[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన ‘తొలి పెళ్ళిచూపులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ రోజు కూడా ఎప్పటిలాగానే నాలుగు గంటలకు నిద్రలేచి మార్నింగ్‌వాక్‌కు బయలుదేరాను. ఆ సమయంలో విజయవాడ ప్రధాన రహదారి కూడా నిర్మానుషంగా ఉంది. కాలుష్యం లేని మంచి గాలి. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాను. సగం నడక ముగిసేసరికి శరీరం తేనీటిని కోరింది. అప్పుడే తోపుడు బండ్లపై టీలు, సిగరెట్లు అమ్ముతున్నారు.
‘సిగిరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్’, కాబట్టి ఆ అలవాటు చేసుకోలేదు. బాగా పరిచయం ఉన్న జమీనా దగ్గరకు వెళ్ళి అయిదు రూపాయలు ఇచ్చి టీ తీసుకున్నాను. ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా అయిదు రూపాయలకే టీ అమ్ముతున్న గొప్ప దయగల వ్యాపారుల్లో ఆమె ఒకరు. తెల్లవారుజామున వచ్చే రెగ్యులర్ కస్టమర్లలో, ఆమెకు నేను కూడా ఒక ముఖ్యమైన కస్టమర్. అలా వాకింగ్, జాగింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరాను. స్నానాదులు, పూజ కార్యక్రమాలు ముగించుకుని టిఫిన్ తిన్నాను. బ్యాంకుకు బయలుదేరబోతూ అద్దంలో అందం చూసుకున్నాను. ఎందుకోగాని ఎడమ కన్ను టపీటపీమని అదిరింది. బ్యాంకులో ఏమి జరుగబోతోందో అని భయం మొదలైంది. ఏ కస్టమర్ వచ్చి, ఏం గొడవ చేస్తాడో, ఏం సమస్య వస్తుందో అని అని ఆందోళన ఆరంభం అయింది. ఆ ఆలోచనలతోనే బ్యాంకుకు బయలుదేరాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరుగా పనిచేస్తున్నాను. మంచి జీతం, జీవితం. తోడుగా అమ్మ, నాన్న. వయసు అక్షరాల నలభై సంవత్సరాలు. ఇంకా కళ్యాణ యోగం కలగలేదు. కలుగుతుంది అనే ఆశ లేదు. కలగాలి అనే ఆలోచన కూడా లేదు. బ్యాంకుకు చేరిన తరువాత నా పనిలో నిమగ్నమయ్యాను. అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు.
ఒక మహిళ తలుపు తీసుకుని బ్యాంకులోకి ప్రవేశించింది. మేనేజర్ క్యాబిన్లో ఉన్న నాకు సిసి కెమెరాలో ఆ మహిళ కనిపించింది. చూడటానికి లక్షణంగా చీర కట్టుకుని ఉంది. బ్యాంకులో ఉన్న క్లర్క్ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడుతోంది. ఎక్కడో ఆమెను చూసాను. కానీ గుర్తుకు రావడం లేదు. ఆ తరువాత పట్టించుకోలేదు. కానీ ఆమె ముఖం నన్ను వెంటాడుతూనే ఉంది. వెంటనే మా క్లర్క్ దగ్గరకు వెళ్ళి ఆమె గురించి వాకబు చేసాను. ఆమె ఇచ్చిన ఆధార్, పాన్ కార్డు, ఫోటో చూసాను. ఆధార్‌లో ఉన్న పూర్తి పేరు చూసాక అనుమానం మరింత బలపడింది. వెంటనే ఆమె వివరాలు నా ఫోన్లో ఫోటో తీసుకున్నాను. మా నాన్నకి వాట్సప్ ద్వారా పంపించి వివరాలు అడిగాను. మా నాన్న ఆమె ఫోటో, పేరు చూసి ఆమె వివరాలు నాకు చెప్పాడు. అప్పుడు ఆమె గుర్తుకు వచ్చింది. ఆమే కుసుమ. నా ఆలోచనలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి..
***
అప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు. ఉద్యోగంలో చేరి ఆరు సంవత్సరాలు అయింది. ఈ ఆరు సంవత్సరాల కాలంలో ‘పెళ్ళి’ అనే ఒక పెద్ద మార్పుకి దూరంగా ఉన్నాను. అమ్మా, నాన్న ఎంత చెప్పినా వినలేదు. పెళ్ళి అనే బాధ్యత తీసుకోవడానికి డబ్బుతో పాటు చాలా ధైర్యం కావాలి. త్యాగాలు చేయాలి. మన జీవితంలోకి వేరొకరు ప్రవేశిస్తే ఆ వ్యక్తితో కలిసి ప్రయాణించడానికి చాలా వదులుకోవాలి. అలాంటి సాహసాలు చేయలేక పెళ్ళి నాకు, నా స్వభావానికి సరిపడదని తప్పించుకు తిరిగాను. అలాంటి సమయంలో పెళ్ళిళ్ళ బ్రోకర్ బ్రహ్మానందం ఒక పెళ్ళి సంబంధం తెచ్చాడు. నేను షరా మామూలుగానే తిరస్కరించాను. అప్పుడు మా అమ్మ, నాన్న ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. నేను బ్రహ్మానందం తెచ్చిన సంబంధం చూడకపోతే బిర్యానీ కూడా ముట్టమన్నారు. దాంతో నేను ‘సరే’ అనక తప్పలేదు. ఒక శుభముహూర్తం చూసి పెళ్ళిచూపులకు వెళ్ళాలనుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు పైగా గురువారం. షిర్డీ సాయిబాబాకి నమస్కరించి తల్లిదండ్రులతో కలిసి పెళ్ళి చూపులకు బయలుదేరాను. ఇది నా తొలి పెళ్ళి చూపులు. అంటే పెళ్ళి చూపుల్లో ‘అరంగేట్రం’ అన్నమాట. బ్రహ్మానందం కూడా ఉండటంతో ఇల్లు త్వరగానే కనుక్కోగలిగాం. అమ్మాయి తండ్రి పోలీసు శాఖలో ఒక రిటైర్డ్ కానిస్టేబుల్. తల్లి గృహిణి. మమ్మల్ని చూసి సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో నా పరిస్థితి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న గొర్రె పిల్లలా ఉంది. అది అరవగలదు. నేను అరవలేను. అంతే తేడా. సావకాశంగా కుర్చీలో సుఖాసీనులం అయ్యాక స్వీట్, హాట్ ఇచ్చారు.
“గతికితే అతకదు. గమ్ వేస్తేనే అతుకుతుంది” లాంటి డైలాగ్ ఏదో చెప్పి మా నాన్న వాటిని ఎవైడ్ చేసాడు. బ్రహ్మానందం మాత్రం జీవితంలో మొట్టమొదటిసారి తింటున్నట్టు ఆ ఫలహారాలను తినసాగాడు.
“పోనీ కాఫీ అయినా తాగండి” అని అమ్మాయి తల్లి అలియాస్ కరెంట్ అత్తగారు అంటే ప్రస్తుత అత్తగారు కాఫీ తెమ్మని పురమాయించింది. దాంతో కాఫీ తీసుకుని మరొక పెద్దావిడ వచ్చింది. ఆ ద్రావకం తాగాక కూడా అది కాఫీనా లేక టీనా అని తేల్చుకోలేకపోయాను.
మరోవైపు బ్రహ్మానందం గ్లాసులో ఒక్క చుక్క కూడా వదలకుండా తాగేయాలనే లక్ష్యంతో విచక్షణ లేకుండా జుర్రుకొని మరీ తాగాడు. అలా తినుబండారాలు తినే కార్యక్రమం పూర్తి అయ్యాక కరెంట్ మామగారు అంటే ప్రస్తుత మామగారు “అమ్మాయిని తీసుకురండి” అని ఆర్డర్ వేసాడు. అప్పుడు హీరోయిన్ నిదానంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. అందరికీ రెండు చేతులతో నమస్కరించింది. ఆ అమ్మాయిని చూసాక “నా మనసు ఈ అమ్మాయికి ఇచ్చేద్దాం” అని అనిపించింది.
“మా రెండవ అమ్మాయి. పేరు కుసుమ. డిగ్రీ చదివింది. ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు. వాళ్ళ అమ్మలా ఒక మంచి గృహిణిగా ఉండాలనుకుంటోంది. ఆ తరువాత మీ ఇష్టం” అని కరెంట్ మామగారు తన కూతురు గురించి గొప్పగా చెప్పాడు.
నేను మాత్రం అవేమీ పట్టించుకోలేదు. అమ్మాయి బాగా నచ్చింది. పెళ్ళి చూపులు అనే భయం ఎగిరిపోయింది. ఎలాగైనా తనతో విడిగా మాట్లాడాలని అనిపించింది. అడిగితే కొడతారేమో అని భయపడుతున్న సమయంలో మా కరెంట్ అత్తగారు “బాబు, మా అమ్మాయితో పర్సనల్‌గా ఏమైనా మాట్లాడాలనుకుంటే పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి” అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నేను ఉత్సాహంగా లేవబోతున్న సమయంలో మా నాన్న నన్ను గమనించి “అయ్యో! అదేం వద్దండి. మా వాడికి అలాంటివి నచ్చవు” అని నన్ను ఆకాశానికి ఎత్తేశాడు.
నాకు ‘కోటి రూపాయల లాటరీ టికెట్ ఒక్క నెంబర్‌తో మిస్ అయిన ఫీలింగ్’ కలిగింది.
బ్రోకర్ బ్రహ్మానందం మా గురించి వారికి గొప్పగా చెప్పాడు. అదే విధంగా వాళ్ళు గురించి మాకు గొప్పగా చెప్పాడు.
కొన్ని క్షణాల నిశ్శబ్దం అనంతరం “సరే సార్. మేము బయలుదేరతాం” అని మా నాన్న లేచాడు. నేను, మా అమ్మ కూడా మా నాన్నని అనుసరించాం.
“ఒక్క క్షణం” అని నా కరెంట్ అత్తగారు, మామగారు మా అమ్మానాన్నలకి బట్టలు పెట్టడానికి సిద్ధమయ్యారు.
“ఎందుకండీ ఇవన్నీ” అంటూనే మా అమ్మ, నాన్న ఆ బట్టలు తీసుకున్నారు. వాటిని చూడగానే తెలుస్తోంది బాగా ఖరీదైన బట్టలు అని. అందుకే మా నాన్న వద్దంటూనే లడ్డులా వాటిని తీసుకున్నాడు. ఇంతకుముందు మా నాన్న చెప్పిన ‘గమ్ అతికే సామెత’ ఇప్పుడు వర్తించదా? అని నాకు అనుమానం వచ్చింది. ఆశ్చర్యకరంగా కుసుమ కూడా మా అమ్మ,నాన్నల కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఆశీర్వాదం ఎఫెక్ట్‌కి నాకు కుసుమ మీద ప్రేమ మరింత బలపడింది.
అలా పెళ్ళిచూపుల కార్యక్రమం ముగిసింది. ఇంటికి వచ్చాక మా అమ్మ, నాన్న ఇద్దరూ కలిసి నా అభిప్రాయం అడిగారు. నేను “ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి” అని కాస్త దర్పంగా ఫోజు కొట్టాను.
దానికి మా నాన్న “అమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడడానికి ఎందుకు ముందుకు లేవబోయావు?” అని రాగాలు తీసాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు.
“ఆలోచించుకుని చెప్తాడులేండి. తొలి పెళ్ళి చూపులు కదా!” అని మా అమ్మ నాకు వత్తాసు పలికింది. అలా ఆ సీన్ లోంచి బయటపడ్డాను. ఇంతలో బ్రోకర్ బ్రహ్మానందం నాకు ఫోన్ చేసాడు.
“ఏమోయ్! అమ్మాయి బాగా నచ్చినట్టుంది. పెళ్ళి చూపుల్లో నేను నిన్ను గమనించానులే. నాకు కమీషన్ ఘనంగా ఇవ్వాలి” అని నవ్వుతూ అన్నాడు.
నేనేమీ మాట్లాడకుండా “సార్! నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను” అంటూ ఫోన్ సంభాషణ ముగించాను.
నేను మాత్రం కుసుమను మర్చిపోలేకపోతున్నాను.
ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నా ఎలా ఉండేదో అని ఆలోచించసాగాను. అలా వారం రోజులు గడిచాయి.
ఆడపిల్ల తరపు వారి నుంచి ‘ఏమనుకున్నారు’ అని? ఎటువంటి ఫోన్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బామ్మలు మంచి రోల్ ప్లే చేస్తారు. అలాగే మా నాయనమ్మ మా నాన్నతో “ఆడపిల్ల తరపు వాళ్ళు ఫోన్ చేయాలి. మనం ఫోన్ చేస్తే మన పరువు పోతుంది. మనమే వెంపర్లాడినట్లు ఉంటుంది. కాస్త బెట్టుగా ఉండండి” అని నూరిపోసింది. చివరికి మా నాన్న నన్ను నిలదీసి నా అభిప్రాయం అడిగాడు. నేను “నాకు ఇష్టమే” అని సంతోషంతో సిగ్గుపడుతూ చెప్పాను. దాంతో మా నాన్న ఒక మెట్టు దిగి నా కోసం కరెంట్ మామగారికి ఫోన్ చేసాడు. ఫోన్ రింగ్ అయింది. కానీ తీయలేదు. ఏదో పనుల వలన బిజీగా ఉండి ఉంటాడులే అనుకుని ఒక గంట తర్వాత మళ్ళీ చేసాడు. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఎందుకైనా మంచిదని మధ్యవర్తికి కూడా ఫోన్ చేసాడు. విచిత్రంగా ఆయన కూడా ఫోన్ తీయలేదు. అలా మరో వారం రోజులు గడిచాయి. మా నాయనమ్మ “ఆడపెళ్ళి వారికి అంత గీర ఉంటే మగపెళ్ళివారం మనకెంత ఉండాలిరా? వదిలెయ్యి ఆ సంబంధం” అని మా నాన్నకి సెలైన్లా ఎక్కించింది. అలా మా అమ్మ, నాన్న, నాయనమ్మ వెరసి మా కుటుంబం అంతా ఆ సంబంధం వదిలేసారు, ఒక్క నేను తప్ప. అలా కుసుమ నా జీవితంలో ఒక కలలా వచ్చింది. ఆ తరువాత అమ్మా, నాన్న ప్రోద్బలంతో ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా, మొదటి పెళ్ళి చూపుల్లో నచ్చిన కుసుమలా ఎవరూ లేరు. అందరూ మోడ్రన్ మహాలక్ష్ముల్లా ఉన్నారు. సంసార లక్ష్మిలు ఎవరూ లేరు. నాకు కావాల్సిన సాధారణ గృహిణులు ఎవరూ దొరకలేదు. దాంతో ఏదో కారణం చెప్పి ప్రతి సంబంధాన్ని తప్పించుకున్నాను. అలా పదేళ్ళు గడిచాయి.
***
గతంలోంచి బయటకు వచ్చిన నాకు కుసుమతో మాట్లాడాలని అనిపించింది. కానీ ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో అని భయం. అలాంటి ఆలోచనలతో ఆ రోజు ముగించుకుని ఇంటికి చేరాను. ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ ఆత్రంతో “ఆ అమ్మాయి బ్యాంకుకు ఎందుకు వచ్చింది? మాకు తెలియకుండా ఏదైనా చిన్నిల్లు, పెద్దిల్లు లాంటిది ఏమైనా సెట్అప్ చేసావా?” అని అనుమానంగా అడిగింది. నాయనమ్మ అయిదు సంవత్సరాల క్రితం బాత్రూంలో స్టీల్ బక్కెట్ తన్నేయడంతో ఈసారి ఆమెకు ఛాన్స్ లేదు.
ఈ సన్నివేశంలో మా నాన్న మౌనంగా నవ్వుతూ నన్ను చూస్తున్నాడు.
నేను “అమ్మా! నేను వేరుకుంపట్లు, చిన్న ఇల్లు, వేరే అపార్ట్మెంట్లు పెట్టే వాణ్ణి అయితే ఇన్ని రోజుల దాకా ఆగను. నువ్వు భయపడకు. ధైర్యంగా ఉండు” అంటూ భుజం తట్టాను. ఆ మరునాడు మరలా యథావిధిగా బ్యాంకుకు వెళ్ళాను. కుసుమ మళ్ళీ బ్యాంకుకు వచ్చింది. కొత్తగా ఓపెన్ అయిన సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించినవి తీసుకుంది. పాస్‌బుక్ మీద సంతకం కోసం నా దగ్గరకు వచ్చింది. పది సంవత్సరాల తర్వాత మళ్ళీ తనను చూస్తున్నా. పెళ్ళి చూపుల్లో చూసినప్పుడు కూడా మా ఇద్దరి మధ్య కొంత దూరం ఉంది. కానీ ఇప్పుడు అంత దూరం కూడా లేదు. పాస్‌బుక్ మీద సంతకం చేసి తిరిగి ఆమెకు ఇచ్చాను. ఎప్పుడూ చిన్న సంతకం చేసే నేను, ఈ సారి పూర్తిగా నా పేరు ఇంటి పేరుతో సహా రాసాను. ఆ పేరు చూసైనా తను, నన్ను గుర్తుపట్టి పలకరిస్తుందేమోనని. కానీ అలా జరగలేదు. పాస్‌బుక్ తీసుకుని ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ముఖంలో ఎటువంటి మార్పులు లేవు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కంప్యూటర్లో అకౌంట్ నెంబర్ చూసి ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాను. ఆ మరునాడు ఆదివారం.
అప్పుడు సమయం ఉదయం పది గంటలు. అలా ఆదివారం ఉదయం పది గంటలకు కుసుమ నెంబర్‌కు ఫోన్ చేసాను. గుండె దడ మొదలైంది. ఫోన్ తీయలేదు. రింగ్ అవుతూనే ఉంది. కానీ నా కాల్‌కు బదులు రాలేదు. అలా గంట గడిచింది. తప్పు చేస్తున్నామో అని భయమేయసాగింది.
ఇంతలో నా ఫోన్ మోగింది. నేను సేవ్ చేసుకున్న కుసుమ ఫోన్ నెంబర్ అది.
“హలో” అంటూ ఫోన్ ఎత్తాను.
“ఎవరు మీరు? ఫోన్ చేసారు నాకు” అని కుసుమ గొంతు వినిపించింది.
“నేను స్టేట్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసారు కదా? మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇవేనా” అని వివరాలు చెప్పాను.
“అవేనండీ. నో ప్రాబ్లం” అని కుసుమ కన్ఫార్మ్ చేసింది.
“బాగున్నారా?” అని నేనే ధైర్యం తెచ్చుకుని అడిగాను.
“నడుస్తోంది కాలం అలా అలా.. మీరెలా ఉన్నారు?” అని కుశలం అడిగింది కుసుమ.
“నన్ను గుర్తుపెట్టుకుని మరీ గుర్తుపట్టినట్టున్నారు” అని సంశయంగా అడిగాను.
“అలా ఏం లేదు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు. కానీ చూడగానే గుర్తుపట్టాను”
“మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నాను” అని భయం భయంగానే అడిగాను. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది.
“ఏం మాట్లాడాలనుకుంటున్నారు?”
ఏం చెప్పాలో తోచలేదు నాకు. అయినా ధైర్యం తెచ్చుకొని “ఊరికే. పెద్ద కారణం ఏమీ లేదు” అని సర్దిచెప్పాలని ప్రయత్నించాను.
“సరే! వచ్చే గురువారం. అక్టోబర్ రెండు. గాంధీ జయంతి. మీకు సెలవే కదా! ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు సాయిబాబా గుడికి రండి. నేను కూడా వస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం. ఉంటాను” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఆరంభం కంటే ముగింపు గొప్పగా ఉండాలన్నది ఆర్యోక్తి. అలా మా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ ముగిసేసరికి “తను నన్ను వదిలించుకోవడానికే అలా చేసిందేమో” అనే అనుమానం మొదలైంది. అలా చూస్తుండగానే గురువారం వచ్చింది. పదేళ్ళ క్రితం మా ఇద్దరికీ పెళ్ళిచూపులు జరిగింది కూడా గురువారమే.
ఆ రోజు సెలవు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటలు ఎప్పుడు అవుతుందా అని ఆత్రంగా ఎదురుచూడసాగాను. ఇంతలో నా ఆత్మారాముడు మనసులో మరో అనుమానం రేకెత్తించాడు.
“కుసుమ చీర కట్టుకుని వస్తుందా? లేక మోడ్రన్ డ్రెస్‌లో వస్తుందా? అని.
అప్పుడు నాకు, నేను ఒక పందెం వేసుకున్నాను.
“కుసుమ కనుక మెరూన్ కలర్ చీర కట్టుకుని వస్తే నాతో పెళ్ళికి ఒప్పుకుంటుంది” అని. అలా చూస్తుండగానే సమయం సాయంత్రం అయిదు గంటలు అయింది. సమయపాలన పాటిద్దామని వెంటనే వెళ్ళి గుడిలో కూర్చున్నాను. ఆ గంట సేపు నాకు టెన్షన్‌గా అనిపించింది. ఎవరు వచ్చినా కుసుమ లానే అనిపించేది. ఇంతలో నా ఫోన్ మోగింది. కుసుమ నుంచి ఫోన్. “కొంపదీసి రాను అని చెప్పడానికి ఫోన్ చేసిందా?” అని అనుమానం మొలకెత్తింది.
ఆ డౌటింగ్ తోనే ఫోన్ ఆన్సర్ చేసాను.
“హలో! ఎక్కడున్నారు?” అని కుసుమ ప్రశ్నించింది.
“గుడిలో ఉన్నాను” అంటూ ఆత్రుతగా బదులిచ్చాను.
“ఓ! వచ్చేసారా? అయిదు నిమిషాల్లో ఉంటాను. ఆల్రెడీ బయలుదేరాను. మీరు గుడి ప్రాంగణంలో ఉన్న లెండి వనంలో రెండవ నెంబర్ బెంచీలో కూర్చోండి”
నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. టంచనుగా ఆరు కాగానే కుసుమ తాను చెప్పిన చోటికి వచ్చింది. ఆమెను చూడగానే “పందెంలో నేను ఓడిపోయాను” అని అర్థం అయింది. ఎందుకంటే తను చీరలో రాలేదు. పోలీస్ యూనిఫాంలో వచ్చింది. నన్ను అరెస్ట్ చేస్తుందేమో అని భయం మొదలైంది.
“వచ్చి చాలా సేపు అయిందా? నేను ఇప్పుడే డ్యూటీ ముగించుకుని డైరెక్టుగా ఇటు వచ్చాను. అందుకే గుడి లోపలికి వెళ్ళకూడదని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను” అంటూ లాఠీ పక్కన పెట్టింది.
ఆ లాఠీని చూడగానే నాకు “ఏమైనా తేడా వస్తే కొడుతుందేమో” అని అనుమానంతో కూడిన భయం మొదలైంది.
అయిదు నిముషాల మౌనం తరువాత నేనే ధైర్యం నాకు నేను అరువు తెచ్చుకుని అడిగా “ మీ ఆయన ఏమి చేస్తుంటారు?” అని.
ఒక సీరియస్ లుక్ ఇచ్చింది.
“నాకింకా పెళ్ళి కాలేదు” అంటూ ఫోన్ చూసుకోసాగింది.
“నన్ను చేసుకుంటారా?” అని అడిగాను. అలా అడిగినా నా చూపు భయంతో లాఠీ మీదే ఉంది. నచ్చకపోతే ఎక్కడ కోపంతో లాఠీతో కొడుతుందేమోనని.
“నేను ఎక్కువగా చీర కట్టుకోను. రోజులో మాగ్జిమమ్ టైం ఇలా పోలీస్ యూనిఫాంలోనే ఉంటాను. మీకు అభ్యంతరం లేదు కదా?” అంది.
హమ్మయ్య! ఇంక కొట్టదు అని భరోసాగా అనిపించాక, “మీ ఇష్టం. మీ ఉద్యోగ నియమ, నిబంధనలు ముఖ్యం కదా. మీకెలా కంఫర్ట్‌గా ఉంటే అలానే ఉండండి” అని కూల్‌గా సమాధానం చెప్పాను.
“పది సంవత్సరాల క్రితం ఈ ఆలోచన ఏమైంది? వయసు పెరిగిందని అడ్జెస్ట్ అవుతున్నారా?”
“అలా ఏం లేదు. మారుతున్న కాలంతో పాటు ప్రపంచ మారుతోంది కదా. మన చిన్నప్పుడు లేని ఆన్లైన్ చదువులు, వాట్సప్ సంభాషణలు ఇప్పుడు ఉన్నాయిగా”.
“మీకు అప్పుడు హౌస్‌వైఫ్ మాత్రమే కావాలి అన్నారు. ఇప్పుడు నేను ఒక ఉద్యోగస్తురాలిని. దీనికి కూడా మీరు అడ్జెస్ట్ అవుతారా?”
“ఖచ్చితంగా అడ్జెస్ట్ అవుతాను” అని లేచి నిలబడి మరీ చెప్పాను.
“మీ అమ్మానాన్నలకు కూడా అభ్యంతరం లేదా?”
“లేదు. అమ్మ, నాన్న నీ ఇష్టం అని నాకే వదిలేసారు”
“సరే. మా అమ్మా, నాన్నా వచ్చి మీ పేరెంట్స్‌తో మాట్లాడతారు” అంటూ లేచి వెళ్ళిపోబోయింది కుసుమ.
“మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా?” అని అంటూ ఆమెను ఆపాలనే ప్రయత్నం చేసాను.
“ఏమిటో?”
“ఆ రోజు అంటే పది సంవత్సరాల క్రితం మీ నాన్నగారు మాకు ఎందుకు ఫోన్ చేయలేదు? కారణం తెలుసుకోవచ్చా?” అని ఆత్రుతగా అడిగాను. ఆ ఆత్రుత నాకు ఆమెను ప్రశ్న అడగడానికి కావలిసిన ధైర్యాన్ని ఇచ్చింది.
“మీరు అయిదు లక్షలు కట్నం అడిగారు కదా. మా నాన్న కానిస్టేబుల్ అని మీకు తెలుసు కదా! మా నాన్నను ఆదర్శంగా తీసుకుని నేను కూడా పోలీస్ అయ్యాను. ఆయనకు కట్నం అడిగే వాళ్ళంటే అసహ్యం. అందుకనే మేము ఫోన్ చేయలేదు. అప్పుడు మీరంటే నాకు ఇష్టమైనా, మిమ్మల్ని వద్దనుకున్నాను. మీరు కూడా పెళ్ళి ఆడవారికి మాత్రమే అవసరం. మగవారికి కాదు అనే విధంగా గర్వం చూపించారు. అందుకే మీరు ఆడపెళ్ళివాళ్ళు మాత్రమే ముందుగా, మొదలుగా ఫోన్ చేయాలని మీరు ఫోన్ చేయలేదు. కట్నం అనే సంసృతికి మేము పూర్తిగా వ్యతిరేకం” అని సీరియస్‌గా చెప్పింది.
నేను ఆశ్చర్యంగా “మేము కట్నం అడగడం ఏమిటి? మేము కూడా కట్నానికి వ్యతిరేకం. మా నాన్న అసలు కట్నం తీసుకోవాలని అనుకోలేదు” అని నొక్కి చెప్పాను.
“మరి పెళ్ళిళ్ళ బ్రోకర్ మీరు అయిదు లక్షలు కట్నం డిమాండ్ చేసారని. అలా అయితేనే సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉండమని అన్నారని చెప్పాడు. కావాలంటే మాకు వేరే సంబంధం చూస్తానని కూడా అన్నాడు”
“లేదు. అది అంతా అబద్ధం. పెళ్ళిచూపుల్లో మిమ్మల్ని చూసినప్పుడే ఇష్టపడ్డాను. మీరు, మా కుటుంబానికి కూడా నచ్చారు. మీ అభిప్రాయం తెలుసుకుందామని మేము మీకు ఫోన్ చేసాం. మీరు ఫోన్ తీయలేదు. అప్పుడు బ్రోకర్‌కు కూడా ఫోన్ చేసాం. అప్పుడు అతని నుంచి కూడా సమాధానం రాలేదు. కానీ నెల రోజుల తరువాత బ్రోకర్ మా ఇంటికి వచ్చి, నేను మీకు నచ్చలేదని చెప్పాడు. అంతేకాకుండా మాతో మీకు ఆ సంబంధం సరిపోదు. వేరే సంబంధం చూపిస్తాను అన్నాడు” అని కన్విన్సింగ్ గా చెప్పాను.
“అంటే ఆ బ్రోకర్, మన పెళ్ళి సంబంధం రద్దు చేసి, మనకు వేరే సంబంధాలు చూపించి, ఎక్కువ కమీషన్ రాబట్టాలని ఎత్తు వేసాడన్నమాట” అని నిట్టూర్చింది కుసుమ.
అయిదు నిముషాలు మా మధ్య నిశ్శబ్దం ఆవహించింది. ఆ సైలెన్స్ బ్రేక్ చేస్తూ నేనే “మా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది?” అని ప్రశ్నించాను.
“మిమ్మల్ని పెళ్ళి చేసుకుందామని”
“వాట్! నేను ఇక్కడ ఉంటానని ముందే తెలుసా? సాగదీసినా పర్వాలేదు. సంక్షిప్తంగా కాకుండా వివరంగా విపులీకరించండి. ప్లీజ్” అంటూ బతిమిలాడాను.
కుసుమ నవ్వుకుంటూ “మీరు ఒకరోజు హెల్మెట్ లేకుండా టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు. అప్పుడు మిమ్మల్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుని ఆపారు. మీ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయింది. బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆ సమయంలో మిమ్మల్ని నేను రోడ్ పై వెళ్తూ చూసాను. మిమ్మల్ని ఆపిన కానిస్టేబుల్ నా స్నేహితుడే. ఆయనకు ఫోన్ చేసి మిమ్మల్ని విడిచిపెట్టమన్నాను. ఆ తరువాత మిమ్మల్ని ఫాలో అయి, మీరు బ్యాంక్‌లో పనిచేయడం చూసాను. అకౌంట్ ఓపెన్ చేసే నెపంతో మీ దృష్టిలో కావాలనే పడ్డాను. మీ నుంచి ప్రపోజల్ రావాలనే ఈ డ్రామా అంతా ఆడాను. మీరు నన్ను ఫాలో అవడం కాదు. నేనే మిమ్మల్ని ఫాలో అయ్యాను” అని వివరించింది.
ఆమె మాటలు విన్న నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. కాస్త గట్టిగా శ్వాస తీసుకుని “సుమా! నిన్ను పెళ్ళి చేసుకుని ‘సుమ’ అని పిలుద్దామనుకున్నా. అందుకే ఇప్పుడు అలా పిలిచాను. మన తొలిప్రేమ, మన తొలి పెళ్ళిచూపుల్లోనే మొదలైంది. అది అలానే మనకు కొనసాగుతోంది అని నా అభిప్రాయం. ఇప్పుడు మనకు ఏ పెళ్ళిళ్ళ బ్రోకర్లు అవసరం లేదు. మన కుటుంబ పెద్దలకు చెప్పి, వారి సమక్షంలో పెళ్ళి చేసుకుని ఏడడుగులు నడుద్దాం. జీవితాంతం కలిసి ఒకరినొకరు తోడుగా, నీడగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం” అంటూ చేయి చాపాను.
“అలాగేనండీ. మీరు ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. పెళ్ళి అయిన తరువాత భర్తను పేరు పెట్టి పిలిచే సంస్కృతికి నేను వ్యతిరేకం. అందుకే నాకు మీ పేరు తెలిసినా, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేను. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఈ సాయినాథుని ఆశీస్సులతో మనం కలిసి జీవిద్దాం” అంటూ నా చేతిలో చెయ్యి వేసింది కుసుమ.
అలా చేతిలో చెయ్యి వేసుకుని ఇద్దరం గుడి బయటకు వచ్చాం. అప్పుడు గుడి దగ్గర ఉన్న పాత టీ దుకాణంలో, రేడియోలో వినిపిస్తున్న మాటలు “మీరు వినబోయే పాట పెళ్ళి పుస్తకం చిత్రంలోనిది”.
“శ్రీరస్తు, శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం..” అంటూ పాట మొదలైంది.
అలా ఆ సాయిబాబా ఆశీస్సులు కూడా మా పెళ్ళికి లభించాయి.
