[శ్రీమతి విజయశ్రీముఖి రాసిన ‘స్వేచ్ఛకున్న పదును’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము]
“హాయ్ మామ్!”
గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తున్న తల్లిని పలకరిస్తూనే ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది ఆశ.
భుజానున్న బ్యాగ్ తీసి నిర్లక్ష్యంగా టేబుల్ పై విసిరేసి మంచంపై వాలిపోయింది అలసటగా.
ఆఫీస్ నుండి సాయంత్రం ఐదు గంటలకే రావల్సిన ఆశ ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలకు ఇల్లు చేరింది.
“వెళ్లి స్నానంచేసి వస్తావా భోజనం చేద్దాం?” గది గడప దగ్గరకొచ్చి అడిగింది సుమతి.
“నేను వచ్చేముందే హెవీటిఫిన్ చేసేసి వచ్చాను. నువ్వెళ్ళి తినేసేయ్ మమ్మీ” చెప్పింది ఆశ .
“తిండి సంగతి సరే, ఉదయం కట్టుకుని తిరిగి తిరిగి వచ్చిన బట్టలు.. అవన్నా నీళ్ళు పోసుకుని మార్చుకోవా? ఐనా ఆఫీస్ ఇప్పటివరకుందా?” కోపాన్ని నిభాయించుకుంటూ అడిగింది సుమతి.
“ఆఫీస్ నాలుగున్నరకే ఐపోయింది. ఫ్రెండ్స్‌తో జాలీగా గడిపి వచ్చాను. సో వాట్?” తలెత్తి నిర్లక్ష్యంగా చూస్తూ అడిగింది తల్లిని ఆశ.
“ఫ్రెండ్స్ తో అంటే.. ఆడా మగా?” కించిత్ భయంగా అడిగిందామె.
ఆశ విసురుగా లేచి కూర్చుంది. నిర్భయంగా తల్లిని చూస్తూ “మగే.. ఐతే ఏమిటి?” అడిగింది.
కూతురి జవాబు ఆ విధంగా ఉంటుందని అసలు వూహించని సుమతి బిత్తరపోయింది. వెంటనే ఏదో అనాలనుకుంది.. కానీ, నోరు పెగలడం లేదు, మనసు ముడుచుకు పోయింది. అక్కడ నుండి మౌనంగా వెనుతిరిగి వెళ్లిపోయింది సుమతి.
కూతురు వచ్చాక కలిసి తినవచ్చని ఆగింది. ఇప్పుడా పిల్ల వద్దన్న తీరు, ఆమె వాలకం చూసి తనకీ ఇంక తిండి తినాలనిపించలేదామెకు. వెళ్ళి తన గదిలో మంచంపైన వాలిపోయింది. ఆలోచిస్తూనే మాగన్నుగా నిద్రలోకి జారింది..
అప్పుడప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న ఒక చిన్నపాప.. అచ్చం ఆశ లాగానే ఉంది ఆ ముఖం.
ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతోంది. వెళ్లి.. బావి ఒడ్డున నిలబడి వంగి నూతిలో కనిపించే తన ప్రతిబింబాన్ని ఆశ్చర్యంగాను సంబరంగాను చూసుకుంటోంది. అలా.. మరింత మందుకు వంగి చూసుకుంటూన్న పాప.. వంగి వంగి ముందుకు.. ప.. డ.. బో.. ‘అయ్యో..పాపా..’ పెద్దగా అరుస్తూ దిగ్గున లేచి కూర్చుంది సుమతి.
చుట్టూ చూస్తూ, ముఖాన పట్టిన ముచ్చెమటలు కొంగుతో తుడుచుకుంటూ ‘ఇది కలా!’ అనుకుని తేలిగ్గా నిట్టూర్చి, పక్కనున్న మంచినీళ్లు తాగింది.
ఇంక ఆమెకి నిద్రపట్టడం లేదు.. తన చిన్నప్పటివి, తరవాత తన జీవితంలో జరిగిపోయినవి అన్నీ మనో యవనికపై కదలాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయింది..
***
పదేళ్ల సుమతి తండ్రితో పాటు కూర్చుని అన్నం తింటోంది. తింటూ తింటూ.. తండ్రితో “నాన్నా! మన పొలంలో నించి పీక్కొచ్చిన ఈ పుట్టగొడుగుల కూర చాలా బాగుంది కదూ?” అడుగుతోంది.
తండ్రి ఆ మాట వినిపించు కోకుండా “ఏమే.. నిన్నే ఇట్రా” అరిచాడు పెద్దగా.
“ఆ.. ఆ.. వచ్చే ఇదో.. పెరుగు తెస్తున్నాను” అంటూ పెరుగు పిడతతో వచ్చింది సుమతి తల్లి.
“అదక్కడ పెట్టి ఇదేంటో చూడు” అన్నాడు కంచంలో వేలు పెట్టి చూపిస్తూ. అన్నం తింటున్న సుమతి కూడా ఆపేసి “ఏంటి నానా?” అంటూ తొంగి చూసింది.
ఒక చిన్ని మెంతిగింజంత రాయి ఉందా అన్నంలో.
“అదీ.. ఎట్టా వచ్చిందో.. అక్కడికీ బియ్యం చానా సేపు ఏరాను కూడా..” భయంగా చెబుతోంది తల్లి
“ఈ రాయి కడుపులో కెళితే.. మొగోడికి ఎక్కడ అడ్డం పడుద్దో తెలుసా? నీకెన్నిసార్లు చెప్పాను..” అంటూ వంగి దాన్ని తీసేయబోతున్న తన తల్లి తలను ఎడమచేత్తో గట్టిగా వంచి పట్టుకుని, కుడి చేత్తో ఆ చిన్ని రాయిని ఆమె నుదురుపై పెట్టి గట్టిగా నొక్కసాగాడు.
“అబ్బా.. వ.. దు.. లు..” తలను వెనక్కెనక్కి లాక్కుంటూ, పట్టుకున్న ఆతని చేతిని విదిలించే ప్రయత్నం చేస్తుందామె.
తినటం ఆపేసిన సుమతి గిలగిల లాడుతున్న తల్లిని చూస్తూ “నాన్నా, అమ్మనొదులు వొదులు” అంటూ ఏడుపు గొంతుతో అరవసాగింది.
బూతు తిట్టు తిడుతూ ఆమెను వదిలేసి, ఆమె అంతకు ముందు తెచ్చిపెట్టిన పెరుగు పిడతని మిగిలిన అన్నంలో బోర్లించుకుని తినసాగాడు.
తల్లి అవతలికెళ్లిపోయింది. తండ్రి తినేసి బైటకు వెళ్లిపోయాడు. సుమతి కంచం తీసుకుని వెనుక వసారాలో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళు ముక్కు తుడుచుకుంటూ, కూతురుతో “నువ్వు తినేసేయ్” చెప్పింది.
తల్లి నుదుటిమీద తండ్రి రాయిముక్కతో నొక్కిన చోట కమిలిపోయి చిన్న బుడుపి కట్టిఉంది.
“అమ్మా, నల్లగా వాచింది. నెప్పిగా ఉందా?” అడిగింది సుమతి.
“ఇది చిన్నదే లేమ్మా! ఒళ్లంతా కమిలిపోయి వాచిన రోజులున్నాయి.. నా రాత ఇంతే.. వెళ్ళు.. అన్నం వదిలిపెట్టొచ్చావు.. చప్పబడిపోద్ది తిను” అక్కడి నుంచి పంపేసింది తల్లి.
ఎందుకో తెలియకపోయినా అడపాదడపా తండ్రి తల్లిని కొట్టడం ఆమె ఏడుస్తూ ఉండటం చూసే సుమతి ఓసారి తల్లిని అడిగింది ‘నాన్న నిన్నలా కొడుతుంటే.. నువ్వు కూడా కొట్టొచ్చుగా?’ అని.
‘మళ్లీ కొడితే.. అప్పుడు చావకొట్టేస్తాడు. మగోడి బలం, పెత్తనం అట్టా తగలడ్డాయ్’ అంది తల్లి.
మరో రోజు తనకి తలంటిన జుట్టుకు నూనె రాసి దువ్వుతున్న తల్లితో చెప్పింది సుమతి “అమ్మా! నేను పెళ్లి చేసుకోను” అని.
తల్లి పకపక నవ్వుతూ “ఇప్పుడే నీకెవరు చేత్తన్నారే? అయినా ఎందుకని చేసుకోవు?” అంది.
“నాన్న నిన్ను కొడుతున్నాడుగా? పెళ్లయితే ఆడు కూడా నన్నట్టాగే కొడతాడు. అందుకే నేను చేసుకోను” చెప్పింది ఆరిందాలాగ.
“మీ నాన్న లాగా కోపిష్టోడ్ని కాదు, మంచోడిని చూసి చేత్తాంలే” నవ్వుతూ చెప్పింది తల్లి.
పదేళ్లు గడిచాయి..
సుమతికి పెళ్లయింది.. భర్త కొట్టేవాడు కాదుగాని.. ప్రతిదానికీ డబ్బులెక్క చెప్పమనేవాడు. “యింటి ఖర్చులకు తప్ప నేనేం చేసుకుంటాను?” అనేది.
ఎక్కడికీ పంపేవాడూ కాదు. రెండేళ్లకో, మూడేళ్లకో పుట్టింట్లో శుభకార్యమేదైనా ఉండి పంపవలసి వస్తే.. అప్పటికప్పుడు కొట్లోకి వెళ్లి ఒకటి రెండు వాయిల్ చీరలు మాత్రం కొనితెచ్చి ఇచ్చేవాడు. మళ్ళీ ఏదైనా ప్రయాణం వచ్చేవరకూ అవే! డబ్బులేక కాదు, తన వరకూ జల్సారాయుడే!
పుట్టింటి నుండి తిరిగి వచ్చేప్పుడు తల్లి దాచిన డబ్బులేమైనా చేతిలో పెడితే..తను వాటినెంత పదిలంగా దాచుకునీ వాడుకునేదని!
‘ఏమైనా సరే, నాకు కూతురు పుడితే.. ఆ పిల్లని చక్కగా చదివించి, ఉద్యోగం చేపించాలి. మా అమ్మలాగ తన్నులు తింటూ.. నాలాగా ప్రతి పైసా కోసం మొగుణ్ణి ముష్టి అడుక్కునేలా మాత్రం ఉండకూడదు’ అనుకునేది సుమతి.
***
కొడుకు ఆకాశ్, కూతురు ఆశ పుట్టారు. వాళ్ళు చదువుతూ ఉండగానే ఎనిదేళ్ళ క్రితం తన భర్త పనిచేసే కంపెనీలోనే ఫైర్ ఏక్సిడెంట్లో పోయాడు.
అందువలన కంపెనీవాళ్ళు అప్పటికే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆకాశ్‌కి తండ్రి స్థానంలో ఉద్యోగం ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం ఆకాశ్‌కి పెళ్లి కూడా అయ్యింది.
బి.టెక్. పూర్తి చేసిన ఆశకు క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ వచ్చి బెంగళూరులో జాయిన్ అయ్యింది.
పెళ్ళికాని ఆశని ఒక్కదాన్నే ఉంచలేక సుమతి కూడా వచ్చి బెంగళూరులోనే కాపురం పెట్టింది..
అప్పటినుంచి బాగానే ఉంది. సుమతికిప్పుడు చాలా తృప్తిగా ఉంది. దేనికంటే..
రేపోమాపో ఆశకు పెళ్ళిచేసేస్తే ఆ జంటను వదిలి తను కొడుకు దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆశను వదిలి వెళ్లినా ఇంక తనకు దిగులుండదు.
ఎందుకంటే.. కూతురు ఆశ.. తన తల్లిలాగ మొగుడితో తన్నులు తింటూ పడుండాల్సినంత హీనస్థితిలో లేదు. నెలకు వేలకు వేలు తనే సంపాదిస్తోంది కనుక తనలాగా ప్రతి పైసకూ మొగుడి ముందు ముష్ఠికి చేయి చాపాల్సిన దౌర్భాగ్యమూ లేదు.
సుమతి తల్లికి వాక్ స్వాతంత్ర్యం లేదు. సుమతికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు. తన కూతురుకు మంచి చదువుతో పాటు ఆ రెండూ ఉన్నాయి.
తమ ముగ్గురికీ తరంతరంలో వచ్చిన ఈ మార్పు సుమతికి చాలా సంతృప్తిని కలిగించింది.
‘ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి..’ అనుకుంటోంది.
కానీ.. గత ఐయిదారునెలల నుంచి ఆశ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది.. స్నేహితులంటోంది.. షికార్లంటోంది.. ఇంటికి ఆలస్యంగా వస్తుంది. ఇవి ఎక్కడికి దారితీస్తాయోనని ఆందోళనగా ఉంది సుమతికి.
నిద్రలేని కళ్ళు మంటగా ఉన్నాయి..ఇంకలాగే పడుకోలేక అస్థిమితంగా లేచి కూర్చుంది.
***
రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఆశ ఆఫీసుకి వెళ్లి వస్తూనే ఉంది. ఆఫీసుకి ఇంట్లోంచి సరైన సమయానికే స్కూటీపై బయటపడుతోంది. తిరిగి రావడం మాత్రం రాత్రి ఎనిమిది, తొమ్మిది దాటాకే వస్తోంది.
ఆ ఆదివారం ఆలస్యంగా బద్ధకంగా లేచి, ముఖం కడిగి, టిఫిన్ చేసి, మళ్ళీ తన గదిలోకెళ్ళబోయే కూతుర్ని “ఆశా, ఆగి అలా కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి” అన్నది సుమతి.
“కొంచెం మాట్లాడాలా? క్లాస్ పెట్టాలా అమ్మా?” నవ్వుతూ అంది ఆశ .
“క్లాస్ అనీ, పెడతానేమోనని తెల్సిన దానివి, అదెందుకు పెట్టబోతున్నానో కూడా తెలుసా?” అడిగింది.
“అబ్బ! అమ్మా.. ఆ చెప్పేదేదో చెప్పేద్దూ” కొంచెం విసుగ్గా అడిగింది ఆశ. కూతురులో విసుగును చూసేసరికి సుమతికి చిరాకేసింది.
“తలుపులు వేసుకుని గంటల తరబడి ఊళ్లో వాళ్లతో ఫోనుల్లో మాట్లాడటానికి నీకు ఏ విసుగూ ఉండదు..” మొదలుపెట్టింది సుమతి.
“సరే సరే.. చెప్పేయ్ ఏంటో” తొందరించింది ఆశ.
“ఈమధ్య ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ప్రతిరోజు నువ్వు ఆఫీస్ అవగానే ఇంటికి రాక, స్నేహితులంటూ పొద్దుపోయే వరకు తిరగటం.. బాగుందా పెళ్లి కావలసిన పిల్లవి?”
“పెళ్లయ్యాక తిరిగితే బావుంటుందా చెప్పు?” అడిగింది ఆశ నవ్వుతూ.
“ఆపు నీ పిచ్చి జోకులు”
“లేకపోతే ఏంటమ్మా? నువు అమ్మమ్మ గురించి చెప్పావు. ఆమెకు నోరెత్తి మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదు. నువ్వంటావా.. ఏదో నీ హైస్కూల్ చదువుతో నోరెత్తి మాట్లాడగలిగినా, రూపాయ్ దగ్గరకొచ్చేసరికి ఆయన దయా భిక్షమే కదా?”
“అయితే ఏమంటావ్?” అడిగింది సుమతి.
“ఏమంటాను? మీకు లేని వాక్ స్వాతంత్ర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఈరోజు నాకున్నాయ్ అంటాను. అవన్నీ తెల్సిన నీవు నాకు లక్ష్మణ రేఖలు గీయొద్దంటాను. నన్నిలా స్వేచ్ఛగా వదిలేయమంటాను. నన్నయినా లైఫ్‌ని ఎంజాయ్ చేయనివ్. ఓకేనా?” నవ్వుతూనే వార్నింగ్ లా చెప్పింది ఆశ.
“అమ్మలూ, నేను చెప్పేది వినమ్మా.. స్నేహాల్లోనూ, స్వేచ్చలోను రకాలుంటాయి. స్నేహంకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే విశృంఖలత అంటారు. స్వేచ్ఛ పదునైన కత్తిలాంటిది. దాన్ని సరైనరీతిలో వాడుకుంటే మనకు సౌకర్యంగా ఉంటుంది. ఎడాపెడా తిప్పేస్తే జీవితాన్ని గాయాలపాలు చేస్తుంది..”
“పోమ్మా! నీ నవలలు చదివిన పరిజ్ఞానం నాపై రుద్దకు. నా ఫోన్ రింగవుతోంది.. బై!” వడివడిగా అక్కడ నుంచి తన గదికెళ్లింది ఆశ.
ఉస్సురని నిట్టూరుస్తూ ‘ఈ పిల్లకెట్లా చెప్పాలో నాకు తెలియడం లేదు’ అనుకుంది సుమతి.
***
మూడు నెలలు గడిచాయి..
ఆఫీస్ నుండి మధ్యాహ్నమే ఇంటికొచ్చింది ఆశ.
“ఏమిటి అప్పుడే వచ్చావ్? ఒంట్లో బాగాలేదా?” అడిగింది సుమతి.
మాట్లాడకుండా గదిలో కెళ్ళిపోయిన ఆశ అలాగే మంచం మీద వాలిపోయి ఏడుస్తోంది.
వెనుకనే వెళ్లిన సుమతి కూతుర్ని కదుపుతూ “ఏమయ్యిందమ్మా..” అడిగింది పక్కనే కూర్చుని.
“నా ఫ్రెండ్ కావ్య..” చెప్పలేకపోతోంది ఆశ.
“ఆ.. ఏమైంది కావ్యకు?” అడిగింది సుమతి.
“దాని బాయ్ ఫ్రెండ్ తనని పెళ్లి చేసుకుంటానని ఆరునెల్లుగా నమ్మించాడు..” ఆగింది ఆశ.
“ఇప్పుడు చేసుకోనంటున్నాడా?” అడిగిందామె.
తల ఊపింది ఆశ.
“వాళ్లిద్దరిదీ ఒక ఊరేనా?” అడిగింది సుమతి.
“కాదు. వాళ్లిద్దరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యింది.. ప్రేమగా మారింది.. వాడిది ఈ సిటీ కాదు. మైసూర్. తరచూ వచ్చి కలిసేవాడు.. ఇప్పుడు తెల్సింది వాడికి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని.. ఒక కొడుకని..” వెక్కుతూ చెబుతోంది ఆశ.
“దరిద్రుడు. పోనీ.. పీడా వదిలిందనుకోమను కావ్యను. ముందే తెలిసింది” చెప్పింది సుమతి.
“అయ్యో, నీకు తెలియదమ్మా..” తల బాదుకుని ఏడవ సాగింది ఆశ.
“అయ్యో.. పిచ్చిపిల్ల! ఎంత గుడ్డిగా నమ్మింది?” లబలబ లాడింది సుమతి.
“కావ్యకు.. చావొక్కటే దారి..” ఏడుస్తూనే అంది ఆశ.
“ప్రేమించినోడు చేసుకోనంటే చావే పరిష్కారమా? చదువుంది, సంపాదనుంది, స్వేచ్ఛ కూడా ఉంది. ఐనా మీ తరంలో చాలామంది పిల్లలకు ఆవేశం, అతిశయం ఎక్కువగా ఉంటోంది.. అదే అనర్థాన్ని తెచ్చి పెడుతోంది. సరే, ఇకనైనా కావ్యను వాడ్ని మరిచిపొమ్మను, తనకి ముందెంతో జీవితం ఉందని చెప్పు” చెప్పింది సుమతి.
“అయ్యో, నీకు అర్థం కావడం లేదమ్మా.. కావ్య ఇప్పుడు మూడోనెల ప్రెగ్నెంట్ అమ్మా..” తలకొట్టుకుంటూ చెప్పింది ఆశ ఏడుస్తూనే.
ఆ మాటలు విన్న సుమతి నోట మాట రానట్లుగా చూస్తుండి పోయింది కాసేపు.
కొన్ని క్షణాలాగి.. “వాళ్ల పెద్దవాళ్ళకు చెప్పిందా?” అడిగింది
“నీకు చెప్పేది అందుకేనమ్మా..” తల్లి ఒడిలో తల పెట్టుకుని, రెండుచేతులతో ఆమెను చుట్టేస్తూ వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా చెప్పింది ఆశ.
“నాకు చెప్తే నేనేం చేయగలను? తెలియాల్సింది వాళ్ళ పెద్దవాళ్లకు కదా?”
“ఆ కావ్యే.. ఈ ఆశమ్మా” ఏడుస్తూ చెప్పింది ఆశ.
“ఆ.. కావ్యే.. ఆ..శా? అంటే.. ను.. వ్వు..!?”
“…….”
“స్వేచ్ఛను చిచ్చులాగా వాడుకున్నావు గదే?” అదిరిపాటుగా అడిగింది సుమతి.
(సమాప్తం)
