[‘సూర్యాస్తరాగం’ అనే అనువాద కథని అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. ఒడియా మూలం అరవింద్ రాయ్.]
వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. మూడురోజుల రైలు ప్రయాణం చేసి, తర్వాత రెండు గంటలు బండిలో ప్రయాణం చేసి కూడా వాళ్ళు అలసిపోలేదు.
వాళ్ళకెక్కువ సమయం లేదు.
బహుశా ఇంకో గంటలో పొద్దువాలుతుంది. ఆలస్యం అయిపోతే వాళ్ళిక ఆ సూర్యాస్తరాగాన్ని చూడలేరు.
ప్రతి ఒక్కరూ అక్కడి కొండలు, నది, తురాయి గురించి, విశేషించి ఆ సూర్యాస్తరాగాన్ని గురించి అనేక కథలు చెప్పి ఉంచారు.
డ్రైవర్ కూడా అదే ప్రాంతం వాడు. ఇంకో గంట! అనుకుంటూ అసహనంగా ఉన్నారందరూ. దారి ఇంకొంచెం దూరమైందేమో అనిపిస్తోంది. ప్రయాణం ముగిసేలానే కనిపించడం లేదెవరికీ. సూర్యుడు మునిగే వేళకు చేరడం సాధ్యమయ్యేలా లేదు. వారి ఉత్కంఠ చూసి, డ్రైవర్ మాటలు మొదలెట్టాడు.
***
ఇద్దరిలో ఒకరు డీలా పడితే ఇంకొకరు వారి వీపు తట్టి, “ఏమైంది, చెప్పు!” అంటూ పలకరించుకునేవారు.
ఒకోసారి నడుస్తూన్నప్పుడు ఏదైనా చిన్న దెబ్బ ఒకరికి తగిలితే, ఇంకొకరు, “అయ్యో మెల్లగా. ఎక్కడా ఏమీ తగల్లేదుగా?” అని అక్కరగా అడుగుతాడు.
ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని సూర్యాస్తమయం చూడడానికి రోజూ వెళ్తుండేవారు. నదీతీరాన దుమ్ములేపుతూ ఆవులు తిరిగొస్తుండేవి. నదీ తీరంలో తోటల దగ్గర పైన దూరంగా ఆకాశాన పక్షులు ఒక పంక్తిలో వెళ్ళడం కంట పడేది. నదికి ఆ ఒడ్డున జనాలు ఇంటికి మళ్ళే కోలాహలం వినిపిస్తుంటుంది. నదికి పడమటి వైపు ప్రతి రోజూ రెండు కొండల మధ్యన సూర్యుడు మునుగుతుండేవాడు.
సూర్యుడు మునిగే ముందే వాళ్ళిద్దరూ వచ్చి రోజూ నది ఒడ్డున ఒక పాతకాలం నాటి తురాయి చెట్టు కింద కూర్చొని సూర్యాస్తమయం చూసేవారు. సూర్యుడు మునిగాక చుట్టూ చీకట్లు అలముకోక మునుపే వాళ్ళు రోజూ ఒకరి చేతిలో ఇంకొకరు చేయివేసి పట్టుకొని ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళు.
నగరంలోని ఈ ప్రాంతంలో, బీద, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నచోట, గణేశుడు పాలు తాగడం దగ్గర్నుంచి, భూతం ఉల్లిగడ్డ తింటుందనే సంగతుల వరకూ అన్నిరకాల చర్చలూ జరిగేవి. అప్పుడప్పుడూ కొందరు జనాలు వీళ్ళ స్నేహం చూసి,ఇద్దరిలో ఒకరు చీర కట్టుకొని ఆడదైతే, ఇంకొకరు ఆమె మొగుడవుతారు, ఇంకోమారు ఇంకొకరు చీర, గాజులు, సిందూరం పెట్టుకొని ఆడదైతే మొదటివ్యక్తి ధోవతి, చొక్కా తొడిగి చేతుల్లో మల్లెపూలతో ‘పద, ఈ రాత్రికి రాసక్రీడలాడదాం’ అంటారేమో అనీ చెప్పుకునేవారు.
ప్రతిరోజూ వాళ్ళిద్దరి గురించి జనాల్లో ఏవో పుకార్లు పుట్టేవి. కానీ వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలీవో లేక తెలిసినా పట్టించుకోరో మరి!
వాన పడుతుంటే ఇద్దరూ ఒకే గొడుగులో ముడుచుకొని నడుస్తూ కూరలు తేవడానికి మార్కెట్ కెళ్తుంటారు. పార్క్ లలో తిరుగుతూ మిక్స్చర్ తింటుంటారు.
వాళ్ళిద్దరి గురించీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం ఏంటో ఎవరికీ తెలీదు.
తెల్లగా, బక్కపల్చగా ఉండే పెద్దాయన పేరు కమలాకాంత్ పట్నాయక్. ఆయన అధ్యాపకుడు. ఆయనకు కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు అందరితో కూడిన నిండైన కుటుంబం ఉంది. ఉన్నట్టుండి ఒకనాడు ఆయన భార్య కాలం చేసింది.
ఆమె పోయాక ఆయన మనసునెలాగో సమాధానపరచుకున్నాడు. ‘ప్రపంచమే ఇంత. ఎవరు, ఏమిటి అనేవేమీ తెలీకుండానే ఒకరినొకరు పెళ్ళాడతారు. జీవితమంతా తోడు ఉంటామని ప్రమాణాలు చేసుకుంటారు. అయితే ఉన్నట్టుండి చేయి విడిపించుకొని వెళ్ళిపోతారు. అవును. ఈ రోజు ఆమె వెళ్ళిపోయింది. రేపు నేనూ వెళ్ళిపోతాను.’ అనుకున్నాడు. ఆమె పోయిన బాధను లోపలే దిగమ్రింగుకొని అలాగే బతుకీడుద్దామనుకున్నాడు. తనను తానే ఓదార్చుకున్నాడు.
కానీ మెల్లమెల్లగా ఆయన మనోబలం తగ్గిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కుటుంబానికి తానొక అనవసర వస్తువయ్యాడని తెలుస్తున్న కొద్దీ, ముఖ్యంగా, మునుపు పొద్దున్నే పూలు తేవడానికి వెళ్ళేప్పుడు భార్య సౌదామిని పూల బుట్ట చేతికిస్తూ, ‘త్వరగా వచ్చేయండి.’ అని చెప్పేది. తిరిగొచ్చేసరికల్లా తులసిఆకుల రసం తన కోసం సిద్ధంగా ఉంచేది.
చామదుంపలంటే ఆయనకు ఇష్టం. అందుకే సౌదామిని చామదుంపలతో ఏదో ఒకటి చేస్తుండేది. అలాగే గుమ్మడిగింజలు కూడా చాలా ఇష్టమని ఆయనకోసం గుమ్మడిగింజల వడియాలు పెట్టేది. చలికాలం మొదలవుతూనే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసిచ్చి, పుక్కిలించమనేది.
ఆ రోజులన్నీ కమలాకాంత్ కు గుర్తొస్తున్నాయి. పూలు తేవడానికి బయటకు వెళ్ళొద్దంటాడు కొడుకు.
కోడలేమో, “వేరే వాళ్ళ తోటలో పూలు కోసే పనేముంది?”, “పిల్లలకు చామదుంపలు చూస్తేనే చిరాకు.” అంటూ ఉంటుంది.
చలికాలంలో గొంతు రాసినా, దగ్గు మొదలైనా కోడలు రెండు టాబ్లెట్లు చేతిలో పెట్టి, “ఈ చలికి బయటకు వెళ్ళకండి. ఆరోగ్యం పాడైతే చూసుకునే వాళ్ళెవరు” అంటుంది.
సౌదామిని వెళ్ళిపోయాక కాలం ఇంతగా మారిపోతుందని అనుకోనేలేదు. తనను తాను అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఆలోచిస్తుంటాడు. భార్య భార్యనే.. పిల్లలు పిల్లలే. భార్య మాదిరి పిల్లలెక్కడ అర్థం చేసుకుంటారు? సరే, పోయేరోజు వచ్చినప్పుడు పోక తప్పదు. ఎప్పుడేం జరగాలో అది జరుగుతుంది. సౌదామిని ఆరోగ్యంగా ఉండేది. కానీ రెండు మూడు రోజులు జ్వరం అంతే. వెళ్ళిపోయింది. అలాగే ఎప్పుడో రోజు తానూ వెళ్ళిపోతాడు.
ఒకరోజు పెద్దమనుమడు సౌమ్యుడు, “తాతగారూ, మీరు టీ తాగేటప్పుడు అలా శబ్దం చేస్తూ ఎందుకు తాగుతారు? ఊరికే తాగలేరా? మీరలా శబ్దం చేస్తే నాకస్సలు నచ్చదు.” అన్నాడు.
“ఒరే, ఇదేంట్రా ఇది? నీవు ఈ ఇంట్లోకొచ్చి పదేళ్ళు కాలేదు, నేను అరవై ఏళ్ళనుంచి ఇదే ఇంట్లో ఉన్నాను. నీవు చెప్పి నేను తెలుసుకోవాలా ఏది ఎలా చెయ్యాలో చెయ్యకూడదో!”
“సరే అయితే. మీరు బయట కూర్చొని తాగండి. ఇంట్లో కుక్క లాగా గతక్కండి.” సౌమ్యుడు జవాబిచ్చాడు. సౌమ్యుని మాటలు చాలా బాధపెట్టాయి.
సాయంత్రం కొడుకు ఇంటికి రాగానే సౌమ్యుడు ఇలా అన్నాడని కమలాకాంత్ చెప్పాడు. కొడుకు మనుమడిని దండిస్తాడని, ‘తాతగారు ఇంటికి పెద్దవారు. ఆయన్ని ఇలా అనకూడదు. వెళ్ళి క్షమాపణ అడుగు’ అంటాడని ఆశించాడు. కానీ కొడుకు ఏమీ మాట్లాడలేదు. ఈ సంగతి వినీవిననట్టు చేతిలోకి పత్రిక తీసుకొని కూర్చున్నాడు. కొడుకు వినలేదేమో అని మళ్ళీ గట్టిగా, “ఒరేయ్, వినబడిందా లేదా? నీ కొడుకేమంటున్నాడో చూశావా నన్ను?” అన్నాడు.
కొడుకేదో ప్రశ్నవేశాడు.
“అంటే, నీవూ..!”
మధ్యలోనే మాట తుంచుతూ కొడుకు జవాబిచ్చాడు, “మీకు వెయ్యి సార్లు చెప్పాను, ఆ అంగడి దగ్గరకు పోవద్దని. మీరు వింటారా? పోయి ఆ గేరేజ్ దగ్గర బెంచీ మీద కూర్చుంటారు. అందరూ ఏమనుకుంటారు? సొసైటీలో మనకంటూ ప్రెస్టీజ్ ఉందా లేదా?”
కొడుకు మాటలతో కమలాకాంత్ హృదయానికి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడిక ఈ ఇంట్లో తన అవసరమేమీ లేదని గ్రహించాడు. సౌదామిని కాలం చేశాక తన సొంత ఇల్లు కూడా పరాయిదైపోయినట్టుగా తోచింది.
ఒకసారి సౌదామిని బాగా గుర్తొస్తూ ఉండింది. మాటిమాటికీ ఆమె ముఖమే కనులముందున్నట్టు ఉండింది. కమలాకాంత్కు అశాంతిగా అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్ళి నది ఒడ్డున కూర్చున్నాడు. సాయంకాలమైంది. పడమటి కొండల్లో సూర్యుడు మునుగుతున్నాడు.
సూర్యుడు క్రమంగా లోహిత వర్ణంలోకి వచ్చాడు. నది నీటి పైన సూర్యుని స్వర్ణకిరణాలు పరచుకొని ఉన్నాయి. ఆయన విగ్రహంలా నిలబడ్డాడు. సౌదామిని జ్ఞాపకాలతో జారుతున్న కన్నీటిని తుడుచుకుంటున్నాడు.
“ఏంటి, నడిదారిలో విడిచిపెట్టి వెళ్ళిన తోడు గుర్తొస్తోందా?”
దగ్గర నిలబడి ఎవరో అడుగుతున్నారని కమలాకాంత్ గమనించనే లేదు. కానీ, సౌదామిని వెళ్ళిపోయాక తన మనసునెరిగేవాళ్ళూ ఒకళ్ళు ఉన్నారని మొదటిసారి అనిపించింది.
ఆయన కంటి నుంచి రెండు చుక్కల కన్నీరు జారి నేలపై పడింది. దగ్గర నిలబడి ఉన్న పెద్దమనిషి చేయి చాపి కమలాకాంత్ కన్నీళ్ళు తుడిచాడు.
కమలాకాంత్ గొంతు పూడుకుపోయింది. ఎలాగోలా తనను తాను సంభాళించుకుంటూ, “అవును, సౌదామిని గుర్తొస్తోంది.” అన్నాడు.
“నాకు తెలుసు.”
ఈ మాట వింటూనే కమలాకాంత్ కండ్లలో మళ్ళీ కన్నీళ్ళు తిరిగాయి.
“ధైర్యం తెచ్చుకోండి, ఏడవకండి.”
కాస్త పక్కకు జరిగి, కుంగుతున్న సూర్యుడిని చూస్తూ ఎంతో భావుకుడై, ఆ వ్యక్తి, “నేనూ ఇలా ఎంతో ఏడ్చాను. నది ఒడ్డున ఈ తురాయి పూల చెట్టు పక్కన తిరుగుతూ ఏడుస్తూ ఉండేవాడిని. ఈ పక్షులు, ఈ మునిగే సూర్యుడు తప్పితే ఇంకెవరైనా చూడగలిగారా నా కన్నీళ్ళను? నాకు మీరెవరో తెలియదు. కానీ మిమ్మల్ని ఈ స్థితిలో చూసి, మీరు పోగొట్టుకున్న మీ ఆత్మీయులనెవరినో వెదుకుతున్నారని తెలుస్తోంది.”
కృతజ్ఞతతో కూడిన చిరునవ్వుతో కమలాకాంత్ ఆయన వైపు చూశాడు.
“నా పేరు చంద్రశేఖర్ మహాపాత్ర. పదేళ్ళ కిందటే హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యాను. కొడుకు ఈ ఊళ్ళోనే ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. మునుపు మా ఊళ్ళో ఉండేవాడిని. ఉద్యోగం రాగానే బిడ్డకు పెండ్లి చేశాను. ఊళ్ళోని ఆస్తిపాస్తులు అలాగే ఉన్నాయి. అందరూ ఊరు విడిచిపోయినారు. మేము భార్యాభార్తలమిద్దరం కులాసాగా కాలం గడిపేవాళ్ళం. పెన్షన్ డబ్బులతో సుఖశాంతులతో బతికేవాళ్ళం. అయితే ఆ సుఖం ఎక్కువ కాలం ప్రాప్తం లేదు. ఒకసారి భార్యకు జబ్బు చేసింది. అంతే, నా కళ్ళముందే రెండు మూడు రోజులలో కాలం చేసింది. తర్వాత కొడుకు నన్నిక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళంతా నన్ను బాగా చూసుకుంటారు. కానీ పెంపుడు పిట్టకు ఎంత చేసినా, అది బందీ కాకుండా పోదుగా? ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలతో సమానమవుతుందా? అలా ఉన్న ఊరు వదిలేసి వచ్చినప్పటి నుంచి నేను బొత్తిగా ఒంటరినైపోయాను. పంజరంలో చిక్కిన పిట్టలాగా.
నా భార్య ప్రియంవద కూడా నా అవసరాలనెంతో బాగా పట్టించుకునేది. నేను ఒంటికి నూనె మర్దనా చేసుకుంటే తను బావిలోంచి నీళ్ళు తోడి పెట్టేది. నేను పూజ చేసుకునేటప్పుడు, ఏ స్తోత్రంతో పూజ పూర్తి చేస్తానో, తనకు తెలుసు. టీలో నాకెంత చక్కెర కావాలో, బయటికెళ్ళేటప్పుడు ఎంత ఎండగా ఉంటే నాకు గొడుగు కావాలో తనకు తెలుసు. ఇవన్నీ తనకే తెలుసు. అన్ని వస్తువులూ ఆ యా సమయానికి తీసి ఇచ్చేది. అందుకే నాకేదీ గుర్తుపెట్టుకునే అలవాటు లేదు. నిజం చెప్పాలంటే ప్రియంవద కోసం నాకు కావాలనే మరిచిపోవడం ఇష్టమయ్యేది. అప్పుడే కదా తాను నా వెనుకే పరుగెత్తి వచ్చి ప్రతి ఒకటీ నా చేతుల్లో పెట్టేది!
కానీ ఈమధ్య నేనేదీ మరిచిపోవట్లేదు. అర్ధరాత్రి దాహం వేస్తుందని తలాపున నీళ్ళ బాటిల్ పెట్టుకునే పడుకుంటున్నా. ఎండ వల్ల దారిలో ఇబ్బంది కాకూడదని గొడుగు మరిచిపోకుండా తీసుకెళ్తాను. వెళ్ళే తొందరలో ఎక్కడ మరిచి పోతానో అని దోమతెర దగ్గరే తగిలించి పెడతాను.
సరే గానీ కమలాకాంత్ గారు, ఒకటి చెప్పండి. సూర్యాస్తమయం ఎలా అనిపిస్తుంది మీకు?”
కమలాకాంత్ తురాయి చెట్టుకింద అలసటగా కూర్చుంటూ, “సౌదామినితో పాటు అప్పట్లో ఇక్కడే సూర్యాస్తమయం చూసేవాడిని. చాలా బాగుండేది. ఎంతో అందంగా ఉండేది సూర్యాస్తమయం. ఇప్పుడు తోడుగా సౌదామిని లేదు. ఒంటరిగా సూర్యాస్తమయము అందంగా కనిపించదు.”
“నిజమే. నాక్కూడా.” అన్నాడు చంద్రశేఖర్. తర్వాత ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
రాత్రి అవుతోంది. ఇద్దరూ లేచి నిలుచున్నారు. దార్లో పెద్దగా మాట్లాడుకోలేదు. ముందుకు వెళ్తూన్నప్పుడు ఏవో రెండు మూడు మాటలంతే.
తర్వాత దారి రెండుగా చీలినప్పుడు ఇద్దరూ కొంచెంసేపు ఊరికే నిలుచున్నారు. ఒకరిని వదిలి ఒకరికి వెళ్ళాలనిపించనట్టుగా.
తర్వాత కమలాకాంత్, “ముందు మీరెళ్ళండి. నేనిదిగో ఇక్కడే దగ్గరే ఇటు వెళ్ళాలి.” అన్నాడు.
చంద్రశేఖర్ మాట తుంచుతూ, “లేదు మీరే ముందు వెళ్ళండి” అన్నాడు.
“లేదు. మీరే.”
“కాదు మీరే.”
కమలాకాంత్ ఉద్వేగంగా చంద్రశేఖర్ చేయి పట్టుకున్నాడు.
చంద్రశేఖర్ తలూపుతూ, “సరే. రేపు మళ్ళీ కలుద్దాం.” అన్నాడు. ఇద్దరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
తర్వాత ఇద్దరూ తమతమ దారుల్లో వెళ్ళిపోయారు.
సౌదామిని పోయింతర్వాత తానెంత భారమైన ఒంటరితనం కింద నలిగిపోయాడో తెలిసింది కమలాకాంత్ కు. మొట్టమొదటి సారి తన తల మీంచి ఎవరో ఆ భారం తీసేసినట్లైంది.
చంద్రశేఖర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు.
పొద్దున్న లేవగానే చంద్రశేఖర్ ఆలోచనలో పడ్డాడు. ‘కమలాకాంత్ ఇల్లు ఎంత దూరముంటుందో! అలా నడచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సూర్యాస్తమయం అయ్యేవరకు తాము ఎదురుచూడాల్సిన పని లేదు.’ ఇలా ఆలోచిస్తూ చంద్రశేఖర్ చేతికఱ్ఱ పట్టుకుని, బయల్దేరబోయాడు. అంతలోనే బయటి తలుపెవరో కొట్టినట్టు అయింది.
కమలాకాంత్ గానీ కాదు కదా! అనుకుంటూ చంద్రశేఖర్ ఒక్క అంగలో బయటికెళ్ళి చూస్తే నిజంగానే కమలాకాంత్ నిలబడి ఉన్నాడు.
చంద్రశేఖర్ స్నేహితుడిని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి, కొడుకు కోడలును పరిచయం చేద్దామనుకున్నాడు. కానీ వాళ్ళకింకా తెల్లవారలేదు. కాబట్టి ఇద్దరూ ఇంటిబయట వరండాలో కూర్చుని కొంతసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. తర్వాత, “నేనిక వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? ఎవరింటికి వెళ్ళారు అంటూ ప్రశ్నలేస్తారు వాళ్ళు.”
మెయిన్ రోడ్ వరకూ చంద్రశేఖర్ కమలాకాంత్ తోపాటు వచ్చాడు. “ఈరోజు సూర్యాస్తమయం చూడడానికి రారా?” అని అడిగాడు.
కమలాకాంత్ తలూపుతూ తన సమ్మతి తెలియజేస్తూ, ఇంటి వైపు అడుగులేశాడు.
ఆ రోజు ఇంటికి చేరేసరికి నిజంగా ఒక తుఫానే ఎదురుచూస్తోంది ఆయన కోసం. ఇంట్లో అడుగు పెట్టగానే పెద్ద మనుమడు అరిచాడు.
“వచ్చాడు చూడండి హీరో!” అలా అంటూ ఒకరకంగా పరుగెత్తుకుంటూ వచ్చి అదలింపు ధోరణిలో, “అర్ధరాత్రి లేచి ఎక్కడికెళ్ళిపోయారు? బుఱ్ఱగానీ చెడిందా ఏం?” అన్నాడు.
కమలాకాంత్ నోటి నుంచి ఒక్క మాట రాలేదు. తప్పు చేసిన విద్యార్థిలా తలవంచుకుని అంతా సహిస్తూ నిలబడి ఉన్నాడు. కొంత సేపు అలాగే ఉండి, తర్వాత మెడ పైకెత్తి ఇంటి పైకప్పు వంక చూస్తూ కళ్ళనీళ్ళు దాచుకునే ప్రయత్నం చేశాడు.
అక్కడ చంద్రశేఖర్ ను వాళ్ళ కొడుకు, “పొద్దున్నే ఒక ముసలాడు వచ్చాడే, ఎవరూ?” అని అడిగాడు.
చంద్రశేఖర్ ఉరిమి చూస్తూ, “నోరు ముయ్యి. ఎవరో ముసలాడు అనకు.” అంటూ ఒక్కసారిగా కోపంతో ఎఱ్ఱబడిపోయాడు. అదే మాత్రం ఊహించని కొడుకు ఆశ్చర్యంగా తండ్రివంక చూశాడు.
చంద్రశేఖర్, “నేనూ ముసలివాడినయ్యాను. నన్నెవరైనా ఎవరో ముసలాడు అని అవమానకరంగా అంటే నీకెలా ఉంటుంది?” అన్నాడు. అతడి స్వరం మరింత భారమైంది.
“మీరీమధ్య ఎవరో ముసలాడితో అక్కడక్కడ తిరుగుతున్నారు! నా చెవిన బడింది. అడిగితే తప్పైందా? మీరు ఎవరెవరిని కలుస్తున్నారు? ఎవరు మనింటికి వస్తున్నారు? అని నేను తెలుసుకోవద్దా? ఇలా అడగడం తప్పా?” అన్నాడు.
కొడుకు ఉన్నట్టుండి ఇలా ప్రవర్తిస్తాడని ఊహించని చంద్రశేఖర్ ఊరుకుండిపోయాడు. ‘ఇప్పుడిక వీడు చిన్నవాడు కాదు. పెద్దవాడైపోయాడు. చిన్నపిల్లలనన్నట్టు వీడినేమైనా అంటే బాగుండదు’ అని ఆలోచించి ఊరుకున్నాడు.
సూర్యాస్తమయం కన్నా ముందే వాళ్ళిద్దరూ మళ్ళీ నది ఒడ్డున కలుసుకున్నారు. నది ఒడ్డున పడవ గానీ, నావికుడు గానీ లేరు. పక్షులు కూడా గూటికి తిరిగి చేరుతున్నాయి. ఒడ్డుపైన జనం ఎవరూ లేరు. నీరవం.. నిస్తబ్ధము! ఉండుండి తురాయి చెట్టు ఆకుల మధ్య గాలి వీస్తుంటే ఆకులు కదలిన చప్పుడు కూడా ఈ నిస్తబ్ధంలో కొన్ని క్షణాలు పెద్ద కేకలా ప్రతిధ్వనిస్తోంది.
కమలాకాంత్, “మిత్రమా! ఈ జీవితమంతా యాతనగా ఉంది.” అన్నాడు.
కమలాకాంత్ మిత్రమా అనేసరికి చంద్రశేఖర్ ఉలిక్కి పడ్డాడు. కమలాకాంత్తో మాటతో ఏకీభవిస్తూ, “అవును మిత్రమా! ఈ భారాన్ని ఒంటరిగా మోయడం వేదనగా ఉంది. పంచుకునే తోడుంటే జీవితం తేలికవుతుంది.” అన్నాడు.
కమలాకాంత్, “ఈ నది, నావికుడు, తురాయి చెట్టు అన్నీ ఒంటరిగా, అసంపూర్ణంగానే తోస్తున్నాయి. మనలాగే.. ఇవీ దుఃఖితులేనా?” అన్నాడు.
దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ చంద్రశేఖర్ జవాబిచ్చాడు. “అవును మిత్రమా! నది ఎప్పుడైనా ఒంటరిగా సముద్రాన్ని చేరుకుంటుందా? దారిలో ఎన్నో నదులతో చేతులు కలుపుతుంది. ఈ పడవ! నది లేకపోతే పడవ ఉనికేది? ఎవరు పట్టించుకుంటారు దాన్ని?”
“అంటే.. మనము కూడా దండగ జీవాలమే, అపరిచితులమే కదా?” కమలాకాంత్ మాటను మధ్యలోనే అందుకుంటూ,” అవును ఒకప్పుడు మనం ఒంటరులం, దండగవాళ్ళం, ఉపేక్షకు గురైనవాళ్ళం. కానీ ఇప్పుడిక కాదు.”
“ఎలా?” కమలాకాంత్ ప్రశ్నలో ఆశ్చర్యం.
ఆయనను గాఢంగా ఆలింగనం చేసుకుని, చంద్రశేఖర్, “ఇప్పుడు మనమిద్దరం ఒకరికొకరం తోడైపోయినాము.” అన్నాడు.
కమలాకాంత్ కూడా చంద్రశేఖర్ ను గాఢంగా ఆలింగనం చేసుకుని కొంత సేపలా ఉండిపోయాడు.
ఆరోజు పొద్దు గుంకింది. నది, పడవ, తురాయి చెట్టును రాత్రి తన వశం చేసుకుంది. ఇద్దరూ ఇదేమీ గమనించలేదు. ఇద్దరికీ ఇంటికి వెళ్ళాలనే మాట గుర్తులేదు. అంతే కాదు. “ఇప్పటి దాకా ఎక్కడున్నారు?” అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సి ఉందని కూడా తోచలేదు.
వాళ్ళిద్దరూ ఆరోజు అన్నీ మరచిపోయారు. ఎందుకంటే ఆరోజు తర్వాత వాళ్ళెప్పుడూ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. రోజూ సూర్యుడు తూరుపు దిక్కున ఉదయించి పడమటి కొండల్లో మునిగిపోతాడు. రోజూ నదీజలాలు ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకుంటాయి. ఎందరో నావికులు పడవలు నడుపుతూ, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తిరుగుతుంటారు. ఈ లెక్కలు వాళ్ళేమీ చిట్టా వ్రాయరు. వ్రాయాల్సిన పనీ లేదు.
ఆ రోజు నుంచీ వాళ్ళిద్దరూ ఆలింగనాబద్ధులై సూర్యాస్తమయం చూడడం మినహా ప్రపంచంలోని ఇతర విషయాలన్నీ మరిచిపోయారు.
అప్పట్నించీ జనాలు ఈ చర్చ చేస్తూ ఉన్నారు. ఏమని అంటే ఈ ప్రాంతంలో ఇద్దరు వృద్ధులుండేవారు. ఒకరికి దగ్గు వస్తే రెండవవారు వీపు నిమిరేవారు. ఒకరు ఉదాసీనంగా ఉంటే రెండోవారు, “ఏమయింది, చెప్పు.” అని అడిగేవారు.
ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని సూర్యాస్తమయం చూడడానికి రోజూ వెళ్తారు. సూర్యాస్తమయం తర్వాత, పరస్పర గాఢాలింగనంలో చాలాసేపు ఉండిపోతారు. ఆ చీకటిలో కలిసిపోయేవరకూ..
ఆ స్థలం దగ్గర పడింది. డ్రైవర్ ముగించాడు చెప్పడం.
***
నదికటు వైపు ఒడ్డున రెండు కొండల మధ్యన జరిగే సూర్యాస్తమయం చూడడానికి కొందరు భార్యాభర్తలు, ప్రేమికుల జంటలు ఒకరి చేతుల్లో చేతులు వేసుకొని ఈ రోజు కూడా నిలబడి ఉన్నారు. గైడ్ వాళ్ళకు వివరించి చెప్తున్నాడు. “ఈ కొండల పేరు జీవన్ సాథీ కొండలు. ఈ కొండల మధ్య సూర్యాస్తమయాన్ని ఒక్కసారైనా చూసినవాళ్ళకు ప్రేమించిన వాళ్ళతో వియోగం ఉండదు. వాళ్ళెప్పుడూ ఒంటరి కారు”.
అందరూ ఆ నిర్దిష్ట ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా సమయం గడిచాక ఎదురుచూసిన ముహూర్తం రానే వచ్చింది. సూర్యుడు రెండు కొండల మధ్య మునుగుతున్నాడు. ఆలోక్ తన కొత్త భార్యతో కలిసి సూర్యాస్తమయాన్ని చూస్తూ, “చూడు చూడు, ఇప్పుడు సూర్యుడు మునిగాక ఆ ఇద్దరు ముసలివాళ్ళు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చుట్టూ చీకట్లు ముసిరేదాకా చాలా సేపు అలా ఎలా ఉండిపోతారో చూడు.” అన్నాడు.
లిల్లీ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎదురుగా రెండు కొండల మధ్య సూర్యుడు మునుగుతున్నాడు. చుట్టూ రాత్రి చీకట్లు మెల్లమెల్లగా ముసురుతున్నాయి. గైడ్ మాట్లాడుతూనే ఉన్నాడు. “చూశారుగా మరి మీరు? ఎలా ఉంది ఈ సూర్యాస్తరాగం? అదే, ఈ సూర్యాస్తమయం? వేల రూపాయలు ఖర్చు చేసుకొని జనాలు ఇక్కడికి రోజూ వస్తారు. ఇక్కడి సూర్యాస్తమయాన్ని చూడడానికి! ఈ సూర్యాస్తరాగం కోసం! మీరు రండి. చూడండి ఆ ఇద్దరు వృద్ధులు ఎలా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారో!”
ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు లిల్లీ చాలా గంభీరంగా ఉండిపోయింది. “ఏమైంది? ఎలా ఉంది ఈ సూర్యాస్తమయం?” అడిగాడు ఆలోక్.
లిల్లీ గంభీరంగా, “ఇక్కడికి వచ్చేముందు విన్నాను. సూర్యాస్తమయంలో రెండు కొండల నీడ క్రమంగా అంధకారం ఏకరూపమై పోతుంది. కొందరు బలహీన మనస్కులు, ఉద్వేగపరులు అది వృద్ధుల పరస్పర ఆలింగనం అనుకుంటారని విన్నాను.
కానీ నేను విన్నది అబద్ధం ఆలోక్! నిజంగా! కానీ నేనీరోజు చూసిందే నిజం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నేళ్ళు గడిచిపోయుంటాయి. కానీ ఈనాటికీ ఆ ఇద్దరు వృద్ధులూ రోజూ సూర్యాస్తమయంలో పరస్పరం ఆలింగనం చేసుకోవడం చూడొచ్చు. వాళ్ళిద్దరే ఆ అచలమైన అవిచలితమైన ఆ రెండు కొండలేమో నన్నట్టుగా. ఇదెలా సాధ్యం?”
ఒడియా మూలం: అరవింద్ రాయ్
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.
