Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తాత తకతోం

[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘తాత తకతోం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

భార్య పోయేక వెలితి త్వరగానే తెమిలిపోయింది. కారణం నా మనుమడు రోషిత్.

నాకు ఇద్దరు పిల్లలు. భార్య ఉండగానే నా కూతురుకు పెళ్లైపోయింది. ఈ మధ్యనే నా కొడుకుకు పెళ్లి చేసాను.

నేను కొడుకు పంచన ఉంటున్నాను. నేను రిటైర్డ్ టీచర్‌ని.

నా కూతురు భర్త బ్యాంక్ ఉద్యోగి. లక్కీగా నా కొడుకు ఉన్న ఊరిలోనే అతడి జాబ్.

నా కొడుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నా కోడలు కూడా. ఇంకా వీరికి పిల్లలు లేరు.

మా ఇంటికి గంట ప్రయాణం దూరాన నా కూతురు వాళ్లు ఉంటున్నారు. వాళ్ల ఏకైక బిడ్డ రోషిత్.

రోషిత్ ఫిఫ్త్ స్టాండర్డ్ స్టూడెంట్. ప్రతి ఆదివారం వాణ్ణి చూడ్డానికే పని కట్టుకు కూతురింటికి వెళ్తాను.

ఉదయం కొడుకు కారులో కూతురు ఇంటిన డ్రాప్ చేస్తే.. సాయంకాలం అల్లుడు మా ఇంటిన దించుతాడు. ఇలా సదా ప్రతి ఆదివారాలు జరుగుతూ వస్తోంది.

డోర్ బెల్‌తో అల్లుడు తలుపు తీసాడు. నోరారా పలకరించాడు. కూతురు వంట గదిలో కనిపించింది. నన్ను చూసి నవ్వేసింది.

“రోషీ ఏడి” అడిగాను.

“పక్కెక్కాడు” వెనుకే వున్న అల్లుడు చెప్పాడు.

“అలిగాడు” కూతురు చెప్పింది.

ఆ వెంబడే..

“టిఫిన్ పెడతాను. రా నాన్నా” అంది.

“లేదమ్మా. తినేసా” చెప్పాను.

“మరదలేం వండింది” అడిగింది.

“ఉప్మా” చెప్పాను.

“ఇక్కడా అదేలా ఉంది” అల్లుడు నవ్వేడు.

“రండి. మనం టిఫిన్ చేద్దాం” అల్లుడుతో కూతురు అంది.

ఆ వెంబడే..

“నాన్న.. రోషిగాడ్ని తీసుకు రండి. మేము పిలిస్తే వచ్చేలా లేడు” నవ్వింది.

ఆ ఇద్దరూ డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటే.. నేను రోషిత్ గదిలోకి దూరాను. రోషిత్ మంచం మీద అడ్డంగా పడున్నాడు. నా మాటల అలికిడికి గుమ్మం వైపే చూస్తూ ఉన్నాడు.

“ఐ నో. ఈ టైంకి నువ్వేగా వచ్చేది” మంచం మీద లేచి కూర్చున్నాడు.

“రా. టిఫిన్‌కి” చెప్పాను.

“నో. ఐ డోన్ట్ టాక్ టు దెమ్” జోరుగా అన్నాడు.

“వై” అడిగాను.

“దె హర్ట్ మీ.” సర్రున చెప్పాడు.

“ఏమైందట” అడిగాను.

“ఫోన్ చూడనీయడం లేదు” రోషిత్ రోషపడుతున్నాడు.

“మళ్లీ అదే తంతా. ఆ కారణమేనా” చిన్నగా నవ్వేను.

“నువ్వు చెప్పబట్టేగా ఓన్లీ సండేస్‌నే ఫోన్ ముడుతున్నాను. మిగతా రోజులు ఫోన్ ముట్టడమే లేదు. మరి ఇప్పుడు.. సండేస్‌లో కూడా ఫోన్ ఇవ్వనంటున్నారు కొత్తగా” గింజుకుంటున్నాడు రోషిత్.

“కూల్ కూల్. పద” కదిలాను.

వాడు మంచం దిగలేదు.

“రా మాట్లాడతాను” చెప్పాను.

వాడు మారంలోనే ఉన్నాడు.

“నువ్వు గుడ్ బోయ్‌విగా. పైగా ఈ తాతంటే నీకు భలే ఇష్టంగా. రా మరి. వాళ్లకి చెప్తానులే” చెప్పుతున్నాను.

అడ్డై..

“గట్టిగా చెప్పు తాతా. నాన్న పర్వాలేదు. అమ్మే.. మరిన్నూ. ఎక్సట్రా చేస్తోంది” చెప్పాడు రోషిత్.

వాడి వాలకంకి నవ్వేసాను.

“సరి సర్లే. నీకు నేను ఉన్నాగా. రా” వాడిని మంచం దించాను.

ఇద్దరమూ డైనింగ్ టేబుల్ చేరాం.             వాళ్లిద్దరూ టిఫిన్ చేస్తున్నారు.

“మీ గారాబమే కారణం” కూతురు కలగ చేసుకుంది.

“చాల్లేమ్మా” అనేసాను. రోషిత్‌ని వెనుకేసుకు వచ్చాను.

రోషిత్‌ని గుర్రుమని చూస్తున్న కూతురుతో..

“బెదిరించే కొద్దీ పిల్లలు మరింత రెచ్చిపోతారని ఎన్ని మార్లు చెప్పేది” అన్నాను గట్టిగానే.

అల్లుడు సన్నగా నవ్వేసి.. టిఫిన్ ముగించేసి లేచాడు. చేతులు వాష్ చేసుకొని.. తమ గది లోకి వెళ్లాడు.

“టిఫిన్ పెట్టి ఉంచాను. తినమనండి నాన్నా” కూతురు టిఫిన్ కూడా ఐపోయింది. తనూ లేచింది. చేతులు వాష్ చేసుకొని.. వంట గది లోకి వెళ్లింది.

“రా. ముందు టిఫిన్ చెయ్యి” చెప్పాను రోషిత్‌తో. వాడు నా వెనుకే తచ్చాడుతున్నాడు.

“ఫోన్ ఇప్పించు” లొడుగుతున్నాడు నా జుబ్బా లాగుతూ.

“అలాగే. ఇప్పిస్తాగా. ముందు టిఫిన్ తిను” చెప్పాను.. వాడి చేతిని పట్టి నా ముందుకు తెచ్చుకుంటూ. వాడు మారం కొనసాగిస్తున్నాడు.

“నా మాట వింటావుగా. టిఫిన్ అయ్యేక నీకు ఫోన్ ఇప్పిస్తాగా. నాది పూచీ” చెప్పాను.

వాడు వినుకున్నాడు. కుర్చీ లాక్కొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.

“నువ్వూ కూర్చో తాతా” చెప్పాడు.

నేను మరో కుర్చీ లాక్కొని కూర్చున్నాను. టిఫిన్ ప్లేట్‌ని వాడి ముందుకు జరిపాను.

“ఎప్పుడూ ఉప్మానే” రోషిత్ నసుగుతున్నాడు.

“జీడి పప్పు దండీగా ఉందిగా. నీకు ఇష్టంగా. పప్పు నంజుకుంటూ ఉప్మా తినేయ్. త్వరగా తినేస్తే.. వెంటనే ఫోన్ కొట్టేయవచ్చు” నచ్చచెప్పాను.

వాడు ఉప్మా తింటున్నాడు. కాఫీ కప్పుల ట్రే తో అక్కడికి వచ్చింది నా కూతురు. కొడుకును చూస్తూ.. తల ఏదోలా ఊపుతోంది.

అది చూసిన నేను.. “తగ్గవే తల్లీ” మెల్లిగా అన్నాను. నవ్వేను.

నాకో కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి.. మిగతా రెండింటితో తమ గది లోకి వెళ్లి పోయింది నా కూతురు. తను సన్నగా నవ్వడం కూడా నేను చూసాను.

“కాఫీ తాగు తాతా” చెప్పాడు రోషిత్.

“ఉదయం పాలు తాగావా” అడిగాను.

“ఆఁ. తాగేకే.. ఫోన్ అడిగాను. అంతే, మామ్ స్క్రీమ్డ్” తిండాపేసి గమ్మత్తుగా చెప్పాడు రోషిత్.

వాడి రియాక్షన్‌కి నవ్వు వచ్చింది. గట్టిగా నవ్వేసాను. వాడూ నవ్వేసాడు.

“మిమ్మల్ని చూసాడుగా.. ఇక రెచ్చిపోతాడు” అప్పుడే అక్కడికి వచ్చిన నా కూతురు గలగలా అంటోంది.

నేనేమీ అనలేదు.

“కాఫీ చల్లారుతోంది. తాగండి” చెప్పేసి ఖాళీ కప్పుల ట్రే తో వంట గది వైపు కదిలి పోతోంది నా కూతురు.

అక్కడికి వచ్చిన అల్లుడు.. “మామయ్యగారూ.. కూరలకు మార్కెట్‌కు వెళ్లి వస్తాను. ఈ రోజు మీ అమ్మాయి మీకు షీప్ బ్రైన్ పట్రమంది. తెస్తాను” చెప్పాడు. పిమ్మట అటుకై కదిలాడు.

“రా. తలుపు వేసుకో” వంట గది వైపు చూస్తూ చెప్పాడు.

నా కూతురు ఆ పని చేసి.. తిరిగి వంట గది వైపు వెళ్తుండగా నేనాపేను.

“ఆ ఫోన్ ఇవ్వమ్మా. కొంత సేపు చూసి ఇచ్చేస్తాడు” చెప్పాను.

“మీరు ఇంకా వెనుకేసుకు రావద్దు. హోం వర్క్స్ చాలా ఉన్నాయి. ఫోన్‌లో పడి అన్నింటినీ పెడన పెట్టేస్తున్నాడు” నా కూతురు రుసరుసలాడింది.

నేను నాన్చుతున్నట్టు కదిలాను. అలానే రోషిత్‌ని చూడలేక పోయాను.

నా కూతురు ఏమనుకుందో ఏమో.. తమ గదిలోకి వెళ్లింది.

ఆ వెంబడే, నా కూతురు విసురుగా తిరిగి వచ్చింది. నా ముందు డైనింగ్ టేబుల్ మీద తన ఫోన్ పెట్టేసి.. “తగలడనీ” విసురుగా అనేసింది.

ఆ వెంబడే.. అక్కడి నుండి వెళ్తూ.. “ఆయన ఫోన్ ఎలానూ ఇవ్వరు. నేను ఇస్తే.. నన్ను తిడుతున్నారు. వీడా వినడు. మధ్య నేను చస్తున్నాను” గోలగా అంది.

నేను నిజంగా అలజడయ్యాను.

తమాయించుకుంటూ.. “మమ్మీ చెప్పింది నిజమేగా. ఫోన్‌లో పడి హోం వర్క్స్ చేయకపోతే ఎలా.” అన్నాను రోషిత్‌నే చూస్తూ.

వాడు ఏమీ అనలేదు. ఫోన్ వైపే చూస్తున్నాడు. నేను తెములుకున్నాను.

“నా మాట వింటే.. వాళ్లే నీకు ఫోన్ ఇచ్చేలా చేస్తాను” చెప్పాను.

రోషిత్ ఆశ పడ్డాడు.

“ఏంటీ తాతా” ఉత్సాహంగా అడిగాడు.

“ఫోన్ బదులు అమ్మానాన్నల నుండి ఇకపై డబ్బులు డిమాండ్ చేయ్. వాళ్లు ఇచ్చే డబ్బుల్ని వాళ్లు చూస్తుండగానే.. నీ హుండీ బాక్స్ ఉందిగా.. దాంట్లో దాచుకో” చెప్పుతున్నాను.

రోషిత్ అడ్డై..

“ఎందుకు” అడిగాడు టక్కున.

“ఫోన్ బదులు అలా డబ్బులు వాళ్లు ప్రతి ఆదివారం ఇవ్వలేక విసిగిపోతారు.. ఆపై డబ్బులు బదులు ఫోన్ నీకు ఇస్తుంటారు. అంతే” నవ్వేను.

వాడు బులిసిపోయాడు. “నిజమా” కళ్లు సాగతీసాడు.

“ఆఁ. మరి” నేను గొప్పగా అన్నాను.

ఆ వెంబడే..

“ఈ రోజు నుండే అమలు చేయ్” చెప్పాను.

వాడు ‘సై’ అనేసాడు. టిఫిన్ కానిచ్చేసి.. నా కూతురు వద్దకు పరుగు తీసాడు. వాడి వెనుకే నేను వెళ్లాను.

“నాకు ఫోన్ ఇవ్వొద్దు. అందుకు నాకు డబ్బులు ఇవ్వాలి” తల్లిని అడిగాడు.

నా కూతురు చిత్రమయ్యింది.

వాడు వెంటనే తన గది లోకి వెళ్లాడు. తన హుండీ బాక్స్‌తో వచ్చాడు.

“గివ్ ఫైవ్ హండ్రడ్.” అన్నాడు.

నేను జంకాను.

“ఐదు వందలా” నా కూతురు డంగవుతోంది.

“అంతే. లేదా నాకు ఫోన్ ఇవ్వు” టప్‌న అనేసాడు రోషిత్.

“ఫోన్ ఇవ్వక.. డబ్బులు ఇవ్వక.. ఎలా తల్లీ” కలగ చేసుకున్నాను.

ఆ వెంబడే..

“ఖర్చు ఏం పెట్టడులే. హుండీలో పెట్టుకుంటున్నాడుగా” చెప్పాను.

“ఇంతంతా మీ ప్లానా. సరే. ఇస్తాను” తమ గదిలోకి వెళ్లింది. ఐదు వందలు తెచ్చి రోషిత్ హుండీలో వేసింది.

“ఇకపై ఫోన్ ఇవ్వను” చెప్పింది.

“అందుకు బదులుగా డబ్బులు మాత్రం ఇవ్వాలి” నేనే చెప్పాను.

రోషిత్.. “అంతే తాతా” అన్నాడు సరదాగా.

“ఆఁ. చూస్తాను. ఎన్నాళ్లు ఫోన్ ముట్టడో” అంది నా కూతురు.

నా అల్లుడు రాగానే.. విషయం చెప్పి.. అతడి నుండి కూడా ఐదు వందలు హుండీలో వేయించుకున్నాడు రోషిత్.

“ఆయన కూడా ఇవ్వాలా ఏం. ఇదేం పితలాటకం” నా కూతురు రుసరుసలాడింది. నేను నవ్వుకున్నాను.

రెండు ఆదివారాలు తర్వాత..

రోషిత్ చెంతకు ప్రతి ఆదివారంలా వచ్చిన నాతో..

“తాతా.. అమ్మ మూలుగుతూ ఇస్తోంది కానీ.. నాన్న సరదాగానే డబ్బులు ఇస్తున్నారు. నేను హుండీలో దాచుకుంటున్నాను. బోల్డు కూడాయి. ఇప్పుడు ఒన్ థవ్జెండేసి హుండీలో వేయించుకుంటున్నాను.” చెప్పాడు వాడు.

“భలే. త్వరలో అమ్మే విసుక్కుంటుంది. డబ్బులు ఇవ్వక ఓడిపోతోంది. నీకు ఫోన్ ఇచ్చేస్తోంది” చెప్పాను చలాకీ పర్చేట్టు. రోషిత్ తల నిమిరాను.

“తాత.. హోం వర్క్ ఉంది. రాసి వచ్చేస్తా. నువ్వు అమ్మ దగ్గర ఉంటావా” రోషిత్ పుస్తకాలు తీసుకుంటున్నాడు.

వాడి గదిలోంచి బయటికి వచ్చేసాను. అల్లుడు బజారు నుండి వచ్చాడు. అతడి వెనుకే నేను కూడా వంట గది లోకి దూరాను.

“ఫోన్ ఇచ్చుడు కంటే వాడికి డబ్బులు చెల్లించడమే కష్టమవుతోంది నాన్నా. పైగా వాడు అడిగినంత ఇవ్వాలంటా” నా కూతురు అవస్థ తెలుస్తోంది.

“మరి ఓడిపోతావా” అడిగాను.

నా కూతురు ఏమీ అనలేదు.

అప్పుడే.. అల్లుడు మాత్రం.. “ఇచ్చినవి హుండీన పోగేస్తున్నాడుగా. ఇదీ మంచిదేగా” అన్నాడు.

“అదే నా తలంపు కూడా. ఏదోలా నెమ్మదిగా ఫోన్ వైపు నుండి వాడి దృష్టి మరల్చేయాలి” చెప్పాను.

మరి కొన్ని ఆదివారాల తర్వాత..

కూతురు ఇంటిలో అడుగు పెట్టీ పెట్టగానే.. “తాతా రా” అంటూ నా చేయి పట్టుకొని తన గది లోకి లాక్కుపోయాడు రోషిత్.

వాడి తొందర నాకు అర్థం కావడం లేదు.

“ఏమైంది రోషీ” అడుగుతున్నాను.

“తాతా.. లెక్కలు రాసుకున్నాను. అమ్మానాన్నల నుండి మొత్తం ఇరవై వేలు వసూలు చేసి కూడేసాను.” చెప్పాడు గొప్పగా.

“అబ్బో” అన్నాను. అబ్బురపడ్డాను.

వాడిని అభినందించాను. వాడి బుగ్గల్ని ముద్దాడాను.

వాడు ఇవేమీ పట్టించుకోక..

“తాతా.. ఆగు తాతా.. మనం ఇప్పుడే బజారుకు వెళ్దాం. నా హుండీలోని డబ్బులతో కొత్త ఫోన్ నాకు కొనిపెట్టావా.. ఇక అమ్మ నాకు ఫోన్ ఇచ్చేదేటీ..” జరజరా మాట్లాడేస్తున్న రోషిత్‌ని చూస్తున్న నేను..

ఒక్క మారుగా హడలిపోయాను.. వెంబడే హతాశుడయ్యాను.

Exit mobile version