Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ట్రాఫిక్ రూల్స్

[బాలబాలికల కోసం ‘ట్రాఫిక్ రూల్స్’ అనే రచనని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

బాలలూ, ఇవాళ నేను మీకు కథ చెప్పటానికి రాలేదు. ఎప్పుడూ కథలేకాదు, మీకు కొన్ని మంచి విషయాలు, అవసరమైన విషయాలు కూడా తెలియాలి.

రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చాలామందిని చూస్తుంటాం. సెల్ ఫోన్ చెవికానించుకుని, వాళ్ళేదో వేరే లోకాల్లో వున్నట్లు కబుర్లు చెప్పేస్తూ వుంటారు, రోడ్డుకడ్డంగా నడుస్తున్నామనే ధ్యాస లేకుండా. ఇంకా చోద్యం ఏమిటంటే సిగ్నల్ దొరికి హడావిడిగా వెళ్ళే వాహన చోదకులకి అడ్డంగా, తొణక్కుండా, బెణక్కుండా మాయా లోకం నుంచి బయటకి రాకుండా నింపాదిగా నడుస్తూ వెళ్తారు. ఆ వాహనదారులేం తక్కువ వాళ్ళు కాదులెండి. ముఖ్యంగా బైకుల మీద వెళ్ళేవాళ్ళు. తల ఒక పక్కకి వాల్చి ఫోన్ చెవి కింద పెట్టి మాట్లాడుతూనే యమా స్పీడుగా బైకు నడిపేస్తారు. వీళ్ళల్లో ఎక్కువ యువతే కనిపిస్తారు. వాళ్ళకి భయం లేదు సరే. ఎదుటివారి గురించి ఆలోచనయినా వుండాలి కదా.

బాలలూ, వాళ్ళ సంగతి మాకెందుకుగానీ, మాకేదయినా చెప్పండి అంటున్నారా. అలాగేనర్రా. ఎటూ మొదలు పెట్టాంగనుక ఈ విషయం గురించే చెబుతాను. కొందరు రోడ్డు క్రాస్ చెయ్యాలంటే చాలా భయపడతారు. ఎవరి సహాయమన్నా కోరుతారు. కొందరు అడ్డదిడ్డంగా పరిగెత్తి అందరినీ హడలు కొడతారు. సిటీలలో ట్రాఫిక్ ఎక్కువ వున్నచోట్ల అనేక సదుపాయాలు వుంటాయి. అవి లేని చోట ఎలా అంటే మీకిప్పుడు చెప్తాను. మరి రేపటి పౌరులు మీరే కదా.

మా చిన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ అని బళ్ళోనే కాదు, ఇంట్లో అమ్మా నాన్నలు కూడా చెప్పేవారు. అవ్వేమిటో తెలుసా మనం రోడ్డు క్రాస్ చెయ్యాల్సి వచ్చినప్పుడు పక్కగా ఆగి ముందు కుడివైపు చూడాలి, వాహనాలేమొస్తున్నాయో. తర్వాత ఎడమవైపు చూడాలి. మనం రోడ్డు క్రాస్ చేసే లోపల ఏ వాహనం అడ్డు రాదు కదాని. తర్వాత మళ్ళీ కుడి వైపు నుంచి వచ్చే వాహనాలని గమనించి అవి దూరంలో వుంటే క్రాస్ చెయ్యవచ్చు. అంటే రోడ్డుకడ్డంగా పరిగెత్తకూడదు. అవసరమైతే రోడ్డు మధ్య డివైడర్ దగ్గర ఆగి ఎడమవైపు నుంచి వచ్చే వాహనాలను జాగ్రత్తగా చూసుకుని దాటవచ్చు. ఏదైనా మీరు కంగారు పడకుండా, ఎదుటివారిని కంగారు పెట్టకుండా చూసుకోండి.

ఇలా ముందు కుడివైపు ఎందుకు చూడాలంటే మనం ఎక్కడైనా సరే రోడ్డు దాటేటప్పుడు ముందు కుడి వైపు నుంచి వచ్చే వాహనాలని దాటాలి, తర్వాత ఎడమవైపు నుంచి వచ్చేవాటిని. కావాలంటే మీరు ఒక రోడ్డు దగ్గర నుంచుని గమనించండి. మీకు అర్థమవుతుంది.

కొందరుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా వాహనాలకి చెయ్యి అడ్డుపెట్టి, వాళ్ళ దోవన వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తారు, వాహనదారులదే బాధ్యత, ఆగి తీరాలన్నట్లు. అది కూడా మంచి పధ్ధతి కాదు. దూరంలో వున్న వాహనానికి చెయ్యి అడ్డు పెడితే వాళ్ళు చూసుకుని వేగం తగ్గిస్తారుగానీ, దగ్గరకొచ్చిన వాహనాలు ఆపటం కష్టమవుతుంది.

పిల్లలూ, మీరిప్పటినుంచే నేర్చుకోవాల్సిన విషయం ఇంకోటి వుంది. కొందరు ఎవరైనా కనిపిస్తే చాలు, రోడ్డు మధ్యలో కలిసినా అక్కడే నుంచుని మాట్లాడుతారుగానీ, పక్కకి వెళ్ళరు. దీనివల్ల కూడా వచ్చేపోయేవారికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే మీరిప్పటినుంచే నేర్చుకోండి. రోడ్డు మధ్యలో నుంచుని మాట్లాడద్దు. మీ వాళ్ళెవరైనా అలా చేసినా మర్యాదగా చెప్పండి పక్కకి నుంచుని మాట్లాడుకోమని.

ట్రాఫికే కాదు, రోడ్ల మీద నిలిపి వుంచిన వాహనాల వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సిటీలలో. బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువైనాయి. ఇంటి యజమానులు కూడా ఇళ్ళు కట్టేటప్పుడు ఇదంతా ఊహించి వుండరు. అందుకే ఇదివరకు కట్టిన ఏ ఇంట్లోనైనా పార్కింగ్ ప్లేస్ గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇది వరకు సైకిల్ వుంటే చాలనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి రెండు వాహనాలుంటున్నాయి. దానితో చాలా ఇళ్ళకే రోడ్డే పార్కింగ్ ప్లేస్. సరే, దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు వాహనాలని నిలిపే పధ్ధతిని మాత్రం అర్థం చేసుకోలేక పోతున్నాము. ఏదో అర్జంటు పని వున్నట్లు వాహనం ఎవరికైనా అడ్డు వస్తుందేమో చూసుకోకుండా అడ్డదిడ్డంగా ఆపేసి వెళ్తుంటారు. ఆ దోవన వచ్చిన వేరే వాహనాలు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. పిల్లలూ, ఇలాంటి విషయాలలో మీరిప్పటినుంచే జాగ్రత్త తీసుకోవచ్చు. మీ వాళ్ళు ఆపిన వాహనం రోడ్డుకడ్డుగా వుందేమో చూడండి. ఎవరికి వారు ఇలా చెయ్యటం మొదలు పెడితే కూడా ట్రాఫిక్ సరిగ్గా సాగటానికి సహాయ పడిన వాళ్ళవుతారు.

చూశారా చిన్న పిల్లలం, మేమేం చెయ్యగలం అనుకుంటారుగానీ మీరు చెయ్యగలిగే పనులు ఎన్ని వున్నాయో. గుర్తుంచుకుంటారు కదూ. భవిష్యత్తు మీది. మీరు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. జై హింద్.

Exit mobile version