Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీరామచంద్ర నిలయం

[శ్రీనివాస జోకట్టె గారి ‘శ్రీరామచంద్ర నివాస’ అనే కన్నడ కథని అనువదించి ‘శ్రీరామచంద్ర నిలయం’ పేరుతో అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశ బాబు.]

వెంకట రమణ అయోధ్యలోని శ్రీరామలల్ల ప్రాణప్రతిష్ఠ రోజు తన ఇంటిలో ప్రణతుల వెలుగును నింపడానికి కొన్ని వస్తువులను కొనడానికి మంగళూరు బస్సు ఎక్కాడు. అతడికి ఇప్పుడు తన ఇంటికి పెట్టిన పేరు పైన గర్వం పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం ఇదే ఇల్లు తనకు ఎంత తలనొప్పి తెచ్చిందని.. గుర్తుకు తెచ్చుకుంటే నవ్వు వచ్చింది. అప్పుడు అయోధ్యా రామజన్మ భూమి వివాదం గురించి కోర్టులో విచారణ జరుగుతున్న సమయం.. బస్సులో కూర్చున్న అతడి మనసు రెండు దశాబ్దాల నేపథ్యానికి జారుకోసాగింది.

***

ఉదయం ఏడు గంటల ఆవె మరియా సిటి బస్సులోనుండి వార్తా పత్రికల బండల్ కింద పడగానే ఏజంట్ దివాకర్ చురుకవుతాడు. కొద్ది సేపట్లో అతడి సైకిల్ రోడ్డు పైన ట్రిణ్ ట్రిణ్ అంటూ సద్దు చేస్తుంది. ఆ శబ్దం వినపడగానే శ్రీరామచంద్ర నిలయంలోని వెంకటరమణ చురుకవుతాడు. ‘ఈ రోజు అయోధ్య వార్తలేం ఉంటాయో?’ అనుకుంటూ తొందరగా బయటికి వచ్చి “ఏంటి విశేషాలు దివాకర్?” అంటూ పేపర్ తీసుకుంటాడు. “నిన్నటి అయోధ్య చర్చ తరువాతి భాగం ఉంది.. చూడండి.” అంటూ తన సైకిలును ముందుకు తొక్కుతాడు.

లోపల అమ్మ టీ పెడుతుంటే, భార్య లక్ష్మి వంట చేస్తుంటే వెంకటరమణ చావడిలో కూర్చుని ఆ రోజు దిన పత్రికను చదవడం మొదలుపెడతాడు.

క్రితం రాత్రి టివి వార్తలు వినేటప్పుడు కూడా లోక్‌సభ వార్త వచ్చినప్పుడు ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేతలు అయోధ్య గురించి గొడవ పడుతుండడం గమనించి ఉన్నాడు. ఈ రోజు పత్రికలో దాని గురించి తప్పకుండా వార్త వచ్చుండాలి. పేపర్ తీయగానే “అయోధ్య గురించిన తమ పట్టుదల అచలం” అనే శీర్షిక కనిపించింది. రామ మందిరం నిర్మించాలన్న పరమహంస గారి చివరి కోరికను ఈడేరుస్తామన్న ఆశయం వ్యక్తపరచిన ప్రధాని మాటకు ప్రతిపక్షాలు ఆక్షేపం వ్యక్తపరచి చివరికి వాకౌట్ చేశారు. ప్రధాని ఒత్తిడికి లోనయ్యారు.. అన్నది ప్రతిపక్షాల వాదన.

వెంకటరమణ వాస్తవానికి వచ్చాడు. ఒత్తిడి తను కూడా అనుభవించాడు కదా! ఇటీవల తన ఇంటి గుమ్మం వద్ద నిలుచుకోవడానికి కూడా వెంకటరమణకు ఇబ్బందిగా అనిపిస్తోంది. బయట రోడ్డు పైన వెళ్ళే వాహనాలు బస్టాప్‌లో నిలబడ్డప్పుడు బస్సులోని ప్రయాణికులలో కిటికీ పక్కన కూర్చున్నవారు ఇతడిని గమనించడం జరుగుతుంది. అవును. కారణమేమంటే ఈ ఇంటి పేరు ‘శ్రీరామచంద్ర నిలయం’. మూడు నాలుగు తరాల క్రింద కట్టిన ఇల్లది. ఈ ఇంటి పేరు వల్లనే అక్కడ ఉన్న బస్‌స్టాపుకు ‘రామనిలయం స్టాప్’ అని కండక్టర్ పిలుస్తాడు. బస్సులోని జనాలు తననే చూస్తున్నట్టు, తను ఒక విలన్ అయ్యాడేమో.. అనే భయం వెంకటరమణను సతాయించసాగింది. ఈ ఇంటి పేరు ‘శ్రీరామచంద్ర నిలయం’ అని ఉన్నప్పుడు అందులో ఉన్నవాళ్ళంతా మతతత్వవాదులే అయి ఉండాలని ఊళ్ళోని కొందరు స్వఘోషిత ప్రగతిపర వాదులు భావించడం వెంకటరమణకు కలవరం కలిగించసాగింది. ఎప్పుడైతే అయోధ్యలో కరసేవకుల జాథా నడిచి, వివాదస్పదమైన కట్టడం దొర్లిందో అప్పటినుండి వెంకటరమణకు నిద్ర పట్టకుండా పోయింది. ఆ రోజు నుండి శ్రీరామ అనే పేరు ఈ దేశంలోని బుద్ధిజీవులకు ఒక విలన్‌లా అనిపించే వాతావరణం ఏర్పడుతున్న సమయం అది. ‘శ్రీరామచంద్ర నిలయం’ యజమాని కూడా అయిన వెంకట రమణ కూడా ఆ రోడ్దు పైన వెళ్ళి వచ్చే వాళ్ళ దృష్టిలో పరోక్షంగా ‘మత ఛాందసుడు’ అయి ఉండవచ్చని ఊహిస్తూ తనలో తనే మథనపడేవాడు.

వెంకటరమణకు ఈ సంకెళ్ళ నుండి ఎలా బయట పడాలా అని తోచక దిగులు పడసాగాడు. మొదటి పరిహార క్రమంగా తన ఇంట్లో ‘రామాయ రామభద్రాయ..’ అని భార్య, కొడుకు గొంతెత్తి పాడే శ్లోకాన్ని గొంతు తగ్గించమని సూచించాడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే చాలా ఇబ్బందిగా మారేది. వెనుకటి సంవత్సరం తండ్రి ఆబ్దీకానికి వచ్చిన ఒకాయన భోజనానికి కూర్చున్నప్పుడు అడిగేశారు. “మీరు తొంభై రెండులోని కరసేవకు వెళ్ళారా? బజరంగ్ దళ్ మెంబరయ్యారా?..” అంటూ కొన్ని ప్రశ్నలు అడగ్గా తింటున్న అన్నం వాంతి అయినట్టయ్యింది. శ్రీరాముడితో పాటు తను కూడా విలన్‌గా ఈ ప్రజలకు కనబడినా ఆశ్చర్యం లేదు అనుకుని నిట్టూర్చేవాడు.

ఆ రోజు నగరంలో భవ్య హిందూ సమ్మేళనం. ఊరివాళ్ళంతా లారీ మాట్లాడుకుని సమ్మేళనానికి తరలి వెళ్ళారు. అక్కడ త్రిశూలాల పంపిణీతో పాటు భారతదేశాన్ని హిందూ రాజ్యంగా చెయ్యాలన్న గురి తలపెట్టబడింది. తనను  కూడా ఆ సమ్మేళనానికి లారీలో తీసుకెళ్ళవచ్చు అనే భయంతో వెంకటరమణ పొద్దున్నే తొందరగా లేచి ఎక్కడికో వెళ్ళిపోయి రాత్రి వార్తల సమయానికి ఇంటికి తిరిగి వచ్చాడు. రెండు చోట్ల కార్యక్రమాల్లో శ్రీరాముడి గురించి మాట్లాడాల్సి ఉన్నా వెళ్ళలేదు. తన గొంతు పడిపోయింది, డాక్టర్ ఎక్కువగా మాట్లాడరాదు అని చెప్పారు.. అని అబద్ధాలు చెప్పసాగాడు. మొత్తానికి రాముడికి, తనకు ఏ రకమైన కనెక్షన్ లేదని చాటవలసిన ఇరకాటంలో పడ్డాడు. ‘శ్రీరామచంద్ర నిలయం’లో నివసిస్తున్న తనను మతతత్వవాది అని ప్రజలు పిలుస్తారేమోనని వెంకటరమణ అనుకోసాగాడు.

***

కొంకణ్ రైలు పట్టాల పైన మత్స్యగంధి ఎక్స్‌ప్రెస్ శబ్దం చేస్తూ వెళుతోంది. ఆ శబ్దం వినబడినప్పుడల్లా వెంకట్రరమణ ఏదో ఆలోచనలో పడతాడు. అప్పుడింకా ఈ కొంకణ్ రైల్వే పట్టాలు పడలేదు. భూసేకరణ కార్యక్రమం నడుస్తోంది. కొంకణ్ రైల్వేకి ఈ పరిసరాల్లోని భూమిని ఇవ్వాలన్నప్పుడు వెంకటరమణ సంతోషపడ్డాడు. ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి కొత్త ఇల్లు కట్టుకుని కొత్త పేరు పెట్టుకోవచ్చు అని కలలు కన్నాడు. కాని కొన్ని రోజులకే ఆ కల కరగిపోయింది. దగ్గరలోని జమీందారు ఒకాయన తన భూములను కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులను పట్టుకుని పట్టాల రూటును మార్చాడు. ఊరు వదిలే తయారిలో ఉన్న వెంకటరమణకు ఇదొక షాక్‌లా తగిలింది.

ఇంకేం చెయ్యడం అని మథనపడుతూ ఇక చివరికి ఇల్లు అమ్మెయ్యడమొకటే దారి అనిపించింది. కానీ ఇల్లు అమ్మడం కూడా కష్టమే. ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళలో కొందరైతే “మనవాళ్ళకే అమ్మండి. వాళ్ళకు అమ్మొద్దు వీళ్ళకు అమ్మొద్దు” అంటూ సలహాలు ఇవ్వసాగారు. “మీరు ఇల్లు అమ్మేటట్టయితే ఆ బీరువా మాకివ్వండి, ఈ కుర్చీ మాకివ్వండి” అంటూ ఇంటిలోని వస్తువులను బుక్ చేసుకోసాగారు.

ఇలాంటి పితకలాటంలో పడిన వెంకటరమణ జీవితంలో అప్పడి నుండి ఇప్పడి దాకా కొత్తగా ఏమీ మార్పులు కనరాక అదే ‘శ్రీరామచంద్ర నిలయం’లోనే ఉంటూ ‘ఒకవేళ తను అడ్రెసునైనా మార్చి ఇస్తే బాగుంటుందేమో’ అని అనుకోసాగాడు.

***

అటు అయోధ్యలో తవ్వకాల గురించి వార్తలు బయట పడుతుండగానే వెంకటరమణకు ‘తన ఇంటిని కూలగొడితే ఎలా ఉంటుంది..? లేదా ఇంటి పేరును మారిస్తే ఎలా ఉంటుంది?’ లాంటి ఆలోచనలు రాసాగాయి. ఇంటి పేరు మార్చే ప్రస్తావనకు తల్లి సుతరామూ ఒప్పుకోలేదు. “నేను పోయిన తరువాత ఏమైనా చేసుకో!” అన్నది. భార్య కూడా “కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికి ఇదే ఉండనీయండి” అనింది.

మొన్న ఊరి పెద్ద ఒకాయన ‘శ్రీరామచంద్ర నిలయం’ కు వచ్చారు. మాటల మధ్యలో “ఆ సంఘటన జరిగి ఒక దశాబ్దమే గడిచింది. మొన్న నేను అయోధ్యకు వెళ్ళొచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు అయోధ్యలో గుడికి వెళ్ళినట్టే అనిపించలేదు. మూడు మూడు చోట్ల పోలీసుల తనిఖీలు ముగించి, లోపలికి వెళ్ళి ఒక టెంట్లో ఉన్న రామ్ లల్లాను చూసి రావడమే ఒక సాహసంగా అనిపించింది. ఎప్పుడు రామ మందిరం వెలుస్తుందో.. అని కాచుకున్నాను. నేనుంటానో ఉండనో అనుకునే మొన్న వెళ్ళొచ్చాను..” అన్నారు.

ఆ రాత్రి వెంకటరమణకు నిద్ర పట్టలేదు. ముందేమిటి..? అనే ప్రశ్ననుండి బయటకు రావడానికి తన్నుకోసాగాడు. ఎలాగైనా ఈ పెంకుటింటిని కూలగొట్టి, సిమెంటు ఇల్లు కట్టినప్పుడే దీనికి పరిహారం వీలయ్యేటట్టుంది. ఇల్లు అమ్మాలనుకుంటే తరువాతైనా అమ్మవచ్చు కదా..? అనే నిర్ణయానికి వచ్చేశాడు. అయినా సిమెంటు ఇల్లు కట్టడం అంత సులువా? డబ్బులు కావాలి కదా? అని అనుకున్నప్పుడు ఒక ఐడియా తట్టింది.

మరుసటి రోజు తన బాబాయ్, తమ్ముళ్ళకు ఒక లెటర్ రాసేసాడు. “మీరంతా ముంబై, ఢిల్లీ, మైసూరు ఇలా వేర్వేరు చోట్ల ఉన్నారు. నాకిక్కడ పెద్దలు కట్టిన ఇంట్లో ఉండడం కుదరడం లేదు. నేను కూడా ఇంకో ఇంట్లోకి మారాలనుకుంటున్నాను. ఈ ఇల్లు పాతదయి పోతోంది. మన పూర్వీకులు పూజించుకుంటూ వచ్చిన దేవుళ్ళంతా ఇక్కడే ఉన్నారు. పండగలు, పూజల ఖర్చులు భరించలేక పోతున్నాను. కావలసినవాళ్ళు దేవుళ్ళను తీసుకెళ్ళండి. నాకైతే కష్టంగా ఉంటోంది. ఎవరికీ అక్కర్లేదనుకుంటే నేను ఉడుపిలోని మధ్వ సరోవరంలోకి (పుష్కరిణి) దేవుళ్ళ మూర్తులను వేసేద్దాం అనుకుంటున్నాను. మీకేమైనా పూర్వీకుల దేవుళ్ళు కావాలనుకుంటే తీసుకెళ్ళవచ్చు. తరువాత వచ్చే కష్టనష్టాలు మీరే భరించాల్సి ఉంటుంది. నేను దానికి బాధ్యుణ్ణి కాను. మీ బదులు కోసం నిరీక్షిస్తూ ఉంటాను..” అని రాసి అదే రోజు అందరికీ పోస్ట్ చేశాడు.

ఇంకో వైపు వెంకటరమణ తను ఛాందసుణ్ణి కానని చూపడానికి ఆత్రపడసాగాడు. ఇంటి దేవుడి పూజప్పుడు మ్రోగించే జేగంటను మెల్లగా కొట్టమని కొడుకుకు చెప్పేటందుకు భార్యను ఒప్పించాడు. బంధువుల ముందు, ఊళ్ళోని వాళ్ళ ముందు తను ‘ప్రగతిశీలుణ్ణి’ అని, అంత ధార్మిక వ్యక్తిని కానని చూపించుకోవడానికి సంకల్పించాడు.

***

కబురు అందిన పదిరోజులకి బాబాయ్, తమ్ముళ్ళు అంతా వచ్చారు. కుటుంబ సభ్యులతో ఒక మీటింగ్ జరిగింది. “పూజలు ముందులాగనే జరగనీ. ఖర్చులకు మా వైపు నుండి కొంత డబ్బులు పంపుతాము. దేవుణ్ణి మాత్రం పుష్కరిణిలో వేయద్దు” అని వెంకటరమణను ఒప్పించారు. తన సిమెంటు ఇంటి కోరికను వెంకటరమణ నింపాదిగా మీటింగులో ప్రవేశపెట్టాడు. పెద్దవాళ్ళు కట్టిన ఇల్లు, నిలుపుకోవాలి అంటూ సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సరే, పంచాంగం చూసి మరుసటి నెలలో కొత్త ఇంటికి శుభ గడియలున్న ముహూర్తాన్ని ఖాయం చేశారు.

అలా కట్టిన కొత్త ఇంటికి ‘శ్రీరామచంద్ర నిలయం’ అనే పేరును చెరిపేస్తే ఇక తనను ఆ కలత సతాయించదు అనేది వెంటరమణ నమ్మకం. అయోధ్య ప్రకరణం ఇన్ని సంవత్సరాలైనా ఇంకా వాద వివాదాలు నడుస్తున్నాయి అంటే అది నిర్ణయం కాకుండా తన ఇంటి పేరు సమస్య కూడా ఒక కొలిక్కి రాదు అని అతడికి అనిపించింది.

వెంకటరమణ ఇప్పుడిప్పుడు పత్రికలకు మత సామరస్యం పైన వ్యాసాలను రాస్తూ, తను ఒక చింతనాశీలుడిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఊళ్ళోని భజనా మందిరం కమిటీలో, పాఠశాల అభివృద్ధి కమిటీలో, మత సామరస్య కమిటీలో సభ్యుడుగా కూడా ఉన్నాడు. అలా అందరితో కలుస్తూ తనొక ప్రగతిశీల వ్యక్తి అని అనిపించుకోవడం అతడికి అత్యవసరం అనిపించింది. పాపం, ఏం చెయ్యగలడు? ఊళ్ళోని మేధావి వర్గాల ముందు తనొక మత ఛాందసుడు కానని ప్రదర్శించాల్సిన అవసరం అతడి ముందు ఉండింది. దీనంతటికీ కారణం తన ఇంటి పేరు ‘శ్రీరామచంద్ర నిలయం’ అని ఉన్నదే కారణం అన్నది అతడికి మాత్రం తెలుసు.

చివరికి మూడు తరాలకంటే ఎక్కువ కాలం వైభవంగా విలసిల్లిన ‘శ్రీరామచంద్ర నిలయం’ అన్న పెంకుటిల్లు కూలిపోయి, ఆ స్థలంలో కొత్త సిమెంటు ఇల్లొకటి నిలిచింది. ఆ సంతోష గడియల్లో ఆ కొత్త ఇంటికి ఏం పేరు పెట్టాలి అన్న సమస్య వెంకటరమణను సతాయించసాగింది. గృహ ప్రవేశం పత్రికలు ప్రింటవక ముందే ఇంటి పేరు పెట్టి తీరాలి. స్నేహితులతో చర్చించాడు. కొన్ని సలహాలు వచ్చాయి. అన్నిటినీ రాసి పెట్టుకున్నాడు. ఈసారి మాత్రం మతీయవాది అనే ఆక్షేపణ రాకుండా ఉండేలా పేరు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. లౌకికవాద దేశమైన భారతదేశంలో అలాంటి ముద్ర కనిపించేలా ఏ పేరు అనిపించవచ్చు అని తన భార్యతోనూ చర్చించాడు.

***

మళ్ళీ లోక్‌సభలో జరిగిన గొడవ గురించిన వార్త. వెంకటరమణ వార్తా పత్రిక చదువుతూ కూర్చున్నాడు.

అయోధ్యలోని వివాదాత్మక కట్టడాన్ని కూల్చిన సంఘటనలోని కొందరు ముద్దాయిలను ప్రభుత్వం రక్షిస్తోంది అని ఆపాదిస్తూ, ప్రతిపక్షాలు ప్రధాని వాజపేయిగారు దిగిపోవాలంటూ ఒత్తిడి తెచ్చాయని ఆ రోజు పత్రికలోని హెడ్ లైన్లలో వచ్చింది. ఈ సంఘటనలో ఒకవేళ ఒత్తిడికి లోనయ్యే సన్నివేశం ఎదురైతే తాము పదవి త్యాగానికి సిద్ధమని ప్రధాని ఘోషించారు. ప్రధాని కూడా ఒక మనిషే.. ఆయనకూ భావనలున్నాయి. తను మాటి మాటికి తన మాటను మార్చనని అన్న మాటలను  వెంకటరమణ పత్రికలో మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు.

టివి ఆన్ చేశాడు.

వార్తలు వచ్చే సమయం. నిన్నటి గొడవ దృశ్యం మళ్ళీ కనిపించింది. తను మాట పైన నిలబడతామని ప్రధాని అంటున్నారు..

***

ఈ మధ్య వెంకటరమణ ప్రవర్తన ఇంట్లోని వాళ్ళకు విడ్డూరంగా అనిపించసాగింది. ఆ రోజు భార్య అడిగేసింది. “ఏమైంది మీకు? విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఒకసారి తిరుపతికి వెళ్ళొద్దాం. ఏ ధార్మిక కార్యకలాపాలకు రాకుండా ఉన్నారు. ఏంటి కథ? అయోధ్య సంఘటనల గురించి ఎందుకంత కంగారు మీకు? ఏ రోజో ఒక రోజు తీర్పు రావచ్చు.. మన ఇంటి పేరు గురించి మీకు ఎందుకింత కలత? ఎందుకలా ప్రగతిశీలుడిలా పోస్ కొడ్తారు? అంతా వదిలెయ్యండి. ముందులా ఉండండి. మీలా బ్రతకండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళను మెప్పించాలని చూడకండి.. మన మతం మనది, మన జాతి మనది. దాని గురించి గర్వంగా ఉండాల్సింది పోయి ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు’ వాళ్ళను మెప్పించడానికి పోయి మీరు బాధ పడుతున్నారు. సిగ్గు పడాలి మీరు..”

వింటున్న వెంకటరమణకు తన తాళం ఎక్కడో తప్పింది అనిపించసాగింది.

ఆ రాత్రి తనకు ఉన్నట్టుండి మతీయవాదిని కాను అని చూపించాలన్న తపన ఎందుకు కలిగింది? ఆ ఆలోచన ఎక్కడినుండి వచ్చింది? ఎవరూ తనను ఒత్తిడి చెయ్యలేదు కదా? అలాగయితే తను ఎందుకు ఇన్ని రోజులు భ్రమలో, ద్వంద్వంలో బతకాల్సి వచ్చింది?.. తననే ప్రశ్నించుకున్నాడు.

నవ్వుకున్నాడు. ఏ తప్పూ చెయ్యని తను ఎందుకు భయపడాలి? ఎవరూ తనను ఏమీ అనలేదు కదా.. వార్తా పత్రికల్లోని వార్తలు చదివి, టీవిలోని వార్తలు విని తనంతట తానే భ్రమలో పడ్డాడు.. ఛీ ఇలాంటి వార్తలకు తనెందుకు భయపడ్డాడు?

ఆ క్షణంనుండి వెంకటరమణ మనస్సును గట్టిపరచుకున్నాడు.

చేతిలో పెన్ను తీసుకుని కాయితం పైన గృహ ప్రవేశానికి ఆహ్వానిస్తూ రాయడానికి మొదలు పెట్టాడు. ‘రేపు ప్రెస్సుకు వెళ్ళి టైప్ చేయడానికి ఇవ్వాలి’ అనుకున్నాడు. తరువాత అమ్మను, భార్యను పిలిచాడు.

“ఇదిగో! ఆహ్వాన పత్రిక తయారయ్యింది. ఇంటి పేరుకూడా తట్టింది. రేపు ప్రెస్సుకు వెళ్ళి ఇచ్చి రావాలి” అన్నాడు.

భార్య “ఏదీ ఇలా ఇవ్వండి. ఇంటికి ఏం పేరు పెట్టాలనుకున్నారు?” అంటూ చదవడానికి తీసుకుంది. చదివి ఆశ్చర్యంతో అతడి మొహం వైపు చూసింది. “కొత్త ఇంటికి ఏం పేరు పెట్టావురా?” అంటూ అమ్మ అడిగింది. మళ్ళీ అదే పేరు! “శ్రీరామచంద్ర నిలయం” అని భార్య అనగానే “అవును. నేను కూడా మనిషినే. నేను భారతీయుణ్ణి కూడా!!” అన్నాడు వెంకటరమణ.

అప్పుడే మంగళూరుకు బస్సు చేరుకుంది. ప్రాణప్రతిష్ఠ రోజు వేడుకలకు కావలసిన సరుకులు కొనడానికి మార్కెట్ వైపు అడుగులు వేశాడు వెంకటరమణ.

కన్నడ మూలం: శ్రీనివాస జోకట్టె

తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

Exit mobile version