Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు, ఆంగ్ల సాహిత్య కుసుమాలు జీవన సౌరభాలు

[అనుకృతి గారి ‘తెలుగు, ఆంగ్ల సాహిత్య కుసుమాలు జీవన సౌరభాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

సాహిత్య పఠనం, అది మాతృభాషే కానవసరం లేదు, ఏదైనా మన జీవితాలని ప్రభావితం చేస్తుంది. సాహిత్యాభిలాష జీవితానికి పరిపూర్ణత చేకూరుస్తుంది. ఒక గమ్యాన్నీ నిర్దేశిస్తుంది. ఒక్కటే జీవితం, ఈ ఒక్క జీవితాన్నిసుసంపన్నం చేసుకోవటానికి సాహిత్య పఠనం ఒక్కటే పరిష్కారం. కేవలం అనుభవాలే అన్నీ నేర్పవు. మాతృభాషలో అక్షర రాస్యులై ఉంటే చాలు. జీవితం లోఎన్నో సమస్యలకు దారి చూపిస్తుంది.

కొన్ని తెలుగు సినీ గేయాలలోని సాహిత్య౦, ఆంగ్ల సాహిత్యం లోని కొన్ని కవితా పంక్తులు ఒకే భావాన్ని కలిగి ఎంతో భావస్ఫోరకంగా ఉంటాయి. ఈ రచనలన్నీ పరస్పర ప్రభావితాలు కావు, అనుసరణలూ కావు.. ఒక్కొక్క సినీ గేయాల భావుకత, ఆంగ్ల కవితా పంక్తుల లోని భావ సారూప్యత చూస్తే, ఆశ్చర్యం కలుగక మానదు. ఆ దిశగా నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ రచన.

మొదటిగా కృష్ణశాస్రి గారి గేయాన్ని తీసుకొందాం.

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ గేయం లోని భావుకత, ప్రకృతిలో మమేకమై జీవించాలన్నతపన, ప్రకృతి ఆరాధన కనిపిస్తుంది. అందమైన ప్రకృతి పట్ల ఆకర్షణ అటువంటిది. కానీ అలా జీవించట౦ సామాన్యుడికి సాధ్యమవుతుందా?

సాధ్యం కాదంటాడు Robert Frost ‘Stopping by woods on a snowy evening’ అనే కవితలో.

“The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep”

రెండు కవితలలో ప్రకృతిలో మమేకమై జీవించాలన్న తపన, ప్రకృతి పట్ల ఆరాధన కనిపిస్తుంది రెండు కవితల లోని భావ సారూప్యత ఇదే.

(ఈ నాలుగు పంక్తులు నెహ్రూ గారి టేబుల్ మీద వుండేట. ఆ నాలుగు పంక్తులు తనను కార్యోన్ముఖుడిని చేసేవని ఆయన చెప్పేవారు). కృష్ణశాస్రి గారి భావన ఎంతో అందమైనది, మృదువైనది కూడా. పచ్చని చెట్లూ, సౌగంధిక పుష్పాలు, సెలయేళ్ళు అంటూ ఒక అద్భుతమైన దృశ్య చిత్రాన్ని తెలుగులో కవి ఆవిష్కరిస్తే, బాధ్యతలు మనిషిని ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ “ఇచటనే నిలిచిపోనా” అని ఆశించటానికి ఆస్కారం ఉండదని చెబుతాడు Robert Frost.

జీవితం పట్ల ఆశావహ దృక్పథం అలవర్చుకోవాలని, దానికై ప్రకృతిని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రకృతి మనకు ఎన్నో జీవిత పాఠాన్ని నేర్పుతుందని ప్రభోదించే తెలుగు సినీ గేయాలు, ఇంగ్లీష్ కవితలు అనేకం వున్నాయి. ఈ రోజుల్లో రకరకాల మానసిక రుగ్మతలకు, డిప్రెషన్స్‌కు గురౌతూ జీవితాలను అంతం చేసుకుంటున్నారు.

“కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా..
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగీ సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదూ
శోధించి సాదించాలి అదియే ధీరగుణం”

చిత్ర నేపథ్యం ఏదైనా, సందేశం ఒక్కటే. అపజయాలు, నష్టాలు, కష్టాలు మానవ జీవితంలో సర్వ సాధారణం. వున్నది ఒక్కటే జీవితం, నిరాశ నిసృహలతో అంతం చేసుకోవద్దని సందేశం.

(చిత్రం: వెలుగు నీడలు, రచన: శ్రీశ్రీ: గాత్ర౦, ఘంటసాల, సంగీతం: పెండ్యాల)

ఈ సందర్బంగా Lord Tennyson poem ‘Ulysses’ లోని ఆఖరి వాక్యాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. Ulysses కొడుకు Telemachus కి రాజ్య భారాన్ని అప్పగిస్తూ తన జీవితమంతా ఒక నిరంతర అన్వేషణ అనీ, తనకు ఇదివరకు ఉన్నంత శారీరక శక్తి లేకపోయినా, కొత్త కొత్త విషయాలను, జ్ఞానాన్ని పొందాలన్న తపనతో, ఆత్మ బలంతో ముందుకు సాగుతున్నానని అంటాడు.

నిజానికి Ulysses కి అతని అనునాయులకు యవ్వనంలో ఉన్నంత శారీరక శక్తి లేకపోయినా, దిగంతాలలో తమ అన్వేషణ ఆగదని, నిరంతర కృషితో ముందుకు వెళ్ళటమే ధ్యేయమని చెబుతాడు. Ulysses ఆలోచనలు అన్నీ ఒక యోధుడికి సంబందించినవి. ఈ వాక్యాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. జ్ఞాన తృష్ణకి అంతం లేదు, అది నిరంతరం సాగుతూనే ఉండాలి. కాలం, వయసుతో పని లేదు. ఆత్మ నిర్భరతతో ముందుకు సాగటమే ధేయంగా పెట్టుకోవాలి. అంతే తప్ప పరిస్థిలకు లొంగిపోరాదని ఈ వాక్యాలు ఉద్భోదించుతాయి.

“To strive, to seek, to find, and not to yield.” అంటాడు. Ulysses నేపథ్యం వేరు కానీ నిరాశ నిసృహలు దరి చేరకుండా, జీవన పోరాటాన్ని కొనసాగించమని, ప్రతికూల పరిస్థితులకు లొంగి పోవద్దని సందేశం.

Ode to the West Wind

John Keats 19th century రొమాంటిక్ పోయెట్ ‘Ode to the west wind’ అనే పోయెమ్‌లో వెస్ట్ విండ్‌ని అత్యంత శక్తివంతమైన ప్రకృతి శక్తిగా వర్ణిస్తాడు. వెస్ట్ విండ్ శిశిర ఋతువులో ప్రచండ శక్తిగా మారి పండుటాకులని, ఎండిన విత్తనాలని భూమి అంతా విస్తారంగా వెదజల్లుతుంది. మళ్ళీ (వసంత ఋతువు వచ్చేసరికి ప్రకృతి అంతా సౌందర్య భరితంగా మార్చేస్తుంది). ‘వెస్ట్ విండ్’ని ఒక వినాశకారిగా, (destroyer) వసంత ఋతువు వచ్చేసరికి పునర్జీవన౦ (preserver of life) గా వర్ణిస్తాడు.

శిశిరంలో ప్రకృతి

శీతాకాలంలో ప్రకృతి

వసంత ఋతువు లో ప్రకృతి

The trumpet of a prophecy! O Wind,

If Winter comes, can Spring be far behind?

‘Ode to the west wind’ లో కవి John Keats ఒక ఆశావహ దృక్పథంతో ముగిస్తాడు. శీతాకాలంలో ప్రకృతి తన స్వరూపాన్ని కోల్పోతుంది. ఆకురాలే కాలం, ఆ తర్వాత వచ్చే చలికాలం Europe దేశాల్లో తీవ్ర ప్రభావ౦ చూపిస్తుంది. శీతాకాలం తరవాత వసంతకాలం తప్పకుండా వస్తుంది. జీవన సత్యం కూడా ఇదే. అపజయాలు, కస్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు. కస్టాలు ఎప్పుడూ వుండవు, రుతువులు మారినట్టే మనిషి జీవితంలో కష్ట సుఖాలు సహజం.

ఇదే భావాన్ని ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రం లోని ‘మౌనంగానే ఎదగమని’ పాటలో కవి చంద్రబోస్ వ్యక్తీకరిస్తాడు. జీవన ప్రయాణo లోని అపజయాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతాడు.

“మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ”

‘Heard melodies are sweet, but those unheard are sweeter’.

John Keats ‘Ode on a Grecian urn’ లో ‘Heard melodies are sweet, but those unheard are sweeter’ – వినిపించే రాగాల కంటే వినిపించని రాగాలే అత్యంత మధురమైనవని అంటాడు. ఒక ప్రాచీన పాత్ర మీద వాయిస్తున్న bag piper వినిపిస్తున్న వినిపించని రాగం గురించి వర్ణిస్తాడు. కవి ఊహకు అంత మేముంది?

దాశరధి మరో అడుగు ముందుకేసి ఇలా వర్ణించారు.

వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

[చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963), సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, గీతరచయిత: దాశరధి నేపధ్య గానం: సుశీల]

వినిపించని రాగాలు, కనిపించని అందాలే అంటాడు. వినిపించనివీ, కనిపించనవీ లోని మాధుర్యం మనకు ఎలాగ అవగతమౌతుంది? ప్రేమ భావ తో నిండిన ఒక ప్రేమైక హృదయం ఆలపిస్తున్న గీతిక ఇది. వినిపించని రాగాలు, కనిపించని అందాలు అలలై మదిని కలవర పరుస్తుంటే, కలలో ఎవరో పిలిచినట్టు ఆ ప్రేమిక మధుర భావ తరంగాలని ఆలపిస్తున్నది. మోహపరవశురాలైన ఆ ప్రేమిక అద్భుతమైన ప్రేమ భావన, సుందర భావన.

To love is nothing
To be loved is something but To love, and to be loved, that’s everything
(Hemes Tollis)

పై మూడు వాక్యాల అర్థం తెలిస్తే, దేశంలో అమ్మాయిల పై జరుగుతున్న అమానుష హత్యలు జరగవు. ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమించలేదని ఎంతో మంది అమ్మాయిలని అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. ప్రేమించబడటం ఒక అదృష్టమే, కానీ అవతలి వాళ్ళ ఇష్టం కూడా చూడాలి కదా! అంతేకానీ ప్రేమించలేదు కాబట్టి, అతని ప్రేమని ఆమె అంగీకరించలేదు కాబట్టి ఇంక ఆమెకు జీవించే హక్కు లేదని భావించటం ఏం న్యాయ౦? ప్రేమించటం, ప్రేమించబడటం ఒక అదృష్టం, అది అందరికీ లభించదు.

ఇదే భావాన్ని ‘మురళీకృష్ణ’ చిత్రంలో ఈ పాట ద్వారా వ్యక్తం అవుతుంది. ‘మనసు కవి’ ఆత్రేయ రాసిన ఈ గీతం ఒక్కటి చాలు, నిజమైన ప్రేమ గురించి అవగాహన కలగటానికి.

ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే రుజువు కదా!

[చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు, సాహిత్యం: ఆత్రేయ, గానం: ఘంటసాల]

నిజమైన ప్రేమ ఒకే ఒక్కసారి కలుగుతుందన్న వాదం ఈ కాలానికి అన్వయించటం సరికాదు. ఒకసారి విఫలమైతే, సంయమనం కోల్పోకూడదు. జీవితం జీవించటానికి, అర్ధాంతరంగా ముగించటానికి కాదు. నిజమైన ప్రేమకు తార్కాణము ఏమిటి, కవి అన్నట్టు మనసిచ్చినదే నిజమైతే, మన్నించటమే రుజువంటాడు కవి, అంత గొప్ప సందేశమిది!

Exit mobile version