ముడుతలు పడ్డ కాన్వాస్ ముఖచిత్రం
నా గుండెల్లో పదిలంగా భద్రపరచబడింది
అశుద్ధాన్ని శుభ్రం చేసిన చేతులు
ఆప్యాయంగా చెక్కిళ్ళు నిమిరిన గుర్తు
నీటి భాష్పీభవన ఉష్ణోగ్రతలు అటుఇటుగా
శరీరం మీద తాండవిస్తున్నపుడు
రెప్పవాలని కళ్ళు కాచినట్లు ఆలాపన
పాదాలు గుర్రాలై ప్రథమంగా నిలిచినపుడు
చెక్కిళ్ళ ఆనందభాష్పాలు మెరిసినట్లు భావన
పరాయమ్మ కన్నబిడ్డ కోడలై వస్తే
తన బిడ్డగా లాలించిన తీపి గురుతు
అవయవాలు క్రుంగి మూటగా మారి
ఒడి తలగడపై ముడుచుకున్న వేళ
చేతిని తడిపిన ఆమె కన్నీటి సంద్రం
తను పోతాననే బాధతో కాదట
నేనైమైపోతానో అనే దిగులుతోనట
కాలం చేసిన కాయం కనుచూపు దాటినా
వడలిన వదనం నాకు అందంగా
కోటి తారల వెలుగులా కనిపిస్తున్నది కంటికి
ఎందుకంటే ఆమె నాకు అమ్మ
నాకు ఉనికినిచ్చిన కొమ్మ
ఒంగోలుకు చెందిన శింగరాజు శ్రీనివాసరావుగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా 2015 సంవత్సరంలో పదవీవిరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టారు. వీరు వ్రాసిన కథలు, కవితలు.. ఆంధ్రభూమి, స్వాతి, రమ్యభారతి, సాహితీకిరణం, విశాఖ సంస్కృతి, విశాలాక్షి, హాస్యానందం, ఉషా వంటి వివిధ పత్రికలలోను, సంచిక, తపస్వి మనోహరం, సుమతి, కథామంజరి, గో తెలుగు, నెచ్చెలి, సహరి, షార్వాణి, రవళి వంటి మరికొన్ని అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో కథలు, కవితలు బహుమతులను పొందాయి. ఫోన్ 9052048706

