[శ్రీ రఘు శేషభట్టర్ రచించిన ‘తూకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బంగారాన్ని లోహమని
మనిషిని చర్మమని తేల్చే వాడికి
తేమరంగు మాటలివ్వొద్దని
అవి వాడి కోసం రాయలేదని అన్నప్పుడు
విననట్టుండటం తెంపరి తనం
అవిద్య మొండి కత్తిలా ఊగే చోట కాలుండని వాడ్ని
కదలికల ఆరా తీయటం అలవాటు కనుక
గాలి వీచినప్పుడు అది పుట్టిన దేశం ఏదని అడుగుతాను
ప్రవహించే నదిని ఆపి దాని మూలం ఏదని వెతుకుతాను
రాలుతున్న ఆకుల్లో దూరి చెట్ల గోత్రాలు చెబుతాను
నిద్ర లేచిన కళ్ళు సితారు తీగలంటాను
ఇవ్వటంలోని రుచి తెలిసిన వాడ్ని
పురా ఆత్మలు తల చుట్టూ తిరిగినప్పుడు
పద్యాలిచ్చి పంపుతాను
ఆత్మకథ రాసుకున్న పద్యంలా ఉంటాను
పట్టని తనం ఒక లోపమని
పొడిపొడి మాటలు దాని తూకాలని అంటాను
రఘు శేషభట్టర్ గారి స్వస్థలం ఖమ్మం. 18 నవంబర్ 1970వ తేదీన జన్మించిన రఘు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక బహుళ జాతి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం, సూర్యుడు పొడిచిన రాత్రి, నిద్రపోని మానవ కోయిల, లిపి తడిసిన తరుణం, మోహధూపం, నేను కల వెన్నెల, అసంకల్పిత పద్యం, అనల్పం, దిశాంతర స్వప్నం (9 కవితా సంపుటాలు), సౌరభం (వ్యాస సంపుటి) ప్రచురిచమయ్యాయి. ప్రస్తుతం హైదరబాద్ నేరేడ్మెట్ లోని రామకృష్ణాపురంలో నివాసం. ఫోన్స్: 9676144904 & 9603264732
