సింహప్రసాద్ ‘గోచర’:
సింహప్రసాద్ – కథకుడుగా, నవలాకారుడుగా అనన్యసామాన్యమైన ప్రాచుర్యం కలిగిన రచయిత. బహుమతి కథలు నవలల రచయితగా – బహుశ తెలుగులోనే కాదు, ప్రపంచంలోనే ఆయన ‘రికార్డు హోల్డర్’ అయివుంటారు. 300కు పైగా కథలూ, 70కి పైగా నవలలూ రాశారు. బహుమతి కథలు 70కి పైనే!
ఈ సంచికలో సింహప్రసాద్ కథ ‘గోచర’ని పరామర్శించటానికి చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పినట్లు ఈ సీరీస్‌లో వచ్చేవన్నీ అ-పూర్వ కథలే కనుక, ఇదీ ఆ కోవలోని మరో ఏరిన ముత్యం!
‘గోచర’ కథ-అతి సున్నితమైన హిందూముస్లిం మతాచార వ్యవహార విశ్వాసాలు ఒక పార్శ్వంగా, మనిషి సునిశిత మనస్తత్వం ఒక పార్శ్వంగా వస్తు సాంద్రతని పొదువుకున్నది. ఇతివృత్తం-ఈ రెంటి కేంద్రకంగా-అతి స్పష్టమైన, ఏ శషభిషలు లేని వ్యక్తి ముద్రగా-మానవీయతని ఆవిష్కరిస్తూ సంపన్నమైంది.
సలీం ఆర్టీసీ బస్సు డ్రైవర్. భార్య ముంతాజ్. ఒకరికొకరు ప్రాణం. పెళ్ళయిన పదకొండేళ్లకు మగబిడ్డని కన్నది ముంతాజ్. సలీంకి పట్టరాని సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో నిమగ్నుడై బస్ నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు. ఆవుదూడ బస్ కింద పడి చచ్చిపోయింది. పోయింది ఆవుదూడ, డ్రైవర్ ముస్లిం! మతఘర్షణల ప్రమాదాన్ని – కండక్టర్ బ్రహ్మం, పోలీస్ ఇన్‌స్పెక్టర్ కూడా చాకచక్యంతో తప్పించి, సలీంని ఇంటికి పంపించేశారు. మూడో రోజున డ్యూటీలో చేరాడు. అదే రూటు. సరిగ్గా ఆ ‘స్పాట్’కి వచ్చేసరికి, ఆవు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కన్నీళ్ళూ… బస్ చుట్టూ పరిభ్రమణం… ఇంకా చాలా స్వప్నభ్రాంతే… సలీం మనసు కకావికలమైంది.
ముంతాజ్‌కి పాలుపడలేదు. పిల్లవాడు ఇలకరుచుకుపోతున్నాడు. ప్యాకెట్ పాలుపడలేదు. చిన్న డెయిరీకి వెళ్లి పాలు తెచ్చి పోస్తే తేరుకున్నాడు. కానీ, సలీం మానసికంగా అతలాకుతలమైపోతున్నాడు. బ్రహ్మంతో తన వ్యధని పంచుకుంటే, అతను ‘మతం వేరు, నమ్మకాలు వేరు’ అని వేంకటేశ్వరస్వామిని ముస్లింలు ఆరాధించే విషయం చెప్పి ప్రాయశ్చిత్తం ఏమిటో కనుక్కునేందుకు ఒక శాస్త్రిగారి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆయన గోమాహాత్మ్యాన్ని పక్కా లెక్కలతో చెప్పి-ప్రాయశ్చిత్తం లేదంటాడు. ‘అగ్నిశిఖరం మీద నుంచీ మంచులోయలోకి తోసేయబడినట్లు’ విలవిల్లాడాడు; సరాసరి కబేళాకి వెళ్ళి, కరువు ప్రాంతం నుండి తీసుకువచ్చిన ఒక బక్క ఆవుని కొనుక్కుని ఇంటికి తీసుకు వెళ్తాడు. దాని రాకతోనే ముంతాజ్ ‘జాకెట్టు పాలతో తడిసిపోయింది’, ఆనందించాడు. ఆ తర్వాత, దాన్ని పెంచి పోషించారు. దానికొక దూడ పుట్టింది. ఈ దూడ అచ్చం సలీం చేసిన యాక్సిడెంట్‌లో చనిపోయిన దూడలాగే వుంది. దానికి లాగానే దీనికీ ‘ముఖంమీద బొట్టులా నారింజరంగు మచ్చ సైతం ఉంది’. ఎవరో దోస్త్ అడిగితే ప్రవక్త గోవు గురించి చెప్పిన మాటలే గుర్తుచేసుకొన్నాడు సలీం. ‘ఆవు మెడచుట్టూ చేతులు చుట్టి కావలించుకున్నాడు. ముట్టె నిమురుతూ నిన్నూ, నీ సంతతినీ సంరక్షిస్తాను. అల్లాకే కసమ్’ అంటూ కథ ముగిసింది!
ఇలాంటి కథని ముందు పెద్ద పెద్ద విమర్శకులు ‘సెంటిమెంట్’ కథ అని పక్కన పెట్టేస్తారు. మరికొందరేమో ‘కార్యకారణ విచికిత్స’ని ముందుకు తెచ్చి, తర్కించి, పెదవి విరుస్తారు. విశ్వాసం ప్రాతిపదిక అయినప్పుడు పింగళి అన్నట్టు ‘తర్కం’ కూడదు! భావజాల నిబద్ధతల నుండి పుట్టుకొచ్చే ప్రాపంచిక దృక్పథాల సిద్ధాంతాలూ ఇక్కడ నిలవ్వు. ఈ సత్యాలకి నిదర్శనం-‘గోచర’!
‘గోచర’ వంటి కథని రాయటానికి ముందు రచయిత ఇలాంటి వస్తువుని ఎన్నుకుని, ఆ తపనని నిలుపుకుని కథ రాయటానికి చాలా దమ్ముండాలి. ఎక్కడా ఏ ఉద్వేగాలకీ, ఉద్రేకాలకీ లోనుగాకుండా ‘వ్యాస’ ధోరణిని రానీకుండా-ఎంతో స్తిమితంగా కథనాన్ని సాగించారు సింహప్రసాద్.
‘శిల్పం కథకుడి మంత్రదండం’ అనేవారు పద్మరాజుగారు. ఆ మంత్రదండంని చాలా గట్టిగా పట్టుకుని కథల్నీ, కథా ప్రియుల్నీ ఆటాడించేస్తున్నారు సింహప్రసాద్. కనుక, కథ చెప్పిన రీతీ, శైలీ గుణం – వీటి గురించి ప్రత్యేక ప్రశంస అక్కర్లేదు. అవి ఇందులో నూరుశాతం కుదురుకున్నాయి. కథ అల్లికా, కథనం శ్రుతిలయలూ ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇప్పటివరకూ రాయబడని వస్తువుని కథాగతం చేసిన వారే గొప్ప రచయితలు. ఆవిధంగా కూడా సింహప్రసాద్ గొప్ప రచయిత.
‘గోచర’లో సామాజికత ఉంది. సమకాలీనత ఉంది. ఉద్విగ్న కారణమయ్యే సంభవం ఉంది. మనిషి అంతఃసంఘర్షణున్నది. మానవసంబంధాల సరళస్పర్శ ఉంది. మనిషి మనిషిగా మారటానికి అవకాశం కలిగించే సందేశం ఉంది. ఇవన్నీ కథాత్మకంగా, కళాత్మకంగా ఆవిష్కరింపబడినై, అదీ విశేషం!
‘గోచర’ని ఏరిన ముత్యం అనటానికి మరో ముఖ్యమైన కారణం-కథ మొదలెట్టినప్పట్నుంచీ, చదువుతూ పోతుంటే అశాంతి, అలజడీ! దీని ముగింపేమిటి? అనే గుండె బిగింపు! చదవటం పూర్తిచేయగానే ఒక చిత్తశాంతీ, దీర్ఘ ఉచ్ఛ్వాసం. మనసు అంతర్వీక్షా యానం!
17.6.2016 నవ్య వీక్లీలో వచ్చింది. పోటీలో బహుమతి పొందింది. సమార్హమైన గుర్తింపు! చదవండి. నాకంటే ఎక్కువ ఆనందిస్తారనే నా నమ్మకం! శుభాకాంక్షలు!
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.