Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తత్త్వమసి

[శ్రీ వెంకట్ మంత్రిప్రగడ గారు రచించిన ‘తత్త్వమసి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

నేను పుట్టిన రోజుకు తేదీ లేదు. నేనక్కడికి ఎలా వచ్చానో, నాకు పేరు పెట్టింది ఎవరో ఎప్పటికీ తెలియని ప్రశ్న.  కానీ ఆకలి మాత్రం నాకు తొలి గుర్తింపు. ఆ ఆకలి కేవలం పొట్టలోనే కాదు – గౌరవం కోసం, ఒక స్థానం కోసం, ఒక మాట వినిపించుకోవాలనే తపనగా నా అంతరంగంలో మండుతూనే ఉండేది. పట్టణం అంచున ఉన్న అనాథాశ్రమంలో పెరిగాను. అక్కడ గోడల పగుళ్లకంటే మనసుల పగుళ్లు ఎక్కువ. దానం తగ్గిపోయింది; ఆశలు కూడా అలాగే కరిగిపోయాయి. ఒక రాత్రి, వర్షం చినుకులు నేలను తాకుతుండగా, నా లోపల ఏదో తెగిపోయింది. ‘ఇక్కడ ఉండటం అంటే నన్నే నన్ను మరిచిపోవడం,’ అనిపించింది. అప్పుడు నేను నడిచాను – ఎక్కడికి అన్నది తెలియకుండా, కానీ ఎక్కడికో చేరాలని మాత్రం తెలిసి. ఆలా మూడు రోజులు నడిచాక ఒక నగరానికి చేరాను.

నగరం మొదట నన్ను ఒప్పుకోలేదు – నన్ను తిప్పికొట్టింది. రోడ్డుపై గడిచిన రాత్రులు నా దేహాన్ని మాత్రమే కాదు, మనసును కూడా గట్టిగా పరీక్షించాయి. చల్లని గాలి ఎముకల వరకు దిగిపోయినప్పుడు, నా ఒంటరితనం మరింత గాఢమైంది. ఎవరూ అడగని జీవితం, ఎవరూ పట్టించుకోని బాధ – అది నా దైనందినం అయ్యింది. చిన్న పనుల కోసం పెద్ద అవమానాలు భరించాల్సి వచ్చింది; ఒక గ్లాసు టీ కోసం కూడా గౌరవాన్ని అమ్ముకోవాల్సిన రోజులు వచ్చాయి. ఇవన్నీ నాకు పూర్తిగా కొత్తవి కావు, కానీ వాటికి అలవాటు పడటం మాత్రం అంత సులభం కాదు. ప్రతి అవమానం నా లోపల ఒక ప్రశ్నగా మిగిలేది -“ఇదేనా నా జీవితం?” అని.

అలాంటి రోజుల్లోనే సత్యమూర్తి గారి ఇంటి గుమ్మం నాకు ఒక ఆశ్రయంలా కనిపించింది. ఆ గుమ్మం దగ్గర నిలబడి “పని ఏదైనా చేస్తాను సార్” అని చెప్పినప్పుడు, నా గొంతులో వణుకు ఉండేది, కానీ కళ్లలో మాత్రం ఒక మౌనమైన వేడుక. ఆయన నన్ను ఒకసారి పూర్తిగా పరిశీలించారు – అది కేవలం ఒక మనిషిని చూసిన చూపు కాదు, నా గతం, నా బాధ, నా ఆశ – అన్నీ కలగలిసిపోయిన చూపు. “పనితో పాటు నువ్వు చదువుకోవాలి.. చేయగలవా?” అని ఆయన అడిగిన ఆ ప్రశ్న నా జీవితాన్ని మలిచే మలుపుగా మారింది. అది కేవలం ఒక ప్రశ్న కాదు; అది ఒక అవకాశం, ఒక నమ్మకం, ఒక పరీక్ష. పని కంటే పెద్ద బాధ్యతను ఆయన నా చేతుల్లో పెట్టారు – నా భవిష్యత్తు.

నేను తల ఊపాను. ఆ చిన్న కదలికలో నా భయాలు, నా ఆకాంక్షలు, నా నిశ్శబ్ద ప్రతిజ్ఞ – అన్నీ ఒక్కచోటుకు చేరి అంతవరకూ నాకు అర్థం కాని విషయాలమీద కొద్దిపాటి అవగాహన కల్పించాయి. ఆ రోజు నుంచి నా జీవితం కేవలం బతుకుదెరువు కోసం పోరాటం కాదు; అది ఒక మార్గం, ఒక గమ్యం కోసం సాగిన ప్రయాణంగా మారింది. సత్యమూర్తి గారి గుమ్మం వద్ద మొదలైన ఆ అడుగు, నాకు ఆశ అనే పదం మళ్లీ అర్థం చెప్పింది.

ఆ ఇంట్లో నేను పని చేసేవాడిని – కానీ ఎవరో ఒకరిగా కాదు, ఏ పనికైనా సిద్ధంగా ఉండే ఒక నీడలా. వంటగదిలో పాత్రలు కడిగాను, గదులు ఊడ్చాను, బట్టలు ఉతికాను. కానీ నా అసలు పని గ్రంథాలయంలో మొదలైంది. ఆ గదిలోని పుస్తకాలు మొదట నాకు భయం కలిగించాయి – అవి నాకు తెలియని ప్రపంచాలు. కానీ మెల్లగా అవే నా మిత్రులు అయ్యాయి. అక్షరాలు నాకు భాష నేర్పాయి; పుస్తకాలు నాకు ఆలోచన నేర్పాయి.

ఒక రోజు, సత్యమూర్తి గారి గదిలో ఉన్న ఒక ఫోటో నా చూపును బంధించింది. ఆ కళ్లలో ఏదో నిశ్శబ్దం ఉంది – అది ఓటమి కాదు, అది అణచివేత కాదు – ఏదో నిలువెత్తు ప్రతిఘటన. ఆ మనిషి నవ్వడం లేదు. నేను ఆ ఫోటో ముందు నిలబడినప్పుడల్లా, నాకు అనిపించేది – ఆయన నన్ను చూస్తున్నాడని, నన్ను పరీక్షిస్తున్నాడని. రాత్రిళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఆయనతో మాట్లాడేవాడిని. “నేను ఎక్కడికి వెళ్తున్నాను?” అని అడిగేవాడిని. సమాధానం రాకపోయినా, ఆయన కళ్లలో ఒక దిశ కనిపించేది.

పాఠశాలలో ఒక రోజు, గోడపై వేలాడుతున్న ఆ ఫోటోలోని వ్యక్తి గురించి మా గురువు చెప్పడం మొదలుపెట్టారు – అతనే అంబేద్కర్. ఆ పేరు అప్పటివరకు నాకు ఒక సాధారణ పేరు మాత్రమే. కానీ ఆ రోజు తర్వాత అది నా లోపల నినాదంలా మారిపోయింది. ప్రతి అక్షరం నా గుండెల్లో కొట్టుకునే ధైర్యంలా వినిపించింది.

ఆయన జీవిత కథను చదవడం మొదలుపెట్టాను. ప్రతి పేజీ ఒక గాయం లాంటిది, కానీ అదే సమయంలో ఒక మార్గదర్శకం కూడా. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న అవమానాలు – నీళ్ళు తాగడానికి కూడా హక్కు లేని రోజులు, పాఠశాలలో ఒంటరిగా కూర్చోబెట్టిన క్షణాలు – ఇవన్నీ చదివినప్పుడు నాకు బాధ మాత్రమే రాలేదు. ఆశ్చర్యంగా, ఆ బాధ కన్నా ఎక్కువగా నాకు ఒక బాధ్యత అనిపించింది. “ఇంత అవమానాన్ని భరించిన మనిషి, తన జీవితం మాత్రమే కాదు, లక్షల మందికి దారి చూపగలిగితే.. నేను నా జీవితాన్ని ఎందుకు మార్చుకోలేను?” అనే ప్రశ్న నాలో మెల్లగా పెరిగింది.

ఆయన పోరాటం కేవలం తనకోసం కాదు – అది సమానత్వం కోసం, గౌరవం కోసం, మనిషి అనే విలువ కోసం. ఆ పోరాటం నా లోపల ఒక అగ్నిలా వెలిగింది. ఇక చదువు నాకు ఒక బాధ్యత అయింది, ఒక ఆయుధం అయింది. నా పరిస్థితిని తిట్టుకోవడం కాదు, దాన్ని మార్చుకోవాలని ఒక నిశ్చయం నాలో పుట్టింది. ఆ రోజు నుంచి, అంబేద్కర్ గారి పేరు నాకు ఒక చరిత్ర కాదు – అది నా దారి, నా ధైర్యం, నా స్వరం అయింది.

ఒక ప్రశ్న మాత్రం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది – ఈ రోజుల్లో ఆయన ఆలోచనలు ఎలా జీవించాలి? పుస్తకాలలో చదవడం సులభం; కానీ జీవితం అనే పరీక్షలో వాటిని నిలబెట్టడం అంత సులభం కాదు. నేను ప్రయత్నించాను. ప్రతి చిన్న ప్రయత్నంలో ఒక సంఘర్షణ, ఒక గందరగోళం. నిజం కోసం నిలబడాలా? లేక ప్రశాంతంగా ఉండి దూరంగా నడవాలా? ఈ రెండు మధ్య నేను ఎన్నోసార్లు చిక్కుకుపోయాను.

ఒకసారి పాఠశాలలో, ఒక పిల్లవాడిని అతని నేపథ్యం వల్ల ఎగతాళి చేస్తూ ఉన్నారు. అందరూ నవ్వుతున్నారు. నేను కూడా కాసేపు మౌనంగా చూసాను. కానీ లోపల ఏదో కదిలింది. అలా నిలబడి ఉండటం అంటే నేనూ ఆ అన్యాయంలో భాగమవుతున్నట్టే అనిపించింది. ఒక్కసారిగా ముందుకు వచ్చి, “ఇది తప్పు” అని చెప్పాను. నా మాటల కంటే, నా ధైర్యమే అందరికీ అసౌకర్యంగా అనిపించింది. ఆ నవ్వులు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి.. కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలవలేదు. తర్వాత అది నా మీదికి తిరిగొచ్చింది.

ఆ రోజు నాకు శిక్ష పడింది – తప్పు చేసినవాడిలా నిలబెట్టారు. చేతిలో దెబ్బలు పడినంతగా కాదు, గుండెల్లో పడిన దెబ్బలు ఎక్కువగా నొప్పించాయి. “నిజం కోసం నిలబడితే ఇదే ఫలితమా?” అనే సందేహం నా మనసును కొరుక్కుంటూ ఉండిపోయింది.

ఆ రాత్రి, అలసిపోయిన ఆలోచనలతో, మళ్లీ ఆ ఫోటో ముందు నిలబడ్డాను – అంబేద్కర్ గారి కళ్లలోకి నిశ్శబ్దంగా చూస్తూ. “నేను చేసినది సరైనదేనా?” అని మెల్లగా అడిగాను. గదిలో ఎలాంటి సమాధానం వినిపించలేదు. గాలి కూడా కదల్లేదు. కానీ నా లోపల ఎక్కడో, చాలా నిశ్శబ్దంగా, ఒక స్వరం వినిపించింది – “నువ్వు  ఓడిపోలేదు, నేర్చుకుంటున్నావ్… నిలబడటం నేర్చుకుంటున్నావు.”

ఆ మాట నా లోపల ఓదార్పుగా కాకుండా, ఓ బాధ్యతగా మిగిలింది. అప్పుడే నాకు అర్థమైంది – ఆయన ఆలోచనలు అనుసరించడం అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం కాదు; చిన్న చిన్న అన్యాయాల ముందు నిలబడే ధైర్యాన్ని ప్రతిరోజూ సాధన చేయడం. ప్రతి సంఘర్షణలో నేను కొంచెం కొంచెంగా మారుతున్నాను.. ఓడిపోతూ కాదు, ఎదుగుతూ.

అనన్య నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం. ఆమె నన్ను ఎప్పుడూ పనివాడిగా చూడలేదు. “చిన్నా,” అని పిలిచేది. ఒక తమ్ముడిలా చూసుకునేది. నేను చదువులో కష్టపడుతున్నప్పుడు, ఆమె పక్కనే కూర్చుని సహాయం చేసేది. ఒకసారి నేను ఫీజులు ఎలా చెల్లించాలో ఆలోచిస్తూ మౌనంగా ఉండగా, ఆమె నవ్వుతూ, “నువ్వు చదువు, మిగతావన్నీ మనం చూస్తాం,” అంది. ఆమె మాటల్లో ఆత్మీయత ఉంది – అది రక్త సంబంధం కాదు, కానీ అంతకంటే బలమైనది. ఆమె విదేశాలకు వెళ్లే రోజు, నేను మాటలేకుండా నిలబడ్డాను. “నువ్వు కూడా ఒకరోజు పెద్దవాడవుతావు,” అని చెప్పి వెళ్లిపోయింది.

సంవత్సరాలు గడిచాయి. నేను న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, గోల్డ్ మెడల్ పొందాను. ఆ రోజు కూడా, నేను ఆ ఫోటో ముందు నిలబడ్డాను. “ఇది గెలుపా?” అని అడిగాను. నా లోపల మరోసారి అదే నిశ్శబ్దం “ఇది ప్రారంభం మాత్రమే. గొప్ప బాధ్యత”

అనన్య తిరిగి వచ్చిన రోజు, ఆ ఇంట్లో ఒక కొత్త వెలుగు వచ్చింది. ఆమె మరింత ధైర్యంగా, మరింత లోతుగా మారింది. మేమిద్దరం సత్యమూర్తి గారి ముందు నిలబడ్డాము. ఆయన మమ్మల్ని శిక్షణార్థులుగా తీసుకున్నారు. కోర్టులో మేమిద్దరం మా ప్రతిభ చూపించాము – ఆమె మాటల్లో స్పష్టత, నా వాదనల్లో లోతు.

ఒక రోజు ఆయన నన్ను కోర్టుకు పంపారు. లాయర్ గారి ఆరోగ్యం బాగాలేనందున ఆ రోజు లిస్ట్ అయిన కేసులో వాయిదా కావాలి. జడ్జి గారి కోపం నా మీద పడింది. నేను మౌనంగా వినిపించుకున్నాను. ఆ రోజు నాకు ఒక గాఢమైన అనుభవం – అవమానం కూడా ఒక శిక్షణ. అదే రోజు, రెండు కేసుల్లో నేను ఇచ్చిన చిన్న సూచనలు, నన్ను నేను నమ్మేలా చేశాయి. ఆ రాత్రి, నేను మళ్లీ ఆ ఫోటో ముందు నిలబడ్డాను. “ఇది మార్గమా?” అని అడిగాను. నా లోపల ఒక ప్రశాంతత “నీ మార్గం నువ్వే నిర్మించాలి.”

మరోసారి అనన్య కోర్టుకు వెళ్లిన రోజు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. చిన్న కోర్ట్‌హాల్‌ – కానీ ఆ రోజు అది ఒక పెద్ద వేదికలా అనిపించింది. ఆమె వాదన మొదలైనప్పుడే అక్కడి గాలి మారిపోయింది. ఆమె మాటల్లో ఒక ధైర్యం ఉంది, కానీ అదే సమయంలో ఒక మృదుత్వం కూడా ఉంది. పేదల గురించి మాట్లాడినప్పుడు అది కేవలం చట్టపరమైన పాయింట్‌లా కాదు – అది ఒక మనిషి హృదయం నుంచి వచ్చిన కరుణలా వినిపించింది. ఆమె ప్రతి వాక్యం వెనుక ఒక బాధను అర్థం చేసుకున్న లోతు, ఒక న్యాయం మీద ఉన్న నమ్మకం కనిపించాయి. ఆమె వాదన ముగిసేసరికి, అక్కడ ఉన్నవాళ్లు కాసేపు మౌనంగా ఉన్నారు – అది ప్రశంసల కంటే గొప్పది.

ఆమెను చూస్తూ నాకు తెలియకుండానే ఒక గర్వం కలిగింది. అది కేవలం ఆమె ప్రతిభ మీద గర్వం కాదు – ఆమె ప్రయాణం మీద, ఆమె మార్పు మీద, మనిద్దరం కలిసి నడిచిన దారిపై ఉన్న గర్వం. ఒకప్పుడు అనుమానాలతో, భయాలతో ఉన్న ఆ అమ్మాయి.. ఇప్పుడు న్యాయం కోసం నిలబడే ఒక స్వరం అయింది. ఆ మార్పులో నేను కూడా ఒక చిన్న భాగమయ్యాననే భావన నాకు అంతర్లీనంగా తాకింది.

కోర్టు బయటకు వచ్చాక, ఆమె నా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో అలసట ఉంది, కానీ అదే సమయంలో ఒక తృప్తి కూడా ఉంది. “నువ్వు నిజంగా గొప్పవాడవుతావు,” అని ఆమె మెల్లగా చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నేను కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాను. నాకు తెలిసి, నేను ఇంకా మార్గం మధ్యలోనే ఉన్నాను. నేను నవ్వాను – అది వినమ్రతతో కూడిన నవ్వు. “మనిద్దరం కలిసి ఉంటేనే,” అన్నాను.

ఆ మాట కేవలం ఒక స్పందన కాదు; అది ఒక నమ్మకం. ఒక్కొక్కరుగా ఎదగడం కాదు – ఒకరికొకరం అద్దంలా మారుతూ, ఒకరికొకరం బలం అవుతూ ముందుకు సాగుతున్నాం. ఆమె న్యాయం కోసం నిలబడితే, నేను ఆమె వెనుక ఉన్న ఆలోచనగా ఉండాలని అనిపించింది. ఆ రోజు నాకు ఒక విషయం స్పష్టంగా తెలిసింది – గొప్పతనం అనేది ఒంటరిగా చేరుకునే గమ్యం కాదు; అది పంచుకున్న ప్రయాణంలో పుట్టే వెలుగు.

సత్యమూర్తి గారు ఒక రోజు నన్ను పిలిచారు. “ఇద్దరూ సమానంగా ఉన్నారు. కానీ ఒకరినే ముందుకు తీసుకెళ్లాలి,” అన్నారు. నేను మౌనంగా విన్నాను. నా చూపు మళ్లీ ఆ ఫోటో మీద పడింది. ఫోటో లోని అంబేడ్కర్ గారు నా ఆలోచనలతో ఏకీభవిస్తున్నట్లనిపించింది.

“సార్,” అన్నాను, “నేను ఇప్పుడే మొదలయ్యాను. అనన్య మీ కుటుంబం జెనరేషన్స్‌గా పోగు చేసిన ప్రతిభ, మేధస్సు ఆ పైన అపరిమితమైన ఆదరణ పుణికి పుచ్చుకుంది. తాను ఈ సంస్థను మీరు ఎక్కడ వదులుతున్నారో అక్కడ నుంచి ప్రారంభం చెయ్యగలుగుతుంది. నేను మొదటి తరం చదువుకున్నవాడిని. నేను సంస్థను ముందు నా స్థాయికి లాగి అప్పుడు మళ్ళీ నిర్మించాలి” అన్నాను.

“అనన్యే ఈ స్థానం పొందాలి. ఆమె మీ స్థాయిని కొనసాగించగలదు. నేను తనతో పనిచేస్తాను” అని ముగించాను.

ఆ రాత్రి, నేను ఆ ఫోటో ముందు నిలబడ్డాను. ఎన్నేళ్లుగా నన్ను వెంటాడిన ప్రశ్నకు చివరకు సమాధానం దొరికింది. ఆ మనిషి నవ్వకపోవడానికి కారణం బాధ కాదు. అది ఒక మౌన ప్రతిజ్ఞ. సమాజం కోసం, న్యాయం కోసం, తనని తాను అర్పించుకున్న మనసు.

అప్పుడు నాకు అర్థమైంది – ఆ ఫోటోలో ఉన్న డా. అంబేద్కర్ గారి ముఖంలో కనిపించిన ఆ నిగూఢ భావం ఎందుకని.

Exit mobile version