Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వేచ్ఛ

[బాలబాలికల కోసం ‘స్వేచ్ఛ’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

రామూకి ఒక పెంపుడు చిలక వుంది. అదంటే వాడికి ఎంతో ఇష్టం. చాలా చిన్నప్పటినుంచీ రామూకి పక్షులంటే చాలా ఇష్టం. వరండాలోకెగిరొచ్చిన పిచ్చుకలని చూసి చాలా సంబర పడేవాడు. వాటితో ఆడుకోవాలని ప్రయత్నించేవాడు. దోవ తప్పి ఇంట్లోకెగిరొచ్చిన సీతాకోక చిలుకని పట్టుకోవటానికి దాని వెనకే పరిగెత్తటానికి ప్రయత్నించి పడేవాడు.

చిన్నప్పటి నుంచీ వాడికి పక్షులంటే వున్న ప్రేమని చూసి వాడి ఆరవ పుట్టిన రోజుకి వాళ్ళ నాన్న వాడికో చిలకని కొనిచ్చాడు. చక్కని పంజరంలో వుండే ఆ చిలుక రామూతో ఆడేది. చిలుకలు మాట్లాడతాయని అమ్మమ్మ చాలా కథలలో చెప్పింది. అందుకే దానికి రోజూ మాటలు నేర్పాలని ప్రయత్నించేవాడు. తన పేరు తేలికగా పలకచ్చుగదా అని రామూ అను అంటూ చెప్పేవాడు. అది పిలిచేది కాదు కదా కనీసం ప్రయత్నం చేసేది కాదు.

అయినా రామూకి ఆ చిలకంటే ప్రాణం. పొద్దున్న స్కూల్‌కి వెళ్ళేదాకా, సాయంత్రం స్కూల్ నుంచి రాగానే దానితోనే గడిపేవాడు. బయటకి వెళ్ళటం, స్నేహితులతో ఆడుకోవటం మానేశాడు. అది చూసి వాళ్ళమ్మమ్మ కంగారు పడ్డది. ఆ వయసులో పిల్లలకి వ్యాయామం ఆటలే. వీడేమో చిలకతో ముచ్చట్లు చెబుతూ, దానికి ఆహారం పెడుతూ ఆటలే మానేశాడు. ఇంక వాడి ఆరోగ్యం ఏం బాగుంటుంది.

అమ్మమ్మకి తెలుసు. పిల్లలకి మిగతా పిల్లలతో కలిసి తిరిగితేనే అన్నీ తెలుస్తాయి. చదువులో, విషయ పరిజ్ఞానంలో పోటీ వుంటుంది. కలిసి మెలిసి వుండటం తెలుస్తుంది. మంచీ, చెడూ తెలుస్తాయి. ఇచ్చి పుచ్చుకోవటాలు కూడా అలవాటవుతాయి. చిలకని తీసుకువచ్చిన ఈ రెండు నెలలనుంచీ రామూ తోటి పిల్లలతో ఆడుకోవటం మానేశాడు. వాళ్ళూ కొత్తల్లో కొంచెం సేపు వచ్చి చిలకతో ఆడుకున్నారు గానీ, పంజరంలో బంధించిన చిలకతో ఆటలు నచ్చక తర్వాత రావటం మానేశారు. అంతే కాదు. రోజూ తనని కథలు చెప్పమని విసిగించేవాడు, ఈ మధ్య వాడికి కథలు కూడా అవసరం లేక పోతున్నాయి.

అమ్మమ్మ ఆ పరిస్ధితిని మార్చాలనుకుంది. వాళ్ళింటి చుట్టూ చెట్లు వుండటంతో పక్షులు ఎగిరి వచ్చి వాళ్ళ బాల్కనీ పిట్టగోడమీద వాలుతూ వుంటాయి. మళ్ళీ ఏదో పని వున్నట్లు హడావిడిగా ఎగిరిపోతాయి. అది గమనించింది అమ్మమ్మ. ఒక రోజు బాల్కనీలో వాలిన ఇంకో చిలకని చూపిస్తూ చెప్పింది రామూకి. “ఆ చిలుక ఈ చిలుక ఫ్రెండ్ అనుకుంటారా. రోజూవచ్చి పలకరిస్తోంది. దాన్ని చూసి ఇదేమో పంజరంలోంచే అరుస్తోంది. ఎగరటానికి ప్రయత్నిస్తోంది”.

రామూ ముందు అమ్మమ్మ మాటలని పట్టించుకోలేదు. తర్వాత రెండు రోజులు స్కూల్‌కి సెలవలు అవటంతో ఇంట్లోనే వున్నాడు. అప్పుడు చూశాడు. ఒక చిలుక వచ్చి బాల్కనీలో పిట్టగోడ మీద వాలింది. అది అరుస్తుంటే ఇంట్లో పంజరంలో వున్న చిలక కూడా అరుస్తూ, బయటకి ఎగిరి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యసాగింది. అది చూసిన రామూ చిన్నబుచ్చుకున్నాడు. ఆ చిలుకని తను ఎంత బాగా చూశాడు. ఎన్ని పళ్ళు పెట్టాడు. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అమ్మకి, అమ్మమ్మకి ఎన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళేవాడు. రాగానే దానితోనే ఆడుకునేవాడు. అయినా ఆ చిలుక ఇంకో చిలకని చూడగానే అలా అరిచి, ఎగరటానికి ఎందుకు ప్రయత్నించిందో వాడి చిన్న బుర్రకి అర్థం కాలేదు.

అర్థం కాని విషయాలన్నీ ఓపిగ్గా చెప్పటానికి అమ్మమ్మ వుందిగా. అదే అడిగాడు. “అమ్మమ్మా, చిలకకి పంజరం బాగాలేదా. ఎందుకు ఎగరాలని చూస్తోంది. అసలు అంత చిన్న పంజరంలో ఎలా ఎగురుతుంది?” అని. అమ్మమ్మకి అవకాశం దొరికింది.

“నాన్నా, నువ్వు రోజూ ఏం చేస్తున్నావు. లేచిన దగ్గరనుంచీ ఒక చోటే కూర్చుంటున్నావా? లేదు కదా! ఇల్లంతా తిరుగుతున్నావు. స్కూల్‌కి వెళ్తున్నావు. అక్కడ ఆడుకుంటున్నావు. నీకెంత స్వేచ్ఛ వున్నదో చూడు! మరి ఆ చిలుకని నువ్వు పంజరంలో కట్టేసి పెట్టావు. నీకు రెండు కాళ్ళున్నాయి గనుక నువ్వు నడుస్తావు. దానికీ భగవంతుడు రెండు రెక్కలు ఇచ్చాడు గనుక అది ఎగరాలని చూస్తుంది. మనిషి కాళ్ళకీ, పక్షుల రెక్కలకీ కూడా బలంలో తేడా వుంటుంది. అవి ఆహారం సంపాదించుకోవటానికి దూరంగా ఎగురుతాయి. నువ్వేమో నీ చిలుకకి ఆహారం ఇస్తున్నావుగానీ, దానిని ఎగురనియ్యటంలేదు. పంజరంలో పెట్టేశావు. అటూ ఇటూ కదలలేదు. ఆ ఇబ్బందేమిటో నీకు తెలియాలంటే నువ్వీ కుర్చీలో ఒక గంట సేపు కదలకుండా కూర్చో” అని ఒక కుర్చీలో కూర్చోపెట్టింది.

“సరే నా కథల పుస్తకం ఇవ్వు. చదువుకుంటూ కూర్చుంటాను” అన్నాడు.

“అవ్వన్నీ ఏమీ లేవు. ఏ కాలక్షేపం లేకుండా, కదలకుండా కూర్చో. కావాలంటే నేను అప్పుడప్పుడూ వచ్చి మాట్లాడిస్తూ వుంటాను, తినటానికి ఏమైనా పెడతాను” అని వెళ్ళిపోయింది.

ఐదు నిముషాలు కూర్చునేసరికి రామూకి విసుగుపుట్టసాగింది. కూర్చున్నచోటు నుంచే పంజరంలో దిగులుగా కూర్చున్న చిలకని చూశాడు. కదలకుండా వుండేసరికి దానికీ తనకిమల్లే బోర్ కొడుతోందా!? తను అమ్మమ్మ చెప్పినట్లు గంటసేపు కాగానే లేచి తిరుగుతాడు. కానీ చిలుకకి పాపం అస్సలు తిరగటానికి అవకాశం లేదు కదా. కదలకుండా కూర్చోవాలంటే తనకి కాళ్ళు నొప్పులు పుడతాయి. అలాగే ఎగరకుండా వుంటే చిలుకకి రెక్కలు నొప్పి పుడతాయా!? అది నోరు తెరిచి నొప్పి అని చెప్పలేదు కూడా. అంతే! రామూ ఆలోచనలు ఇంకో ఐదు నిముషాలు కూడా సాగలేదు. తనకి తెలియకుండా తను చిలుకని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు తెలిసింది కదా. ఇంక దానిని కష్టపెట్టడు.

రోజూలాగే ఇంకో చిలక ఎగిరి వచ్చి బాల్కనీ పిట్టగోడ మీద కూర్చుని సందడి చేస్తోంది. వెంటనే కుర్చీలోంచి లేచాడు రామూ. పంజరం తలుపు తెరిచాడు. అప్పటికే పంజరంలో ఎగరటానికి ప్రయత్నిస్తున్న చిలుక బయటకి ఎగిరిపోయింది. దాని వెనకే బాల్కనీలో వాలిన చిలుక.

రామూ బాల్కనీలో నుంచుని రెండు చిలుకలకూ బై చెప్పటం చూసి నవ్వుకుంది అమ్మమ్మ.

Exit mobile version