[బాలబాలికల కోసం ‘తెలివితేటలు’ అనే కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]
పిల్లలూ, మీరు అనేక జంతువుల కథలు చదివి వుంటారు. జంతువుల గురించి కొంచెం నేర్చుకుని వుంటారు. అడవికి రాజెవరో మీకు తెలుసు కదా. సింహం. మరి జంతువులన్నింటిలోనూ ఎక్కువ తెలివితేటలు కల జంతువుగా దేని గురించి చెప్పుకుంటాం. నక్క. కదా. ఈ నక్కల తెలివితేటల గురించి కూడా అనేక కథలు చదివారు కదా. ఇప్పుడు ఇంకో కథ చదవండి మరి..
అనగా అనగా ఒక అడవి. అడవికి రాజు మృగేంద్రుడు (సింహం). ఆ రాజుగారి మంత్రి చాలా వృధ్ధుడవటంతో ఆయనకు బదులుగా ఆరోజు తన మంత్రిగా ఎవరినైనా ఎన్నుకోవాలని అనుకున్నాడు మృగేంద్రుడు. అందుకనే జంతువులనన్నింటినీ తన గుహకి రమ్మని కబురు పెట్టాడు. రాజుగారి మాటకి ఎదురేముంది. అన్ని జంతువులూ వచ్చాయి.
సింహాలు ఎక్కడ వుంటాయి. అడవిలో గుహల్లో వుంటాయి కదా. గుహలోకి సరిగా గాలి, వెలుతురు రాకపోవటంతో అంతా చీకటిగా, చెడు వాసన వస్తూ వుంటుంది. మనుషులకి మల్లే జంతువులకి ఇళ్ళు శుభ్రం చేసుకోవటం తెలియదు కదా. సింహం గుహ ఎప్పటిలాగా సింహం తిన్న జంతువుల ఎముకలతో చిందరవందరగా వుండి చెడ్డ వాసన వస్తున్నది.
జంతువులు అన్నీ గుహలలో వుండవు కదా. కొన్ని అలా స్వేచ్ఛ గా బయటే తిరుగుతూ వుంటాయి. జిరాఫీ, ఏనుగు అలాంటివే. అవి కూడా రాజుగారి ఆహ్వానంతో రాజుగారి గుహకు వచ్చాయి. వాటిలో ముందుగా వచ్చిన జిరాఫీ ఆ గుహ, దానిలో చెడ్డ వాసన వస్తూ ఎక్కడబడితే అక్కడే వున్న ఎముకలు అన్నీ చూసేసరికి దానికి కడుపులో తిప్పి “అబ్బో చాలా చెడ్డ వాసన” అన్నది. అది విని సింహానికి కోపం వచ్చింది. జిరాఫీ రాజైన తనని అవమానించింది అనుకున్నది. వెంటనే పక్కనే వున్న ఏనుగుని అడిగింది “ఏంటి? నా గుహ అంత చెడ్డ వాసన వస్తోందా?” అని.
అడిగింది రాజుగారు. ఏం చెప్తే ఏమనుకుంటారో ఆని భయపడింది ఏనుగు. “లేదు లేదు రాజా, చుట్టుపక్కలనుంచి వచ్చే పూల పరిమళమంతా ఇక్కడే వుంది. చక్కని సువాసన వస్తోంది” అన్నది. సింహానికి ఆ మాటలూ నచ్చలేదు. ఏనుగు అబధ్ధం చెప్తోందని తెలుసుకువి దాని వంక గుర్రుగా చూసింది.
పక్కనే నక్క అతి వినయంగా నుంచున్నది. దాని వైపు తిరిగి సింహం “నక్క బావా, వాళ్ళవి పెద్ద శరీరాలు కనుక పెద్ద పెద్ద ముక్కులుంటాయి. అందుకే అన్ని రకాల వాసనలు వస్తాయి. నీ ముక్కు అంత పెద్దది కాదుగా, నువ్వు సరిగ్గా చెప్పు” అన్నది.
నక్కకి తను ప్రమాదంలో పడ్డదని తెలిసి పోయింది. అవును అంటే రాజుకు కోపం వస్తుంది, నిజానికి ఆ గుహలో వుండటం చాలా కష్టంగా వుంది. కానీ రాజుకి కోపం తెప్పిస్తే తను బతకటం కష్టం. అందుకే ఒక్క క్షణం ఆలోచించి, ముక్కులు ఎగబీల్చి, “రాజా, మీరడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వాలనే వుంది నాకు. కానీ ఏం చెయ్యను? రెండు రోజులనుంచి నాకు విపరీతమైన జలుబు చేసింది. నా ముక్కుకసలు ఏ వాసనా తెలియటంలేదు, మీరెంతో నమ్మకంతో నన్నడిగినప్పుడు నేను మీకు సహాయ పడలేక పోతున్నాను, అసమర్థుణ్ణి, క్షమించండి.” అని చాలా నమ్మకంగా మాట్లాడింది.
రాజు అన్ని సంగతులూ తెలుసుకుంటూ వుంటాడు కదా. జిరాఫీ, ఏనుగు మాటలకి కోపం వచ్చినా, నక్క తెలివితేటలకి సంతోషించింది. ఇలాంటి తెలివితేటలు, సమయస్ఫూర్తి కలవాళ్ళే మంత్రిగా వుండటానికి అర్హులని నక్కని తన మంత్రిగా చేసుకుంది.
ఈ కథతో ఏం తెలుసుకున్నారు బాలలూ, మనకి ఖచ్చితంగా విషయం తెలిసినా, అది ప్రమాదకరమైనది కానప్పుడు, ఎదుటివాళ్ళకి బాధ కలిగించేది అయితే మనం అసలు విషయం పైకి చెప్పకపోవటం మంచిది. అంతేకాదు. మనం ఇబ్బందుల్లో వున్నప్పుడు తెలివితేటలు ఉపయోగించి తప్పించుకోవాలి.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
