అంతర్జాలంలో అతిపెద్ద స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా అరుదైన ఘనత సాధించింది. తెలుగు వికీపీడియాలోని 28,605 వ్యాసాలలో ఫోటోలు, మ్యాపులు చేర్చి ప్రపంచ వికీపీడియాల్లో మూడవ స్థానంలో నిలిచి తెలుగువారి సత్తా చాటింది. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని భాషల వికీపీడియాల్లో జూలై-ఆగస్టు నెలల్లో ‘వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021’ పేరుతో ఒక పోటీ నిర్వహించబడింది. అందులో భాగంగా రెండు నెలల పాటు ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేపట్టిన తెలుగు వికీ రచయితలు దాదాపు 22,700లకు పైగా గ్రామాల వ్యాసాల్లో మ్యాపులను చేర్చి రికార్డు సృష్టించారు. తెలుగు వికీపీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 వేల గ్రామాల గురించిన వ్యాసాలలో, ఆయా గ్రామాలలో ఉన్న విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు, దర్శనీయ ప్రదేశాలు తదితరాల గురించి విలువైన సమాచారం లభిస్తుంది. ఇప్పుడు ఈ వ్యాసాలకు మ్యాపు రూపంలో ఒక కొత్త హంగు చేకూరింది.
వికీపీడియా అందించే సమాచారాన్ని ఎవరైనా ఉచితంగా, నిరాక్షేపణీయంగా వాడుకోవచ్చని వికీపీడియా తెలియజేస్తోంది. అంతేకాదు, వికీపీడియా వ్యాసాల్లో ఎవరైనా మార్పుచేర్పులు చెయ్యవచ్చుకూడా. అలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారిని వికీపీడియా ఆహ్వానిస్తోంది, కొత్త సమాచారం చేర్చేందుకు ప్రోత్సహిస్తోంది. గ్రామాల వ్యాసాల్లో మ్యాపులు చేర్చే పనిలో కూడా కొత్తగా వికీపీడియాలో చేరినవారు గణనీయమైన కృషి చేసారు. వికీపీడియా సైటుకు (te.wikipedia.org) వచ్చి అక్కడ “వర్గం:ఆంధ్రప్రదేశ్ గ్రామాలు”, “వర్గం:తెలంగాణ గ్రామాలు” అని వెతికి ఆయా రాష్ట్రాల్లోని గ్రామాల వ్యాసాలకు వెళ్ళి తమతమ గ్రామాల సమాచారాన్ని చూడవచ్చు. వాటిలో కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. తమ గ్రామానికి చెందిన ఫొటోలను ఈ వ్యాసాల్లో చేర్చవచ్చు.
ఇప్పుడు 75వ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరమంతా వికీపీడియాలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికీ, స్వతంత్ర భారత దేశపు 75 ఏళ్ళ ప్రస్థానానికీ సంబంధించి కొత్తగా 3 వేల వ్యాసాలను రాయాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కృషిని ప్రారంభించారు. ఇందులో కూడా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.