Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

త్రివేణి-2

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ అనే కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

1)
ప్రతి ఉదయం తూర్పున ఒక ప్రశ్న
ప్రతి సాయంత్రం పశ్చిమాన ఒక జవాబు

మధ్యలో నా జీవన యానం.

2)
చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా
పెద్దగా హృదయంలో వెలుగుతాయి

ఎప్పుడో ఎక్కడో నక్షత్రాల్లా.

3)
నడిచీ నడిచీ అలసిపోయిన పాదాలు
కాసేపు ఆగితే తెలుసుకుంటాయి

బాట ఎప్పుడూ ఇక్కడే ఉందని.

4)
నీ పేరు పలికితే
లోపల నిశ్శబ్దం గానం చేస్తుంది

నవ నాడుల్లో పూలవాసన.

5)
వర్షం కురిసేసరికి
చిన్న పిలుపులు నేలలో మొలుస్తాయి

మొక్కలుగా కాదు, ఆశలుగా.

6)
పగటిపూట ప్రపంచం పరుగులు పెడుతుంది
రాత్రిపూట సోయి తప్పి సోమ్మసిల్లుతుంది

స్వప్నమే నిజం అవుతుంది.

7)
నవ్వు ఒక్కసారి నవ్వితే
నా మది రూపం మారిపోతుంది

లోనేదో దీపం వెలుగుతుంది.

8)
పుస్తకపు పుటలు తెరిస్తే
నిద్రపోయిన జ్ఞానమే మెరుస్తుంది

ఎదురుచూస్తున్న ప్రేరణ కూడా.

9)
మడుచుకున్న పాత లేఖల్లో
హృదయంలో దాచిన ఎన్నో మాటలు

తెరిస్తేనే కదా అర్ధమయ్యేది.

10)
ఎత్తు పల్లాలు దాటి సముద్రాన్ని చేరిన నది
తన ప్రయాణం మర్చిపోదు

కలిసికరిగి పోయినా, విడిపోదు.

11)
నీ నవ్వు దగ్గర ఆగిన పగలు
హృదయం ఒక్కసారిగా పులకింత

గాలి కూడా నీ పేరు పలికింది.

12)
చేతులు తాకితే కరచాలనం
మనసులు పలకరించుకుంటేనే

అదే ప్రేమ పులకరింత.

13)
చెట్టు నీడ, పక్షి పాట
సమయాన్ని కొద్దిగా మరపిస్తుంది

ప్రకృతి యోగమే అది.

Exit mobile version