో శ్రీ విశ్వపతి తిమ్మరాజు రామకృష్ణమూర్తి సాక్షాత్కరించుకున్న కృష్ణతత్త్వసారం.

***

శ్రీకృష్ణ దర్శనం (మొదటి భాగం)
రచన: టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి)
పేజీలు: 120
మూల్యం: ₹100/-
viswapathi@gmail.com
Mobile: +91 98494 43752
http://www.lordofsevenhills.com
ప్రతులకు:
Shyam: 8688616060

Exit mobile version