మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది. కోలనీ అంతా కోవిడ్ ప్రభావంతో నిర్మానుష్యంగా వుంది. డెలివరీ అబ్బాయిలు సరుకులను మెయిన్ గేటు వద్దే వదిలి వెళ్ళిపోతున్నారు. వాటిని తీసుకోవడానికి ముఖాలకు మాస్కులు పెట్టుకొని వచ్చే కొద్ది మంది తప్ప ఇంకే విధమైన అలికిడి లేదు. వంట పూర్తవడంతో సోఫాలో రిలాక్స్ అయ్యి మొబైల్‌లో వాట్సప్ మెస్సేజిల్ని చూస్తూ చెరగిలబడింది వనజ.
మన కోలనీలో ఫలానా బిల్డింగ్‌లో ఫలానా ఫ్లాట్‌లో ఒక ఆఫీసరు గారికి కోవిడ్ 19 వచ్చిందని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని, అందరూ ఈ సంఘటనతో జాగ్రత్త పడాలని కోలనీ అసోసియేషన్ సెక్రటరీ నుండి మెసేజి వచ్చింది.
కోవిడ్ ప్రభావిత వ్యక్తి పేరు చూడగానే వనజ మనస్సు ఆనందంతో గంతులు వేసింది. ఆయన వనజ భర్త ఆఫీసులోనే పని చేస్తున్నారు. జూనియర్ అయినా త్వరగా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ పిల్లలు వనజ పిల్లల కంటే చదువుల్లో బాగా రాణిస్తున్నారు. అందుకే వాళ్ళ కుటుంబం అంటే వనజకు ఒళ్ళు మంట. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారి కుటుంబంపై విద్వేషాగ్ని విరజిమ్మేందుకు సిద్ధంగా వుంటుంది. అదిగో ఈ మెస్సేజి రూపంలో వనజకు మరొక మంచి అవకాశం వచ్చింది.
ఇక ఆ మెస్సేజిని మరి నాలుగు లైన్లు అదనంగా జోడించి కాలనీలో కాక వారి ఆఫీసులో కోలీగ్స్ భార్యలకు ఫార్వర్డ్ చేసేసింది. పదవులు వస్తే చాలదని, బాధ్యతగా కూడా ప్రవర్తించాలని, ఆయనగారి బాధ్యతారహిత ప్రవర్తన వలన ఈ కోలనీలోని వందలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాసి అందరికీ పంపించింది. అంతే కాకుండా అజాగ్రత్తతో వుండి, కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారం తిరిగి వాళ్ళతో పాటు ఇతరుల జీవితాలను కూడా ఎలా ప్రమాదంలో పడేస్తున్నారో వివరిస్తూ ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ లలో పోస్టులు పెట్టింది. కడుపులో వున్న ద్వేషం అంతా కక్కేసాక మనసు ఎంతో రిలీఫ్‌గా అనిపించింది. సుష్టుగా భోజనం చేసి కంటికి నిండా నిద్రపోయింది.
సాయంత్రం ఆరవుతుండగా వనజ భర్త రవి ఆఫీసు నుండి ఫోనొచ్చింది. రవి బాసు ఫోన్ చేసి హఠాత్తుగా రవికి 104 డిగ్రీల జ్వరం వచ్చిందని, దగ్గర్లో వున్న డాక్టరుకు చూపిస్తే కోవిడ్ లక్షణాలు వున్నాయని, అందుకే ప్రభుత్వాసుపత్రిలో ఐసొలేషన్ వార్డుకు తరలించారని చావు కబురు చల్లగా అందించాడు. అంతే కాకుండా లంగ్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా వుండడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా వున్నందున వెంటిలేటర్ పై వుంచారని, బ్రతికే అవకాశాలు ఎంత వున్నాయో చెప్పడం కష్టమని డాక్టర్లు అంటున్నారని చెప్పాడు. అంతే మొదలు నరికిన చెట్టులా వనజ కూలిపోయింది.
అప్పుడే స్కూలు నుండి వచ్చిన పిల్లలు అమ్మ పరిస్థితి చూసి గాభరా పడుతూ పక్కవారికి వెళ్ళి చెప్పారు. ఆ ఫ్లోర్ లో వున్న ఆడవాళ్ళందరూ వచ్చి వనజకు సపర్యలు చేసి కోలుకునే వరకు దగ్గరే కూర్చున్నారు. వారు చూపిన ఆదరణ, ఆప్యాయతలకు వనజ కళ్ళలో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
మర్నాడు కాలనీ మహిళల నుండి, ఇతర కొలీగ్స్ భార్యల నుండి ఎన్నో పరామర్శక పూర్వమైన మెస్సేజిలు వచ్చాయి. వాటిని చూసాక వనజ హృదయం పశ్చాత్తాపంతో దహించుకు పోయింది. తాను ఒకరిపై కసి తీర్చుకునేందుకు అడ్డమైన రాతలతో మెస్సేజిలను పంపగా వారు మాత్రం మాత్రం రవి వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సాంత్వన ఇచ్చే వ్యాక్యాలతో కూడిన మెస్సేజిలను పంపారు.
ముఖ్యంగా రవి కొలీగ్ వాసు భార్య రుక్మిణి మాత్రం రవి త్వరగా కోలుకోవాలని హనుమాన్ చాలీసా, దుర్గా స్త్రోత్రం, ఆదిత్య హృదయం అనేక సార్లు పారాయణ చేస్తున్నట్లు, అధైర్య పడవద్దని, మన రెండు కుటుంబాలను ఆ భగవంతుడే తప్పక కాపాడతాడని ధైర్యం చెబుతూ మంచి మెస్సేజిని పంపించింది. తాను ఇంతకాలం విద్వేషం పెంచుకున్న రుక్మిణి వ్యక్తివం హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిపోయినట్లనిపించింది.