Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తండ్రి

[‘తండ్రి’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – కావ్య కడమె.]

న్మయి బ్రెస్ట్ పంప్ ఉపయోగించే సమయంలో స్టోర్ రూమ్ వైపు ఎవరూ తిరగకూడదనే అలిఖిత నియమం ఈ రెస్టారెంట్లో ఉంది. అది ఆమె భర్త అయిన సుమేదాకు కూడా అన్వయిస్తుంది. టేబుల్ తుడవడానికి, పాత్రలు కడగటానికి వచ్చే పని కుర్రవాడు టామ్ ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో ఎన్నడూ స్టోర్ రూమ్ వైపు కాలుపెట్టనే లేదు. అలా కాలుపెట్టే సందర్భమూ అతనికి ఇప్పటిదాకా రాలేదు. తనకు ఇచ్చిన పనిని, ఇచ్చిన సమయంలో పూర్తిచేసి, గంటల లెక్కలో ‘క్యాష్ ప్లీజ’ అని డాలర్ నోట్‌లనే జీతం తీసుకుని అతను వెళ్ళిపోతాడు.

ఇక మిగిలింది వంట బాధ్యతలు చూసుకునే బాబు మాత్రమే. ఈ బాబు పూర్తి పేరు బసంత్ కుమార్. అమెరికాకు వచ్చిన కొత్తలో ఇక్కడి జనానికి పిలవడానికి సులభంగా ఉండాలని పెట్టుకున్న పేరు ఇప్పుడు అదే ఖాయం అయిపోయింది. సుమారు ఆరవై ఐదు నుంచి డెబ్బయి వరకు ఏ వయసులోనైనా ఉండగలిగిన బాబ్ గత ముప్ఫయి సంవత్సరాల నుంచి అమెరికాలోని వేరువేరు రాష్ట్రాలలో వేరువేరు కారణాలకు నివాసముండి, ఇప్పుడు న్యూజెర్సీలోని ర్యారిటన్ పట్టణంలోని ఈ గూడును చేరుకున్నాడు.

మొదటి సమావేశంలోనే గుజరాతివారో, బీహార్‌వారో అన్నారు కదా, సరిగ్గా భారత్‌లోని ఏ ప్రాంతంవారని సుమేదా అప్పుడప్పుడు ఆలోచిస్తాడు. జతలో ఉన్న పది గంటలలో ఒకే మాట అడిగి ఈ ప్రశ్నకు సులభంగా జవాబు అతను దొరకబుచ్చుకోవచ్చు. అయితే అతని వైపు కచకచమని ఉల్లిపాయలు కోస్తూ, ఇటు తాళింపుకు ఆవాలు వేస్తున్నప్పుడు, ఖాళీ అయిన పచారీ సామాన్ల వివరాలు అప్పజెబుతూ కొత్త వంట ప్రయోగాల పట్ల చెప్పేటప్పుడు చప్పున, “మీరు ఎటువైపు వారు?” అని అడగటం సుమేదాకు అదోలా అనిపించింది. ఇదొక విధంగా బస్సులో పక్కన కూర్చున్నవారితో నాలుగైదు గంటలు మాట్లాడినప్పటికీ, వాళ్ళ పేరు మరిచి గందరగోళానికి చిక్కుకుంటాం కదా, అలా ఉంది.

రెండేళ్ళ క్రితం తాము పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి గ్రీన్ కార్డ్ దొరికిన తర్వాత ఆ ఉద్యోగం వదిలి చాలా కాలపు కల అయిన ఈ రెస్టారెంట్ ప్రారంభించినప్పటికీ సుమేదా, తన్మయి, వంట పనికోసం ఇంటర్వ్యూకు వచ్చిన మూడో అభ్యర్థి అయిన బాబ్ అడిగిన తక్కువ జీతానికి, రెస్టారెంట్ ఒక మూలలో మంచం వేస్తే చాలు అనే అతని సరళమైన మాటల్లో, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ అన్నిటికీ ‘నో ప్రాబ్లమ్’ అనే ఆయన ఆత్మవిశ్వాసంలో నమ్మకం పెట్టుకుని కొద్ది రోజులు చూద్దామని, మొదలైన బంధం ఇప్పుడు ఆయన లేకుండా వ్యాపారం నడపటానికి సాధ్యమే లేదన్నట్టుగా పరిణమించింది.

తన్మయి పరిచయమైన మొదటిరోజు నుంచే బాబ్‌గారిని ‘బాబా’ అని పిలుస్తోందని సుమేదాకు అసహనం. ఎవరో మగవాడు ఈమెకెందుకు బాబా కావాలి అని ఆమె పిలిచినప్పుడల్లా ఈ అకారణమైన చనువుకు మండిపడ్డాడు. బాబ్ కూడా తన్మయిని తనలాగే ‘తనూ’ అని పిలిచినప్పుడు మరింతగా మండిపడ్డాడు. తన్మయి స్టోర్ రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన ఒకసారి తలుపు కొట్టినట్టు చేసి లోపలికి వెళ్ళిపోతాడుకదా అని అతనికి బాధ. అది తన్మయిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడం లేదని ఇంకా అయోమయం. అయితే దాని గురించి గొడవ చేయటానికి ఇది సమయం కాదని మౌనం వహించాడు.

తన్మయి, సుమేదాల కొడుకు సమన్వయ బతికివుంటే వచ్చే సోమవారానికి వాడికి రెండు నెలలు నిండేది. నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ ఇచ్చిన డేటుకు వెనకటి రోజున బిడ్డ కదలిక ఎందుకో అనుభవానికి రాలేదు. ఎందుకైనా మంచిదని క్లినిక్‌కు వెళ్లటమే గుర్తుకొచ్చి ఆయన అప్పటిదాకా గడిపిన జీవితమే ఒక విధంగా ఛిద్రమైపోయింది. “ఐ క్యాంట్ ఫైండ్ ది హార్ట్ బీట్. బిడ్డ గుండెచప్పుడు ఎందుకో దొరకటం లేదు” అని డాఫ్లర్ పరికరాన్ని తన్మయి కింది పొట్ట మీద పెట్టి చూస్తున్న నర్స్ ఆక్రందన వాళ్ళిద్దరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.

ఇరవై వారాల అనాటమీ స్కాన్‌లో మగబిడ్డ అని తెలిసినప్పుడు సుమేదా, తన్మయి పేర్ల అక్షరాలనే ముందు వెనుకలు చేసి దొరికిన ‘సమన్వయ’ అనే పేరు ఇద్దరికీ ఇష్టమైంది. అతని స్నేహితులందరికి శ్యామ్ అవుతాడు, మేము సమూ అని పిలవచ్చు అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలలో, ఆశపడి తీయించుకున్న మెటర్నిటీ ఫోటోషూట్‌లో, ఫేస్‌బుక్‌లో పంచుకున్న, ‘ఎదురు చూస్తున్నాం’ అనే పోస్టులో, రోజువారి కార్యక్రమాల్లో ఇంకా పొట్టలోనే ఈత కొడుతున్నప్పటికీ పేరు పెట్టి పిలిపించుకుంటున్న ‘సమన్వయ’ తొందరలోనే ఈ లోకాన్ని చూస్తాడని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా గుండె చప్పుడు ఆగిపోయింది. అలా ఎందుకు జరిగిందో ఆ గుట్టును తన్మయికి కానీ, సుమేదకు కానీ, స్వయంగా డాక్టరుకు కానీ అర్థం కాలేదు.

“ఇట్ హ్యాపెన్స్ మోర్ ఆఫన్ దెన్ యూ థింక్. కొంతమంది శిశువులు గర్భంలోనే ఎందుకు చనిపోతారో చివరి వరకూ మనకు కారణం దొరకదు. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదన్నది మాత్రం గుర్తుంచుకోండి” అని తన్మయి డాక్టర్ అయిన ఆలిసన్ విచార స్వరంతో చెప్పారు.

పన్నెండు గంటలు నొప్పులు పడిన తర్వాత బయటికి వచ్చిన పసిబిడ్డ మృతదేహాన్ని గుండెల మీద పెట్టుకొని కంపిస్తూ కూర్చున్న తన్మయికి, మెడికల్ బెడ్‌కు ఆనుకొని నిలుచున్న వాళ్ళిద్దరినీ మొదటిసారిగా, అలాగే చివరిసారిగా మొత్తంగా చూస్తున్న సుమేదకు ఈ గదిలో తన ఇద్దరు ఊపిరి తీసుకుంటుండడమే మహా పాపంగా కనిపించింది. అరగంట, అరగంట అంతరంలో బిడ్డ చర్మం గులాబీ నుంచి పసుపుకు, తర్వాత నీలం వైపు, తర్వాత గోధుమ రంగుకు మారుతూ ఉండటం తన భ్రమ మాత్రమే కాదు కదా అనే సుమేద కంగారు పడ్డాడు. డాక్టర్ ఆలిసన్ ఎత్తుకొని ఇచ్చినప్పుడు, వెచ్చగా మెత్తగా ఉన్న బిడ్డ దేహం క్షణాలు గడుస్తున్నట్టే చల్లబడుతూ, గట్టిపడుతూ పోయింది. ప్రపంచంలోనే ఏదేదో యుద్ధాలలో అలసిపోయి ఎక్కడెక్కడో గెలిచి, ఓడి, మూల్గి, సంబరపడి చివరికి అమ్మ ఒడిలో దబ్బుమని కూలబడి సుదీర్ఘమైన నిద్రపో జారిపోయిన బిడ్డ కళ్ళను సుఖంగా మూసుకుంది. విగ్రహంలాంటి భారమైన దేహం మీద తదేక చిత్తంతో దృష్టిని సారించి కూర్చున్న తన్మయి ఇక చివరిసారి బిడ్డను దాదికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు తల ఎత్తి ఒకసారి సుమేద వైపు చూసింది.

ఆమె ఆ ఖాళీ చూపులను ఎదుర్కొన్నప్పుడు సుమేద అక్షరాల ఒక అడుగు వెనక్కు జరిగాడు. ఆ క్షణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న గట్టిదేదో ముక్కలైనట్టు అనిపించింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆ వంతెన పునర్నిర్మాణం కాలేదని అతనికి నమ్మకం కలుగుతుంది.

ఇంటికి మరలేటప్పుడు డాక్టర్ ఆలిసన్ ఒక బ్రెస్ట్ పంప్ కిట్టును తన్మయికి ఇచ్చారు. పాలను ఎలా పంపు చేయాలి, క్రమంగా తగ్గిస్తూ వచ్చి ఎలా పాలు ఉత్పత్తిని నిలిపే సూచనలను దేహానికి ఇవ్వాలో అనటం గురించి సమాచారం ఇస్తూ, “బి బ్రేవ్, నువ్వు తలుచుకుంటే చనుబాలు లభించని ఎంతోమంది పసిబిడ్డలకు క్షీరదానం చేయొచ్చు. దీనివల్ల నీ మనస్సుకూ సంతప్తి దొరకవచ్చనే ఆశయం నాది” అని కౌగిలించుకొని ముద్దుపెట్టి వీడ్కోలు చెప్పారు.

ఆనాటి నుంచి తన్మయి ఒక వ్రతంలా పాలను చిన్న ప్యాకెట్లలో సేకరించి ఫ్రీజ్ చేస్తోంది. వారానికి ఒకసారి ‘మామ్స్ మిల్క్ కోఆపరేటివ’ అని పేరున్న తెల్లటి రంగు వ్యానులో నుంచి దిగిన స్వయంసేవకులు ఆ ప్యాకెట్లను కలెక్ట్ చేసుకుని వెళ్తారు.

ప్రతిసారి కూడా ఆ పాలను దానంగా తీసుకొన్న బిడ్డ ఇంటివారు ధన్యవాదాలు సూచించిన హస్తాక్షరాల గ్రీటింగ్ కార్డును ఇస్తారు. తన్మయి వాటిని మొదట్లో జాగ్రత్తగా పెడుతుండేది. ఈమధ్యన సుమేదకు ఒకే రకంగా కనిపించే ఆ థాంక్యూ కార్డులు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి.

మొదటి ఒకటిన్నర నెల వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంది. ఇప్పుడు రెండు వారాల నుంచి రెస్టారెంట్‌కి వస్తోంది. ఆమె హాజరు లేకుండా వెలవెలబోయిన రెస్టారెంట్ మళ్ళీ కళకళలాడడం మొదలైంది. కాన్పుకు ముందు ఆమె పొట్టను గమనించి అభినందనలు చెప్పిన పరిచయస్థులైన కస్టమర్లు వస్తే మాత్రం కొద్దిసేపు లోపలే ఉండిపోతుంది.

***

‘చపాతి హౌస’ అనే పెద్ద అక్షరాలలోనూ ‘ఫైన్ ఇండియన్ క్యుసీన్’ అని కింద చిన్నగానూ ఎరుపు, నీలిరంగులలో రాయబడిన ఈ పచ్చరంగు బోర్డు ఇంత చిన్న అంగడికి పెద్దదైందని లోపల కాలుపెట్టే కస్టమర్లందరికీ అనిపిస్తుందేమోనని సుమేదకు అనుమానం. బోర్డుకు ఆర్డర్ ఇవ్వడానికి ముందు తాను కొలతను తప్పుగా ఊహించినందుకు ఇలా జరిగిందేమోనని అప్పట్లో పశ్చాత్తాపం పడ్డాడు.

హోటల్ తెరిచినప్పుడంతా ముందు భాగానికి వేయించిన గాజు మీద ‘ఓపెన్’ అనే ఎర్రటి మిణుకు మిణుకుమనే దీపం నిరంతరంగా వెలుగుతూ, ఆరుతూ ఉంటుంది. ఆ దీపం కుడివైపున ఫ్రేమ్ వేయించిన మెనూ ఉంది. దాని పక్కనే ‘టుడేస్ స్పెషల్’ అని చేత్తో రాసిన బోర్డు ఉంది. రోజు మారుతూనే ఉండే ఈ బోర్డు మీద రాసేవాడు సుమేద. ఉదయం రాగానే బాబ్ దగ్గర ఆ రోజుటి ప్రత్యేకమైన వంటకాలు ఏమిటో అడిగి, ఆ పలక మీద రాస్తాడు. కొన్నిసార్లు నిలువుగా పంక్తుల్లో సుందరమైన అక్షరాలతోనూ, మరికొన్నిసార్లు అడ్డదిడ్డమైన అక్షరాలలోనూ అతను రాసేవాడు. సరిగ్గా గమనిస్తే ఆ రోజు అతని మనస్థితిని అప్పటి బోర్డును చూసే గుర్తించవచ్చు.

అక్కడే కూర్చుని ఆర్డర్ చేసేవారికన్నా ఇంటికి ‘టేక్ అవుట్’ తీసుకొని వెళ్లేవారే ఎక్కువగా ఉండటం వల్ల ఉన్న నాలుగైదు టేబుళ్లు, కుర్చీలే సరిపోయేవి. ఆ రెస్టారెంట్ గతంలో ఎప్పుడో సింగిల్ బెడ్ రూమ్ కలిగిన ఇల్లు అనటానికి అక్కడ ఇంకా రుజువులు దొరుకుతాయి. లోపల కాలుపెట్టిన వెంటనే ఒక లివింగ్ రూమ్, ఓపెన్ కిచెన్ కనిపిస్తాయి. తన్మయి ఆ రెండు గదుల మధ్య ఇప్పుడు ఒక కళాత్మకమైన తెరను వేలాడదీసింది. ఆ తెర ముందు క్యాష్ కౌంటర్. పక్కనే రెండు రకాల తీయటి సోంపుతో నిండిన పింగాణి గిన్నెలు పెట్టారు. కిచెన్ వెనక వాష్ రూమ్, అలాగే పెరటి వాకిలి. ఎదురుగా ఉన్న తలుపు మీద ‘స్టోర్ రూమ్’ అని రాయబడిన ఒక గది. వారానికి అవసరమైన సరుకులు, కూరగాయలను సేకరించి పెట్టడానికి ప్యాంట్రీ, ఫ్రీజర్లు ఉన్నాయి. మూలలో ఒక సింగిల్ బెడ్, అక్కడే రాత్రి బాబ్ పడుకుంటాడు. ఇదే గదిలో తన్మయి గంటకొకసారి వెళ్లి పంపుచేసి పాలను ఫ్రీజర్‌లో పెట్టి వస్తుంది.

మొదట్లో తన్మయికి నైతిక ధైర్యం ఇవ్వడానికీ, సహజమైన కుతూహలంతోను ఆమె పంపు చేసేటప్పుడు సుమేద ఆమెతోపాటు కూర్చునేవాడు. ఆ పంపు విడిభాగాలు పిల్లల ఆటవస్తువులను పోలినట్లుగా ఉంటాయి. ఒక చిన్న బాటిల్, దాని మూత నుంచి లోపలికి వదిలిన ట్యూబ్, ఆ ట్యూబ్‌కు జతపరిచిన పువ్వు ఆకారంతో ఉన్న గిన్నె. తన్మయి ఒక చేత్తో స్తనాన్ని ఒత్తి పట్టుకొని ఇంకొక దానితో ఆ గిన్నెను స్తనం ముచ్చికకు ఒత్తుతుంది. ఈ బాటిల్‌ను చిన్న రేడియోలా ఉన్న ఒక యంత్రానికి కనెక్ట్ చేసి బటన్ నొక్కుతుంది. అప్పుడు శబ్దం ఏర్పడి గిన్నె స్తనపు ముచ్చికను లాగి లాగి పాలను సేకరించి బాటిల్లోకి వదులుతుంది. చూస్తూ చూస్తుండగానే బిందువులు బిందువులు కిందికి జారి ఆ చిన్న బాటిల్ లేత పసుపు రంగు పాలతో నిండిపోతుంది.

నిర్వాతాన్ని సృష్టించేటప్పుడు ఆ యంత్రం హుష్ టక్ టక్.. హుష్ టక్ టక్.. అనే విచిత్రమైన శబ్దాన్ని వెలువరిస్తుంది. ఇనుప మంచం మీద వదులైన పక్కను వేసి ఒక జంట నడపగలిగే అవసరపు మిలనక్రియే శబ్దాన్ని ఆ యంత్రపు సద్దు పోలుతూ ఉంది. ఒక అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు ఈ శబ్దానికి సుమేద భయపడ్డాడు. లేచి చూస్తే తన్మయి పాలు పంపు చేస్తూ కూర్చుని ఉండటం కనిపించింది. సుమేద చూడటం లేదనే నమ్మకంతో ఆమె దేహం స్త్రీ సౌష్టవానికి సహజమని అతను భావించిన నాజుకుతనాన్నంతా పక్కన పెట్టింది. చెదిరిన జుట్టుతో, తడిలేని పెదవులతో, ఉబ్బిన కళ్ళతో, ఉదాసీనంగా వదిలేసిన పొట్టమడతలతో, అతను ఎన్నడూ తన్మయిని చూడలేదు. కుర్చీ మీద నిటారుగా కూర్చొని కాళ్ళను వెడల్పుగా నేలకు ఆన్చింది. తన మొత్తం అస్తిత్వమే ఆ ఎడమవైపు స్తనంలో ఉందేమో అన్నట్టు వేరు వేరు భాగాలలో పిండి పాలును సేకరిస్తోంది. ఎందుకో సుమేద ఆ రోజు నుంచి ఆమె పంపు చేసేటప్పుడు ఆ గదికి దూరంగానే ఉండిపోయాడు.

బాబ్‌కూ ఈ సూక్ష్మాన్ని తెలియజేయడానికి ప్రయత్నించాడు. ‘తన్మయికి ఇలాంటి సమయంలో స్పేస్ అవసరమవుతుంది’ అని చెప్పబోయి దాన్ని కొనసాగించడం ఎలాగో తెలియక తడబడ్డాడు. ‘తను చేస్తున్నది పవిత్రమైన పని. ఆ దేవుడు ఆమెను చాలా ఎత్తుకు తీసుకెళ్తాడు’ అని ఒకసారి భావోద్వేగంతో అనడం తప్ప బాబ్ ఆ విషయం గురించి ఇంకేమీ అనలేదు.

అలా ఆయన ఆమె స్థనాన్ని చూడాలనే ఆ గదికి వెళ్తారని అతను కచ్చితంగా చెప్పలేడు. అలా చెప్పేలా ఉంటే ఈ సందిగ్ధాన్ని భరించడం ఎంత సులభమయ్యేది అని అతని అనిపించింది కూడా. తన్మయి ప్రతిసారి పంపు చేయడం మొదలు పెట్టగానే ఆయన అక్కడికి వెళ్లి కూర్చుంటారు అని అన్నప్పటికీ అది అబద్ధం అవుతుంది. మధ్యాహ్నం మూడు నుంచి ఆరువరకు ఈ రెస్టారెంట్లో విరామ సమయం. రాత్రి ఐటమ్స్ అన్నీ ఆ సమయంలో హడావుడిగా తయారు కావాలి. వంట చేసేవాడు బాబ్ ఒక్కడే కావడం వల్ల ఫ్రీజర్ నుంచి కూరగాయలో, ప్యాంట్రి నుంచి బ్యాటరీ పప్పులో, గింజలో నిరంతరంగా అవసరమవుతుంటాయి. పైగా అది ఆయన నివసించే గది కూడా కావడం వల్ల వంటింటి పనులు తొందరగా పూర్తయితే ఆయన అక్కడికి వెళ్లి కూర్చునేవారే.

***

ఆరోజు గది నుంచి హఠాత్తుగా నవ్వు విస్పోటించినప్పుడు కౌంటర్లో డబ్బులు లెక్కపెడుతూ కూర్చున్న సుమేద ఊరకుండలేకపోయాడు. లోపల ఏమి మాట్లాడుకుంటున్నారోనని తలుపుల దగ్గర అరక్షణం నిలుచున్నాడు. తన్మయి ఇంకా నవ్వు ఆపలేదు. బాబ్ ముందుకు కొనసాగించాడు.

“ఆ తర్వాత ఆమె ఏమందో తెలుసా? నేను అక్కడ లేనే లేనని చివరి వరకు సాధించింది”

“మీకు తెలుసా? సుమేద చిన్నమ్మ ఒకరు అలాగే ఉన్నారు?”

“ఏ చిన్నమ్మ, ఏమిటి విషయం?” అంటూ సుమేద తానూ నవ్వులో బాగస్థుడవ్వటానికి లోపలికి వెళ్ళాడు.

“ఏమీ లేదులే, లాంగ్ స్టోరీ, అంత ముఖ్యమైనది కాదు. ఈ బాబు ఒక జోక్ చేస్తున్నాడు అంతే..” అంటూ టేబుల్ మీద పెట్టిన బాటిల్ నుంచి పాలను దానికోసమే పెట్టిన చిన్న జీప్ బ్యాగులలో నింపసాగింది. బాబ్ మంచూరియా మసాలను తయారు చేసి పెడతానంటూ లేచిపోయాడు.

అలా తన్మయి తనతోపాటు నవ్వి ఎంత కాలమయ్యింది అని సుమేదకు విషాదం కలిగింది. బిడ్డను పోగొట్టుకొని ఇంకా రెండు నెలలు కూడా కానప్పుడు, ఆమె అంత నిశ్చింతగా నవ్వడం ఎలా సాధ్యమైందని కోపమూ వచ్చింది. అదే నవ్వును తాను నవ్వి వుంటే తానెంతటి కఠినమైన హృదయం కలిగినవాడని ఉపన్యాసం ఇవ్వడానికి బోడి వెధవలూ తయారుగా నిలుచుకునేవారని లోపల గొణుక్కున్నాడు. చనుబాలు తోపాటు దుఃఖాన్ని కూడా చుక్కలు చుక్కలుగా పోగొట్టుకోగలిగిన తన్మయి అదృష్టానికి అసూయ పడ్డాడు.

రోజులు గడుస్తున్న కొద్ది తన్మయి, బాబ్‌ల సంభాషణలు స్టోర్‌రూమ్‌కు మాత్రమే పరిమితం కాకుండా పెరటి తలుపులను దాటి, కిచెన్ గుండా రెస్టారెంట్ బయటి అరుగు వరకు వచ్చి నిలుచుంది. ఎప్పుడో ఆపిన టేప్‌రికార్డు లోపలి నుంచి ప్లే బటన్ నొక్కగానే సగం నుంచి మొదలైన గానంలా వాళ్లు ఆగి ఆగి మాట్లాడుతున్నారు. మధ్యమధ్య వారి కంఠాల హెచ్చుతగ్గులు, తాత్కాలికమైన మౌనం తప్పక ఉండేది. సుమేద చెవికి అర్థం లేనట్టు కనిపిస్తున్న కథలు, సంభాషణలు, ప్రకటనలు వారిద్దరికీ మాత్రం పరిమితమైన, వారికే వ్యక్తిగతమైన మనోభూమికలో కొత్త అర్థాలను పొందినట్టు కనిపిస్తుండేది

వారి సంభాషణలో భాగస్థుడు కావాలని సుమేద కూడా ఒక్కోసారి ప్రయత్నించాడు. అయితే వారిలా అతను ప్రమాదరహితమైన కథలను జ్ఞాపకాలనుంచి ఏరుకొని అల్లలేడు. దానికి ఒక సమగ్ర అర్థాన్ని ఇవ్వడానికి సాధ్యం కాకపోతే అవి కేవలం వివరణలు గానో, అల్పస్థాయి జోకులుగానో మిగిలిపోయే అవకాశం ఉండేది. వాళ్ళిద్దరితో అలాంటి సంబంధాన్ని సాధించడానికి ఎంత ప్రయత్నించినా అతనికి సాధ్యం కాలేదు. ఇదే కారణంగా సుమేద వారి మాటల్లో పాల్గొన్న కొద్ది నిమిషాలలోనే ముగ్గురిలో ఒకరు ఏదో ఒక సాకుతో సంభాషణను ముగించేవారు. అందువల్ల మిగతా ఇద్దరికీ నిశ్చింతగా ఉండేది.

“సుమతికి తెలియగానే నన్ను పట్టుకొని అడిగేసింది. నేను చెప్పింది విని ఓపిక ఉంటే కదా ఆమెకు?”

“అప్పుడు ఆనంద్ ఎక్కడున్నాడు?”

“ఓహ్, అతను పుట్టడానికి ముందరి సమాచారమిది”

“అంత పాతదా? అదే చెప్పారు కదా, ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని. పాపం ఆ బాధతో అలా అనివుండాలి”

“కావచ్చేమో. ఆ రెండు నెలల్లోనే మేము చాలా దగ్గరగా ఉన్నామని అనిపిస్తుంది”

“నా స్నేహితుడి తమ్ముడొకడు మీరు చెప్పిన తీరులోనే ఆడేవాడట. రాత్రంతా లేచి కూర్చోవడం, చెప్పిందే చెప్పటం, నవ్వడం, ఆ దశ నుంచి బయటికి తీసుకురావడానికి పాపం ఆయన ఇంటివారికి విసుగొచ్చేసిందట”

ఈ అర్థం లేని మాటల వల్ల వీళ్ళిద్దరికీ ఏ సుఖం దొరుకుతుందోనని సుమేద అయితే చెప్పలేడు. ఒకసారి మాత్రం తన్మయి వెక్కి వెక్కి ఏడవడం స్పష్టంగా విన్నాడు. “నేను సుమేదనే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టినప్పుడు ఊర్లో ఉన్న నా తండ్రి, ‘కన్నవాళ్ళ మనసును నొప్పించినవారు అమెరికాలో ఉన్నప్పటికీ మోరీలో పడటమే’ అని బాధతో అన్నారు. అందుకే ఇదంతా జరుగుతూ ఉందేమో” అని ఆగి ఆగి చెబుతోంది.

“అలా మరొకరి నోటి శాపం వల్ల అన్నీ జరిగేటట్టయితే ఎంతటి విషాదాన్ని కూడా మాటలోనే ఆపవచ్చుకదా తనూ” అని బాబ్ ఓదార్చుతున్నాడు.

***

ఆరోజు సుమేద అలా బాబ్ మీద గూఢచర్యం జరపటానికి వారి గదిలో ప్రవేశించలేదు. సోమవారం రెస్టారెంట్‌కు సెలవు కావడం వల్ల , తన్మయి, బాబ్‌లు ఆ వారం సరుకులు తీసుకుని రావడానికి వెళ్లారు. సుమేదను రమ్మని పిలిచినప్పటికీ సామాన్లు నింపుకొని తిరిగి వచ్చేటప్పుడు కారులో ముగ్గురికి ఇరుకవుతుందని షాపులోనే ఆగిపోయాడు. వాళ్లు రావడానికి ముందే చాయ్ చేసి పెడదామని పాలు తీసుకొని రావడానికి స్టోర్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది.

ఫ్రిడ్జ్ ఎడమ పక్కన తన్మయి చనుబాలుతో చిన్నచిన్న పాకెట్లు చాలా ఉన్నాయి. వారానికి ఒకసారి మాత్రమే ఇన్సులేటెడ్ బ్యాగు తెచ్చి వాటిని తన్మయి ఇంటికి తీసుకొచ్చేది. సుమేదకు ఎందుకో మండిపోయింది. చీకట్లోనే తన భార్య స్తనం నుంచి తన బిడ్డ దేహానికి చేరవలసిన ఈ పాలు ఇలా మరొక మగవాడు పడుకునే గదిలో వెలుతురులో అమ్మకానికి పెట్టిన ఉత్పన్నంలా కనిపించి కలతచెందాడు. బాబ్ కుతూహలానికైనా ఆ ప్యాకెట్లను ముట్టివుండడా, మూత తీసి వాసన చూసి ఉండడా, మంచుగడ్డగా మారిన బాల ఒక చిప్పనైనా తీసి రుచి చూసి ఉండడా అని రకరకాలుగా కల్పించుకొని హైరాణా పడ్డాడు.

గదిలో చెల్లాచెదురుగా పడివున్న వారి సామానులలో తనకు కావలసిన రుజువులు ఏవైనా దొరుకుతాయా అనుకున్నాడు. రూములో ఉన్న ఒకే అల్మారాలో చాలా వస్తువులు ఇరుకిరుకుగా కూర్చున్నాయి. నాలుగైదు జతల ప్యాంట్లు, షర్టులు, పచ్చటి చారల పైజామాలు, ఒకటి రెండు లుంగీలు, గుండ్రటి రంధ్రాల స్లీవ్ లెస్ బనియన్లు, కొన్ని కాగితపు ఉత్తరాలు, ఏదో కాలపు పత్రికా కటింగులు, మగవాడో, ఆడదో చెప్పడానికి సాధ్యంకాని ఒక దేవుడి చిత్రపటం, నాలుగైదు టైలు దొరికాయి. అయితే టైతోపాటు వేసుకుని షర్టులేవీ అక్కడ లేవు. అల్మారా మూలలో గులాబీ రంగు క్యుటికూర కంపెనీ పౌడర్ డబ్బా ఉంది. సుమేద దాని వాసన చూసి మౌనంగా అల్మారా మూశాడు.

మంచం పక్క న ఒక చిన్న అద్దం ఉంది. ఇన్ని రోజులు గదిలోని భాగాన్ని నేను గమనించనే లేదుకదా అని అతనికి ఆశ్చర్యం వేసింది. చిన్న స్టూలు మీద ట్రేలో దువ్వెన, రోజూ ఉపయోగించే పౌడర్ డబ్బా, టూత్ బ్రష్, పేస్ట్, ఏదో మెడికల్ క్రీమ్, బాక్స్‌లో షేవింగ్ సెట్, మంచం కింద రెండు జతల, షూలు, చెప్పులు. ఇక వాళ్లు వచ్చే సమయమైందని బయటికి వస్తూ, అనాలోచితంగా మంచం మీది పక్కను అకస్మాత్తుగా పైకెత్తాను.

అప్పుడే అతనికి ఆ పల్చటి అట్టలు వేసిన పుస్తకాలు కనిపించాయి. ముఖపుట మీద ఏదో భారతీయ భాష లిపి అని అర్థమవుతున్నప్పటికీ, అది ఏ భాషనో సులభంగా స్ఫురించలేదు. వేరువేరు భంగిమలలో సరసాల్లో నిమగ్నమైన స్త్రీ, పురుషుల చిత్రపటాల అట్టలు వాటికి ఉన్నాయి. లిపిని చదవటానికి రాకపోయినప్పటికీ వాటిలో అచ్చయిన రేఖా చిత్రాల వల్ల అవి ఎలాంటి పుస్తకాలో సుమీదకు అర్థమైపోయింది. మడిచిన గుర్తుగా పుటలు అక్కడక్కడ చిరిగిపోయాయి. మాసిపోయిన అక్షరాల్లోనే అవి వీధి పక్కన దొరికే ఏదో కాలపు నాలుగణాల పుస్తకాలని చాటి చెబుతున్నాయి. రాత్రి ఎవరూ లేనప్పుడు వీటిని చదువుతూ చీకట్లో సుఖపడే బాబ్ చిత్రం కళ్ల ముందుకొచ్చినట్లయి సుమేదకు అసహ్యం వేసింది. ఆయన ఈ ముఖాన్ని తన్మయికి పరిచయం చేయాలని వెంటనే నిర్ణయించుకున్నాడు.

కారు నుంచి ఒక్కొక్క కూరగాయల పెట్టెలను లోపలికి తీసుకొని వస్తున్నప్పుడు బాబ్ కౌంటర్‌లో క్యాలిక్యులేటర్ ఒత్తుతూ తల మీద చేయి పెట్టుకొని కూర్చున్న సుమేదను చూసి, “లెక్క సరిగ్గానే ఉందికదా సర్కార్” అని తమాషా చేశాడు. దానికితను ఆహా చాలా తమాషా ముసలివాడని అనుకున్నాడు.

కొని తెచ్చిన సామాన్లను వాటి స్థానాల్లో పెట్టి బాబ్ వంటింటికి, తన్మయి స్టోర్ రూమ్‌కు నడిచారు. తన్మయి పంపింగ్ సెషన్ పూర్తికాని అని సుమేద ఇరవై నిమిషాలు ఎదురు చూశాడు. తర్వాత ఆ పుస్తకాలను చేతిలో పట్టుకొని కదిలాడు.

తన్మయి అప్పుడే పాలప్యాకెట్ల మీద ఆనాటి డేట్, టైమ్ రాస్తోంది. ఆమె ముందు పుస్తకాలను పెట్టి, చూడు ఇలాంటివన్నీ ఆయన చదువుతున్నాడు అని రహస్యంగా చెప్పాడు.

అతని ప్రవర్తనలో గతంలో ఎన్నడూ కనిపించని ఇబ్బందిని తన్మయి గుర్తించింది. ఆమెకు సుమేద మాటల తలాతోకా అర్థం కాలేదు. ఇలాంటి వాటిని ఎవరు చదువుతారు అని కాస్త నిరాసక్తితోనే అడిగింది. సుమేద ఆమె చేతిలో ఆ పుటలను పెడుతూ, “ఆయనే ఆయనే బాబ్, చూడిక్కడ, ఇలాంటి పుస్తకాలు చదువుతున్నాడు. నువ్వు చూస్తే ఆయన్ను బెల్లం వేసుకొని నాకుతున్నావు”

తన్మయి ముఖం హఠాత్తుగా వాడిపోవటం చూసి సుమేదకు సంతృప్తి కలిగింది. మొత్తానికి ఈమెకు సత్యం తెలిసింది కదా అని శాంతించాడు. చూస్తే ఆమె కోపంగా చూస్తూ ఇతన్నే తిట్టడం మొదలుపెట్టింది.

“నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇవి ఎక్కడ దొరికాయి నీకు? అలా ఇతరుల వస్తువులు తీసి చూడకూడదు”

“నేనేమీ కావాలని తీసి చూడలేదు. ఇక్కడే మంచం మీద పడివున్నాయి. చూస్తే సెక్స్ బుక్స్, ఛ, ఈ వయసులో ఆయనకు సిగ్గుగా అనిపించదా? ఇంకా ఏమేమి దాచి పెట్టారో ఎవరికి తెలుసు?”

“ఇలా చేయడం తప్పు సుమేదా. ఆయనేమైనా మనల్ని ముందు కూర్చోబెట్టుకొని చదివి వినిపిస్తున్నారా?”

ఒకసారి బయటికి తొంగిచూసి కొనసాగించింది, “ఏమిటో ఆయన పాటికి ఆయన చదువుకుంటే నీకేమి కష్టమో చెప్పు. మనమే మొదట్లో కుతూహలం కోసం ఎన్నో సార్లు ఫోర్న్ చూడలేదు. ఇలాంటి సాహిత్యాన్ని హాస్టల్లో స్నేహితులతో పంచుకొని చదివిన విషయాన్ని నువ్వే గర్వంగా చెబుతుండేవాడివి కదా. ఇతరులు చేసినప్పుడు మాత్రం క్రైమ్ కదా? ముందు ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టు. ఆయనకు తెలిస్తే ఎంత బాధ పడతారో?”

ఈ విషయంలోని సీరియస్‌నెస్ ఎందుకు తన్మయిని కలచివేయడం లేదో సుమేదకు అర్థం కాలేదు. ఆమెను తట్టడానికి సమర్థమైన వాదనను అతను వెతికేటంతలో, తనూ అని పిలుస్తూ ట్రేలో మూడు కప్పుల చాయ్‌తోపాటు బాబ్ వచ్చాడు. సుమేదకు ఈ విషయాన్ని బాబ్ ముందు బయట పెట్టడం అవసరం లేదు. తన్మయికి తెలిపి ఆ పుస్తకాలను తిరిగి అక్కడే పెట్టాలని అనుకున్నాడు.

ఆ పేజీలను చూడగానే బాబ్ వెలుతురులో నగ్నమైనట్టు పాలిపోయాడు. ఎంతగా అంటే ట్రేను కుర్చీపై పెడుతున్నప్పుడే అతని భుజాలు వంగిపోయాయి. కళ్ళయితే నేలనే చూస్తున్నాయి. సుమేద చేతుల్లోంచి వెంటనే ఆ పుస్తకాలను తీసుకొని, “అవి.. అవి..” అని ఏదో చెప్పబోయి పుస్తకాలను మంచం కింద దూర్చి చిన్న పిల్లవాడిలా, “సారీ, సారీ” అంటూ అక్కడే ఆవులా ఒకట్రెండు సార్లు ముందు వెనకా అడుగులు వేసి, తర్వాత చెప్పులు వేసుకుని తమ ఐదు అడుగుల దేహాన్ని మరింతగా ముడుచుకొని బయటికి నడిచాడు.

ఆయన అటు వెళ్లగానే తన్మయి అరవసాగింది. ఆమె నాలుకమీద ఏ ఏ కాలంలోని ఎలాంటెలాంటి మాటలు వచ్చి పోయాయి. సుమేద కూడా ఊరక ఉండలేదు. తన్మయికి ఏమేమి చెప్పాలని అనుకున్నాడో అన్నిటినీ చెప్పాడు. చివరికొకసారి కోపంతో, “నేనూ బిడ్డను పోగొట్టుకున్నానని నీవు మరిచిపోయినట్టు ఉన్నావు” అని అనకూడని మాటను అనేశాడు.

తన్మయి మండిపడింది.

“అవును చనిపోయిన బిడ్డను కడుపులో పెట్టుకొని పన్నెండు గంటలు నువ్వూ నొప్పులు పడ్డావు కదా?” అని ఆమె కూడా ఇంకొక చెప్పకూడని మాటను అన్నది. ఆ తర్వాత ఉన్న ఒకే కారును ఆమె నడుపుకుంటూ వెళ్లిపోవడం వల్ల, సుమేద ఊబర్ తెప్పించుకొని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

రాత్రి తన్మయి వెనకటి రోజుటి పలావునే వేడి చేసి, తిని, ఇంకోసారి పంపి సెషన్ ముగించి పడుకుంది. మొబైల్లో నిరంతరంగా మెసేజ్ చేస్తోంది. అటువైపు నుంచి కూడా జవాబులు వస్తూనే ఉన్నాయి. ఈ సంభాషణ ఎవరితో అని అతను నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలు గురించి కూడా సరళంగా మాట్లాడగలిగే వాళ్ళిద్దరి దగ్గరితనం చూసి అసూయ కలిగింది.

ఇప్పుడు వదిలేస్తే తమ సంబంధపు దారమొకటి శాశ్వతంగా తెగిపోతుందేమో అనిపించి ఆమె పక్కన దొర్లుతూ తనూ అన్నాడు. అప్పటికే మెసేజ్‌లు రావడం ఆగిపోయాయి. సుమేదకు ఎలా మాటలు కొనసాగించాలో తోచలేదు. ఆమే ఒకసారైనా తనను ముట్టుకోవాలి, పలకరించాలి అని ఆశపడ్డాడు.

గోడ దగ్గరికి జరిగి పడుకున్న ఆమెకు ఇంకా దగ్గరగా జరిగి, “తనూ, సమూ ఈ రోజుకు రెండు నెలల పిల్లవాడయ్యేవాడు కదా?” అన్నాడు, అదొక్కటే తమ సంకటాన్ని కలగలిపే లంకె అనేలా.

“అవును..” అని మొదలుపెట్టిన ఆమె కంఠం దృఢంగా ఉంది. ఇప్పటికే వేలసార్లు తనలో చెప్పుకున్నట్లు, చల్లటి, సాంత్వన స్వరంతో, తన్మయి, “వాడు బతకలేదు, ఎందుకంటే వాడు మన బిడ్డ కాదు. వాడు మన సమూ కానే కాదు” అంది.

కన్నడ మూలం: కావ్య కడమె
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

Exit mobile version