Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీపర్వతం-61

సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 61వ భాగం.

“వెల్‌కమ్”

సాదరంగా తనను ఆహ్వానిస్తున్న ఆయనను చూసి ఆశ్చర్యపోయాడు.

ఆయన ఎంతో అందంగా ఉన్నాడు. అచ్చు శశికళలా ఉన్నాడు. శశికళ కొంత వయసు వచ్చి జుట్టు అక్కక్కడా తెలుపయితే, అచ్చు ఇలా ఉంటుంది అనిపించింది మోహన్‌కు.

ఇంటి బయట ‘ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్’ అన్నది చూడకపోయి ఉంటే ఆయనను పోలీసు అనుకునేవాడు కాదు. ఏ కవియో, ప్రొఫెసరో అన్నట్టు ఉన్నడాయన.

మోహన్‌ను సాదరంగా ఆహ్వానించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో పని చేస్తున్నాడని తెలుసుకుని సంతోషించాడు.

“చరిత్ర, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. శశికి కూడా చరిత్ర అంటే ఎంతో ఇష్టం. వాళ్లమ్మ నుంచి వచ్చింది దానికి అది. వాళ్లమ్మ అమరావతి దగ్గర తవ్వకాలు జరపాలని పథకం వేస్తోంది. ఆ పనుల్లో వెళ్లింది. ఇప్పుడు ఉంటే మిమ్మల్ని కలిసి సంతోషించేది” ఆయన స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్నాడు.

“ఆమె స్పెషాలిటీ ఏమిటి?” అడిగాడు మోహన్.

“ఏన్షియన్ట్ ఎడ్యుకోషన్ సిస్టమ్. ఆమె ఆఫ్ఘన్‌లో కూడా తవ్వకాలు జరిపింది. షి ఈజ్ గుడ్ ఎట్ వాటెవర్ షీ డజ్. అందుకే శశికళ ఆర్కియాలజీ వైపు ఆసక్తి చూపిస్తే ఇద్దరం ప్రోత్సహిస్తాం. ఆమె ఈజిప్టాలజీ ఎంచుకుంటే సంతోషించాం. కానీ హఠాత్తుగా బౌద్ధం వైపు మళ్ళింది. ఇప్పుడు ఇద్దరూ ఇంట్లో బౌద్ధం గురించి, శాంతి గురించి, త్రీవంగా నా ముందు, ఓ పోలీసు ఆఫీసరు ముందు, చర్చించుకుంటుంటారు” అంటూ పెద్దగా నవ్వేశాడాయన.

మోహన్ కూడా నవ్వాడు. అతడికి ఈయన అప్పుడే పరిచయం అయిన వాడిలా అనిపించటం లేదు. ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న వాడిలా అనిపిస్తున్నాడు.

“నీకేదో సమస్య వచ్చిందని చెప్పింది శశికళ. ఏమిటది?” అడిగాడాయన.

ఇబ్బందిగా నవ్వాడు మోహన్.

“పర్లేదు చెప్పు” అన్నారాయన.

టూకీగా చెప్పాడు మోహన్.

ఆయన కాస్సేపు మౌనంగా ఉన్నారు.

“నేను మాట్లాడుతాను. కానీ నేను ఈ విషయంలో తల దూరిస్తే బాగుండదేమో” తనలో తాను అనుకుంటున్నట్టు అన్నాడాయన.

అంత వరకూ మౌనంగా ఉన్న శశికళ హఠాత్తుగా అంది.

“ఎందుకు బాగుండదు నాన్నా…. నీకు కాబోయే అల్లుడతడు. ఆ రిపోర్టులో నీ కూతురికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పు. అప్పుడు నువ్వు కాకపోతే ఎవరు మాట్లాడతారంటారు అందరు.”

అన్న తరువాత ఆమెకి అర్థమయింది తానేమందో!

ఆయనకూ శశికళ మాటలు ముందు అర్థమయినట్టు లేవు. నవ్వుతూ ఏదో అనబోయిన ఆయన ఆగిపోయాడు. నవ్వు పెదిమలపై ఆగిపోయింది.

ఆయన ఇద్దరి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తరువాత ఆయన ముఖం నవ్వుతో నిండిపోయింది.

“మీరిద్దరూ చిన్న పిల్లలు కారు. మీరేం చేస్తున్నారో తెలుసుకొని చేసేంత విచక్షణ ఉందనే అనుకుంటున్నాను” అన్నాడు.

మోహన్‌కి ఏమనాలో తెలియలేదు. ఇబ్బందిగా నవ్వాడు.

“థాంక్స్ నాన్నా. అమ్మకు ఎప్పుడో చెప్పాను. అమ్మ మీకు చెప్పలేదా? ”

ఆమె తల్లితండ్రులతో అంత స్వేచ్ఛగా మాట్లాడగలగటం మోహన్‌కి ఆశ్చర్యంగా ఉంది.

తమ దగ్గర నాన్న అంటే ఎంత భయం! ఆయన ముందు ఇలా కూర్చుని మాట్లాడగలగటమా? అదీ పెళ్ళి గురించి. మగపిల్లలే మాట్లాడలేరు. ఆడపిల్ల ఇలా మాట్లాడటం ఊహించటం కష్టం.

ఇదేనా కల్చరల్ ఢిఫెరెన్స్ అంటే?

“ఓ.కె మీరు మాట్లాడుతూండండి. నాకు పనుంది. రేపు ఓ సారి మీరు వెళ్లి సెక్రటరీని కలవండి. అన్ని సమస్యలూ పరిషృతమవుతాయి” అన్నాడు ఆయన లేస్తూ.

(ముగింపు త్వరలో)

Exit mobile version