Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగుజాతికి ‘భూషణాలు’-14

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

నర్తకీమణి యామినీ కృష్ణమూర్తి (20 డిసెంబరు 1940):

యామినీ కృష్ణమూర్తి సుప్రసిద్ధ భారతీయ నర్తకి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. దేశవిదేశాలలో కూచివూడి నాట్య ప్రదర్శనలిచ్చి ఖ్యాతి గడించారు. ఈమెలో ప్రత్యేకత- కర్ణాటక సంగీతం కూడా నేర్చుకొని నిత్యం చేస్తూ స్వయంగా పాట పాడేవారు. 2016లో పద్మ విభూషణ్ అందుకున్న ఈమె 1940లో ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించారు. ఢిల్లీలో స్థిరపడ్డారు.

తండ్రి కృష్ణమూర్తి గొప్ప సంస్కృత పండితులు. ఆ కుటుంబం మదనపల్లి నుండి తమిళనాడులోని చిదంబరం వెళ్లి స్థిరపడింది. 17 వ ఏట 1957లో యామిని భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించుకొని తొలి నృత్యప్రదర్శన చెన్నైలో ఇచ్చి ప్రశంసలందుకున్నారు. ఈమె పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం. 5వ ఏటనే తండ్రి ప్రోత్సాహంతో మదరాసులో రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో చేరి నాట్య శాస్త్రాభ్యాసం ఆరంభించారు.

ఈమె గురు పరంపర విశిష్టమైంది – కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూరు కిట్టప్ప, దండాయుధ పాణి, మైలాపూర్ గౌరీ అమ్మ- వీరి గురువులు. కూచిపూడి గురువులు వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, బాలకృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాలశర్మ ప్రభృతులు. ఒడిస్సీ నృత్యాన్ని పంకజచరణ్ దాస్, కేలూ చరణ్ మహాపాత్రల వద్ద అభ్యసించారు.

నాట్యరీతులు:

20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రతిభావంతురాలుగా గుర్తింపు పొంది కార్యరంగాన్ని ఢిల్లీకి మార్చారు. వివిధ నృత్యరీతులను కలగాపులగం చేయకుండా ఆయా నృత్య విధానాలకే ప్రాధాన్యం యిచ్చి ప్రదర్శన లిచ్చారు. అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూరు, బర్మా – ఇలా పలు విదేశీ నగరాలలో ప్రదర్శనలిచ్చారు. రెండో తరాన్ని తీర్చిదిద్దడానికిగా ఢిల్లీలో – నృత్య కౌస్తుభ కల్చరల్ సొసైటీ నెలకొల్పారు. డాన్స్ నేర్పించడానికి యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ మొదలెట్టి – భరతనాట్యం, కూచిపూడి బాణీలలో ఎందరినో తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈమెను ఆస్థాన నర్తకిగా నియమించారు. సిద్ధేంద్ర కళాక్షేత్ర ప్రిన్సిపాల్‍గా చింతా కృష్ణమూర్తి నుండగా క్షీరసాగర మథన దృశ్యరూపకాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆకాశవాణి కోసం వ్రాశారు. దాని రంగస్థల ప్రదర్శనలో యామిని ‘విశ్వమోహిని’గా అద్భుత ప్రదర్శన నిచ్చారు. అప్పటినుండి ఆమెను ‘విశ్వమోహిని’గా పిలుస్తున్నారు. తొలిసారిగా ఈ రూపకం రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు ప్రదర్శించి మెప్పు పొందారు. ‘భామావేణి’ బిరుద ప్రదానం చేశారు.

1975లో హైదరాబాదులో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభంలో యామినీ కృష్ణమూర్తి చేసిన ‘రారా స్వామి రారా’ ప్రదర్శన అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ ప్రశంసలందుకొంది. భామాకలాపంలో సత్యభామగా ఆమె ప్రదర్శన అద్భుతం. కృష్ణదేవరాయల సాహిత్య ప్రశస్తిని వ్యక్తపరచే మండూక శబ్దం ఆమె ప్రత్యేకత. కృష్ణ శబ్దాన్ని ఆమె ప్రదర్శిస్తే అందులో భావ తీవ్రత, సుకుమార లాలిత్యంతో కూడిన వైవిధ్యము ప్రేక్షకులను ఆకట్టుకొనేవి. ఈమె పాండితీ వైశిష్ట్యానికి నిదర్శనం వేదాలకు కొన్ని వినూత్న జతులలో కూర్చిన నృత్యం.

భారత ప్రభుత్వం 1968లో పద్మ శ్రీ, 2015లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ లతో సత్కరించిది. మహిళా దినోత్సవం నాడు 2014లో శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ వారు ఈమెను నాట్యశాస్త్రగురు బిరుదుతో సన్మానించారు. ఈమె నృత్య శాస్త్ర విశేషాలను – A FASHION OF DANCE అనే గ్రంథం ద్వారా వ్యక్తపరచారు. ఆ గ్రంథానికి సహరచయిత రేణుకా ఖాండేకర్.

దూరదర్శన్ వారు ఈమె రూపొందించిన 13 భాగాల సీరియల్ – నృత్యమూర్తిని ధారావాహికంగా ప్రసారం చేశారు. జనసామాన్యానికి భరతనాట్యం గూర్చి అవగాహన కల్పించడానికి అవి దోహదపడ్డాయి. ఈ సీరియల్‍లో ఆమె భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను, స్థల పురాణాలను, చారిత్రకాంశాలను మూడేళ్ల పరిశోధన ద్వారా జోడించారు. విశాఖపట్టణంలోని మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ 2017లో నాట్యవిద్యాభారతి బిరుదుతో బాటు స్వర్ణకమలాన్ని బహుకరించింది. న్యూఢిల్లీ లోని Indira Priyadarshini International Institute for Music and Dance సంస్థకు డైరక్టరుగా ఆమె దిశానిర్దేశం చేశారు.

పత్రికారంగ దిగ్గజం రామోజీరావు (16 నవంబరు 1936):

ఆంధ్ర ప్రదేశ్‌లో పత్రికారంగంలో తనదైన శైలిలో ఈనాడు పత్రికా ప్రారంభంలో ఒక వినూత్న శకానికి ఆద్యుడై ఒక దశలో ‘కింగ్ మేకర్’గా పేరు తెచ్చుకొన్నారు. కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీ రైతు కుటుంబానికి చెందినవారు. ‘పట్టిందలా బంగారం’ అనే సామెత ఆయన వ్యాసారసరళిని గమనిస్తే నిజమనిపిస్తుంది. ఇంటిపేరు చెరుకూరులో చెరుకు వలె ప్రతి గణుపుకూ మాధుర్యం గల వ్యక్తిత్యం ఆయన సొంతం.

చిట్‌ఫండ్ వ్యాపారంలో ప్రారంభమైన ఆయన జీవనగమనం దాదాపు 50 సంస్థలకు అధిపతిగా ఎదిగే స్థాయికి చేరింది. పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, చిత్రనిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఈటీవీ అధినేతగా ఆయన ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టారు. విదేశాలకు ప్రాకిన ప్రియా పచ్చళ్ల రుచులు ఆయన దూరదృష్టికి నిదర్శనం. ‘ప్రియా పుడ్స్’ బ్రాండ్ ఇమేజీ సంపాదించుకొంది. మార్గదర్శి చిట్‌ఫండ్ శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. కళాంజలి అద్భుత రూపకల్పన.

ప్రపంచంలోనే అతిపెద్దదైన హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గొప్ప సంస్థ. సంపన్నులు అందులో ప్రవేశించి అన్ని విభాగాల వల్ల ప్రయోజనం పొంది ఒక కొత్త సినిమాను రూపొందించి బయటకు రాగల స్థాయి గల ఫిల్మ్ సిటీ అది. 1960వ దశకంలో అడ్వర్టయిజింగ్ రంగంలో ఆసక్తి కనబరచారు. 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రారంభం ఆయన జీవితంలో ఒక మలుపు.

1969లో తొలిసారిగా వ్యవసాయదారుల కోసం అన్నదాత మాసపత్రిక ఆరంభించారు. 1970లో ఇమేజస్ అవుట్‌డోర్ అడ్వర్టయిజ్మెంట్ ఏజన్సీ ఆరంభించారు. విశాఖపట్టణంలో డాల్ఫిన్స్ హోటల్ ప్రారంభించారు. ఏ ఆలోచన వచ్చినా దానిని కార్యరూపంలోకి తీసుకు రావడంలో ఆయన అఘటన ఘటనా సమర్థుడు.

ఈనాడు ప్రభంజనం:

1974లో తీరప్రాంతమైన విశాఖపట్టణంలో ఆగస్టు మాసాంతంలో ఈనాడు దినపత్రిక 5 వేల ప్రతులలో ఆరంభమైంది. 2019 జనవరి నాటికి దాని సర్క్యులేషన్ సగటున 16.56 లక్షలు దాటింది. స్వర్ణోత్సవ సంవత్సరమిది (2024). ఈనాడుకు తిరుగులేదని చెప్పవచ్చు. తానే ప్రధాన సంపాదకుడు. జిల్లా ఎడిషన్లు ప్రారంభించారు. స్ట్రింగర్ వ్యవస్థను మొదలుపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పతాక శీర్షికలు ప్రచురించి ప్రభంజనం సృష్టించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి తొలిమెట్టు ఈనాడు. రాజకీయ పార్టీల అజెండాకు ఊతమిచ్చిన పత్రిక ఈనాడు. ఆయన ఆంగ్లంలో ప్రారంభించిన దినపత్రిక NEWSTIME ఎక్కువ కాలం మనుగడ కొనసాగించలేదు. జర్నలిజం స్కూల్ రామోజీ ఆలోచనల ప్రతిబింబం.

ఎడిషన్లు:

ఈనాడు దినపత్రిక తెచ్చిన పెను మార్పు – వివిధ ప్రాంతాల నుండి ఒకేసారి ఎడిషన్లు తీసుకరావడం. తొలి సంపాదకుడు ఏ.బి.కె. ప్రసాద్. ఆయన సారథ్యంలో దినపత్రిక కొత్త పుంతలు తొక్కింది. 1975 డిసెంబరులో హైదరాబాదులో రెండవ ప్రచురణ ఆరంభం. పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థ ఏర్చరుకుంది. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పాఠకాదరణ పెరిగింది. తెలుగు భాషకు ఈ పత్రిక పట్టం కట్టింది. గ్రామస్థాయి విలేఖరుల వ్యవస్థ నెలకొల్పారు. కొత్త శీర్షికలు మొదలుపెట్టారు. దినపత్రికతో బాటు విపుల, చతుర మాసపత్రికలు కథలు, నవలలకు ప్రాచుర్యం ఇచ్చాయి.

బూదరాజు రాధాకృష్ణ దినపత్రికలో భాష విషయంలో ఒక ప్రత్యేకశైలికి మార్గదర్శనం చేశారు. ఇంగ్లీషు మాటలకు సరియైన తెలుగు పదజాలం సృష్టించారు. కొత శీర్షికలు – చదువు, సుఖీభవ, ఛాంపియన్, eనాడు, సిరి, ఈతరం, స్థిరాస్తి, హాయ్ బుజ్జీ, ఆదివారం ఈనాడు, వసుంధర, ఈనాడు బిజినెస్, ఈనాడు సినిమాల ద్వారా అన్ని వర్గాల పాఠకులకు ఈనాడు దగ్గరైంది. సాహిత్యానికి ప్రాధాన్యం తగ్గించారు, వార్తా శీర్షికలు, శ్రీధర్ కార్టూన్లు ప్రజలను ఆకర్షించాయి. పరిశోధనా విభాగం ప్రత్యేకంగా ఏర్పరచారు.

సినీనిర్మాత:

రామోజీరావు స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టి విజయం సాధించారు. 1984లో చిత్రనిర్మాణ సంస్థ ద్వారా ‘శ్రీవారికి ప్రేమలేఖ’ విడుదల చేశారు. మయూరి (1985) ప్రతిఘటన (1987), మౌనపోరాటం (1989), పీపుల్స్ ఎన్‌కౌంటర్ (1991), అశ్వని (1991) ఇలా అనేక చిత్రాలు విజయవంతంగా ఈ సంస్థ రూపొందించింది. ఉషాకిరణ్ మూవీస్ సంస్థకు ఖ్యాతి లభించింది. రామోజీ ఫౌండేషన్ పక్షాన తెలుగువెలుగు, బాలభారతం పత్రికలు వెలువడ్డాయి. కరోనా ప్రభావంలో తరువాత దినపత్రిక తప్ప మిగిలిన పత్రికలు నిలిచిపోయాయి. సినీరంగానికి చెందిన ‘సితార’ పత్రిక ఒక విశిష్ట పత్రిక.

పురస్కారాలు:

దినపత్రికలో ఎన్నడూ తన ఫోటో ప్రచురించకూడదనే నియమం పాటించారు రామోజీరావు. పత్రికారంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా లభించిన పురస్కారాలివి:

  1. ఆంధ్ర విశ్వవిధాలయ గౌరవ డాక్టరేట్
  2. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
  3. శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
  4. యుధ్‌వీర్ అవార్డు.
  5. కెప్టన్ దుర్గా ప్రసాద్ అవార్డు (రాజస్తాన్)
  6. బి.డి.గోయెంకా అవార్డు.
  7. పద్మ విభూషణ్ అవార్డు (2016)

రామోజీరావు ఒక వ్యక్తి కాదు, అద్భుత సంస్థల సృష్టికర్త.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version