Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగుజాతికి ‘భూషణాలు’-4

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

త్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను తొలి సంవత్సరము (1954) కేవలం రాజకీయవేత్తలకే గాక శాస్త్రవేత్తమైన సర్ సి. వి. రామన్‌కు అందజేసి ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఆ మరుసటి సంవత్సరం ప్రముఖ విద్యావేత్త మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ ప్రతిష్ఠాపన జేసిన భగవాన్ దాస్‍కు అందించారు. అదే సంవత్సరం (1955) సివిల్ ఇంజనీర్‌గా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ప్రకటించారు. 1956లో ఎవరికీ ఇవ్వలేదు, 1958లో మహిళా విద్యా వ్యాప్తికి అవిరళకృషి చేసి 1916 లోనే మహిళా విశ్వవిద్యాలయ స్థాపన చేసిన ధోండో కేశవ కార్వేకు ప్రకటించారు. ఆదే రీతిలో 1963లో ప్రముఖ సంస్కృత విద్వాంసులు, ధర్మశాస్త్ర గ్రంథ రచయిత అయిన పాండురంగ వామన కాణే ను ‘భారత రత్న’ వరించింది.

1980లో సేవారంగంలో కృషికి గాను మదర్ తెరెసాకు ప్రకటించారు.

1990లో తొలిసారిగా విదేశీయుడైన నెల్సన్ మండేలాకు ప్రకటించారు. గాంధేయ సిద్ధాంతాల పట్ల అపారమైన విశ్వాసం గల వ్యక్తి ఆయన. ప్రముఖ పారిశ్రామికవేత్త, వదాన్యుడు అయిన జె.ఆర్.డి టాటాకు 1992లో ప్రకటించారు, సినీ నిర్మాత, దర్శకుడు అయిన సత్యజిత్ రే ని 1992 లోనే సత్కరించారు. నోబుల్ బహుమతి గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అయిన అమర్త్యసేన్ 1999లో ఈ పురస్కారం పొందారు.

1987లో సరిహాద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పొందారు. హిందూస్థానీ సంగీత విద్వాంసులైన రవిశంకర్ 1999లో, లతామంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ 2001లో; భీమ్‍సేన్ జోషీ 2009లో ‘భారత రత్న’ అందుకున్నారు. కర్ణాటక సంగీత విదుషీమణి శ్రీమతి యం.యస్. సుబ్బులక్ష్మి 1997లోనే అందుకొన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ప్రముఖ నేపథ్య గాయకుడైన శ్రీ భూపేన్ హజారికా 2019 లో పురస్కారం పొందారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా. యం. యస్. స్యామినాథన్‌కు 2024లో ప్రకటించడంతో 1954లో సి.వి.రామన్‌తో ప్రారంభమైన ఈ రికార్డుల పరంపర పతాక స్థాయికి చేరుకొంది.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు శ్రీ మదన్ మోహన్ మాలవ్యా 2015లో ‘భారత రత్న’ పురస్కారంతో సన్మానితులయ్యారు. క్రీడారంగ నిపుణులు సచిన్ టెండూల్కర్‍కు 2014లో ప్రకటించడం ఒక నూతనాధ్యాయం.

ప్రత్యక్ష రాజకీయవేత్తలు:

‘భారత రత్న’ పురస్కారాన్ని రాష్ట్రపతులు, ప్రధానులే గాక కేంద్రంలో మంత్రులు గాను, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా పనిచేసేనవారు పొందారు. వివరాలివి:

సం. ప్రముఖులు హోదా
1957 గోవింద వల్లభ పంత్ ఉత్తర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి (1950-54)
1961 బిధాన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ ద్వితీయ ముఖ్యమంత్రి (1948-1962)
1961 పురుషోత్తమ్ దాస్ టాండన్ యునైటెడ్ ప్రావిన్స్ స్పీకరు (1937-50)
1976 కె. కామరాజు తమిళనాడు ముఖ్యమంత్రి (1954-57, 1962-63)
1988 యం.జి. రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి (1977-80, 1980-84, 1985-87)
1988 బి. ఆర్. అంబేద్కర్ తొలి కేంద్ర న్యాయ శాఖా మంత్రి
1991 వల్లభ్ భాయ్ పటేల్ తొలి ఉప ప్రధాని (1947-50)
1991 అబుల్ కలామ్ అజాద్ తొలి విద్యా శాఖ మంత్రి
1998 సి. సుబ్రహ్మణ్యం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి (1964-66)
1998 జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ నేత
1999 గోపీనాథ్ బొర్దొలాయి అస్సాం తొలి ముఖ్యమంత్రి (1946-50)
2015 నానాజీ దేశ్‍ముఖ్ సామాజిక కార్యకర్త
2024 కర్పూరీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి (1970-71, 1977-79)

ఈ పట్టికను పరిశీలించినప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ సామాజిక ప్రముఖులకు ఆయా సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్యం సందర్భోచితంగా ‘భారత రత్న’ ప్రకటిస్తూ వస్తోంది. డా. శంకర్ దయాళ్ శర్మ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా వ్యవహరిచారు. కాని ఆయనకు ‘భారత రత్న’ లభించలేదు. వివిధ విదేశీ విశ్వవిద్యాలయులు డాక్టరేట్ గౌరవంతో సత్కరించాయి. పలువురు రాష్ట్ర, కేంద్ర నాయకుల పేర్లు ‘భారత రత్న’ పురస్కారానికి సూచింపబడ్డాయి కాని, అవి ఫలించలేదు.

పంచరత్నాలు – 2024:

2024 సంవత్సర ప్రత్యేకత ఐదుగురు ప్రముఖులకు ‘భారత రత్న’ ప్రకటించడం. అందులో ఇద్దరు మాజీ ప్రధానులు, ఒక ఉప ప్రధాని వుండటం విశేషం. ఒక్క అద్వాణీ తప్ప మిగిలిన నలుగురికీ మరణానంతరం లభించింది. 2021లో పి.వి.నరసింహారావు శతజయంతి సందర్భంగా ‘భారత రత్న’ ప్రకటిస్తారని ఎదురుచూశారు. ఎట్టకేలకు అది ఇప్పుడు సాకారమైంది.

చరణ్ సింగ్:

చరణ్ సింగ్ (1902 డిసెంబరు -1987 మే) ఉత్తరప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి. భారతదేశ ఐదవ ప్రధాన మంత్రి (1979 జులై- ఆగస్టు 1979). కేవలం 23 రోజులు పదవిలో కొనసాగారు. అయితే ఉపప్రధానిగా 1979 జనవరి నుంచి జూలై వరకు ఉన్నారు. కేంద్రంలో ఆర్థిక శాఖా మంత్రిగా, హోం శాఖా మంత్రిగా మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కొనసాగారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి 1967-68లోను, రెండవ దఫా 1970లోను వ్యవహరించారు. 1980లో లోక్‌దళ్ పార్టీ స్థాపించారు.

యల్.కె. అద్వాణీ:

అయోధ్య ఉదంతంలో ప్రధాన పాత్ర పోషించిన అద్వాణీ భారతీయు జన సంఘ్ పార్టీలో తొలినాళ్లలో పనిచేశారు. పాకిస్తాన్ లోని కరాచీలో 1927 నవంబర్‍లో జన్మించిన అద్వాణీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్త. 1939లో భారతీయ జనసంఘ్‌ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించినపుడు అందులో చేరి ఉన్నత పదవులు చేపట్టారు. రథయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా సంచరించి సంచలనం సృష్టించారు (1990-97).

అద్వాణీ అధిరోహించిన ఉన్నత పదవులు:

వివిధ సందర్భాలలో ఆయన దేశ ప్రగతికి మార్గదర్శకుడయ్యారు. రామమందిర నిర్మాణం జరిగిన సందర్భంగా అద్వాణీకి ‘భారత రత్న’ ప్రకటించడం పట్ల దేశప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అయోధ్య ఉదంతంతో సంబంధమున్న రెండవ వ్యక్తి అప్పుటి ప్రధాని సి.వి. నరసింహరావు. ఆయనకు కూడా ఇదే సంవత్సరం ప్రకటించడం ఆంధ్రాలు హర్షించడానికి కారణమైంది.

పి.వి. ఠీవి:

పి.వి. నరసింహారావు రాజకీయాలలో చాణక్యుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా విశిష్టుడు. కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖలను సమర్థవంతంగా నిర్వహించి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు సన్నిహితుడిగా ప్రసిద్ధి కెక్కారు. 1991 మేలో రాజీవ్ గాంధీ హఠాన్మరణంతో ప్రధాన మంత్రి పదని పి.వి.ని వరించింది. ఆర్థికరంగంలో సంస్కరణలకు ఊతం యిచ్చి 1991-96 మధ్య కాలంలో ఆయన నేతృత్వంలో భారతదేశం పురోగతి సాధించింది. ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా ఎంపిక చేయడంలోనే ఆయన దూరదృష్టి కన్పిస్తుంది. 2004 – 2014 మధ్య మన్‌మోహన్ సింగ్ ప్రధాని పదవిలో కొనసాగడం మరో విశేషం.

భారతదేశం ఎదుర్కొందున్న ఆర్థిక అత్యవసర పరిస్థితి నుండి దేశాన్ని రక్షించిన వ్యక్తి పి.వి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే ఆయన ఆర్థిక విధానంలో సమూలమైన మార్పులు చేశారు. స్వేచ్ఛా మారక విధానం ప్రవేశపెట్టారు, లైసెన్సుల జారీలను సులభతరం చేశారు. విదేశీ పెట్టుబడులకు అనుమతులు మంజూరయ్యాయి. దేశ ఆర్థికవ్యవస్థ సరికొత్త పంథాలో పరుగులు తీసింది. ప్రభుత్వరంగంలో ప్రభుత్వ వ్యయం తగ్గింది. ప్రైవేటురంగం ఊపిరి పీల్చుకొంది. ఆర్థిక విధానం సరళీకరణకు, ప్రైవేటీకరణకు, గ్లోబలైజేషన్‌కు రాచబాటలు వేసింది. సమ్మిళిత అభివృద్ధి ఎదుగుతూ వచ్చింది. సామాజికంగా అణగారిన పేదవర్గాలకు కూడా లబ్ధి చేకూర్చాలనేది ఆయన ఆకాంక్ష.

ఆయన అద్భుత మేధస్సు, అసాధారణ రాజనీతిజ్ఞత కొనియాడదగినవి. భారతీయుల తలరాతను సమూలంగా మార్చివేసిన మహోన్నత నేత. నెహ్రూయేతర కుటుంబం నుండి వచ్చిన తొలి ప్రధాని పి.వి. సరళీకరణ విధానము, ప్రపంచీకరణ విధానం ద్వారా 21 వ శతాబ్దంలో అమెరికాతోను, ఇటు ఆసియాదేశాలతోను సుస్థిర సంబంధాలు నెలకొల్పడానికి పునాది వేసిన వ్యక్తి పి.వి.

శ్రీమతి ఇందిరాగాంధీ 1980 లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఏర్పడ్డ మంత్రివర్గంలో పి.వి. విదేశాంగశాఖ మంత్రిగా నియమింపబడ్డారు. ఆయన హయాములో ఇండో-అమెరికా సంబంధాలు కొత్తపుంతలు తొక్కాయి. 1991లో మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వంగా మార్చడంలో ఆయన రాజనీతిజ్ఞత గమనించవచ్చు. అదే రీతిలో మానవ వనరుల మంత్రిత్వశాఖలో ఆయన దూరదృష్టితో వ్యవహరించారు భూసంస్కరణలు, గ్రామీణాభివృద్ధి ఆయనకు ప్రధాన లక్ష్యాలు. మేధావి అయిన పి.వి.కి ‘భారత రత్న’ ప్రకటించడం పట్ల దేశమంతా హర్షించింది.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version