[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీమతి చిలకమర్రి శశిరేఖ.]
“అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు….”
అనుకుంటూ అనంతలోకాలకి వెళ్ళిపోయిన జానకమ్మా! మీకు మరణమనేది వుందా? కారణజన్ములకి ఉండదుకదా! ఫద్మభూషణ్ బిరుదు దక్షిణాది గాయనీమణులకి సరైన గుర్తింపు కాదని ధైర్యంగా తిరస్కరించి ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న అరుదైన గాయనీ నీకు ప్రత్యేకంగా బిరుదు ప్రధానం చేయాల్సిన అవసరం వున్నదా? ఏ గౌరవ బిరుదు నీ ప్రతిభ కు సాటి రాదుకదా!
అలవోకగా నవరసాలు నీ గళం లో పలికించి మా అందరినీ మంత్రముగ్ధుల చేసావు. ఇకపై నీ గొంతులో క్రొత్త పాటలు వినలేమే అన్న బాధ తప్ప నీవు సాధించాల్సిన లక్ష్యాలు ఏమీ లేవమ్మా నీ కీర్తి ఎత్తైన శిఖరాలు ఎప్పుడో చేరుకుంది. పలు భాషలలో మధురంగా పాడి, సందర్భానుసారంగా అందరికీ అత్మస్థైర్యం చేకూర్చే నీ గళం మా అందరికీ ఓ వరం.
నిన్ను చూడగలగడం, నీ సమకాలీనులుగా వుండడం, నీ చక్కని గాన మాధుర్యాన్ని చవిచూడగలగడం మా అదృష్టం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పసిపిల్లల మరియు వృద్ధుల గళంలో పాడినపుడు వారే అచ్చంగా పాడారేమో అని అచ్చెరువొందడం మా వంతైంది.
నీ గళంలో విరిసిన ప్రత్యేక సువాసనలు వెదజల్లే సుమాలు అనుపమానం అద్వితీయం. నీ గళంలో విరిసిన ‘నీ కేలా ఇంత నిరాశ’ అన్న పాట వింటే అన్నిరకాలుగా నిస్సహాయంతో చతికిలపడినవారిలో కూడా కొత్త శక్తి ప్రవేశిస్తుంది అన్నమాట అక్షరాల వాస్తవం.
నలభై వేల పై చిలుకు పాటలు మాకు అందించిన కోయిలమ్మా! నీ గొప్పతనం వర్ణించడం నాలాంటి సామాన్యుల వల్ల అయ్యెపనేనా? సముద్రంలో ఓ చిన్న బిందువంత మాత్రమే నేను నీ గొప్పతనాన్ని గురించి చెప్పగలిగాను. నీకు యిదే నా అశ్రునివాళి.
