Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగుజాతికి ‘భూషణాలు’-40

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

పద్మ పురస్కారాల గత వైభవాన్ని ఒకసారి పరిశీలిస్తే 1954-2024 మద్యకాలంలో ఈ క్రింది పురస్కారాలు మహామహులు అందుకున్నారు. భారత రత్న 53 మంది, పద్మ విభూషణ్ – 336, పద్మ భూషణ్-1320, పద్మ శ్రీలు 3531 మంది. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి వివరాలు ముచ్చటించుకొన్నాం (మొత్తం సంఖ్య- 5240).

సినీరంగ ప్రముఖులలో ‘పద్మ శ్రీ’లు:

తొలిసారిగా 1968లో అక్కినేని, ఎన్.టి.ఆర్. ఇద్దరూ పొందారు. నాగేశ్వరరావుకు 1988లో పద్మ భూషణ్, 2011లో పద్మ విభూషణ్ లభించాయి. లోగడ వీరిని గూర్చి ప్రస్తావించాను.

నందమూరి తారక రామారావు ( 1928 మే – 1996 జనవరి):

విలక్షణ వ్యక్తిత్వం గల రామారావు సినీరంగంలోనే గాక దేశ రాజకీయాల లోను తనదైన ముద్ర వేశారు. ‘మన దేశం’ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసి 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 180 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలలో అద్భుతంగా నటించారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983లో ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెసేతర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. నేషనల్ ఫ్రంట్‌లో జాతీయ స్థాయి నాయకత్యం లభించింది.

రేలంగి వెంకట్రామయ్య  (1910 ఆగస్ట్ – 1975 నవంబరు):

హాస్యనటుడిగా ప్రఖ్యాతిగాంచిన రేలంగి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. 1935లో ‘కృష్ణ తులాభారం’ ద్వారా వెండితెరకు పరిచయమై నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాలలో విలక్షణ హాస్యాన్ని పోషించారు. రేలంగికి 1970లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు.

గుమ్మడి వెంకటేశ్వరరావు (1927 జూలై- 2010 జనవరి):

ఐదు దశాబ్దాలకు పైగా విభిన్న తరహా పాత్రలు పోషించిన గుమ్మడి గుంటూరు జిల్లా రావికంపాడులో జన్మించారు. 1950లో ‘అదృష్టవంతుడు’ చిత్రంతో ప్రారంభమైన నట జీవితం క్యారెక్టర్ యాక్టర్‌గా నిలదొక్కుకొనేలా చేసింది. 1970లో రేలంగి, గుమ్మడి ‘పద్మ శ్రీ’ అందుకొన్నారు.

బి. యన్. రెడ్డికి 1974లో ‘పద్మ శ్రీ’, ఆ తరువాత పద్మ భూషణ్ లభించాయి.

దేవులపల్లి కృష్ణశాస్త్ర (నవంబరు 1897 – ఫిబ్రవరి1980):

వీరికి 1976లో పద్మ భూషణ్ లభించింది. అలానే సినారెకి పద్మ శ్రీ, పద్మ భూషణ్ లభించాయి.

డి. వి. ఎస్. రాజు (డిసెంబరు 1928 – నవంబరు 2010):

దాట్ల వెంకట సూర్యనారాయణరాజు తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. ప్రొడ్యూసర్‌గా సినీరంగంలో విశిష్ట ఖ్యాతి గడించారు. 2001లో వీరికి ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. 25 విజయవంతమైన సినిమాల నిర్మాత. మా బాబు (1960), మంగమ్మ శపథం (1965), పిడుగు రాముడు (1966), తిక్క శంకరయ్య (1968), గండికోట రహస్యం (1969),  జీవనజ్యోతి (1975) బాగా పేరు తెచ్చాయి. NFDC చైర్మన్‌గా వ్యవహరించారు. 1988లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం స్వీకరించారు.

యం. మోహనబాబు (1952 మార్చి):

దాదాపు 575 సినిమాలలో నటించిన ఘనత మోహన్ బాబుది. స్వయంగా 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. ఆయన పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మోదుగుల పాలెంలో జన్మించారు. తిరుపనికి సమపంలో శ్రీ విద్యానికేతన్ స్థాపించి ఉన్నత విద్యారంగంలో ప్రతిష్ఠ సంపాదించారు. ఆ యూనివర్శిటికి ఆయన చాన్సలర్. ఆయన సంతానం మంచు లక్ష్మి, మంచు విష్ణు, మనోజ్ కుమార్‌లు ప్రసిద్ధులు. మోహన్ బాబు 65 కి పైగా హిట్ చిత్రాల నిర్మాతగా 2007లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మ శ్రీ’ అందుకున్నారు.

కన్నెగంటి బ్రహ్మానందం (1956 ఫిబ్రవరి 1):

1250 కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు బ్రహ్మానందం. పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో జన్మించారు. గుంటూరు పి. జి. సెంటర్‍లో తెలుగు ఎం.ఏ. చేశారు. అత్తిలి డిగ్రీ కళాశాలలో 9 సంవత్సరాలు ఉపన్యాసకులుగా పనిచేశారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహా నా పెళ్లంట’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. హాస్యనటులుగా జగత్ప్రసిద్ధులు. 2009 లో వీరికి ‘పద్మ శ్రీ’ ప్రదానం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ లభించింది.

కొంటె బొమ్మల బాపు (1993 డిసెంబరు – 2014 ఆగస్టు):

తెలుగునాట చిత్ర దర్శకుడిగా అఖండ ఖ్యాతి సంపాదించిన సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి బి.కాం, బి.యల్ పట్టాలందుకొన్నారు. 2013లో ‘పద్మ శ్రీ’ లభించింది. పౌరాణికాంశాల నేపథ్యంలో ఆయన గీసిన చిత్రాలు ప్రత్యేక ముద్ర గలవి. బాపు – రమణల సాంగత్యం విలక్షణం, విశిష్టం, విభిన్నం. అనేక జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. జాతీయ ఫిల్మ్ అవార్డులు, నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రత్యేకం.

బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. శ్రీ వేంకటేశ్వర భక్తి భానల్‌ లోగో తయారు చేయమని బాపుని అభ్యర్థించడానికి తిరుపతి దేవస్థానం పక్షాన అనంత పద్మనాభరావు మదరాసు వెళ్ళినపుడు ఆయన సభక్తికంగా వారం రోజులో అందించారు. కార్టూనిస్టుగా బాపు ప్రసిద్ధులు. వీరు దర్శకత్వం వహించిన ప్రసిద్ధ సినిమాలు ఎన్నో. 1967లో ‘సాక్షి’ చిత్రంతో ఆరంభించి 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976లో నిర్మించిన ‘సీతాకళ్యాణం’ నయనానందకరం. తెలుగు, హిందీ, తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు. సంపూర్ణ రామాయణం, శ్రీరామాంజనేయ యుద్ధం. శ్రీరామరాజ్యం రామాయణ గాథల చిత్రాలు. త్యాగయ్య, శ్రీనాథకవి సార్వభౌముడు, కృష్ణావతారం, వంశవృక్షం, కలియుగ రావణాసురుడు, పండంటి జీవితం, భక్త కన్నప్ప విశిష్ట చిత్రాలు. ‘ముత్యాల ముగ్గు’ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. 1981 నుండి హిందీ చిత్రాలకు దర్శకత్వం మొదలెట్టారు. బేజూబాన్, వో సాత్ దిన్, మెహబ్బత్, ప్యారీ బెహనా, మేరా ధరమ్, ప్యార్ కా సిందూర్, దిల్‌జలా, పరమాత్మా ప్రముఖ హింది చిత్రాలు. పలు గ్రంథాలకు ముఖచిత్రాలు గీశారు. బాపు సోదరులు శంకరనారాయణ ఆకాశవాణి పలు కేంద్రాలలో డైరక్టరుగా పనిచేశారు. ఆయన కూడా మంచి చిత్రకారుడు. బాపు రచనలలో సున్నిత హాస్యం, సునిశిత వ్యంగ్యం కలగలిపి వుంటాయి. చిత్రసీమలో ఆయన ధ్రువతార.

కోట శ్రీనివాసరావు (1942 జూలై):

కంకిపాడులో జన్మించారు. కొంతకాలం స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978-79లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో అరంగేట్రం అయ్యింది. సినీరంగ ప్రవేశానికి ముందు 20 ఏళ్ళ నాటకానుభవం వుంది. వీరిని 2015లో ‘పద్మ శ్రీ’ వరించింది. డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత గల నటుడు. ‘అహనా పెళ్ళంట’ సినిమాలో కథానాయిక తండ్రిగా పిసినిగొట్టు పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’లో హీరో తండ్రి పాత్ర ధరించారు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా (1999-2004) విజయవాడ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. కోట శంకరరావు వీరి తమ్ముడు.

ఉత్తమ విలన్‌గా 1998, 2000లో రెండు మార్లు నంది అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటుడిగా 2002, 2004, 2006 లలో నంది అవార్డు పొందారు. వీరి కుమారుడు కోట ప్రసాద్ సినీ నటుడు. అకస్మాత్తుగా మరణించారు (2010).

సిరివెన్నెల సీతారామశాస్త్రి (1955 మే – 2021 నవంబర్):

అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల 2019 లో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు. గీత రచయితగా ఆయన విశిష్ట శైలిలో ఎన్నో సినీగీతాలు వ్రాశారు. ‘జనన జన్మభూమి’ చిత్రానికి పాటలు రాసే అవకాశం కె. విశ్వనాధ్ ఆయనకు కల్పించారు. ‘సిరివెన్నెల’ సినిమాకు రాసిన ‘విధాత తలపున’ అనే గీతం ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. ప్రతి పాటా ఆణిముత్యమే. రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శుభలగ్నం, సిందూరం, చంద్రలేఖ, శుభసంకల్పం – సిరివెన్నెల విలక్షణ శైలికి పట్టం గట్టాయి. ఆయన రచించిన చిత్ర గీతాలను డల్లాస్‌కు చెందిన తోటకూర ప్రసాద్ మూడు సంపుటాలుగా ప్రచురించారు. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వీటిని హైదరాబాదులో ఆవిష్కరించారు. ఎన్నో నంది పురస్కారాలు లభించాయి. ఆయన ఒక యుగపురుషుడు.

సినీ మధుర గాయని శ్రీమతి యస్. జానకికి 2013లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కాని, జానకి ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. దక్షిణాది సినీపరిశ్రమకు చెందిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

సుమధుర వాణి కీరవాణి (1961 జులై):

కోడూరు మరకత మణి కీరవాణి తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగులో కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా హిందీలో యం.యం. క్రీమ్‌గా ప్రసిద్ధులు. కొవ్వూరులో జన్మించారు. రామోజీరావు నిర్మించిన ‘మనసు –మమత’ చిత్రంతో సినీరంగప్రవేశం చేశారు.

2023లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అందుకున్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావుతో కలిసి 27 సినిమాలకు సంగీతం సమకూర్చారు. 1997లో ‘అన్నమయ్య’ చిత్రానికి జాతీయ చలన చిత్ర అవార్డు లభించింది. ఆస్కార్ పురస్కారం లభించిన ‘నాటు నాటు’ పాటకు కీరవాణి సన్మానితులయ్యారు (2023). నేటి తరం తెలుగు సంగీత దర్శకులలో ఆయన స్థానం ప్రముఖం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version